close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ కార్లకు డ్రైవింగ్‌ తెలుసు!

ఈ కార్లకు డ్రైవింగ్‌ తెలుసు!

కంప్యూటర్‌ కనిపెట్టాడు... అంతర్జాలంతో అవనిని చుట్టేశాడు...
చేతిలో ఇమిడే సెల్‌ఫోన్‌తో జీవనవిధానాన్నే ‘స్మార్ట్‌’ చేసేశాడు...
అయినా ఇంకా ఏదో సాధించాలి...
వేళ్ల మధ్య నుంచి జారిపోతున్న సమయాన్ని ఒడిసి పట్టాలి...
ఎన్నెన్నో పనులు...
మల్టి టాస్కింగ్‌ మాయాజాలంలో ఇరుక్కున్న మనిషికి 24 గంటలు సరిపోవడం లేదు. అందుకే ఎన్నో యంత్రాలు
కనిపెడుతున్నాడు. వాషింగ్‌మెషీన్‌, డిష్‌ వాషర్‌ లాంటి గృహోపకరణాలతో మొదలెట్టి రోబోల వరకూ ఎన్నో వస్తువులు.
టైమ్‌ సెట్‌ చేసి స్విచాన్‌ చేస్తే ఆటోమేటిగ్గా పని చేసేస్తున్నాయి. అలాంటప్పుడు కారుని మాత్రం ఇంకా మనమే ఎందుకు నడపాలి? గంటలకొద్దీ సమయం ఎందుకు వృథా చేసుకోవాలి? ప్రమాదాలకు ఎందుకు గురి కావాలి?

నిషి చలనశీలి. కదలిక ప్రగతికి మార్గం. ఉన్నచోటే ఉంటే శతాబ్దాలు మారతాయి కానీ చరిత్ర మారదు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి... కొత్త ప్రాంతాలను సందర్శించాలి... కొత్త విషయాలను కనిపెట్టాలి. మనిషిలోని ఈ తీరని దాహానికి సమయాన్ని ఆదా చేయాలన్న కోరిక తోడై ఇప్పుడు కార్ల తయారీదారులను కొత్త పరిశోధనల వెంట పరుగులు తీయిస్తోంది. అత్యంత ఆధునిక సాంకేతికతతో గాల్లో తేలిపోతున్నట్లు దూసుకుపోయే కార్లొచ్చాయి. అయినా ఆశ తీరలేదు. ఇప్పుడిక సారథి లేని రథాల తయారీలో కంపెనీలు తలమునకలవుతున్నాయి. త్వరలోనే స్టీరింగ్‌ చక్రం లేని నాలుగు చక్రాల వాహనం దూసుకుపోనుంది. అలాంటి కారును అందుబాటులోకి తేవడానికి ఆటోమొబైల్‌ సంస్థలు పోటీ పడుతోంటే వాటికి దీటుగా మేమున్నామంటున్నాయి గూగుల్‌, ఆపిల్‌ లాంటి టెక్‌ సంస్థలు. అందుకు అవసరమైన కృత్రిమ మేధ (ఏఐ) పరిశోధనకి ఈ సంస్థలన్నీ లక్షల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి. డ్రైవరు లేకుండా రోడ్డుమీద నడిచే కారునే కాదు ఏకంగా గాలిలో ఎగిరే కారునీ సిద్ధం చేస్తామంటున్నాయి. ఐహెచ్‌ఎస్‌(ఇన్‌ఫర్మేషన్‌ హ్యాండ్లింగ్‌ సర్వీసెస్‌) అంచనా ప్రకారం 2025కల్లా పలు దేశాల్లో రహదారులపై రెండు కోట్ల వరకూ డ్రైవర్‌ రహిత వాహనాలు తిరిగే అవకాశముంది.

