close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టీనేజీ... గెలుపు గ్యారేజీ!

టీనేజీ... గెలుపు గ్యారేజీ!

అంతా కుర్రాళ్లే... అల్లరీ ఆటలూ సినిమాలూ బైకులూ... కాదంటే హోంవర్కులూ చదువూ పరీక్షలూ. అయినా ఏదో ప్రత్యేకత... అందరితో పాటూ చదువుకుంటున్నా సొంత ఆలోచన కొత్తబాట నడిపించింది. అమ్మానాన్నల చేయూత వెన్నుతట్టింది. ఫలితం... టీనేజీ దాటకముందే వార్తల్లోని వ్యక్తులయ్యారు. కొత్త కొత్త ఆవిష్కరణలూ వ్యాపారాలూ! విజయగాథలతో వెబ్‌సైట్లూ టెడ్‌ ప్రసంగాలూ పత్రికల్లో ఇంటర్వ్యూలూ! క్షణం తీరికలేని సీఈవోలూ శాస్త్రవేత్తలూ వీరు! ‘సాహో’ అనదా సమాజం మరి!

చెట్టు మీద నుంచి కాయలు కిందికి రాలడాన్ని అందరూ చూశారు. న్యూటన్‌ మాత్రమే దాని గురించి ఆలోచించాడు. ఫలితంగా గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రపంచానికి తెలిసింది. అతడిని గొప్ప శాస్త్రవేత్తని చేసింది. దక్షిణాఫ్రికాలో మొదటి తరగతిలో ఎక్కినందుకు గాంధీజీని రైలు దించేశారు అధికారులు. అప్పటికే న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయనకు జాతి వివక్ష గురించి తెలుసు. కానీ రైల్వే స్టేషన్లో జరిగిన ఆ ఘటన ఆయనలోని పోరాటయోధుణ్ణి తట్టిలేపింది. ప్రపంచానికి అహింసా సత్యాగ్రహాల సత్తా చాటింది. ఒక్క సంఘటన చాలు... ఆలోచన రేకెత్తడానికీ, ఆసక్తి పురి విప్పడానికీ. మనిషిలో నిద్రాణంగా ఉండే శక్తి సామర్థ్యాలు వెల్లడి కావడానికి వయసుతో సంబంధం లేదు. ఈ బంగారాలంతా అలా వెలుగులోకి వచ్చినవారే. స్కూల్లో హోంవర్కు ఇచ్చారనో, ఇంజినీరింగ్‌ కోర్సు ప్రాజెక్టులో భాగంగానో వీరు ప్రయోగాలు చేయలేదు. తమ చుట్టూ ఉన్న సమాజాన్ని చూశారు. అవసరాన్ని గుర్తించారు. తమ వంతు ఆవిష్కరణని అందించారు! శభాషనిపించుకున్నారు!

రూ.ఐదుకోట్ల ఒప్పందం! 

