close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మా మంచి మాస్టారు!

మా మంచి మాస్టారు!

గురువూ దైవం... ఇద్దరూ ఒకేసారి నా ఎదుట ప్రత్యక్షమైతే దైవం గురించి తెలిపే గురువుకే ముందుగా నమస్కరిస్తానన్నాడు కబీర్‌ దాస్‌. అమ్మానాన్నలు ప్రాణం పోస్తే... ఆ ప్రాణికి జీవన విలువలు నేర్పి వ్యక్తిగా మలిచేది గురువే. ఉద్యోగాన్ని ఉపాధిగా కాక గురుతరమైన బాధ్యతగా భావించి అంకితమయ్యే ఉపాధ్యాయులకూ... సొంత సమయాన్నీ సంపాదననీ కేటాయించి విద్యార్థుల సంక్షేమానికై తపించే సేవామూర్తులకూ... అసలు బోధన తమ వృత్తి కాకపోయినా, చదువుకునే పరిస్థితులు లేని పిల్లలకోసం ఉపాధ్యాయుల అవతారం ఎత్తి విద్యాదానం చేస్తున్నవారికీ... ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ...

మైక్రోసాఫ్ట్‌ లేని ప్రపంచాన్ని వూహించగలమా ఇప్పుడు? బిల్‌ గేట్స్‌ మాత్రం ‘వాళ్లే లేకపోతే నేనూ లేను... మైక్రోసాఫ్టూ లేదు’ అంటారు. ఆయన ఇప్పటికీ తలచుకునేది తన చిన్ననాటి లెక్కల టీచర్ని, డ్రామా టీచర్ని. ఒకరు అంకెలను ప్రేమించేలా చేస్తే మరొకరు జీవితం పట్ల తన దృక్పథాన్ని మార్చారంటారాయన.
బిల్‌ గేట్స్‌కే కాదు... స్ఫూర్తినిచ్చి మార్గనిర్దేశం చేసిన మంచి మాస్టార్లు ప్రతి వ్యక్తి జీవితంలోనూ తప్పనిసరిగా ఉంటారు. అది బడిలో పాఠాలు చెప్పిన టీచరు కావచ్చు! ఇంట్లో ట్యూషన్‌ చెప్పిన మాస్టారు కావచ్చు! సేవాభావనతో చేయందించిన గురువు కావచ్చు...
అందరి లక్ష్యం ఒకటే, పిల్లలందరూ చక్కగా చదువుకుని గొప్పగా ఎదగాలన్నదే. అలాంటి కొందరు మంచి మాస్టార్ల గురించి...

ఒక్కడే... బడిని నిలబెట్టాడు! 

తెల్లని చొక్కా, నెరిసిన తల, చెరగని చిరునవ్వు... వూరివాళ్లకు ఆయన సుపరిచితులు. పిల్లలన్నా బడి అన్నా ఆయనకు ప్రాణం అని మాత్రమే వారికి తెలుసు. అయితే మూతబడిపోతున్న ఒక పాఠశాలను నిలబెట్టడానికి ఆయన ఏం చేశాడో, అందుకు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు. ఎలాగైతేనేం... ఆయన మాత్రం అనుకున్నది సాధించారు. మూసేసిన బడి తలుపులు తెరుచుకునేలా చేశారు. అందుకు ముంజ వెంకట్రాజం ఏం చేశారంటే...

