close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అందుకో నా లేఖ 


- యం.ఆర్‌.అరుణకుమారి

నాయనా గౌతమ్‌, బాగున్నావా? నీ శ్రీమతీ పిల్లలూ అంతా బాగున్నారని తలుస్తాను. వారికి నా ఆశీస్సులు.

గౌతమ్‌, నేను నీకు జాబు రాయడం- నీకే కాదు నాకు కూడా అనూహ్యమైన విషయమే! కానీ అనుకోనివి జరిగేదే కదా జీవితమంటే? అయినా, నీకు జాబు రాసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాను. ఏం రాయాలా అని కాదు, అసలు రాయొచ్చా రాయకూడదా అని. కానీ నీకు చదువు నేర్పిన గురువుగా ఇది నా బాధ్యత అని భావించాకే నేనీ జాబు రాయడానికి సిద్ధమయ్యాను.

గౌతమ్‌, నా దృష్టిలో చదువంటే అక్షరాలు నేర్చుకుని చదవడం, రాయడం కాదు. చదువంటే మంచిచెడులు తెలుసుకోవడం. వివేకం, విజ్ఞానం, విచక్షణ పెంపొందించుకోవడం. వాటిని జీవితానికి అన్వయించుకుంటూ అభివృద్ధి చెందడం. దురదృష్టవశాత్తూ అభివృద్ధి అంటే లక్షలు సంపాదించడం అని మాత్రమే నేటితరం భావించడం వల్ల క్రమంగా 
మనుషుల్లో మానవీయ, నైతిక విలువలు తగ్గిపోతూ ఉన్నాయి. ‘ధనమూలం ఇదం జగత్‌’ అనుకుంటూ మనిషి డబ్బు చుట్టూ తిరుగుతూ అది సృష్టించే హంగూ ఆర్భాటాలకు లొంగిపోయి... తన చుట్టూ తానే ఒక ఫాల్స్‌ ప్రిస్టేజి వలయాన్ని సృష్టించుకుని తానేదో గొప్పగా సాధించినట్లు విర్రవీగుతున్నాడు. అందులోకి తనూ తన భార్యాబిడ్డలూ తప్ప మరెవర్నీ రానివ్వడం లేదు. ఇలాగైతే మనుషుల మధ్య... సరిసరి... అసలు బంధువర్గం మధ్యనన్నా కనీస సంబంధ బాంధవ్యాలు ఎలా కలుస్తాయి? మమతలు ఎలా అంకురిస్తాయి? ప్రేమానురాగాల విలువలు ఎలా తెలుస్తాయి? మన ముందుతరాలకు మన సంస్కృతి ఎలా అందుతుంది? అన్నింటికన్నా మానవ సంబంధాలే ముఖ్యమని ఎప్పుడు తెలుసుకుంటారు?

‘స్నేహాలూ ప్రేమలూ అన్నీ అవసరార్థ కృతకాలైపోయిన ఈ హైటెక్‌ యుగంలో స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందిలే’ అని మీ తరంవాళ్ళు అనుకోవడం పొరపాటు... కాదు కాదు తప్పిదం! అవును గౌతమ్‌, మనం పుట్టినప్పట్నుంచీ... మనం పోయేదాకానో, వాళ్ళు పోయేదాకానో... మనకు కల్మషం, స్వార్థంలేని ప్రేమను పంచేవాళ్ళు మన కన్నవాళ్ళు. 
ప్రతి నిమిషమూ మారిపోతూన్న శాస్త్ర, సాంకేతిక, విజ్ఞానాలను అందిపుచ్చుకునే పరుగులో మనిషి అన్నిటినీ మరచిపోతున్నాడు. ఒయాసిస్సులను వదిలి ఎండమావుల వెంటపడుతున్నాడు. ఈ జీవన ప్రస్థానంలో ఎక్కడో ఒకచోట ఈ పరుగు ఆపక తప్పదు. వెనక్కి తిరిగి చూసుకోకా తప్పదు. అప్పుడు... తాను నడచివచ్చిన దారిలో... తనను నమ్మినవారికి ఏమిచ్చాడు, తాను తిరిగి ఏమి పొందాడు అన్న ప్రశ్నలకు... ఆత్మసంతృప్తి, ఆత్మానందం పొందానని భావిస్తే ఆ మనిషి జన్మ సార్థకమైనట్లే! లేకపోతే ఎంత పశ్చాత్తాపపడినా... గడచిపోయిన కాలం, గతించిన మనుషులూ తిరిగిరారు కదా! అటువంటి దయనీయ పరిస్థితి ఎవరికీ రాకూడదనే నా తపన.

