close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాన్నా... నేనొచ్చేస్తా

- ఈశ్వరి

కాలింగ్‌బెల్‌ చప్పుడికి ఒక్కసారిగా తెలివి వచ్చింది సావిత్రికి. కిటికీ వైపు చూసింది. వీధి దీపాలు ఇంకా వెలుగుతున్నాయి. సూర్యుడి వెలుగు ఏమాత్రం రాలేదు. ‘టైమెంతయింది?’ అనుకుంటూ పక్కనే ఉన్న సెల్‌ చూసింది. 4.35 అని కనిపించింది. ‘ఈ టైమ్‌లో ఎవరై ఉంటారు?’ అనుకుంటూ పక్కకు చూసింది. భర్త రాఘవ మంచి నిద్రలో ఉన్నాడు. ‘ఎలాగూ తెల్లవారుతోంది కదా... ఆయన్ను లేపడం ఎందుకు?’ అనుకుని తలుపు తీయడానికి బయటకు వచ్చేలోపు మళ్ళీ మోగింది కాలింగ్‌బెల్‌.

‘‘ఆ వస్తున్నా’’ అని సావిత్రి అంటుంటే అటువైపు నుంచి ‘‘అమ్మా! తలుపు తీయమ్మా’’ అంటూ సుధ గొంతు వినబడింది. ‘‘సుధా!’’ తలుపు తీస్తూ ఆశ్చర్యంగా పలికింది సావిత్రి.

గబగబా గ్రిల్‌ తాళం తీసింది.

‘‘అదేమిటి, నిన్నరాత్రి ఫోన్‌ చేశావు కదా, కనీసం వస్తున్నట్లు చెప్పలేదు. ఎప్పుడు బయలుదేరావు... శ్రీరామ్‌ రాలేదా?’’ బయటకు చూస్తూ అడిగింది.

‘‘రాలేదమ్మా. కాలేజీలో పనుండి అప్పటికప్పుడు అనుకుని నేనే బయలుదేరి వచ్చాను.’’

కూతురి కంఠంలో తడబాటును సావిత్రి కనిపెట్టింది. తన గదిలోకి వెళ్తున్న కూతురిని పరిశీలనగా చూసింది. బాగా ఏడ్చినట్లుంది. కళ్ళు వాచి ఉన్నాయి. సావిత్రి ఏదో అడగబోయేంతలో సుధ ‘‘నాన్న ఇంకా లేవలేదామ్మా. నేను కొంచెంసేపు పడుకుంటాను’’ అంటూ గదిలోకి వెళ్ళిపోయింది. సావిత్రి మనసు కీడు శంకించసాగింది. ఏదైనా అడుగుదామన్నా కూతురి ప్రవర్తన చూసి ఆగిపోయింది.

‘సరేలే, కొంచెంసేపు పడుకుని లేచాక నెమ్మదిగా అడగవచ్చు’ అనుకుంటూ తన రోజువారీ పనిలో పడింది.

* * *

హాల్లో టీవీ సౌండ్‌ వినిపించేసరికి చేతిలో ఉన్న పని ఆపి గబగబా హాల్లోకి వెళ్ళింది సావిత్రి. టీవీలో చానల్స్‌ మారుస్తున్న భర్తను చూసి ‘‘సుధ వచ్చిందండీ తెల్లవారుజామున’’ అని చెప్పింది.

‘‘అవునా... నన్ను లేపలేకపోయావా?

ఏరి, పడుకున్నారా?’’ అన్నాడు.

‘‘ఆ! కానీ సుధ ఒక్కతే వచ్చింది. శ్రీరామ్‌ రాలేదు. ఏదో కాలేజీ పని ఉంది అని చెప్పింది.’’

సావిత్రి చెప్తున్నంతలోనే రాఘవ- కూతురి గదివైపు నడిచాడు. మంచి నిద్రలో ఉన్న కూతుర్ని చూసి వెనక్కు వచ్చేశాడు.

‘‘రాత్రి ప్రయాణంలో నిద్రలేదేమో...