వరంగల్‌ స్టేషన్‌రోడ్డులో ఉంటుంది సుశీలాదేవి ప్రభుత్వ ఉన్నత పాఠశాల. 1958లో ఆకారపు రాజ చెన్న విశ్వేశ్వర్‌రావు స్థాపించిన ఈ (ఎయిడెడ్‌) పాఠశాలలో సీటు దొరకాలంటే ఒకప్పుడు పెద్దల సిఫార్సు కావాల్సి వచ్చేది. 20 మందికి పైగా ఉపాధ్యాయులూ, వందలాది విద్యార్థులతో కళకళలాడిన బడి ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల ధాటికి క్రమంగా వైభవాన్ని కోల్పోయింది. విద్యార్థులు తగ్గిపోవడంతో అధికారులు రెండేళ్ల క్రితం పాఠశాలను మూసేసి అందులో మిగిలి ఉన్న ఒకరిద్దరు విద్యార్థులను మరో పాఠశాలలో చేర్పించారు. ఉపాధ్యాయులను బదిలీచేశారు. కానీ వెంకట్రాజానికి ఆ పాఠశాల వదిలి వెళ్లడానికి మనసు రాలేదు. తానే పాఠశాలను నడిపిస్తానని అధికారులను బతిమాలుకున్నారు. వారు సరేననడంతో వెంటనే రంగంలోకి దిగి స్థానిక అండర్‌బ్రిడ్జి దగ్గరున్న పేదల గుడిసెలకు వెళ్లారు వెంకట్రాజం. పిల్లలను పాఠశాలకు పంపించేలా తల్లిదండ్రులను ఒప్పించారు. అలా, మూసిన బడిని మరుసటి నెలలోనే నలుగురు పిల్లలతో తెరిచారు. కొన్నాళ్లు రోజూ తానే ఇల్లిల్లూ తిరిగి పిల్లల్ని చేయిపట్టుకుని తీసుకొచ్చేవారు. తర్వాత సొంత ఖర్చుతో ఆటో మాట్లాడి పిల్లలను తీసుకొచ్చేవారు. క్రమంగా పిల్లల సంఖ్య పెరిగింది. బడిలో పాఠాలు చెప్పడానికి సొంత డబ్బు నుంచి జీతం ఇచ్చి ఇద్దరు టీచర్లను నియమించారు. పిల్లలకు మధ్యాహ్న భోజనమూ పెడుతున్నారు. అలా మూతపడిందనుకున్న పాఠశాలను తిరిగి నిలబెట్టి యాజమాన్యంతో పాటు అధికారుల మన్ననలనూ అందుకున్నారు వెంకట్రాజం.

- న్యూస్‌టుడే, శివనగర్‌

ట్యూబు మాస్టారు

మాస్టారు వస్తున్నాడంటే పిల్లలంతా గప్‌చుప్‌గా తరగతి గదికి పరుగులు తీస్తారు. కానీ ఈ మాస్టారికి మాత్రం స్వాగతం చెప్పడానికి వారంతా రోజూ నది ఒడ్డున వేచి చూస్తారు. సాయంత్రం మళ్లీ సాగనంపుతారు కూడా. ఎందుకలా? ఓ ప్లాస్టిక్‌ బ్యాగు, చెప్పులు చేత్తో పట్టుకుని నదిలో ఈదుకుంటూ బడికి వెళ్తాడు అబ్దుల్‌ మలిక్‌. అతడు కేరళలోని మలప్పురం ప్రాథమిక పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు. మలప్పురం చుట్టూ నది ప్రవహిస్తుంటుంది. రోడ్డుమార్గంలో ఆ వూరు వెళ్లిరావడానికి 4 గంటలు పడుతుంది. దానికన్నా నది ఈదడం తేలికనుకున్నాడు అబ్దుల్‌. కిలోమీటరు వెడల్పున్న నదిని పావుగంటలో ఈది బడికి చేరుకుంటాడు. రెండు దశాబ్దాలుగా అబ్దుల్‌ దినచర్య అదే. నడుముకి ఒక రబ్బరు ట్యూబు తగిలించుకుని ఈదుకుంటూ వచ్చే ఆయన్ని పిల్లలు ట్యూబు మాస్టారు అని పిలుచుకుంటారు. ఇంతకష్టపడి అబ్దుల్‌ ఆ ఉద్యోగమే చేయడానికి కారణం... అబ్దుల్‌కి చిన్న పిల్లలన్నా, వారికి పాఠాలు చెప్పడమన్నా చాలా ఇష్టం. పదో తరగతి పాసైనప్పటినుంచే టీచరు ఉద్యోగానికి శిక్షణ పొందడం ప్రారంభించాడు. సోదరులు గల్ఫ్‌ వెళ్లి సంపాదిస్తూ అబ్దుల్‌ని పైచŒదువులు చదువుకోమన్నా వినకుండా తనకిష్టమైన టీచరు ఉద్యోగం సంపాదించాడు. ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా సమయానికి బడికి వచ్చే అబ్దుల్‌ని చూసి వూరివాళ్లు సమయం నిర్ధారించుకుంటారట. అబ్దుల్‌ నది ఈది బడికి వెళ్తున్న విషయం వార్తాపత్రికల్లో చూసిన ఓ ప్రవాసభారతీయుడు అతనికి ఒక పడవ కొనిచ్చాడు. ఆటుపోట్లు ఎక్కువగా ఉండే నదిలో పడవప్రయాణం ప్రమాదకరమంటాడు అబ్దుల్‌. ఒంట్లో బాగున్నన్నాళ్లూ తన బడినీ పిల్లలనూ వదలననే అబ్దుల్‌ పిల్లలకీ నీరంటే భయం పోగొట్టి ఈత నేర్పుతుంటాడు కూడా. ప్రకృతితో మమేకమై జీవించడం పిల్లలకు నేర్పాలనే ఈ ఉపాధ్యాయుడు ఏం చెప్పినా ఆ వూరివారికి వేదవాక్కే. తమ వ్యక్తిగత విషయాలైనా, వూరి విషయమైనా అతని సలహా తీసుకోకుండా ఏ పనీ చేయరు.

