close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మానవత్వం సాయితత్వం..!

మానవత్వం సాయితత్వం..!

షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం ఈ భౌతిక దేహానంతరం సహితం నేనప్రమత్తుడనే మీ భారాన్ని నాపై వేయండి నేను మోస్తాను నన్నాశ్రయించిన వారినీ శరణు జొచ్చిన వారినీ రక్షించడమే నా కర్తవ్యం... వందేళ్ల కిందట... బాబా సశరీరులుగా ఉన్నపుడు పలికిన మాటలివి. ఇన్నేళ్లలో ఆ మాటలపై భక్తులకు నమ్మకం ఎన్నో రెట్లు పెరుగుతూ వచ్చింది కానీ అణువంతైనా తగ్గలేదు. ఎంత అద్భుతమది..? 1918 అక్టోబర్‌ పదిహేను... సాయి బాబా మహా సమాధి చెందిన రోజు. నేటికి సరిగ్గా వందో ఏట అడుగు పెట్టాం. అందుకే, ఈ నెల నుంచీ వచ్చే ఏడాది అక్టోబర్‌ వరకూ సంవత్సరం పాటు షిర్డీతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబా ఆలయాలన్నిటిలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. బాబా గురించి మననం చేసుకోవడానికి ఇంతకుమించిన మంచి సందర్భం ఏముంటుందీ...

నూట యాభైఏళ్ల కిందట... షిర్డీ గ్రామం ఒకటుందన్న విషయం మహారాష్ట్రలోనే చాలామందికి తెలీదు. బాబా అడుగు పెట్టాకే ఆ వూరు వెలుగులోకి వచ్చింది. అది ఎంత దేదీప్యమానమైన వెలుగు అంటే ఆ కాంతులు ప్రపంచమంతా ప్రసరించే అంత. అందుకే, కొన్నేళ్లలోనే షిర్డీ ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల్లో ఒకటైంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన హిందూ ఆలయాల్లో మూడో స్థానానికి చేరుకుంది. బాబా మహా సమాధి చెందే నాటికి ఆయన నివాసం ఓ పాడుబడిన మసీదు. మరి ఇప్పుడూ... పిలిచినంతనే పలికే ఆ దైవానికి వూరూరా ఆలయాలే. వాడవాడా భక్తులే. ‘నా భక్తులు ఎక్కడున్నా పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లూ నా దగ్గరకు రప్పించుకుంటాను’ అని చెప్పే సాయినాథుడికి భారత్‌లోనే కాదు, ఎన్నో దేశాల్లో ఎందరో భక్తులున్నారు. ఇక, సర్వాంతర్యామి అయిన ఆ సద్గురువుకి దాదాపు 50 దేశాల్లో 8,500 దాకా ఆలయాలున్నాయంటే ఆశ్చర్యం ఏముందీ...

బాబా జీవితం... జ్ఞాన సాగరం!
సదానింబ వృక్షస్య మూలాధి వాసాత్‌
సుధాస్రావిణం తిక్త మప్య ప్రియంతం
తరుంకల్ప వృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

బాబా వేపచెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకుంటేనే ఆ వేపచెట్టు ఆకుల్లో చేదు పోయింది. అలాంటిది ఆయన్ను మనసులో నిలుపుకుంటే మన కష్టాలు తొలగిపోవడం ఎంతసేపు... అన్నది ఈ శ్లోకంలోని భావం.