మంచి నిద్రలో ఉంది. లేపకు. తను ఎప్పుడు లేస్తే అప్పుడు లేవనీ. శ్రీరామ్‌కి ఫోన్‌ చేసి చెప్పిందా చేరానని?’’

‘‘ఏమోనండీ, చెప్పే ఉంటుంది. లేదా మెసేజ్‌ అయినా పెట్టి ఉంటుంది’’ అంది.

సుధ విషయంలో తను గమనించిన విషయం చెప్పలేదు. రాఘవకి కూతుళ్ళు అంటే పంచప్రాణాలు. పెద్ద కూతురు సుధకి పెళ్ళయి ఆర్నెల్లు అయింది. చిన్నకూతురు చదువు కోసం వేరే ఊళ్ళో హాస్టల్లో ఉంటోంది. పిల్లలిద్దరూ దూరంగా ఉండటంతో రాఘవ, సావిత్రిలు ఒంటరిగా ఫీల్‌ అవుతున్నారు. కూతురు ఇంటికి వచ్చేసరికి రాఘవకి చాలా హుషారుగా అనిపించింది.

* * *

ఆఫీసుకి వెళ్ళడానికి రెడీ అయి డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని టిఫిన్‌ తింటున్నాడు రాఘవ. సుధ నిద్రలేచి బ్రష్‌ చేసుకుని వచ్చి తండ్రి పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది. రాఘవ సుధని చూసి ‘‘అంత సడన్‌గా బయలుదేరి వచ్చావేమ్మా? ట్రైన్‌లో బెర్త్‌ దొరికిందా? ఇక్కడ కాలేజీ పని ఏదైనా ఉంటే నేను చూసేవాణ్ణి కదా!’’

సుధ నుండి ఏ సమాధానం రాలేదు.
‘‘సావిత్రీ, సుధకు కాఫీ తీసుకురా’’ వంటింట్లో ఉన్న సావిత్రికి వినపడేలా చెప్పాడు. సావిత్రి కాఫీ తెచ్చి సుధ ఎదురుగా టేబుల్‌పైన పెట్టింది.

సుధ ఒక్కసారిగా తండ్రి భుజంపై తలవాల్చి బొటబొటా కన్నీరు కార్చసాగింది. రాఘవ కంగారుగా సుధ తలపై చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు ‘‘ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? శ్రీరామ్‌తో ఏమైనా గొడవ జరిగిందా?’’ తండ్రి లాలనగా అడిగేసరికి సుధకి దుఃఖభారం మరింత ఎక్కువయింది. సావిత్రి ఏదో అనబోయేంతలో రాఘవ సైగ చేశాడు ఏమీ మాట్లాడవద్దని.

అయిదు నిమిషాలు అయ్యాక సుధ తేరుకుని ‘‘నేనింక అక్కడికి వెళ్ళను నాన్నా. నేనంటే అసలు విలువ లేదు. మగాడిననే అహంకారం ఎక్కువ. అన్నిటికీ తనమాటే నెగ్గాలంటాడు’’ అంటూ మరొకసారి ఏడవసాగింది.
సుధ మాటలు వింటూనే రాఘవ మొహంలో కోపం చోటుచేసుకోసాగింది.

‘‘అదేమిటీ... ఇన్నాళ్ళూ బానే ఉన్నాడు కదమ్మా. ఈ ఆరు నెలల్లో ఎప్పుడూ ఏ కంప్లయింట్‌ చెప్పలేదు. మరి ఇప్పుడు ఏమిటి ఇలా?’’ ప్రశ్నించాడు.

‘‘ఈ ఆరు నెలల్లో అడపాదడపా గొడవలు అయినా నేను పెద్దగా పట్టించుకోలేదు. రెండు మూడు రోజులు మౌనంగా ఉండి మళ్ళీ కలిసి పోయేవాళ్ళం. అందుకే నేను కూడా మీకు చెప్పలేదు. ఇప్పుడు ఇద్దరికీ అభిప్రాయభేదాలు మరీ ఎక్కువవుతున్నాయి. నేను అవునంటే తను కాదంటాడు. నాకు చాలా ఇన్సల్ట్‌గా ఉంటోంది. ఇంత చదువు చదివి టీమ్‌ లీడర్‌గా ఆఫీసులో అందరి మన్ననలూ అందుకుంటున్న నేను, ఇంట్లో మాత్రం ఎందుకూ పనికిరానిదానిగా ఉంటున్నాను’’ వెక్కుతూ చెప్పింది సుధ.

