close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సృష్టికి ప్రతిసృష్టి... సిమ్యులేటర్‌!

సృష్టికి ప్రతిసృష్టి... సిమ్యులేటర్‌!

యుద్ధాలు జరుగుతాయి. కానీ ప్రాణ హాని ఉండదు. భూకంపాలు వస్తాయి. కానీ ఒక్క ఇటుక కూడా కింద పడదు. రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయి. కానీ ఎవరికీ చిన్న గాయం కాదు. శస్త్రచికిత్సలు పూర్తవుతాయి. కానీ ఒక్క రక్తం చుక్కా నేల రాలదు. అదంతా ‘సిమ్యులేటర్ల’ మాయ. వాస్తవానికీ, వూహకూ మధ్య వారధిలా నిలిచే ‘సిమ్యులేటర్లు’, విద్య, వైద్యం, రక్షణ, పరిశ్రమలూ, అంతరిక్ష పరిశోధనలూ లాంటి ఎన్నో రంగాల ప్రగతిని శాసిస్తున్నాయి.

పూర్వకాలంలో జంతువులని వేటాడటం రాజులకో వినోద క్రీడ. అలాగని సాధన లేకుండా అడవికెళ్లి నేరుగా పులికి బాణం గురిపెట్టడం ప్రాణాలకే ప్రమాదం. అందుకే కళాకారులకు చెప్పి అచ్చం పులిని పోలిన బొమ్మల్ని తయారు చేయించుకునేవాళ్లు. వాటికింద చక్రాల్ని అమర్చేవాళ్లు. ఉద్యానవనంలో భటులు ఆ చక్రాల బొమ్మని తాళ్ల సాయంతో చెట్ల మధ్యలో నుంచి లాగుతుంటే, రాజు గురి చూసి ఆ కదిలే బొమ్మను కొట్టడానికి ప్రయత్నించేవాడు. ఇక్కడ ఆ ఉద్యానవనం అడవికి ‘సిమ్యులేటర్‌’. ఆ కదిలే బొమ్మ పులికి ‘సిమ్యులేటర్‌’.

చిన్నప్పుడు చాలామంది బిజినెస్‌ ఆట ఆడే ఉంటారు. బొమ్మ కరెన్సీ నోట్లతో అమ్మడం, కొనడం, అప్పులివ్వడం లాంటి ఆర్థిక లావాదేవీలు ఆ ఆటలో భాగంగా జరిగేవి. ఆట ముగిసేసరికి ఎవరికీ లాభనష్టాలు ఉండవు. కానీ ఓ బ్యాంకులో జరిగే అన్ని రకాల లావాదేవీలూ ఆ ఆటలో చోటుచేసుకునేవి. అంటే ఆ ఆటకు ఉపయోగించే బోర్డే నిజమైన బ్యాంకుకి ‘సిమ్యులేటర్‌’. ఆ బొమ్మ నోట్లు నిజమైన కరెన్సీకి ‘సిమ్యులేటర్‌’.

ఈ మధ్య కాలంలో కారు డ్రైవింగ్‌ని కూడా కొందరు ఓ గదిలో కూర్చొని నేర్చేసుకుంటున్నారు. అక్కడ కారులో ఉన్నట్టే స్టీరింగ్‌, బ్రేకులూ, యాక్సిలరేటర్‌ లాంటివన్నీ ఓ యంత్రానికి బిగించి ఉంటాయి. ఎదురుగా తెరమీద ఇతర వాహనాలు వెళ్తున్నట్టూ, వాటి మధ్యలో నుంచి మనం కారుని నడుపుతున్నట్టూ వాస్తవిక అనుభూతిని ఆ యంత్రం కలిగిస్తుంది. ఇక్కడ ఆ యంత్రం కారుకి సిమ్యులేటర్‌. ఆ తెరమీద కనిపించే బొమ్మలు రోడ్డుకి సిమ్యులేటర్లు.

