close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ. పదికోట్లతో అమ్మవారికి బంగారుచీర?!

‘జయజయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే’... అంటూ ఆ దుర్గామాతను వేనోళ్ల కొనియాడుతూ అంగరంగవైభవంగా దేశవ్యాప్తంగా చేసుకునే అపురూపమైన వేడుకే దసరా. దుష్టశిక్షణకోసం శిష్టరక్షణకోసం అవతరించిన ఆ అమ్మను, ఒక్కోచోట ఒక్కోరూపంలో పూజిస్తూ ఒక్కోతీరులో పండగ జరుపుకుంటారు. అయితే ఆ దుర్గమ్మ ఆరాధనలోనూ వేడుకల్లోనూ బెంగాలీల ఘనత, ప్రత్యేకతే వేరు. అదెలానో చూద్దాం..!

 

 

 

శంఖచక్ర గదాహస్తే శుభవర్ణ సుశోభితే మమ దేవి వరం దేహి సర్వసిద్ధి ప్రదాయిని...

...అంటూ దేశవ్యాప్తంగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకుని నవమి వరకూ ఆ జగన్మాతను స్తుతిస్తారు. ఉత్తరాదిన దుర్గాపూజతోబాటు రాముడు రావణాసురుడిని సంహరించిన రోజుగా రామలీలా ఉత్సవాలు జరుపుకుంటే, దక్షిణాదిన దుష్టసంహారం గావించిన ఆ దుర్గమ్మ తల్లిని తొమ్మిది రోజులపాటు విభిన్న రూపాల్లో అర్చిస్తారు. పాండవులు ఆయుధాల్ని దించిన రోజుగా భావించి దశమినాడు ఆయుధపూజ చేస్తారు. అయితే బెంగాల్‌తోబాటు తూర్పు భారతావనిలో కూడా ఆశ్వయుజ శుక్లపక్ష షష్ఠి నుంచి దశమి వరకూ ఐదురోజులపాటు దుర్గోత్సవ్‌ను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

 

 

 

అలంకారం... ఆడంబరం!
దుర్గోత్సవ్‌ సమయంలో కోల్‌కతాలో కొత్తగా అడుగుపెట్టినవాళ్లకి ఎక్కడ ఉన్నామో అర్థంకాని పరిస్థితి. అసలు కోల్‌కతా ఇదేనా అన్న సందేహమూ కలగొచ్చు. ఏ కూడలిలోకెళ్లినా విద్యుద్దీపకాంతులతో మెరిసే కొత్త కట్టడాలు కనిపిస్తాయి. అవే పండాల్స్‌ ఉరఫ్‌ దుర్గామాత వేదికలు. పశ్చిమభారతంలోని గణపతి వేడుకల మాదిరిగానే బెంగాలీయులకి శరదోత్సవ్‌ అతిపెద్ద సామాజిక వేడుక. అందుకోసం భారీ వేదికలు కట్టి అమ్మ విగ్రహాన్ని షష్ఠి రోజున ప్రతిష్ఠిస్తారు. తరవాత లక్ష్మి, సరస్వతి, గణేశ, కార్తికేయల్ని ప్రతిష్ఠిస్తారు. అయితే ఆ వేదిక ఏదో సాదాసీదాగా కాకుండా ఏదో ఒక థీమ్‌తో సెట్టింగుల రూపంలో వేయడం సంప్రదాయంగా మారింది. ఐఫిల్‌ టవర్‌, కొలోజియం, మధురమీనాక్షి, సోమనాథ్‌, అక్షరధామ్‌, బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌, లండన్‌బ్రిడ్జి, థాయ్‌ వైట్‌ టెంపుల్‌... ఇలా దేశవిదేశాల్లోని ఏ ప్రసిద్ధ కట్టడమైనా అక్కడ కనిపించవచ్చు. స్థానికంగా ఒకరిని మించి మరొకరు ఈ పండాల్స్‌ని రూపొందించి, అమ్మవారిని అలంకరిస్తారు. దాంతో కోల్‌కతా దుర్గోత్సవ్‌ సంబరం వెయ్యికోట్ల బడ్జెట్‌ను దాటిపోయింది. ఏటికేడూ ఇది పెరుగుతూనే ఉంది.
వందల సంవత్సరాలనుంచీ ఈ దుర్గారాధన ఉన్నప్పటికీ ఈ పండగను ఓ సామాజిక వేడుకలా మాత్రం 16వ శతాబ్దం నుంచీ చేస్తున్నారనీ, ఇందుకోసం రాజులూ సంపన్నులూ భూరివిరాళాలు ఇచ్చేవారనీ చరిత్ర చెబుతోంది. మధ్యయుగంలో ముస్లిం దాడులతో అక్కడ దుర్గాదేవిని యుద్ధదేవతగా అభివర్ణిస్తూ ఆరాధించడం మరింత పెరిగింది. ఈ పండాల్స్‌లో ప్రతిష్ఠించిన ఆ లోకమాతను పూజించేందుకు స్థానికులు తండోపతండాలుగా వస్తుంటారు. ప్రాచుర్యం పొందిన కొన్ని పండాల్స్‌ దగ్గరకయితే లక్షల్లో భక్తులు రావడం విశేషం. ఆ ఐదు రోజులూ బెంగాలీలు రాత్రివేళలో నిద్రపోరు. తెల్లవార్లూ పూజలతోనూ సంగీతసాంస్కృతిక అందాలపోటీలతోనూ ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా అష్టమి, నవమి రాత్రుల్లో కోల్‌కతా వీధులన్నీ జనసంద్రంలా గోచరిస్తాయి.

