close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒక్క ఫోను... ప్రపంచాన్నే మార్చేసింది!

ఒక్క ఫోను... ప్రపంచాన్నే మార్చేసింది!

సినిమా టికెట్ల కోసమూ రైల్వే రిజర్వేషన్‌ కోసమూ ఒకప్పుడు క్యూలో నిలబడేవాళ్లం. అంతా ఆన్‌లైన్‌ కాబట్టి ఇప్పుడా అవసరం లేదు. గుళ్లలో దైవదర్శనానికి తప్ప మనకిప్పుడు ఎక్కడా క్యూకట్టే పరిస్థితులు లేవు. అయినా యువతరం పొడవాటి క్యూలు కడుతూనే ఉన్నారు. మన దేశంలోనే కాదు, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, జపాన్‌లో, చైనాలో... ఐఫోన్‌ డే కోసం ఉద్యోగాలకు సెలవులు పెడుతున్నారు. రోజుల తరబడి పేవ్‌మెంట్ల మీద టెంట్లు వేసుకుని కూర్చుని మరీ కొనుక్కుంటున్నారు. ఏమిటో తెలుసా... ఒక్క స్మార్టు ఫోను. అది అలాంటి ఇలాంటి ఫోను కాదు మరి... ఐఫోను! మేడ్‌ బై ఆపిల్‌! ఏడాదికో కొత్త మోడల్‌తో అత్యంత అధునాతన సాంకేతికతతో అబ్బురపరిచే హస్తభూషణం... ఈ తరానికి స్టేటస్‌ సింబల్‌!

జనవరి 9, 2007. ఐఫోన్‌ని స్టీవ్‌ జాబ్స్‌ ప్రపంచానికి పరిచయం చేసిన రోజు. శాన్‌ ఫ్రాన్సిస్కోలో మ్యాక్‌వరల్డ్‌ కాన్ఫరెన్స్‌ వేదికపైన ఆయన ఈ ఫోన్‌ చూపిస్తూ ‘అప్పుడప్పుడూ ప్రపంచాన్ని మార్చేసే విప్లవాత్మక ఉత్పత్తులు తయారవుతుంటాయి...’ అన్నారు. అది అక్షరాలా నిజమని ఐఫోన్‌ నిరూపించింది. ప్రజాదరణలో ఆపిల్‌ ఉత్పత్తులన్నింటినీ ఇది మించిపోయింది. ప్రపంచాన్నే కాదు, ఆపిల్‌ పట్ల ప్రపంచం దృక్పథాన్నీ మార్చేసింది. ఇప్పుడు ఆపిల్‌ రెవెన్యూలో 60 శాతం దీని ద్వారానే వస్తోంది. ప్రజలు ఆపిల్‌ని ఐఫోన్లు తయారుచేసే కంపెనీ మాత్రమే అనుకుంటున్నారు. అదే సంవత్సరం జూన్‌ 29న తొలి ఐఫోన్‌ మార్కెట్లోకి వచ్చింది. 28 రాత్రి నుంచే ఫోను కొనుక్కోవడానికి ప్రజలు ఆపిల్‌ కార్యాలయాల ముందు బారులు తీరారు. ‘పెద్ద తెర, టచ్‌ కంట్రోల్‌ ఉన్న ఐపాడ్‌; మంచి మొబైల్‌ ఫోన్‌; అంతర్జాలంతో అనుసంధానించి కంప్యూటర్‌లా పనిచేసుకోగల పరికరం... మూడు సౌకర్యాలూ ఒకే దాంట్లో ఉండి; తేలిగ్గా చేతిలో పట్టే ఈ హ్యాండ్‌సెట్‌ని మేం ఐఫోన్‌ అంటున్నాం....’ అని ఆనాడు స్టీవ్‌ వర్ణించి చెప్పిన ఆ చిన్ని అద్భుతాన్ని అపురూపంగా అందుకుని ప్రపంచాన్ని గెలిచినంతగా సంబరపడ్డారు. అప్పటివరకూ ఆపిల్‌ ప్రకటనని అతిశయోక్తిగా కొట్టేసిన పోటీ సంస్థలు బిత్తరపోయాయి. వ్యాపార ప్రకటనకు దీటుగా ఉత్పత్తీ ఉండడం ఈ ఒక్క విషయంలోనే జరిగిందని రాసిన పత్రికలు దీనికి ‘దేవుడి ఫోన్‌’(జీసస్‌ ఫోన్‌) అన్న పేరు పెట్టేశాయి.