ఒక్క మాటలో చెప్పాలంటే నిజమైన ప్రపంచాన్ని కృత్రిమంగా ఓ గదిలో ప్రతి సృష్టించే ప్రక్రియే సిమ్యులేషన్‌. అసలైన యంత్రాలను పోలిన ఉత్తుత్తి పరికరాలనే ‘సిమ్యులేటర్లు’ అని అంటారు. వీటి వల్ల ఎన్నో రంగాల నిపుణుల ప్రమాణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఫలితంగా ఆయా రంగాల్లో ప్రమాదాలూ తగ్గుతున్నాయి. ఏదైనా పనిని కృత్రిమ వాతావరణంలో నేర్చుకోవడం వల్ల ఖర్చూ ఆదా అవుతుంది. సమయమూ కలిసొస్తుంది. పనిని నేర్చుకోవడంలో ఎన్నిసార్లు విఫలమైనా వనరుల వృథా ఉండదు. ఎలాంటి ప్రమాదకర పరిస్థితినైనా సృష్టించి, దాన్ని ఎదుర్కోవడానికి కావల్సిన నేర్పునీ సాధించే అవకాశం దొరుకుతుంది. ఇలా ఎన్నో సానుకూలతలతో నిండిన ఈ సిమ్యులేటర్ల వినియోగం, ఆట బొమ్మల నుంచి అంతరిక్ష పరిశోధనల దాకా అన్ని రంగాల్నీ కొత్త వేగంతో, సరికొత్త దారిలో ముందుకు నడిపిస్తోంది.

పైలట్లకు భరోసా

విమానంలో ప్రయాణించాలంటేనే కొందరికి భయం. అలాంటిది విమానాన్ని నడపాలంటే ఇంకెంత భయపడాలి! ఆ భయం ఏ మాత్రం శ్రుతిమించినా భారీ ప్రమాదాలకు దారితీయొచ్చు. అందుకే పైలట్లకు శిక్షణ ఇవ్వాలంటే ఖర్చుతో పాటు రిస్కూ ఎక్కువే. ‘ఫ్లైట్‌ సిమ్యులేటర్లు’ ఆ రిస్కుని పూర్తిగా నిరోధించడంతో పాటు ఖర్చునీ భారీగా తగ్గిస్తున్నాయి. సిమ్యులేషన్‌ సాంకేతికతను ఉపయోగిస్తూ విమానంలోని కాక్‌పిట్‌లో ఉండే అన్ని రకాల పరికరాల్నీ ఓ గదిలో అమరుస్తున్నారు. పైలట్‌ సీటుకి ఎదురుగా భారీ తెరల్ని ఏర్పాటు చేసి అచ్చంగా మబ్బుల్లో విమానాన్ని నడిపిస్తున్న అనుభూతినే కల్పిస్తున్నారు. సౌండ్‌ ఎఫెక్ట్‌లూ, టేకాఫ్‌, ల్యాండింగ్‌ ఎఫెక్ట్‌లూ నిజమైన విమానాల్లో ఉన్నట్టుగానే ఈ సిమ్యులేషన్‌ కాక్‌పిట్‌లలోనూ అందుబాటులోకి తెస్తున్నారు. గాలి వేగంలో హెచ్చు తగ్గులూ, గాలి ప్రయాణించే దిశలో మార్పులూ, దట్టమైన మబ్బులతో నిండిన వాతావరణం మొదలైనవాటిని కృత్రిమంగా సృష్టిస్తూ ఆ పరిస్థితుల్లో సాధన చేసే అవకాశాన్ని పైలట్లకు కల్పిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లోని కంట్రోల్‌ రూం జీపీఎస్‌తో ఈ డ్రైవింగ్‌ సిమ్యులేటర్లను అనుసంధానం చేసి ఇతర విమానాల ట్రాఫిక్‌తో సమన్వయం చేసుకుంటూ నడపడం ఎలానో నేర్పిస్తున్నారు. దాదాపుగా నిజమైన విమానాన్ని నడిపిన అనుభూతిని కల్పించే ఈ సిమ్యులేటర్ల వల్ల పైలట్ల శిక్షణ సులభతరం కావడంతో పాటు ఖర్చూ ఆదా అవుతోంది. షార్ట్‌ సర్క్యూట్‌, ఇంజిన్‌ విఫలమవడం, విద్యుత్‌ వ్యవస్థ స్తంభించడం లాంటి ప్రమాదకర పరిస్థితులనూ కృత్రిమంగా సృష్టించే వెసులుబాటు ఉండటంతో పైలట్లు ముందుగానే అలాంటి సందర్భాలకు సన్నద్ధమయ్యే అవకాశాన్నీ సిమ్యులేటర్లు కల్పిస్తున్నాయి.

