close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అవి తింటే గుండె ఢమాల్‌..!

ప్రాసెస్‌డ్‌ ఆహారం ఏదీ ఆరోగ్యానికి అంత మంచిది కాదన్నది తెలిసిందే. అంతేకాదు, అది గుండె ఆరోగ్యాన్ని మరింతగా దెబ్బతీస్తుందని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ పేర్కొంటోంది. ఈ రకమైన ఆహారం తీసుకునేవాళ్లలో బరువు పెరగడంతోబాటు క్రమేణా గుండె పనితీరు కూడా దెబ్బతిన్నట్లు గుర్తించారు. కొవ్వులు, పిండిపదార్థాలు, పంచదార, కృత్రిమ ఫ్లేవర్లు, రంగులు ఉపయోగించి తయారుచేసిన సాఫ్ట్‌ డ్రింకులూ ఉప్పుతో కూడిన స్నాక్సూ కుకీలూ కేకులూ ప్రాసెస్‌డ్‌ మాంసమూ చికెన్‌ నగ్గెట్సూ ఇన్‌స్టంట్‌ సూపులూ... వంటివన్నీ అల్ట్రా ప్రాసెస్‌డ్‌ ఫుడ్స్‌ జాబితాలోకే వస్తాయి. అదే పండ్లూ కూరగాయలూ నట్సూ ముడిధాన్యాలూ ఆకుకూరలూ... వంటి వాటిని తినడం వల్ల గుండెతోబాటు మొత్తంగా ఆరోగ్యం మెరుగవుతుందనీ గుర్తించారు. ఇందుకోసం వీళ్లు కొంతమంది పెద్దవాళ్లనీ, మరికొందరు చిన్న వయస్కులనీ ఎంపిక చేసి మరీ పరిశీలించారట. వాళ్లలో, వయసుతో నిమిత్తం లేకుండా- ప్రాసెస్‌డ్‌ ఆహారపదార్థాలకన్నా ముడివాటిని తినే పెద్దవాళ్లలోనే వాటిని తినని పిల్లల కన్నా గుండె ఆరోగ్యం బాగున్నట్లు గుర్తించారు. కాబట్టి జాగ్రత్త.


ఎందుకు మర్చిపోతారంటే...

చాలామందికి కొన్ని విషయాలు బాగా గుర్తు ఉంటాయి. కొన్ని మాత్రం ఎప్పుడు చెప్పింది అప్పుడే మర్చిపోతుంటారు. ఎందుకన్నది ఓ పట్టాన అర్థం కాదు. అయితే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోకపోవడానికి కారణం అది వాళ్ల అనుభవంలోకి రాకపోవడంగానీ లేదా ఆ విషయాన్ని వాళ్లు మరోసారి గుర్తుచేసుకోకపోవడంగానీ కావచ్చని ఫ్లాండర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీకి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. ఓ ప్రదేశానికి స్వయంగా వెళ్లి చూడటం లేదూ ఏదైనా సంఘటన జరిగినప్పుడు ప్రత్యక్షంగా ఉండటం... వంటివి అనుభవంలోకి వచ్చినప్పుడు వాటిని మెదడులోని హిప్పోక్యాంపస్‌ భాగం ఒకటికి పదిసార్లు గుర్తుచేసుకుంటుందట. ఈ ప్రక్రియ మనం నిద్రపోయినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఆ విధంగా అది జ్ఞాపకాల పొరల్లో నిక్షిప్తమై పోతుంది. అలాకాకుండా ఏదైనా విషయాన్ని కేవలం విన్నప్పుడో లేదా చెప్పినప్పుడో అది వెంటనే మర్చిపోయే అవకాశం ఎక్కువ. దానిపట్ల పెద్దగా ఆసక్తి లేకపోవడం ఒక కారణం కాగా, ఆ విషయాన్ని మరోసారి గుర్తుచేసుకునే సందర్భం రాకపోవడం వల్ల అది మెదడుపొరల్లోకి చేరకపోవడంతో అది జ్ఞాపకంగా నిక్షిప్తం కాక మర్చిపోతుంటాం. మొత్తమ్మీద అనుభవంతో వచ్చే జ్ఞాపకం పదిలంగా ఉంటుందన్న విషయాన్ని తేల్చారు పరిశోధకులు. దీని ఆధారంగా మతిమరపు బాధితుల్లో జ్ఞాపకశక్తిని పెంచగలిగే చికిత్సల్ని రూపొందించే ఆలోచనలో ఉన్నారు. 


