close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నేస్తం... సమస్తం!

నేస్తం... సమస్తం!

స్నేహితుడు... అమ్మలా ప్రేమను పంచుతాడు. నాన్నలా బాధ్యత నేర్పిస్తాడు. అక్కలా జాగ్రత్తలు చెబుతాడు. తమ్ముడిలా పేచీ పెడతాడు. గురువులా కర్తవ్యం బోధిస్తాడు. జీవితభాగస్వామిలా కష్టసుఖాల్లో తోడుంటాడు. సృష్టిలో అందరి స్థానాన్నీ భర్తీ చేయగల ఆ స్నేహితుడే అన్ని విధాలా మన జీవితాన్నీ ప్రభావం చేస్తాడు. మనం ఇప్పుడెలా ఉన్నామన్నది నిన్నటి మన స్నేహితులే నిర్ణయించారు. రేపు ఎలా ఉంటామన్నదీ ఇప్పటి మన స్నేహితులే నిర్ణయిస్తారు. అందుకేనేమో, అన్ని బంధాల్నీ పుట్టుకతోనే ఇచ్చే ఆ దేవుడు, అత్యుత్తమమైన స్నేహబంధాన్ని ఎంచుకునే అవకాశాన్ని మాత్రం మనిషికే వదిలేశాడు.

‘మనిషికి అసలు ఎంత మంది స్నేహితులుండాలి?’... ‘ఫ్రెండ్షిప్‌ డే’ సందర్భంగా క్లాసులో స్నేహం గురించి చర్చ జరుగుతుంటే మాస్టారుకి ఓ పిల్లాడి నుంచి ఎదురైన ప్రశ్న ఇది. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో ఆ గురువుగారికి అర్థం కాలేదు. కాసేపు ఆలోచించి పిల్లలందర్నీ బయట ఉన్న మామిడి చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు. ‘ఆ పైనున్న మామిడిపండుని తెంపడానికి నీకెంత మంది స్నేహితుల సాయం కావాలో తీసుకో’ అని ఆ ప్రశ్న వేసిన పిల్లాడితో అన్నాడు. మొదట ఓ ఐదుగురు కలిసి ఆ పిల్లాడిని పైకెత్తినా పండు అందలేదు. తరవాత మరో పది మంది పిరమిడ్‌లా ఒకరినొకరు పట్టుకొని ఆ పిల్లాడిని ఎక్కించుకొని నిలబడినా మామిడిపండు దొరకలేదు. చివరికి ఆ అబ్బాయి క్లాసులో పిల్లలందరినీ గుండ్రంగా ఒకరిమీద ఒకరిని నిల్చోబెట్టి పైకెక్కి ఎలాగైనా ఆ పండుని తెంపాలని ప్రయత్నించాడు. అది దొరకలేదు సరికదా, పట్టు తప్పి పిల్లలంతా కింద పడి దెబ్బలు తగిలించుకున్నారు. దూరం నుంచి ఈ తంతునంతా గమనిస్తున్న ఓ పిల్లాడు నింపాదిగా నిచ్చెన తీసుకొచ్చి ఆ పిల్లాడి ముందు పెట్టి దాని సాయంతో పండు కోసుకోమని చెప్పాడు. దాంతో ఆ మాస్టారి పని సులువైంది. ఎంతమంది ఉన్నారన్నది కాదు, ఆ నిచ్చెన తెచ్చిన అబ్బాయిలాంటి ఆలోచన ఉన్న స్నేహితుడు ఒక్కడున్నా చాలన్నదే ఆ గురువుగారు బోధించాలనుకున్న విషయం. అందుకే స్నేహితులు ‘లిఫ్ట్‌’ లాంటి వాళ్లు, మనల్ని పైకి తీసుకెళ్లాలన్నా, కిందకి దించాలన్నా వాళ్ల చేతుల్లో పనే అని చెబుతారు. స్నేహితులు చూపే ఈ ప్రభావానికి పరిశోధకులు పెట్టిన పేరు ‘ఫ్రెండ్‌ఫ్లుయెన్స్‌’. సృష్టిలో ప్రతి వ్యక్తి జీవితాన్నీ ముందుకు నడిపించేది ఆ ప్రభావమే. మన దుఃఖం, సంతోషం, కోపం, నవ్వూ, ఆలోచనా, ఆరోగ్యం, అలవాట్లూ, కెరీర్‌... అన్నిటినీ నిర్దేశించేదీ, గమ్యాన్ని నిర్ణయించేదీ మన స్నేహితులే.