కార్లూ, క్రేన్లూ, ఇతర భారీ వాహనాలను నడిపించడానికి అవసరమయ్యే శిక్షణను ఇచ్చే డ్రైవింగ్‌ సిమ్యులేటర్లూ అందుబాటులో ఉన్నాయి. అచ్చంగా ట్రాఫిక్‌ మధ్యలో వాహనాన్ని నడిపిస్తున్న అనుభూతిని కల్పిస్తూ, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా డ్రైవింగ్‌ నేర్చుకునేందుకు ఇవి సాయపడుతున్నాయి.

వైద్యానికి సాయం

వైద్యుల తప్పిదాల వల్ల ఏటా లక్షలాది మంది చనిపోతున్నారని అంచనా. సరైన నైపుణ్యం లేకపోవడమే ఆ తప్పిదాలకు దారితీస్తోంది. వైద్యుల సాధనకు సరిపడా మృత దేహాలు లేకపోవడం, జీవం ఉన్న దేహాలపైన సాధన చేయడం ప్రమాదకరం కావడం లాంటి అంశాలన్నీ వాళ్లలో నైపుణ్య లేమికి కారణాలవుతున్నాయి. దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ సమస్యకు సిమ్యులేటర్లు అద్భుత పరిష్కారాన్ని చూపిస్తున్నాయి. ఓ ఇరవై ఏళ్ల క్రితం వైద్య రంగంలో సిమ్యులేటర్లంటే కేవలం మనిషిని పోలిన బొమ్మలే. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందిన టెక్నాలజీతో వాటి స్వరూపమే మారిపోయింది. ఆ సిమ్యులేటర్లలోనూ రక్త ప్రసరణ జరుగుతోంది. గుండె కొట్టుకుంటోంది. వూపిరితిత్తులు పనిచేస్తున్నాయి. ప్రాణం లేదన్న మాటే కానీ, మనిషి శరీరంలో జరిగే అనేక చర్యలు ఆ సిమ్యులేటర్లలోనూ చోటు చేసుకుంటున్నాయి. అచ్చంగా మనిషిని పోలిన ఆ సిమ్యులేటర్లను తెరిచి చూస్తే మానవ అవయవ వ్యవస్థే కనిపిస్తుంది. అలాంటి సిమ్యులేటర్లపైన వైద్యులకు ఇచ్చే శిక్షణ వారి నైపుణ్య స్థాయుల్ని అమాంతం పెంచేస్తోంది.