దిహేనేళ్ల వయసులో పిల్లలందరూ పదోతరగతి బోర్డు పరీక్షలు గట్టెక్కడమెలా అని ఆలోచిస్తుంటారు. హర్షవర్ధన్‌ జాలా మాత్రం చదువుకుంటూనే గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వంతో రూ.ఐదు కోట్లకు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాడు. మందు పాతరల్ని గుర్తించి ధ్వంసం చేయడానికి పనికొచ్చే డ్రోన్లను తయారుచేయడానికే ఆ ఒప్పందం. గత ఏడాదే హర్షవర్ధన్‌ అలాంటి డ్రోన్‌ నమూనా తయారుచేశాడు. బిజినెస్‌ ప్లాన్‌ కూడా సిద్ధం చేసుకున్నాడు. అది ఈ ఏడాది జనవరిలో జరిగిన ‘వైబ్రంట్‌ గుజరాత్‌’ సదస్సులో ఆచరణలో పెట్టాడు. మందుపాతరల్ని ధ్వంసం చేసే సమయంలో ఎందరో సైనికులు గాయపడడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని టీవీలో ఓ కార్యక్రమంలో చూశాడట. అప్పుడే తనకీ ఆలోచన వచ్చిందంటాడు హర్షవర్ధన్‌. మనుషులు లేకుండా డ్రోన్‌తో ఆ పని చేయిస్తే సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం ఉండదని భావించి డ్రోన్‌ తయారీకి పూనుకున్నాడు. డ్రోన్‌కి పేటెంట్‌కోసం దరఖాస్తు చేసుకున్న హర్ష ‘ఏరోబోటిక్స్‌’ పేరుతో సొంత కంపెనీని రిజిస్టర్‌ చేయించాడు. హర్ష తండ్రి ఓ ప్రైవేటు సంస్థలో అకౌంటెంటు. పదో ఏట నుంచే ఎలక్ట్రానిక్స్‌ పట్ల ఆసక్తి పెంచుకున్న హర్ష ప్రయోగాల కోసం అతడి తల్లిదండ్రులు ఇప్పటికే లక్షల్లో ఖర్చు చేశారు. మూడు వేర్వేరు రకాల ప్రయోజనాలతో నమూనా డ్రోన్లను తయారుచేశాడు హర్ష. స్వీయప్రతిభతో గూగుల్‌ కార్యాలయంలో ప్రసంగించేందుకు ఆహ్వానం అందుకున్న హర్ష అక్కడ జరిగిన సమావేశంలో పలువురు పెట్టుబడిదారులతో మరో ప్రాజెక్టు ఆలోచనను కూడా పంచుకున్నాడు. అప్పుడే తాను డిజైన్‌ చేసిన డ్రోన్లకు పేటెంట్‌ సంపాదించి పెద్ద ఎత్తున తయారుచేయాలన్న కోరిక బలపడిందట. ఆ కోరికను ఇప్పుడు సాకారం చేసుకుంటున్నాడు ఈ కార్యసాధకుడు.

వ్యర్థాలతో ‘గ్రీన్‌ ఉడ్‌’! 

చండీగఢ్‌లో చదువుకుంటూ సెలవుల్లో సొంత వూరు అమృత్‌సర్‌ వెళ్లేది బిస్మన్‌ దేవ్‌. అలా వెళ్లినప్పుడు ఓసారి తండ్రితో కలిసి పొలాల్లో నడుస్తుండగా దూరంగా దట్టంగా కన్పించిన నల్లని పొగ మేఘాలు చూసి భయపడిపోయింది. పంట నూర్పిళ్లు అయ్యాక రైతులు గడ్డీ పొట్టూ తగలబెడుతుంటారనీ అది మామూలేననీ తండ్రి చెప్పాడు. ఆ నల్లని పొగ ఎంత కాలుష్యకారకమో చదువుకుంటున్న ఆ అమ్మాయికి తెలుసు. పైగా పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో రైతులు చేస్తున్న ఈ పని వల్ల దిల్లీ వరకూ కాలుష్యం వ్యాపిస్తున్న సంగతీ ఆమె పేపర్లో చదివింది. అలా తగలబెట్టకుండా దాన్ని మరొకందుకు ఉపయోగించుకోలేమా..? ఆ ప్రశ్న పదిహేనేళ్ల ఆ అమ్మాయిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. బడికెళ్లి టీచర్లతో చర్చలు జరిపేది. ఇంటికొచ్చి వంటింటిని ప్రయోగశాలగా మార్చేసేది. ఫలితంగా తయారైందే ‘గ్రీన్‌ ఉడ్‌’. పంటల వ్యర్థాలను వాడి తయారుచేసిన ఈ గ్రీన్‌ ఉడ్‌ నీటిలో తడవదు. దాంతో చౌకగా ఇళ్లు కట్టుకోవడానికి మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. బిస్మన్‌ తయారుచేసిన ఈ గ్రీన్‌ ఉడ్‌ హ్యూలెట్‌ ప్యాకార్డ్‌ సంస్థ వారి సోషల్‌ ఇన్నొవేషన్‌ రిలే పోటీలో గెలుపొందింది. పద్దెనిమిదేళ్ల బిస్మన్‌ ఇప్పుడు ఇంగ్లాండ్‌లోని వార్విక్‌ యూనివర్శిటీలో పై చదువులు చదువుతోంది. గ్రీన్‌ ఉడ్‌కి పేటెంట్‌ తీసుకుని దాన్ని మరింతగా అభివృద్ధి చేయడం ద్వారా అటు కాలుష్యం తగ్గించడమూ ఇటు పేదలకు చౌకగా ఇళ్ల నిర్మాణానికి తోడ్పడడమూ తన భవిష్యత్‌ ఆశయాలంటోంది ఈ నవ యువతి.