ఆ తపనతోనే పుస్తకాల్లోని పాఠాలకు జీవిత పాఠాలు అన్వయించి బోధిస్తుంటాను. నా శిష్యులు పెద్ద చదువులు చదివి, ఉన్నత స్థానాలకు చేరుకున్నప్పుడు ఎంత సంతోషిస్తానో, వాళ్ళు చదువుతోపాటు సంస్కారాన్నీ అందిపుచ్చుకున్నప్పుడు అంతకు రెట్టింపు ఆనందిస్తుంటాను. మన ఊరి పిల్లలు కొందరు - వారిలో నీ స్నేహితులు కూడా ఉండొచ్చు - మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నవారు తమ కుటుంబాలనే కాదు ఊరిని కూడా అభివృద్ధి చేయడానికి చేస్తున్న కృషి... నాకు ఒకింత గర్వాన్ని కూడా కలిగిస్తుంటుంది. వాళ్ళు నా శిష్యులనుకుంటే... ఎంతో తృప్తిగా ఉంటుంది. ఆ సంతృప్తితోనే రిటైరవుతాననుకున్న నా ఆశ అడియాస అవుతుందని నేనసలు ఊహించనేలేదు. వచ్చేనెలలో నేను రిటైరవబోతున్నా. ఇది తెలిసి మన ఊరివాళ్ళందరూ గొప్పగా సభ చెయ్యాలనీ నన్ను సన్మానించాలనీ అనుకుంటుంటే... హఠాత్తుగా... మొన్న ఒకావిడ స్కూలుకొచ్చి ‘ఏం సదువు సెప్పినావు, అసలు నువ్వు అయ్యోరివేనా?’ అని నా మొహం మీదే అడిగేసింది.

నిజం చెప్పొద్దూ, ఇంతవరకూ- అంటే నా ముప్ఫైఅయిదేళ్ళ సర్వీసులో ఈ ప్రశ్నను బయటినుండిగానీ, నా అంతరాత్మనుండిగానీ నేను ఎదుర్కోనే లేదు. ‘పుస్తకాలు చదివి పాఠాలు చెప్పేవాళ్ళు ఉపాధ్యాయులు. పిల్లల్ని చదివి పాఠాలు చెప్పగలిగిన వాళ్ళు గురువులు. చదవగలిగితే ప్రతి పిల్లవాడూ ఒక అద్భుతమే’- అన్న గిజూబాయి ఆదర్శాలను ఒంటపట్టించుకుని, అధికారుల మెప్పునో, ఏ అవార్డులనో ఆశించకుండా... నా మనస్సాక్షితో విద్యాబోధన చేస్తున్న నేను ఆమె ప్రశ్నకు బిత్తరపోయాను. నోటమాటలేక నిలిచిపోయాను కొంతసేపు.