అలవాట్లపైన...
పొద్దున్నే ఒక్కరమే జాగింగ్‌కి వెళ్దామనుకుంటాం. కానీ మంచం దిగ బుద్ధి కాదు. ఒంటరిగా జిమ్‌లోనూ కాలు పెట్టాలనిపించదు. సినిమాలూ, రెస్టరెంట్లూ, షాపింగ్‌, పర్యటనలూ... ఇలా ఎన్నో చోట్లకు ఒంటరిగా వెళ్లాలంటే చాలామందికి మనసు రాదు. కారణం... ఇలాంటి ప్రదేశాల్లో తొంభై శాతం ఎవరూ ఒంటరిగా కనిపించరు. చుట్టూ అంతా స్నేహితులతో సరదాగా గడుపుతుంటే, వాళ్ల మధ్యలో ఏకాకిలా ఉండటానికి ఎవరూ ఇష్టపడరు. ఒకవేళ తప్పనిసరై వెళ్లాల్సొచ్చినా, స్నేహితుల సమక్షంలో ఉన్నంత ఉత్సాహంగా అక్కడ గడపలేం. ఏదో ఆత్మన్యూనత ఆవరిస్తుంది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. దాంతో ఒత్తిడి పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు మొదలవుతాయి. ఇవన్నీ తిరిగి తిరిగీ మన అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఓ మంచి స్నేహితుడు. క్రమశిక్షణ కలిగిన స్నేహితుడు తోడుంటే జీవితం సగం గాడిన పడుతుంది. జిమ్‌కి డుమ్మా కొట్ట బుద్ధికాదు. దాంతో ఆరోగ్యం మెరుగవుతుంది. పర్యటనలూ, సినిమాల్లాంటి సరదాలకూ లోటుండదు. దాంతో మానసిక ఉల్లాసానికీ కొదవుండదు. పదిమందితో కలిసుండటం వల్ల ఆత్మవిశ్వాసమూ రెట్టింపవుతుంది. ఆ ప్రభావం చేసే ప్రతి పనిలోనూ కనిపిస్తుంది. లైబ్రరీలూ, యోగా, ధ్యాన కేంద్రాలూ, జిమ్‌లూ, క్రీడా శిక్షణా కేంద్రాలూ... ఇలా మనిషి ఉన్నతికి సహాయపడే అనేక కేంద్రాల్లో హాజరు శాతాన్ని పరిశీలిస్తే, ఒంటరిగా వచ్చే వాళ్లకన్నా స్నేహితుల తోడున్నవారే క్రమం తప్పకుండా వాటికి హాజరవుతున్నారని ‘సైకలాజికల్‌ సైన్స్‌’ మేగజీన్‌ పరిశీలన తేల్చి చెబుతోంది. అంటే... ఏదైనా మంచి అలవాటుని అలవర్చుకోవడంలో మనం వెనకబడుతున్నామంటే, సరైన స్నేహితుల తోడు మనకు లేదని గమనించుకోవాల్సిందే.