షిర్డీవాసులు బాబాను తొలిసారి చూసింది ప్రస్తుతం సాయినాథుని సమాధి మందిరం వెనక ఉన్న వేప చెట్టు కిందే. పదహారేళ్ల వయసులో ఆ చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ తొలిసారి షిర్డీ ప్రజలకు దర్శనమిచ్చారు బాబా. పగలూ రేయీ ఎండా వానల్ని లెక్క చేయకుండా ఎప్పుడూ ధ్యానంలోనే మునిగి ఉన్న ఆ బాలకుడు ఎవరో, ఎక్కణ్నుంచి ఎందుకు వచ్చాడో వారికి అంతు పట్టలేదు. అతడి చుట్టూ చేరి వివరాలు అడగడం మొదలుపెట్టారు. ఎవరు ఏది అడిగినా బాబా బదులు చెప్పేవారు కాదు, ధ్యానంలో నుంచి దృష్టిని మరల్చేవారు కాదు. అయితే, గ్రామస్థులు అదేపనిగా విసిగిస్తుండడంతో కొన్నాళ్లకు అక్కణ్నుంచి వెళ్లిపోయారు. తర్వాత నాలుగేళ్లకు... ధూప్‌ గ్రామ మునసబు చాంద్‌ పాటిల్‌కు ఫకీరు వేషధారణలో అడవిలో కనిపించారు. తప్పిపోయిన గుర్రాన్ని వెతుక్కుంటూ తిరుగుతున్న అతడికి గుర్రం జాడ తెలపడంతోపాటు చూస్తుండగానే చేతిలో ఉన్న సటకాతో నేలమీద కొట్టి హుక్కా వెలిగించుకోవడానికి కావల్సిన నీటినీ నిప్పునీ పుట్టించారు. అంతే, చాంద్‌పాటిల్‌కు ఆ ఫకీరు సామాన్యుడు కాదని అర్థమైపోయింది. వెంటనే బాబాని తన ఇంటికి అతిథిగా రమ్మని వేడుకుని, వెంట తీసుకెళ్లాడు. కొంతకాలానికి చాంద్‌పాటిల్‌ బావమరిది పెళ్లి కుదిరింది. వధువుది షిర్డీ గ్రామం. అలా పెళ్లివారితో కలసి మంగళవాయిద్యాల మధ్య 1858లో రెండోసారి షిర్డీగ్రామంలో అడుగుపెట్టారు బాబా. ఆ మూరుమూల పల్లె ఆధ్యాత్మిక శిఖరంలా ఎదిగేందుకు పునాది పడిన రోజది. బాబా పాద ధూళికే ఆ గాలి పులకరించిపోయిందేమో కండోబా ఆలయం దగ్గర బండి దిగిన ఫకీరును చూస్తూనే ఆలయ పూజారి మహల్సాపతి ‘సాయీ, సాయి బాబా, ఆయియే’ అంటూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటివరకూ బాబా పేరేంటో ఎవరికీ తెలీదు. ఆనాడు ఆ పూజారి నోటి నుంచి అప్రయత్నంగా వచ్చిన ఆ నామమే జగత్‌ ప్రసిద్ధమైపోయింది. ఆ పేరుతోనే షిర్డీ పవిత్ర పుణ్య క్షేత్రమై వర్ధిల్లుతోంది. కళ్యాణ వేడుకల కోసం షిర్డీ వచ్చిన బాబా జగత్‌ కళ్యాణం కోసం తాను చెయ్యాల్సింది మిగిలిపోయిందనుకున్నారేమో... పెళ్లివారితో తిరిగి వెళ్లలేదు. అప్పట్నుంచీ షిర్డీలోని పాడుబడిన మసీదు ఆయన నివాసమైంది. ఫకీరు వేషధారణ... మసీదులో నివాసం... పైగా అనుక్షణం ‘అల్లా మాలిక్‌ (అల్లానే ప్రభువు)’ అని అంటుంటారు... ‘అంటే కచ్చితంగా ఆయన ముసల్మానే’ అంటూ స్థానికులు బాబాకు మతాన్ని ఆపాదించడం మొదలు పెట్టారు. తాను ఏ ఒక్క మతానికో చెందిన వ్యక్తిగా చెప్పుకోవడం బాబాకు నచ్చలేదు. వెంటనే మసీదుకి ద్వారకామాయి అని పేరు పెట్టడంతో పాటు లోపల తులసిమొక్కను నాటారు. నిత్యాగ్నిహోత్రాన్ని ఏర్పాటుచేసి, రోజూ మసీదులో దీపాలు వెలిగించడం ప్రారంభించారు... తనకు అన్ని మతాలూ సమానమే అని చాటారు. ఇలా కుల మతాల గురించే కాదు, మంచీ చెడూ... జాలీ దయ... త్యాగం దానం... కర్మలూ ఫలితాలూ... ఆధ్యాత్మికత ఆనందం... లాంటి ఎన్నో విషయాల గురించి దాదాపు అరవై వసంతాలు ఆచరణ పూర్వకంగా చూపించి సమర్థ సద్గురువు అయ్యారు సాయిబాబా.

