close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టాటా నాటిన సేవావృక్షం!

టాటా నాటిన సేవావృక్షం!

సాటి మనిషికి సాయం చెయ్యడం... మన సంస్కృతిలో భాగం. ఆ గుణంలేనివారు క్షమార్హులే కారంటుంది రుగ్వేదం. అవసరంలో ఉన్నవారికీ అర్హులకూ తిరిగి ఇవ్వలేనివారికీ... ఇచ్చే సాత్విక దానాన్ని గొప్పదానంగా పేర్కొన్నాయి వేదాలు. దాన్ని అక్షరాలా ఆచరిస్తూ సాయం చెయ్యడంలోని పరమార్థాన్ని చాటుతున్నాయి... నూట పాతికేళ్లుగా టాటా ట్రస్టులు. ధర్మబద్ధంగా సంపద సృష్టించడమే కాదు, అర్థవంతంగా ఖర్చుపెట్టడమూ తమకే సాధ్యమంటున్నాయి.

యుద్ధంతో సతమతమవుతోన్న ఓ దేశం నుంచి ప్రజలు వలస వెళ్తున్నారు. వారిలో ఓ బృందం సింధూనదిని దాటి ఓ ప్రాంతానికి చేరింది. అక్కడి వాతావరణం వారికి నచ్చింది. దాంతో అక్కడే స్థిరపడదామనుకున్నారు. అందుకు అనుమతి కోరడానికి రాజు వద్దకు వెళ్లాడు బృందనాయకుడు. ‘రాజా... పొట్ట చేతబట్టుకుని పరాయి దేశం నుంచి వచ్చాం. తలదాచుకోను మాకింత నీడనివ్వండి’ అని అడిగాడు. కాదనడం రాజుకు అలవాటు లేదు. అలాగని కొత్తవారికి గబుక్కున ఆతిథ్యమిస్తే రేపెలాంటి పరిణామాలు ఎదురవుతాయో! సహాయకులను గిన్నెడు పాలు తెమ్మన్నాడు. నిండుగా ఉన్న పాలగిన్నెను ఆ విదేశీయుడి ముందు పెట్టాడు. తమకు చోటు లేదని రాజు చెప్పదలచుకున్నాడని అతడికి అర్థమైంది. బిడ్డలకోసం చేతి సంచీలో దాచుకున్న చక్కెర మూట విప్పి కాసింత ఆ పాలగిన్నెలో వేశాడు. గరిటెతో కలిపాడు. పాలు పొర్లిపోకుండా చక్కెర పాలలో కలిసిపోయింది. గిన్నెను రాజు ముందు పెట్టాడతను. ‘పాలలో చక్కెరలా మీ సమాజంలో కలిసిపోతాం’ అని అతడు చెప్పిన విధానం రాజుకు నచ్చింది. సాదరంగా ఆహ్వానించాడు.

ఆ ప్రాంతం గుజరాత్‌. యుద్ధభూమి ఇరాన్‌ నుంచి వచ్చినవారే పార్శీలు. వెయ్యేళ్లక్రితం ఎప్పుడో వచ్చి స్థిరపడిన ఆ కొద్ది మందీ భారతీయులతో మమేకమయ్యారు. స్వయంకృషితో వ్యాపార పారిశ్రామిక రంగాల్లో రాణించారు. తమ కష్టార్జితంతో ఇప్పటికీ భారతీయుల జీవితాలను తీపి చేస్తూనే ఉన్నారు. వారిలో ఒకటి టాటాల కుటుంబం.