ఇంజెక్షన్‌ చేయాలంటేనే కొందరు కొత్త వైద్యులకు చేతులు వణుకుతాయి. అదే ఏ గుండె ఆపరేషనో చేయడమంటే అలాంటి వారికి కత్తి మీద సామే. ఎన్ని వీడియోలు చూసినా, ఎన్ని మృతదేహాలపైన సాధన చేసినా నేరుగా మనుషులకు శస్త్రచికిత్స చేసే అనుభూతిని ఆ సాధన పంచలేదు. సిమ్యులేటర్ల రూపంలో ఆ క్లిష్టమైన సమస్యకు సులువైన పరిష్కారం దొరికింది. ఉదాహరణకు గుండెకు స్టెంట్‌ వేసే సర్జరీని సిమ్యులేటర్‌ మీద సాధన చేయాల్సొస్తే, ఆ సిమ్యులేటర్‌ కూడా మనిషి శరీరంలానే స్పందిస్తుంది. దాని చర్మాన్ని కత్తిరించినప్పుడు రక్తమొస్తుంది. తెరిచి చూస్తే గుండె స్థానంలో ఉన్న పరికరం కొట్టుకుంటూ కనిపిస్తుంది. సర్జరీ ఏమాత్రం తేడాగా జరిగినా ఆ కృత్రిమ గుండె ఆగిపోతుంది. అంటే సిమ్యులేటర్‌కి శస్త్రచికిత్స చేస్తే, దాదాపు మనిషికి చేసినట్టే లెక్క. ఆ విధమైన సాధన మరింత నాణ్యమైన వైద్యులని సమాజానికి అందిస్తోంది. ఇంజెక్షన్‌ చేయడం, కుట్లు వేయడం, రక్తం సేకరించడం లాంటి చిన్న ప్రక్రియల నుంచి ప్రసవం చేయడం, కిడ్నీలో రాళ్లు తొలగించడం లాంటి పెద్ద చికిత్సల వరకూ అన్ని వైద్య విధానాల సాధనకూ పనికొచ్చే సిమ్యులేటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా కాలేజీ నుంచి బయటికొచ్చే సరికే ఎన్నో సర్జరీలు చేసిన అనుభవం, అనుభూతీ వైద్య విద్యార్థుల సొంతమవుతోంది. ఈ మెడికల్‌ సిమ్యులేటర్ల పుణ్యమా అని ఎవరికీ ఎలాంటి హానీ జరగకుండానే చేయి తిరిగిన డాక్టర్లు ఆస్పత్రుల్లో అడుగుపెడుతున్నారు.

సైనికులకు తోడు

యుద్ధం జరగకపోయినా, ఉగ్రవాదులు ఎదురు పడకపోయినా, శత్రుసైన్యం కవ్వించకపోయినా, అసలు జీవితంలో ఒక్కసారి కూడా తుపాకీని పేల్చే అవసరం రాకపోయినా సరే ప్రతి సైనికుడూ యుద్ధవిద్యలో ఆరితేరాలి. అత్యాధునిక ఆయుధాల్ని ఉపయోగించగలగాలి. అన్ని రకాల రక్షణ యంత్రాల్నీ నియంత్రించడం తెలిసుండాలి. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాల్నీ పక్కాగా ఛేదించగలగాలి. ఇవన్నీ జరగాలంటే ఆయా అంశాల్లో కఠిన శిక్షణ తప్పనిసరి. లక్షలాది సైనికులకు అలాంటి శిక్షణ ఇవ్వడమంటే మాటలు కాదు. కేవలం శిక్షణ కోసం విలువైన పరికరాల్ని వినియోగిస్తే, పేలుడు పదార్థాలు వృథా అవడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశాలూ పెరుగుతాయి. కొన్నిసార్లు వాటిని పరీక్షించేందుకు అనువైన స్థలం కూడా దొరక్కపోవచ్చు. దాదాపు అన్ని దేశాల్లో ‘మిలటరీ సిమ్యులేటర్లు’ ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నాయి. వీటివల్ల చాలా దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే విధానాన్ని కూడా ఓ గదిలో కూర్చొని నేర్చుకుంటున్నారు. సిమ్యులేటర్‌ ఉన్న గదిలో పెద్ద తెరల మీద ఉగ్రవాదుల క్యాంపుల దృశ్యాలు కనిపిస్తాయి. శిక్షణలో ఉన్న సైనికులు కంప్యూటర్‌కి అనుసంధానించిన ఆయుధాల సాయంతో వాటిని ధ్వంసం చేయడం సాధన చేస్తారు. ఆ ఫలితాల ఆధారంగా సైనికుల సామర్థ్యాన్ని మెరుగుపరచొచ్చు. సిమ్యులేటర్‌ గదిలో సాధన చేసిన సైనికుల సామర్థ్యాన్ని బయటి ప్రాంగణంలో పరీక్షించినప్పుడు 99శాతం సరైన ఫలితాలు వస్తుండటంతో సైన్యంలో వీటి వినియోగం బాగా పెరిగింది. అమెరికాలాంటి దేశాల్లో అయితే రెండు సైనిక బృందాలను రెండు వేర్వేరు సిమ్యులేటర్‌ గదుల్లో ఉంచి, ఉగ్రవాద బాధిత దేశాల్లోని వాతావరణాన్ని అక్కడ సృష్టించి ఒకరికొకరు ఎదురుదాడి చేసుకునేలా శిక్షణ ఇస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలకూ గురికాకుండా ఉగ్రవాదులను నేరుగా ఎదుర్కోవడానికి ఈ సాధన సాయపడుతోంది. యుద్ధ నౌకలూ, యుద్ధ విమానాల్ని నడపడం, కదులుతున్న వాహనాల నుంచి లక్ష్యాల్ని ఛేదించడం లాంటి అనేక యుద్ధవిద్యలు నేర్పడానికి అన్ని దేశాలూ ఇప్పుడు సిమ్యులేటర్లనే ఆశ్రయిస్తున్నాయి.