ఎలాంటి రోగమైనా బాబాని తలచినంతనే నయమైపోతుంది... అని నమ్ముతారు భక్తులు ఇప్పుడు. ఆశ్చర్యం ఏంటంటే బాబా షిర్డీ వెళ్లిన తొలిరోజుల్లో మామూలు వైద్యుడిలా భక్తులకు సేవలు చేసేవారు. గ్రామంలో రోగులను పరీక్షించి సందర్భాన్ని బట్టి యునానీ ఆయుర్వేద వైద్యాన్ని చేసేవారట. కొద్దికాలంలోనే ఆయనకు గొప్ప వైద్యుడనే పేరు వచ్చింది. అయితే, మొదట్లో కొద్దిమంది మాత్రమే బాబా దైవాంశ సంభూతుడని నమ్మేవారు. ఓసారి జరిగిన సంఘటనతో ఆయన అవతార పురుషుడనే నమ్మకం అందరికీ కలిగింది. మసీదులో దీపాలు వెలిగించేందుకు బాబా రోజూ గ్రామంలోని వ్యాపారుల దగ్గర నూనె అడిగి తెచ్చేవారు. కానీ ఓరోజు వ్యాపారులందరూ కూడబలుక్కుని సాయిబాబాకు నూనె పొయ్యడానికి నిరాకరించారు. సద్గురువు మారు మాట్లాడలేదు. మసీదుకి చేరుకుని ఓ డబ్బాలో నీరు తీసుకుని కొంచెం నీటిని పుక్కిలించి అందులో వూశారు. తర్వాత ఆ నీటినే ప్రమిదల్లో పోసి వత్తులు వేసి వెలిగించగా అవి రోజూకన్నా కాంతిమంతంగా వెలిగాయట. ఆరోజు నుంచీ షిర్డీ వాసులకు సాయిబాబా దేవుడయ్యాడు. సాయిబాబాతో కలసి ఉన్నవారూ ఆయన మహిమల్ని కళ్లారా చూసినవారి అనుభవాలతో రాసిన సాయి సత్‌చరిత్రలో బాబా జీవితంలో జరిగిన ఇలాంటి విశేషాలెన్నో ఉన్నాయి.

స్వయంగా వండి పెట్టేవారు
బాబా దినచర్య విషయానికొస్తే... రోజూ ముఖ ప్రక్షాళన చేసుకున్న తర్వాత ధునిలో కట్టెలు వేసి, ఫలహారం సమయానికి భుజానికి జోలె, చేతిలో భిక్ష పాత్రా పట్టుకుని అయిదు ఇళ్లకు భిక్షకు వెళ్లేవారు. కాసేపటికి లెండీ వనానికి వెళ్లి వామన తాత్యా అనే భక్తుడు ఇచ్చే రెండు పచ్చి కుండలతో నీళ్లు తోడి మొక్కలకు పోసేవారు. సాయిబాబానే స్వయంగా రకరకాల మొక్కల్ని తెచ్చి లెండీవనంలో నాటి పెంచేవారట. తర్వాత ద్వారకామాయిలో భక్తులతో గడిపి మధ్యాహ్నానికి మరోసారి భిక్షకు వెళ్లేవారు. భిక్షలో దొరికిన పదార్థాలన్నిటినీ మసీదులో రెండు పాత్రల్లో వేసేవారు. ఒక పాత్రలోనివి మసీదు తుడిచే మహిళ, భక్తులూ తీసుకెళ్లేవారు. మరో పాత్రలోనివాటిని కుక్కలూ పిల్లులూ కాకులూ యథేచ్ఛగా తినేవి. నిజానికి బాబాకోసం ఎంతోమంది భక్తులు రకరకాల ఫలహారాలు వండి తీసుకొచ్చేవారు అయినా చివరి రోజుల వరకూ ఆయన భిక్షాటన మానలేదు. తన దగ్గరకు ధనవంతులు వచ్చినా బీదవారొచ్చినా ఒకేలా చూసేవారు. ద్వారకామాయిలోకి అడుగుపెట్టాక అందరూ సమానమే అనేవారు. వివిధ ప్రాంతాల నుంచి ఎందరో భక్తులు సద్గురు సాయిని దర్శించుకునేందుకు వచ్చేవారు. అలాంటి వారు దక్షిణ రూపంలో ఇచ్చిన డబ్బుని పేద భక్తులకు రోజుకి రూ.50, 20, 15 చొప్పున పంచిపెడుతూ ఉండేవారు బాబా. ఇంకా మిగిలితే ఆ సొమ్ముతో స్థానికంగా ఉన్న ఆలయాలకు మరమ్మతులూ బీదవారికి అన్నదానాలూ చేయించేవారు. ఒక్కోసారి వంటసామాను తెప్పించి రకరకాల వంటకాలను తనే స్వయంగా వండి వడ్డించేవారు.