పెద్దయ్యేదాకా ఆగనక్కర్లేదట...

దైనా సాధించాలంటే పెద్దయ్యేదాకా ఆగనక్కర్లేదంటుంది పన్నెండేళ్ల ఇషితా కత్యాల్‌. ఆమె అలాగే సాధించింది మరి. కబుర్ల పోగు అయిన ఇషితాని అందరూ పెద్దయ్యాక ఏమవుతావు అనడిగేవారట. ఏమన్నా అవ్వాలంటే పెద్దవాళ్లమవ్వాల్సిందేనా, చిన్నప్పుడే సాధించకూడదా అన్నది ఈ చిచ్చరపిడుగు ఎదురు ప్రశ్న. ఏడేళ్లప్పుడు అమ్మానాన్నలతో ఓ టెడ్‌ ప్రసంగానికి హాజరైన ఈ చిన్నారికి వేదిక మీద వాళ్లు మాట్లాడుతోంటే ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం తెగ నచ్చేసింది. అంతే, తానూ అలా మాట్లాడాలని నిర్ణయించేసుకుంది. అమ్మ వెంటపడి ఆ వివరాలు తెలుసుకుంది. టెడ్‌ఎక్స్‌ గ్లోబల్‌ వలంటీర్లకోసం రెండు స్కైప్‌ ఇంటర్వ్యూలను దిగ్విజయంగా పూర్తిచేసింది. తన స్కూల్లో టెడ్‌ ప్రసంగం నిర్వహించి అందరి మన్ననలూ పొందింది. దాంతో పదేళ్ల ఇషితాకి న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ మ్యూజియంలో జరిగిన టెడ్‌ సదస్సులో మాట్లాడడానికి ఆహ్వానం లభించింది. ‘పెద్దయ్యేదాకా ఆగాల్సిన అవసరం ఎందుకు లేదంటే...’ అంటూ తనకిష్టమైన అంశంపై తొలి ప్రసంగం చేసింది. ‘వేదిక మీద మాట్లాడడానికి భయపడేవాళ్లు ఒకటే గుర్తుపెట్టుకోవాలి... మొదటిసారి అలా నెర్వస్‌గా అన్పించడం మామూలే. నాకూ అలాగే అన్పించింది. మాట్లాడుతూ ఉంటే అలవాటైపోతుంది’ అంటుంది ఆరిందాలా ఇప్పుడు. పుణెకి చెందిన ఈ అమ్మాయి భారత్‌ నుంచి టెడ్‌ ప్రసంగం చేసిన అత్యంత పిన్నవయస్కురాలు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో టెడ్‌ యూత్‌ సదస్సులు ఏర్పాటుచేస్తున్న పిన్న వయస్కురాలిగా కూడా రికార్డు సృష్టించింది. ఎనిమిదో ఏటే ‘సిమ్రాన్స్‌ డైరీ’ పేరుతో ఓ పుస్తకం కూడా రాసేసిందీ గడుగ్గాయి.

వూపిరిని మాటలుగా మార్చి...