అది 1892. దేశం బ్రిటిష్‌ పాలనలో ఉంది. జంషెడ్‌జీ నుసర్‌వాంజీ టాటా దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త. గుజరాత్‌నుంచి వచ్చి ముంబయిలో స్థిరపడ్డ కుటుంబం. టాటా గ్రూపు వ్యవస్థాపకుడు. డిగ్రీ చదివి తండ్రి వ్యాపారాన్ని అందిపుచ్చుకున్నారు. ఇంగ్లాండ్‌లో నూలు మిల్లుల పనితీరు చూసొచ్చి ప్రఖ్యాత ఎంప్రెస్‌ మిల్స్‌ని ప్రారంభించారు. మంచి ఆదాయం వస్తోంది. తన దగ్గరున్న డబ్బుతో వ్యాపారాన్ని ఇంకా విస్తరించుకోవచ్చు. కొత్త పరిశ్రమ పెట్టుకోవచ్చు. కానీ ఆయనకు దేశభవిష్యత్తు గురించి ఆలోచన ఎక్కువైంది. భారతీయ విద్యావిధానంలో తేవాల్సిన సంస్కరణల గురించి ఆంగ్లేయుడు మెకాలే నివేదిక ఇచ్చిన సంవత్సరమూ అదే కావడం కాకతాళీయం. అయితే పాలకుల ఉద్దేశం వేరు. టాటా ఆలోచన వేరు. భారతీయ యువత ఉన్నత చదువులు చదవాలి. చైతన్యవంతులవ్వాలి. అప్పుడే ఈ దేశ భవిష్యత్తు బాగుపడుతుందనుకున్న ఆయన అందుకు స్వయంగా నడుం బిగించారు. చేతిలో ఉన్న డబ్బుతో అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసేస్తే మధ్యలో అంతరాయం కలగవచ్చు. స్థిరంగా ఆదాయం రావాలి. పథకం నిరంతరాయంగా కొనసాగాలి. అందుకు ట్రస్టును ఏర్పాటుచేయడమే మార్గమని భావించి ‘జేఎన్‌ టాటా ఎండోమెంట్‌’ పేరుతో ఓ నిధిని ఏర్పాటుచేశారు. విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే యువతకు ఆర్థిక సహాయం అందిస్తుందీ ట్రస్టు.

నాటి మొక్క నేడు మానై...
ఇంతింతై... అన్న మాటకి అక్షరాలా అర్థం చెప్పగల సంస్థ ఏదైనా ఉందీ అంటే అది టాటా ప్రారంభించిన ఈ ట్రస్టే. తాను నాటిన మొక్క నేడు మానై ఇంతగా విస్తరిస్తుందని బహుశా జంషెడ్‌జీ కూడా వూహించివుండరు. సమాజంలో చాలామంది దానధర్మాలు చేస్తారు. పేదలకు తిండి పెడతారు. సత్రాలూ ఆశ్రమాలూ నిర్మించి నిలువనీడనిస్తారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే ఒకపూట కడుపు నిండుతుంది, కానీ వారు రోజూ కడుపునిండా తినాలంటే బతకడానికి మార్గం చూపమని పెద్దలు చెప్పేవారు. జంషెడ్‌జీ కూడా అలాగే ఆలోచించారు. నిస్సహాయులమీద పెట్టుబడి పెడితే ఫలితం తాత్కాలికమే. అదే ప్రతిభగలవారిని ప్రోత్సహిస్తే వారి భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తు కూడా బాగుపడుతుంది కదా... అన్న ఆయన ఆలోచన ఒక నూతన శకానికి తెరలేపింది. దేశ భవిష్యత్తును నిజంగానే ఓ మలుపు తిప్పింది. విదేశాలకు వెళ్లి పై చదువులు చదవాలనుకున్న భారతీయ యువకులెందరో ఆ సంస్థ నుంచి ఆర్థిక సహాయం అందుకున్నారు.

జేఎన్‌ టాటా తొలి స్కాలర్‌ ఫ్రెనీ కె.ఆర్‌.కామా. ఇంగ్లాండ్‌లో వైద్య విద్య చదివివచ్చారు. మాజీ ఉప రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌, శాస్త్రవేత్తలు రాజారామన్న, జయంత్‌ నార్లికర్‌, మెహలీ మెహతా, నటుడు గిరీష్‌ కర్నాడ్‌, ప్రపంచ ప్రఖ్యాత వయొలినిస్ట్‌ జుబిన్‌ మెహతా... వీరంతా విద్యార్థులుగా ఆ సంస్థ సాయం అందుకున్నవారే. పథకం ప్రయోజనం కన్పించడం మొదలవగానే ఆ కుటుంబం మరింత ఉత్సాహంగా ధర్మనిధులను ప్రారంభించింది. టాటా కుటుంబ సభ్యుల పేరు మీద ఒకటీ రెండూ కాదు ఏకంగా 15 వరకూ ట్రస్టులు ఏర్పడ్డాయి. అన్నీ కలిసి టాటా ట్రస్టులుగా ఒకే ఛత్రం కింద చేరి ఈ ఏడాది 125 ఏళ్ల సంబరం జరుపుకుంటున్నాయి. విద్య, జీవనోపాధి, ఆరోగ్యం, నీరు, వ్యవసాయం, సాంకేతికత... ప్రధాన విషయాలుగా టాటా ట్రస్టులు చేస్తున్న సేవాకార్యక్రమాలు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలకు విస్తరించాయి. 170 జిల్లాల్లో 450కి పైగా ఎన్జీవోలతో కలిసి ఈ ట్రస్టులు పనిచేస్తున్నాయి.