ఆర్థిక స్థితిపైన...
ప్రేమలో విఫలమైనా, భాగస్వామితో సంతృప్తిగా లేకపోయినా, వ్యాపారంలో నష్టపోయినా, చదువులో వెనకబడినా... ఇలాంటి అనేక సందర్భాల్లో భావోద్వేగాలు అదుపులో ఉండవు. ఆ ప్రభావం ఖర్చులపైనా పడుతుంది. డబ్బుల విషయంలో జాగ్రత్త లేకుండా, ముందూ వెనకా ఆలోచించకుండా ఖర్చు చేస్తారు. ఆ సమయంలో భావోద్వేగాలు శ్రుతిమించి ఆలోచనలూ, ఆర్థిక క్రమశిక్షణా అదుపు తప్పుతాయి. ఆ సందిగ్ధాన్ని ఇంట్లోవాళ్లతో పంచుకునే స్వేచ్ఛా అందరికీ ఉండదు. మనసుని కలవరపెట్టే ఆ కల్లోల స్థితి సద్దుమణగాలంటే స్నేహితుల సాయం కావాల్సిందే. మంచి స్నేహితుడులేని లోటు మనిషి ఆర్థికస్థితిపైన నేరుగా ప్రభావం చూపుతుందనీ, అలాంటి వాళ్లు ఖర్చుల విషయంలో అజాగ్రత్తగా ఉంటారనీ ‘జర్నల్‌ ఆఫ్‌ కన్జ్యూమర్‌ రీసెర్చ్‌’ అధ్యయనం చెబుతోంది. ఒంటరితనాన్ని ఇష్టపడేవాళ్లూ, ఎక్కువగా ఎవరితో కలవని వాళ్లూ డబ్బు వ్యవహారాల్లో, వ్యాపారాల్లో ఎక్కువ రిస్క్‌ తీసుకుంటారనీ తేలింది. దానికి కారణం వాళ్ల నిర్ణయాల్ని చర్చించడానికీ, లాభనష్టాల్ని బేరీజు వేయడానికీ తోడెవరూ లేకపోవడమే. ఆ విషయాన్ని అంతర్జాతీయ కుబేరులు వారెన్‌ బఫెట్‌, బిల్‌గేట్స్‌ లాంటి వాళ్లూ అంగీకరిస్తారు. బఫెట్‌కు తొలి రోజుల్లో పెట్టుబడుల విషయంలో ఏమాత్రం నియంత్రణ ఉండేది కాదట. చార్లీ ముంగేర్‌ అనే స్నేహితుడు తన జీవితంలోకి వచ్చాకే పెట్టుబడుల విషయంలో కాస్త దూకుడు తగ్గించానని ఆయన చెబుతారు. మరోపక్క బిల్‌గేట్స్‌ కూడా మైక్రోసాఫ్ట్‌లో కాకుండా మరేదైనా కార్యక్రమం కోసం డబ్బు ఖర్చు చేయాల్సొస్తే, దానికి బఫెట్‌ సలహా తీసుకొని తీరతానని అంటారు. అంతటి సంపన్నులే ఆర్థిక సలహాలకు స్నేహితుల్ని ఆశ్రయిస్తున్నారంటే... స్నేహితుల ప్రభావం మన ఆర్థిక నిర్ణయాల్ని ప్రభావితం చేస్తుందనే కదా!

అభివృద్ధి పైన...
సాధారణంగా క్లాసులో బాగా చదవని పిల్లలకు స్నేహితులు తక్కువగా కనిపిస్తారు. ఆఫీసుల్లో కూడా సరిగ్గా పనిచేయలేని వాళ్లతో ఇతరులు త్వరగా కలిసిపోరు. వాళ్లు వెనకబడుతున్నారు కాబట్టి ఎవరూ స్నేహం చేయడానికి ఇష్టపడరన్నది చాలామంది భావన. కానీ ఈ పరిస్థితిని చూడాల్సిన కోణం అది కాదనీ, స్నేహితులు తక్కువగా ఉండటం వల్లే వాళ్లు చదువులో, కెరీర్లో మరింత వెనకబడుతున్నారని గుర్తించాలనీ హాంకాంగ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అధ్యయనాల సాక్షిగా సూచిస్తున్నారు. దీనికోసం చాలామంది విద్యార్థులూ, ఉద్యోగులని వాళ్లు జల్లెడపట్టారు. మొదట కాలేజీలో టాపర్లనూ వెనకబడిన వాళ్లనూ వేరు చేశారు. కొన్నాళ్లపాటు కొందరు వెనకబడిన విద్యార్థులని టాపర్లతోనే కలిసి కూర్చోమని చెప్పారు. రోజులు గడిచేకొద్దీ టాపర్ల ప్రభావం సాధారణ విద్యార్థులపైనా పడటం మొదలైంది. తమ పక్కన కూర్చునేవాళ్లు శ్రద్ధగా అన్ని తరగతులకూ హాజరవుతుంటే తాము మాత్రం ఎప్పుడుపడితే అప్పుడు బంక్‌ కొట్టడం సరికాదన్న ఆలోచన వాళ్లలో మొదలైంది. గతంలో స్టడీ అవర్లను ఇష్టానుసారంగా ఎగ్గొట్టిన విద్యార్థులు, క్రమంగా ఆ పనిచేయడాన్ని తప్పుగా భావించే పరిస్థితి నెలకొంది. ఆర్నెల్లు తిరిగేసరికి వాళ్ల మార్కుల్లోనూ స్పష్టమైన తేడా కనిపించింది. కార్యాలయాల్లోనూ ఈ ప్రయోగం మంచి ఫలితాల్నిచ్చింది. బాగా పనిచేసేవాళ్ల పక్కన కూర్చున్న ఉద్యోగుల్లో నెమ్మదిగా కష్టపడేతత్వం పెరిగింది. గతంలో ఠంచనుగా సమయానికి ఇంటికెళ్లిపోయేవాళ్లు కూడా పని పూర్తయ్యేదాకా కార్యాలయంలోనే గడపడం మొదలుపెట్టారు. మొక్కుబడిగా ఏ మాటా మాట్లాడకుండా పక్కన కూర్చున్నవాళ్లతో పోలిస్తే, కాస్త స్నేహంగా పక్కవారితో కలిసిపోయినవాళ్లలోనే ఈ సానుకూల మార్పులు కనిపించాయట. స్నేహితులతో తమని తాము పోల్చి చూసుకోవడం మనిషి సహజ లక్షణమనీ, తెలీకుండానే తమ స్నేహితుల స్థాయికి తగ్గట్టుగానే ఇతరులూ కష్టపడటానికి ఇష్టపడతారనీ ఆ ప్రొఫెసర్లూ నిర్ధరించారు. పరిశోధనల దాకా ఎందుకు, కాలేజీలోనో, ఆఫీసుల్లోనో మన చుట్టూ ఉన్నవాళ్లని గమనించినా చాలు, మెరుగైన వాళ్లంతా ఒకే బృందంగా ఉన్నట్టుగా కనిపిస్తారు. కానీ నిజానికి స్నేహంగా ఉండబట్టే వాళ్లంతా మెరుగ్గా ఉంటారన్నది అధ్యయనాల సారాంశం. అంటే... కష్టపడేతత్వం, అంకితభావం, మార్కులూ, కెరీర్‌లాంటి వాటన్నింట్లో అభివృద్ధికి నేరుగా స్నేహితులే కారణం.