సెప్టెంబరు మాసం...
ఆనాటి ఆ ఫోన్‌ కారణంగా ఇప్పుడు లక్షలాది ఆప్‌లు వినియోగంలోకి వచ్చాయి. ఆర్థిక వ్యవస్థలో వాటి పాత్ర హాలీవుడ్‌ని మించిపోయింది. ఉబర్‌, ఓలా, ఎయిర్‌బీఎన్‌బీ, పేటీయం లాంటి వందలాది సంస్థలు రూపుదిద్దుకున్నాయి. స్మార్ట్‌ ఫోన్‌ సాంకేతికతని ప్రధాన జీవితావసరంగా మార్చేసింది ఐఫోన్‌. అందుకే అభిమానులు ప్రతి ఏటా ‘సెప్టెంబరు మాసం...’ అని పాడుకుంటూనే ఉన్నారు. ఐఫోన్‌ డే వేడుక జరుపుకుంటూనే ఉన్నారు. సెప్టెంబరు రెండో వారంలో క్రమం తప్పకుండా ఆపిల్‌ విడుదల చేసే కొత్త మోడల్‌ ఫోన్‌ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ ఏడాది పదో వార్షికోత్సవం కావడంతో ఆపిల్‌ ఎలాంటి ఫోన్‌ ఆవిష్కరిస్తుందోనన్న వూహాగానాలకు హద్దుల్లేకుండా పోయాయి. ఐఫోన్‌ 8 వస్తుందనీ, కొత్త ఫోన్‌లో ఫేస్‌ రికగ్నిషన్‌ ఫీచర్‌ ఉంటుందనీ, ఎల్‌సీడీ బదులు ఓఎల్‌ఈడీ, ఎడ్జ్‌ టు ఎడ్జ్‌ డిస్‌ప్లే ఉంటుందనీ, ఎంబెడెడ్‌ వర్చువల్‌ హోం బటన్‌ ఉంటుందనీ... ఎన్నెన్నో వూహలు. బ్లాగులో సీఈవో టిమ్‌కుక్‌ రాసిన మాటలతో ఈ వూహలకు రెక్కలొచ్చాయి. ‘వినియోగదారుల జీవితాల్లో ఐఫోన్‌ విడదీయరాని భాగమైంది. గతానికి భిన్నంగా ఇప్పుడు మనం ఇతరులతో సంభాషించడాన్నీ, వినోదాన్ని పంచుకోవడాన్నీ, పనిచేసుకోవడాన్నీ, మొత్తంగా జీవించడాన్నీ పునర్నిర్వచిస్తోంది ఐఫోన్‌. మొబైల్‌ని కంప్యూటర్‌లా వాడుకోవడంలో ఈ దశాబ్దకాలంలో ఐఫోన్‌ కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఇప్పుడిక ఇంకా ఉత్తమమైనది రావాల్సి ఉంది...’ అని రాశారు కుక్‌. ఈ మాటలతో అభిమానుల అంచనాలు మిన్నంటాయి. భవిష్యత్తులో ఈ ఫోను ఇంకా ఏమేం మ్యాజిక్కులు చేయనుందోనని ఎదురుచూసేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

అతడి మీద కోపంతో... ఐఫోన్‌ తయారైంది!
అసలు ఐఫోన్‌ తయారీకి పునాదే నాటకీయ పరిణామాల మధ్య పడింది. ఐఫోన్‌ అభిమానులు స్టీవ్‌ జాబ్‌ కన్నా ముందు మరో వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అతడు మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగి. అతడి భార్య స్టీవ్‌ భార్య పావెల్‌కి స్నేహితురాలు. ఐఫోన్‌ నిర్మాతల్లో ఒకరైన స్కాట్‌ ఫోర్‌స్టాల్‌ ఐఫోన్‌ పదో వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఆ మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగి పేరు చెప్పకుండా రహస్యాన్ని బయటపెట్టారు. భార్యలిద్దరూ స్నేహితురాళ్లు కావడమూ, భర్తలిద్దరూ టెక్‌ సంస్థల్లో పనిచేసేవారే కావడంతో ఈ రెండు కుటుంబాలూ తరచూ విందుల్లో తారసపడేవి. స్టీవ్‌కి అసలు మైక్రోసాఫ్ట్‌ అంటేనే ఇష్టం ఉండేది కాదు. తప్పనిసరై అతడితో మాట్లాడేవాడు. అలా ఒకసారి మాటల్లో మైక్రోసాఫ్ట్‌ ట్యాబ్లెట్‌ పీసీ తయారీలో ముందడుగు వేసినట్లు అతడు చెప్పాడు. దాని గురించి అతడు గొప్పగా చెప్పుకోవడం, పైగా ఆ ట్యాబ్లెట్‌ పీసీలు స్టైలస్‌ (పుల్లలాంటి పరికరం)తోనే పనిచేస్తాయనడం... స్టీవ్‌ జాబ్స్‌కి కోపం తెప్పించింది. మర్నాడు ఆఫీసుకు వెళ్తూనే ఫోర్‌స్టాల్‌తో సమావేశమయ్యాడు. ఆపిల్‌ సొంతంగా టచ్‌స్క్రీన్‌ పరికరం తయారుచేయాలన్న ప్రతిపాదన పెట్టాడు. స్టైలస్‌ లాంటి పరికరాలను వినియోగదారులు తేలిగ్గా పారేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి చేతి వేళ్లనే స్టైలస్‌లా ఉపయోగించి పనిచేసేలా ఆ పరికరం ఉండాలన్నది జాబ్స్‌ లక్ష్యం. అలా ఫోర్‌స్టాల్‌ ఆధ్వర్యంలో టచ్‌ స్క్రీన్‌ ట్యాబ్లెట్‌ తయారీ మొదలెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు స్టీవ్‌ ఫోర్‌స్టాల్‌తో కలిసి ఓ కాఫీషాప్‌కి వెళ్లాడు. అక్కడ చాలామంది మొబైల్‌ ఫోన్లు వాడడం స్టీవ్‌ చూశాడు. కానీ వారంతా ఆ ఫోను పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు ఆయనకు అన్పించిందట. దాంతో టచ్‌ స్క్రీన్‌తో ట్యాబ్లెట్‌ తయారుచేసే ప్రాజెక్టుని ఫోను తయారీ దిశగా మళ్ళించేశాడు.