అలా మొదలైంది
డ్రైవరులేకుండా కారు నడపాలన్న ఆలోచన దాదాపు వందేళ్ల నాటిది. ఆ ఆలోచనే పలు సినిమాల్లో డ్రైవరులేకుండా నడిచే కారుని ప్రధాన ఆకర్షణగా చేసింది. ఎప్పుడూ ఎక్కడో ఓ చోట దానికి సంబంధించి ప్రయోగాలు జరుగుతూనే ఉండేవి. 1980వ దశకం నుంచీ మాత్రం ఈ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఆటోమొబైల్‌ సంస్థలు విశ్వవిద్యాలయాల పరిశోధనా విభాగాలతో కలిసి పనిచేయడం ప్రారంభించాయి. 1995లో తొలిసారిగా కార్నెగీ మెలన్‌ యూనివర్శిటీ వారి నవ్‌లాబ్‌5 పాంటియాక్‌ ట్రాన్‌ స్పోర్ట్‌ కారు అమెరికాలో 2,849 మైళ్లు ప్రయాణించింది. అందులో 98.2 శాతం ప్రయాణం డ్రైవరు సహాయం లేకుండానే జరిగింది. ఈ సంఘటన తర్వాత అన్ని సంస్థల ప్రయోగాలూ వూపందుకున్నాయి.

దాదాపు రెండేళ్ల క్రితం సంగతి. టెస్లా కార్లు కొనుక్కున్నవారు కొందరు కారులో స్టీరింగ్‌ని వదిలేసి పేపరు చదువుతూ, ఫోన్లో సందేశాలు పంపుతూ, కాఫీ తాగుతూ తీసుకున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించాయి. కారు కొన్నవారికి అదనంగా మరో 4,250 డాలర్ల ధరకు ఓ టెక్నాలజీ ప్యాకేజీని అందించింది ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లా. పలురకాల సెన్సార్లు, కెమెరా, ముందువైపు రాడార్‌, డిజిటల్‌ బ్రేక్స్‌ లాంటివన్నీ ఈ ప్యాకేజీలో భాగం. వీటి సాయంతో డ్రైవర్‌ జోక్యం లేకుండా కార్లు నడుస్తాయి. వాటంతటవే మార్గాన్ని మార్చుకుంటాయి. ఇంకా ముఖ్యంగా... దేన్నైనా ఢీకొనే పరిస్థితి వస్తే ముందుకు కదలకుండా ఆగిపోయి ఢీకొనే ప్రమాదాన్ని నివారిస్తాయి. ఈ ప్యాకేజీకి ఆదరణ బాగా ఉండడంతో ఆ తర్వాత సాఫ్ట్‌వేర్‌ని అప్‌డేట్‌ చేసి ఆటోపైలట్‌ ఆప్షన్‌ని వినియోగదారులందరికీ పంపించింది టెస్లా కంపెనీ. కారులో టచ్‌ స్క్రీన్‌ సహాయంతో ఈ ఆప్షన్‌ని ఎంచుకోవచ్చు. లేదా తీసేయొచ్చు. ఇలాంటి వాహనాలు రోడ్డుమీదికి వస్తే జరిగే పరిణామాలను ఎదుర్కొనడానికి కావలసిన చట్టాలేవీ అప్పటికి లేవు. దాంతో సమస్యలొస్తాయని భావించిన సంస్థ సాఫ్ట్‌వేర్‌ స్థాయిని తగ్గించింది. అయితే మనిషికీ, వాహనానికీ, రవాణా వ్యవస్థకీ మధ్య ఉన్న అనుబంధానికి కొత్త అర్థం చెప్పింది ఈ ప్రయోగం. అప్పుడు టెస్లా వాడింది లెవెల్‌ 2 సాంకేతికత.

జనరల్‌ మోటార్స్‌... వందేళ్లకు పైగా చరిత్ర గల కంపెనీ. గత ఫిబ్రవరిలో ఈ సంస్థ శాన్‌ఫ్రాన్సిస్కో వీధుల్లో తీసిన రెండు వీడియోలు విడుదల చేసింది. సెల్ఫ్‌డ్రైవింగ్‌ కార్ల విషయంలో తాము ఏమాత్రం వెనకబడి లేమని ప్రకటించింది. డ్రైవరులేని షెవీ బోల్ట్‌ కారు 20 నిమిషాల పాటు ప్రయాణించడం ఈ వీడియోలో కన్పిస్తుంది. ప్రయాణికులు కారెక్కి తమ దగ్గరున్న క్రూయిజ్‌ ఆప్‌ ద్వారా గమ్యాన్ని నిర్దేశించుకుంటే చాలు కారు బయల్దేరుతుంది. కాలిఫోర్నియాలో ఈ కార్లు గత ఏడాది పదివేల మైళ్లు తిరిగాయి. లిఫ్ట్‌ పేరుతో ప్రత్యేక విభాగం కింద జనరల్‌ మోటార్స్‌ 2015లోనే అటానమస్‌ కార్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. మిగతా పోటీదారుల లాగా తమ ప్రయోగాల గురించి పూర్తి వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని ఈ సంస్థ 2021ని లక్ష్యంగా పెట్టుకుని, బిలియన్‌ డాలర్ల ప్రాజెక్టును అమలుచేస్తోంది. పరీక్షిస్తున్న కార్ల సంఖ్యను కూడా 50 నుంచి 180కి పెంచింది.

