close
ఆఫీస్‌... మహాభారత్‌!

ఆఫీస్‌... మహాభారత్‌!

ప్రపంచంలో ఉన్నవన్నీ మహాభారతంలో ఉన్నాయి. మహాభారతంలో ఉన్నవన్నీ ఆఫీసులోనూ ఉన్నాయి. ఎందుకంటే, ప్రపంచంలో ఆఫీసు ఓ భాగం కాబట్టి, ఆఫీసు కూడా ఓ చిన్నసైజు ప్రపంచమే కాబట్టి! ఉద్యోగంలో చేరిన తొలిరోజే, గడ్డం దువ్వుకుంటూ గంభీరంగా ఓ పెద్దమనిషి ఎదురొస్తాడు. ‘భీష్మ పితామహుడిలా ఉన్నాడే!’ అనుకుంటాం. వంకరచూపులతో ఓ వెధవాయి తారసపడతాడు. ‘జాగ్రత్త, శకునిమామ లాంటోడు!’ అని అంతరాత్మ హెచ్చరిస్తుంది.కొన్ని క్యారెక్టర్లంతే. మర్యాదగా నమస్కారం పెట్టినా స్వీకరించరు. ‘నేనేమిటీ నా స్థాయేమిటీ?’ అన్న అహంభావం. అలాంటి వాళ్లది దుర్యోధన మనస్తత్వం. ఇలా, బేరీజు వేసుకుంటూ పోతే...భారతంలోని ప్రతి పాత్రా ఏదో ఓ సీట్లో తారసపడుతుంది. ఎవరు ధర్మనందనుడో, ఎవరు మధ్యమపాండవుడో, ఎవరు దుర్యోధనుడో, ఎవరు దుశ్శాసనుడో... ఓ అవగాహనకు రాగలిగితే ఇక తిరుగుండదు. అమాయక అభిమన్యు కుమారుడిలా ఆఫీసు పద్మవ్యూహంలో చిక్కుకోం. పొరపాటున చిక్కుకున్నా ఒడుపుగా ఒడ్డునపడతాం.

 

‘చక్రం’ తిప్పేస్తాడు!

వాసుదేవ కృష్ణుడు సర్వాంతర్యామి, జగన్నాటక సూత్రధారి, ధర్మపక్షపాతి. పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం...మంచితనానికీ మంచి మనుషులకూ అండగా నిలబడటం, దుర్మార్గాన్నీ దుర్మార్గులనూ నిలువరించడం...ఆయన ప్రధాన కర్తవ్యాలు. ఆ ప్రయత్నంలో అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించాడు, భీముడికి దుర్యోధనుడిని జయించే మార్గం చెప్పాడు, వీరాధివీరుడైన కర్ణుడిని అన్నివిధాలా బలహీనపరిచాడు, అంతిమంగా పాండవుల్ని గెలిపించాడు, ధర్మాన్ని సంస్థాపించాడు. కృష్ణుడి పాత్రను కార్పొరేట్‌ ఆఫీసుకు అన్వయించుకుంటే - అతడు, చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌...తిరుగులేని వ్యూహాన్ని రచిస్తాడు. చీఫ్‌ నాలెడ్జ్‌ ఆఫీసర్‌...అనుచరులకు కర్తవ్యదీక్షోపదేశం చేస్తాడు. చీఫ్‌ రిలేషన్‌షిప్‌ ఆఫీసర్‌...నమ్మినవారికి అండగా నిలుస్తాడు.

పాండవ సైన్యం కంటే కౌరవ పటాలమే పెద్దది. ఆయుధ సంపత్తి కూడా ఎక్కువే. కానీ పాండవులే గెలిచారు. కారణం, పాండవుల వైపు శ్రీకృష్ణుడనే ‘చీఫ్‌ మోటివేటర్‌’ ఉన్నాడు. సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపి...తక్కువ వనరులతో ఎక్కువ ఫలితాన్ని రాబట్టడం అతడికి బాగా తెలుసు. మొత్తంగా శ్రీకృష్ణుడు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కమ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌. యత్ర యోగేశ్వర కృష్ణ...ఎక్కడ అలాంటి సమర్థ నాయకుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. అలాంటి మేధోసంపన్నుల నాయకత్వంలో ఏ సంస్థ అయినా అనతికాలంలోనే ‘బిలియన్‌ డాలర్‌’ స్థాయికి చేరుతుంది. ఫోర్బ్స్‌ ఉత్తమ కంపెనీల జాబితాలో నిలబడుతుంది.