విద్యార్థులకు వరం

ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ లాంటి కొన్ని వృత్తి విద్యలకు సబ్జెక్టు కంటే ఆచరణాత్మక జ్ఞానమే ప్రధానం. ఒక కంప్యూటర్‌ చిప్‌ని తయారు చేయడమెలాగో తెలుసుకోవడం వేరు, తయారు చేయడం వేరు. నాలుగ్గోడల మధ్య చదువుకునేప్పుడు తలెత్తని ఎన్నో ఇబ్బందులు, ఆ విద్యని ఆచరణలో పెట్టినప్పుడు ఎదురవుతాయి. వాటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే విద్యార్థి దశలోనే పూర్తిస్థాయిలో సాధన చేయాలి. దానికి సరిపడా యంత్రాలు విద్యాసంస్థల దగ్గర లేక, డిగ్రీ చేతికొచ్చినా తగినంత ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ అబ్బక చాలామంది పట్టభద్రులు ఉద్యోగాల కోసం కష్టపడుతున్నారు. విద్యా ప్రమాణాల్లో ఏర్పడ్డ ఆ అగాధాన్ని ‘ఎడ్యుకేషనల్‌ సిమ్యులేటర్లు’ దూరం చేస్తున్నాయి. కంప్యూటర్‌ చిప్‌ల తయారీ, విద్యుత్‌ సర్క్యూట్‌ల మరమ్మతులూ, పారిశ్రామిక యంత్రాల నియంత్రణ, మైక్రో వెల్డింగ్‌ పనులూ మొదలైన అనేక విద్యలను నేర్పే సిమ్యులేటర్లు కాలేజీల్లో అందుబాటులోకి వచ్చాయి. ‘ట్రయల్‌ ఎండ్‌ ఎర్రర్‌’ విధానంలో విద్యార్థులు ఎన్నిసార్లయినా వాటిపైన సాధన చేసి ఆయా రంగాల్లో నిష్ణాతులయ్యే అవకాశాన్ని అవి కల్పిస్తున్నాయి. విద్యారంగంలోకి సిమ్యులేటర్లు ప్రవేశించాక చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు దక్కించుకునే వాళ్లతో పాటు, సిమ్యులేటర్లపైన సాధన ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో సొంతంగా చిన్నస్థాయి పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ల సంఖ్యా పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి.

