close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మీలో ఎవరా కోటీశ్వరుడు!

మీలో ఎవరా కోటీశ్వరుడు!

దో సినిమాలో చెప్పినట్టు... జీవితం కోడిగుడ్డు లాంటిది. ఏది పిల్లవుతుందో, ఏది ఆమ్లెట్‌ అవుతుందో తెలీదు. మంచి వ్యాపార ఆలోచన కూడా అలాంటిదే. ఏ ఆలోచన గొప్ప సంస్థగా ఎదిగి జనాల్లోకి దూసుకెళ్తుందో, ఏది అట్టర్‌ ఫ్లాపై యజమానిని నట్టేట ముంచుతుందో ఎవరూ వూహించలేరు. రెండో రకానికి చెందిన వ్యాపారాలు లక్షల్లో ఉంటాయి. కానీ ఏవో కొన్ని మాత్రమే అనుకోకుండా ప్రారంభమై, అనూహ్యంగా ప్రజల ఆదరణ దక్కించుకొని ప్రపంచ స్థాయి సంస్థలుగా ఎదుగుతాయి. ఎలక్ట్రానిక్‌ రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న సోనీ, శీతల పానీయాల్లో తిరుగులేని కోకాకోలా, చికెన్‌ వెరైటీలకు పెట్టింది పేరైన కేఎఫ్‌సీ, స్పోర్ట్స్‌ కార్ల మార్కెట్‌లో దూసుకెళ్తున్న లాంబొర్గిని... ఇవన్నీ అట్టడుగుస్థాయి నుంచే తమ ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. అనూహ్య పరిస్థితులవల్లో, అనుకోని సంఘటనల కారణంగానో ఈ సంస్థలన్నీ ప్రారంభమై, వాటి యజమానులు కూడా వూహించలేనంత ఉన్నత స్థాయికి ఎదిగాయి. గొప్ప వ్యాపార ఆలోచనల కోసం మేధో మథనం జరపాల్సిన అవసరం లేదనీ, రోజువారీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులే మనకు కొత్త దారి చూపిస్తాయనీ చెప్పడానికి వీటి విజయాలే సాక్ష్యాలు.


 

అవమానానికి బదులుగా... లాంబొర్గిని!

తగిలిన రాళ్లనే పునాదిగా చేసుకొని ఎదగాలంటారు... ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన స్పోర్ట్స్‌ కార్లను తయారు చేసే ‘లాంబొర్గిని’ సంస్థ యజమాని ఫెరూషియో లాంబొర్గిని అచ్చంగా అలానే ఎదిగాడు. తనకు జరిగిన అవమానానికి బదులుగా అత్యుత్తమ స్పోర్ట్స్‌ కార్ల తయారీ సంస్థకు ప్రాణం పోశాడు. ఫెరూషియోది ఇటలీలోని ఓ రైతు కుటుంబం. తొలిరోజుల్లో ట్రాక్టర్ల మెకానిక్‌గా పనిచేసిన ఫెరూషియో, తరవాత వ్యవసాయ పనిముట్లు తయారు చేసే సంస్థని నెలకొల్పాడు. ఆ వ్యాపారంలో బాగా సంపాదించిన అతడు, ఏరికోరి ఓ ఫెరారీ కారుని కొనుక్కున్నాడు. కానీ దాని క్లచ్‌తో ఫెరూషియోకి నిత్యం ఇబ్బందులు ఎదురయ్యేవి. దాని మరమ్మతుల కోసం తరచూ సర్వీస్‌ సెంటర్ల చుట్టూ తిరిగేవాడు. తానుకూడా మెకానిక్కునేననీ, దాన్ని రిపేర్‌ చేసే పద్ధతిని చూపిస్తే ఆ పనేదో తానే చేసుకుంటాననీ ఫెరూషియో చెప్పినా సర్వీస్‌ సెంటర్‌ వాళ్లు ఒప్పుకోలేదట. దాంతో ఎలాగో కష్టపడి ఫెరారీ సంస్థ వ్యవస్థాపకుడు ఎంజో ఫెరారీని కలిసిన ఫెరూషియో ఆయనకు తన సమస్యని చెప్పి, ఫెరారీ కార్లు అస్సలు బాలేవని అన్నాడట. దాంతో ఎంజో ఫెరారీకి కోపమొచ్చి, ‘సమస్య మా కార్లది కాదు, దాన్ని నడిపే డ్రైవర్‌ది. ట్రాక్టర్లని నడిపినట్టు ఫెరారీ కారుని నడపకూడదు’ అని బదులిచ్చాడట. ఆ మాటతో ఫెరూషియోకి ఉక్రోషం మొదలైంది. ఫెరారీకి దీటుగా తానే సొంతంగా ఓ స్పోర్ట్స్‌ కార్‌ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. తెలిసిన కొందరు ఇంజినీర్ల సాయంతో ఇంజిన్‌ తయారీ మొదలుపెట్టాడు. అది బాగా పనిచేయడంతో, తన వ్యాపారాన్నీ ఇతర ఆస్తుల్నీ అమ్మేసి తన పేరు మీదే ‘లాంబొర్గిని’ అనే కార్ల తయారీ సంస్థని మొదలుపెట్టాడు. ఇక ఆ తరవాత అంతా అందరికీ తెలిసిన చరిత్రే. కోటి రూపాయలకు పైగా ధర పలికే లాంబొర్గిని కారుని సొంతం చేసుకోవాలని చాలామంది సంపన్నులు తహతహలాడుతుంటారు. కోపాన్ని కూడా సరైన దారిలో చూపిస్తే ఇంత మంచి ఫలితాలొస్తాయన్నమాట! 