ర్ష్‌ షా దిల్‌బాగీ స్కూల్లో చదువుతుండగా ఓ సంఘటన జరిగింది. బంధువుల్లో ఓ వ్యక్తి పక్షవాతానికి గురికావడంతో మాట్లాడలేకపోయేవాడు. పూర్తిగా మూగవాడిలా మారిపోయిన అతడి పరిస్థితి చిన్న పిల్లవాడైన అర్ష్‌ని ఆలోచింపజేసింది. ఇతరులతో సంభాషించడానికి అతను పడే అవస్థను చూసి స్టీఫెన్‌ హాకింగ్‌ లాంటివాళ్లు ఉపయోగించే పరికరం లాంటిది ఈయన కూడా ఉపయోగించవచ్చు కదా అనుకున్నాడట. కుతూహలంతో అలాంటి పరికరాల గురించి అంతర్జాలంలో ఆరా తీస్తే అవెంత ఖరీదైనవో అర్థమైంది. సాధారణ ప్రజలకు అవి అందుబాటులో లేవనీ, పలు రకాల అనారోగ్యాలతో బాధపడుతున్నవారు ఎందరో మాట కోల్పోయి జీవితాంతం అలాగే గడపాల్సి వస్తోందనీ తెలుసుకున్నాడు. పన్నెండేళ్ల వయసు నుంచే రోబోటిక్స్‌ పట్ల ఆసక్తితో ప్రయోగాలు చేస్తున్న అర్ష్‌కి తానే అలాంటి పరికరం ఒకటి ఎందుకు తయారుచేయకూడదన్న ఆలోచన వచ్చింది. మోర్స్‌ కోడ్‌ని ఉపయోగించి శ్వాసను ఎలక్ట్రికల్‌ సిగ్నల్స్‌గా మార్చి తర్వాత పదాల్లోకి అనువదించగల ‘టాక్‌’ అనే పరికరాన్ని అర్ష్‌ రూపొందించాడు. మూడేళ్ల క్రితం దాన్ని గూగుల్‌ గ్లోబల్‌ సైన్స్‌ ఫెయిర్‌కి పంపించగా ఓటర్స్‌ ఛాయిస్‌ అవార్డు లభించింది. ‘ఇన్‌స్పైర్‌’ అవార్డునూ గెలుచుకున్నాడు. సాంకేతికత మన శక్తి సామర్థ్యాలను ఎన్నో రెట్లు పెంచగలదని నమ్మే పద్దెనిమిదేళ్ల అర్ష్‌ ప్రస్తుతం ప్రిన్స్‌టన్‌ యూనివర్శిటీలో కంప్యూటర్‌ సైన్సు చదువుతున్నాడు. మరో పక్క ‘టాక్‌’ ప్రయోజనాలను పెంచి చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయోగాలు కొనసాగిస్తున్నాడు. ‘అరిడో’ పేరుతో సొంత సంస్థను ప్రారంభించిన అర్ష్‌ రోబోటిక్‌ శాస్త్రవేత్తగా ప్రజలకు ఉపయోగకరమైన పరికరాలే తయారుచేస్తానంటాడు.