ఉద్యోగులుగా మనకు అలాంటి అధినాయకుడు తారసపడినప్పుడు...ఆ గొప్పదనాన్ని గుర్తించాలి, గౌరవించాలి. పడకసీనులో కృష్ణుడు ‘బావా...కోరుకో!’ అనగానే, దుర్యోధనుడు లక్షల సైన్యాన్ని కోరుకున్నాడు. అర్జునుడేమో కృష్ణుడి సారథ్యాన్నీ సాన్నిధ్యాన్నీ ఎంచుకున్నాడు. అలాంటి సందర్భమే ఎదురైతే, అర్జునుడిలా ఆలోచించడమే తెలివైన పని.

చాలా...పెద్దాయన!

భీష్మపితామహుడు కురువంశానికి పునాది. తన చేతుల మీదుగా ఓ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఎప్పుడూ పదవులూ హోదాలూ కోరుకోలేదు. తండ్రి శంతనుడికి ఇచ్చిన మాట ప్రకారం, కురుసామ్రాజ్యానికి ధర్మకర్తగా మాత్రమే వ్యవహరించాడు. తనముందే పుట్టిపెరిగిన కౌరవ కుర్రకుంకలు కూడా చులకన చేసి మాట్లాడుతున్నా సహించాడూ భరించాడూ. ఆ మమకారంతోనే మహాభారత సంగ్రామంలో కౌరవసైన్యానికి నాయకత్వం వహించాడు. చివరికి, అర్జునుడి శరాఘాతాలకు కూలిపోయాడు. ఆ స్థాయి వ్యక్తులు అరుదుగా అయినా, అక్కడక్కడ దర్శనమిస్తుంటారు. కంపెనీకి అతనే పెద్దదిక్కనే ప్రచారం ఉంటుంది. ఆ పెద్దాయనంటే సిబ్బందికి బోలెడంత గౌరవం కూడా. షెడ్డులో మొదలైన వ్యాపారం అద్దాల మేడకు చేరుకునే దాకా...ప్రతి మలుపులోనూ ఆయన పాత్ర ఉండితీరుతుంది. ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా ఓమాట అడుగుతారు. ఇదంతా పైపైకి కనిపించే దృశ్యం. కనిపించని కోణమూ ఒకటుంటుంది. ఆయన్ని సలహా అడగడం నిజం, చెప్పినదానికల్లా తలూపడమూ నిజమే. కానీ, వాటిని ఆచరణలో పెట్టిన సందర్భాలు అరుదే. చివరికొచ్చేసరికి తాము చేయాలనుకున్నదేదో చేసేస్తారు. కౌరవ సభలో దుర్యోధన దుశ్శాసనుల అకృత్యాల్లా...ఆఫీసులో తెరవెనుక రాజకీయాలు పెద్దాయనకు తెలియనివి కాదు. పతనమవుతున్న పనిసంస్కృతీ, దారితప్పుతున్న క్రమశిక్షణా ఆ అనుభవ సంపన్నుడి దృష్టికి వెళ్లవనీ అనుకోలేం. సంస్థ మీద మమకారం కొద్దో, యాజమాన్యం పట్ల కృతజ్ఞతతోనో ఇంకా కొనసాగుతూ ఉంటారు. అవకాశం ఉంటే, ఇలాంటి పెద్దల్ని దర్శించుకుని దండం పెట్టుకోవచ్చు. ఓపిక ఉంటే, సంస్థ విజయ రహస్యాల్నీ ఆ యోధుడి జీవితానుభవాల్నీ ‘భీష్మబోధ’లా ఆలకించవచ్చు.

అతడి దారి...‘అడ్డదారి’!