 

తలనొప్పికి మందు... కోకాకోలా


స్కూళ్లూ, నీళ్లూ, రోడ్లూ లేని వూళ్లు బోలెడుంటాయి. కానీ కిళ్లీ కొట్టూ, అందులో చిన్న ఫ్రిజ్‌, దాంట్లో కోకాకోలా సీసా ఉండని గ్రామాలు మాత్రం చాలా అరుదు. ఆసియా నుంచి అంటార్కిటికా దాకా అన్ని ఖండాల్లో, రెండొందలకు పైగా దేశాల్లో ఈ శీతల పానీయం దొరుకుతుంది. కొత్తగా ఎన్ని కూల్‌డ్రింక్‌ల సంస్థలు వెలిసినా, 130 ఏళ్లుగా మార్కెట్‌లో కోకాకోలా తన స్థానాన్ని కాపాడుకుంటూనే వస్తోంది. ఏటా వందల కోట్ల రూపాయల మేర అమ్మకాల్ని సాగించే ఈ పానీయం, మొదట తలనొప్పికి మందులా తయారైందని ఎవరూ వూహించలేరు. 1880ల్లో అమెరికాలో కలర్‌ సోడాలు బాగా అమ్ముడయ్యేవి. జాన్‌ పెంబర్టన్‌ అనే ఫార్మసిస్టుని ఆ సోడాలు బాగా ఆకర్షించాయి. అప్పటికే పెంబర్టన్‌ రకరకాల ఆరోగ్య సమస్యలకు మందులు తయారు చేసి పేటెంట్లను తీసుకున్నాడు. కానీ అవేవీ ఆశించినంత ఆదాయాన్ని ఇవ్వలేకపోయాయి. దాంతో చివరి ప్రయత్నంగా కోకా ఆకుల్నీ, కోలా నట్స్‌తో మరికొన్ని పదార్థాల్నీ కలిపి జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్న సోడాల తరహాలోనే ఓ పానీయాన్ని తయారు చేశాడు. దానికి తలనొప్పీ, అలసటని దూరం చేసే శక్తి ఉందని ప్రచారం చేసి, దానికి ఔషధంగానే పేటెంట్‌ తీసుకొని మందుల దుకాణాల్లో అమ్మడం మొదలుపెట్టాడు. కోకాకోలా అమ్మకాలు క్రమంగా పెరిగినా, పెంబర్టన్‌కి ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. మత్తుమందులకు బానిసగా మారిన పెంబర్టన్‌, డబ్బుల కోసం తన కోకాకోలా ఫార్ములాని క్యాండ్లర్‌ అనే మరో వ్యక్తికి అమ్మేశాడు. ఆ పైన కొన్ని రోజులకే అనారోగ్యంతో పెంబర్టన్‌ కన్నుమూశాడు. తరవాత క్యాండ్లర్‌ తనదైన శైలిలో మార్కెటింగ్‌ చేస్తూ సంస్థని విస్తరించాడు. కొన్నాళ్లకు అమెరికా ప్రభుత్వం ఔషధాలపైన పన్ను పెంచడంతో, కోకాకోలాని ఔషధాల జాబితా నుంచి తొలగించి శీతల పానీయంగా క్యాండ్లర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించాడు. 130ఏళ్లు దాటినా ఇప్పటికీ దాదాపుగా పెంబర్టన్‌ కనిపెట్టిన ఫార్ములాతోనే కోక్‌ని తయారు చేస్తున్నారు. అతడు ఓ ఔషధంలా దాన్ని తయారుచేశాడు తప్ప, కూల్‌డ్రింక్‌లా అన్ని దుకాణాల్లో అమ్మాలని ఏనాడూ అనుకోకపోవడం విశేషం.


