close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వైకుంఠనాథుని వైభోగం!

వైకుంఠనాథుని వైభోగం!

శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమలను కలియుగ వైకుంఠంగా చెబుతారు. వైకుంఠమంటే ఒక్క విష్ణుమూర్తే ఉంటాడా... పాలకడలి నుంచి ప్రత్యక్షమైన శ్రీమహాలక్ష్మీ ఉంటుంది. ఆ బంగారు మువ్వల తల్లి నడయాడే చోటంటే, అష్టైశ్వర్యాలకూ చిరునామానే. అందుకే శ్రీపతి భక్తజన కోటి ఉన్న స్వామిగానే కాదు, కోటాను కోట్ల సిరులున్న దేవుడిగా కూడా ప్రసిద్ధికెక్కాడు. 13 వేల కిలోలకు పైబడిన బంగారు ఆభరణాలు స్వామి వైభవానికి తార్కాణంగా నిలిస్తే, వేల కోట్ల రూపాయల బ్యాంకు బ్యాలెన్సులు ఆయన పట్ల భక్తుల నమ్మకానికి నిదర్శనాలు. ప్రపంచంలోనే రెండో ధనవంతుడైన దేవుడిగా పేరొందిన ఆ సిరిగలవాడి సిరిసంపదల గురించి తెలుసుకోవడమంటే ఆయన భక్తులకు ఆనంద నిలయపుటంచుల దగ్గర నిలబడి స్వామి వారి లడ్డూని నోట్లో వేసుకున్నంత సంతోషం మరి!

విగో... ఏడు కొండలు... అవిగవిగో ఆ కొండ పైన స్వామి నామాలు... గాలిగోపురం మీద కనిపిస్తున్నాయి... ఇదిగో ఇదే స్వామిని చేరే తొలిమెట్టు అలిపిరి... ఏడుకొండలవాడా వేంకట రమణా గోవిందా... గోవింద, ఆపద మొక్కుల వాడా అడుగడుగు దండాలవాడా గోవిందా... గోవింద, వడ్డికాసుల వాడా అనాథ రక్షకా గోవిందా... గోవింద... తెలవారుజాము మంచు తెరలు ఇంకా వీడనైనా లేదు, నల్లని కొండల మాటు నుంచి భానుడు ఇంకా పైకిరానే లేదు. స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులు మాత్రం అప్పటికే ఆలస్యమైపోయినట్టు పరుగులెడుతూ ఉంటారు. స్వామి దగ్గరికి సూట్‌కేసుల్లో డబ్బులు తెచ్చి కుమ్మరించివెళ్లే సూపర్‌రిచ్‌ భక్తులతో పాటు, వట్టి చేతులతో వెళ్లి తాము ఇవ్వగలిగింది ఇంతేనంటూ తలనీలాలు సమర్పించుకొని వెనుదిరిగే నిరుపేదలైన నమ్మినబంట్లూ ఎంతో మంది. ‘మేము ప్రయోగించే అత్యాధునిక రాకెట్‌ గగనతలంలోకి విజయవంతంగా దూసుకుపోవాలి స్వామీ’ అని వేడుకునే ఇంటలెక్చువల్‌ భక్తుల నుంచి ‘నేను ఎంబీఏ గట్టెక్కితే చాలు స్వామీ’ అని మొక్కుకునే కుర్ర విద్యార్థుల దాకా, ‘నా పార్టీ రాష్ట్రంలో మెజారిటీ సాధిస్తే నీకేం కావాలంటే అది చేయిస్తా తండ్రీ’ అని మొక్కే రాజకీయ భక్తులతో పాటు ‘ఈ ఏడు మంచిగ పంటలు పండితె పిల్లాజెల్లతో మళ్లొస్తనయ్యా’ అని దండం పెట్టే సగటు జీవుల దాకా అందరూ స్వామికి మొక్కులు మొక్కే భక్తులే. అయితే ఇక్కడ, ఎవరి మొక్కులు వాళ్లవి ఎవరి లెక్కలు వాళ్లవి. మొక్కులు మొక్కించుకోవడంలోనే కాదు, ఆపద తీర్చాక తిరిగి వాళ్లను తన దగ్గరికి రప్పించుకోవడంలోనూ స్వామికి స్వామే సాటి. రావల్సినవేవైనా ముక్కుపిండి వసూలు చేస్తాడనీ, వడ్డీతో సహా ఇప్పించుకుంటాడనీ వడ్డికాసుల వాడి గురించి మురిపెంగా చెప్పుకుంటుంటారు భక్తులు. స్వామి దర్శనానికి ఏటా తరలి వచ్చే సుమారు రెండున్నర కోట్ల పైచిలుకు భక్తజనం, అంతే స్థాయిలో రోజుకి కోట్లు రాల్చే తిరుమల హుండీ లెక్కలూ ఈ నమ్మకాలకు గట్టి సాక్ష్యాన్నే ఇస్తుంటాయి.