ఆమెకు ఆరువందల మంది పిల్లలు

ప్రధానోపాధ్యాయురాల్ని చూసి పిల్లలు భయపడరు. కష్టసుఖాలు చెప్పుకుంటారు. ఇష్టంగా చదువుకుంటారు. వారి తల్లిదండ్రులూ అంతే. పిల్లల్ని ఆమెకు అప్పగించి నిశ్చింతగా ఉంటారు. ఆరువందలమందికి పైగా ఉన్న గిరిజన సంక్షేమశాఖ బాలికల ఆశ్రమ పాఠశాలకి ప్రధానోపాధ్యాయురాలైన అంపిలి లిల్లీరాణి పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు. ఆదివారాలూ సెలవులూ పండగలూ అన్నీ వారితోనే. పొద్దున్నే 8గంటల కల్లా బయల్దేరి బడికి వస్తే తిరిగి రాత్రి తొమ్మిదింటికే ఇంటికి వెళ్లడం. అమ్మానాన్నల్ని టీచర్లుగా చూసిన లిల్లీరాణి ఎంతో ఇష్టంగా సైన్సు టీచరయ్యారు. నిత్యజీవితంలో సైన్సు ఉపయోగాలనే పాఠాలుగా చెప్తూ పిల్లలకు చేరువయ్యారు. మన్యంలో డిజిటల్‌ బోధనకు శ్రీకారం చుట్టిన తొలి టీచర్‌ ఆమే. ఇపుడు శ్రీకాకుళం జిల్లా సీతంపేటలోని హడ్డుబంగిలో ఆమె పాఠశాలకు అంకితమైన తీరు తల్లిదండ్రుల మనసు దోచుకోవడంతోపాటు అధికారుల ప్రశంసలనూ అందుకుంది. పాలనా వ్యవహారాలు చూసుకుంటూనే రోజూ కొన్నిగంటలు తప్పనిసరిగా పిల్లలతో గడుపుతారామె. సన్నిహితంగా ఉండి వారి సామర్థ్యాలు తెలుసుకుని తదనుగుణంగా ప్రోత్సహిస్తారు. నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి పిల్లలతో చిన్న చిన్న కమిటీలు వేసి బాధ్యతలు అప్పజెప్పారు. హెల్త్‌ కమిటీ పిల్లలకు తెల్లకోట్లూ కొనిచ్చారు. వాళ్లు అవి ధరించి డాక్టరవ్వాలన్న స్ఫూర్తి పొందుతోంటే, వారిలో ఒక్కరు డాక్టరైనా తన ప్రయత్నం ఫలించినట్లేనంటారు లిల్లీరాణి. పిల్లలకు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయిస్తారు. పాఠశాల, వసతిగృహాలను సకల వసతులతో తీర్చిదిద్దడమే కాక, 8 ఎకరాల ప్రాంగణాన్ని చక్కని తోటగా అభివృద్ధి చేశారు. అందులో పండించే కూరగాయలనే వసతిగృహంలో వినియోగిస్తారు. తద్వారా వచ్చిన ఆదాయంతో పిల్లలకు కావలసినవి కొంటారు. గిరిజనులు సంగీత ప్రియులని వారికి పాటల సీడీలు కొనిపెట్టారు. కుట్టు మిషన్లు కొని ఆసక్తి ఉన్న పిల్లలకు నేర్పిస్తున్నారు. పిల్లలకు ఇంటిపై ధ్యాస మళ్లి, చదువు మానేయకూడదన్న లక్ష్యంతో వారిని సంతోషంగా ఉంచడం కోసం ఆమె పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. నిధులు చాలకపోతే సొంత డబ్బే ఖర్చుపెడతారు. పిల్లలు సాధించిన ప్రతి విజయాన్నీ ప్రశంసిస్తూ మిఠాయిలు పంచుతారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపించే వ్యాధుల గురించి విద్యార్థులకే కాక గ్రామాల్లోనూ అవగాహన కల్పిస్తారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ఆమె తరచూ సమావేశమవుతారు.