ర్ణుడు వీరాధివీరుడు, మహాదాత. కథానాయకుడికి ఉండాల్సిన గొప్ప లక్షణాలన్నీ ఉంటాయి. కానీ, సహవాస దోషంతో సర్వభ్రష్టుడు అవుతాడు. కార్యాలయాల్లో కర్ణుడి అంశ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివాళ్లు ఐఐటీలూ, ఐఐఎమ్‌లలో చదువుకుని ఉండకపోవచ్చు. కానీ ఆ స్థాయి నైపుణ్యం ఉంటుంది. కష్టపడి పనిచేస్తారు. తమ ప్రతిభను గుర్తించి, అవకాశం ఇచ్చినవారి పట్ల మహా నమ్మకంగా ఉంటారు - ఆ అతి విధేయత వల్ల కంపెనీ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని తెలిసినా, తమ వ్యక్తిత్వానికి మచ్చపడే ప్రమాదం ఉన్నట్టు స్పష్టంగా అర్థం అవుతున్నా..అస్సలు పట్టించుకోరు. ఫలితంగా, కవచ కుండలాల్లాంటి సహజ నైపుణ్యాలు మరుగునపడిపోతాయి. ఏదో ఓరోజు...గతంలో చేసిన తప్పులన్నీ బాణాలై గుచ్చుకుంటాయి. కార్పొరేట్‌ రణక్షేత్రంలో కుప్పకూలిపోతారు. మంచి స్నేహితుడిని ఎంచుకుని ఉంటే, కర్ణుడి కథ మరోలా ఉండేదేమో. కెరీర్‌ క్షేత్రంలో నువ్వు ఎవరన్నది ఎంత ముఖ్యమో, ఎవరితో రాసుకుపూసుకు తిరుగుతున్నావన్నదీ అంతే ముఖ్యం!

‘ధర్మ’రాజే కానీ....

పారమైన మేధస్సు, అణువణువునా నిబద్ధత - ఇదీ ధర్మరాజు వ్యక్తిత్వం. వెనకాల ‘అన్నా! నువ్వెలా అంటే అలా...’ అనే నలుగురు తమ్ముళ్లూ, పక్కనే ‘బావా నేనున్నా..’ అంటూ ధైర్యమిచ్చే శ్రీకృష్ణుడూ, ‘అదిగో ధర్మనందనుడు’ అంటూ చేతులు జోడించే మహాజనమూ - ఇంకేం కావాలి? అన్నీ ఉన్నా...జూదమనే బలహీనతే అడవుల పాలు చేసింది. అచ్చంగా ధర్మరాజును తలపించే పాత్రలు ఆఫీసు కారిడార్లలో కనిపిస్తాయి. బుర్రనిండా విషయం ఉంటుంది. బోలెడంత నైపుణ్యం ఉంటుంది. అపార అనుభవమూ ఉంటుంది. కానీ, ఏవో చిన్నచిన్న వ్యసనాలు. ఆఫీసులో కూర్చుని ఆన్‌లైన్లో పోకర్‌ ఆడుతుంటారనో, క్యాంపుల సాకు చెప్పి, రేసులకు వెళ్తారనో ఒకట్రెండు ప్రచారాలు వినిపిస్తూ ఉంటాయి. మంచి ఎక్కడున్నా స్వీకరించాల్సిందే. ఆ ప్రకారంగా, ధర్మనందనుల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలేమైనా ఉంటే తప్పకుండా నేర్చుకోవాలి. ఆ బలహీనతలు మనల్ని తాకకుండా జాగ్రత్తపడితే చాలు.

నిలువెల్లా విషమే!

కుని...గాంధారి సోదరుడు. దుర్యోధన, దుశ్శాసనాదులకు మేనమామ. మహాభారతంలోని ‘ఫోర్‌ ఇడియట్స్‌’లో ఒకడు. మహాప్రమాదకారి. అతడికి కురువంశం అంటే మంట! ఆ కుటుంబాన్ని నామరూపాల్లేకుండా చేయాలని కలలు కంటుంటాడు. తనకంత శక్తి లేదనీ పోరాడి గెలవడం అసాధ్యమనీ శకునికి తెలుసు. దీంతో, దొడ్డిదారి ఎంచుకున్నాడు. దుర్యోధనుడికి ఆప్తుడిలా నటిస్తూ అగ్గిరాజేశాడు. దాయాదుల పోరును మహా సంగ్రామం దాకా తీసుకెళ్లాడు. కార్పొరేట్‌ కార్యాలయాల్లో శకుని రకరకాల వేషాల్లో దర్శనమిస్తాడు. కొన్నిసార్లు సహోద్యోగి రూపంలో, కొన్నిసార్లు సీనియర్‌ అవతారంలో, ఇంకొన్నిసార్లు సాక్షాత్తూ బాసే ఆ పాత్ర ధరించవచ్చు. ఆ బాపతు మనుషులు ఆత్మీయుల్లా నటిస్తూ, ప్రేమగా పలకరిస్తూ ఎదుటివారి బలాల్నీ బలహీనతల్నీ తెలుసుకుంటారు. బలహీనతల్ని యాజమాన్యానికి భూతద్దంలో చూపుతారు. బలాల్ని బలహీనతల్లా వక్రీకరిస్తారు. ఫిర్యాదులూ పితూరీలూ ఆధునిక శకునిమామల మాయా పాచికలు!