  ఆయుష్షు పైన...
రంగనాథ్‌... ఒకప్పటి ఈ మేటి నటుడు ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా నిత్యం ఎందరో విద్యార్థులు ఒత్తిడిని జయించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. మంచి స్నేహితుల తోడుంటే ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాదంటారు ఆరోగ్య నిపుణులు. సుదీర్ఘకాలం సంతోషంగా జీవించడానికి స్నేహితుల సాహచర్యం చాలా కీలకమన్నది వారి మాట. నేస్తాల ప్రభావం ఆయుర్దాయంపైన ఉంటుందనీ అధ్యయనాలూ చెబుతున్నాయి. నిత్యం స్నేహితుల సమక్షంలో గడిపేవారికీ, బాధైనా సంతోషమైనా ప్రతి విషయాన్నీ ఇతరులతో పంచుకునేవాళ్లకీ ఒత్తిడికి దారితీసే హార్మోన్లు అదుపులో ఉంటాయి. దాంతో రక్తపోటు, గుండెపోటు, మధుమేహం లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం తగ్గుతుంది. ఫలితంగా ఆయుష్షూ పెరుగుతుంది. ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లు పదేళ్లపాటు పదిహేను వందల మందినీ, అమెరికాలోని ఓ ప్రైవేటు సంస్థ 32ఏళ్ల పాటు 12వేల మందినీ పరిశీలించి తేల్చిన విషయమిది. ఎంపిక చేసిన వ్యక్తుల ఆరోగ్యాన్నీ, ఆయుర్దాయాన్నీ సుదీర్ఘకాలంపాటు గమనిస్తూ వచ్చిన పరిశోధకులు ఒంటరి జీవులతో పోలిస్తే, ఎక్కువ స్నేహితులు కలిగిన వాళ్లు ఆరేడేళ్లు అధికంగా జీవించారనీ, ఎక్కువ కాలంపాటు మంచమ్మీద గడపాల్సిన అవసరమూ వాళ్లకు రాలేదనీ చెబుతున్నారు. అంటే... స్నేహితుల సమక్షంలో ఒత్తిడి తరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది. ఫలితంగా దీర్ఘాయువనే వరం అందుతుంది.