జాతినిర్మాణం కీలకం
జంషెడ్‌జీ టాటా ఆలోచనలన్నింటా కన్పించే అంతర్గత సూత్రం ఒకటే... అదే జాతినిర్మాణం. అవి వితరణ కార్యక్రమాలైనా పరిశ్రమలూ వ్యాపారాలైనా... లక్ష్యం భారతదేశ నిర్మాణం. ‘అసలైన విశ్వవిద్యాలయాల’ అవసరాన్ని పేర్కొంటూ లార్డ్‌ రియా చేసిన ప్రసంగాన్ని విన్నారాయన. ఆ ప్రభావంతోనే తర్వాత తన సంపదలో సగం విలువ చేసే పలు భవనాలూ ఖాళీ స్థలాలను ఓ యూనివర్శిటీ ఏర్పాటుకు విరాళంగా ఇచ్చేశారు. జాతి నిర్మాణానికి చదువే కీలకమని ఆయన ప్రగాఢంగా నమ్మారు. దానితోనే దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చని భావించారు. ఈరోజు దేశంలోని ఉత్తమ విద్యాలయాల్లో ఒకటిగా పేరొందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఆయన నెలకొల్పినదే. తొలి హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్లాంట్‌, దేశంలోనే తొలి స్టీల్‌ ప్లాంట్‌... ఏది ప్రారంభించినా లక్ష్యం ఒకటే. విద్యావంతులూ వివిధ రంగాల్లో నిపుణులూ ఉన్న భారతాన్ని నిర్మించడం. జేఎన్‌ టాటా ఎండోమెంట్‌ పథకం కింద ఆర్థికసహాయాన్ని అందుకుని ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదువుకుని వచ్చిన వారందరికీ తెలుసు, టాటా స్కాలర్లుగా తమ ముందున్న అవకాశాలు ఎన్నో! వాటిని ఉపయోగించుకుని వారంతా తమ తమ రంగాల్లో నిష్ణాతులుగా రాణించడమే కాదు దేశ స్వాతంత్య్రం గురించీ కలలు కనడం మొదలెట్టారు. ఈ స్కాలర్‌షిప్‌కి ఆరోజుల్లోనే ఎంత డిమాండ్‌ ఉండేదంటే టాటా స్కాలర్లనిపించుకోవడం కోసం నామమాత్రపు ఆర్థిక సహాయం అయినా ఇవ్వమని అడిగేవాళ్లట కొంత మంది. ఇప్పటికీ టాటా ఎండోమెంట్‌ పథకం కింద ఆర్థికసాయం కోసం దరఖాస్తు చేసేవారి సంఖ్య ఏటికేడూ పెరుగుతూనే ఉంది. కేవలం ప్రతిభ ఆధారంగా ఏటా 120 మందిని టాటా స్కాలర్‌షిప్‌కి ఎంపిక చేస్తారు.

స్వాతంత్య్రోద్యమానికీ చేయూత
యువత చదువుతో సమాజంలో చైతన్యం వచ్చి దేశభవిష్యత్తు బాగుపడుతుందన్న జేఎన్‌ టాటా వూహ నిజమైంది. చదువుకున్న యువత స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొనడం మొదలైంది. జంషెడ్‌జీ కుమారులిద్దరూ తండ్రి వారసత్వాన్ని కొనసాగించారు. ఉద్యమానికి అండగా నిలిచారు. చిన్న కుమారుడు సర్‌ రతన్‌ టాటా...గోపాలకృష్ణ గోఖలే నెలకొల్పిన సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీకి పెద్ద మొత్తం విరాళమిచ్చారు. పదేళ్ల పాటు సంస్థ నిర్వహణ వ్యయం తానే భరించారు. దక్షిణాఫ్రికాలో భారతీయుల కోసం గాంధీ ప్రారంభించిన ఉద్యమానికి కూడా ఆర్థిక అండదండలు సర్‌ రతన్‌ టాటావే.