 

జాన్‌ డీర్‌... ఓ రైతు సలహా!

గరవాసులకు పెద్దగా పరిచయం లేకపోయినా, ‘జాన్‌ డీర్‌’ అన్న పేరు చెప్పగానే కాళహస్తి నుంచి కల్వకుర్తిదాకా చాలామంది పల్లెవాసులు ఆ సంస్థను గుర్తుపడతారు. దేశవ్యాప్తంగా వందలాది పల్లెల్లో ‘జాన్‌ డీర్‌’ దుకాణాలు కనిపిస్తాయి. వ్యవసాయ పనిముట్లూ, యంత్రాల తయారీ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అది. ఏటా వేల కోట్ల రూపాయలు విలువ చేసే వ్యవసాయ పరికరాల్ని ‘జాన్‌ డీర్‌’ విక్రయిస్తుంది. అలాంటి కంపెనీకి ప్రాణం పోసిన జాన్‌ డీర్‌ ఓ సాధారణ కమ్మరి. చిన్నప్పుడు జాన్‌డీర్‌ తన తండ్రి దగ్గర సూదులూ, చాకులను సానపెట్టడం నేర్చుకున్నాడు. పెద్దయ్యాకా అతడు అదే రంగంలో కొనసాగుతూ క్రమంగా వ్యవసాయ పనిముట్లకు పదును పెడుతూ, వాటికి మరమ్మతులు చేసే వృత్తిలో స్థిరపడ్డాడు. చెక్కతో, ఇనుముతో చేసిన నాగళ్లు అన్ని నేలలకూ సరిపోవట్లేదనీ, తన అనుభవంతో ఏదైనా మరింత పదునైన నాగలిని తయారు చేయమనీ తెలిసిన ఓ రైతు ఓసారి జాన్‌ డీర్‌ని అడిగాడు. పదునైన స్టీలు భూమిలోకి సులువుగా దిగుతుందనీ, మిగతా వాటితో పోలిస్తే అది తేలిగ్గానూ ఉంటుందనీ గ్రహించిన జాన్‌ డీర్‌, ఆ రైతు కోసం ఓ స్టీలు నాగలిని తయారు చేసిచ్చాడు. ఆపైన మరో ముగ్గురు రైతులు అడిగి మరీ అలాంటి నాగలినే తయారు చేయించుకున్నారు. ఏటికేడూ వాటిని తయారు చేయించుకునే రైతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దాంతో డీర్‌ వ్యవసాయ పనిముట్ల మరమ్మతులను పూర్తిగా ఆపేసి సొంతంగా నాగళ్లను తయారు చేయడం ప్రారంభించాడు. అది క్రమంగా ఇతర యంత్రాలకూ విస్తరిస్తూ ఇప్పుడు ట్రాక్టర్లూ, కోత యంత్రాలూ, ఫీల్డు స్ప్రేయర్లంటూ అన్ని రకాల వ్యవసాయ పరికరాల తయారీకి చేరింది. అలా ఓ రైతు ఇచ్చిన సలహా, ప్రపంచ వ్యవసాయాన్ని ఆధునిక బాట పట్టించే దిశగా జాన్‌ డీర్‌ని నడిపించింది.


 

కొడుకు కోసం లెగో!