 

 

 

అయితే ఈ మొత్తం వేడుకలో స్టేజీ అలంకరణ ఓ ఎత్తయితే, విగ్రహం తయారీ మరోయెత్తు. గతేడాది శ్రీభూమి స్పోర్టింగ్‌ క్లబ్‌ ఏకంగా 10 కోట్ల రూపాయలతో బాహుబలి సినిమాలో మాహిష్మతి సామ్రాజ్యాన్ని పోలిన సెట్‌ వేసి రికార్డు సృష్టించింది. అదే క్లబ్‌ ఈ ఏడాది సంజయ్‌లీలా భన్సాలీ పద్మావత్‌ సినిమాలోని ఛిత్తోడ్‌ ప్యాలెస్‌ సెట్‌తో భక్తుల్ని అలరించనుంది. అలాగే 83 ఏళ్ల నుంచీ దుర్గాపూజ నిర్వహిస్తోన్న సంతోష్‌మిత్రా స్క్వేర్‌ కమిటీ గతేడాది రూ.10 కోట్ల విలువ చేసే 30 కిలోల బంగారంతో అమ్మవారికి చీర తయారు చేయించింది. అయితే తయారీలో భాగంగా నెమళ్లూ పువ్వులూ డిజైన్ల చెక్కుడులో తరుగుపోగా చివరకు మిగిలింది తొమ్మిది కిలోలేనట. పైగా దీనికోసం ముప్ఫైమంది స్వర్ణకళాకారులు మూడునెలలపాటు శ్రమించినట్లు ఈ చీర తయారీని చేపట్టిన సెన్కో గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ జ్యువెలరీ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏకంగా 40 కోట్ల రూపాయల ఖరీదు చేసే పది టన్నుల వెండితో 60 అడుగుల ఎత్తులో రథం సెట్‌ వేసి ఆకర్షించనున్నారట. ఈ రథాన్ని తరవాత ఒడిశా రథయాత్రలో వాడతారట. అయితే విగ్రహాల అలంకరణలో వాడే బంగారంతోబాటు వెండి పండాల్‌ రక్షణకోసం అంతేస్థాయిలో భద్రతా ఏర్పాట్లూ చేయనున్నారట. ఈ రెండే కాదు, నగరంలోని ఎక్‌దాలియా, ఎవర్‌గ్రీన్‌, బాగ్‌బజార్‌, కుమర్‌తులి పార్క్‌, కాలేజ్‌ స్క్వేర్‌, సురుచి సంఘ, జోథ్‌పూర్‌ పార్కు... ఇలా పలు ప్రాంతాలు భారీ సెట్టింగులతో కళకళలాడుతుంటాయి.