బాబా మహా సమాధి
షిర్డీలో దాదాపు అరవై ఏళ్లు నివసించిన బాబా 1918 సంవత్సరంలో దసరా రోజున తన భౌతిక దేహాన్ని విడిచి వెళ్లారు. సమాధి చెందడానికి కొన్ని నెలల ముందు దగ్గరి భక్తుడూ కోటీశ్వరుడూ అయిన బాపూ సాహెబ్‌ బూటీకి చక్కని భవనం ఒకటి కట్టించమని బాబా చెప్పినట్లూ కల వచ్చిందట. అది సాయినాథుడి ఆజ్ఞగా భావించి పనులు మొదలుపెట్టాడు బూటీ. మందిరం పనులు పూర్తి కావొచ్చేసరికి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో సాయి భక్తురాలైన బాయిజా బాయి కొడుకు తాత్యా అనారోగ్యంతో మంచం పట్టాడు. చిన్నతనం నుంచీ బాబాను మామా అంటూ ఎన్నోఏళ్ల పాటు ఆయనతో మసీదులోనే నిద్రించాడు అతడు. తాత్యా అనారోగ్యం గురించి తెలిసి ఓరోజు బాబా అతడిని తీసుకు రమ్మని కబురు పంపించారు. అతికష్టంమీద మసీదులో అడుగుపెట్టిన తాత్యాని చూసి ‘నీకేం కాదు, నీ బదులు నేను వెళ్తాను’ అని చెప్పారట. బాబా మాటలు అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత నుంచీ ఆయన ఆరోగ్యం క్షీణించడం, తాత్యా కోలుకోవడం మొదలైంది. దసరా రోజుకి సాయిబాబా పూర్తిగా నీరసించిపోయారు. చివరికి... నాకిక్కడ బాగోలేదు, బూటీ కట్టించిన భవనంలోకి తీసుకెళ్లమని అంటూ పక్కకు ఒరిగిపోయారు. తర్వాత సద్గురు సాయి చెప్పిన ప్రకారమే ఆయన దేహాన్ని బూటీ వాడాలోని మందిరంలో సమాధి చేశారు. అదే ఇప్పటి షిర్డీ ఆలయం. సమాధి పైనున్న బాబా నిలువెత్తు విగ్రహాన్ని ఆ తర్వాత 36 ఏళ్లకు ప్రతిష్ఠించారు.

