close
వీళ్లకి చాలా సీనుంది!

కొందరి గురించి తెలుసుకుంటుంటే ఆసక్తిగా అనిపిస్తుంది. తెలుసుకునే కొద్దీ ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. అలాంటి వాళ్లే వీళ్లు. ఇంతకీ వీళ్లెవరూ... ఏం చేస్తున్నారూ అంటే...


ఈ బాడీగార్డు జీతం నెలకి రూ.15లక్షలు

కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ ఇమేజ్‌ అంతా ఇంతాకాదు. కాలు బయటపెడితే చాలు ‘సల్లూభాయ్‌’ అంటూ చుట్టుముట్టేసి అభిమానంలో ముంచెత్తుతుంటారు జనాలు. అలాంటి సందర్భాల్లో ఎలాంటి తోపులాటలూ జరగకుండా నీడలా సల్మాన్‌ వెన్నంటే ఉంటాడు షెరా. పాతికేళ్ల నుంచి తనకు అంగరక్షకుడిగా పనిచేస్తున్న షెరాను సొంత మనిషిలా చూస్తాడు సల్మాన్‌. నెలకి పదిహేను లక్షల రూపాయల జీతం ఇవ్వడంతోపాటు ఈ మధ్యనే షెరాకు ఓ పెద్ద ఇల్లు కూడా కట్టించి బహుమతిగా ఇచ్చాడు. బాడీగార్డుగా పక్కనుంటూనే పీఏగానూ, మేనేజర్‌గానూ కూడా పలు రకాల సేవలు అందిస్తూ సల్మాన్‌ ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న షెరా అసలు పేరు గుర్మీత్‌ సింగ్‌. అతనిది ముంబయిలోని ఓ మధ్యతరగతి కుటుంబం. తండ్రి ఓ మెకానిక్‌ షెడ్డును నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. చిన్నతనం నుంచీ చదువంటే ఇష్టంలేని షెరా కూడా తండ్రితోపాటే షెడ్డులో పనిచేసేవాడు. కొన్నాళ్లకి బాడీబిల్డర్‌ కావాలని జిమ్‌లో చేరి కండలుపెంచడం మొదలుపెట్టాడు. పలు పోటీల్లో పాల్గొని మిస్టర్‌ ముంబయి, మిస్టర్‌ మహారాష్ట్ర టైటిళ్లను కూడా అందుకున్నాడు. ఆ తరవాత ‘టైగర్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌’ పేరుతో సొంతంగా ఏజెన్సీని ప్రారంభించి బాడీ బిల్డర్లకూ, బాడీగార్డులకూ ట్రైనింగ్‌ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో చాలా సార్లు సల్మాన్‌కు బాడీగార్డుగానూ వెళ్లాడు షెరా. అతని తీరూ, జాగ్రత్తగా చూసుకునే విధానం సల్లూభాయ్‌కి నచ్చడంతో పర్మినెంట్‌ బాడీగార్డుగా ఉండిపొమ్మని ఆఫర్‌ ఇచ్చేశాడు. అప్పట్నుంచీ తనను నీడలా అంటిపెట్టుకుని ఉంటున్న షెరాకు భారీగా జీతమిస్తూ ఇంటి మనిషిలా చూసుకుంటున్నాడు సల్మాన్‌. షెరా ఇప్పటికీ సొంత ఏజెన్సీని నడుపుతున్నాడు. ఈ మధ్యనే ఆ ఏజెన్సీ ఆసియాలోనే బెస్ట్‌ సెక్యూరిటీ ఏజెన్సీ అవార్డునూ అందుకుంది. 