దాదాపు డెబ్భై ఐదేళ్లుగా పిల్లలు లెగో బొమ్మలతో ఆడుకుంటున్నారు. చిన్నచిన్న ప్లాస్టిక్‌ ‘లెగో బ్రిక్స్‌’ సాయంతో పెద్ద పెద్ద లెగో బొమ్మల్ని తయారు చేస్తూ ఆనందిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో అమ్ముడయ్యే పిల్లల బొమ్మలను లెగో సంస్థే ఉత్పత్తి చేస్తోంది. ఆ భారీ బొమ్మల సామ్రాజ్యానికి పునాది వేసింది ఓ సాధారణ కార్పెంటర్‌. దాదాపు ఎనభై ఏళ్ల క్రితం క్రిస్టియన్‌సన్‌ అనే వ్యక్తి ఇంటి దగ్గరే వడ్రంగి పనులు చేసుకునేవాడు. తన కొడుకు పనికి అడ్డు తగిలి ఇబ్బంది పెట్టకుండా, వృథా చెక్కతో బొమ్మలు తయారు చేసిచ్చి ఆడుకోమనేవాడు. వాటిని చూసి తక్కిన పిల్లలూ తమకూ ఆ బొమ్మలు కావాలని మారాం చేయడం, వాళ్ల బాధ పడలేక తల్లిదండ్రులొచ్చి డబ్బులిచ్చి అలాంటి బొమ్మల్ని తయారు చేయించుకొని వెళ్లడం పరిపాటైంది. అదేదో లాభసాటిగా ఉందనిపించి క్రిస్టియన్‌సన్‌ కొన్నాళ్లకు ఫర్నీచర్‌ తయారీ మానేసి పూర్తిగా బొమ్మల్నే తయారు చేయడం మొదలుపెట్టాడు. బయట క్రమంగా ప్లాస్టిక్‌ బొమ్మల వాడకం పెరగడంతో క్రిస్టియన్‌సన్‌ కూడా చెక్క బొమ్మలకు స్వస్తి పలికి, అవే బొమ్మలను ప్లాస్టిక్‌తో చేయసాగాడు. కానీ తాను చిన్నప్పుడు మట్టితో బొమ్మల్ని సొంతంగా తయారు చేసుకున్నప్పుడు కలిగిన ఆనందాన్ని, ఆ ప్లాస్టిక్‌ బొమ్మలు పిల్లలకు ఇవ్వలేవేమోనని క్రిస్టియన్‌సన్‌కి సందేహం కలిగింది. దాంతో పెద్ద పెద్ద బొమ్మల తయారీ ఆపేసి, ‘లెగో బ్రిక్స్‌’ పేరుతో చిన్న చిన్న విడిభాగాల రూపంలో ఆట వస్తువుల్ని తయారు చేయడం మొదలుపెట్టాడు. ఆ లెగో బ్రిక్స్‌ని క్రమ పద్ధతిలో అమరిస్తే పెద్ద బొమ్మలు తయారయ్యేలా ఏర్పాటు చేశాడు. ఆ రంగురంగుల లెగో బ్రిక్స్‌, వాటితో సొంతంగా తయారు చేసే బొమ్మలూ పిల్లలకు తెగనచ్చేశాయి. అలా కొడుకు సరదా కోసం క్రిస్టియన్‌సన్‌ తయారు చేసిన బొమ్మలే, ఇప్పుడు కోట్ల రూపాయల్ని సంపాదిస్తున్నాయి.


 

65ఏళ్లకు కేఎఫ్‌సీ!

చికెన్‌ 65, చికెన్‌ టిక్కా, చికెన్‌ కబాబ్‌... ఇలాంటి చికెన్‌ వెరైటీల గురించి తెలియని వాళ్లుంటారేమో కానీ, ‘కేఎఫ్‌సీ చికెన్‌’ పేరు చెప్పగానే చిన్న పిల్లలు కూడా లొట్టలేస్తారు. కొన్నేళ్ల క్రితం దాకా పాశ్చాత్య దేశాలకూ నిన్న మొన్నటిదాకా దేశంలోని పెద్ద నగరాలకూ పరిమితమైన కేఎఫ్‌సీ రెస్టరెంట్లు ఇప్పుడు చిన్నచిన్న పట్టణాలకూ విస్తరించాయి. చికెన్‌ రెస్టరెంట్లలో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా ఉన్న కేఎఫ్‌సీ, ఏటా వందల కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. సంస్థకు కాసుల వర్షం కురిపిస్తున్న అంత విలువైన చికెన్‌ ఫార్ములాని కల్నల్‌ సాండర్స్‌ అనే అమెరికన్‌ షెఫ్‌ ఒకాయన సృష్టించాడు. ఓ చిన్న హోటల్‌లో వంటమనిషిగా పనిచేసే సాండర్స్‌ అరవై ఐదేళ్ల వయసులో ఆ పని నుంచి రిటైరయ్యాడు. సాండర్స్‌ వండే చికెన్‌ పదార్థాలంటే అతడి సన్నిహితులు పడిచచ్చేవారు. ఆ వంటల ఫార్ములాని ఏదైనా హోటల్‌కి అమ్మితే, దాని ద్వారా వచ్చే రాయల్టీతో తన జీవితం సాఫీగా గడిచిపోతుందన్న ఆలోచన సాండర్స్‌కి కలిగింది. దాంతో తన చికెన్‌ పదార్థాల్ని తమ మెనూలో చేర్చమని అక్షరాలా 1009 హోటళ్ల చుట్టూ తిరిగాడట. ఎవరూ ఒప్పుకోకపోవడంతో తప్పని పరిస్థితుల్లో స్నేహితుల సాయంతో సాండర్సే అరవై ఐదేళ్ల వయసులో అమెరికాలో ‘కెంటకీ ఫ్రైడ్‌ చికెన్‌’(కేఎఫ్‌సీ) పేరుతో రెస్టరెంట్‌ని మొదలుపెట్టాడు.