బోధనలు...
* తానెక్కణ్నుంచి వచ్చాడూ... తన తల్లిదండ్రులు ఎవరూ... అన్న వివరాలు బాబా జీవిత కాలంలో ఎప్పుడూ చెప్పలేదు. ఎవరైనా ఆయన దగ్గర కుల మతాల ప్రస్తావన తెచ్చినా బాగా కోప్పడేవారు. ఎప్పుడూ సబ్‌కా మాలిక్‌ ఏక్‌ హై(అందరి ప్రభువూ ఒక్కరే) అనేవారు. శ్రీరామనవమి పండుగను శాస్త్రోక్తంగా జరిపించేవారు బాబా. అదే సమయంలో ఈదుల్‌ ఫితర్‌ పండుగనాడు మసీదులో నమాజు చేయించేవారు.
* ఒకసారి సాయిబాబా ఓ ఇంటి పైకప్పు మీదికి ఎక్కడానికి నిచ్చెన తెమ్మన్నారు. నిచ్చెన తెచ్చిన కుర్రాడికి రెండు రూపాయలు ఇచ్చారు. ఆ రోజుల్లో రెండు రూపాయలంటే చాలా ఎక్కువ. దాంతో అక్కడున్న భక్తులు ‘నిచ్చెన తెచ్చినందుకు అంత ఇవ్వాల్సిన అవసరం ఏముందీ...’ అని అడిగారట. దానికి సాయిబాబా ‘మనం ఎవరితోనైనా పనులు చేయించుకుంటే వారికి సరైన కూలీ ఇవ్వాలి. కాస్త ఎక్కువ ఇవ్వగలిగితే మరీ మంచిది. లేకపోతే రుణపడిపోతాం...’ అన్నారట.
* ‘ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే నాకు పెట్టినట్లే. దాహంతో ఉన్నవారికి నీళ్లూ పేదవారికి బట్టలూ అలసిపోయి వచ్చిన వారు విశ్రాంతి తీసుకోవడానికి నీ అరుగు మీద చోటూ... ఇస్తే భక్తితో నన్ను సేవించినట్లే’ అని చెప్పేవారు సద్గురు సాయి. దేవుడిని మెప్పించాలంటే పెద్ద పెద్ద పూజలు చేయనక్కర్లేదు. ఉపవాసాలు ఉండనక్కర్లేదు. శ్రద్ధ, సబూరి(సహనం) ఉంటే చాలన్నది బాబా వాక్కు.
* ఓసారి ఓ మహిళ సాయినాథుడిని తన ఇంటికి భోజనానికి రమ్మని కోరింది. సరే అని మాట ఇచ్చారు సద్గురువు. భోజనం సమయానికి ఆ భక్తురాలు పదార్థాలన్నీ ఓ చోట పెట్టి బాబా ఇంకా రావడం లేదని చూస్తుండగా ఆకలితో ఉన్న ఓ నల్ల కుక్క అక్కడికొచ్చి వంటకాలవైపు చూస్తూ నిలబడిందట. అదిచూసి ఆ మహిళ కర్రతో కుక్కను కొట్టింది. తర్వాత బాబా దగ్గరికెళ్లి ‘మీకోసం చాలా ఎదురుచూశాను భోజనానికి ఎందుకు రాలేదు’ అని అడగ్గా... ‘నేను వచ్చాను. నువ్వే నన్ను కొట్టి తరిమేశావు...’ అన్నారట బాబా. అలా సర్వ జీవుల్లోనూ తాను ఉంటానని బోధించారు ఆ సర్వాంతర్యామి.
* ఇతరుల గురించి చెడుగా మాట్లాడినా సాయిబాబా సహించేవారు కాదు. బాబా భక్తుల్లో ఒక వ్యక్తి వాడాలో కూర్చొని ఎప్పుడూ మరో భక్తుడి గురించి చెడుగా మాట్లాడేవాడు. ఓరోజు సద్గురువు అతడిని పిలిచి... పంది అందరూ అసహ్యించుకునే అశుద్ధాన్ని ఇష్టంగా తింటుంది. అలాగే నువ్వు తోటివారి గురించి చెడుగా మాట్లాడి నీ నాలుకతో వారు చేసుకున్న పాపాలను కూడా కడుగుతున్నావు అన్నారు. మనం ఒకర్ని నిందించినా వాళ్లు చేసిన చెడ్డ పనుల గురించి అదే పనిగా మాట్లాడినా వారి పాపాన్ని మనం శుభ్రం చేస్తున్నట్లే... అన్నది బాబా మాట.
* భక్తులు ఎన్ని కానుకలు ఇచ్చినా సాయినాథుడు అవేవీ తనవి కాదనీ భిక్షపాత్ర, జోలె, సటకా మాత్రమే తన ఆస్తులనీ చెప్పేవారు. సంపాదించిన కొద్దీ కోరికలు పెరుగుతాయి. ఆ కోరికల్ని తీర్చుకోవడానికి కష్టాలు పెరుగుతాయి. అందుకే, వైరాగ్యంతో జీవించడానికి మించిన సంతోషం ఉండదు అని బోధించేవారు.

ఇలా... బాబా తన జీవిత కాలంలో భక్తులకు చేసిన బోధనలు ఎన్నో. ప్రేమ తత్వం, మానవత్వమే సాయితత్వం. బాబా భౌతిక దేహాన్ని విడవక ముందూ తర్వాతా కూడా భక్తుల్ని నడిపిస్తున్న మార్గం అదే. అందుకే, భక్తులకు బాబా దైవం మాత్రమే కాదు. తల్లీ తండ్రీ గురువూ నేస్తం ఆత్మీయుడూ... అన్నీ. ఆ అనుబంధంతోనే కోట్లాది భక్తులు బాబాను గుండెల్లో నిలుపుకుంటున్నారు.

సాయీ శరణం బాబా శరణు శరణం...