మేమే ముందు
సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లను అందరికన్నా ముందు తామే రోడ్డుమీదికి తెస్తామంటోంది ఫోర్డ్‌. 2021 కల్లా పూర్తి స్థాయి స్వయంచోదక వాహనం ప్రజలకు అందుబాటులోకొస్తుందనీ, అందుకు పరిశోధన పెద్ద ఎత్తునే సాగుతోందనీ ప్రకటించింది. అందుకోసం ఈ సంస్థ ఏకంగా 6,463కోట్ల డాలర్లు ఖర్చుపెడుతోంది. స్టీరింగ్‌ వీల్‌, బ్రేక్‌, యాక్సిలరేటర్‌ పెడల్స్‌ లేకుండా డ్రైవర్‌ అవసరం అసలేమాత్రం లేని కారును 2021కల్లా రోడ్లమీదికి తెస్తామంటోంది. ఉబర్‌, గూగుల్‌ చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టుల్లో చిన్న చిన్న ప్రమాదాలు నమోదయ్యాయి. అలాంటివేమీ జరక్కుండా జాగ్రత్తపడాలనే ఫోర్డ్‌ పూర్తి స్థాయిలో లెవెల్‌ 4 సాంకేతికతతో రోడ్డుమీదికి రావాలనుకుంటోంది.

చేయీ చేయీ కలిపి...
ఆటోమొబైల్‌ సంస్థలూ, టెక్నాలజీ కంపెనీలూ చేయీ చేయీ కలిపి అటానమస్‌ వాహనాల అభివృద్ధికి రంగం సిద్ధంచేస్తున్నాయి. ఒకరు వాహనాలను తయారు చేస్తే మరొకరు డ్రైవరు అవసరం లేకుండా వాహనం నడిచే సాంకేతికతను అందించనున్నారు. అందుకే గూగుల్‌ ఫియట్‌ క్రిస్లర్‌తో జతకడితే వోల్వో ఉబర్‌తో, డైమ్లర్‌ బాష్‌తో, మైక్రోసాఫ్ట్‌ టొయోటాతో జోడీ కట్టాయి. ఈ పొత్తుల వెనక లక్ష్యం కేవలం సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల తయారీ మాత్రమే కాదు, నగర వాతావరణంలో ట్రాఫిక్‌ ఒత్తిళ్లను నివారించడం కూడా. స్మార్ట్‌ వ్యవస్థల వినియోగంతో ట్రాఫిక్‌ నిర్వహణ సులభతరం చేసి రోడ్డు ప్రయాణ భద్రత పెంచాలన్నది ఆశయం.