ఈ ఏడాది రూ. 1100 కోట్లు!
ఆనంద నిలయపు వాకిళ్లలోకి అడుగిడి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకొని, గుడి వెనుక భాగానికి చేరగానే మనకు తెల్లబనియనూ, తెల్లపంచే ధరించి శ్రద్ధగా డబ్బులు లెక్కపెట్టే కొందరు కనిపిస్తారు. దాన్నే పరకామణిగా పిలుస్తారు. శ్రీవారికి భక్తులు హుండీలో వేసిన డబ్బుల్ని అక్కడ లెక్కపెడతారు. ఇంకా ముందుకు నడిస్తే తాళ్లపాక వారి అరకి ఎదురుగా తిరుమామణి మండపంలో ఉంటుంది హుండీ. నామంతో పాటు శంఖచక్రాలూ ముద్రించిన ఓ వస్త్రంలో చుట్టి ఉండే రాగి గంగాళం అది. స్వామి కానుకలన్నీ ఇందులోకే చేరతాయి. తిరువేంకటాధిపుడికి రోజుకి సగటున మూడు కోట్ల రూపాయల ధనం సమకూరుతుందిక్కడినుంచి. ఈ డబ్బుని నోట్లూ, చిల్లరగా విభజించి తితిదే ఉద్యోగులతో పాటు, సేవ కోసం రిజిస్టర్‌ చేసుకున్న ప్రభుత్వ, బ్యాంకు సిబ్బంది కలిసి రెండు షిఫ్టుల్లో లెక్కబెడతారు. స్వామి నగదును లెక్కించడానికే రోజుకి 90 మంది పనిచేస్తారు. లెక్కింపు తర్వాత ఆ డబ్బును బ్యాంకుల్లో జమచేస్తారు. మొత్తానికి అచ్చంగా ధనం రూపంలో కానుకల హుండీ ద్వారా ఈ ఏడాది స్వామికి ముట్టిన మొత్తం 1100 కోట్ల రూపాయలు! ఇక ఈ హుండీలో కేవలం డబ్బులే కాకుండా బంగారు బిస్కెట్లూ, ఆభరణాలూ, విలువైన వజ్రాలూ, రత్నాలూ, ముత్యాలూ సమర్పించేవాళ్లూ ఉంటారు. వాటినీ వేరు చేసి ఒక్కోదాన్నీ విలువ కట్టి బ్యాంకులకు పంపుతారు. సగటున రోజుకి కిలోన్నర నుంచి రెండు కిలోల బంగారం తిరుమల హుండీలోకి వచ్చి చేరుతోంది.