 

 

 

దుర్గోత్సవ్‌..!
పితృపక్షం చివరిరోజైన మహాలయ అమావాస్యనాడు మట్టితో చేసిన విగ్రహానికి కళ్లను దిద్దడం ద్వారా బెంగాలీల దుర్గారాధన మొదలవుతుంది. నిజానికి కుంభకారులు రథోత్సవం రోజునే విగ్రహం తయారీని ప్రారంభిస్తారు. కానీ అమావాస్యనాడే అమ్మవారు మట్టిలో ప్రవేశిస్తుందన్న కారణంతో-  మొత్తం తయారైన విగ్రహానికి కళ్లను మాత్రం ఆ రోజునే తీర్చిదిద్దుతారు. దీన్నే చోకు దాన్‌ అంటారు. విగ్రహాన్ని ఇంట్లోగానీ వేదికమీద గానీ షష్ఠి రోజునే ప్రతిష్ఠించాక, పూజారి కళ్లకు కాటుక దిద్ది, దేవి చేతుల్లో ఆయుధాల్ని అమర్చడంతో పూజ మొదలవుతుంది.

మిగిలిన చోట్లకు భిన్నంగా ఆరో రోజునే పూజ ప్రారంభించడం వెనక పౌరాణిక గాథలనేకం ప్రాచుర్యంలో ఉన్నాయక్కడ. రావణ సంహరణార్థం రాముడు శుక్ల పక్ష షష్ఠిరోజునే అమ్మను అర్చించాడనీ, ఏటా తన సంతానమైన సరస్వతి, లక్ష్మి, గణేశుడు, కార్తికేయలతో పార్వతీదేవి ఆ రోజునే పుట్టింటికి వచ్చి విజయదశమి రోజున భర్త దగ్గరకు వెళ్లిపోతుందనీ విశ్వసిస్తారు బెంగాలీలు. అందుకే అమ్మవారితోబాటు లక్ష్మి, సరస్వతి, గణేశుడు, కార్తికేయులతోపాటు రాక్షస రూపాలను ప్రతిష్ఠించి, దశమినాడు నిమజ్జనం చేయడం ద్వారా అమ్మను కైలాసానికి సాగనంపుతారు.

 

 

 

పూజా విధానం!
షష్ఠి నుంచి వరసగా మూడురోజులూ శ్లోకాలూ స్తుతులూ ప్రార్థనలూ వేద, తాంత్రిక మంత్రాలతో అమ్మను కొలుస్తారు. సప్తమినాడు కుమారిపూజ. ఆ రోజున ఇంట్లోగానీ వేదికమీదగానీ 5-8 ఏళ్ల లోపు పిల్లల్ని పూజిస్తారు. అష్టమి వెళ్లి నవమి వచ్చే సమయంలో అటు 24 ఇటు 24 మొత్తం 48 నిమిషాలపాటు సంధిపూజ చేస్తారు. ఆ సమయంలో దుర్గాదేవి మూడోకంటినుంచి ఉద్భవించిన చాముండీ దేవి చండ, ముండ అనే రాక్షసుల్ని సంహరించినట్లుగా భావిస్తూ ఆ క్రతువును నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో మేక లేదా గుమ్మడికాయను బలి ఇచ్చి, ఆ దుర్గమ్మతల్లి మీద చిందిన రుధిరం గుర్తుగా సింధూర పూజ చేస్తారు. తరవాత అమ్మవారికి ప్రసాదం పెట్టి, అందరూ పంచుకుంటారు. నవమిరోజున దేవీమాత
విజయానికి గుర్తుగా హోమం చేస్తారు. దశమిరోజున స్త్రీలంతా ఒకరికొకరు సింధూరం పూసుకుంటూ ఆనందంగా నృత్యాలు చేస్తూ విగ్రహాలను ఊరేగిస్తూ, వెళ్లిరమ్మని పాటలు పాడుతూ కన్నీటితో వీడ్కోలు పలుకుతూ నిమజ్జనం చేసి వస్తారు. తరవాత స్నేహితులూ చుట్టపక్కాలంతా బహుమతులూ మిఠాయిలు పంచుకుంటూ వేడుకను ముగిస్తారు.

 

 

 

 

 

 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.