అందరి చూపూ అటువైపే
అటానమస్‌ వాహనాలను రోడ్డుమీదికి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్న సంస్థలన్నీ కూడా 2021నే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం నగరాల్లో వాడుకలో ఉన్న అద్దె ట్యాక్సీల్లాగా వాటిని అందుబాటులోకి తేనున్నాయి. ధర, నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉండడంతో వ్యక్తిగత వాహనాలు మాత్రం ఇప్పట్లో రాకపోవచ్చు. ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే నిన్నమొన్నటివరకూ కార్ల విడి భాగాలు తయారుచేసే సంస్థలేవీ ఆటోమేటెడ్‌ కార్ల వ్యాపారం లాభసాటిగా ఉంటుందని భావించలేదు. అంతెందుకు ఫోర్డ్‌ మాజీ సీఈవో అలాన్‌ ములాలీ అయితే బహిరంగంగానే దీన్ని ఖండించేవారు. మనుషులు డ్రైవింగ్‌ని ఎలా ఆస్వాదిస్తారో ఆయన వర్ణించి చెప్పేవారు. అలాంటిది ఫోర్డ్‌తో పాటు ఇతర సంస్థలు కూడా ఇప్పుడీ రంగంలో ముందడుగేశాయి. అటానమస్‌ కార్లను మార్కెట్లోకి తేగల సత్తా ఉన్న కంపెనీలపై నేవిగెంట్‌ రీసెర్చ్‌ వెలువరించిన నివేదిక ప్రకారం ప్రథమ స్థానంలో ఫోర్డ్‌ తర్వాతి స్థానంలో జనరల్‌మోటార్స్‌ ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో రెనొ-నిస్సాన్‌, డైమ్లర్‌ ఉన్నాయి. 2015 సర్వేలో అసలు టెక్‌ కంపెనీల ప్రస్తావనే లేదు. అలాంటిది ఈ ఏడాది గూగుల్‌ ‘వేమో’ ఏడో స్థానంలో ఉంది. టెస్లా 12, ఉబర్‌ 16 స్థానాల్లో ఉన్నాయి. వివిధ కారణాల వల్ల ఎలక్ట్రిక్‌ కార్ల ప్రాజెక్టును పక్కన పెట్టిన ఆపిల్‌ కూడా హెర్ట్జ్‌తో కలిసి స్వయం చోదక కారుని కాలిఫోర్నియాలో పరీక్షిస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. కృత్రిమ మేధకు సంబంధించిన ప్రాజెక్టులన్నిటికీ ఈ అటానమస్‌ సాంకేతికతే పునాది కానుందని కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ పేర్కొన్నారు. సాధారణంగా ఆపిల్‌ గాడ్జెట్ల పేర్లన్నీ ఐ అక్షరంతో మొదలవుతాయి కాబట్టి ఆపిల్‌ అటానమస్‌ కారుకి ‘ఐకార్‌’ అని పేరు పెట్టేసుకున్నారు అభిమానులు. ‘ఆడి’ కంపెనీ కూడా తన ప్రయత్నాల్లో తానుంది. లెవెల్‌-3 సాంకేతికతతో తయారుచేస్తున్న కొత్త ఎ8 కారుని ‘స్పైడర్‌మాన్‌-హోం కమింగ్‌’ టీజర్స్‌లో చూపించింది.

‘వేమో’ అన్నది గూగుల్‌ అటానమస్‌ కార్‌ ప్రాజెక్ట్‌ పేరు. ఎనిమిదేళ్ల క్రితమే మొదలెట్టిన ఈ ప్రాజెక్టుకి వేమో అన్న పేరును మాత్రం కొత్తగా పెట్టింది గూగుల్‌ మాతృసంస్థ అల్భాబెట్‌. 2009లోనే రోడ్డెక్కిన గూగుల్‌ డ్రైవర్‌లెస్‌ కారు ఇప్పటికే 30 లక్షల మైళ్లు తిరిగేసింది. ఏకంగా 500 కార్లను పరీక్షిస్తున్న గూగుల్‌ కొన్ని చోట్ల ప్రయాణికులను ఎక్కించుకుని కూడా పరీక్షించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ‘మేము మంచి కారు తయారుచేయాలని కాదు, మంచి డ్రైవర్ని తయారుచేయాలని ప్రయత్నిస్తున్నాం...’ అని ప్రకటించారు వేమో సీఈవో జాన్‌ క్రాఫ్సిక్‌. మరో పక్క ఉబర్‌ సరైన ప్రణాళిక, సాంకేతికత లేక చతికిలబడడమే కాక అంతర్గత సమస్యలతోనూ పోరాడుతోంది. వేమో నుంచీ టెక్నాలజీ చౌర్యం తాలూకు కేసునూ ఎదుర్కొంటోంది. ఇక మెర్సిడెస్‌ బెంజ్‌ మాతృ సంస్థ డైమ్లర్‌ జర్మనీ సరఫరాదారు బాష్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం లక్ష్యం ఏమిటంటే 2021 నాటికి పూర్తి స్థాయి అటానమస్‌ కారుని రోడ్డుమీద ప్రవేశపెట్టడం. నిస్సాన్‌ అయితే ఏకంగా నాసాతో సహా పలు సంస్థలనుంచి సహకారం తీసుకుంటోంది. మరోపక్క కొత్తగా ఆటోమొబైల్‌ రంగంలోకి అడుగిడిన టెరాఫుజియా ఏకంగా ఎగిరే కారులోనూ అటానమస్‌ సాంకేతికతే వాడతానంటోంది.

