close
బాయ్‌ఫ్రెండ్‌ కావాలని అమ్మని అడిగా!

అందం, అణకువ, అల్లరి... ఇవన్నీ పోతపోసిన రూపం - రష్మిక మందన్నా. ‘ఛలో’, ‘గీత గోవిందం’ చిత్రాలతోనే 
తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. తాజాగా ‘దేవదాస్‌’లో ఆకట్టుకుంది. కన్నడ నుంచి తెలుగు 
చిత్రసీమలో అడుగుపెట్టిన రష్మిక ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటోంది.  ‘తెలుగు భాష, హైదరాబాద్‌, తెలుగు 
చిత్రసీమా నాకు బాగా నచ్చేశాయ్‌.. ఇక్కడి ప్రేక్షకులైతే మరీనూ...’ అంటున్న రష్మిక ఇంకా ఏం చెబుతోంంటే... 

చూడ్డానికి అల్లరిపిల్లలా కనిపిస్తాను కదా! కానీ పైకి కనిపిస్తున్నంత అల్లరి కాదు. నేను చాలా సున్నితం. ఎవరైనా బాధ పడుతుంటే తట్టుకోలేను. ‘నా గురించేమైనా బాధ పడుతున్నారా’ అనుకుని నాలో నేను హైరానా పడిపోతుంటా. ఏదైనా ఓ పని అప్పగించారంటే... అందులో పూర్తిగా మునిగి మిగిలిన ప్రపంచాన్ని మర్చిపోతా. ‘నీలాంటి అమ్మాయి సినిమాల్లోనా’ అని అమ్మ ఆటపట్టిస్తుంటుంది. నిజంగానే.. ‘నేనేంటి?  సినిమాల్లో ఏంటి?’ అని ఇప్పుడనిపిస్తోంది. మా ఇంట్లో అస్సలు సినిమా వాతావరణం లేదు. నేను సినిమాలు చూసేదాన్ని కానీ, మరీ అంత పిచ్చి లేదు. కానీ సినిమాల్లోకి వచ్చేశాను. అది కూడా అనుకోకుండా, ఓ మెరుపు కలలా.. జరిగిపోయింది. 


 