పేదల కోసం ఇన్వర్టర్‌

రెంటు పోయినప్పుడు కూడా ఫ్యాన్లూ ఏసీలూ పనిచేయాలంటే డబ్బున్నవాళ్లు ఇన్వర్టరు కొనుక్కుంటారు. పేదలకు ఆ వెసులుబాటు లేదన్న ఆలోచన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడిని ప్రయోగాల దిశగా మళ్లించింది. హైదరాబాదులో పదో తరగతి చదువుతున్న నడిమింటి చంద్రశేఖర్‌ సొంతంగా ఓ పరికరాన్ని తయారుచేశాడు. దాన్ని ఫ్యాన్‌కి ఫిట్‌చేస్తే ఫ్యాన్‌ తిరిగినంతసేపూ అది ఛార్జ్‌ అవుతుంది. కరెంటు లేనప్పుడు దానితోనే ఫ్యాన్‌ తిరుగుతుంది. ఒక్క ఫ్యాన్‌కే కాకుండా దేనికైనా ఆ కరెంటును వాడుకునేలా చంద్రశేఖర్‌ దీనిని రూపొందించాడు. తరచూ ఇలాంటి ప్రయోగాలు చేస్తూండే చంద్రశేఖర్‌ని టీహబ్‌కి వెళ్లమని పొరుగింటి వాళ్లు సలహా ఇచ్చారు. అక్కడి అధికారులూ ప్రోత్సహించడంతో టీహబ్‌ తొలివార్షికోత్సవం సందర్భంగా వేదికమీద తన ప్రాజెక్టు గురించి వివరించాడు. అతడి ఆలోచన ఎందరినో ఆకట్టుకుంది. పెట్టుబడిదారులూ ఆసక్తి చూపారు. టీహబ్‌ సీఈవో జయ్‌ కృష్ణన్‌ కూడా దాన్ని చూసి చంద్రశేఖర్‌ని టీహబ్‌కి రమ్మనీ తాము సహాయం చేస్తామనీ ఆహ్వానించారు. ఓ పక్క పరికరాన్ని మరింతగా అభివృద్ధి పరిచే ప్రయోగాలు కొనసాగిస్తూనే పేటెంట్‌ సంపాదించే ప్రయత్నాలూ ప్రారంభించాడతడు. అంతా సవ్యంగా సాగితే మరో మూడు నెలల్లో ఉత్పత్తికి శ్రీకారం చుడతానంటున్నాడు. చంద్రశేఖర్‌ తండ్రి ఓ దేవాలయంలో ఉద్యోగి. పెదనాన్న ద్వారా సైన్సులో ఆసక్తి పెంచుకున్న చంద్రశేఖర్‌ ఏడవ తరగతి నుంచీ సైన్స్‌ ప్రదర్శనల్లో పాల్గొనేవాడు. కజిన్‌ సాయికృష్ణ మార్గదర్శకత్వమూ సీఏ చదువుతున్న అన్నయ్య ప్రోత్సాహమూ తనని ధైర్యంగా ముందుకు నడిపిస్తున్నాయనే చంద్రశేఖర్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదివి గ్రామీణ పేదలకు విద్యుచ్ఛక్తీ, నీరూ అందించే పరికరాలను తయారుచేయడమే తన ఆశయమంటున్నాడు.

1700 మందితో పోటీపడి...

యువతరాన్నీ సృజనాత్మక స్టార్టప్‌లనీ ప్రోత్సహించడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘ఎలెవేట్‌ 100’ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. 100 స్టార్టప్‌ ప్రాజెక్టులకు ప్రభుత్వ సహాయం అందించాలన్నది దాని లక్ష్యం. అందులో 1700 మంది పోటీ పడగా ఎంపికైన వందమందిలో ఒకరు నిరంజన్‌ కరగి. ఇంజినీరింగ్‌ చదువుతుండగానే ఈ విద్యార్థి ఎంతో తక్కువ ఖర్చుతో తేలికైన, చౌకైన వాటర్‌ఫిల్టర్‌ని తయారుచేశాడు. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లడానికి వీలయ్యే ఈ వాటర్‌ఫిల్టర్‌తో అందుబాటులో ఉన్న నీటిని తేలిగ్గా ఫిల్టర్‌ చేసుకుని ధైర్యంగా తాగేయొచ్చు. బ్రాండెడ్‌ నీళ్ల సీసాలకోసం వేచిచూడనక్కర లేదు. ‘గ్రౌండ్‌లో ఆడుకునేటప్పుడు మేం ఇళ్లనుంచి తెచ్చుకునో, కొనుక్కునో నీరు తాగేవాళ్లం. కానీ చుట్టుపక్కల ఉండే పేదవాళ్ల పిల్లలు మంచినీరు కొనుక్కునే స్తోమత లేక ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉన్న నీరు తాగడం చూశాను. అది ఎంత ప్రమాదమో, నీటి ద్వారా ఎన్ని వ్యాధులు సోకుతాయో నాకు తెలుసు. అందుకే చాలా చౌకగా మళ్లీ మళ్లీ వినియోగించుకోవడానికి వీలయ్యే ప్యూరిఫయర్‌ తయారుచేయాలనుకున్నా’ అనే నిరంజన్‌ ఓ పక్క ఇంజినీరింగ్‌ చదువుతూనే వాటర్‌ ఫిల్టర్‌కోసం ప్రయోగాలూ చేశాడు. చివరికి విజయవంతంగా నమూనా సిద్ధమైంది. దేశ్‌పాండే ఫౌండేషన్‌ వారి ‘లీడ్‌’ కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకోగా అతని ఆలోచన నచ్చి ఆర్థిక సహకారం అందించారు. ‘నిర్ణల్‌’ పేరుతో పోర్టబుల్‌ వాటర్‌ ఫిల్టర్లను తయారుచేసి విక్రయించడం మొదలెట్టాడు నిరంజన్‌. మైక్రోసాఫ్ట్‌ గ్లోబల్‌ డైరెక్టర్‌ రవి నారాయణ్‌కి నిరంజన్‌ ఆవిష్కరణ ఎంతగానో నచ్చి తానూ ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. దాంతో ఇప్పటికే కొన్ని వేల పరికరాలు తయారుచేసి అమ్మారు. ఇప్పుడు ప్రభుత్వ సహాయం అందడంతో నిరంజన్‌కి తన ప్రాజెక్టుని వ్యాపార స్థాయిలో పెద్ద ఎత్తున విస్తరించడానికి అవకాశం లభించింది. అలా అటు ఇంజినీరింగ్‌ పూర్తవుతూనే ఇటు కంపెనీకి అధిపతి అయిపోయాడు నిరంజన్‌.