- న్యూస్‌టుడే, సీతంపేట

వంతెన కింద... ఓ విద్యాలయం!

యన వృత్తి రీత్యా టీచరు కాదు, వ్యాపారస్తుడు. ఉపాధ్యాయ వృత్తితో ఏమాత్రం సంబంధం లేని రాజేశ్‌ కుమార్‌ శర్మ దిల్లీలోని మెట్రో వంతెన కింద ఓ పాఠశాల తెరిచారు. దాదాపు 300 మంది పిల్లలు అక్కడ అక్షరాలు దిద్దుతుంటారు. ఆర్థిక పరిస్థితుల వల్ల ఇంజినీరింగ్‌ సగంలో వదిలేసిన రాజేశ్‌కి చదువు విలువ బాగా తెలుసు. మురికివాడల్లో పిల్లలు చదువూ సంధ్యా లేకుండా తిరగడం ఆయనకు బాధ కలిగించింది. 2006లో ఆ పిల్లలందరినీ సమీకరించి అక్షరాలు దిద్దించడం ప్రారంభించారు. తన పలుకుబడిని ఉపయోగించి పిల్లలకు అవసరమైన సామగ్రిని విరాళాల రూపంలో సేకరిస్తారు. పిల్లలందరినీ దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తారు. స్కూల్లో వారు నేర్చుకున్నదానికి రాజేశ్‌ తన పాఠాలతో మెరుగుపెడతారు. పొద్దున్నా సాయంత్రమూ రెండేసి గంటల చొప్పున ఆయన ఆంగ్లం, గణితం, సైన్సు లాంటి సబ్జెక్టుల్లో పాఠాలు చెప్తారు. పిల్లలే ఆ ప్రాంతమంతా శుభ్రంచేసుకుని చాపల మీద కూర్చుని చదువుకుంటారు. వంతెన గోడలనే బ్లాక్‌బోర్డులుగా మార్చారు రాజేశ్‌. తల్లిదండ్రులు పనులకు వెళ్లిపోవడంతో ఆలనా పాలనా లేక ఒకప్పుడు పాఠశాల మొహమే చూడని ఆ పిల్లలంతా ఇప్పుడు చక్కగా చదువుకుంటున్నారు. రాజేశ్‌ నిస్వార్థ సేవ చూసి స్ఫూర్తిపొందిన కొందరు యువకులు కూడా వచ్చి ఇక్కడ పాఠాలు చెప్తుంటారు. ఈ వంతెనకింద పాఠశాలకి ఇప్పుడు దిల్లీలో ఎంత పేరొచ్చిందంటే చుట్టుపక్కల ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న పేద కుటుంబాలవారు కూడా తమ పిల్లల్ని సైకిల్‌పైన తీసుకొచ్చి రాజేశ్‌ దగ్గర దించి పనులకు వెళ్తున్నారు. ఫీజులు కట్టి పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలకూ ట్యూషన్లకూ పంపలేని నిరుపేదలకు రాజేశ్‌ నడుపుతున్న వంతెన కింద బడి ఓ వరం.