బంధాల అంధుడు!

ధృతరాష్ట్రుడికి పుట్టుకతోనే కళ్లు లేవు. పిల్లలు పుట్టాక మనసుకూ అంధత్వం వచ్చింది. కొడుకు మీదున్న మితిమీరిన మమకారమే భయంకరమైన బలహీనతగా మారింది. అదే కౌరవవంశాన్ని నిండా ముంచేసింది. సిబ్బందిని మంచి వైపు నడిపించాల్సిన బాసు...మిన్నకుండిపోతే ఎన్ని ఘోరాలు జరుగుతాయో చెప్పడానికి కౌరవసంతతి వినాశనమే తార్కాణం. కార్పొరేట్‌ సామ్రాజ్యాల్లో గుడ్డిదర్బార్లకు కొదవ ఉండదు. కొందరు పెద్దబాసులు ఏవో మమకారాలతో అనర్హుల్ని అందలం ఎక్కిస్తుంటారు. అసమర్థులకు ముఖ్య బాధ్యతలు కట్టబెడుతుంటారు. ఆ కౌరవ సంతతి వల్లే వ్యవస్థ బీటలువారుతున్నట్టు అర్థమౌతున్నా, నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తారు. విదురుడి లాంటి పెద్ద మనిషో, కృష్ణుడిలాంటి మేధావో వాస్తవాల్ని వివరించినా, ఆ నిఖార్సయిన నిజాల్ని జీర్ణించుకోలేరు. మంచి చెప్పినవాళ్ల మీదే మసిపూస్తుంటారు. ఆ ధృతరాష్ట్ర కౌగిలికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. అలాంటి ‘హెడ్‌ ఆఫ్‌ ద డిపార్ట్‌మెంట్‌’ దగ్గర కొలువంటే పాముతో చెలగాటమే.

ధైర్యం విసిరిన పాశుపతం!

‘రేపే డెడ్‌లైన్‌. టెండరు కాగితాలు సిద్ధంగా ఉన్నాయా?’
‘ఎస్‌ సర్‌! ఆ బాధ్యత మిస్టర్‌ ఎక్స్‌ చూస్తున్నాడు’
‘ముఖ్యమైన కాన్ఫరెన్స్‌. ప్రజెంటేషన్‌ అదిరిపోవాలి’
‘తప్పకుండా సర్‌! మిస్టర్‌ ఎక్స్‌ ఆ పన్లోనే ఉన్నాడు’

ఆ ఎక్స్‌ పేరు ఏదైనా కావచ్చు - అర్జున, పార్థ, కిరీటి, ఫల్గుణ! ప్రతి ఆఫీసులో అర్జునుడిలాంటి కత్తిలాంటి ఉద్యోగులు ఒకరో ఇద్దరో ఉంటారు. ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులు వచ్చిన ప్రతిసారీ సీయీవో ఆఫీసు నుంచి వాళ్లకే ఫోన్లు వెళ్తాయి. సమస్యో సంక్షోభమో ఎదురైనప్పుడు కూడా వాళ్లనే ‘ట్రబుల్‌ షూటర్స్‌’గా బరిలో దింపుతారు. అర్జునుడు రెండు చేతులతోనూ బాణాలు వేయగలడు, ‘మల్టీటాస్కింగ్‌’ నిపుణుడన్నమాట. చెట్టునూ కొమ్మనూ పక్షినీ పట్టించుకోకుండా పక్షి కనుగుడ్డుకే గురిపెడతాడు, ‘ఫోకస్‌’ అపారమని అర్థం. మత్స్యయంత్రాన్ని ఛేదించి మరీ సాధించిన ద్రౌపదిని మిగతా సోదరులతో పంచుకున్నాడు, ‘టీమ్‌స్పిరిట్‌’ ఎక్కువని తెలుస్తోంది. లక్ష్యసాధనలో భాగంగా శిఖండి వేషమూ కట్టాడు, ‘గో-గెట్టర్‌’ అని తెలిసిపోతుంది. అన్నింటికీ మించి, శ్రీకృష్ణుడికి అత్యంత ఆప్తుడు. ఇక చెప్పేదేముంది, బలమైన ‘మెంటార్‌’ ఉండనే ఉన్నాడు. కార్పొరేట్‌ సంస్థలు అచ్చంగా ఇలాంటి వాళ్ల కోసమే హెచ్‌ఆర్‌ హంట్స్‌ నిర్వహిస్తాయి. ఎక్కడున్నా సరే, ఎంత జీతమిచ్చి అయినా సరే తన్నుకుపోతాయి. ఏ వేయిమందో పనిచేసే చోట...అర్జున్‌బాబులు ఒకరో ఇద్దరో ఉంటారు. అలా కనిపించేవాళ్లూ, కనిపించాలని ప్రయత్నించేవాళ్లూ మాత్రం బోలెడంతమంది. నకిలీల్ని చూసి మోసపోకండి!