‘నీ దెగ్గిర అయిదేండ్లు సదవతారు పిలకాయలు. పెద్దయినంక, పెద్ది స్కొలుకు పోయినంక గూడా నీ దెగ్గిరకు వస్తానే ఉంటారు. నీతో మాటాడతానే ఉంటారు గదా. వాల్లకు మంచీ సెడ్డా యివరంగా సెప్పొద్దా? పెద్దా చిన్నా తల్లీ తండ్రీ అనే మట్టు మర్రేదా ఉండొద్దా?’ అంటున్న ఆవిడ కోపావేశాలతో రగులుతున్న అగ్నిపర్వతంలా ఉంది. 
‘ఏం జరిగింది?’ అని అడిగితేనే పగులుతుందా? ఉహు, లావాను భరించటానికి సిద్ధమైపోయాను. మరో గత్యంతరం లేదు.‘ఇట్టా లోపలికి రామ్మా, వచ్చి కూర్చో’ నచ్చచెప్పబోయాను. 
‘కూచోటానికి టయం ల్యా, బస్సొస్తాది కదా ఇబుడు. టవునుకు పోతాండా. అసలుకు నీకు నాయంగా ఉండాదాని అడగల్ల నొస్తి.’‘విషయమేమిటో చెప్పమ్మా ముందు’ అన్నా. ‘ఆ... ఆ... అందురూ నంగనాచులే. నిన్నంతా మా యింటాయన ఈడనే కూచోనుండె గదా... నీకేం చెప్పలా?’‘లేదే! అసలింతకూ ఏమయింది?’‘వోడికీ, వోడి పెల్లానికీ కండ్లు నెత్తికెక్కిండాయి. ఆ బిడ్డ పరాయిబిడ్డ. ఆయమ్మిని ఏమనేది? కడుపున పుట్నోడు జాతీగా లేకపోతే?’ ఆవిడ మాటల్లో కోపం.

‘కస్టం, నస్టం అనుకోలా! మా సుకం, సంతోసం చూసుకోలా! వోడు పుట్టినాల నుండీ వోడి కోసరమే మా బతుకనుకొంటిమి. వోడు కోరుకున్న గుడ్డలు, సదువు, పెండ్లి... అంతా వోడిస్ట పకారమే చేస్తిమి కదా! కాసింతన్నా మామింద అక్కర వుండద్దా? ఈ పొద్దుటిగ్గూడా మా కస్టమేందో మేం బడి, మా కూడు మేం తింటాండాం కదా! వోడినేమన్నా యిబ్బంది పెడ్తాండామా? కనీసరం వొల్లుకేమన్నా వస్తే గూడా సూసుకోపోతే ఎట్టా?’ ఆవిడ గొంతు చివరకొచ్చేసరికి గద్గదమవుతోంది.

ఇంతలో ఆవిడ భర్త వచ్చాడు. ‘ఏమ్మీ, యాడుండావు? పిలస్తాంటే యిన్పించుకోకండా వస్తాండావు?’ అంటూ.‘చూస్తివా అయ్యొరా! పొగులే ఎట్టా తడమాడుకుంటా వస్తాండాడో! కండ్లు కనబడతల్లేదంటే నువ్వు సెప్తివి గదా- పొరలొచ్చిండాయి... ఆపరేసను చేస్తారు, డాక్టరు దెగ్గిరకు పోమని. మనిసి మన మాట యింటే గదా! దినామూ పోరిపోరి మొన్నటికి ఎలబారినాడు కొడుకు దెగ్గిరకు పోయినోడు పోయినట్టే తిరిగొచ్చినాడు. ఏమయిందంటే- ఉలకడు పలకడు- బెల్లం కొట్టిన రాయి మాదిరి. సరే, అబ్బొడికే ఫోను చేస్తానంటే అబ్బుడుగాని నోరిప్పలా పెద్ద మనిసి...’