రాఘవ భృకుటి ముడిపడింది. ‘‘ఈ విషయం మీ అత్తమామలకు తెలుసా? చిన్నప్పటి నుంచీ మగపిల్లాడు అంటూ గారాబం చేసి పెంచితే ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. ఉండు, ముందు మీ అత్తమామలకి ఫోన్‌ చేసి నాలుగు దులిపేస్తాను. వాళ్ళు మీ ఆయనకి చెప్పుకుంటారు. ఆడపిల్లలంటే లోకువ! మనకు ఏమీ లేక పెళ్ళి చేసి వాళ్ళ ఇంటికి పంపలేదు... ఏదో సంప్రదాయం ప్రకారం అబ్బాయి దగ్గరికి అమ్మాయి వెళ్ళాలని కానీ.’’
రానురాను వాతావరణం సీరియస్‌గా మారడం చూసిన సావిత్రి ‘‘కంగారు పడకండి, శ్రీరామ్‌ మంచివాడే. అతనివైపు నుంచి కూడా చూద్దాం ఎందుకు మాటపట్టింపు వచ్చిందో?’’ అంది.

‘‘చాల్లే! ఇలా అంటే వాళ్ళు ఇంకా నెత్తికెక్కుతారు. అయినా మన పిల్ల మాట వదిలేసి అవతలివాళ్ళ మాట విందాం అంటావేమిటి? అంత సడన్‌గా బయలుదేరి వచ్చిందంటేనే అర్థం అవుతోంది. సరేలే, నువ్వు ఈరోజు
రెస్ట్‌ తీసుకోమ్మా. ఆఫీసుకి లీవ్‌ అప్లయ్‌ చెయ్‌. నేను మీవాళ్ళతో మాట్లాడతాను’’ అంటూ రాఘవ ఆఫీసుకు బయలుదేరాడు.

అతనికి లంచ్‌ బాక్సు అందిస్తూ ‘‘మీరు సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక మాట్లాడుదురుగాని లెండి... పూర్తిగా అన్ని విషయాలూ తెలుసుకుని’’ అంది భర్తతో నెమ్మదిగా సావిత్రి.

‘‘సరేలే, నువ్వేమీ దానికి క్లాసు పీకకు’’ అంటూ కారు స్టార్ట్‌ చేశాడు.

* * *

స్నానం చేసి వచ్చిన సుధకి ప్లేటులో టిఫిన్‌ పెట్టి ఇస్తూ అడిగింది సావిత్రి ‘‘నీ ఫ్రెండ్‌ గీత ఎక్కడ ఉంది సుధా?’’ అని.

‘‘అది యూఎస్‌ వెళ్ళిపోయిందమ్మా. దానికి కూతురు కూడా పుట్టింది. మొన్నే ఫోన్‌ చేసింది’’ అంది.

‘‘అదికాదు సుధా, నువ్వూ గీతా క్లాస్‌మేట్స్‌ కదా, పైగా రూమ్మేట్స్‌, బెస్ట్‌ ఫ్రెండ్స్‌! అయినా ఇంజినీరింగ్‌ టైమ్‌లో రెండు మూడుసార్లు మీకు మాటపట్టింపులు వచ్చాయి. మాట్లాడుకోవడం కూడా మానేశారు. కానీ,
ఆ విషయాలు మాదాకా తీసుకురాలేదు. మళ్ళీ మీరే కలిసిపోయారు. మరి, శ్రీరామ్‌ కూడా నీ ఫ్రెండ్‌లాంటివాడే కదా. పెళ్ళికి ముందు ఆరు నెలల పరిచయం ఉంది. పెళ్ళయి ఆర్నెల్లు అయింది. అంటే ఏడాదిగా బాగా పరిచయం ఉన్నవాడే కదమ్మా. మరి ఇప్పుడు ఎందుకు ఇంత గ్యాప్‌ వచ్చింది మీమధ్య?’’