సైన్స్‌ అంటే భయం... 
నేను పుట్టింది కర్ణాటక కూర్గ్‌ దగ్గర్లోని విరజ్‌పెట్‌లో. నాన్న వ్యాపారవేత్త. మాకు కాఫీ తోటలు ఉన్నాయి. మూడో తరగతి వరకూ చెన్నైలో చదువుకున్నా. నాలుగు నుంచి పది వరకూ కూర్గ్‌లో. మైసూర్‌లో ఇంటర్‌, బెంగళూరులో డిగ్రీ చదివా. సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యం ఆప్షన్స్‌తో డిగ్రీ చేశా. దాదాపు నా బాల్యం అంతా ఇంటికి దూరంగా హాస్టల్స్‌లోనే గడిచిపోయింది. నాకెప్పుడూ హాస్టల్‌ జీవితం భారంగా అనిపించలేదు. ఎక్కడికి వెళ్లినా నా చుట్టూ ఉన్నవాళ్లని స్నేహితులుగా మార్చుకోవడం నాకు చాలా సులభం అనిపిస్తుంది. అందుకే ఎక్కడున్నా నాకో స్నేహ బృందం ఉండేది. వాళ్లతో స్నేహం కుటుంబాన్ని మరిపించేది. పదో తరగతి వరకూ... ఏదో గట్టెక్కించేశా. ఇంటర్‌, డిగ్రీలలో భయంకరమైన మార్పులొచ్చి టాపర్‌గా మారిపోయా. ఎందుకంటే... నాకిష్టమైన సబ్జెక్టుల్ని ఎంచుకునే అవకాశం అప్పుడే వచ్చింది. లెక్కలు, ఫిజిక్స్‌, జువాలజీ పేర్లు చెబితే వణుకొచ్చేస్తుంది. చిన్నప్పుడు ఓసారి ‘డాక్టర్‌’ అవ్వాలనుకున్నా. ఆ తరవాత గుండె బొమ్మ, మూత్ర పిండాల బొమ్మ గీసేసరికి.... ‘ఇదంతా నా వల్ల కాదు’ అని ఫిక్సయిపోయా. డిగ్రీలో ఉన్నప్పుడే ‘కిరిక్‌ పార్టీ’ అనే కన్నడ చిత్రంలో అవకాశం వచ్చింది. అదే నా తొలి చిత్రం. అటు కాలేజీ, ఇటు షూటింగ్‌ అంటూ రెండు పడవలమీద ప్రయాణం చేశా. అయినా డిస్టింక్షన్‌లో పాసయ్యా. ‘కాలేజీకి ఎప్పుడూ రావు.. నీకేంటి ఇన్ని మార్కులు? కాపీ కొట్టావా’ అంటూ మా లెక్చరర్లంతా ఆశ్చర్యపోయారు. నా మార్కులకి కారణం నా స్నేహితులే. ఎగ్జామ్‌ హాల్‌కి ఓ గంట ముందు వెళ్లేదాన్నంతే. ‘ఈ ప్రశ్న వస్తే... ఇలా రాయి...’ అంటూ జవాబుల్ని నాకో చిన్నకథలా పూస గుచ్చినట్టు చెప్పేవారు. అవన్నీ బుర్రకు ఎక్కించేసుకుని అచ్చుగుద్దినట్టు దింపేసేదాన్ని. అలా.. డిగ్రీ పూర్తి చేసేశా. 
చదువుతోపాటు మిగతా  యాక్టవిటీస్‌లోనూ చురుగ్గా ఉండేదాన్ని. స్విమ్మింగ్‌ అంటే చాలా ఇష్టం. త్రోబాల్‌లో కాలేజీ ఛాంపియన్‌ని. స్కూల్లో, కాలేజీలో డాన్స్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చేదాన్ని. భరతనాట్యం, ఫోక్‌ డ్యాన్స్‌ అంటే ఇష్టం. ప్రత్యేకంగా నేర్చుకోలేదు కానీ ఎవరైనా చేస్తుంటే చూసి.. అలాగే చేసేదాన్ని. ఏదైనా ఒక్కసారి చూస్తే, వింటే బుర్రకు ఎక్కిపోతాయి నాకు. 
సినిమా ఛాన్స్‌ 
‘చూడ్డానికి బాగుంటావ్‌... మోడల్‌గా ట్రై చేయకూడదా’ అంటూ డిగ్రీలో ఉండగా స్నేహితులు సలహా ఇచ్చారు. అలా ఆ రంగంపై ఆసక్తి పెంచుకున్నా. ‘ఫ్రెష్‌ ఫేస్‌ ఆఫ్‌ ఇండియా 2014’ టైటిల్‌ నాదే. నన్ను సినిమాల్లోకి లాక్కొచ్చింది కూడా ఆ టైటిలే. నా ఫొటోల్నీ, వీడియోల్నీ చూసిన ‘కిరిక్‌ పార్టీ’ టీమ్‌ నన్ను ఆడిషన్స్‌కి పిలిచింది. అసలు ఆడిషన్స్‌ అంటే ఏమిటో, ఎలా ఉంటాయో నాకు తెలీదు. నన్నూ, నా మాట తీరునీ చూసి ‘కిరిక్‌ పార్టీ’లో కథానాయికగా ఎంచుకున్నారు. ఆ సినిమా పెద్ద హిట్‌. తొలి సినిమా నాకు మంచి అనుభవాల్ని మిగిల్చింది, పాఠాల్నీ నేర్పింది. నాకు సినిమాలు కొత్త కదా, అందుకే అమ్మ నాతో పాటు షూటింగులకు వచ్చేది. కాబట్టి... కొత్త ప్రదేశానికి వెళ్లా, కొత్త మనుషులతో పనిచేస్తున్నా అనే భావన ఎప్పుడూ రాలేదు. ఎప్పుడైనా ఓరోజు అమ్మ సెట్‌లో లేకపోయినా.. భయం ఉండేది కాదు. సినిమా రంగం అంటే చాలామందికి భయాలు ఉంటాయి. అమ్మాయిలకు రక్షణ లేదేమో అనిపిస్తుంది. కానీ, మనల్ని బట్టే ఎదుటి వ్యక్తి ప్రవర్తన ఉంటుంది... అనే భరోసా ఈ ప్రయాణంతో దొరికింది. అందుకే ‘కిరిక్‌ పార్టీ’ టీమ్‌నీ, షూటింగ్‌ రోజుల్నీ ఎప్పటికీ మర్చిపోలేను. ఆ తరవాత ‘ఛలో’లో అవకాశం వచ్చింది. ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నా. ‘గీత గోవిందం’ అయితే నన్నెక్కడికో తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు ‘దేవదాస్‌’కీ మంచి గుర్తింపు వచ్చింది. కన్నడలో ఇప్పటి వరకూ నాలుగు సినిమాలు చేశా. అక్కడలానే ఇక్కడా నన్ను బాగా చూసుకుంటున్నారు.