నైపుణ్యాలు లేని యువతకూ మహిళలకూ శిక్షణ ఇచ్చి జీవనోపాధి కల్పించేందుకు ఆరోజుల్లోనే టాటా ఇండస్ట్రియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించారు. మహిళల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా లేడీ మెహర్‌బాయి డి.టాటా ఎడ్యుకేషన్‌ ట్రస్టుని నెలకొల్పారు. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌, నేషనల్‌ మెటలర్జికల్‌ లేబొరేటరీ తదితర సంస్థలన్నీ సర్‌ రతన్‌ టాటా ట్రస్టు చలవే.

విదేశీ విశ్వవిద్యాలయాల్లో
విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లతో మొదలుపెట్టిన టాటా కుటుంబ వితరణ కార్యక్రమం నెమ్మదిగా పలు విద్యాసంస్థల ఏర్పాటుకు దారితీసింది. 1911లోనే బెంగళూరులో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ని ప్రారంభించారు. మొత్తం ఆసియా ప్రాంతంలోనే సైన్సు పరిశోధనలకు ప్రధాన కేంద్రమైంది ఈ సంస్థ. దానికి తొలి భారతీయ డైరెక్టర్‌గా చేసిన సీవీ రామన్‌ ఆ తర్వాత నోబెల్‌ బహుమతి అందుకున్నారు. పేదరిక నిర్మూలనకు అవసరమైన పథకాల రూపకల్పనకు తోడ్పడే పరిశోధనలను ప్రోత్సహించేవారు సర్‌ రతన్‌ టాటా. అందుకుగాను ఆయన యూనివర్శిటీ ఆఫ్‌ లండన్‌కి ఏటా పెద్ద మొత్తం విరాళంగా ఇచ్చేవారు. 19 ఏళ్ల తర్వాత లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో సర్‌ రతన్‌ టాటా ఫౌండేషన్‌ శాశ్వతంగా ఏర్పాటైంది. దీని సహాయంతో యూనివర్శిటీలోనూ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లోనూ ఎందరో విద్యార్థులు పరిశోధనలు చేశారు. మారుతున్న విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా విదేశాల్లోని పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో టాటా ట్రస్టుల కింద ప్రత్యేక విభాగాలు ఏర్పాటయ్యాయి.

ఐదేళ్లక్రితం ఎంఐటీలోనూ టాటా సెంటర్‌ని ఏర్పాటుచేశారు. ట్రస్టు ఆశయాలకు అనుగుణంగా పరిశోధన చేసే విద్యార్థులకు ఇది సహాయం చేస్తుంది. ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ పోర్టుఫోలియోలో భాగంగా 2013లో హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్లో టాటా హాలు ఏర్పాటైంది. వ్యవసాయమూ పౌష్టికాహారం అంశాలపై పరిశోధనకు టాటా-కార్నెల్‌ ఇనిషియేటివ్‌ తోడ్పడుతుంది. యూనివర్శిటీ ఆఫ్‌ షికాగోలో టాటా సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ని రెండేళ్ల క్రితం నెలకొల్పారు. యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాన్‌డీగో సహకారంతో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ యాక్టివ్‌ జెనెటిక్స్‌ అండ్‌ సొసైటీ ఏర్పాటైంది.

భార్య నగలతో సహా...
జంషెడ్‌జీ పెద్దకుమారుడు సర్‌ దొరాబ్జీ టాటాకి ఆటలంటే ఇష్టం. 1927లో ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ని ప్రారంభించిన ఆయన 1920లోనే భారత ఒలింపిక్‌ జట్టుని స్పాన్సర్‌ చేశారు. సర్‌ దొరాబ్జీ టాటాకు వారసులు లేరు. దాంతో టాటా సన్స్‌ కంపెనీలో 40శాతం భాగస్వామ్యంతో సహా తన యావదాస్తినీ ఆయన తన పేరు మీద ప్రారంభించబోయే ట్రస్టుకి చెందేలా రాసిచ్చేశారు. అందులో ఆయన భార్య దగ్గరున్న జూబిలీ డైమండ్‌, ఆయన పెట్టుకునే ముత్యాల టై పిన్ను లాంటి అపురూపమైన నగలు కూడా ఉన్నాయి. జూబిలీ డైమండ్‌ కోహినూర్‌ వజ్రం కన్నా రెండు రెట్లు పెద్దదని పేరు. కుషన్‌ ఆకారంలో ఉండే ఈ రంగులేని వజ్రం ప్రపంచంలోని పెద్ద వజ్రాల్లో ఒకటి. భార్య కోసం దాన్ని కొన్న దొరాబ్జీ టాటా ఆమె మరణానంతరం ట్రస్టుకి ఇచ్చేశారు. అది అమ్మగా వచ్చిన డబ్బును ట్రస్టు నిధిలో కలిపారు.

క్యాన్సర్‌ ఆస్పత్రులకు వెయ్యి కోట్లు
తన భార్య పేరు మీద లేడీ టాటా మెమోరియల్‌ ట్రస్టుని ప్రారంభించారు దొరాబ్జీ. లుకేమియా లాంటి రక్త సంబంధిత వ్యాధులపై పరిశోధన చేసేందుకు ప్రాధాన్యమిస్తుంది ఈ ట్రస్టు. బోంబేలోని ఓ ఆస్పత్రిలో రేడియాలజీ విభాగాన్ని ఏర్పాటుచేయాలని దొరాబ్జీ టాటా అనుకున్నారు. అయితే ఆయన మరణానంతరం ట్రస్టీలు సమాజ అవసరాన్నీ ట్రస్టు దగ్గరున్న నిధులనూ దృష్టిలో పెట్టుకుని క్యాన్సర్‌ చికిత్సకు ప్రత్యేకంగా ఓ ఆస్పత్రే ఏర్పాటుచేశారు. అదే టాటా మెమోరియల్‌ సెంటర్‌ ఫర్‌ క్యాన్సర్‌ రీసర్చ్‌ అండ్‌ ట్రీట్‌మెంట్‌. ముంబయిలోని ఈ ఆస్పత్రికి దేశంలోని పలు ప్రాంతాలనుంచి రోగులు చికిత్స కోసం వస్తారు. క్యాన్సర్‌ చికిత్సకి కొన్ని నెలలు పడుతుంది. అన్ని రోజులు ఇల్లు విడిచి అక్కడ ఉండలేక దూరప్రాంతాలనుంచి వస్తున్న కొందరు చికిత్సను మధ్యలోనే ఆపేసి తిరిగి వెళ్లిపోతున్న సంఘటనలు ట్రస్టు దృష్టికి వచ్చాయి. దాంతో దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఐదు క్యాన్సర్‌ ఆస్పత్రులను నిర్మించేందుకు సంకల్పించింది ట్రస్టు. అస్సాం, రాజస్థాన్‌, జార్ఖండ్‌, యూపీ, ఆంధ్రప్రదేశ్‌లలో వీటిని నిర్మించడానికి టాటా ట్రస్టులు రూ.1000 కోట్లు కేటాయించాయి. గ్లోబల్‌ ఫండ్‌తో కలిసి టాటా ట్రస్టులు గత ఏడాది ‘ద ఇండియా హెల్త్‌ ఫండ్‌’ని ఏర్పాటుచేశాయి. మలేరియా, టీబీ లాంటి ప్రధాన అంటువ్యాధులను ఎదుర్కొనడానికి ఈ నిధులను వినియోగిస్తారు.