‘‘లేదమ్మా, తను ఈమధ్య బాగా మారిపోయాడు. ప్రమోషన్‌ వచ్చాక మరీ అహంకారం అసహనం పెరిగిపోయాయి, నేను అబ్జర్వ్‌ చేస్తూనే ఉన్నాను’’ అంది సుధ.

‘‘నువ్వు అలా ఎందుకనుకోవాలి... ప్రమోషన్‌ వచ్చిందని నువ్వే అంటున్నావ్‌ కదా. ప్రైవేట్‌ సెక్టార్‌లో ప్రమోషన్‌ వచ్చింది అంటే దాంతోపాటే బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయి కదా. అతనికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు. అందుకే అసహనంగా ఉంటున్నాడేమో. అతని బాధా, భారం గురించి కనుక్కోవడానికి నువ్వు ఎప్పుడైనా ప్రయత్నం చేశావా?’’

తల్లి మాటలకి ఒక్కసారి ఆలోచనలో పడింది సుధ.

అంతలోనే ‘‘నువ్వు అన్నీ అలాగే చెబుతావమ్మా. నీకు అతని మీద మంచి ఇంప్రెషన్‌ వచ్చేసింది. ఇక నేను ఏం చెప్పినా నీకు అర్థంకాదు. నీకు నాన్నలాంటి మంచివాడు దొరికేశాడు. నా బాధ నీకు అర్థంకాదులే’’ అంటూ నీళ్ళతో నిండిన కంటిని తుడుచుకోసాగింది.

ఇంకేమీ మాట్లాడకుండా సావిత్రి తన పనులు తాను చేసుకోసాగింది. కొంతసేపటి తర్వాత ఇద్దరూ మౌనంగానే భోజనాలు ముగించారు. సావిత్రి మనసంతా ఆందోళనగా ఉంది. సాయంత్రం భర్త వచ్చి వాళ్ళకు ఫోన్‌ చేసి విషయం అడిగితే అది ఎంతవరకూ వెళ్తుందో? ఈలోపు శ్రీరామ్‌ నుంచి కానీ, అతని తల్లిదండ్రుల నుంచి గానీ ఫోన్‌ వస్తే ఏం చేయాలి, ఏం చెప్పాలి? పాలుపోవట్లేదు. పెళ్ళి అయిన కొత్తలో కొన్ని సర్దుబాటు సమస్యలుంటాయి. ఎంత చదువులు చదివినా తమకే అన్నీ తెలుసని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈకాలం పిల్లలు. ...ఇలా సాగుతున్నాయి సావిత్రి ఆలోచనలు.

ఏదో ఒకటి చేసి ఈ నిప్పుని చల్లార్చాలి. శ్రీరామ్‌కి తనే ఫోన్‌ చేద్దాం అన్నా, భర్తకు అది ఇష్టం ఉండదు. ఇంట్లో ఏ పనైనా అతనికి చెప్పే చేయాలి. సావిత్రి స్వతంత్రంగా ఏదైనా పనిచేస్తే అది సరి అయినది అయినా చాలా విమర్శించేవాడు. అతని ప్రవర్తనను పెళ్ళయిన కొత్తలోనే గమనించిన సావిత్రి ఏ పని అయినా అతని దృష్టిలోపెట్టే చేయడం అలవాటు చేసుకుంది. అలాగే సావిత్రి శుభ్రత విషయంలో రాజీపడదు. ఆ విషయంలో పెళ్ళి తర్వాత సావిత్రి కోసం చాలా మారాడు రాఘవ. వివాహబంధం ఏర్పడ్డాక ఇలాంటి సర్దుబాట్లు సహజం. కానీ ఇప్పటి పిల్లలు చదువూ కెరీర్‌కి ఇస్తున్న ప్రాముఖ్యత బంధాలకు ఇవ్వడం లేదు. ఇందులో తల్లిదండ్రులుగా తమ పెంపకలోపం కూడా ఉందేమో. నిద్రపోదామని మంచం మీద వాలిన సావిత్రికి బుర్రలో ఇలా ఎన్నో ఆలోచనలు. కన్ను మూతపడలేదు. పక్కనే ఉన్న సుధ నిద్రలోకి జారడం గమనించింది. పెళ్ళయిన కొత్తలో తను ఎదుర్కొన్న సమస్యలతో పోలిస్తే సుధ సమస్యలు ఏపాటివి? పెద్ద కుటుంబంలో అందరితో కలిసి ఉండేటప్పుడు స్ట్రగుల్‌ ఫర్‌ ఎగ్జిస్టెన్స్‌గానే ఉండేది. పూర్తిగా మానసిక పరిపక్వతలేని సమయంలోనే- సమస్యలను తను ఏనాడూ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళకుండా తన సమస్యకు తానే పరిష్కారం వెతుక్కునేది. అలా గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయిన సావిత్రికి ఆ ఆలోచనల నుంచి పరిష్కారం దొరికినట్లనిపించింది. గబగబా మంచం మీద నుంచి లేచి బాల్కనీలో ఉన్న స్టూల్‌ తీసుకుని స్టోర్‌రూమ్‌లోకి వెళ్ళింది. స్టూల్‌ ఎక్కి పై అరలో ఉన్న పుస్తకాలలో వేటికోసమో వెతకసాగింది. పది నిమిషాలసేపు వెతకగా... కనిపించిన కవరును బయటకు తీసింది.