పరిశోధనలకు వూతం

అంతరిక్షంలోకో, సముద్ర గర్భంలోకో ఎలాంటి శిక్షణా లేకుండా నేరుగా వెళ్లి పరిశోధనలు చేయడం ప్రమాదకరం. సీ సిమ్యులేటర్లనూ, స్పేస్‌ సిమ్యులేటర్లనూ ఉపయోగించడమే ఆ సమస్యకు పరిష్కారం. సాధారణంగా వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేది ఈ పద్ధతిలోనే. అంతరిక్షంలో ఉండే వాతావరణం, గురుత్వాకర్షణ శక్తీ, పీడనం తదితర పరిస్థితులను ‘స్పేస్‌ సిమ్యులేటర్‌’గా వ్యవహరించే ఓ గదిలో కృత్రిమంగా సృష్టించి కొన్ని రోజుల పాటు పరిశోధకుల్ని అందులోకి పంపించి శిక్షణ ఇస్తారు. సముద్ర గర్భంలో పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలను కూడా అలా కృత్రిమంగా సృష్టించిన వాతావరణంలోనే సన్నద్ధం చేస్తారు. దీని వల్ల ఆయా పరిస్థితులకు పరిశోధకులు అలవాటు పడగలరో లేదో తెలియడంతో పాటు మెరుగైన పరిశోధకుల్నే ఎంపిక చేసే అవకాశమూ ఉంటుంది. ఇటీవలే అమెరికా శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేసి ‘మార్స్‌ సిమ్యులేటర్‌’నీ తయారు చేశారు. అంగారకుడిపైన ఉండే వాతావరణ పరిస్థితుల్ని సృష్టించడంతో పాటు అక్కడ లభ్యమయ్యే ఖనిజాల్నీ సిమ్యులేటర్‌లో ఏర్పాటు చేశారు. పరిశోధకులు ఆ వాతావరణంతో పాటు ఆ ఖనిజాల నుంచి వచ్చే వాసనల్నీ తట్టుకోగలరో లేదోనన్న అంశంపైన పరిశోధనలు జరుపుతున్నారు. ‘సిమ్యులేషన్‌’ పద్ధతే లేకుంటే ఆయా పరిశోధనలు మరింత ప్రమాదకరంగా మారేవని శాస్త్రవేత్తలు అంటారు.

ఆటగాళ్లకు ఆసరా

కొందరు వినోదం కోసం ఆటలాడతారు. ఇంకొందరు క్రీడల్నే కెరీర్‌గా ఎంచుకుంటారు. రెండు రకాల వ్యక్తుల అవసరాల్నీ సిమ్యులేటర్లు తీరుస్తున్నాయి. కారు, బైక్‌ రేసింగ్‌, బాక్సింగ్‌, షూటింగ్‌ లాంటి రకరకాల క్రీడల్ని నేరుగా మైదానంలో ఆడుతున్న అనుభూతిని కలిగించే విధంగా అనేక సిమ్యులేటర్లు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వీటిలో కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌కి ప్రాధాన్యమివ్వడంతో కాస్త కృత్రిమత్వం కనిపిస్తుంది. ప్రొఫెషనల్‌ స్పోర్ట్స్‌ సిమ్యులేటర్లు వాటికి భిన్నం. వాటిపైన చేసే సాధన దాదాపుగా మైదానంలో చేసే సాధనకి సమానం. ఉదాహరణకు నదుల్లో పోటీపడే ‘కయాకింగ్‌’ క్రీడనే తీసుకుంటే... క్రీడాకారులు రోజూ వెళ్లి సాధన చేయడానికి వాతావరణం అనుకూలించకపోవచ్చు. నదులూ, కాలువల్లో నీటి లభ్యత కూడా సాధనని ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యల్ని అధిగమించేందుకు కయాకింగ్‌ సిమ్యులేటర్లు ఉన్నాయి. ఈ యంత్రంపైన కూర్చొని సాధన చేస్తుంటే గాలి దిశ, వేగం, అలల తీవ్రత, కయాకింగ్‌ బోటు కుదుపులు లాంటి అన్ని అంశాలూ నిజంగా నదిలో చేసే సాధననే తలపిస్తాయి. ఒలింపిక్స్‌ లాంటి ప్రధాన పోటీల తాలూకు వీడియోలూ ఆ సిమ్యులేటర్లలో నిక్షిప్తమై ఉంటాయి. కావల్సిన మ్యాచ్‌ని సెట్‌ చేసుకుంటే, సిమ్యులేటర్‌ మీద కూర్చున్న వ్యక్తి ఆ మ్యాచ్‌లో తలపడుతున్నట్టు తెరమీద కనిపిస్తుంది. అలా ఓ యంత్రం మీద కూర్చొని, నేరుగా నదిలో జరిగే పోటీలో పాల్గొనే అనుభూతిని పొందడం వల్ల ఆ పోటీలో తన స్థానం ఏంటో తెలుసుకునే అవకాశం క్రీడాకారుడికి దొరుకుతుంది. అథ్లెటిక్స్‌, గోల్ఫ్‌, బౌలింగ్‌, రేసింగ్‌ తదితర రంగాలకు చెందిన ఎందరో ప్రొఫెషనల్‌ క్రీడాకారులు సిమ్యులేటర్ల సాయంతోనే తమ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోటీలకు సన్నద్ధమవుతున్నారు.