సైన్స్‌ పాఠం అరవింద్‌ టాయ్స్‌తో

ర్త లేకపోయినా నలుగురు కొడుకుల్నీ కష్టపడి చదివించింది ఆ తల్లి. ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదివి టెల్కోలో ఉద్యోగం వస్తే ఎగిరిగంతేయకపోగా ఆ ఉద్యోగం మానేసి తనకు నచ్చిన పని చేస్తానన్నారు అరవింద్‌ గుప్తా. నిరక్షరాస్యురాలైనా తల్లికి అతడి మనసు అర్థమైంది. సరేనంది. సోదరులంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటే అరవింద్‌ మాత్రం మూడు దశాబ్దాలుగా సైన్సు పాఠాలు చెప్తున్నారు. ఒకసారి ఆయన పాఠం విన్న పిల్లలెవరూ మళ్లీ మళ్లీ కావాలని అడగకుండా ఉండరు. ఎందుకంటే పనికిరాని వస్తువులతో పనికొచ్చే ప్రయోగాలను క్షణాల్లో చేసేసి ఆయన పిల్లల్ని అబ్బురపరుస్తుంటారు. పరిమిత వనరులతో అపరిమిత ఫలితం పొందవచ్చన్న విషయం పిల్లలకు నేర్పడానికి తానీ మార్గాన్ని ఎంచుకున్నానంటారు అరవింద్‌.
విజ్ఞానశాస్త్రాన్ని అర్థం చేసుకోవాలన్నా, అందులో పై చదువులు చదవాలన్నా ఆంగ్ల మాధ్యమంలో చదివే ఉన్నత వర్గాలవారికే సాధ్యమవుతుందన్న అపోహను అరవింద్‌ కొట్టిపడేస్తారు. అరవింద్‌గుప్తాటాయ్స్‌.కామ్‌ పేరుతో సొంత వెబ్‌సైట్‌ ప్రారంభించిన ఆయన పలు ప్రాంతీయ భాషల్లో సైన్సు ప్రయోగాలను వీడియోలుగా రూపొందించి అందులో పెట్టారు. వందలాది సైన్సు పుస్తకాలను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా ఉంచారు. 12 భాషల్లో సైన్సు ప్రయోగాల వీడియోలు, ఫొటోలు ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. తాను వెళ్లిన ప్రతి చోటా ఈ-బుక్స్‌ ఉన్న సీడీలను పిల్లలకు పంచుతారు. ‘ప్రతి విద్యార్థి కళ్లలో ఓ కలను చూస్తాను. ఆ కల నాకు భవిష్యత్తు పట్ల ఆశ కలిగిస్తుంది. అందుకే ఈ పని నాకు అంత ఇష్టం...’ అనే అరవింద్‌ గాంధీ సిద్ధాంతాలను మనసా వాచా ఆచరిస్తారు. అరవింద్‌ కృషిని యునెస్కో, యునిసెఫ్‌, ఇంటర్నేషనల్‌ టాయ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌, బోస్టన్‌ సైన్స్‌ సెంటర్‌, వాల్ట్‌ డిస్నీ ఇమేజినీరింగ్‌ అండ్‌ రీసెర్చ్‌... లాంటి సంస్థలు గుర్తించి గౌరవించాయి.

విమలా టీచర్‌... వయసు 80 ప్లస్‌

నిమిది పదుల వయసులో ఎవరైనా ఏం చేస్తారు? వచ్చే పింఛనుతో కాలక్షేపం చేస్తూ మునిమనవలతో ఆడుకుంటారు. కానీ విమలా కౌల్‌ అలా చేయడంలేదు. రాజధాని నగర బస్తీలో ఆమె ఓ పాఠశాల నిర్వహిస్తోంది. దాని పేరు ‘గుల్‌దస్తా’. అంటే పుష్పగుచ్ఛం అని అర్థం. పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలలుండగా ఈ వయసులో ఎందుకంత శ్రమ తీసుకుంటున్నారని అందరూ ఆమెను అడుగుతుంటారు. ఉన్నత విద్యావంతులైన విమల, ఆమె భర్త ఎంతో ఇష్టంతో బోధనా వృత్తిని ఎంచుకుని కళాశాలల్లో అధ్యాపకుల్లా పనిచేశారు. అది 1995 నాటి సంగతి. రిటైరైన ఆ జంట ఏం చేయాలా అని ఆలోచిస్తూ దగ్గర్లోని ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడి సమస్యల గురించి పెద్దలతో చర్చిస్తుండగా అల్లరి చేస్తున్న పిల్లలకు విమల బిస్కట్లు పంచారు. అది చూసిన ఓ మహిళ ‘పిల్లలకు బిస్కట్లు పెడితే సరిపోదు, వాటిని సంపాదించడమెలాగో వారికి నేర్పాలమ్మా...’ అని చెప్పిందట. ఆ మాట విమలని ఆలోచింపచేసింది. ఫలితంగా వెలసిందే ‘గుల్‌దస్తా’. అయితే అదేమంత తేలిగ్గా జరగలేదు. తాము నివసిస్తున్న చోట స్కూలు పెట్టడానికి ఇరుగుపొరుగు అంగీకరించకపోవడంతో మున్సిపల్‌ పార్కులో నిర్వహించారు కొన్నాళ్లు. ఆ తర్వాత పిల్లలు ఉండే బస్తీలోనే నాలుగు గదుల్లోకి పాఠశాలను మార్చారు. భర్త మరణించినా విమల మాత్రం బోధన కొనసాగిస్తున్నారు. పాఠశాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఓ ఎన్జీవోను ప్రారంభించారామె. ‘ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపరు. వారి సామర్థ్యంతో సంబంధం లేకుండా పై తరగతికి పంపిస్తారు. ఫలితంగా పిల్లలు పదోతరగతికి వచ్చేస్తారు కానీ వారికి కనీస స్థాయి లెక్కలు, ఆంగ్లం రావు...’ అంటారు విమల. అందుకే ఆమె కొందరు వలంటీర్ల సహాయంతో ఇక్కడ పిల్లలకు ఆంగ్లం, గణితం, సైన్సు పాఠాలు బోధిస్తున్నారు. తన దగ్గర చదువుకున్న పిల్లలు పెద్దవాళ్లై ఉద్యోగాల్లో చేరుతుంటే చూసి మురిసిపోతున్నారు ఈ టీచరు.