ఇంటెల్‌ ఎందుకొచ్చిందంటే...
సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారు తయారీకి వాహనతయారీ సంస్థలు ముందుకొచ్చాయంటే అర్థముంది. కానీ కంప్యూటర్‌ చిప్‌లు తయారుచేసే ఇంటెల్‌ సంస్థకి కార్లతో ఏం పని అనుకోవచ్చు. కానీ విషయమేంటంటే... అటానమస్‌ కారు అంటేనే పూర్తిగా సాఫ్ట్‌వేర్‌పై ఆధారపడేది. ఈ కార్లకైతే ఇంటెల్‌ తన సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ రెండిటినీ అమ్ముకోవచ్చు మరి! అందుకే కొంతకాలంగా ఈ రంగంపై దృష్టిపెట్టిన ఇంటెల్‌ ఇటీవలే ఇజ్రాయెల్‌కు చెందిన మొబిలై సంస్థను 15.3 బిలియన్‌ డాలర్లకు కొనుక్కోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇంటెల్‌ చూస్తున్న మరో అవకాశం ఏమిటంటే... ఈ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లన్నిటినీ అనుసంధానించడానికి డేటా కేంద్రాల అవసరం ఉంటుంది. అది చాలా పెద్ద మార్కెట్‌గా ఇంటెల్‌ లెక్కలేస్తోంది. 2030 నాటికి ఈ డేటా కేంద్రాల మార్కెట్‌ 40 బిలియన్‌ డాలర్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఇంటెల్‌ మొబిలైను ఎంచుకోవడానికి కారణం... సెల్ఫ్‌డ్రైవింగ్‌ టెక్నాలజీకి అవసరమైన విడి భాగాల తయారీలో అనుభవం, ప్రపంచంలోని వాహన తయారీ సంస్థలన్నిటితోనూ సంబంధాలుండడం.

సింగపూర్‌ సై...
స్వయం చోదక కార్ల విషయంలోనూ సింగపూర్‌ తన ప్రత్యేకత నిలుపుకొంది. అక్కడ ఈ కారులో ప్రయాణికులు తిరుగుతున్నారు కూడా. దేశంలోని ‘వన్‌-నార్త్‌’ అనే ప్రాంతంలో ఆరున్నర కిలోమీటర్ల పరిధిలో ఎంచుకున్న రహదారుల్లో కొద్ది దూరాల మధ్య గత ఏడాది ఆగస్టులోనే ప్రయాణికులను చేరవేయడం మొదలెట్టారు. అమెరికాకి చెందిన న్యూటోనమీ సంస్థ అభివృద్ధి చేసిన లెవెల్‌ 4 సాంకేతికతను ఈ కారుల్లో వినియోగిస్తున్నారు. కారులో అత్యవసర పరిస్థితిలో ఉపయోగపడడానికి డ్రైవరుతో పాటు కంప్యూటర్లను నిరంతరం పరిశీలిస్తూ మరో వ్యక్తి ఉంటాడు. మరో ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకుని రెండు మూడు మైళ్ల దూరంలో దించుతుంది ఈ కారు. స్వయం చోదక కార్ల సాంకేతికతకి గాను ప్రపంచ ఆర్థిక వేదికపై ‘టెక్నాలజీ పయొనీర్‌ 2017’ గుర్తింపు పొందిన న్యూటోనమీ 2018 కల్లా పూర్తి స్థాయి అటానమస్‌ సాంకేతికతను వాడుకలోకి తెస్తామంటోంది. అందుకుగాను వేర్వేరు కార్ల కంపెనీలతో ఈ సంస్థ ఒప్పందాలు కుదుర్చుకుంది. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల ప్రయోగాలకు సింగపూర్‌ అనుకూలమనీ, అటానమస్‌ కార్లు పూర్తిస్థాయిలో వాడుకలోకి వస్తే సింగపూర్‌ రోడ్ల మీద కార్ల సంఖ్య 9 లక్షల నుంచి 3 లక్షలకు పడిపోతుందనీ ట్రాఫిక్‌ సమస్యలు తీరుతాయనీ అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.