ఏడాదికి రూ.360 కోట్ల ఆదాయం 

ద్మనాభస్వామి ఆలయం, తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ప్రపంచంలో అత్యంత సంపన్నమైన హిందూ దేవాలయం షిర్డీసాయి బాబాదే. సాయి సంస్థాన్‌ బ్యాంకు అకౌంట్లో 1800 కోట్ల రూపాయల సొమ్ము, 380 కిలోల బంగారం, సుమారు 4,450 కిలోల వెండీ ఉన్నాయట. ఇవి కాకుండా డాలర్లూ పౌండ్ల రూపంలో మరికొంత ఉంది. ఇలా మొత్తం బాబా ఆలయ ఆస్తుల విలువ రెండువేల కోట్ల రూపాయలకు పైనే.
* నిత్యం దాదాపు 60వేల మంది షిర్డీ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇక, గురుపూర్ణిమ, శ్రీరామనవమి, నూతన సంవత్సరం... లాంటి పర్వదినాల్లో ఆ సంఖ్య లక్ష వరకూ చేరుతుంటుంది. ఆ సమయంలో వచ్చే కానుకలు కూడా భారీ మొత్తంలో ఉంటాయి.
* ఈ ఏడాది గురు పూర్ణిమకు మూడురోజుల్లో హుండీల్లోనూ విరాళాల రూపంలోనూ సమకూరిన ఆదాయం రూ.5.52 కోట్లు. గతేడాదితో పోల్చితే ఇది రూ.1.40 కోట్లు ఎక్కువ. గురుపూర్ణిమ రోజున ఓ భక్తుడు రెండు కిలోలతో తయారైన బంగారు పాదుకల్ని కానుకగా సమర్పించాడట.
* గత శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా వచ్చిన కానుకలూ విరాళాల విలువైౖతే 6.32 కోట్ల రూపాయలకు చేరిపోయింది. ఓ అజ్ఞాత భక్తుడు ఒకేసారి ఏకంగా 12 కిలోల బంగారాన్ని కానుకగా ఇచ్చాడు. మరో భక్తుడు రెండు పెట్టెల నిండా 65 కిలోల వెండి నాణాలను సాయినాథుడికి సమర్పించాడు.
* ఇలా... ఒక్క 2016 సంవత్సరంలోనే షిర్డీ ఆలయానికి 28కిలోల బంగారమూ(విలువ సుమారు రూ.6.74 కోట్లు), 383 కిలోల వెండీ కానుకలుగా వచ్చాయట. ఇవి కాకుండా గతేడాది జనవరి నుంచి డిసెంబర్‌ మధ్య షిర్డీ ఆలయ ఆదాయం రూ.403.75 కోట్లు. వీటిలో ఏకంగా 258.42 కోట్ల రూపాయలు భక్తులు కానుకలూ విరాళాల రూపంలో ఇచ్చినవే. దీంతోపాటు షిర్డీ సంస్థాన్‌ ట్రస్టు వివిధ జాతీయ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన సొమ్ముకి వడ్డీగా గతేడాది 128.24 కోట్ల రూపాయలు రాబడి వచ్చింది. అంతేకాదు, 2016 సంవత్సరంలో 47 దేశాల నుంచి బాబా దర్శనార్థం షిర్డీ వచ్చిన భక్తులు కానుకగా ఇచ్చిన విదేశీ కరెన్సీ విలువ రూ.9.8 కోట్లు.
* 2015 సంవత్సరంలో సంస్థాన్‌ ఆదాయం రూ.393.72 కోట్లట.
* షిర్డీ ఆలయానికి వచ్చే ఆదాయంతో సంస్థాన్‌ రకరకాల సేవా కార్యక్రమాలు చేపడుతోంది. సంస్థాన్‌ నడుపుతున్న రెండు ఆసుపత్రుల్లో కలిపి ఏడాదికి 5.5 లక్షల మంది రోగులకు సేవలందిస్తున్నారు.
* సాయిబాబా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భక్తులకోసం రూ.350 కోట్ల వ్యయంతో షిర్డీలో ప్రత్యేక విమానాశ్రయాన్ని నిర్మించారు. దీన్లో రూ.50కోట్ల ఖర్చును సాయి సంస్థానే భరించింది.
* ఉన్నంతలో ఎదుటివారికి సాయపడే భక్తులంటే తనకెంతో ఇష్టమని చెబుతారు బాబా. సద్గురు సాయిమీద భక్తితో పాటు ఆ మాటల్ని కూడా మనసులో నింపుకున్నారు ‘నాస్‌కామ్‌’ సంస్థ * ఫౌండర్‌ కేవీ రమణి. చైన్నైకు చెందిన ఫ్యూచర్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థకు అధిపతి కూడా అయిన ఆయన తన ఆస్తిలో 80 శాతాన్ని ‘షిర్డీసాయి ట్రస్టు’కి విరాళంగా ఇచ్చేశారు. రమణి చెన్నైలో స్థాపించిన ఈ ట్రస్టు ఆమధ్య 110 కోట్ల రూపాయల వ్యయంతో భక్తులకోసం షిర్డీలో సాయి ఆశ్రమాన్ని నిర్మించి బాబా సంస్థాన్‌కి అప్పగించింది.