ఆ కవర్‌ని ఓపెన్‌ చేసి లోపల ఉన్నవి బయటకు తీసి, అటూ ఇటూ తిప్పి చూసింది. తృప్తిగా నిట్టూర్చి కిందకు దిగి హాల్లోకి వచ్చి ‘సుధ ఎప్పుడు నిద్ర లేస్తుందా?’ అని ఎదురుచూడసాగింది.

* * *

నిద్రలేచి వచ్చిన సుధకి టీకప్పు అందించి తాను ఒక కప్పుతో పక్కన కూర్చుంది సావిత్రి. కాస్త విశ్రాంతి తీసుకునేసరికి సుధ తెరిపిన పడినట్లు ఉంది. ఉదయంలా కాక ముఖం ఇప్పుడు ప్రశాంతంగా కనిపించింది. ‘ఎలా మొదలుపెట్టాలా?’ అని ఆలోచిస్తున్న సావిత్రి ‘‘ఈ కవర్‌లో ఆ ఉత్తరాలు ఏమిటమ్మా?’’ అన్న సుధ మాటలు విని ‘హమ్మయ్య, నా పని ఈజీ అయింది’ అనుకుంటూ ‘‘సుధా, నీ పెళ్ళప్పుడు నీ వయసు ఎంత?’’ అంది.
‘‘ఏం, నీకు తెలియదా?’’ అంటూ, ‘‘24’’ అంది.

‘‘నా పెళ్ళికి నా వయసు ఎంతో తెలుసా... 18. డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న నాకు మంచి సంబంధం అని కుదిర్చి నెల రోజుల్లో పెళ్ళి చేసేశారు. మీ నానమ్మవాళ్ళు ‘మాకు చదువు అక్కర్లేదు, పిల్లను పంపించేయండి...’ అని ఒకటే గొడవ! నాకు చదువు మానడం ఇష్టంలేదు. ఆఖరికి... అటెండెన్స్‌ లాస్‌కి కాలేజీలో ఫీజు కట్టి పరీక్షలు రాయడానికి ఒప్పించి ఇంట్లోనే చదువుకుని పరీక్షలు రాసి డిగ్రీ పాస్‌ అయ్యాను. నువ్వు పీజీ చేశావు. ఇంకో ఏడాది ఉద్యోగం కూడా చేశాక పెళ్ళి చేశాం. నువ్వు ఇంట్లో ఉండేది రోజులో కొన్ని గంటలే. మిగతాది ఎలాగూ ఆఫీసులోనే.