పాఠాల ఫార్మాట్‌ మార్చేశాడు!

మలేశ్‌ జపాడియా ఉండేదీ పనిచేసేదీ ఓ మారుమూల పల్లెటూళ్లొ. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడి ఉద్యోగం. పాఠశాల సంగతి పక్కన పెడితే ఇంట్లోనూ కరెంటు సరఫరా అంతంత మాత్రమే. పరిస్థితులు సహకరించడం లేదని అతను వూరుకుండిపోలేదు. బడి అయిపోయాక రోజూ 20కి.మీ. దూరంలో ఉన్న పట్టణానికి వెళ్లివచ్చేవాడు. ఎందుకో తెలుసా? అక్కడ సైబర్‌ కేఫ్‌లో పనిచేసుకోవడానికి. అక్కడ అతనేం చేశాడంటే...
పల్లెల్లో పిల్లలను బడికి వచ్చేలా చేయడం ఒకెత్తు అయితే వారు మధ్యలో బడి మానకుండా చూసుకోవడం మరో ఎత్తు. అందుకు ఉపాధ్యాయులు చాలా కష్టపడాలి. పిల్లల్ని ఆకట్టుకునేలా పాఠాలు చెప్పడం ఉపాధ్యాయులకు సవాలే. టీవీలో ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమాన్ని ఆసక్తిగా చూస్తున్న పిల్లల్ని చూస్తే కమలేశ్‌కి ఓ ఆలోచన వచ్చింది. పాఠాలంటే విసుక్కునే పిల్లలు అవే విషయాలను టీవీలో చెప్తే ఆసక్తిగా వింటున్నారు. దాంతో పాఠాలన్నింటినీ అతడు క్విజ్‌ తరహా ఫార్మాట్‌లోకి మార్చేశాడు. పాఠ్యాంశాలేవీ పొల్లు పోకుండా ప్రశ్న- జవాబుల రూపంలోకి తెచ్చేశాడు. ‘ఎడ్యుసఫర్‌.కామ్‌’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ని రూపొందించి వాటిని అందులో పొందుపరిచాడు. ఆన్‌లైన్‌లో క్విజ్‌ అంటే పిల్లలకు సరదా. ఆ సరదాతోనే ఉత్సాహంగా బడికొచ్చి పాఠాలూ నేర్చేసుకుంటున్నారు. కంప్యూటర్‌లో పాఠాలు పరీక్షల్లోనూ మంచి ఫలితాలే తెస్తున్నాయి. కమలేశ్‌ ప్రయత్నాన్ని అహ్మదాబాద్‌ ఐఐఎం సృజనాత్మకయత్నంగా గుర్తించి ప్రశంసించింది. గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం సైతం అతడిని సన్మానించింది. ఈ పాఠ్యాంశాలను సీడీల్లోకి డౌన్‌లోడ్‌ చేసి జిల్లాలోని అన్ని పాఠశాలలకూ ఇస్తోంది జిల్లా విద్యాశాఖ. ఇదంతా కమలేశ్‌ సొంత ఖర్చుతో, అదనపు గంటలు పనిచేసి సాధించాడు. ఒక ప్రైమరీ స్కూల్‌ టీచర్‌నుంచి ఎవరైనా ఇలాంటి పని ఆశించగలరా?!

పిల్లల దగ్గరికే బడి!