ఆప్‌లతోనే ఫోర్బ్స్‌ దాకా!

శ్రవణ్‌ కుమరన్‌ (17), సంజయ్‌ కుమరన్‌(16). ఈ అన్నదమ్ములిద్దరూ ఎప్పుడూ ఒకరిని ఒకరు అంటిపెట్టుకునే ఉంటారు. స్వయంగా ఆప్‌లు తయారుచేసిన పిన్నవయస్కులుగా ఐదారేళ్ల క్రితమే పేరుతెచ్చుకున్న ఈ సోదరులు ఇప్పుడు కుమరన్‌ బ్రదర్స్‌గా ఫోర్బ్స్‌ జాబితాలోకీ ఎక్కారు. ముప్పైఏళ్లలోపు 30 మంది ఆసియా యువకుల జాబితాలో స్థానం పొంది యువభారతం సత్తా చాటారు. పదుల సంఖ్యలో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆప్స్‌, మొబైల్‌ గేమ్స్‌ తయారుచేసిన వీరు సొంతంగా పెట్టుకున్న కంపెనీ పేరు ‘గో డైమెన్షన్స్‌’. దానికి అన్నదమ్ముల్లో ఒకరు సీఈవో, మరొకరు ప్రెసిడెంట్‌. 2013లో కొరియా హెరాల్డ్‌ పత్రిక ప్రపంచంలోని టాప్‌టెన్‌ ఆప్‌ డెవలపర్ల జాబితా తయారుచేయగా అందులో వీరికి చోటు లభించింది. సమాజానికి ఉపయోగపడే పనిచేయాలన్న ఉద్దేశంతోనే తాము ఆప్స్‌ తయారుచేయడం మొదలెట్టామనీ తమ ఆప్స్‌ అన్నిటికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనీ చెప్తున్నారు ఈ సోదరులు. తాజాగా వీరు తయారుచేసిన ఆప్‌ పేరు ‘గో డొనేట్‌’. మిగిలిపోయిన ఆహారం వ్యర్థం కాకుండా స్థానికంగా అవసరమైన వారికి ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. చిన్నప్పుడు తాము చేసే ప్రయోగాలకు ఖర్చు తండ్రి భరించేవాడనీ ఇప్పుడు తాము సొంతంగా సంపాదించి తండ్రికి ఇస్తున్నామనీ గర్వంగా చెబుతున్నారీ నవయువకులు. ఇంకా టీనేజీ దాటకుండానే ఐఐటీ, ఎన్‌ఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో విద్యార్థులకు గెస్ట్‌ లెక్చర్లు ఇస్తున్న వీరు ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌’ పేరుతో తమ ఇంటికి తాళం వేయడానికీ తీయడానికీ కూడా ఓ మొబైల్‌ ఆప్‌ తయారుచేసుకున్నారు. తక్కువ ఖర్చుతో వీళ్లు తయారుచేసిన వీఆర్‌ పరికరం కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది.