భీమ... పవర్‌ ఆఫ్‌ హార్డ్‌వర్క్‌!

పాండవ ద్వితీయుడు మహాబలవంతుడు. ఎంతటి బలమంటే... చిన్నప్పుడోసారి కొండ మీది నుంచి జారిపడ్డాడు. అయినా, పసివాడు నిక్షేపంగానే ఉన్నాడు. బండ మాత్రం ముక్కులుచెక్కలైపోయింది. బాల్యంలో, తోటి పిల్లలంతా చెట్టెక్కి పండ్లు తెంచుకుంటే...భీముడు కాండాన్ని పెకిలించి కాయలు రాల్చేవాడు. బుద్ధిబలం తోడైతేనే ఆ కండబలానికి సార్థకత. ఆ దిశానిర్దేశం కృష్ణుడి రూపంలో దొరికింది. కృష్ణుడే... జరాసంధుడిని ఎలా సంహరించాలో చెప్పాడు, దుర్యోధనుడిని ఎక్కడ దెబ్బకొట్టాలో సూచించాడు. కార్పొరేట్‌ పర్వంలోనూ అభినవ భీమసేనులు దర్శనమిస్తూ ఉంటారు. బండెడు చాకిరీని ఒంటిచేత్తో చేసేస్తారు. మహామహా ప్రాజెక్టుల్ని డెడ్‌లైన్‌లోపే పూర్తిచేస్తారు. కాకపోతే, వీళ్లకో మార్గదర్శకుడంటూ కావాలి. ఆ అండ దొరికిందా, గండరగండలే! లేదంటే, ఆ ‘ఎనర్జీ’ అంతా వృథా అయిపోతుంది. ఆ అపారశక్తిని సమర్థంగా వాడుకోవాల్సిన బాధ్యత కార్పొరేట్‌ కృష్ణపరమాత్మలదే! అప్పుడప్పుడూ ఈ భీమసేనరావుల్ని ‘నిదురవోచుంటివో లేక బెదిరి పలుకుచుంటివో...’ తరహా ఎత్తిపొడుపులతో రెచ్చగొడుతూ ఉండాలి. లేకపోతే బర్గర్లూ పిజ్జాలూ తిని, బేఫికర్‌గా కునుకులోకి జారుకుంటారు.

కార్పొరేట్‌ నారి

కార్పొరేట్‌ మేడల్లో కనిపించని అడ్డుగోడలేవో ఉంటాయి. మహిళ ఓ స్థాయికి మించి ఎదగకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అయినా సరే, మడమతిప్పకూడదు, పరుగు ఆపకూడదు - ద్రౌపదిలా. ఆ పాండవపత్ని సంక్షోభ సమయాల్లోనూ స్థైర్యం వీడలేదు. నిండుసభలో అవమానాన్ని భరించింది, విరాటుడి కొలువులో దాసిగా పనిచేసింది. ఓ దశలో పాండవులు దుర్యోధనుడితో సర్దుకుపోదామనుకున్నారు. అదే జరిగితే, ఏ ఐదూళ్లతోనో రాజీపడితే, తాత్కాలికంగా కష్టాలు తీరతాయి. దుర్యోధనుడి రక్తంతో తలంటుకుంటానంటూ నిండుసభలో చేసిన ప్రతిజ్ఞా నెరవేరదు. అన్నివైపుల నుంచీ బేరీజు వేశాక, ద్రౌపది ఆ రాజీప్రతిపాదనను తిప్పికొట్టింది. ‘ఇదేనా మీ వీరత్వం?’ అంటూ భర్తల్లో రోషాన్ని రగిలించింది. ముఖ్యనిర్ణయం తీసుకోవాల్సిన ప్రతి సందర్భంలోనూ పాండవులు ద్రౌపది సలహా తీసుకున్నారు. ఇదంతా, భార్యగానే కాదు... దక్షురాలిగా, వ్యూహకర్తంగా సాధించుకున్న గౌరవమిది. నలుగురు మనుషులతో సమన్వయం చేసుకోవాల్సి వచ్చినప్పుడూ, ద్రౌపది ప్రదర్శించిన పరిణతే మహిళా మణులకో మేనేజ్‌మెంట్‌ పాఠం.