ఈ ఆశ్రమంలో ఒకేసారి 14వేలమంది భక్తులు వసతి పొందే అవకాశం ఉంది. రమణి ఇప్పటివరకూ 450 బాబా ఆలయాలను నిర్మించేందుకు సహాయం చేశారు. ఆయన ట్రస్టు ఇంకెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

మరికొన్ని... 

సాయిబాబాకు స్వయంగా ఓ ఎఫ్‌ఎమ్‌ స్టేషన్‌ ఉంది. ప్రసార భారతి ఆధ్వర్యంలో షిర్డీలో ఈ ఏడాది ఏర్పాటైన ఈ రేడియోలో చుట్టుపక్కల ప్రాంతాలవారూ అక్కడికొచ్చే భక్తులూ రోజంతా సాయిబాబా హారతులూ భజనలూ ఇతర భక్తి పాటలనూ వినొచ్చు. ఇలా ప్రత్యేకంగా ఓ రేడియో స్టేషన్‌ కలిగిన దేవాలయాలు మనదేశంలో తిరుమల, షిర్డీ రెండే ఉన్నాయి.
* 2008లో భారత తపాల శాఖ సాయిబాబా గౌరవార్థం అయిదు రూపాయల స్టాంపును విడుదలచేసింది.
* మహారాష్ట్రతో పాటు, తెలుగు రాష్ట్రాల్లోనూ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లలో బాబా భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇతర దేశాల విషయానికొస్తే కరీబియన్‌ దీవుల నుంచి నేపాల్‌, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, యూఏఈ, మలేషియా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, సింగపూర్‌లాంటి దేశాల్లోనూ షిర్డీ సాయిబాబా ఆలయాలున్నాయి.
* ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద సాయిబాబా విగ్రహం ఉంది. ఇక్కడ బాబా 116 అడుగుల ఎత్తులో కొలువుదీరి ఉన్నారు.
* శతాబ్ది ఉత్సవాలకు ఈ ఏడాది 4.5 కోట్లమందికి పైగా భక్తులు షిర్డీని సందర్శించే అవకాశం ఉందన్నది అంచనా.

వందేళ్ల వేడుక... బాబా అడుగు జాడల్లో!