కానీ, నేను... అత్తగారూ అత్తగారి అత్తగారూ ఇద్దరు ఆడపడుచులూ ఇద్దరు మరుదులూ మామగారూ... అలా అందరిమధ్యా ఉండేదాన్ని. అందరిదీ తలొక రకం మనస్తత్వం. కొందరు నన్ను ఏడిపించి ఆనందపడేవారు, ఇంకొందరు విపరీతమైన జాలి చూపించేవారు. ఇందాక అన్నావు చూడు... నీకేవమ్మా- నాన్నలాంటి మంచి మనిషి భర్తగా వచ్చాడు అని. అప్పట్లో మీ నాన్నతో కూడా చాలా సమస్యలు ఫేస్‌ చేశాను. చిన్నచిన్నవాటికి పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటే, ఈరోజు నా స్థానం మరో రకంగా ఉండేది. అంటే - అప్పుడవి బాధలు అనిపించేవి. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఏమీ లేదు అనిపిస్తుందనుకో’’ అంటూ తాను పైనుంచి తీసిన కవరులో నుంచి ఉత్తరాలు బయటకు తీసింది.
‘‘ఏంటమ్మా ఇవి?’’ అంటూ సావిత్రి చేతిలో నుంచి ఉత్తరాలు లాక్కుంది సుధ.

‘‘ఇవి నేను నువ్వు పుట్టకమునుపు రాసినవి. రాసినప్పుడు తప్పితే నేను మళ్ళీ ఇంతవరకూ వాటిని చూడలేదు.’’

‘‘అదేంటమ్మా, ఇలా ఉత్తరాలు రాసి, మరి పోస్టులో వేయకుండా నీ దగ్గరే ఎందుకు ఉంచుకున్నావ్‌?’’ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది సుధ.

‘‘అవి నా మనసులోని బాధ తీర్చుకోవడానికి రాసినవి. నాలుగు రోజుల తర్వాత మాత్రమే పోస్టులో వేయాలని నిర్ణయించుకుని రాసేదాన్ని. నాలుగు రోజుల తర్వాత ఆ బాధ ఉండేది కాదు. ఆ ఉత్తరం పోస్టు చేయాల్సిన అవసరం ఉండేదికాదు. దాన్ని అలాగే దాచేదాన్ని. అందులో ఏం రాశానో కూడా ఇప్పుడు పూర్తిగా గుర్తులేదు. కానీ ఏ సందర్భంలో రాశానో గుర్తుంది. నువ్వు వీటిని ఒకసారి చదువు. తర్వాత నీ అనుమానాలు ఏమైనా ఉంటే చెబుతాను’’ అంది సావిత్రి.

సుధకి తన అమ్మానాన్నల పెళ్ళి ఎప్పుడు అయిందో తెలుసు. అందుకని ఆ తేదీ ప్రకారం చూసుకుని ముందుగా రాసిన ఉత్తరాన్ని మొదట తీసింది. ‘‘అమ్మా, నీ రైటింగ్‌ ఎంత ముద్దుగా ఉందో’’ అంటూ క్యూరియాసిటీతో చదవడం ప్రారంభించింది.

‘అమ్మకు, నాన్నకు నమస్కారములు. మీరు అక్కడ క్షేమమని తలుస్తాను. మేమందరం ఇక్కడ బాగానే ఉన్నాం. అమ్మా నాన్నా... నాకు మళ్ళీ మన ఇంటికి వచ్చేయాలి అనిపిస్తోంది. నాకు బాగా ఏడుపొస్తోంది. మీరు గుర్తొస్తున్నారు. మా ఇంట్లోవాళ్ళు అప్పుడప్పుడూ ‘చిన్నపిల్లవి, నీకేం తెలీదు అంటుంటారు. మళ్ళీ అంతలోనే పెళ్ళయింది... పెద్దింటి కోడలు అయ్యావ్‌, ఆమాత్రం తెలుసుకోలేవా?’ అంటుంటారు. నిన్న రాత్రి ఇంట్లోవాళ్ళ మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. నాకు ఎవరితో ఏం మాట్లాడాలో అర్థంకాలేదు. ఇవాళ అందరూ చాలా మూడీగా ఉన్నారు. ఈయన కూడా కోపంగానే ఉన్నారు. నాకు ఇక్కడ బాలేదు నాన్నా.