కేఎఫ్‌సీ రుచులకు కెంటకీ ప్రాంతంలో బాగా పేరు రావడంతో నెమ్మదిగా ఒక్కొక్కరూ సాండర్స్‌ని కలిసి దాని ఫ్రాంఛైజీలను కొనుగోలు చేయసాగారు. కొన్నాళ్లకు వృద్ధాప్యం కారణంగా చూసుకోలేక సాండర్స్‌ తన వ్యాపారాన్ని వేరే సంస్థకు అమ్మేశాడు. మలి వయసులో తనకు ఆసరాగా ఉంటుందని సాండర్స్‌ కేఎఫ్‌సీని మొదలుపెట్టాడు తప్ప అదిప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇరవై వేలకు పైగా స్టోర్లకు విస్తరిస్తుందని ఆయన వూహించలేదు. ఇప్పటికీ సాండర్స్‌ ఫార్ములాతోనే అక్కడి పదార్థాలు తయారవుతున్నాయి. అందుకే, ఆయన మీదున్న గౌరవంతో సాండర్స్‌ ముఖాన్నే తమ సంస్థ లోగోగా మార్చేసింది కేఎఫ్‌సీ. ఒక్కోసారి తిరస్కరణ కూడా మేలే చేస్తుందని కేఎఫ్‌సీ విజయం నిరూపిస్తుంది.


 

సేవకోసం డాబర్‌!

బ్బులూ, షాంపూలూ, తేనె, టూత్‌పేస్ట్‌, రియల్‌ ఫ్రూట్‌ జ్యూస్‌... ఇలా భారతీయ సంస్థ డాబర్‌కి చెందిన దాదాపు 250 ఉత్పత్తులు 130 ఏళ్లుగా భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఓ ఆయుర్వేద వైద్యుడు తప్పని పరిస్థితుల్లో తన ఇంట్లో నెలకొల్పిన చిన్న ఆయుర్వేద మందుల దుకాణం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు సాగిస్తున్న ఆయుర్వేద సంస్థగా ఎదిగింది. 1890ల ప్రాంతంలో దేశవ్యాప్తంగా కలరా, మలేరియా, క్షయ లాంటి వ్యాధులు వందలాది పల్లెల్ని పట్టి పీడించేవి. ఆ సమయంలో ఎస్‌కే బర్మన్‌ అనే ఓ బెంగాలీ వైద్యుడు తాను సొంతంగా తయారుచేసిన ఆయుర్వేద మందులను వూరూరా తిరిగి ఉచితంగా పంచేవాడు. కానీ అలా తానొక్కడే ఒక్కో గ్రామానికి తిరిగితే సమయం వృథా అవుతుందనీ, ఇంటి దగ్గరే ఓ దుకాణాన్ని తెరిచి ఔషధాల్ని అందుబాటులోకి తెస్తే, కావల్సిన వాళ్లు అక్కడికే వచ్చి తీసుకెళ్తారనీ బర్మన్‌ స్నేహితుడు సలహా ఇచ్చాడు. అందరూ అతడిని డాక్టర్‌ బర్మన్‌ అని పిలుస్తారు కాబట్టి ఆ పదాల్లోని తొలి అక్షరాల్ని తీసుకొని ‘డాబర్‌’ పేరుతో బర్మన్‌ మందుల దుకాణాన్ని తెరిచాడు. అలా మొదట సేవా దృక్పథంతో బర్మన్‌ ఔషధాల్ని తయారు చేసి పంచినా, అతడి తరవాతి తరం వాళ్లు మాత్రం ఆ ఫార్ములాతో తయారు చేసిన ఔషధాల్ని దుకాణంలో అమ్మేవారు. బర్మన్‌ ఔషధాల మహత్యం అప్పటికే బెంగాల్‌ అంతా విస్తరించింది. దాంతో డబ్బులు పెట్టి కొనడానికీ ఎవరూ వెనకాడేవారు కాదు. అలా నెమ్మదిగా ఆ ఉత్పత్తులు పశ్చిమ బెంగాల్‌ నుంచి ప్రపంచమంతా విస్తరించాయి. కేవలం సేవా దృక్పథంతో నెలకొల్పిన ‘డాబర్‌’ దుకాణం, వేల కోట్ల రూపాయల విలువ కలిగిన సంస్థగా ఎదుగుతుందని బర్మన్‌ కూడా వూహించి ఉండడు!