తొలుత ‘ప్రాజెక్ట్‌ పర్పుల్‌’ ట్యాబ్లెట్‌కి బదులుగా ఫోన్‌ తయారుచేయాలని నిర్ణయించుకున్నాక ఆ ప్రాజెక్టుకి ‘ప్రాజెక్ట్‌ పర్పుల్‌’ అని పేరు పెట్టారు. దాంతో ఫోను పేరు కూడా ‘పర్పుల్‌’ అనే పెడతారనుకున్నారు అందరూ. ఆపిల్‌ కొత్త రకం ఫోను తయారుచేయబోతోందన్న వార్తలు బయటకు పొక్కడంతో అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేచిచూడడం మొదలెట్టారు. ట్యాబ్లెట్‌ లాంటి పెద్ద స్క్రీన్‌ని ఫోను సైజుకి తగ్గించడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది. అయితే ఒకసారి ఫోన్‌ తయారయ్యాక స్టీవ్‌ ఆలోచన సరైనదే అనిపించిందంటారు ఫోర్‌స్టాల్‌. నిజంగానే ఐఫోన్‌ అప్పటివరకూ ఉన్న ఫోన్ల స్వరూపాన్ని మార్చేసింది. ఫోనులో ఎక్కువ భాగం ఆక్రమించే కీబోర్డుని తీసేశారు. స్టైలస్‌ని చెత్తబుట్టలో పడేశారు. ‘స్పర్శ’తోనే పనిచేసే అద్భుతాన్ని ఆవిష్కరించారు. రివల్యూషనరీ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ తెచ్చామనీ, సాఫ్ట్‌వేర్‌లో మిగిలిన వాళ్లకన్నా ఐదేళ్లు ముందున్నామనీ స్టీవ్‌ జాబ్స్‌ ఆనాడు ప్రకటించారు. ఐఫోన్‌ నిజంగానే అద్భుతమైన ఆవిష్కరణ అని భావించిన టైమ్‌ మ్యాగజైన్‌ ‘ఇన్వెన్షన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2007’ అవార్డు ఇచ్చింది.

ఆపిల్‌ సీఈవోగా స్టీవ్‌జాబ్స్‌ చాలా వేదికలపై కీలక ప్రసంగాలు చేశారు. కానీ ఐఫోన్‌ ఆవిష్కరణ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం వాటన్నిటిలోకీ కీలకమైంది. ఎలక్ట్రానిక్‌ వస్తువుల చరిత్రనే తిరగరాసిన ప్రసంగమది. ఫోనును ఆవిష్కరించిన నెల తర్వాత తొలి వాణిజ్య ప్రకటనని 2007 ఫిబ్రవరి 25న ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమంలో ప్రసారం చేశారు. ఫోను మార్కెట్లో విడుదలైన మరుసటి నెలలోనే సంస్థలోని ఉద్యోగులందరికీ ఐఫోన్లు ఉచితంగా ఇచ్చి ముందుగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది ఆపిల్‌.