దైనా ఆలయంలో వందేళ్ల వేడుక అంటే హోమాలూ కుంభాభిషేకాలూ పెద్ద పెద్ద పూజలూ నిర్వహించడం సహజం. కానీ బాబా చూపిన మార్గంలోనే నడిచే షిర్డీ సంస్థాన్‌ చేపట్టే ఏ కార్యక్రమమైనా భక్తి శ్రద్ధలూ సేవలతో ముడిపడే ఉంటుంది. అందుకే, ఏడాదిపాటు జరిపే షిర్డీ సాయి శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనుకున్న సాయి సంస్థాన్‌ అందుకు సేవను ప్రధానాంశంగా తీసుకుంది. దీనికోసం మూడువేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించింది. దీన్లో భాగంగా ఈ ఏడాది నుంచి గిరిజనులూ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఐఏఎస్‌ ట్రెయినింగ్‌ అకాడమీని ప్రారంభిస్తున్నారు. టాటా ట్రస్ట్‌తో కలసి 125 కోట్ల వ్యయంతో 100 పడకల క్యాన్సర్‌ ఆసుపత్రిని నిర్మించడం, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల్లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకూ వారి పిల్లల చదువుకూ ఆర్థిక సహాయం చెయ్యడం... లాంటి కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. సంస్థాన్‌ ఆధ్వర్యంలో నడిచే ప్రసాదాలయ్‌లో ఈ ఏడాదంతా భక్తులకు అన్నదానం చేయాలని నిశ్చయించారు. మామూలుగా ఇక్కడ రూ.10కి భోజనం పెడతారు. ఇవేకాదు, ఉచిత కంటి చికిత్సలు చేయించడంతోపాటు కళ్లజోళ్లను పంపిణీ చెయ్యడం, రక్తదాన, అవయవ దాన శిబిరాలూ, వికలాంగులకోసం జైపూర్‌ ఫుట్‌ క్యాంపులు ఏర్పాటు చెయ్యడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు వివిధ ప్రాంతాల్లో మొక్కలను నాటించే కార్యక్రమాలను కూడా సాయిబాబా శతాబ్ది ఉత్సవాల్లో భాగం చేస్తోంది సాయి సంస్థాన్‌. బాబాను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల అడుగుల నుంచీ పారేసే వ్యర్థాల నుంచీ విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రయత్నాలూ మొదలు పెట్టింది. దీన్లోభాగంగా భక్తులు క్యూలైన్‌లో నడిచినపుడు కరెంటు ఉత్పత్తి అయ్యేలా ఆ మార్గంలో విద్యుత్తును ఉత్పత్తి చేసే ఫలకాలను ఏర్పాటు చేయబోతున్నారు. వీటితోపాటు భజనలూ సాయి సత్‌ చరిత్ర నిత్య పారాయణ కార్యక్రమాలూ పండితులతో ప్రవచనాల్లాంటివీ షిర్డీలో ఈ ఏడాదంతా ఉంటాయి. బాబా మహా సమాధి చెంది వందో ఏట అడుగు పెట్టిన ఈ సంవత్సరంలో మనదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న భక్తుల కోసం స్వయంగా శ్రీసాయి పాదుకలనే వారి దగ్గరకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని అక్టోబర్‌ 12న గోవాలో ప్రారంభించింది సాయిసంస్థాన్‌. అక్కణ్నుంచి మన దేశంలోని అన్ని జిల్లాలతో పాటు 25 దేశాల్లోని వేరు వేరు ప్రాంతాలకు బాబా పాదుకలను తీసుకెళ్లి పాదుకా దర్శన్‌ వేడుకలను నిర్వహించబోతున్నారు. ఇక, పుణెలోని ద రన్‌బడ్డీస్‌ క్లబ్‌తో కలసి సాయి సంస్థాన్‌ ఈరోజు షిర్డీలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్‌ మారథాన్‌ బాబా శతాబ్ది వేడుకల్లో మరో ముఖ్యమైన ఘట్టం. ఈ పరుగులో మన దేశంతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే లక్ష మందికి పైగా భక్తులు పాల్గొంటారన్నది అంచనా.

షిర్డీలో పూజా విధానం...

బాబా జీవించి ఉన్నపుడు ప్రారంభమైన హారతి పూజలే ఇప్పటికీ షిర్డీలో కొనసాగుతున్నాయి. ఉదయం 4.30 గంటలకు బాబాను నిద్రలేపుతూ కాకడ హారతి ఆలపిస్తారు పూజారులు. అప్పటికే భక్తులు దర్శనానికి క్యూలలో నిలబడి ఉంటారు. కాకడ హారతి ముగిశాక మంగళస్నానం చేయిస్తారు. అనంతరం షోడశోపచార పూజ ఉంటుంది. తొమ్మిదింటికి అభిషేక పూజ, మధ్యాహ్నం 12గంటలకు మధ్యాహ్న హారతీ ఇస్తారు. సూర్యాస్తమయ సమయంలో ధూప్‌ హారతి, రాత్రి 10.30 గంటలకు షేజ్‌ హారతి పూజను నిర్వహించి పదకొండుంపావుకు ఆలయాన్ని మూసేస్తారు. పండుగల సమయాల్లో ఇతర ప్రత్యేక పూజలూ ఉంటాయి. పూజలే కాదు, బాబా సశరీరులుగా ఉన్నారనే భావనతో నిత్యం సాయినాథుడికి రకరకాల సేవల్నీ నిర్వహిస్తారు. రోజూ ఉదయం సద్గురువుకి వేడినీళ్ల స్నానం చేయిస్తారు. బాబా పక్కన ఓ గ్లాసు నీటిని ఉంచడంతోపాటు, పొద్దున్నే అల్పాహారాన్నీ మధ్యాహ్నం, రాత్రిపూట భోజనాన్నీ నైవేద్యంగా సమర్పిస్తారు. బాబా విగ్రహం మీదున్న వస్త్రాన్ని రోజుకి నాలుగుసార్లు హారతి ఇచ్చేముందు మార్చుతారు. రాత్రిపూట ఆలయాన్ని మూసేటపుడు సాయినాథుడి చుట్టూ దోమతెరను కట్టి, సమాధి మీద తెల్లటి ఖాదీ వస్త్రాన్ని కప్పుతారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.