 

సబ్బుల నుంచి చూయింగ్‌గమ్‌కి...

క్రికెట్‌ ఆడుతున్నా, బైక్‌ నడుపుతున్నా, వేరే ఏ పనిలో ఉన్నా చూయింగ్‌ గమ్‌ని నమలడం చాలామంది కుర్రాళ్లకి సరదా. ఓ రకంగా ప్రపంచానికి ఆ అలవాటు చేసింది ‘రిగ్లీస్‌’ సంస్థే. డబుల్‌ మింట్‌, స్పియర్‌ మింట్‌, జ్యూసీ ఫ్రూట్‌, ఆర్బిట్‌ అంటూ 125ఏళ్లుగా రకరకాల చూయింగ్‌ గమ్‌లను దాదాపు అన్ని దేశాల్లో రిగ్లీస్‌ మార్కెట్లోకి తీసుకొస్తోంది. అంత భారీ సంస్థకు ప్రాణం పోసిన విలియమ్‌ రిగ్లీ అనే వ్యక్తి నిజానికి ఓ సబ్బుల వ్యాపారి. మొదట్లో వీధుల్లో తిరుగుతూ తాను తయారు చేసిన సబ్బులను ఇంటింటికీ తిరిగి అమ్మేవాడు. వినియోగదార్లను ఆకర్షించేందుకు సబ్బులతో పాటు కాస్త బేకింగ్‌ పౌడర్‌ని ఉచితంగా ఇచ్చేవాడు. జనాలు తానిచ్చే బేకింగ్‌ పౌడర్‌ కోసమే సబ్బులని ఎక్కువగా కొంటున్నారని అతడికి అర్థమైంది. దాంతో సబ్బుల తయారీని ఆపేసి సొంతంగా ‘రిగ్లీస్‌ బేకింగ్‌ పౌడర్‌’ని తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. ఈసారి ఆ పౌడర్‌ని కొన్నవాళ్లకు తాయిలంగా తానే తయారు చేసిన చిన్న చూయింగ్‌ గమ్‌ని ఇవ్వసాగాడు. ఆ గమ్‌ కూడా జనాలకు బాగా నచ్చడంతో, అవసరం లేకపోయినా దాని కోసమే బేకింగ్‌ పౌడర్‌ని కొనేవారు. దాంతో బేకింగ్‌ పౌడర్‌ తయారీని ఆపేసి, ‘రిగ్లీస్‌’ పేరుతో అచ్చంగా చూయింగ్‌ గమ్‌లనే తయారు చేయడం ప్రారంభించాడు. ఆపైన విలియమ్‌కి ఆ వ్యాపారాన్ని ఆపేసే అవసరం రాలేదు. ఓ దశలో తన ఆస్తి మొత్తాన్నీ తాకట్టు పెట్టి, ఆ డబ్బుతో చూయింగ్‌ గమ్‌కి ప్రచారం కల్పించిన విలియమ్‌, ప్రపంచ వ్యాప్తంగా ఆ గమ్‌ని నమిలే అలవాటు చేయడంలో కీలకపాత్ర పోషించాడంటారు. అసలుకంటే కొసరు ముద్దని జనాలు అనుకోవడం వల్ల విలియమ్‌కి ఎంత మేలు జరిగిందో కదా!


 

ఆ తప్పు వల్లే బోయింగ్‌!

