close

బోళా శంకర... భక్తవ శంకర...

‘శివం కరోతీత తవః’... తనను సేవించినవారికి సమస్త శుభాలనూ ప్రసాదించేవాడు శివుడు. ‘శంకరోతీత శంకరః’... తనను ఆరాధించినవారికి సకల సౌఖ్యాలనూ సమకూర్చేవాడు శంకరుడు. అవేమీ చేయకున్నా కార్తికమాసంలో వేకువనే స్నానం చేసి ఆయన్ని దర్శించి నమస్కరిస్తే చాలు... కోరిన కోరికలు తీరుస్తాడా బోళాశంకరుడు. అందుకే గుంటూరుజిల్లా నకరికల్లు మండలంలోని అన్నపూర్ణాదేవీ సమేతంగా కొలువైన కాశీవిశ్వశ్వరస్వామిని తండోపతండాలుగా సందర్శిస్తుంటారు భక్తులు.

పంచభూతాత్మక స్వరూపుడూ నిరాకారుడూ అయిన ఆ మహాశివుడు కొలువైన ద్వాదశ జ్యోతిర్లింగాలూ పంచభూత క్షేత్రాలూ దేశవ్యాప్తంగా ఉన్నాయి. వాటిని అందరూ సందర్శించలేరనే భక్తులకోసం అనేక చోట్ల వెలిశాడు ఆ పరమశివుడు. నర్సింగపాడులోని విశ్వేశ్వరస్వామి ఆలయం కూడా ఆ కోవకే చెందుతుంది. ప్రకృతి అందాలతోనూ చారిత్రక గాథలతోనూ విలసిల్లుతోన్న ఈ ఆలయంలోని ఆది శంకరుణ్ణి మనసారా కొలిస్తే శుభం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆయన కరుణాకటాక్షాల వల్లే గ్రామంలో ఎక్కడ తవ్వినా మోటార్లతో పనిలేకుండానే భూమిలోంచి జలధారలు నిరంతరం వెల్లువలా పైకి ఉబికి వస్తూ గ్రామం సస్యశ్యామలమై, సిరిసంపదలతో తులతూగుతుందనేది గ్రామీణుల విశ్వాసం. బదులుగా ఆ శివయ్యకు ఏటా కార్తికమాసంలో లక్ష బిల్వార్చన మహోత్సవాలను గత 47 సంవత్సరాలనుంచీ నిరాటంకంగా జరిపిస్తున్నారు.

పల్నాటిసీమలో..!
భూదేవి నిత్యం పచ్చకోక సింగారించుకున్నట్లుగా ఉండే నర్సింగపాడుకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. పల్నాటి యుద్ధంలో కీలకపాత్ర వహించిన నలగామరాజు సోదరుడు నరసింగరాజు పేరుతోనే ఈ గ్రామానికి నర్సింగపాడు అనే పేరు వచ్చింది. 500 ఏళ్ల క్రితం ఈ గ్రామానికి సాంబశివపురంగా పేరుండేది. పల్నాటిసీమను ఏలినవాళ్లంతా ఇక్కడి సాంబయ్యని కొలిచి తరించినవారే. శివభక్తురాలైన నాయకురాలు నాగమ్మ, మాచర్ల మలదేవరాజు, నలగామరాజు, శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరసు, కవిసార్వభౌముడు శ్రీనాథుడు... వంటి వారంతా ఆలయాన్ని సందర్శించారట. బ్రహ్మనాయుడు కుటుంబసమేతంగా నర్సింగపాడు కాశీవిశ్వేశ్వరుని దర్శించుకొని శాంతి పూజలు చేయించినట్లుగా ఆధారాలున్నాయి. 1950లో ఇక్కడి స్వామిని దర్శించినాకనే విశ్వనాథ సత్యనారాయణ కాశీ విశ్వేశ్వరునిపై ‘మధ్యాక్కర్లు’ శతకాన్ని రచించారట.

దక్షిణాముఖిగా అన్నపూర్ణాదేవి..!
కోవెలలోని మూలవిరాట్‌ కాశీవిశ్వేశ్వరస్వామి తేనెరంగు శివలింగ రూపంలో కొలువుదీరడం ఓ విశేషమైతే, అన్ని ఆలయాలకూ విభిన్నంగా ఇక్కడ అన్నపూర్ణాదేవి అమ్మవారు దక్షిణాముఖిగా కొలువై ఉంటుంది. ప్రతిరోజూ అర్ధరాత్రి వేళ అంటే- లింగోద్భవ సమయంలో రుషీశ్వరులు కాశీవిశ్వేశ్వరుడికీ అన్నపూర్ణాదేవికీ అభిషేకాలు చేస్తుంటారనేది స్థానిక కథనం. దాదాపు 60 ఏళ్ల క్రితం ఆలయ అర్చకులైన కొమ్మవరపు ఊళ్లయ్య దీన్ని చూసినట్లు చెబుతారు. ఆలయంలో పలు దేవతామూర్తులకు ఉప ఆలయాలు ఉన్నాయి. అంతరాలయంలో అన్నపూర్ణాదేవికి ఎదురుగా భద్రకాళీ వీరభద్రుడూ, గర్భాలయ ద్వారం పక్కనే వినాయకుడూ, మూలవిరాట్టుకు ముందు భాగంలో నందీశ్వరుడూ కొలువుదీరారు. ఏటా కార్తికమాసంలో లక్ష బిల్వార్చన, లక్ష దీపార్చన, సహస్ర కలశ క్షీరాభిషేక వేడుకలను నిర్వహిస్తారు. ఈ ఏడాది నవంబరు 24 ఆదివారం, అంటే ఈ రోజు గోపూజ, గణపతిపూజ, పుణ్యాహవాచనం, మహాన్యాస పారాయణం, చండీపారాయణం, చండీ-రుద్ర హోమాలు, అమ్మవారికి కుంకుమపూజల్ని నిర్వహిస్తారు. మధ్యాహ్నం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం చేస్తారు. రాత్రి 6 గంటలకు కళ్యాణం జరిపిస్తారు. 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు క్షీరం, దధి, ఆజ్యం, మధువు, ఇక్షురసం, నారికేళం, భస్మం, గంధం, పన్నీరు, ద్రాక్షరసం, కదళీఫలరసాలతో చేసే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చూసితీరాల్సిందే. అదేరోజు రాత్రి గ్రామోత్సవాన్నీ అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. 26వ తేది మంగళవారం అన్నాభిషేకం, లక్షబిల్వార్చన, లక్ష దీపార్చన, శ్రీచక్రార్చన నిర్వహిస్తారు. రాత్రికి విశ్వరూప దర్శనంలో భాగంగా స్వామిని పండ్లూ పుష్పాలతో అలంకరించాక, కోనేరులో తెప్పోత్సవం జరుపుతారు. చివరి రోజు వేడుకలకు భక్తులు అధికసంఖ్యలో వస్తారు. కార్తికమాసంలోనే కాదు, ఏటా ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి దశమివరకూ శరన్నవరాత్రులు నిర్వహిస్తారు. ఆరుద్ర నక్షత్రం రోజునా పౌర్ణమినాడూ తొలి ఏకాదశి రోజునా కూడా ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మహాశివరాత్రి రోజున ఆలయంలో విశేష పూజలతోపాటు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నరసరావుపేటకి 23 కిలోమీటర్ల దూరంలోనూ, నకరికల్లుకి మూడు కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న ఈ క్షేత్రాన్ని రైలూ రోడ్డు మార్గాల్లో చేరుకోవచ్చు.

- పసుపులేటి కేశవులు
న్యూస్‌టుడే, నకరికల్లు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.