సిమ్యులేటర్‌ సంగతులు

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో తయారు చేసిన ‘లింక్‌ ట్రెయినర్‌’ అనే యంత్రాన్నే ప్రపంచంలో తొలి సిమ్యులేటర్‌గా చెబుతారు. కదులుతున్న లక్ష్యాలను ఛేదించడంలో సైనికులకు శిక్షణ ఇవ్వడానికి అమెరికా అధికారులు ఓ కృత్రిమ కాక్‌పిట్‌ను ఉపయోగించారు. యంత్రాల సాయంతో దాన్ని అటూ ఇటూ కదుపుతూ, అందులో ఉన్న సైనికులకు కాల్పులు జరపమని చెప్పేవారట. రెండో ప్రపంచ యుద్ధం నాటికి దాదాపు అన్ని ప్రధాన దేశాలూ ఈ లింక్‌ ట్రెయినర్లను ఉపయోగించడం మొదలుపెట్టాయి.
* సిమ్‌ సిటీ... ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పాపులరైన సిమ్యులేషన్‌ గేమ్‌ ఇది. ఇచ్చిన మ్యాప్‌కి అనుగుణంగా ఖాళీగా ఉన్న వూళ్లొ అన్ని వసతులతో ఉన్న అందమైన నగరాన్ని నిర్మించడమే ఇక్కడ ఆటగాడు చేయాల్సిన పని. ఇందులోని గ్రాఫిక్స్‌ నిజమైన నిర్మాణాలకు దగ్గరగా ఉండటంతో పాటు ఆటగాడికి నిజంగా నగరాన్ని నిర్మించిన అనుభూతిని కలిగిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడయ్యే టాప్‌-10 కంప్యూటర్‌ గేమ్‌ల జాబితాలో ఇదీ చోటు సంపాదించింది.
* డబ్బులు పోకుండానే వినియోగదార్లకు స్టాక్‌ మార్కెట్‌పైన అవగాహన కల్పించేందుకు ‘సిమ్యులేటెడ్‌ స్టాక్‌ మార్కెట్‌’లూ వెలుస్తున్నాయి. బయటి మార్కెట్‌ పరిస్థితుల్ని ఈ కృత్రిమ స్టాక్‌ మార్కెట్‌కి అనుసంధానిస్తారు. ట్రేడర్‌ తాను ఎంత డబ్బు పెట్టదల్చుకున్నాడో ఆ సంఖ్యని సిమ్యులేటర్‌లో నమోదు చేసి షేర్లు కొనుగోలు చేయొచ్చు. అసలైన మార్కెట్‌ గణాంకాల్ని ఈ సిమ్యులేటర్‌కి అనుసంధానించడంతో ఆ రోజు ట్రేడింగ్‌ ముగిసేసరికి తాను పెట్టిన డబ్బుకి రాబడి ఉంటుందో లేదో ట్రేడర్‌కి తెలిసిపోతుంది. అలా కొన్నాళ్లు డబ్బు పెట్టకుండానే ట్రేడింగ్‌ చేయడం సాధన చేశాక అసలైన మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి కావల్సిన ఆత్మవిశ్వాసం కొత్త ట్రేడర్లకు పెరుగుతుందన్నది మార్కెట్‌ నిపుణుల మాట.