వ్యక్తిత్వం పైన...
నీ స్నేహితులెవరో చెబితే, నువ్వెలాంటి వాడివో చెప్పడం పెద్ద కష్టం కాదంటారు. నిజమే, ‘మనం’ అంటే మనతో పాటు మన స్నేహితులు కూడా. వారి ఆలోచనలే మన ఆలోచనలు, వారి అలవాట్లే మన అలవాట్లు, వారి వ్యక్తిత్వమే మన వ్యక్తిత్వం. మన స్నేహితుడు మంచి నాయకుడైతే, మనలోనూ ఆ లక్షణాలు ఎన్నో కొన్ని కనిపిస్తాయి. మన స్నేహితుడు ఇతరుల సమస్యలకు స్పందించేవాడైతే, మన మనసూ సున్నితంగా మారుతుంది. మన స్నేహితుడు కుటుంబాన్ని అమితంగా ఇష్టపడేవాడైతే, మనకూ అతడిలానే కుటుంబ సభ్యుల్ని ప్రేమించాలనిపిస్తుంది. ఆహారం, ఆహార్యం, ఆరోగ్యం, అభిరుచులూ... అన్నింట్లో మన స్నేహితులు కనిపిస్తారు. ఓ వ్యక్తి వ్యవహారశైలిని పరిశీలిస్తే అతడి ప్రతి నిర్ణయంలోనూ స్నేహితుల ప్రభావం స్పష్టంగా ఉంటుందని మాంట్రియల్‌లోని కాంకర్డియా విశ్వవిద్యాలయ పరిశోధనలు చెబుతున్నాయి. ఒకే దేశంలో నివసించే మనుషుల రూపంలో పోలికలున్నట్లు, ఒక స్నేహితుల బృందంలోని అందరి స్వభావంలోనూ బోలెడంత సారూప్యత ఉంటుందని అక్కడి పరిశోధకులు అంటున్నారు. దీనికోసం కార్పొరేట్‌ సంస్థల సీయీవోల స్నేహితుల నుంచి కాలేజీ విద్యార్థుల స్నేహితుల బృందాల వరకూ చాలామంది స్వభావాన్ని వాళ్లు అధ్యయనం చేశారు. రకరకాల సమస్యలూ, సందర్భాలను వాళ్ల ముందు పెట్టి విడివిడిగా సమాధానాలు రాబట్టారు. ఒకే బృందానికి చెందిన స్నేహితులంతా ప్రతి ప్రశ్నకూ దాదాపు ఒకేలాంటి సమాధానమివ్వడం అధ్యయనకర్తలను ఆశ్చర్యపరిచింది. దాదాపు ఐదేళ్లపాటు సాగిన ఈ పరిశోధన మనుషుల వ్యక్తిత్వంపైన స్నేహితుల ప్రభావం కచ్చితంగా ఉంటుందని నిరూపిస్తోంది. అంటే... ఓ వ్యక్తి దొంగలా మారినా, మహాత్ముడిలా ఎదిగినా ఆ మార్పు వెనక స్నేహితులకీ వాటా ఉంటుందన్న మాట.

జీవనశైలి పైన...
ప్రస్తుత జమానాలో స్నేహితులు రెండు రకాలు. ఒకటి... మనం నిత్యం కలిసే స్నేహితులు. రెండు... ఆన్‌లైన్‌ స్నేహితులు. ఈ రెండో రకం స్నేహితుల ప్రభావం మనుషుల జీవన విధానాన్ని సమూలంగా మార్చేస్తోంది. సోషల్‌ మీడియా పుణ్యమా అని చిన్నప్పుడు వూళ్లొ చదువుకున్న రోజుల్నాటి స్నేహితులు కూడా టచ్‌లోకి వచ్చేస్తున్నారు. స్నేహితులకు స్నేహితులైన వాళ్లు కూడా మనకు నేస్తాలుగా మారిపోతున్నారు. ముక్కూమొహం తెలియనివాళ్లు సైతం ఫ్రెండ్స్‌ జాబితాలో చేరిపోతున్నారు. అలా ఒక్కొక్కరి ఫేస్‌బుక్‌ ఖాతాల్లో వందలమంది స్నేహితులు పోగవుతున్నారు. దాంతో ఎప్పటికప్పుడు వాళ్లు సాగిస్తున్న ప్రయాణాలూ, కెరీర్‌లో సాధిస్తున్న విజయాలూ, పొందుతున్న అవకాశాలూ, చేసుకుంటున్న పార్టీలలాంటి వాటికి సంబంధించిన ఫొటోలన్నీ ఫేస్‌బుక్‌ ఖాతాలో ప్రత్యక్షమవుతున్నాయి. అలా అందరి జీవితాలూ తెరిచి ఉంచిన పుస్తకాల్లా పారదర్శకంగా మారుతున్నాయి. ఫలితంగా ఆన్‌లైన్‌ స్నేహితుల జీవనశైలిని చాలామంది తెలీకుండానే అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారని ‘ఎడిన్‌బరో బిజినెస్‌ స్కూల్‌’ నివేదిక చెబుతోంది. ఆ ప్రభావం వేసుకునే దుస్తుల నుంచి భవిష్యత్తుకి సంబంధించిన నిర్ణయాల దాకా అన్ని విషయాల్లో పడుతోందట. ఆన్‌లైన్‌లో తమకంటే మెరుగైన స్థితిలో ఉన్న స్నేహితులని చూసి, వాళ్లలాంటి దుస్తుల్ని ధరించడానికీ, వాళ్లలా పర్యటనలకు వెళ్లడానికీ, కెరీర్‌లో ముందుకు వెళ్లడానికీ, మొత్తంగా వాళ్లలా మరింత ఉన్నతంగా ఎదగడానికీ ప్రయత్నిస్తున్నారట. అంటే... సోషల్‌మీడియా పుణ్యమా అని కనీసం ఒక్కసారి కూడా కలవకుండానే కొందరు స్నేహితులు ఇతరుల జీవనశైలినీ మార్చేస్తున్నారన్న మాట.