పేరు కోసం పోరు
ఆపిల్‌ అప్పటికే ఐమ్యాక్‌, ఐపాడ్‌ లాంటి పేర్లని ఉపయోగించింది. అయితే ఐఫోన్‌, ఐఓఎస్‌ అన్న పేర్లను మాత్రం సిస్కో కంపెనీ రిజిస్టర్‌ చేసుకుంది. ఆ సంస్థ నుంచీ ఆ పేర్లను సొంతం చేసుకోవడానికి స్టీవ్‌ నెరిపిన దౌత్యాన్ని వాణిజ్యవర్గాలు ఇప్పటికీ తలచుకుంటాయి. ఇతరులు నమోదుచేసుకున్న పేరు తమకు కావాలనుకున్నవాళ్లు ఆ పార్టీలతో నేరుగా మాట్లాడి ఎంతో కొంత చెల్లించి హక్కులు కొనుక్కుంటారు. స్టీవ్‌ అదేం చేయలేదు. ‘ఈ పేరు మేం వాడుకుంటున్నాం’ అని సిస్కో ఉద్యోగికి ఫోనులో చెప్పేశాడు. ఆ తర్వాత ఆపిల్‌ ఐఫోన్‌ను తెస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించగానే సిస్కో ఆపిల్‌ మీద కేసు పెట్టింది. అప్పుడు స్టీవ్‌ జాబ్స్‌ తనదైన శైలిలో చర్చలు జరిపాడు. పరస్పరం సహకరించుకోవాలన్న ఒప్పందంతో సిస్కో కేసు ఉపసంహరించుకుంది. ఐఓఎస్‌(ఇంటర్నెట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌) అన్న పేరు కూడా సిస్కో నుంచి తీసుకున్నదే. ఆపిల్‌ తన ఉత్పత్తులకు ఐ అనే ఆంగ్ల అక్షరంతో మొదలయ్యేలా పేరు పెట్టడానికి కారణం ఆ అక్షరానికి ఉన్న అర్థమే. తమ ఉత్పత్తులు వ్యక్తిగత అభిరుచులనూ వ్యక్తిత్వాన్నీ ప్రతిబింబిస్తాయనీ, అలా మార్చుకునే వెసులుబాటు వాటికి ఉంటుందనీ తెలియజేయడానికే ఆపిల్‌ ఇలాంటి పేర్లు పెడుతోంది.

స్టీవ్‌ జాబ్స్‌ కలల కార్యాలయంలోకి...
ఐఫోన్‌ పదో వార్షికోత్సవం సందర్భంగా ఆపిల్‌ కొత్త కార్యాలయంలోకి మారింది. కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో 175 ఎకరాల్లో నిర్మించిన దీన్ని ‘ఆపిల్‌ పార్క్‌’ అంటారు. లండన్‌ స్క్వేర్‌ స్ఫూర్తితో పార్కు చుట్టూ గుండ్రంగా భవనం ఉండాలని అంతరిక్ష నౌక ఆకృతిలో స్టీవ్‌ జాబ్స్‌ దీనికి రూపకల్పన చేయించాడు. కార్యాలయంలో ఏసీలూ, ఫ్యాన్లూ, కిటికీలూ ఉండవు. లోపల గదులూ ఉండవు. అంతా ఓపెన్‌స్పేస్‌. ఒక పద్ధతి ప్రకారం అమర్చిన బల్లలూ కుర్చీలు మాత్రమే ఉంటాయి. వాతావరణ మార్పులకు అనుగుణంగా పెరిగేలా ఎంపికచేసిన చెట్లతో తీర్చిదిద్దిన పార్కు వల్ల భవనం చల్లగా ఉంటుందట. చాలా వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఉష్ణోగ్రత కాస్త తగ్గించడానికి బయటి గోడలపై నీటిని చల్లే ఏర్పాటు చేశారు. పగలో రాత్రో తెలియకుండా కృత్రిమ కాంతిలో పనిచేయకూడదనీ, ఉద్యోగులు సహజ వాతావరణంలో పనిచేయాలనీ భావించిన స్టీవ్‌జాబ్స్‌ ఆపిల్‌ ప్రధాన కార్యాలయాన్ని ఇలా నిర్మింపజేశాడు. ఈ అద్దాల భవనంలో 12వేల మంది సిబ్బంది పనిచేస్తారు. ఐఫోన్‌ పదో వార్షికోత్సవం కోసం ఈ భవనంలో ప్రత్యేకంగా స్టీవ్‌జాబ్స్‌ థియేటర్‌ని తీర్చిదిద్దారు.