దూరంగా విసిరేసినట్లున్న పల్లెలు. ఎక్కడో పది కిలోమీటర్ల అవతల బడి. పెద్దలు పనులకు వెళ్లిపోతే పిల్లలు బడికెలా వెళ్తారు? ఈ ఆలోచన ఆదిత్యకుమార్‌ని ‘సైకిల్‌ గురూజీ’ని చేసింది. యూపీలోని లఖ్‌నవూకి చెందిన ఆదిత్య పాఠాలు చెప్పడానికి అవసరమైన సరంజామా అంతా సైకిల్‌మీద తీసుకుని నిరుపేదల బస్తీలకూ, పల్లెలకూ వెళ్తాడు. ఎక్కడ పది మంది పిల్లలు కనబడితే అక్కడ ఆగి వారికి అక్షరాలు నేర్పిస్తాడు. కథలు చెప్పి నవ్విస్తాడు. మళ్లీ తాను వచ్చేసరికి ఏం నేర్చుకోవాలో చెప్తాడు. పిల్లలు కూడా ఈ సైకిల్‌ గురూజీ రాకకోసం వేచిచూస్తుంటారు. కాస్త చదవడం వచ్చిన పిల్లలను ప్రోత్సహించి బడిలో చేర్పిస్తాడు. 1995 నుంచీ అతడీ అక్షరాస్యతా యజ్ఞం నిర్వహిస్తున్నాడు. డిగ్రీ చదివిన ఆదిత్య ఉద్యోగం చేసుకోక ఎందుకీ పనిచేస్తున్నాడూ అంటే ‘జీవితానికి చదువు ఎంత అవసరమో నాకు తెలుసు కాబట్టి...’ అంటాడతను. పేద కుటుంబం కావడంతో చిన్నవయసులోనే ఆదిత్యని అతని తండ్రి పనిలో పెట్టాడు. దాంతో ఇంట్లోనుంచి పారిపోయి పట్నం చేరాడు ఆదిత్య. చదువుకోవాలన్న అతని పట్టుదల చూసి ఓ ఉపాధ్యాయుడు చేరదీసి చదివించాడు. అందుకే తానూ సాధ్యమైనంత మందిని అక్షరాస్యుల్ని చేయాలన్న ఆదర్శంతో ఇలా సైకిల్‌ గురూజీ అవతారం ఎత్తాడు ఆదిత్య. ‘పిల్లలందరూ బడికెళ్లే పరిస్థితులు లేనిచోట బడే పిల్లలదగ్గరికెళ్లాలి మరి...’ అంటాడతను.

పదహారేళ్లకే హెడ్మాస్టారయ్యాడు! 

పాధ్యాయుడిగా కొన్ని సంవత్సరాల అనుభవం సంపాదించినవారే ప్రధానోపాధ్యాయులు అవుతారు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన బాబర్‌ అలీ మాత్రం పదహారేళ్లకే హెడ్మాస్టారు అయ్యి బీబీసీ చేత ‘ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కుడైన ప్రధానోపాధ్యాయుడు’ అనిపించుకున్నాడు. బాబర్‌కి పాఠాలు చెప్పడం అంటే ఎంతిష్టమంటే తొమ్మిదేళ్ల వయసులో తన ఇంటి వాకిట్లోనే బడి మొదలుపెట్టాడు. స్కూలునుంచి రాగానే బడికి వెళ్లని పిల్లల్ని పోగుచేసి పాఠాలు చెప్పేవాడు. కూర్చోబెట్టి అక్షరాలు దిద్దించేవాడు. అలా మొదలైన ‘ఆనంద శిక్షా నికేతన్‌’ ఇప్పుడు 300 మంది పిల్లలతో కళకళలాడుతోంది. బాబర్‌ ప్రధానోపాధ్యాయుడు కాగా మరో పదిమంది టీచర్లున్నారు. పిల్లలెవరూ రూపాయి ఫీజు కట్టరు. టీచర్లెవరూ రూపాయి జీతం తీసుకోరు. చదువుచెప్పాలన్న తపన టీచర్లది. నేర్చుకోవాలన్న జిజ్ఞాస పిల్లలది. ఇవి రెండూ ఉంటే అవసరమైన వస్తువులు వాటంతటవే వస్తాయని వీరి పాఠశాల రుజువు చేసింది. 8వ తరగతి వరకు ఉన్న ఆ బడిని ప్రభుత్వం అన్‌ఎయిడెడ్‌ పాఠశాలగా గుర్తించింది. ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి ‘ఇండియన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’, ‘రియల్‌ హీరో’ లాంటి ఎన్నో అవార్డులు పొందిన పాతికేళ్ల బాబర్‌ అలీ టెడ్‌ ప్రసంగాలూ చేస్తుంటాడు. అతడి గురించి మనదేశంలో సీబీఎస్‌ఈ సిలబస్‌లోనే కాక, యూరోప్‌లోని లగ్జెంబర్గ్‌ అనే దేశంలోనూ పాఠ్యాంశంగా పేర్కొనడం విశేషం.