కాలంతో పాటు విస్తరణ
ఏడెనిమిది దశాబ్దాల పాటు యువత; స్త్రీల చదువూ ఉపాధీ ఆరోగ్యాలపై దృష్టిపెట్టిన టాటా ట్రస్టులు 1990వ దశకం నుంచీ కొత్త రంగాలకు సేవలను విస్తరించాయి. గ్రామీణ ప్రజల సంక్షేమంపై దృష్టి సారించాయి. గ్రామాల్లో తాగు నీరు, పారిశుద్ధ్యం, పిల్లల చదువు, ఆరోగ్యం, స్త్రీల సాధికారత, నిరుద్యోగులకు ఉపాధి, రైతులకోసం సౌరశక్తీ సాంకేతికతల వినియోగం... ఇలాంటి వాటికి నిధులను వెచ్చిస్తున్నాయి. అదే సమయంలో దేశ ఆర్థిక విధానాల్లో వచ్చిన మార్పుల వల్ల ట్రస్టు ఆదాయమూ పెరిగింది. పుష్కలంగా ఉన్న నిధులను సక్రమంగా వినియోగించాలన్న తలంపుతో ట్రస్టులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్థానిక అవసరాలను బట్టి పథకాలను రూపొందిస్తూ ముందుకు సాగుతున్నాయి. రకరకాల గ్రాంటుల ద్వారా వ్యక్తులకూ సంస్థలకూ కూడా ఆర్థిక సహాయం చేస్తాయి ఈ ట్రస్టులు.

టాటా ట్రస్టులు ఏటా ఖర్చు చేసే నిధుల్లో దాదాపు 15 శాతాన్ని నీరూ పారిశుద్ధ్య కార్యక్రమాలకు వెచ్చిస్తాయి. టాటా వాటర్‌ మిషన్‌ కింద ఇవి జరుగుతాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 40 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పించిన టాటా వాటర్‌ మిషన్‌ వచ్చే మూడేళ్లలో కోటిన్నర మందికి సేవలందించడం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది దాదాపు రూ.800 కోట్లు ఇందుకు ఖర్చు పెట్టింది. ఇప్పటివరకూ తాగు నీటి సమస్య తీవ్రంగా ఉన్న 10 రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్న వాటర్‌ మిషన్‌ ఇప్పుడు కొత్తగా యూపీ, తెలంగాణ రాష్ట్రాలకూ విస్తరించనుంది. దిల్లీ, బెంగళూరుల్లో ఏర్పాటుచేసిన వాటర్‌ ఏటీఎంలు సత్ఫలితాలు ఇవ్వడంతో త్వరలో గుజరాత్‌, రాజస్థాన్‌, ఏపీలలో వీటిని నెలకొల్పే ప్రయత్నంలో ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడం ఈ ఏటీఎంల లక్ష్యం.

‘మార్పు’నకు సాంకేతికత
టాటా ట్రస్టులు 125 ఏళ్ల సంబరం జరుపుకుంటున్న సందర్భంగా కొత్త కార్యక్రమాన్ని చేపట్టాయి. సాంకేతికత సత్తాను చాటుతూ 2021కల్లా పదికోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసేలా పథకాలను అమలుచేస్తున్నాయి. తాము ఖర్చు పెట్టే నిధులకు సాంకేతికత కూడా తోడైతే మరింత వేగంగా ఫలితాలు పొందవచ్చని భావిస్తోంది ట్రస్టుల యాజమాన్యం. గ్రామాల్లో సామాజిక ఆర్థిక మార్పులకు శాస్త్రీయ అంశాల్లో శిక్షణా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నైపుణ్యాల మెరుగూ లాంటి పథకాలకు శ్రీకారం చుట్టారు. 12 రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పేందుకు ‘ఖాన్‌ అకాడమీ’తో ఒప్పందం కుదుర్చుకున్నాయి టాటా సంస్థలు.