‘సర్లేమ్మే, ఇబ్బుడెందుకీడ పంచాయితీ?’ ఆయన చిరాగ్గా చూశాడు.‘పరువు కోసరం పాకలాడ్తామేగానీ పంచాయితీపెట్టి మొగాన యిన్ని పేడనీల్లు కొట్టినా పాపమేం రాదులే’ ఆవిడ ఈసడింపుగా అంది.‘ఎవురి మొగాన కొట్టల్లంటావు పేడ్నీల్లు? మన మొగాన మనమే కొట్టుకోవల్లగానీ!’‘ఎందుకయ్యా మన మొగాన కొట్టుకునేది? బిడ్డను కని, సాకి, సంతరించి సదవేసి, సంపాయించే మొగోన్ని చేసి, ఆ మహారాని చేతుల్లో పెట్టిందానికా?’ గయ్‌ మందావిడ.‘ఆయమ్మ చేతుల్లో పెట్టేసిండామని నువ్వే చెప్తాండావు. ఇంగ నీ పెత్తానమేంది?’‘అయ్యో నా ఎర్రి మొగుడా, పెత్తానం చేద్దామని కాదయ్యా. మనల్ని సూసుకొనే బాద్దెత వోడికి లేదాని అడుగుతుండా. ఏమయ్యోరా, నువు చెప్పు.’

నిజం చెప్పొద్దూ... ఆవిడ ఉగ్రరూపం నాకే భయం కలిగిస్తోంది. ఆ పళాన బస్సెక్కి... కొడుకు ఇంటికి వెళ్ళి ఎంత రాద్ధాంతం చేస్తుందోనని. ఇంకా చెప్పాలంటే- నోటిదురుసే కాదు చెయ్యి వాటమూ ఉన్న మనిషి. కొడుకునో... కోడల్నో... చెయ్యి చేసుకొంటే... అయ్య బాబోయ్‌... నాకూ ఆయనకూ ముచ్చెమటలు పోశాయి. పరిస్థితి గట్టెక్కించమని ఆయన నావంక దీనంగా చూశాడు. ఇంతలో బస్సు హారన్‌ విన్పించి ఆవిడ మెట్లు దిగబోయింది.

‘ఈ పొద్దు వోడి సంగతి తేల్చేసే వొస్తా.’‘తొందరపడమాకమ్మీ, అయ్యోరితో మాటాడు ముందు. ఆనక ఏం చెయ్యాలో చూద్దారి’ అంటూ ఆయన.‘అవునుమా, రా... కూర్చో! ముందసలు విషయమేంటో చెప్పు’ విషయమేమిటన్నది చూచాయగా అర్థమైనా వివరం కోరటంతో ఇహ ఆవిడ విధిలేనట్లు వచ్చి కూర్చుంది. 
‘అది కాదయ్యోరా! ఈ మనిసిని మొన్న పొద్దుగాల బస్సుకే మన ఎంకన్న పోతాంటే... జతచేసి టవునుకు అంపిస్తినా. ఎంకన్న బధ్రంగానే కొడుకింట్లో వదిలేసి ఆయన పని మింద ఆయన పోయెనంట. ఈయన్ని చూసి కొడుకు ‘ఏమయ్యా, ఎట్టుండావు? పానం బాగుండాదా?’- అని గదా అడగల్ల... ‘ఎందుకొచ్చినావు చెప్పా పెట్టాకండా’ అని సిరాకు పడ్నాడంట. కోడాలమ్మ అసలకు మాటాన్నేలేదంట. ‘టిపినీ తిను, మేము బయటకు పోతాండాము. నిన్ను బస్సెక్కిస్తా’ అన్నాడంట. ఈ మనిసి పానం సుట్టకపోయి ఏమీ మాటాడలేదంట. ఆయమ్మ పెట్టిన రొండిడ్లీలూ బలొంతంగా మింగేసి లేచి బయట వరండాలోకొచ్చి నిలబడ్నాడంట.