దుష్ట ఇగోయిస్టు!

దుర్యోధనుడి చుట్టూతా దురభిమానం వైఫైలా వ్యాపించి ఉంటుంది. పాండవుల్ని మట్టుబెట్టడానికి సుయోధనుడు చేయని ప్రయత్నమంటూ లేదు. విషప్రయోగం చేస్తాడు, అగ్నికి ఆహుతివ్వాలనుకుంటాడు, మాయాజూదంలో ఓడించి అడవులకు పంపుతాడు, చివరికి, మడుగుపక్కన...భీముడి గదాదండం దెబ్బకి రక్తపుమడుగులో తుదిశ్వాస వదుల్తాడు. కార్పొరేట్‌ కారిడార్లలో ఇలాంటి దురహంకారులకు కొదవ ఉండదు. అందరూ తమచుట్టే తిరగాలనుకుంటారు. అన్నీ తాము అనుకున్నట్టే నడవాలనుకుంటారు. అందర్నీ శాసించాలనుకుంటారు. వ్యవస్థను ఆడించాలనుకుంటారు. అందుకోసం ఎన్ని కుట్రలైనా చేస్తారు. ప్రతిభావంతుల్ని నయానో భయానో తమ బృందంలోకి లాక్కోవాలని చూస్తారు. కుదరకపోతే...ప్రలోభాలతో లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారు - కర్ణుడికి సామంత పదవి ఎర జూపినట్టు. ఎదుటివారి బలహీనతల్ని భలేగా వాడుకుంటారు - ధర్మరాజును జూదానికి రప్పించినట్టు. అయినా, ఆ ఆటలు ఎంతోకాలం సాగవు. చివరికి మంచే గెలుస్తుంది. సమర్థులకు న్యాయం జరుగుతుంది.

‘శబ్ద’ కాలుష్యమే!

త్తరుడి మాటలు కోటల్ని దాటతాయి. చేతలు గడప కూడా దాటవు. గోగ్రహణ సమయంలో... ‘నేనే కనుక రంగంలోకి దిగితేనా, కౌరవసేనలు కాలికి బుద్ధిచెప్పాల్సిందే..’ అని బీరాలు పలుకుతారు. తీరా రణక్షేత్రానికి వెళ్లాక...శత్రుసైన్యాన్ని చూసి గడగడా వణికిపోతాడు. అర్జునుడి వెనకెళ్లి దాక్కుంటాడు. ఉత్తరుడిని తలపించే పాత్రలు ఆఫీసుల్లో చాలానే ఉంటాయి. ‘నాకే ఆ ప్రాజెక్టు అప్పగిస్తేనా...’ అని గొప్పలు చెబుతుంటారు. ‘మేనేజ్‌మెంట్‌కు నేనెంత చెబితే అంతే’ అని ప్రగల్భాలు పలుకుతుంటారు. ‘నా హయాంలో అయితేనా..’ అంటూ ఫ్లాష్‌బ్యాకులు చూపిస్తారు. అంతా ఒట్టిదే! చెరువు ఉందని చెప్పిన దగ్గర, బురద నీళ్లు కూడా కనిపించవు. ఉత్తరకుమారులు దుర్మార్గులేం కాదు కానీ...మన సమయాన్ని మింగేస్తారు, మన బుర్రల్ని తినేస్తారు. క్యాంటీన్‌లో వన్‌-బై-టూ చాయ్‌ వరకూ ఫర్వాలేదు, కాసేపు ఉచిత వినోదం!

నోస్టైల్‌...నార్మల్‌!