నేను వచ్చేస్తాను. పైగా నా పెళ్ళిలో కొన్ని మర్యాదలు సరిగ్గా జరగలేదని అంటున్నారు. మిమ్మల్ని ఏమైనా అంటుంటే నాకు ఏడుపొస్తోంది. ప్లీజ్‌ నాన్నా... నేను వచ్చేస్తాను.’

సుధ ఆ ఉత్తరం చదువుతూ 18 ఏళ్ళ వయసులో ఉండే అమ్మ చిన్నప్పటి రూపాన్ని కళ్ళముందు ఊహించుకోసాగింది. ‘తనలాగే అమ్మకి కూడా వాళ్ళ నాన్న- అంటే, తాతగారి దగ్గరి చనువెక్కువ’ అనుకుంది. మరొక ఉత్తరం తీసి చదవసాగింది.

‘అమ్మా నాన్నా... మీతో నాకు చాలా మాట్లాడాలని ఉంది. నేను క్లాసులో ఫస్ట్‌ వస్తుంటే మీరు బాగా మెచ్చుకునేవారు. లెక్కల్లో వందకు వంద వస్తే బహుమతులు ఇచ్చేవారు. కానీ, ఇక్కడ అవేమీ పనిచేయడం లేదు. నిన్న అప్పటికప్పుడు వచ్చిన చుట్టాలు పదిమందికి వంట చేయాల్సి వచ్చింది. దానికి... వచ్చినవాళ్ళూ ఇంట్లోవాళ్ళూ ఎన్ని పేర్లు పెట్టారో తెలుసా! నాన్నా... నాకు అక్కడికి వచ్చేయాలని అనిపిస్తోంది. మనింట్లో నేను చిన్న కూర చేస్తేనే, మీరు మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ‘మా అమ్మాయి ఎంత బాగా వంట చేస్తుందో’ అని చెప్పి మురిసిపోయేవారు. కానీ, ఇక్కడ అంతా రివర్స్‌లో ఉంది నాన్నా. ఒకరు బాగుంది అంటే ఇంకొకరు దానికి వంకలు పెడుతూ ఉంటారు. వీళ్ళందరి మధ్యలో నామీద నాకే నమ్మకం పోతోంది నాన్నా. అందుకే నాన్నా... నేను వచ్చేస్తా... ప్లీజ్‌ నాన్నా. ఉంటాను.’

చదువుతున్న సుధకి గుండెభారం అయిపోయింది. ఇంట్లో కూర్చుని టీవీలో సినిమా చూస్తుంటేనే విషాద దృశ్యాలు వస్తే సుధ ఏడ్చేసేది. ఇంట్లోని వారందరూ ఏడిపించేవారు కూడా. తల్లి రాసిన ఉత్తరం చదువుతున్న సుధ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. కన్నీటితో నిండిన కళ్ళు తుడుచుకుని తల్లి కోసం వెతికింది. వంటగదిలో సామాను సర్దుకుంటూ కనిపించింది. మరొక ఉత్తరం తీసింది.

‘అమ్మా నాన్నలకు సావిత్రి నమస్కరించి వ్రాయునది. అక్కడ మీరు అందరూ క్షేమం అని తలుస్తాను. ఈయనకి ట్రాన్స్‌ఫర్‌ అవడంతో మేము ఇప్పుడు అందరినీ వదిలి దూరంగా వచ్చేశాం. నా బాధలు చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు. ఇప్పుడిప్పుడే అత్తగారింట్లో నన్ను అందరూ అర్థం చేసుకుంటున్నారు. నాక్కూడా వాళ్ళు అంటే అభిమానం ఏర్పడింది. నన్ను ఎవరైనా ఏదైనా అన్నా మా అత్తగారు నావైపు మాట్లాడుతూ వాళ్ళను కోప్పడేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. నిన్న నాకూ ఈయనకూ గొడవ జరిగింది- చాలా చిన్న విషయానికి. ఈయన మాటలు అంటుంటే నేను తిరిగి సమాధానం చెప్పాను. దాంతో ఆయనకు కోపం వచ్చేసింది. నన్ను బాగా తిట్టారు, తట్టుకోలేకపోయాను. మనింట్లో పెద్దకూతుర్ని అని చాలా గారంగా చూసేవారు. ఎప్పుడూ ఒక్కమాట కూడా అనేవారు కాదు. ఎందుకు పెంచారు నాన్నా... నన్ను అలాగ? చిన్నప్పటి నుంచీ నన్ను ఎందుకో అందుకు తిడుతూ పెంచితే ఇప్పుడు ఈ తిట్లు పడటం కష్టంగా ఉండేదికాదేమో నాన్నా... నేను వచ్చేస్తాను ప్లీజ్‌.’