వాటంతటవే... ఎలా!?
రోడ్డుమీద వాహనం నడపాలంటే ఒళ్లంతా కళ్లు చేసుకుని ఏ పక్కనుంచి ఎవరు దూసుకొస్తారోనని చూసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. అలాంటిది ఎవరి సాయమూ లేకుండా ఓ వాహనం దానంతటది ఎలా ప్రయాణిస్తుందీ అవరోధాలను ఎలా దాటుతుందీ అంటే... సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లకు ప్రధాన ఆధారం మ్యాప్‌లే. రహదారుల అణువణువునూ పకడ్బందీగా చిత్రించిన మ్యాప్‌ల ఆధారంగా జీపీఎస్‌తో రూపొందించే సాఫ్ట్‌వేర్‌ ఈ కార్లలో ఉంటుంది. సాంకేతికత వీటిలో ఆకర్షణీయమైన అంశమైతే భద్రత ప్రధానాంశం కానుంది. ఎందుకంటే... డ్రైవర్ల తప్పిదాల కారణంగా రోడ్డు ప్రమాదాలు నానాటికీ పెరుగుతున్నాయి. ఏకాగ్రత, అప్రమత్తత లోపించడం, గంటల తరబడి పనిచేసి కారు నడుపుతూ నిద్ర పోవడం, మద్యపానం చేసి కారు నడపడం, డ్రైవ్‌ చేస్తూ ఫోను వాడడం... ఇలాంటి కారణాల వల్ల ప్రమాదాలు పెరగడం అన్నిదేశాల్లోనూ కన్పిస్తున్నదే. ఈ కార్లవల్ల అలాంటి ప్రమాదాలేవీ జరగవు. వీటిల్లో ఉన్న రాడార్లు, సెన్సార్ల వల్ల మనుషులూ ఇతర వాహనాలే కాదు, చిన్న పక్షి అడ్డమొచ్చినా కారు ఆగి తప్పుకొని వెళ్తుంది తప్ప దేన్నీ ఢీకొట్టదు. కాబట్టి ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయన్న ఆలోచన ఈ కార్ల తయారీని ప్రోత్సహించడానికి ప్రధాన కారణం. సమన్వయంతో కూడిన ట్రాఫిక్‌ వల్ల రహదారులపై రద్దీ తగ్గి వాహనకాలుష్యం సైతం తగ్గుతుంది. అందుకే అన్ని దేశాలూ వీటిని ప్రోత్సహిస్తున్నాయి.

మన దేశానికి వస్తే... అటానమస్‌ కార్ల అభివృద్ధికి టాటా గ్రూపు ప్రయత్నిస్తోందని ఆ మధ్య వార్తలు వచ్చాయి కానీ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. అయితే తమ కార్లను ఇక్కడ పరీక్షించుకోవడానికి గూగుల్‌, ఉబర్‌ లాంటి సంస్థలకు అనుమతివ్వడానికి భారత ప్రభుత్వం సుముఖంగా ఉంది. క్రమశిక్షణ గల ట్రాఫిక్‌, పూర్తిస్థాయిలో రోడ్ల మ్యాపింగ్‌, శక్తిమంతమైన అంతర్జాల సదుపాయం... ఈ కార్ల పరీక్షకు అత్యవసరమైన అంశాలు. కాబట్టి ముందుగా ఆ మౌలికావసరాలను అభివృద్ధి చేస్తే... మన నగరాల్లోనూ అటానమస్‌ కార్లను చూడవచ్చన్నమాట.

కారు నడిపే సమయం కలిసి రావాలి... సురక్షితంగా గమ్యం చేరాలి.

ఆశయం స్పష్టం, సృజనాత్మకత పుష్కలం, సాంకేతికత సిద్ధం.

అందుకే... డ్రైవరు లేని కారులో రోడ్డుమీదో, ఎగిరే కారులో ఆకాశంలోనో షికారుకెళ్లే రోజు ఎంతో దూరం లేదు మరి!

వెహికిల్‌ అటానమీ లెవెల్స్‌ ఈ ఐదూ! 

వాహనంపై నియంత్రణ స్థాయిని బట్టి సొసైటీ ఆఫ్‌ ఆటోమోటివ్‌ ఇంజినీర్స్‌(ఎస్‌ఏఈ) వాహనాలకు ఈ స్థాయులు నిర్దేశించింది.

లెవెల్‌ జీరో:
సాధారణంగా మనుషులు నడిపే వాహనమే.

లెవెల్‌ 1:
అడప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌ అంటారు వీటిని. పార్కింగ్‌లో, లేన్‌ మారాలన్నా డ్రైవరు సహాయం కావాలి. వాహనాన్ని అదుపులోకి తీసుకోవడానికి డ్రైవరు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.