  బంగారు కొండయ్య
మేలుగ రతంపు రాలు చెక్కిన ఉంగరాలు భుజగ కేయూరాలు మెరయంగ... కొలువై ఉన్నాడే... అంటూ, ఎంతో వైభవంగా స్వామి కొలువుదీరాడని చెప్పారంటేనే ఆ పదాలన్నీ శ్రీనివాసుడి గురించేనని అర్థమైపోతుంటుంది. ఆ దివ్య సమ్మోహన రూపం నుంచి కాంచనాన్ని వేరుచేయడం ఎవరితరం మరి! ‘తిరువీధుల మెరసే ఈ దేవదేవుడూ’ అంటూ అన్నమాచార్యుల వారు పాడారంటే ఆ మెరుపులో బంగారం కలిసి ఉండకపోయి ఉంటుందా, శ్రీవారి నగల కాంతులు ఆయన కళ్లను తాకకపోయి ఉంటాయా! అలంకార ప్రియుడిగా చెప్పుకునే ఈ మహావిష్ణు స్వరూపుడికి రత్న మణిమయ స్వర్ణాభరణాలు సమర్పించి, అలంకరింపజేసి, దీపపు వెలుగుల్లో తళుక్కుమనే ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి మురిసిపోయిన భక్తుల్లో చక్రవర్తుల నుంచి సామాన్యుల దాకా ఎందరో ఉన్నారు. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలైతే స్వామికి అపరభక్తుడు. ఆయన యుద్ధంలో గెలిచినప్పుడల్లా స్వామిని దర్శించుకునేవాడట. ఆ సమయంలో లెక్కకు మిక్కిలి నగలూ, రత్నాలూ, బంగారం వెండీ సమర్పించేవాడట. తిరుమల ఆనంద నిలయ గోపురానికి బంగారు తాపడం చేయించిందీ ఆయనే. మొత్తానికి తరాల నుంచీ స్వామికి దాసులుగా ఉన్న ఎందరో భక్తుల మూలంగా, ఇప్పటికి తిరుమల శ్రీవారికి సమకూరిన బంగారు నగలు 13 వేల కిలోలకు పైనే ఉన్నాయంటే ఆయన వైభవాన్ని అర్థం చేసుకోవచ్చు. వీటిని మూలవిరాట్టు సహా ఉత్సవ మూర్తులకూ, అమ్మవార్లకూ అలంకరిస్తారు. శ్రీవారికి ఒక్క వజ్రాల కిరీటాలే ఏడు ఉన్నాయి. ఇవి కాక బంగారు కిరీటాలూ, వందల సంఖ్యలో హారాలూ, ఇతర భూషణాలూ ఉన్నాయి. స్వామికి వివాహ సమయంలో మామగారు ఆకాశరాజు ఇచ్చిందిగా చెప్పే మేలిమి బంగారు కిరీటం బరువు 9 కిలోల 750 గ్రాములు. దీనికి పూజల్లో విశేష స్థానం ఉంది. 20, 30 కిలోల బరువున్న కిరీటాలూ ఏడుకొండల వాడి నగల్లో ఉన్నాయి. శ్రీవారికి రోజూ చేసే అలంకారాన్ని ‘నిత్యకట్ల అలంకారం’ అంటారు. అందులో పాదాలు, అంకెలు, పాగడాలు, వడ్డాణం, శంఖచక్రాలు, కర్ణపత్రాలు, వైకుంఠహస్తం, కటిహస్తం, సువర్ణపాదాలు, నాగాభరణాలు, భుజకీర్తులు, ముఖపట్టి, అష్టోత్తర కాసుల దండ, తులసీ పత్ర హారం, చతుర్భుజ లక్ష్మీహారం, అశ్వత్థపత్రహారం, పులిగోరు, సూర్యకటారి, సహస్రనామమాల, చంద్రవంక కంఠి, ఐదుపేటల కంఠి, శ్రీవత్సం, కౌస్తుభం, సువర్ణపీతాంబరాలు ఉంటాయి. మొత్తంగా శ్రీనివాసుడి మూల విరాట్టుకి రోజుకి 65 నుంచి 70 కిలోల దాకా పసిడి నగల్ని అలంకరిస్తారట. స్వామికి పెట్టే ప్రతి నగకూ రెండో సెట్టు ఉంటుంది. ఏ ఆభరణాన్నైనా అలంకరించాల్సి వచ్చినప్పుడు ఆ సమయంలో అందులో ఏవైనా రాళ్లు వూడినట్టు కనిపించినా, కాస్త విరిగినట్టున్నా ఆ స్థానంలో అదేలాంటి ఇంకో ఆభరణాన్ని పెడతారన్నమాట! ఇక దేశాధ్యక్షుడూ, ప్రధానిలాంటి విశిష్ట వ్యక్తులు వచ్చినప్పుడూ, బ్రహ్మోత్సవాల సమయంలోనూ వజ్రాభరణాలతో స్వామికి విశేష అలంకారం చేస్తారు. అంటే స్వర్ణ కిరీటం బదులు వజ్రాల కిరీటం, బంగారు హారాల బదులు వజ్రాల హారాలూ ఇలా! ఇక, నగల రూపంలో స్వామి వద్ద ఉన్న బంగారం కాకుండా, మరో ఆరున్నర వేల కిలోల పసిడి బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి ఉంది. దేవస్థానం దానికి వడ్డీగా నగదుకు బదులు బంగారాన్నే ఇవ్వమని అడగడంతో వివిధ బ్యాంకుల నుంచి వడ్డీకింద శ్రీవారికి జమవుతున్న బంగారం ఏడాదికి 56 కిలోలు. ఇక శ్రీవారి హుండీ నుంచి వచ్చే స్వర్ణ కానుకలు ఏడాదికి 500 నుంచి 600 కిలోలు ఉంటాయి. దాన్నీ మింట్‌ ద్వారా కరిగించి బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తున్నారు. స్వామి రూపుతో దేవస్థానం ముద్రించే 5, 10 గ్రాముల బంగారు డాలర్లను అమ్మడం ద్వారా దేవస్థానానికి ఏటా 20 కోట్లరూపాయలకు పైగా ఆదాయం వస్తోంది.