శాస్త్రవేత్తల అధ్యయనాలే కాదు మన రోజువారీ అనుభవాలు కూడా తినే తిండీ, ధరించే దుస్తులూ, పలికే మాటా, కోరుకునే జీవితం... ఇలా అన్నింట్లో స్నేహితుల ముద్ర సుస్పష్టం అని చెప్పకనే చెబుతున్నాయి. అంటే మనకు మంచి స్నేహితులుంటే మంచి జీవితం, చెడ్డ స్నేహితులుంటే చెత్త జీవితం అన్నది నిశ్చయమంటారు మానసిక నిపుణులు. కానీ అందరినీ పూర్తిగా ఒకే గాటన కట్టేయలేం. మనిషంటేనే మంచీ చెడుల కలయిక. అందుకే ప్రతి స్నేహితుడూ హంసలా మారాలి. ఇతరుల్లోని లోపాల్నీ, చెడుగుణాల్నీ పక్కనబెట్టి మంచిని మాత్రమే అలవర్చుకోవాలి. సందర్భాన్ని బట్టి పువ్వులానూ మారాలి. చెడు ప్రభావం మనల్ని చిదిమేస్తున్నా, పరిమళాన్నే పంచే ప్రయత్నం చేయాలి.

మంచి స్నేహితులు కావాలని కోరుకుంటే సరిపోదు. ముందు ఆ ‘మంచి’ మనలో ఉందో లేదో చూసుకోవాలి. లోపాలుంటే సరిచేసుకోవాలి. గాజు గ్లాసుకి ఇవతలి వైపు మాత్రమే గీత ఉన్నా, అవతలివైపూ అది కనిపిస్తుంది. స్నేహంలోనూ అంతే. కోపమైనా, ప్రేమైనా, బాధైనా, సంతోషమైనా, కష్టమైనా, సుఖమైనా... మనమేం పంచుతామో అదే మనకూ తిరిగొస్తుంది. దానికి అనుగుణంగా మారితే, మనం ఎదురుచూస్తున్న లక్షణాలున్న స్నేహితుడు ముందు మనలోనే మనకు కనిపిస్తాడు.

* * *

ఓ వూళ్లొ జనాలంతా ఓ బౌద్ధ సన్యాసిని అమితంగా ఆరాధించేవారు. ఆయన ప్రసంగాలను ముగ్ధులై వినేవారు. ఆయన చెప్పిన ప్రతి పనినీ కాదనకుండా చేసేవారు. కానీ అదే వూళ్లొ ఓ కుర్రాడు మాత్రం ఆ సన్యాసి ప్రసంగాలను అస్సలు ఇష్టపడేవాడు కాదు. ఆయన చెప్పే ప్రతి సూక్తిలో ఏదో ఒక లోపాన్ని వెతికేవాడు. ఆయన చెప్పే ప్రతి మాటా అసత్యమేనని ప్రచారం చేసేవాడు. వూళ్లొవాళ్లంతా ఆ కుర్రాడి ప్రవర్తనతో విసిగిపోయినా, చేసేదేమీలేక వూరుకునేవారు. ఉన్నట్టుండి ఓ రోజు ఏదో అనారోగ్యం కారణంగా ఆ కుర్రాడు చనిపోయాడు. అతడి అంతిమసంస్కారానికి వచ్చిన బౌద్ధ సన్యాసి మొహంలో దుఃఖాన్ని చూసి వూరి వాళ్లంతా ఆశ్చర్యపోయారు. తనని ద్వేషించే వ్యక్తి చనిపోతే ఇంతలా బాధపడటం దేనికీ అని అడిగారు. అప్పుడా సన్యాసి... ‘నేను బాధపడుతుంది అతడి గురించి కాదు, నా గురించి. ఈ వూళ్లొ నాకు నిజమైన స్నేహితుడు ఆ కుర్రాడే. నేను చెప్పే ప్రతి మాటలో, చేసే ప్రతి పనిలో అతడు లోపాలు వెతికేవాడు. ఆ అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు నన్ను నేను మెరుగుపరచుకోవడానికి చాలా శ్రమించేవాడిని. ఇప్పుడలా నాలో లోపాల్ని వెతికేవాళ్లుండరు. అంటే నా ఎదుగుదల ఇక్కడితో ఆగిపోతుంది’ అన్నాడు. స్నేహితులంటే ఆత్మీయులే కానవసరం లేదు, పరోక్షంగా మన ఉన్నతికి సాయపడే శత్రువు కూడా గొప్ప స్నేహితుడే అన్నది ఆ గురువుగారి ఉద్దేశం. అంటే... మన స్నేహితుడు మంచివాడా చెడ్డవాడా అన్నది పక్కనపెడితే, అతడి నుంచి మనం ఏం స్వీకరిస్తున్నామన్నదే మన జీవితం ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది.