లెవెల్‌ 2:
కారు స్వయంగా వేగం పెంచుకుంటుంది, బ్రేక్‌ వేస్తుంది, స్టీరింగ్‌ తిప్పుకొంటుంది. అయితే ఏ క్షణాన్నైనా ఆటోమేటెడ్‌ వ్యవస్థ విఫలమైతే తక్షణం స్పందించడానికి డ్రైవరు సిద్ధంగా ఉండడమే కాక చుట్టుపక్కల పరిస్థితులను నిశితంగా గమనిస్తూ ఉండాలి.

లెవెల్‌ 3:
ఈ కారు చుట్టుపక్కల పరిస్థితులను అంచనా వేస్తూ మామూలు రోడ్డుమీద వెళ్లగలదు. అయితే అది వూహించదగ్గ పరిస్థితుల్లో మాత్రమే. కాబట్టి డ్రైవరు సిద్ధంగానే ఉండాలి.

లెవెల్‌ 4:
మరీ అసాధారణ ట్రాఫిక్‌ పరిస్థితుల్లో తప్ప మిగతా అన్నిచోట్లా ఈ కారు దానంతటదే నడవగలదు. సాధారణంగా ఒకసారి అటానమస్‌ సిస్టమ్‌ యాక్టివేట్‌ చేశాక డ్రైవర్‌ దానిమీద దృష్టిపెట్టాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పలు సంస్థలు దీన్నే పరీక్షిస్తున్నాయి.

లెవెల్‌ 5:
గమ్యం చెప్తే చాలు, సొంతంగా నిర్ణయాలు తీసుకుని సురక్షితంగా వెళ్లిపోతుంది ఈ కారు.

 

వాళ్లలా లెక్కలేశారు!

దివ్యాంగులకూ వాహనం నడపలేని వారికీ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు వరం లాంటివంటున్నారు నిపుణులు. ఈ మేరకు బ్రిటన్‌లో ఇప్పటికే లెక్కలు వేసేశారు. ఈ కార్లు ఉపయోగంలోకి వస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఏటా 8 బిలియన్‌ పౌండ్ల వృద్ధి చేకూరుతుందని వారి అంచనా. వైకల్యం, ఇతరత్రా ఆరోగ్య సమస్యల వల్ల స్వయంగా వాహనం నడపలేని వాళ్లు ఇంటికి పరిమితమై పోవడం వల్ల విద్యా, వ్యాపార నైపుణ్యాలను పెంపొందించుకోలేకపోతున్నారు. దాంతో వారి ఉత్పాదకత కుంటుపడుతోంది. సంపాదన అవకాశాలు కోల్పోతున్నారు. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు వస్తే వాళ్లు ఇతరుల మీద ఆధారపడకుండా తమ పనులు తాము చేసుకుంటారు. నైపుణ్యాలూ సంపాదనా పెంచుకుంటారు. ఇలా పది లక్షల మంది వరకూ లబ్ధి పొందుతారనీ దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుతుందనీ నిపుణుల అభిప్రాయం.

 

వారెన్‌ బఫెట్‌ ఏమన్నారంటే...

అటానమస్‌ కార్లు వినియోగంలోకి వస్తే బీమా రంగం కుదేలవుతుందంటారు వారెన్‌ బఫెట్‌. ఈ కార్లు సురక్షితంగా ఉంటాయి కాబట్టి ప్రమాదాలు జరగవనీ దాంతో ఇన్సూరెన్సు అవసరం ఉండదనేది ఆయన అభిప్రాయం. ఆయన కంపెనీ బెర్క్‌షైర్‌ హాథ్‌వే వాహనబీమా రంగంలో ఉంది. వాహనతయారీ సంస్థలు బిలియన్ల కొద్దీ డబ్బును అటానమస్‌ సాంకేతికత కోసం ఖర్చు పెట్టడంతోపాటు ఎంతో మంది నిపుణులు సాంకేతికత అభివృద్ధికి కృషిచేస్తున్నందున అందరూ అనుకుంటున్న సమయం కన్నా ముందే ఈ కార్లు రోడ్డుమీదికి రావచ్చన్నది బఫెట్‌ అంచనా.