తలనీలాలకు 150 కోట్లు!
‘తిరుపతి వెళ్లి గుండుతో ఉన్న ఒక వ్యక్తి ఇటుగా ఏమైనా వెళ్లాడా అని అడిగినట్టుంది వ్యవహారం’ అంటూ ఎవరైనా సమాచారం సరిగ్గా అడగనప్పుడు ఎగతాళి చేయడం మనం గమనిస్తూనే ఉంటాం. అంటే, తిరుమల కొండకు వెళితే గుండుతో కనిపించే వాళ్లు వేలల్లో ఉండటం అంత సర్వసాధారణం మరి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వామికి ఏడాదికి కోటి మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. నల్లబంగారంగా పిలిచే ఈ తలనీలాలకు మార్కెట్టులో మంచి గిరాకీ ఉంది. భారతదేశంలోనే కాక ఫ్రాన్స్‌, ఇటలీ, బ్రెజిల్‌, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు తలనీలాలను కొనుగోలు చేస్తున్నాయి. ఒక్క తలనీలాల ద్వారానే తిరుమల తిరుపతి దేవస్థానానికి గడచిన ఆర్థిక సంవత్సరంలో సమకూరిన సొమ్ము 150 కోట్ల రూపాయలు. తిరుమలలోని కల్యాణకట్ట ఇరవై నాలుగు గంటలూ తెరిచే ఉంటుంది. సుమారు 700 మంది క్షురకులు మూడు షిఫ్టుల్లో పనిచేస్తారిక్కడ.

లడ్డూ ‘మహా’ ప్రసాదమే!
ప్రసాదాలు ఎన్ని రకాలున్నా తిరుపతి లడ్డూ ప్రత్యేకత వేరు. శ్రీనివాసుడి ప్రసాదంగా ఎంత భక్తిగా దాన్ని మొక్కుతారో, అంతే ఇష్టంగానూ భక్తులు సేవిస్తారు. దేవస్థానం రోజుకి 3 లక్షల నుంచి 4 లక్షల వరకూ లడ్డూలు తయారు చేస్తోంది. ప్రసాదంగా ఇచ్చే చిన్న లడ్డూని వదిలేస్తే 100 రూపాయల విలువ చేసే కల్యాణం లడ్డూ, 25 రూపాయల విలువ చేసే సాధారణ లడ్డూలను తితిదే విక్రయిస్తోంది. భక్తులు ఎక్కువగా వచ్చే బ్రహ్మోత్సవాల్లాంటి కార్యక్రమాల కోసం మరిన్ని లడ్డూలను ముందే సిద్ధం చేసుకుంటుంది. 2016 సంవత్సరానికి గాను 10.34 కోట్ల లడ్డూలను తితిదే తయారు చేసింది. 2016-17 సంవత్సరంలో ప్రసాదాల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం 165 కోట్ల రూపాయలు. ఎవరు ఎన్ని రకాలుగా చేద్దామని ప్రయత్నించినా తిరుపతి లడ్డూ రుచితో మాత్రం లడ్డూని తయారు చేయలేరు. బహుశా చక్కెర మోవిగల తల్లి అలమేలు మంగపతి ఎంగిలి, ఇంట్లో చేసిన లడ్డూకి తగలకపోవడమే అందుకు కారణమేమో! అందుకే తిరుమల లడ్డూకి తితిదే పేటెంట్‌ హక్కులను కూడా సాధించుకుని, జియోగ్రాఫికల్‌ ఇండికేటర్‌ రిజిస్ట్రీ జాబితాలో చేరింది. 2009లో ఈ హక్కును తితిదే సొంతం చేసుకుంది.