- శరత్‌ కుమార్‌ బెహరా

అమ్మాయి-అబ్బాయి-స్నేహం! 

మ్మాయిల మధ్య ఉండే స్నేహంతో పోలిస్తే, అబ్బాయిల మధ్యే స్నేహం ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉందంటారు శాస్త్రవేత్తలు. దీనికి అనేక కారణాలను వాళ్లు చూపిస్తున్నారు. స్వతహాగానే అబ్బాయిల్లో ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకునే స్వభావం ఎక్కువగా ఉంటుందనీ, స్నేహితుడి వల్ల ఏదైనా ఇబ్బంది కలిగినా, సమయానికి సాయం చేయలేకపోయినా, కొన్నాళ్లకే ఆ విషయాన్ని వాళ్లు మరచిపోగలరనీ పరిశోధకులు అంటున్నారు. అవతలివాళ్ల స్వభావం కారణంగా నొచ్చుకుంటే, దాన్ని ఎక్కువ రోజులు మనసులో పెట్టుకోకుండా అప్పటికప్పుడే అబ్బాయిలు బయట పెట్టేస్తారట. స్నేహితుల బలహీనతలూ, దుస్తులు ధరించే విధానం, అభిరుచులూ లాంటి కొన్ని విషయాలకు అబ్బాయిలు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వరట. అమ్మాయిలతో పోలిస్తే తరచూ అబ్బాయిలు కలిసే అవకాశం ఎక్కువగా ఉండటం కూడా స్నేహం బలపడటానికి ఓ కారణమంటున్నారు. భారత్‌లాంటి దేశాల్లో అమ్మాయిలను చూసే కోణంలో తేడాలుండటం, అనేక ఆంక్షలు విధించడం, పెళ్లయ్యాక స్నేహితుల కోసం సమయం కేటాయించే అవకాశాలు తగ్గిపోవడం, అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు త్వరగా భావోద్వేగానికి గురవ్వడం లాంటి కారణాల వల్ల అమ్మాయిల మధ్య స్నేహం ఎక్కువకాలంపాటు కొనసాగే అవకాశాలు కాస్త తక్కువంటారు మానసిక నిపుణులు.

ఏడేళ్ల స్నేహం చాలు! 

స్నేహితులు దగ్గరయ్యే కొద్దీ దీర్ఘకాలంలో వాళ్ల డీఎన్‌ఏలో మార్పులు చోటు చేసుకుంటాయనీ, ఇద్దరి డీఎన్‌ఏలోనూ ఒకశాతం మేర పోలికలు ఏర్పడతాయనీ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు అంటున్నారు. చాలామంది స్నేహితులు ఒకేలా ఆలోచించడానికి ఇదే ప్రధాన కారణమట.

* స్నేహితుడికి నచ్చే విషయాలకంటే, ఇష్టపడని వాటి గురించి తెలుసుకున్నప్పుడే ఇద్దరి మధ్యా స్నేహం బలోపేతమవుతుందట. ఇష్టపడే పనుల్ని చేసే వాళ్లకంటే తమకి నచ్చనివాటిని చేయని వాళ్లనే ఎక్కువ ఇష్టపడతారని పరిశోధనలు చెబుతున్నాయి.

* మనం అపాయంలో ఉన్నా మన దగ్గరి స్నేహితుడు అపాయంలో ఉన్నా మన మెదడు ఒకేలా స్పందిస్తుందట. కొందరు వ్యక్తుల్ని తక్కువ స్థాయి కరెంటు షాక్‌కి గురి చేసి, ఆ సమయంలో వాళ్ల స్నేహితుల మెదడు స్పందించే విధానాన్ని స్కాన్‌ చేసి మరీ వర్జీనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించారు.