ప్రేమ‌-బ్రేక‌ప్‌  

అమ్మానాన్నలతో నాకు చనువు ఎక్కువ. నాపైన వాళ్లకు భరోసా ఎక్కువ. అమ్మని ఫ్రెండ్‌లా సరదాగా ఆట పట్టిస్తుంటా. నా ఫీలింగ్స్‌ అన్నీ చెప్పుకుంటా. ‘అందరికీ బాయ్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారు. నాకెందుకు లేరమ్మా.. నాకో బాయ్‌ ఫ్రెండ్‌ కావాలి’ అని అమ్మని చాలాసార్లు అడిగా. ‘ఈ అబ్బాయి బాగున్నాడా, ఆ అబ్బాయి బాగున్నాడా’ అని చాలామందిని చూపించేదాన్ని. అమ్మ కూడా సరదాగానే తీసుకునేది. ‘కిరిక్‌ పార్టీ’ సమయంలోనే ఆ సినిమాలోని హీరో రక్షిత్‌ శెట్టిపై అభిమానం ఏర్పడింది. అది ఇష్టంగా, ప్రేమగా మారింది. ఈ విషయాన్నీ ముందు అమ్మతోనే చెప్పా. ‘నేను తీసుకున్నది సరైన నిర్ణయమేనా’ అని అడిగా. ఎందుకంటే ఆ వయసులో మన కంటికి అందరూ మంచివాళ్లుగానే కనిపిస్తారు. కానీ అమ్మానాన్నలు మాత్రమే మనకు ఏది మంచిదో ఆలోచిస్తారు. ‘నీ ఇష్టం.. నీకేది అనిపిస్తే అది చెయ్‌’ అంటూ అప్పుడు కూడా అమ్మ నా అభిప్రాయానికి విలువ ఇచ్చింది. కానీ ఆ ప్రేమకథ నిశ్చితార్థంతోనే ఆగిపోయింది. ‘అంతా బాగుంది’ అనుకున్నప్పుడు ఓ బంధాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. పొరపాట్లూ, లోటుపాట్లూ  కనిపిస్తే... దాన్ని అక్కడితో వదిలేయడం మంచిది. లేదంటే భవిష్యత్తులో చాలా కోల్పోతాం అనిపించింది. జరిగిన పరిణామాల వల్ల ప్రేమపైన నా నమ్మకాలేమీ మారిపోలేదు. ప్రేమ గొప్పది. అది చూసే కళ్లని బట్టి ఉంటుంది.

లవ్‌ హైదరాబాద్‌ 
హైదరాబాద్‌ వస్తే మరో ఇంటికి వచ్చినట్టే ఉంటుంది. హైదరాబాద్‌ అనగానే ‘ఇక్కడ బిరియానీ బాగుంటుంది’ అంటుంటారు. అదొక్కటే కాదు.. ఇక్కడ అన్నీ బాగుంటాయి. రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం హైదరాబాద్‌లో బాగా దొరుకుతుంది. ఇక్కడ నాకు స్వేచ్ఛ దొరికింది. బయట మామూలుగా అందరిలానే తిరిగేస్తున్నా. షాపింగులకూ, సినిమాలకూ వెళ్తున్నా. చూడగానే నన్ను ఎవ్వరూ గుర్తుపట్టరు. ‘ఈ అమ్మాయి రష్మికనా’ అనిపించడానికి కనీసం అయిదు సెకన్ల సమయం అయినా పడుతుంది. అది చాలు.. అక్కడి నుంచి నేను జారుకోవడానికి. ‘ఛలో’ చేసినపుడు తెలుగు రాక నటించడానికి చాలా ఇబ్బంది పడాల్సివచ్చింది. పెద్ద పెద్ద డైలాగులు ఇచ్చేసేవారు. దాంతో ఏడుపు వచ్చేసేది. కానీ... ‘నాకు ఎందుకు రాదు’ అని పట్టుబట్టి మరీ తెలుగు నేర్చుకున్నా. ఇప్పుడు తెలుగు బాగా అర్థం అవుతోంది. మాట్లాడుతున్నా కూడా. నాగశౌర్య, విజయ్‌ దేవరకొండ, నాని... ఈ ముగ్గురితో నేను పనిచేశా. ముగ్గురూ నన్ను బాగా చూసుకున్నారు. స్నేహితురాలిగా ఆదరించారు. 
నాగశౌర్య, నాని.. ఈ ఇద్దరికీ చేతిలో ఓ ట్యాబ్‌ పెట్టేస్తే చాలు, అందులో సినిమాలు చూసుకుంటూ, వీడియోలు చూసుకుంటూ గడిపేస్తారు. నాని, విజయ్‌... ఇద్దరూ సెట్లో సన్నివేశాన్ని ఇంప్రూవ్‌ చేసేస్తుంటారు. వాళ్ల ఈజ్‌కి తగ్గట్టుగా నటించడం పెద్ద సవాల్‌. 
ప్రస్తుతం తెలుగులో రెండు, కన్నడలో ఒక సినిమా చేస్తున్నాను. అనుకోకుండా మోడలింగ్‌లోకీ అక్కణ్నుంచి సినిమాల్లోకీ వచ్చాను తప్ప ఇక్కడేదో సంపాదించేద్దామని కాదు. ‘కిరిక్‌ పార్టీ’ సమయంలో పారితోషికం అడగలేదు. వాళ్లే రెండున్నర లక్షలు ఇచ్చారు. డబ్బు గురించి నేను పెద్దగా పట్టించుకోను. కానీ.. పరిశ్రమలో ఫ్రీగా ఏదీ చేయకూడదు. చేస్తే విలువ ఉండదు. మనకంటూ ఓ స్థాయి వచ్చాక, అదేమిటో చూపించడానికైనా పారితోషికం తీసుకోవాలి. పైగా నేనంటే నేనే కాదు, నా స్టాఫ్‌ కూడా. వాళ్లకు మంచి జీతాలు ఇవ్వాలి కదా!