గర్భిణీలకు చెప్పకండి!

గర్భిణీలుగా ఉన్నప్పుడు ఏ విషయం కోసమైనా బాగా ఆందోళన చెందితే, అది పుట్టబోయే పిల్లల పెరుగుదలమీదా వాళ్ల మానసిక ఆరోగ్యంమీదా ప్రభావం చూపిస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది. అయితే అది ఎలా అనేది ఇప్పటివరకూ చెప్పలేకపోయారు. ఆల్టో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిండు గర్భిణీలకు విషాదకరమైన వార్తలు చెప్పడం వల్ల వాళ్లు కలత చెందితే, దాని కారణంగా శిశువు మెదడులో భావోద్వేగాలూ, మాట్లాడటానికి  సంబంధించిన భాగంలో చురుకుదనం తగ్గిపోయినట్లు గుర్తించారు. దీనికోసం వీళ్లు 19 మంది గర్భిణీల్ని ఎంపిక చేసుకుని వాళ్లకు రకరకాల శబ్దాలను వినిపించడం ద్వారా పిల్లల మెదడులోని రక్తప్రసారంలో జరిగే మార్పులను స్కానింగ్‌లో ప్రతిఫలిస్తోన్న కాంతి ద్వారా తెలుసుకున్నారట. శాస్త్రీయంగా తెలియకున్నా వెనకటి రోజుల నుంచీ కూడా పెద్దవాళ్లు అనారోగ్యంతో ఉన్నవాళ్లకీ గర్భిణీలకీ చెడువార్తలను చెప్పకపోవడానికి ఇదే కారణం కావచ్చు.


పుట్టగొడుగుల్లో ఏముంది?

పురుషుల్లో వయసు పెరిగేకొద్దీ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌  వచ్చే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 12 లక్షల మంది ఈ క్యాన్సర్‌కు గురవుతున్నారట. అయితే జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య తక్కువగా ఉండటంతో అక్కడి వాళ్ల ఆహారపులవాట్లను నిశితంగా గమనించిన టొహొకొ విశ్వవిద్యాలయ పరిశోధకులు దానికి కారణం వాళ్ల ఆహారపుటలవాట్లేననీ, ముఖ్యంగా తరచూ పుట్టగొడుగులు తినేవాళ్లలో ఈ క్యాన్సర్‌ వచ్చే అవకాశం తక్కువగా ఉందనీ గుర్తించారు. దశాబ్దాల నుంచీ పుట్టగొడుగుల్ని తినే 36 వేలమందిని పరిశీలించినప్పుడు- వాళ్లలో ఈ క్యాన్సర్‌ జాడలు దాదాపుగా కనిపించలేదట. అదేసమయంలో మాంసాహారం, పాల పదార్థాలూ ఎక్కువగా తింటూ కూరగాయలూ పండ్లూ తక్కువగా తినేవాళ్లలో ఈ సమస్య అధికంగా ఉన్నట్లు తేలింది. అదే మాంసాహారానికి బదులుగా వారానికి కనీసం మూడుసార్లయినా పుట్టగొడుగులు తినేవాళ్లలో మాత్రం ఈ సమస్య బాగా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పుట్టగొడుగుల్లో ఎర్గోథియోనైన్‌ అనే పదార్థం ఉండటంతో ఇది కణాల్లోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. సాధారణంగా ఈ ఒత్తిడి వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపాలకు గురవడంతో ఏర్పడుతుంది. అది దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీసి క్యాన్సర్‌కు కారణమవుతుంది. కాబట్టి పుట్టగొడుగులతో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను నిరోధించవచ్చన్నది స్పష్టమైంది.
 

24 నవంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.