17 ఆవిష్కరణలు ఆదిత్య సొంతం

న వయసు పిల్లలు ఇంటర్మీడియట్‌ పుస్తకాలతో ఎంట్రన్స్‌ కోచింగులతో కుస్తీ పడుతోంటే తమిళనాడుకు చెందిన టెనిత్‌ ఆదిత్య మాత్రం కూల్‌గా కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ, అవార్డులు గెలుచుకుంటూ యంగ్‌ సైంటిస్ట్‌ అనిపించుకుంటున్నాడు. ‘సమస్యలతో జీవించడమెందుకు పరిష్కారం మన చేతిలో ఉండగా...’ అన్నది ఆదిత్య నమ్మే సిద్ధాంతం. నాలుగో తరగతిలో మొదలెట్టిన కంప్యూటర్‌ పాఠాలతో నాలుగు పదుల అప్లికేషన్లూ ఆరు భాషలూ నేర్చేసుకున్నాడు. రోజులో ఎక్కువ భాగం ప్రయోగశాలలోనే గడిపే ఆదిత్య ఓసారి ప్రయోగం వికటించి విషవాయువు పీల్చి ఆస్పత్రిలో చేరాడు. కంగారుపడిన అమ్మానాన్నలకు ‘సైన్సు అభివృద్ధి చెందాలంటే త్యాగాలు అవసరం’ అని సమాధానం ఇచ్చాడట. ఆ తర్వాత వారు ఎన్ని ఆంక్షలు పెట్టినా తన ప్రయోగాలు మాత్రం ఆపలేదు. అలా ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఓసారి అతనికి ఒకేచోట చాలా ప్లగ్‌ పాయింట్లు అవసరమయ్యాయి. దాంతో ఎలా కావాలంటే అలా అమర్చుకోగల ఎక్స్‌టెన్షన్‌ బోర్డుని తానే తయారుచేసుకోవడంతో అతని ఆవిష్కరణల పర్వానికి తెరలేచింది. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడానికి అరటి ఆకులతో కప్పులూ ప్లేట్లూ తయారుచేశాడు. ఎలాంటి రసాయనాలూ ఉపయోగించకుండానే అరిటాకుల్ని ఏడాది పాటు నిలవుంచే టెక్నిక్‌ను కూడా కనిపెట్టాడు. వాడాక వాటిని ఎరువుగా వినియోగించవచ్చు. అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు ఆదిత్య ఆవిష్కరణలను గుర్తించాయి. ఇప్పటికే 17 ఆవిష్కరణలను తన ఖాతాలో వేసుకున్న ఆదిత్య రెండు జాతీయ అవార్డులు, నేషనల్‌ ఇన్నొవేషన్‌ ఫౌండేషన్‌ నుంచీ ‘ఇగ్నైట్‌’ అవార్డూ పొందాడు. అతడికి మరో అపూర్వమైన గౌరవమూ దక్కింది. ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ‘ఇన్నొవేటర్‌ ఇన్‌ రెసిడెన్స్‌’ కార్యక్రమానికి ఎంపికైన ఆదిత్య రాష్ట్రపతి నిలయంలో 20 రోజులు గడిపాడు. రాష్ట్రపతి వెంట ఉండి ఎన్నో పాఠాలూ నేర్చుకున్నాడు. గొప్ప ఆవిష్కర్త కావాలనీ ఏరోస్పేస్‌ ఇంజినీరై ఇస్రోలో ఉద్యోగం చేయాలనీ కలలు కంటున్నాడు ఈ యువ శాస్త్రవేత్త.

టీనేజీ మిలియనీర్‌!