ర్ర బస్సుకీ ఎయిర్‌ బస్సుకీ ఎంత తేడా ఉంటుందో, సాధారణ విమానాలకీ, బోయింగ్‌ విమానాలకీ అంతే తేడా ఉంటుంది. ప్రపంచంలోనే శక్తిమంతమైన, విలాసవంతమైన, భారీ విమానాలను బోయింగ్‌ సంస్థ తయారు చేస్తుంది. అమెరికా, ఇంగ్లండ్‌ లాంటి ఎన్నో దేశాల అధినేతలకూ, సైన్యానికీ ఆ సంస్థే విమానాలను సమకూరుస్తోంది. అంత భారీ సంస్థ ఏర్పాటుకి మార్టిన్‌ ఫ్యాక్టరీ అనే మరో విమాన తయారీ సంస్థ చేసిన తప్పిదమే కారణం కావడం విశేషం. 1910 ప్రాంతంలో విలియమ్‌ బోయింగ్‌ అనే ఓ సంపన్న వ్యాపారి తొలిసారి ఓ విమానాన్ని గాల్లో ఎగరడం చూశాడు. అప్పట్నుంచీ అతడికి ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలన్న కోరిక కలిగింది. అప్పటికి పౌర విమానయానం అందుబాటులోకి రాలేదు. దాంతో ఐదారేళ్లు కష్టపడి, కొందరు ప్రముఖులతో పరిచయాలు పెంచుకొని, చివరికి ఓ మిలటరీ అధికారి సాయంతో తొలిసారి విమానంలో కాస్త దూరం ప్రయాణించాడు. ఆ దెబ్బతో విమానాలపైన మోజు అతడికి మరింత పెరిగిపోయింది. పైలట్‌గా మారితే హాయిగా రోజూ విమానాల్లో తిరగొచ్చనిపించి, ఆ కోర్సులో చేరి విజయవంతంగా దాన్ని పూర్తిచేశాడు. తరవాత తన ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మేసి ‘మార్టిన్‌ ఫ్యాక్టరీ’ అనే సంస్థ నుంచి ఓ చిన్న ప్రైవేట్‌ జెట్‌ కొనుక్కున్నాడు. వారానికోసారైనా దాంట్లో చక్కర్లు కొడుతూ బోయింగ్‌ తెగ సంబరపడేవాడు. కానీ ఓసారి అతడి విమానానికి ఇంజిన్‌లో ఏదో సమస్య తలెత్తింది. నెలలు గడిచినా మరమ్మతుకి అవసరమైన విడిభాగాలు సంస్థ నుంచి రాలేదు. అదేంటని ప్రశ్నిస్తే, ‘అది ఎడ్లబండి కాదు విమానం, విడిభాగాలు తయారు చేయడం ఏమంత ఆషామాషీ కాదు’ అంటూ బదులొచ్చిందట. దాంతో బోయింగ్‌కి విపరీతంగా కోపమొచ్చింది. నిజంగా వాటి తయారీ అంత కష్టమా అన్నది తెలుసుకోవడానికి, బోలెడు డబ్బు ఖర్చు చేసి కొంతమంది ఇంజినీర్ల సాయంతో సొంతంగా అతడే ఆ విడి భాగాలని తయారు చేశాడు. అవి బ్రహ్మాండంగా పనిచేయడంతో తన చెక్క వ్యాపారాన్ని అమ్మేసి ఓ భారీ గ్యారేజీని బోయింగ్‌ ఏర్పాటు చేశాడు. అక్కడ మొదట విమానాల విడిభాగాలూ, తరవాత ఇంజిన్లూ, ఆ పైన ఏకంగా విమానాలనే తయారు చేయడం మొదలుపెట్టాడు. బోయింగ్‌ నుంచి పోటీ తట్టుకోలేక, అతడికి విమానాన్ని అమ్మిన మార్టిన్‌ సంస్థ కొన్నాళ్లకు మూత బడింది. ఆ పైన విమానాల తయారీ రంగంలో ఎదురే లేనట్టుగా బోయింగ్‌ దూసుకెళ్లింది. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తో కాదనడానికి బోయింగ్‌ ఎదుగుదలే సాక్ష్యం.


 

ఇవీ అలానే...

లక్ట్రానిక్స్‌ రంగంలో పేరున్న సోనీ సంస్థ కూడా అనుకోకుండానే ప్రాణం పోసుకుంది. జపాన్‌లో అకియో మొరిటా, మసురా ఇబుకా అనే ఇద్దరు స్నేహితులు ఒకప్పుడు రేడియోల్ని రిపేర్‌ చేసే దుకాణం నడిపేవారు. వాళ్ల దగ్గరకు మరమ్మతు కోసం వచ్చే రేడియోల సంఖ్య రోజురోజుకీ పెరగడంతో, త్వరగా పాడవకుండా ఉండే నాణ్యమైన రేడియోని వాళ్లే తయారు చేసి అమ్మకానికి పెట్టారు. సోనీ సంస్థ ఆవిర్భావం ఆ రేడియోలతోనే మొదలైంది.