ఇక మూడు ఉత్తరాలు మిగిలాయి. అవి కూడా తన తండ్రి సంకుచిత మనస్తత్వంతో ఆమెను బాధపెట్టిన సంఘటనలే. పెళ్ళయిన కొత్తలో అమ్మ ఇంత ఇబ్బందిపడింది అంటే సుధకి ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు తన తల్లి అంటే బంధువులందరికీ ఎంతో గౌరవం. బాబాయిలూ అత్తలూ ’వదినా’ అంటూ, వారి పిల్లలు ‘అత్తా పెద్దమ్మా’ అంటూ అమ్మను చాలా ఆప్యాయంగా చూస్తారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా అమ్మ సలహానే తీసుకుంటారు. అలాంటి అమ్మ పెళ్ళయిన కొత్తలో అడ్జెస్ట్‌ అవ్వడానికి ఇంత సంఘర్షణ అనుభవించిందా? తన బాధనంతా ఉత్తరాల్లో రాసుకుని పోస్టు చేయకుండా దాచి ఉంచిందా! రెండు మూడు రోజుల్లో తీరిపోయిన బాధలున్న ఆ ఉత్తరాలను పోస్టులో వేసి ఉంటే ఏమి జరిగేదో? అప్పట్లో అమ్మ స్థానానికీ ఇప్పుడు తన స్థానానికీ బేరీజు వేసుకుంది. ఏదో నిర్ణయానికి వచ్చినదానిలా లేచి వంటగదిలోకి నడిచింది. ‘‘అమ్మా... అంటూ రెండు చేతులూ వెనక నుంచి తల్లి భుజాల మీదుగా వేసి నువ్వు చాలా గ్రేట్‌ అమ్మా. నీ బాధ అంతటినీ ఉత్తరాలు రాసి తగ్గించుకున్నావు. వాటిని పోస్టు చేయకుండా ఉంచేసి అమ్మమ్మావాళ్ళు బాధపడకుండా చూశావు. ఇప్పుడు అందరికీ తలలో నాలుకయ్యావు. నిన్ను చూస్తే నాకు ఏమనిపిస్తోందో తెలుసా... చిన్నప్పుడు స్కూలుకి వెళ్ళనని మారాం చేసిన అమ్మాయి పెద్దయ్యాక యూనివర్సిటీ గోల్డ్‌ మెడల్‌ సాధించినట్టు ఉందమ్మా నీ ప్రయాణం. నేను పేరుకు పీజీ చదివినా చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నా. నువ్వు చెప్పినట్టుగా శ్రీరామ్‌ వైపు నుంచి ఆలోచించే ప్రయత్నం చేయలేదు. నేను పొరపాటు చేశానమ్మా. శ్రీరామ్‌కు వెంటనే ఫోన్‌ చేస్తాను’’ అని సుధ అంటుండగానే సుధ ఫోన్‌ రింగ్‌ అవసాగింది.

సుధ ఫోన్‌ తీసి ‘‘అమ్మా, శ్రీరామ్‌ చేస్తున్నాడు’’ అంటూ స్పీకర్‌ ఆన్‌ చేసి ‘‘హలో శ్రీరామ్‌, ఐయాం వెరీవెరీ సారీ’’ అంది.

అదే సమయంలో అటునుంచి శ్రీరామ్‌ కూడా ‘‘సుధా, సారీరా’’ అంటున్నాడు.

సావిత్రి సుధను నవ్వుతూ చూసి బయటకు నడిచింది తేలికైన మనసుతో.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.