కళ్లు తిరిగే వ్యాపారం
గత పదేళ్ల ఐఫోన్‌ ప్రస్థానం చూస్తే బహుశా చరిత్రలో ఇంత విజయవంతమైన ఉత్పత్తి మరొకటి లేదనిపిస్తుంది. ఈ పదేళ్లలో 120 కోట్ల (1.2 బిలియన్ల) ఐఫోన్లు అమ్ముడుపోయాయని నిపుణుల అంచనా. దీంతోపాటు ఐఓఎస్‌ సామ్రాజ్యమూ విస్తరించింది. ఐపాడ్‌ టచ్‌, ఐప్యాడ్‌, ఆపిల్‌ వాచ్‌, ఆపిల్‌ టీవీ... అన్నీ కలిపి 2018 నాటికి దాదాపు రెండు వందల కోట్ల యూనిట్లు అమ్ముడవుతాయని మార్కెట్‌ పరిశీలకుల అంచనా. ఐఫోన్‌ 4ఎస్‌ 24 గంటల్లో లక్ష ఫోన్లు అమ్ముడై రికార్డు సృష్టిస్తే, అత్యధిక సంఖ్యలో ఫోన్ల ఉత్పత్తిదారుగా ఉన్న నోకియాను 2011లో ఆపిల్‌ అధిగమించింది. ఒక్క 2016లోనే 21.2 కోట్ల ఐఫోన్లు అమ్ముడయ్యాయి. ఒక్క ఏడాదిలో అన్ని ఫోన్లు తయారుచేసి అమ్మడానికి ఆ సంస్థ ఎలా పనిచేయాలి! ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. గత క్రిస్మస్‌ సీజన్‌ మూడు నెలల్లో దాదాపు 8 కోట్ల ఐఫోన్లు అమ్మింది ఆపిల్‌. అంటే రోజుకు సుమారు 9 లక్షలు. ఒక రోజులో 86,400 సెకండ్లు ఉంటాయి. అంటే సెకనుకో ఐఫోన్‌ అమ్మినట్లన్నమాట. ఫోన్‌ అమ్మినంత సులభం కాదు తయారుచేయడం. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఐఫోన్‌ విడి భాగాలు తయారవుతాయి. వాటిని ఒకచోటికి చేర్చి అసెంబుల్‌ చేసే కార్యాలయాలూ మళ్లీ వివిధ దేశాల్లో ఉన్నాయి. వాటన్నిటినీ సమన్వయపరుస్తూ ఇంత బిజినెస్‌ జరపాలంటే సంస్థ ఈ పదేళ్లలో ఎంత మారి ఉండవచ్చు! 2006లో ఆపిల్‌ 53 లక్షల మ్యాక్‌ కంప్యూటర్లు అమ్మింది. అక్కడినుంచీ 21.2 కోట్ల ఐఫోన్ల అమ్మకం వరకూ సాగిన ప్రస్థానం వెనక ఉన్నవి ముఖ్యంగా మూడు అంశాలు... స్టీవ్‌ జాబ్స్‌ దూరదృష్టి, టిమ్‌ కుక్‌ నాయకత్వం, సిబ్బంది కృషి.

లాభాల్లో ప్రథమ స్థానం
స్మార్ట్‌ ఫోన్ల మార్కెట్‌లో అత్యధిక లాభాలు ఐఫోన్‌వే. నాలుగేళ్ల లెక్కలు చూస్తే 2013లో 62 శాతం, 2014లో 77, 2015లో 90, 2016లో 83 శాతం...స్మార్ట్‌ ఫోన్‌ అమ్మకాల్లో లాభాలు ఆపిల్‌వే. ఐఫోన్‌ 6, 6ప్లస్‌ విడుదల చేసిన సంవత్సరం ఏకంగా మార్కెట్‌లో 90 శాతం లాభాలు ఆపిల్‌ జేబులోకి వెళ్లాయి. ఈ ఏడాది తొలి మూడునెలల్లోనూ 5 కోట్ల ఐఫోన్లు అమ్ముడుపోగా 83 శాతం లాభాల వాటా ఆపిల్‌ సొంతమైంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో ఐఫోన్‌ వాటా 20 శాతమే. లాభాల్లో మాత్రం దాదాపు 90శాతంగా ఉంటోంది. ఆప్‌స్టోర్‌లో ఆప్‌ల డౌన్‌లోడ్‌తోనే రోజుకి 6కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభిస్తుందట. 2008లో ఈ ఆప్‌ స్టోర్‌ ప్రారంభించినప్పటినుంచీ ఇప్పటివరకూ డెవలపర్లకు రూ.6 వేల కోట్లకు పైగా ఆదాయం లభించింది.