అనాదిగా మన దేశంలో ధర్మదాతలకు కొదవ లేదు. శరణుకోరిన పావురాన్ని రక్షించడానికి తనను తాను దానం చేసుకున్నాడు శిబి చక్రవర్తి. పుట్టుకతో వచ్చిన కవచకుండలాలనే కోసి ఇచ్చాడు కర్ణుడు. పక్కన ఉన్నవారికి పెట్టకుండా తినకూడదంటుంది ఓ మతం. సంపాదనలో తప్పనిసరిగా ఒక వంతు దానం చేయమంటుంది ఇంకో మతం. వ్యక్తుల పేరునా కులాల పేరునా మతాల పేరునా లెక్కలేనన్ని ధర్మనిధి సంస్థలున్నాయి నేటి సమాజంలో. కానీ వాటన్నిటికీ భిన్నంగా కుల మత ప్రాంత ప్రస్తావన లేని అతి పెద్ద ట్రస్టుల్లో ఒకటి టాటాల ట్రస్టు. భారతీయులు ఎవరైనా ఆ ట్రస్టుల సహాయం పొందవచ్చు. టాటాల కుటుంబ ట్రస్టులుగా పేరొందిన వీటిని నిర్వహిస్తున్నవారిలో జేఎన్‌ టాటా రక్తసంబంధీకులెవరూ లేరు. జేఆర్‌డీ టాటా అయినా రతన్‌ టాటా అయినా దూరపు బంధుత్వం ద్వారా సంక్రమించిన వారసత్వమే. నిజానికి టాటాల సంస్కృతి రక్తసంబంధం కన్నా ఎంతో గాఢమైనది. సంపదను పోగుచేయడం, దాన్ని పదిలంగా వారసులకు అందించడం కన్నా విలువలతో కూడిన జీవితమూ జనులందరి సంక్షేమమే వారికి ముఖ్యం. టాటా ట్రస్టులే అందుకు సాక్ష్యం.


డబ్బెక్కడినుంచీ వస్తోందంటే...

టా వేల కోట్ల రూపాయలను సమాజం కోసం ఖర్చు పెడుతున్న టాటా ట్రస్టులకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందంటే... టాటా గ్రూప్‌ సంస్థల్లో అన్నిటికన్నా పెద్దది టాటా సన్స్‌. ఇందులో 66 శాతం వాటా టాటా ట్రస్టులదే. టాటా కంపెనీలన్నిటికీ పరోక్షంగా టాటా ట్రస్టులే మాతృసంస్థలవుతాయి. వాటన్నిటి లాభాలనుంచీ వచ్చే వాటాలే ఈ ట్రస్టుల నిర్వహణకు ప్రధాన వనరు. ఇది కాక అనేక దేశ విదేశీ సంస్థలూ టాటా ట్రస్టులకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తుంటాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో టాటా ట్రస్టులు తమ సేవాకార్యక్రమాల కింద దాదాపు రూ.800 కోట్లు ఖర్చు చేశాయి. 125 ఏళ్లుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది ఈ మొత్తం.

టాటా ట్రస్టులు ఇవీ!

దాదాపు 15 ట్రస్టుల సమాహారమే టాటా ట్రస్టులు.
1. జేఎన్‌ టాటా ఎండోమెంట్‌ (1892): టాటా గ్రూపు కింద ప్రారంభించిన మొట్టమొదటి ట్రస్టు ఇది. యువత ఉన్నత విద్యకు ఆర్థిక సాయం అందిస్తోంది.
2. సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌ (1919): జంషెడ్‌జీ టాటా చిన్న కుమారుడి వీలునామా ప్రకారం రూ.80 లక్షల కార్పస్‌ ఫండ్‌తో పెట్టిన ఈ ట్రస్టు సాంఘిక సంక్షేమానికి కృషి చేస్తుంది.
బాయి హీరాబాయి జేఎన్‌ టాటా నవ్‌సారి చారిటబుల్‌ ట్రస్టు(1923), సర్‌ రతన్‌ టాటా భార్య పేరున నవాజ్‌బాయి రతన్‌టాటా ట్రస్టు(1974), సార్వజనిక్‌ సేవా ట్రస్ట్‌(1975), టాటా ఎడ్యుకేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు (2008)... దీనికి అనుబంధంగా పనిచేస్తున్నాయి.

3. సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ (1932): జంషెడ్‌జీ టాటా పెద్ద కుమారుడు దొరాబ్జీ టాటా ఆ రోజుల్లోనే కోటి రూపాయల విలువైన తన సంపదనంతా ఈ ట్రస్టుకి రాసిచ్చేశారు. విద్య, పరిశోధన, పునరావాస కల్పన లాంటి వాటికి ఈ ట్రస్టు ప్రాధాన్యమిస్తుంది. దీనికి అనుబంధంగా ఏర్పాటుచేసిన పలు ట్రస్టులే నేడు విద్యారంగంలో ప్రముఖంగా పేరొందిన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ వంటి జాతీయ స్థాయి సంస్థలను నెలకొల్పాయి.

చేయీ చేయీ కలిపి...