 

ఈ ప్రయోగానికి మేం సిద్ధం

సాధారణంగా ఆటోషోలలో వాహన తయారీ సంస్థలు కొత్త వాహనాలను ఆవిష్కరిస్తుంటాయి. గత ఫిబ్రవరిలో జరిగిన డెట్రాయిట్‌ ఆటోషోలో మాత్రం వోల్వో ఓ తమాషా చేసింది. వేదిక మీద ఓ కుటుంబాన్ని ఆవిష్కరించింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి అలెక్స్‌, పౌలా జంట ప్రపంచంలోనే తొలి సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారులో ప్రయాణిస్తారు. అటానమస్‌ వాహన సాంకేతికత, వాహనాలను నడిపే మనుషులు- వీరిద్దరి మధ్య జరిగే ఇంటరాక్షన్‌ని విశ్లేషించేందుకు ‘డ్రైవ్‌మి’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది వోల్వో. అందులో నమోదు చేసుకున్న తొలి కుటుంబమే అలెక్స్‌, పౌలా. ఈ ఏడాది చివర్లో ఎక్స్‌సి90 అనే పూర్తి స్థాయి అటానమస్‌ కారును విడుదల చేయనుంది వోల్వో. డ్రైవరు లేని ఆ కారులో రోడ్డు మీదికి వెళ్లడానికి అలెక్స్‌ కుటుంబం ఏ మాత్రం భయపడడం లేదు. పైగా ఆ కారు ఎలా ఉంటుందో, దాని వల్ల తమ ప్రయాణాలు ఎలా మారిపోతాయో చూడాలని చాలా ఆత్రుతగా కూడా ఉన్నారు. ఉద్యోగస్తులైన వీరికి ఇద్దరు పిల్లలు. కారు డ్రైవ్‌ చేసే సమయం కలిసిరావడమే ఎంతో గొప్పని వారు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే వోల్వో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. వాహనాన్ని నడిపే పని లేనప్పుడు కార్లో కూర్చుని ఆఫీసు పనులు చేసుకోవడానికి వీలుగా తమ అటానమస్‌ వాహనాల్లో స్కైప్‌ కాన్ఫరెన్స్‌ కాల్‌ సదుపాయం కల్పించేలా మైక్రోసాఫ్ట్‌తో వోల్వో ఒప్పందం చేసుకుంది.

 

ఎగిరే కారు వచ్చే ఏడాదేనట! 

2018కల్లా ఎగిరే కారుని మార్కెట్లోకి తేవడానికి డచ్‌ కంపెనీ పిఎఎల్‌-వి ఇంటర్నేషనల్‌ బివి, స్లొవేకియాకి చెందిన ఏరోమొబిల్‌, అమెరికా కంపెనీ టెరాఫుజియా లాంటివి పోటీ పడుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో బుకింగులు కూడా ప్రారంభించాయి. అన్ని రకాల అనుమతులూ పొందాయి. తాజాగా వాటి సరసన జపాన్‌ కంపెనీ టొయోటా కూడా చేరింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో తమ ఎగిరే కారు సాయంతో క్రీడాజ్యోతి వెలిగించాలన్న లక్ష్యంతో పని ప్రారంభించింది టొయోటా. కారుగానూ, విమానంగానూ ఉపయోగపడే ఫ్లయింగ్‌ కార్లు ‘పిఎఎల్‌-వి వన్‌’, టెరాఫుజియా ‘ట్రాన్సిషన్‌’ల రంగప్రవేశానికై ఇప్పటికే మార్కెట్‌ ఎదురుచూస్తోంది. తమ ఎగిరే కారుకి స్వయంచోదక సాంకేతికతను కూడా జతచేసి మరింత సురక్షితం చేసే ప్రయత్నాల్లో ఉంది టెరాఫుజియా. అతి తక్కువ సమయంలో ఆధునిక సాంకేతికతలో దూసుకుపోతున్న ఈ సంస్థను కొనేందుకు చైనాకి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ గీలీ చర్చలు జరుపుతోంది. వాహన తయారీ సంస్థలు స్వయం చోదక కార్ల తయారీపై చూపిన ఆసక్తి ఫ్లయింగ్‌ కార్లపై చూపడం లేదని ఇప్పటివరకూ భావిస్తూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు ఆ దిశగానూ కృషి జోరందుకున్నట్లే కన్పిస్తోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.