* జపాన్‌ లాంటి దేశాల్లో భూకంపాల తీవ్రత ఎక్కువ. ప్రజల్ని వాటికి మానసికంగా సిద్ధం చేసేందుకు శాస్త్రవేత్తలు ‘ఎర్త్‌క్వేక్‌ సిమ్యులేటర్ల’ని తయారు చేస్తున్నారు. అంటే... ఓ పెద్ద భవంతిలోకి జనాన్ని పంపించి, అక్కడ కృత్రిమంగా భూకంప పరిస్థితుల్ని సృష్టించి ఇటుకలూ, షాండ్లియర్లూ కిందపడుతున్నట్లూ, గోడలు కూలుతున్నట్లూ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు స్పందించిన తీరు ఆధారంగా, ఆ పరిస్థితుల్ని ఇంకాస్త మెరుగ్గా ఎలా ఎదుర్కోవచ్చన్న దానిపైన శిక్షణ ఇస్తున్నారు.
* అమెరికాలోని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ‘అర్బన్‌ సిమ్‌’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ని నిర్వహిస్తున్నారు. ఆ దేశ పౌరులెవరైనా అందులో లాగినై నగరాల నిర్మాణానికి సంబంధించిన సూచనలు చేస్తూ ప్లాన్‌ని అందించొచ్చు. దాన్ని అధికార్లు ఆమోదిస్తే వెబ్‌సైట్‌లోని నమూనా నగరంలో వాళ్లు సూచించిన భవంతిని గ్రాఫిక్స్‌లో సృష్టిస్తారు. ‘అర్బన్‌ సిమ్యులేషన్‌’ అనే ఈ పద్ధతి ద్వారా ప్రజల నుంచే ప్రణాళికలు సేకరించి ఓ కొత్త పట్టణాన్ని నిర్మించాలన్నది వాళ్ల ఆలోచన.
* ఏదైనా వ్యవస్థ తాలూకు ‘వైఫల్య విశ్లేషణ’(ఫెయిల్యూర్‌ ఎనాలిసిస్‌)కి సిమ్యులేటర్లే కీలకంగా మారుతున్నాయి. ఉదాహరణకు ఇంజిన్‌ ఫెయిలై ఓ విమానం కూలిపోతే, ఆ పరిస్థితి ఎందుకు తలెత్తిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు సిమ్యులేటర్లను ఆశ్రయిస్తున్నారు. విమానం కూలే సమయంలో అది ప్రయాణిస్తున్న వేగం, పీడనం, గాలి దిశ, వాతావరణ పరిస్థితుల లాంటివన్నీ కృత్రిమంగా సృష్టించి, వాటికి సిమ్యులేటర్‌ ఎలా స్పందిస్తుందో తెలుసుకొని, ప్రమాదానికి దారితీసిన కారణాలను అంచనా వేస్తున్నారు. శస్త్రచికిత్సలూ, అంతరిక్ష పరిశోధనలూ లాంటి వివిధ రంగాల్లో వైఫల్యాల వెనకున్న కారణాలను తెలుసుకునేందుకూ సిమ్యులేటర్లే ఆధారమవుతున్నాయి.