సర్వ‘భూ’పాలుడు!
స్వామికి ఒక్క ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోనే కాకుండా కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, కర్ణాటక, గుజరాత్‌, హరియాణా, తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశా తదితర రాష్ట్రాల్లో లెక్కకు మిక్కిలి భూములూ, భవనాలూ ఉన్నాయి. ఇవికాక విదేశాల్లోనూ కొన్ని ఆస్తులున్నాయి. మొత్తంమీద శ్రీనివాసుడి పేరు మీద తక్కువలో తక్కువ నాలుగున్నరవేల ఎకరాల భూమి రిజిస్టర్‌ అయి ఉంది. ఇక వేంకటేశ్వరుడి అకౌంటు కింద వివిధ బ్యాంకుల్లో 9,500 కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. వాటి ద్వారా దేవస్థానానికి ఏడాదికి 800 కోట్ల రూపాయల వడ్డీ వస్తోంది. ఇవికాక సేవలూ, అద్దెల ద్వారా వచ్చేది కొంత. దానాదీనా శ్రీనివాసుడికి గడచిన ఆర్థిక సంవత్సరం ముట్టిన మొత్తం నగదు 2,900 కోట్ల రూపాయల వరకూ ఉంది.

ఇలా చెప్పుకుంటూ పోతే స్వామికి దిష్టి తగులుతుందేమోనన్నంత సంపద ఆయన సొంతం. అందుకే వేంకటాచలం ఇల వైకుంఠం. ఆ కొండమీద కొలువైన శ్రీవారు సిరిసంపదలకు ఆలవాలం!

- లక్ష్మీహరిత ఇంద్రగంటి
సహకారం: జి.వసంతనాయుడు, న్యూస్‌టుడే, తిరుమల

తొలిస్థానం తిరుమలదే... 

ప్రపంచంలోనే పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగే ఆలయాల్లో తిరుమల దేవస్థానం తొలిస్థానంలో ఉంది. ఈ ఏడాది తిరుమల బడ్జెట్‌ 2900 కోట్ల రూపాయల దాకా ఉంది.
* అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే హిందూ దేవాలయం తిరుమలే.
* తిరుమల హుండీ ఒక్కరోజు రికార్డు కలెక్షన్‌ 5.73 కోట్ల రూపాయలు.
* తిరుమలలో రోజుకు సుమారు రూ.2 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అందులో ఒక్కటోపీలూ, శ్రీవారి ఫొటోలే 70 లక్షల రూపాయల దాకా వ్యాపారానికి మూలం.
* మూలవిరాట్టుకు నిత్యం 120 రకాల ఆభరణాలు అలంకరిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి 383 విభిన్న రకాల ఆభరణాల్ని అలంకరిస్తారు.
* శ్రీవారి బంగారు పీతాంబరం 40 కిలోల వరకూ బరువుంటుంది.
* వేంకటేశ్వరుడి ఆభరణాల్లో అరకిలో బరువుండే అరుదైన గరుడమేరు పచ్చ ఉంది. ప్రత్యేకపూజలూ, ఉత్సవాల్లో అలంకరిస్తారు.
* శ్రీనివాసుడి ఉత్సవాలకి స్వర్ణరథం ఉంది. 74 కిలోల బంగారాన్ని ఉపయోగించారు.
* స్వామికి నిత్యం హుండీ ద్వారా వచ్చే వెండి సుమారు 7 కిలోల దాకా ఉంటుంది.
* ఆసియాలోనే అతిపెద్ద వంటశాల తిరుమల తిరుపతి దేవస్థానం సొంతం. రోజుకి లక్షమంది ఇక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తారు.
* శ్రీవారి పేరిట అన్నదానం చేస్తోన్న తరిగొండ వెంగమాంబ ట్రస్టుకి రోజుకి 5వేల కిలోల కూరగాయల్ని భక్తులు ఉచితంగా అందజేస్తున్నారు. ప్రత్యేక దినాల్లో 10 వేల కిలోల వరకూ అవసరమవుతున్నా అంతా భక్తుల ద్వారానే అందుతోంది.
* స్వామి పుష్ప ప్రియుడు అందుకే దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచీ తిరుమలకు నిత్యం 15 వేల కిలోల వరకూ పువ్వులు చేరతాయి. కేవలం స్వామి పూజ, అలంకారానికే 500 కిలోల వరకూ పువ్వుల్ని వినియోగిస్తున్నారు. మొత్తం 200 మంది దాకా ఈ పువ్వుల్ని మాలలుగా కట్టేందుకూ, దేవస్థానం సహా పలు కాటేజీలూ, వసతి భవనాల్లో అలంకరించేందుకు పనిచేస్తున్నారు. ఇవన్నీ శ్రీవారికి భక్తుల కానుకలుగా చేరుతున్నవే. పువ్వుల కోసం టీటీడీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయదు.

 

ఇంకా..