కులుడు శాంతమూర్తి. సహదేవుడు విలువలకు ప్రతినిధి. మహాభారతంలో ఇద్దరూ చివరిదాకా అన్నల చాటు తమ్ముళ్లే. తమకంటూ సొంత శక్తిసామర్థ్యాలు ఉన్నట్టు నిరూపించిన సంఘటనలు చాలా అరుదు. ఆ కవలల్ని తలపించే ఉద్యోగులు కార్పొరేట్‌ భారతంలో నూటికి ఎనభైమంది. ఆ తరహా ఉద్యోగులు తెలివైనవాళ్లు, కష్టపడతారు, నిశ్శబ్దంగా తమపని తాము చేసుకుపోతారు. ఆఫీసు రాజకీయాలకు ఆమడంత దూరంలో ఉంటారు. మేనేజ్‌మెంట్‌ దృష్టిలో పడాలనో, కార్పొరేట్‌ పరుగులో ముందుండాలనో ఆరాటపడరు. ఒక్క మాటలో చెప్పాలంటే పనితప్ప మరో ప్రపంచం తెలియని అమాయక ఉద్యోగులు. ఇలాంటివాళ్లు ఆఫీసులోని రకరకాల శిబిరాల్లో...ఏ వర్గానికీ చెందరు కాబట్టి ప్రమోషన్లకు పెద్దగా ఆస్కారం ఉండదు. స్వతహాగా పనిమంతులే కాబట్టి, కొలువు వూడే దుస్థితి రాదు. పాతికేళ్ల అనుభవం తర్వాత కూడా ‘తదితరులు’ కోవలోనే మిగిలిపోతారు.

శిష్యులకే పెద్దపీట!

కార్పొరేట్‌ భారతంలో తలనెరిసిన ద్రోణాచార్యులు హెచ్‌ఆర్‌ విభాగాలకు నాయకత్వం వహిస్తుంటారు. ఎవర్లో ఏ చిన్న మెరుపున్నా ఇట్టే పట్టేస్తారు. కఠోర శిక్షణతో ఆ నైపుణ్యాలకు పదునుపెడతారు. అవకాశాలిచ్చి అందలం ఎక్కిస్తారు. ఆ తర్ఫీదులో వ్యక్తిగత స్వార్థమేం ఉండదు - ‘ నా శిష్యుడే..’ అని చెప్పుకోవాలన్న ఆరాటం తప్ప! కానీ ఆ శిష్యవాత్సల్యం కొన్నిసార్లు అదుపుతప్పుతూ ఉంటుంది. ద్రోణుడికి అర్జునుడంటే ఎంత మమకారం అంటే, పార్థుడికి సాటివచ్చే వీరుడు భూమ్మీద ఉండకూడదునుకుంటాడు. ఏకలవ్యుడి విలువిద్యా నైపుణ్యాన్ని సహించలేకపోతాడు. గురుదక్షిణగా బొటనవేలు అడిగి, అడ్డు తొలగించుకుంటాడు. కార్పొరేట్‌ ద్రోణులదీ అదే స్వభావం. కీలకమైన పదవులన్నీ తమ శిష్యులకే దక్కాలనుకుంటారు. ఎవరు పోటీకొచ్చినా తొక్కిపడేస్తారు. మరో కంపెనీకి వెళ్లినా, శిష్యప్రశిష్య సమేతంగానే బయల్దేరతారు. సమర్థత వీరి బలం, ‘నా...’ అన్న సంకుచితత్వం పెద్ద బలహీనత.

ఆ మాటే..మార్గసూచి!

విదురుడు - నీతిశాస్త్ర కోవిదుడు, నిండుసభలో ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని నిరసించిన ఒకే ఒక్కడు. పాండవుల మీద సానుభూతి ఉన్నా, అంతిమంగా ధృతరాష్ట్రుడికే విధేయుడు. ఎందుకంటే, మంత్రిగా రాజు పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించడం తన బాధ్యతని బలంగా భావించాడు. తనకు ధర్మమని తోచినదాన్ని పరోక్షంగానో, ప్రతీకాత్మకంగానో ధృతరాష్ట్రుడికి చెప్పి చూశాడు. తన పరిమితులు తనకు తెలుసు కాబట్టి, అంతకు మించి ఒత్తిడి చేయలేకపోయాడు. కార్పొరేట్‌ కంపెనీల్లో మానవ వనరుల విభాగం అధిపతులుగా, ముఖ్య సలహాదారులుగా ఈ విదురాంశ సంభూతులు తారసపడుతుంటారు. కంపెనీ విజన్‌ స్టేట్‌మెంట్‌ తయారు చేయడం, ట్రైనీ కుర్రాళ్లకు నాలుగు మంచి మాటలు చెప్పడం, అప్పుడప్పుడూ అధినేతకు ఉపన్యాసాలు రాసివ్వడం...వీళ్ల అదనపు బాధ్యతలు. ఉత్తమమైన సలహాలు ఇవ్వడం వరకే వీళ్ల పాత్ర. అవతలివారు, పాటించారా బాగుపడతారు. లేదంటే...