సవాళ్లూ ఉన్నాయి!
ఇవన్నీ చూసి ‘ఆపిల్‌ ముంగిట వడ్డించిన విస్తరి ఐఫోన్‌’ అనుకుంటే పొరపాటే. ఢీ అంటే ఢీ అన్నట్లు సాగుతోంది శామ్‌సంగ్‌ గెలాక్సీతో ఐఫోన్‌ పోటీ. మరోపక్క మార్కెట్‌ నిపుణుల విశ్లేషణల ప్రకారం - ఖరీదైన స్మార్ట్‌ ఫోన్ల మార్కెట్‌ శాచురేషన్‌ పాయింట్‌కి చేరుకుంది. స్తోమత ఉన్నవారు ఇప్పటికే ఈ ఫోన్లు కొనేసుకున్నారు. ఎప్పటికైనా ఒక ఐఫోన్‌ సొంతం చేసుకోవాలని కలలు కంటున్న మధ్యతరగతివారూ, కొత్తగా ఉద్యోగాల్లో చేరే యువత మాత్రమే ఇకముందు దీన్ని కొనబోతారు. కాబట్టి ధరతోపాటు ఇతర విషయాల్లో చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. పైగా ఐఫోన్‌ ఇప్పటికే చాలా పరిణతి చెందిన ఉత్పత్తిగా పేరొందింది. నాలుగేళ్లయినా ఫోను ఎప్పట్లాగా బాగా పనిచేస్తుంది కాబట్టి వినియోగదారులు ఇతర ఫోన్లలాగా రెండు మూడేళ్లకే దీనిని మార్చుకోవాలనుకోరు. దాంతో గతంలో ఉన్నంత ఎక్కువగా కొనుగోళ్ల జోరు ఉండదు... ఇదీ వాళ్లు చెప్పేది.

అయినా... అది ఐఫోన్‌!
మార్కెట్‌ విశ్లేషణలు పక్కన పెడితే వినియోగదారుల్లో మాత్రం ఐఫోన్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇది వాడడం అలవాటైనవారు మరో ఫోన్‌ వాడలేమంటారు. అందుకే కొత్త ఫోన్‌ విడుదలైన ప్రతిసారీ అప్పటికే దాన్ని వాడుతున్నవారిలో సగం మంది పాత ఫోన్‌ అమ్మేసి కొత్తది కొంటున్నారట. ఐఫోన్‌లో వాడే కీలకమైన ప్రాసెసర్‌ని శామ్‌సంగ్‌ తయారుచేస్తుందనీ, కొరియా, చైనా, తైవాన్‌ లాంటి దేశాలు తయారుచేసిన విడిభాగాలను అసెంబుల్‌ చేసి ఐఫోన్‌ అంటూ గొప్పలు చెప్పుకుంటారనీ ఐఫోన్‌ అభిమానుల్ని సరదాగా ఏడిపిస్తుంటారు కొందరు. ఎవరేమన్నా వారు మాత్రం ‘నాది ఐఫోన్‌’ అని గర్వంగా చూపిస్తారు. ఒకసారి ఓ స్కైడైవర్‌ 13వేల అడుగుల ఎత్తునుంచీ ఫోన్‌ని కింద పడేసుకున్నాడు. దాని అద్దం పగిలింది కానీ ఫోన్‌ పనిచేస్తూనే ఉంది. అది ఐఫోన్‌ మరి!

ఐఫోన్‌ కోసమే క్యూ ఎందుకు?

ఐఫోన్‌ ఎలా ఉంటుందో తెలియకముందు నుంచే దానికోసం అభిమానులు క్యూ కట్టారు. క్యూలో ముందుండాలనుకునేవారు కొన్ని రోజుల ముందు నుంచీ క్యాంపులు వేస్తున్నారు. న్యూయార్క్‌లో ఐఫోన్‌ 5 కోసం ఏకంగా 14 రోజులు లైన్లో ఉన్నారట. ఇలా రోజుల తరబడి క్యూలో నిలబడి కొనడానికి ఐఫోన్‌ బతకడానికి తప్పనిసరైన అత్యవసరమైన వస్తువు కాదు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తే వారం రోజుల్లో ఇంటికి వస్తుంది. అలాంటిదాని కోసం ఎందుకిలా లైన్లో నిలబడుతున్నారు? ఈ సందేహమే చాలా మందికి వచ్చింది. వారి పరిశీలనలో తేలిందేమిటంటే... అభిమానుల ప్రేమ ‘ఐ’ఫోను మీద కాదు, ‘ఆపిల్‌’ బ్రాండు మీద అట. ఆపిల్‌ ఉత్పత్తి కోసం లైన్లో నిలబడడాన్ని వారు ఎంజాయ్‌ చేస్తున్నారట. తాము ఆపిల్‌ స్టోర్‌ ముందు పడిగాపులు కాయడాన్ని ఇతరులు గుర్తించాలనీ, అసూయ చెందాలనీ అనుకుంటారట. ఆ బ్రాండ్‌ ఎంత శక్తిమంతమైందంటే ప్రతి వాళ్లూ దాంతో తమకు అనుబంధం ఉండాలని కోరుకుంటారట. వారి దృష్టిలో ఆపిల్‌ ఉత్పత్తి అంటే... మంచి అభిరుచి, సొగసైన ఆకృతి, హుందాతనం. నాలుగు దశాబ్దాల ప్రయాణంలో ఆపిల్‌ కష్టపడి సంపాదించుకున్న అభిమానం అది.