మన ప్రణవ్‌... ‘స్టార్‌’ సీఈఓ

గుజరాత్‌లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన ప్రణవ్‌ మిస్త్రీ... రెండేళ్ల క్రితం శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగానికి గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అయ్యాడు. తాజాగా స్టార్‌(శాంసంగ్‌ టెక్నాలజీ అండ్‌ అడ్వాన్స్డ్‌ రీసెర్చ్‌ ల్యాబ్స్‌)కి ప్రెసిడెంట్‌, సీఈవోగా పదోన్నతి పొందాడు. ఆ సంస్థకు సంబంధించిన పరిశోధనలూ, ఆవిష్కరణలన్నింటికీ ఇక మీదట ప్రణవ్‌ నేతృత్వం వహించాల్సి ఉంటుంది. ముప్ఫై ఏడేళ్ల ఈ కంప్యూటర్‌ సైంటిస్టుది నిరుపేద కుటుంబం. ఇంజినీరింగ్‌ అయ్యాక ఆర్ట్స్‌ అండ్‌ సైన్సులో మాస్టర్స్‌ పూర్తి చేశాడు. ఐఐటీ బోంబేలో కొంత కాలం ఇంటర్న్‌షిప్‌ చేశాక శాంసంగ్‌లో ఉద్యోగం వచ్చింది. అలా కంప్యూటర్‌ సైంటిస్టుగా చేరి ఎన్నో ప్రయోగాలు చేశాడు. అందులో ఇన్విజిబుల్‌ కంప్యూటర్‌ మౌస్‌ ఆవిష్కరణ ప్రణవ్‌కి మరింత గుర్తింపును తీసుకొచ్చింది. అందుకే 2009లో వరల్డ్‌ టాప్‌ 35 ఆవిష్కర్తల్లో ఒకడిగా నిలిచాడు. 2013లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌ అవార్డునూ అందుకున్నాడు. అందుకే శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగం గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలు అప్పగించింది. తాజాగా స్టార్‌ సీఈవో, ప్రెసిడెంట్‌ను చేసింది. సుందర్‌ పిచాయ్‌, సత్యనాదెళ్ల తరవాత ఓ విదేశీ సంస్థలో అంతటి ఉన్నత స్థాయి బాధ్యతలు అందుకుంది ప్రణవ్‌ మిస్త్రీనే కావడం విశేషం.


14ఏళ్ల పాత్రికేయుడు

పద్నాలుగేళ్ల గుర్మీత్‌ గోయెత్‌ హరియాణాలోని జింద్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చదువుతోపాటు ‘గోల్డీ గోయెత్‌’ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌నీ రన్‌ చేస్తూ లక్షల మంది వీక్షకులకు చేరువయ్యాడు. రాజకీయనాయకుల్నీ, అధికారుల్నీ, సోషల్‌వర్కర్లనీ ఇంటర్వ్యూలు చేసి తన ఛానల్‌లో పోస్టు చేస్తున్నాడీ జూనియర్‌ జర్నలిస్టు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, జన్‌నాయక్‌ జనతా పార్టీ నాయకుడు దుష్యంత్‌ చౌతాలా వంటి వారినీ ఏ మాత్రం తడబడకుండా జర్నలిజంలో చేయి తిరిగిన రిపోర్టర్‌ మాదిరి ఇంటర్వ్యూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. జింద్‌ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో నాయకుల హడావుడి, జర్నలిస్టుల కవరేజీని దగ్గరగా చూడటంతో ఆసక్తి కలిగి రిపోర్టర్‌ అయిపోవాలనుకున్నాడట గుర్మీత్‌. అందుకే యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టి వీడియోలు పోస్టు చేస్తున్నాడు. పేపర్లూ, టీవీల్లో రాజకీయ వార్తలు చూసీ, తెలిసిన వాళ్లతో మాట్లాడీ ముఖాముఖికి సిద్ధమవుతున్నాడు. లోకల్‌ రిపోర్టర్ల సాయంతో రాజకీయ నాయకులూ, అధికారుల అపాయింట్‌మెంట్‌ తీసుకుని ఫోన్‌లో సెల్ఫీ వీడియోలో ఇంటర్వ్యూని రికార్డు చేస్తున్నాడు. హరియాణీ, హిందీ, ఇంగ్లీషు, పంజాబీ, ఫ్రెంచ్‌ భాషలు గలగలా మాట్లాడే గుర్మీత్‌ సెలవురోజుల్లోనూ, స్కూలు అయిపోయాకా ఈ పని చేస్తున్నాడు. చదువులో కూడా ముందుండే ఈ చిచ్చరపిడుగు ఇంటర్‌ అయ్యాక జర్నలిజం చదువుతాననీ, మరో పదిహేనేళ్ల తరవాత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా జింద్‌ నుంచి బరిలోకి దిగుతాననీ చెబుతున్నాడు.
 

24 నవంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.