- అన్వర్‌  

మంచి ‘దొంగ’ని

అన్మోల్‌, ప్రేరణ, ఆపేక్ష, వరుణ్‌... వీళ్లంతా నా బెస్ట్‌ ఫ్రెండ్స్‌. అన్మోల్‌ నేనూ కజిన్స్‌. మాకు మూడు నెలలున్నపుడే మా మధ్య స్నేహం మొదలైందట. ఓరోజు మా మమ్మీ, అన్మోల్‌ వాళ్ల మమ్మీ కలసి మా ఇద్దరినీ పోలియో డ్రాప్స్‌ వేయించడానికి తీసుకెళ్తే అక్కడే ఆడుకోవడం మొదలెట్టామట. తను, నేనూ కూర్గ్‌లో కలిసే చదువుకున్నాం. ఎక్కడున్నా టచ్‌లో ఉంటాం. ప్రేరణా, నేనూ ‘ఫ్రెష్‌ ఫేస్‌ కాంటెస్ట్‌’ సమయంలో కలిశాం. అయిదంటే అయిదు నిమిషాలు మాట్లాడుకున్నాం. పదిహేనేళ్ల పరిచయంలా అనిపించింది. అప్పట్నుంచీ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయిపోయాం. 
* చిన్నప్పుడు ఇంట్లో పది, ఇరవై రూపాయల నోట్లు తీసేసి మంచం కింద దాచేదాన్ని. దానికో కారణం ఉంది. దానం చేస్తే పుణ్యం వస్తుందని నా నమ్మకం. అందుకే... 
ఆ డబ్బుల్ని తర్వాత పంచిపెట్టేదాన్ని. 
* నాతో ఎవరైనా నవ్వుతూ మాట్లాడకపోతే... చాలా ఇబ్బంది పడిపోతా. ‘గీత గోవిందం’ క్లైమాక్స్‌ తీస్తున్నప్పుడు సెట్‌కి కాస్త ఆలస్యంగా వెళ్లా. ఎవ్వరూ నాతో మాట్లాడలేదు. నేను పలకరించినా నా వంక చూడలేదు. దాంతో ఓ చోట కూర్చుని ఏడ్చేశా. వెంటనే దర్శకుడు పరశురామ్‌ పరిగెత్తుకుని నా దగ్గరకు వచ్చేశారు. ‘ఇదంతా నిన్ను ఆట పట్టించడానికే’ అంటూ నా వెనకున్న కెమెరాని చూపించారు. అప్పటి వరకూ నన్నో కెమెరా ఫాలో అవుతోందని గమనించనేలేదు. 
* నాకు పాటలంటే పిచ్చి. నా మూడ్‌కి తగ్గట్టు మెలోడీలు, విషాద గీతాలు, హుషారుగా ఉండే ఫాస్ట్‌ బీట్‌లు... ఇలా వింటుంటా. పుస్తకాలు మాత్రం చదవను. అవి ముట్టుకుంటే నిద్ర వచ్చేస్తుంది. 
* వంట కొంచెం వచ్చు. కేకు బాగా చేస్తా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.