ఆ అవకాశాన్ని ఇలా కూడా... 

అందరికన్నా ముందుగా కొత్త ఐఫోన్‌ సొంతం చేసుకోవాలని ఆపిల్‌ స్టోర్ల దగ్గర బైఠాయిస్తున్న అభిమానులు పలురకాల కొత్త ఆలోచనలకు స్ఫూర్తినిస్తున్నారు. స్వచ్ఛంద సేవాసంస్థలు ప్రచారం చేసుకోవడానికీ తద్వారా విరాళాలు సేకరించడానికీ దీనిని ఒక అవకాశంగా మార్చుకుంటున్నాయి. తమ సంస్థల నినాదాలు ముద్రించిన టీషర్టులు ధరించీ, ప్లకార్డులు పట్టుకునీ నిలబడుతున్న కార్యకర్తలు ఐఫోన్‌ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ‘ఐఫోన్‌ డే’ రోజు లైనులో నిలబడ్డవాళ్లంతా తమ శక్తి మేరకు నిరాశ్రయులకోసం, అనాథలకోసం విరాళాలు ఇవ్వాలంటూ ఈ స్వచ్ఛంద సంస్థల వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ‘డీపాల్‌’ ఇంగ్లాండ్‌కి చెందిన నిధుల సేకరణ సంస్థ. ఈ సంస్థ కార్యకర్తలు ఒకరోజు ఉదయం లండన్‌లో రోడ్డు మీద వెళ్తుండగా ఆపిల్‌ సెంటర్‌ ముందు చిన్న చిన్న టెంట్లు వేసుకుని నలుగురైదుగురు కూర్చుని ఉండడం కన్పించింది. కొత్త ఐఫోన్‌ కోసం క్యూ మొదలెట్టారని ఆ కార్యకర్తలు నవ్వుకున్నారు. కానీ అంతలోనే ఓ ఆలోచన తళుక్కున మెరిసింది వారి బుర్రలో. ఆఫీసుకు వెళ్లి పై అధికారులకు దాన్ని వివరించారు. వారి ఆమోదంతో కొందరు కార్యకర్తలు వెళ్లి ఆ క్యూలో నిలబడ్డారు. ఆరోజు సోమవారం. శుక్రవారం ఉదయం వరకూ అలా క్యూలో ఉన్నారు. తర్వాత క్యూలో తమ స్థానాలను ఈబేలో వేలం వేశారు. వచ్చే డబ్బుని ఇళ్లులేని పేదలకోసం ఖర్చుపెడతామని ప్రకటించారు. ఐఫోన్‌ని త్వరగా చేజిక్కించుకోవాలనుకున్నవాళ్లు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి ఆ స్థానాలను కొనుక్కున్నారు. ఈ చర్య వల్ల నిరాశ్రయుల సమస్యల గురించి యువతతో చర్చించే అవకాశం వచ్చిందనీ, పెద్ద మొత్తంలో డబ్బు కూడా సమకూరిందనీ సంస్థ తెలిపింది. ఐఫోన్‌6 విడుదల సందర్భంగా జరిగిందీ సంఘటన.

స్టీవ్‌ చేసిన ప్రాంక్‌ కాల్‌! 