పందొమ్మిదేళ్ల వయసులో అబ్బాయిలు బైక్‌ కొనిపించుకోవడానికి అమ్మానాన్నల్ని ఎలా ఒప్పించాలా అన్న ప్రయత్నాల్లో ఉంటారు. భారత సంతతికే చెందిన ఈ కుర్రాడు మాత్రం ఏకంగా బ్రిటన్‌లో అత్యంత పిన్నవయస్కుడైన మిలియనీర్‌గా సంచలనం సృష్టించాడు. డోర్‌స్టెప్స్‌.కో.యూకే పేరుతో ఆన్‌లైన్‌ రియల్‌ ఎస్టేట్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు అక్షయ్‌. స్కూల్లో చదువుకుంటూనే బంధువుల దగ్గర ఏడువేల పౌండ్లు అప్పు తీసుకుని ఏజెన్సీ మొదలుపెట్టాడు. ఇప్పుడు దాని విలువ 12 మిలియన్‌ పౌండ్లు. అంటే అక్షరాలా 103 కోట్ల రూపాయల పైచిలుకు. మామూలు రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్ల కన్నా తక్కువ కమిషన్‌తో స్థిరాస్తుల క్రయవిక్రయాలు చేసి పెడుతుంది అక్షయ్‌ ఏజెన్సీ. దేశంలోని పెద్ద రియల్‌ ఎస్టేట్‌ ఏజెన్సీల్లో అక్షయ్‌ ఏజెన్సీ 18వ స్థానంలో ఉంది. ‘మీ ఇంటి ఫొటో ఇంటర్నెట్లో పెట్టినందుకు ఏజెంటుకు అంత డబ్బు ఎందుకివ్వాలి’ అని ప్రశ్నించే ఈ యువ వ్యాపారి 99 పౌండ్లకే తానా పని చేసిపెడుతున్నాడు. మిగిలిన ఏజెంట్లు వందల్లోనే కాదు, వేలల్లోనూ కమిషన్‌ వసూలు చేస్తారట. ఇదే కాదు, అక్షయ్‌ వ్యాపారంలో ఇంకా కొత్త కోణాలు చాలా ఉన్నాయి. ఫ్యాన్సీ కార్లు, మెరిసే కోట్లూ వేసుకుని తిరిగే రియల్‌ ఎస్టేటు వ్యాపారులకు దూరంగా ఉండే అక్షయ్‌ తమ కాళ్లమీద తాము నిలబడాలని ఆకాంక్షించే గృహిణులను ఏజెంట్లుగా ఎంపికచేసుకుంటాడు. వాళ్లయితే నిజాయతీగా పనిచేయడమే కాదు, కొనుగోలుదారులకు గొప్పలు చెప్పకుండా వాస్తవాలు చెబుతారని అతడి నమ్మకం. కొత్తలో తాను స్కూలుకెళ్లినప్పుడు ఫోన్లు తీసుకునే బాధ్యత కాల్‌సెంటర్‌కి అప్పజెప్పేవాడు. స్కూల్‌నుంచి వచ్చాక స్వయంగా ఫోన్లు చేసి వినియోగదారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవాడు. ఇప్పుడు 12 మంది ఉద్యోగులతో ఆఫీసు నిర్వహిస్తున్నాడు. తానూ వెయ్యి పౌండ్లు జీతం తీసుకుంటాడు. తాను దాచుకున్న డబ్బుతోనే తొలి కారు కొనుక్కోవాలన్నది అతడి కోరికట. అక్షయ్‌ అమ్మానాన్నలు రేణుకా కౌశిక్‌లిద్దరూ బధిరులే. చిన్న ఉద్యోగాలు చేస్తూ బిడ్డను పెంచుకున్నారు. స్వయంకృషితో నిజాయతీగా బతకాలని తాము నేర్పిన పాఠం విని బుద్ధిమంతుడిగా ఎదిగిన కొడుకుని చూసి మురిసిపోతున్నారు వారు.

స్వేచ్ఛగా ఆలోచించడమూ కలలు కనడమూ పిల్లలకుండే గొప్ప లక్షణాలు. చదువూ ఇంటి వాతావరణమూ వాటికి ప్రేరణనిస్తే... అమ్మానాన్నలు ఆ కలలకు రెక్కలు తొడిగితే... పట్టాలతో పనిలేదు, పాతికేళ్లు వచ్చేదాకా ఆగనూ అక్కర్లేదు! టీనేజీనే... గెలుపు గ్యారేజీ అవుతుంది!

అందుకు నిలువెత్తు సాక్ష్యాలే వీరు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.