‘సీ సీ ఎదవ కంపు’ అంటా ఆయమ్మ కుర్సీలో, యింట్లో బుస్సుబుస్సుమని సీసాతో సెంటు కొడ్తాంటే వోడసలు ఏమీ మాటాడలేదంట. అయ్యోరా, పూలను నలిపి దంచి రసం తీస్తేనే సెంటు తయారవతాదని నువ్వోపారి పాటం చెప్తాంటే యింటి. మా వొంట్లో రకతమంతా సెమటచేసి సంపాయించిన దుడ్లతోనే గదా నా కొడుకు అంతవోడయినాడు. మల్లయితే మా సెమట్నిపుడు ‘కంపు’ అని సీదరించుకోవడం నాయమంటావా? అదే మొగాన అడిగేసి వద్దామనుకొంటి’ హఠాత్తుగా ఆవిడ ఏడ్వడం ప్రారంభించింది.నిజానికావిడ చాలా ధైర్యస్తురాలు. చిన్న విషయాలే కాదు, పెద్ద కష్టాలకు కూడా భయపడదు. కానీ, అనారోగ్యమనీ డాక్టరు దగ్గరకు తీసుకెళ్తారనీ వెళ్ళిన తండ్రిని కొడుకూ కోడలూ అవమానపరిచారని అంగలారుస్తున్న ఆమెను ఏమని ఓదార్చగలను? పోట్లాడ్డం వల్ల సమస్య పరిష్కారమవదు- మరింత దూరం పెరగడం తప్ప! వాళ్ళ కొడుకుతో నేను మాట్లాడతానని చెప్పి, నచ్చచెప్పి ఇంటికి పంపించాను. గాలిలో కలిసిపోయే మాటలకన్నా... చెరగని ‘రాత’ను మళ్ళీ మళ్ళీ చదువుతుంటే, మననం చేసుకుంటుంటే... మన తప్పొప్పులూ పరిష్కార మార్గాలూ తెలిసొస్తాయన్న ఆలోచనతో... ఈ ఉత్తరం రాస్తున్నాను.

గౌతమ్‌, నీకీపాటికి అర్థమయ్యే ఉంటుంది... ఆ తల్లిదండ్రులెవరో! నాయనా, కాయకష్టం చేసేవాళ్ళ దగ్గర చెమట వాసన కాక సెంటు పరిమళం వస్తుందా? ఎకరా భూమి లేకపోయినా నిన్ను పెద్ద సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరును చేసింది ఆ చెమట చిందించే కదా! వాళ్ళు కడుపుకింత తిన్న పూటలెన్నో, కడుపు మాడ్చుకున్న రోజులెన్నో నీకు తెలియనివా? గౌతమ్‌, పట్నం పరుగులూ ఉద్యోగాల ఉరుకులూ ఒత్తిళ్ళూ నాకు తెలియనివి కాదు. కానీ, నీకు జన్మనిచ్చి, నడకా నడతా నేర్పిన చూపుడువేళ్ళు అలసిన వేళ అలుసు చెయ్యడం తప్పు కాదూ? పొరపాట్లూ తప్పులూ చెయ్యడం మానవ సహజం నాయనా. తెలుసుకుని సరిదిద్దుకోవడం మనిషి ధర్మం! నీ బాధ్యతలను నీకు గుర్తుచేయాల్సిన ధర్మం... ఈ ఊరి పెద్దమనిషిగా, నీ గురువుగా నాకు ఉందని భావించే ఈ ఉత్తరం రాశాను. నువ్వు అన్యధా భావించినా నేనేమీ బాధపడను.

ఎలాంటి మనుషుల్లో అయినా మానవత్వం తాత్కాలికంగా మరుగున పడవచ్చేమో కానీ శాశ్వతంగా చచ్చిపోదని నమ్మే మనిషిని నేను. అలాంటిది నా బిడ్డల్లాంటి నా విద్యార్థుల గురించి వేరేగా ఎలా ఆలోచించగలను. నాయనా గౌతమ్‌, నా నమ్మకాన్ని వమ్ము కానీయవు కదా తండ్రీ..! మరి ఉంటాను.

ఆశీస్సులతో 
మీ మాస్టారు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.