మొట్టమొదటి ఐఫోన్‌ డెమో సందర్భంగా గూగుల్‌ మ్యాప్స్‌ చూపిస్తూ వేదికపై నుంచి స్టీవ్‌ జాబ్స్‌ ఒక ప్రాంక్‌ కాల్‌ చేశాడు. ఫోనులో గూగుల్‌ మ్యాప్‌ ఓపెన్‌ చేసి దగ్గర్లోని స్టార్‌బక్స్‌కి ఫోన్‌ చేశాడు. అవతలి నుంచీ హన్నా అనే యువతి ఫోను తీసి మర్యాదగా మాట్లాడింది. జాబ్స్‌ తనకు 4వేల ‘లాటె’(కాఫీలో ఒక రకం) కావాలని అడిగాడు. అన్ని కాఫీలు ఒకేసారి ఎవరూ ఆర్డరు ఇవ్వరు. దాంతో నిర్ఘాంతపోయిన ఆమె తేరుకుని సమాధానం చెప్పేలోపే ‘ఉత్తినే... సరదాగా చేశాను. రాంగ్‌నంబర్‌, గుడ్‌బై’ అని పెట్టేశాడు. ప్రేక్షకులంతా గొల్లున నవ్వారు. బహిరంగంగా ఐఫోన్‌ నుంచి వెళ్లిన తొలి ప్రాంక్‌ కాల్‌ అదే. కార్యక్రమం తర్వాత చాలామంది ఆ స్టార్‌బక్స్‌ రెస్టరెంట్‌కి వెళ్లారు. ‘మీ రెస్టరెంట్‌ నుంచి స్టీవ్‌జాబ్స్‌తో మాట్లాడిందెవరు...’ అని వారు అడిగితే తెలిసింది హన్నాకి తాను మాట్లాడింది స్టీవ్‌ జాబ్స్‌తోనని. అప్పటిదాకా ఆమె ఎవరో ఏడిపించడానికి చేసిన ప్రాంక్‌ కాల్‌ అనే అనుకుందిట. ఇప్పటికీ ఐఫోన్‌డే రోజున ఆపిల్‌ అభిమానుల నుంచీ స్టార్‌బక్స్‌కి ఇలాంటి ప్రాంక్‌ కాల్స్‌ వస్తూనే ఉంటాయట.

ఐఫోన్‌ మేడిన్‌ ఇండియా! 

అవును, భారత్‌లోనూ ఐఫోన్‌ తయారవుతోంది. మొట్టమొదటగా బెంగళూరులోని ఆపిల్‌ ఉత్పత్తి కేంద్రంలో ఐఫోన్‌ అసెంబ్లింగ్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. పరిమిత సంఖ్యలో ఇక్కడ తయారైన ఐఫోన్‌ ఎస్‌ఈ మోడల్‌ ఫోన్లను గత మే నుంచీ కొన్ని ఎంపిక చేసిన స్టోర్లలో అమ్మారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆపిల్‌ తమ కార్యాలయాలను నెలకొల్పబోతోంది. దీంతో మనకు కాస్త తక్కువ ధరకే ఐఫోన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆశపడుతున్నారు అభిమానులు.

ఆపిల్‌ విశేషాలు! 

ఐఫోన్‌తో అంతర్జాలాన్ని మనిషి జేబులోకి తెచ్చిన ఆపిల్‌ గత పదేళ్లలో సంపాదించిన ఆదాయం దాదాపు రూ.64 లక్షల కోట్లు. నికర లాభమే రూ.21 లక్షల కోట్లు. ఆదాయంలో 60 శాతం అచ్చంగా ఐఫోన్‌తో వచ్చిందే. దానివల్లే ఆపిల్‌ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మారింది.
* అమెజాన్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌... ఈ మూడిటి లాభాలూ కలిపితే ఎంత మొత్తమో దానికన్నా ఆపిల్‌ లాభం ఒకటిన్నర రెట్లు ఎక్కువ.
* 2008లో 500 ఆప్‌లతో ప్రారంభమైన ఆప్‌స్టోర్‌లో ఇప్పుడు 21 లక్షల ఆప్‌లున్నాయి.
* ఆప్‌ తదితర సేవల ద్వారానే గత ఏడాది లక్షన్నర కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చింది.
* ఐఫోన్‌కి సంబంధించి ఇప్పటికే 200లకు పైగా పేటెంట్లు ఉన్నాయి.
* ఐఫోన్‌ వచ్చాక ఫొటోలు, వీడియోలు నిత్యజీవితంలో భాగమయ్యాయి. ఏటా ప్రపంచవ్యాప్తంగా తీస్తున్న ఫొటోల్లో 85 శాతం స్మార్ట్‌ ఫోన్లతో తీసినవే. ఫొటోగ్రఫీలో ఐఫోనోగ్రఫీ అన్న పదం చేరింది.
* ఆఖరికి బబుల్‌గమ్‌, చూయింగ్‌గమ్‌లాంటి వాటి అమ్మకాల పైనా ఐఫోన్‌ ప్రభావం పడింది. ఇది వచ్చాక వాటి అమ్మకాలు 15 శాతం పడిపోయాయట. సూపర్‌మార్కెట్లో బిల్లు చెల్లించడానికి లైన్లో నిలబడినప్పుడు చాలామంది వీటిని కొనుక్కునేవారు. ఇప్పుడు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయడం వల్ల ఈ అమ్మకాలు తగ్గిపోయాయట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.