రెండు నాల్కలు...

ల్యుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు పోరాడేందుకు బయల్దేరాడు. మధ్యలో దుర్యోధనుడు ఎదురై, అతిథి మర్యాదలు చేయగానే ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. మరునిమిషమే కౌరవపక్షంలో చేరిపోయాడు. ‘ఎటూ వచ్చాం కదా, ఓసారి చూసిపోదాం’ అని పాండవుల ఇంటికెళ్లాడు. ఆ కాసేపట్లోనే, ధర్మరాజు మంచితనానికి కరిగిపోయాడు. తనవంతు సాయం చేస్తానని పాండవులకు మాటిచ్చాడు. కర్ణుడి సారధిగా వెళ్లినవాడు....బుద్ధిగా తేరు తోలాడా అంటే, అదీ లేదు. సూటిపోటి మాటలతో బాధపెట్టాడు. ‘పార్థుడెక్కడా, నువ్వెక్కడా? అర్జునుడి దెబ్బకు నువ్వు కుప్పకూలడం ఖాయం’ అంటూ రాధేయుడి ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీశాడు. చివరికి, ధర్మరాజు చేతిలో కుక్కచావు చచ్చాడు. శల్యసారథ్యం...కార్పొరేట్‌ ఆఫీసుల్లో సర్వసాధారణమే. మనసులో ఒకటి. చేసేది ఒకటి. ఓ వర్గంలో ఉంటారు. మరో వర్గానికి మద్దతునిస్తారు. అస్సలు నిలకడ ఉండదు. ఇలంటివారు, ఏ సీటులోనూ ఎక్కువకాలం ఉండరు, ఏ సంస్థలోనూ కుదురుగా పనిచేయరు.

దూకుడెక్కువ!

భిమన్యుడు వీరాధివీరుడు. తండ్రి అర్జునుడికి తగిన తనయుడు. కౌరవుల్ని మట్టుబెడతానంటూ వూగిపోతుంటాడు. ఆ దూకుడే దుర్యోధన బృందానికి వరమై కూర్చుంది. వీరావేశంలో, పద్మవ్యూహంలోకి వెళ్లడం వరకే తనకు తెలుసనే విషయాన్ని మరచిపోయాడు. ఫలితంగా, కర్ణుడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆఫీసుల్లో కొంతమంది కొత్త కుర్రాళ్లని చూసినప్పుడు అభిమన్యుడే గుర్తుకొస్తాడు. లేని బలాల్ని వూహించుకుంటూ తల ఎగరేస్తుంటారు. శక్తికి మించిన పనుల్ని నెత్తినేసుకుని హంగామా సృష్టిస్తుంటారు. కొద్దిరోజులు ఆ హవా కొనసాగినా...దీర్ఘకాలంలో సీనియర్ల కుట్రకు బలైపోయి ప్రాధాన్యంలేని సీట్లకు మారిపోతారు, లేదంటే ఆ తలనొప్పులు భరించలేక మరో కంపెనీకి ఎగిరిపోతారు. విజయానికి వేగం ఒక్కటే సరిపోదు, వ్యూహమూ ఉండాలి. ఆ ఒక్క లోపాన్నీ సరిచేసుకుంటే అభినవ అభిమన్యు కుమారులు కార్పొరేట్‌ పద్మవ్యూహంలో చొచ్చుకుపోగలరూ, సురక్షితంగా బయటపడనూగలరు.

ఆఫీసులో...ఎవరు ఏ పాత్రలో ఇమిడిపోతారన్న అంచనా మంచిదే. అదే సమయంలో మనం ఏ పాత్రలో ఒదిగిపోగలమన్న మదింపూ ఉండాలి. ‘మహాభారతంలోని వేలకొద్దీ అనామక పాత్రల్లా...ఏ ప్రాధాన్యం లేకుండా మిగిలిపోవాలా? ‘మ్యాన్‌ ఆఫ్‌ ద ఎపిక్‌’ అర్జునుడిలా మనదైన ప్రత్యేకత చాటుకోవాలా?’ అన్నది ఎవరికివారు తేల్చుకోవాల్సిన విషయం.ఆ నిర్ణయం మీదే కెరీర్‌ ‘జయం’ ఆధారపడి ఉంటుంది. భారతానికి మరో పేరు... ‘జయం’.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.