చారిత్రక టాటా ట్రస్టులకు ప్రస్తుతం అధిపతిగా ఉన్నారు రతన్‌ టాటా. ట్రస్టుల భవిష్యత్‌ కార్యక్రమాల గురించి ఆయనేమంటారంటే...
* ఈ మధ్య కాలంలో టాటా ట్రస్టుల ఆదాయం బాగా పెరిగింది. అందుబాటులో ఉన్న నిధులను మరింత ప్రభావవంతంగా ఖర్చుపెట్టడం ఇప్పుడు మా మీద ఉన్న పెద్ద బాధ్యత. కాబట్టి ఎక్కువమంది అవసరార్థులను చేరేలా పథకాలు సిద్ధం చేసుకుంటున్నాం. సమాజానికీ తద్వారా దేశానికీ కూడా ఉపయోగపడాలన్న ట్రస్టుల మౌలిక లక్ష్యం మాకు మార్గదర్శకం.

* సమాజంలో అవసరాలు మారలేదు. నీరూ పారిశుద్ధ్యమూ పౌష్టికాహారలోపమూ అనారోగ్యాలూ పట్టణాల్లో పేదరికమూ... ఎప్పుడూ ఉన్న సమస్యలే. అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతికతా వనరులూ నైపుణ్యాలను వాడుకోవడం ద్వారా మరింత అర్థవంతంగా ఆ అవసరాలను తీర్చాలన్నది మా ప్రయత్నం.

* ప్రభుత్వాలూ సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాయి. కానీ పలు కారణాల వల్ల చేరవలసినవారికి అవి పూర్తిగా చేరడం లేదు. అలాంటి చోట్ల మేం భాగస్వామ్యం తీసుకోవడం ద్వారా పథకాల అమలు సమర్థంగా జరిగేలా చూస్తున్నాం. గతంలో ఇలా జరగలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో చేయి కలపడం వల్ల ప్రభుత్వ వనరులకు మా సేవలు తోడవుతున్నాయి. ఫలితంగా ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతున్నాం.

* టాటా కంపెనీలు కూడా సామాజిక బాధ్యత కింద పలు కార్యక్రమాల్ని చేపడతాయి. అయితే అవి కూడా ట్రస్టులతో కలిసి ముందుకు వెళ్తే ఫలితం బాగుంటుందన్నది నా ఉద్దేశం. కలిసి వెళ్లడం వల్ల మన సామర్థ్యాలూ స్థాయీ పెరుగుతాయి. కొన్ని సంస్థలకు ఇది ఇష్టం ఉండకపోవచ్చు. ఏ పద్ధతి అనుసరించాలన్నది ఆయా సంస్థల నాయకత్వం మీద ఆధారపడివుంటుంది.

264 గ్రామాల దత్తత

ఆంధ్రప్రదేశ్‌ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి దాని అభివృద్ధికి సహకరించేందుకు ముందుకొచ్చాయి టాటా ట్రస్టులు. విజయవాడ లోక్‌సభ నియోజకవర్గంలో 264 గ్రామాలను దత్తత తీసుకున్నాయి. నాలుగేళ్లలో 75 వేల ఎకరాల్లో వెదురు సాగు ద్వారా స్థానికులకు ఉపాధి, వెదురు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగకల్పన, 86 వేల మత్స్యకార కుటుంబాలకు ఆదాయం పెంపుపై దృష్టిపెట్టడం, మారుమూల గ్రామాలకూ బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యం, గ్రామాల్లో రక్షిత తాగునీటి కేంద్రాలు ఏర్పాటు... ఇవీ దత్తత ఒప్పందంలోని ముఖ్యాంశాలు. గ్రామీణుల్లో అంతర్జాలంపై అవగాహన కల్పించేందుకు ‘ఇంటర్నెట్‌ సాథీ’లను నియమించారు. మరుగుదొడ్లూ రహదారుల నిర్మాణమూ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటూ ఉచితంగా మందుల పంపిణీ గ్రంథాలయాలు నెలకొల్పడమూ తదితర కార్యక్రమాలనూ నిర్వహిస్తున్నారు. తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి క్యాన్సర్‌ ఆస్పత్రిని నెలకొల్పడానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుతో టాటా ట్రస్టులు ఒప్పందం కుదుర్చుకున్నాయి.