* స్త్రీ పురుషుల మధ్య స్నేహం స్నేహంగా మాత్రమే నిలిచి ఉండే అవకాశం తక్కువగా ఉంటుందనీ, ఏదో ఒక సందర్భంలో స్నేహానికి అతీతమైన ఆకర్షణకు వాళ్లు లోనవుతారనీ విస్కన్‌సిన్‌ యూనివర్సిటీకి చెందిన అధ్యయనకర్తలు అంటున్నారు. చాలామంది ఆడా-మగ స్నేహితులను పరిశీలించాకే వాళ్లీ అంచనాకి వచ్చారు.

* ఫేస్‌బుక్‌ రాకతో ప్రపంచవ్యాప్తంగా స్నేహం తీరుతెన్నులే మారిపోయాయట. గతంలో ఓ మనిషికి సగటున 150కి మించి స్నేహితులు ఉండే అవకాశం లేదని పరిశోధనలు చెప్పేవి. కానీ ఫేస్‌బుక్‌ రాకతో ఆ లెక్కలు తప్పి, కొన్ని వందల కొత్త పరిచయాలు స్నేహాలుగా మారుతున్నాయట.

* ఏడేళ్లపాటు ఎవరితోనైనా స్నేహం చేస్తే, జీవిత కాలంపాటు ఆ స్నేహితులు విడిపోరన్నది ప్రపంచవ్యాప్తంగా చాలామంది మానసిక నిపుణులు చెప్పే విషయం.

ఆ నమ్మకంతోనే... 

స్నేహితుల దినోత్సవం రోజున చేతికి కట్టుకునే ఫ్రెండ్షిప్‌ బ్యాండ్‌పైనా చాలా దేశాల్లోని ప్రజలకు అనేక నమ్మకాలున్నాయి. అది కట్టించుకునేవాళ్ల జీవితాల్లో మంచి మార్పుని కోరుకుంటూ స్నేహితులు ఆ బ్యాండ్‌ని కడతారట. దానంతటదే తెగి వూడిపోయే నాటికి వాళ్ల ఆకాంక్ష నెరవేరుతుందన్నది చాలామంది నమ్మకం. మన దేశంలో రాఖీలానే చాలాదేశాల్లో ఇష్టమైన వాళ్ల చేతికి వివిధ సందర్భాల్లో రంగురంగుల దారం కట్టే సంప్రదాయం ఉంది. అలానే 1980 ప్రాంతాల్లో స్నేహితుల దినోత్సవంనాడు ఫ్రెండ్షిప్‌ బ్యాండ్‌ని కట్టే సంప్రదాయం చైనా నుంచి మొదలైందని చెబుతారు.

అన్నిచోట్లా ఆ రోజే! 

భారత్‌తో సహా అనేక దేశాల్లో స్నేహితుల దినోత్సవాన్ని ఆగస్టులో వచ్చే మొదటి ఆదివారం నాడే జరుపుకుంటారు. కానీ ప్రపంచ దేశాలన్నీ సభ్యులుగా ఉన్న ‘ఐక్య రాజ్య సమితి’ జులై 30ని ఫ్రెండ్షిప్‌ డేగా అధికారికంగా ప్రకటించడం విశేషం. కాకపోతే ఇది జరిగి ఆరేళ్లే అయింది. అంతకుముందు ఎన్నో ఏళ్ల నుంచి చాలా దేశాలకు ఆగస్టు నెలలోని తొలి ఆదివారంనాడు ఆ వేడుకని జరుపుకోవడం అలవాటవడంతో దాన్నే తరవాతా కొనసాగిస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తరవాత ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం దెబ్బతినడంతో, తిరిగి అందరి మధ్యా స్నేహభావాన్ని పెంచే ఉద్దేశంతో 1930ల్లో ఈ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని అమెరికా నిర్ణయించింది. తరవాతి రోజుల్లో మిగతా దేశాలూ దానికి మద్దతు పలికాయి. అలా క్రమంగా ఇతర దేశాలకూ ఈ వేడుక విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన కార్టూన్‌ పాత్ర ‘విన్నీ ది పూ’ అనే భల్లూకాన్ని ‘ఫ్రెండ్షిప్‌ డే అంబాసిడర్‌’గా ఐరాస ప్రకటించింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.