* హెడ్‌ అండ్‌ షోల్డర్స్‌, ప్యాంటీన్‌, ఏరియల్‌, టైడ్‌, ఓరల్‌ బీ, పాంపర్స్‌, డ్యూరాసెల్‌.. చాలామందికి ఈ పేర్లతో ఉన్న ఉత్పత్తులు పరిచయమే. ‘ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబిల్‌’ సంస్థే వీటన్నింటినీ తయారు చేస్తోంది. విలియమ్‌ ప్రాక్టర్‌ అనే కొవ్వొత్తుల వ్యాపారీ, జేమ్స్‌ గ్యాంబిల్‌ అనే సబ్బుల వ్యాపారీ ఒలివియా, ఎలిజబెత్‌ అనే ఇద్దరు అక్కచెల్లెళ్లను పెళ్లి చేసుకున్నారు. అల్లుళ్లిద్దరూ తెలివైన వాళ్లే కాబట్టి కలిసి వ్యాపారం చేస్తే బావుంటుందని వాళ్ల మామగారు సలహా ఇవ్వడంతో ఇద్దరి పేరుమీదా ‘పీఅండ్‌జీ’ అనే వ్యాపార సామ్రాజ్యం వెలిసింది.

* హోండా సంస్థ వ్యవస్థాపకుడు సోయిచిరో హోండా ఓ సాధారణ కార్ల మెకానిక్‌. ఒకప్పుడు టొయోటా సంస్థకు చెందిన కార్లకు మరమ్మతు చేసేవాడు. కార్లలానే తన సైకిల్‌ కూడా దానంతటదే ప్రయాణిస్తే బావుంటుందని అనిపించి దానికి ఓ చిన్న ఇంజిన్‌ని అమర్చాడు. అది బాగా పనిచేయడంతో, బైకుల తయారీకి పెట్టుబడి పెడతామని కొంతమంది ముందుకొచ్చారు. అలా ఓ మామూలు మెకానిక్‌ హోండా అధినేతగా మారాడు.

ఓసారి ఓ రాజుగారు తన రాజ్యంలో ప్రజల మనస్తత్వం ఎలా ఉందో తెలుసుకోవడానికి రాత్రి పూట రోడ్డు మధ్యలో ఓ పెద్ద బండరాయిని పెట్టించాడు. తెల్లవారాక ఎవరైనా దాన్ని తొలగిస్తారేమో చూద్దామని ఆ రాజు మారు వేషంలో రోడ్డు పక్కనే నిలబడ్డాడు. చాలామంది ఆ రాయిని చూసీ చూడనట్టు పక్కనుంచి వెళ్లిపోయారు. ఇంకొందరైతే, రాజుగారికి రోడ్లని శుభ్రం చేయించడం కూడా తెలీదు అంటూ తిట్టుకుంటూ ముందుకు నడిచారు. ఒక వ్యక్తి మాత్రం తన చేతిలో బరువైన మూటలున్నా, వాటిని పక్కనబెట్టి ఆ రాయిని అతికష్టమ్మీద దారిలోంచి తొలగించాడు. వెనక్కి తిరిగి చూసేసరికి ఆ రాయి ఉన్న స్థలంలో ఓ చిన్న సంచీ కనిపించింది. ‘ఈ రాయిని తొలగించిన వాళ్లకి ఇందులో ఉన్న బంగారం దక్కుతుంది’ అంటూ అందులో ఓ చీటీ రాసుంది. ‘బోయింగ్‌’ అధినేత విలియమ్‌, లాంబోర్గిని వ్యవస్థాపకుడు ఫెరూషియో, ‘కేఎఫ్‌సీ’ సృష్టికర్త శాండర్స్‌ లాంటి వాళ్లందరికీ అవమానాలూ, సమస్యలూ, సంక్లిష్ట పరిస్థితుల రూపంలో ఇలాంటి పెద్ద పెద్ద బండరాళ్లు ఎదురయ్యాయి. వాళ్లంతా వాటిని దాటుకుపోకుండా, తొలగించుకొని ముందుకెళ్లారు. ‘బంగారం’ లాంటి జీవితాన్ని అందుకున్నారు. రాజుగారి కథా, వీళ్లందరి గాథా చెప్పేదొక్కటే... జీవితంలో మంచిమంచి అవకాశాలన్నీ చాలాసార్లు కష్టాలూ సమస్యల రూపంలోనే వస్తాయి. వాటిని చూసీ చూడనట్టు వదిలేసేవాళ్లు అలాగే మిగిలిపోతారు. తొలగించుకొని ముందుకెళ్లేవాళ్లు విజేతలై చరిత్ర సృష్టిస్తారు!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.