ఐదువేలమందికి విద్యాదానం

తండ్రి స్ఫూర్తితో తానూ సమాజానికి ఏదైనా చేయాలన్న తపన ఓ ఇల్లాలిని ఐదువేల మందికి విద్యాదానం చేసేందుకు ప్రేరేపించింది. గుజరాత్‌కు చెందిన బీనారావు సూరత్‌లోని మురికివాడల పిల్లలకు ఉచితంగా ట్యూషన్‌ చెప్పడం ప్రారంభించారు. సంగీతకారుడైన ఆమె తండ్రి అంధవిద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం చూసిన ఆమె ఈ తొలి అడుగు వేశారు. అదే నేడు ‘ప్రయాస్‌’ అనే స్వచ్ఛంద సంస్థగా మారి వందలాది విద్యార్థులకు విద్యాదాత అయింది. సరైన భాష కూడా మాట్లాడడం రాని మురికివాడల పిల్లలు ఇప్పుడు శుభ్రంగా తయారై బడికి వెళ్లడమే కాదు, చక్కని ఆంగ్లంలో సభ్యతగా మాట్లాడగలుగుతున్నారంటే అది బీనా చలవే. 2006లో ఇద్దరు ముగ్గురు పిల్లలతో ప్రారంభమైన ప్రయాస్‌కి ఇప్పుడు సూరత్‌లోనే వేర్వేరు ప్రాంతాల్లో 8 శిక్షణ కేంద్రాలున్నాయి. 34 మంది వలంటీర్లు అక్కడ పాఠాలు చెబుతారు. 1200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యాహక్కు చట్టం అమల్లోకి రావడంతో పలు పాఠశాలల్లో విద్యార్థులను ఉచితంగా చేర్పించుకుంటున్నా, బోధనలో మాత్రం వారి పట్ల శ్రద్ధ చూపడం లేదన్న విషయం బీనారావు గమనించారు. అందుకే ఆమె పాఠశాల సిలబస్‌కి అనుబంధంగా పాఠాలు రూపొందించి విద్యార్థుల సామర్థ్యం మెరుగయ్యేందుకు కృషిచేస్తున్నారు. ‘ప్రయాస్‌’ కేంద్రాలన్నిటిలోనూ 3 - 8 తరగతుల మధ్య ఉన్న పేద విద్యార్థులకు పూర్తి ఉచితంగా పాఠాలు చెప్తారు. దాంతో అర్థాంతరంగా చదువు మానేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. పాఠాలతో పాటు నైతిక విలువలూ నేర్పిస్తారు.

దో గురుకులం. ధ్యానం, యోగా, చదువు, తోటపని, నిద్ర... అంతా నియమబద్ధమైన జీవితం. పిల్లలందరూ ఎంతో బుద్ధిగా గురువుగారు చెప్పినట్లు వింటూ పాఠాలు నేర్చుకుంటారు. అలాంటిది, ఓరోజు ఆశ్రమంలో ఒక పిల్లవాడు దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. అది చూసిన మిగతా పిల్లలు గురువుగారికి ఫిర్యాదుచేశారు. ఆయన విని వూరుకున్నారు తప్ప ఆ పిల్లవాడిని ఏమీ అనలేదు. కొన్నాళ్ల తర్వాత ఆ అబ్బాయి మరోసారి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. ఈసారీ గురువుగారు మౌనంగా విన్నారే తప్ప ఆ పిల్లవాడిని కోప్పడలేదు. తప్పుచేసినవాడిని గురువుగారు శిక్షించడంలేదని పిల్లలకు కోపం వచ్చింది. దాంతో, ఆ పిల్లవాడిని వెంటనే ఆశ్రమం నుంచి పంపించివేయాలనీ లేకపోతే తామంతా వెళ్లిపోతామనీ పట్టుబట్టారు. అప్పుడు గురువుగారు నవ్వుతూ ‘మంచిది నాయనా, మీరంతా విజ్ఞులయ్యారు. మంచీ చెడూ తెలుసుకున్నారు. మీరు మరెక్కడికైనా వెళ్లి విద్య నేర్చుకోగలరు. కానీ వాడికి ఇంకా ఏది మంచో ఏది చెడో తెలియలేదు. అవన్నీ నేను కాకపోతే ఎవరు చెబుతారు వాడికి? అందుకే విజ్ఞత తెలిసేవరకూ వాడు ఇక్కడే ఉంటాడు. మీరు వెళ్లిరండి’ అని చెప్పారు శాంతంగా. 

ఎందరో గురుదేవులు... అందరికీ వందనాలు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు