close

గుండీ... అందంగా కుట్టేయండి..!

అస్మిత పుట్టినరోజుకి ప్లెయిన్‌ ఫ్రాక్‌మీద అందంగా ఎంబ్రాయిడరీ చేసి బహుమతిగా ఇవ్వాలనుకుంది శ్వేత. కానీ టైమ్‌ కుదరడం లేదు. అప్పుడు వచ్చిందో ఆలోచన. బటన్స్‌... అవును, బొత్తాములే. డబ్బాలోంచి రంగురంగుల గుండీల్ని తీసి కాలర్‌మీదా నెక్‌ చుట్టూ చకచకా కుట్టేసింది.  నిమిషంలో సాదా గౌను కాస్తా బటన్‌ ఎంబ్రాయిడరీతో అందంగా తయారైంది. మార్కెట్లో కనిపించని తనదైన డిజైనర్‌ పీస్‌తో బర్త్‌డే పార్టీకి బయల్దేరింది శ్వేత. అందుకే అంటున్నారు నేటి డిజైనర్లు ‘బొత్తాముకి చాలా సీనుంది’ అని.

బటన్‌ ఉరఫ్‌ గుండీ పేరు వినగానే చాలామందికి పదిహేనేళ్ల క్రితం నాటి బాలీవుడ్‌, టాలీవుడ్‌ సినిమాలన్నింటిలోనూ తప్పక కనిపించే ఓ దృశ్యం కళ్లముందు కదలాడుతుంటుంది. భార్యాభర్తల మధ్య రొమాంటిక్‌ సీన్‌ పండించాలన్నా లేదా గిల్లికజ్జాలతో ఎడముఖం, పెడముఖంగా ఉన్నారన్న విషయాన్ని రక్తి కట్టించాలన్నా ఆఫీస్‌కి రెడీ అయిన హీరోగారి షర్టు బటన్‌ సడెన్‌గా ఊడిపోవడం, వేసుకున్న చొక్కా విప్పకుండానే హీరోయిన్‌ సూదీతో ఆ బటన్‌ కుట్టడం... ఆ సందర్భంగా వాళ్లిద్దరి మధ్యా చూడచక్కని సీనుని చిత్రీకరించని దర్శకులు ఉండరేమో. ఆ సంగతెలా ఉన్నా ఒక్క బటన్‌ ఊడినా మగ మహారాజులు ఆఫీసుకి వెళ్లలేరన్నది నిజం. ఎందుకంటే, బటన్‌ అనేది అబ్బాయిల తప్పనిసరి యాక్సెసరీ. అవునుమరి, చొక్కా తొడగాలి, ప్యాంటు వేసుకోవాలి. స్వెట్టర్‌, కోటు, షేర్వాణీ, జాకెట్‌... ఇలా అబ్బాయిలు ఏ డ్రెస్‌ వేసుకోవాలన్నా బటన్స్‌ పెట్టాలి. ఒకవేళ అవే లేకపోతే చొక్కాప్యాంటూ లేనట్లే. బటనే లేకపోతే జీన్స్‌ ప్యాంటే పుట్టేదికాదు అనడం కూడా ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అంతెందుకు... ప్రపంచవ్యాప్తంగా పురుషుల వేషధారణ ఒకేరీతిలో ఉండటానికి కారణం ఈ గుండీలేనట. అంతకు ముందు ఆయా ప్రాంతాలను బట్టి లాల్చీ, పంచె, పైజామా, నిక్కరూ, స్కర్టూ... ఇలా రకరకాల వేషధారణలు ఉండేవి.

నిజానికి బటన్స్‌ను సింధునాగరికత కాలంలోనే వాడినట్లు తెలుస్తోంది. సముద్రపు ఆల్చిప్పలతో చేసిన వంపు తిరిగిన బటన్‌ను అందంగా కనిపించేందుకు దుస్తులమీద కుట్టుకునేవారట. ఆ తరవాత 13వ శతాబ్దంలో బటన్‌హోల్‌ అనేదాన్ని కనిపెట్టారట. ఇది మొట్టమొదటగా జర్మనీలోని దుస్తులమీద కనిపించింది. ఎప్పుడయితే బటన్‌హోల్‌ని కనిపెట్టి, అందులోని సౌకర్యాన్ని గుర్తించారో అప్పటినుంచే అంతటా వాటిని పెట్టుకోవడం ద్వారా ధరించగలిగే చొక్కా ప్యాంట్లూ వాడుకలోకి వచ్చాయి. అక్కడి నుంచి నావికుల ద్వారా అన్ని దేశాలకీ బటన్స్‌ పరిచయమయ్యాయి. పైగా అప్పట్లో బటన్స్‌ని ఆడంబరం, దర్పం ప్రదర్శించేందుకు సంకేతాలుగా భావించేవారట. అందుకే సంపన్నులు మాత్రమే తమ హోదా చూపించుకోవడానికి వాటిని ఎక్కువగా వాడేవారు. 16వ శతాబ్దంలో ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రాన్సిస్‌-1 అనే చక్రవర్తి కోటుమీద ఏకంగా వెయ్యికి పైగా బటన్స్‌ కుట్టించుకున్నాడట. అంటే కోటుకి అవి ఎన్ని ఉంటే అంత గొప్పన్నమాట. క్రమంగా చెక్క, లోహం, జంతువుల కొమ్ములు, మదర్‌ ఆఫ్‌ పెరల్‌, గింజలు, ప్లాస్టిక్‌, స్వరోవ్‌స్కీ, రాళ్లు... ఇలా రకరకాల వాటితో విభిన్న ఆకారాల్లో భిన్న సైజుల్లో గుండీల్ని తయారుచేయడం ప్రారంభించారు. దాంతో బటన్‌ కేవలం మగవాళ్ల దుస్తులకే పరిమితమవ్వలేదు. పైగా గుండీల్నే కాన్వాస్‌గా చేసుకుని సూక్ష్మ చిత్ర కళాకారులు వాటిమీద బొమ్మలూ చిత్రిస్తే, కొన్ని కంపెనీలు ఏకంగా పెయింటింగ్‌ బటన్స్‌నే తయారుచేయడంతో అది అమ్మాయిల దుస్తులమీదా అందమై మెరిసింది.

గుండీ ‘కళ’
ఒకప్పుడు దుస్తులకి కుట్టే యాక్సెసరీగా మాత్రమే పరిచయమైన బటన్‌, ఇప్పుడు దుస్తులమీద నచ్చిన డిజైన్లలో బటన్స్‌ను అతికించడం, కుట్టడం ద్వారా అందమైన ఎంబ్రాయిడరీగానూ మారింది. అచ్చంగా బటన్స్‌తోనే ఫ్రాక్స్‌ కుట్టేసి అమ్మాయిలకి తొడిగేవాళ్లూ ఉన్నారు. కొందరయితే, తమకు నచ్చిన డిజైన్లలో జాకెట్లకీ టాప్‌లకీ కూడా బటన్స్‌ కుట్టేస్తున్నారు. దాంతో చెప్పులూ బ్యాగులూ హెయిర్‌బ్యాండ్లూ సెల్‌ఫోన్లూ... ఇలా అన్ని రకాల యాక్సెసరీలతోనూ గుండీలు జతకట్టేస్తున్నాయి. యాక్సెసరీలే ఇంత అందంగా ఉంటే రంగుల బటన్స్‌తో చేసిన జ్యువెలరీ మాత్రం ఎందుకు అందంగా ఉండదనుకున్నారు బటన్‌ ప్రేమికులు... అందుకే తమకు నచ్చినట్లుగా బటన్స్‌తో నెక్లెస్‌లూ చెవిలోలాకులూ బ్రేస్‌లెట్లనీ చేసుకుని పెట్టుకునేవాళ్లూ కోకొల్లలు.

ఇంటీరియర్‌ అందాల్లోనూ గుండీ నాట్యం చేస్తోంది. ఫొటోఫ్రేములూ ఫ్లవర్‌వేజ్‌లూ కుండీలూ బాటిళ్లూ గోడ గడియారాలూ కుషన్లూ... ఇలా అదీ ఇదీ అన్న తేడా లేకుండా అన్నింటిమీదా బటన్స్‌ను అలంకరిస్తున్నారు. పూసల కర్టెన్ల మాదిరిగానే మెరిసే ప్లాస్టిక్‌ బటన్స్‌తో గుమ్మాలకీ కిటికీలకూ బటన్‌ కర్టెన్లని వేలాడదీస్తున్నారు. అక్కడితో ఆగితేనా... అదో అద్భుతమైన కళారూపాన్నీ సంతరించుకుంది. అచ్చంగా బటన్స్‌ను అతికిస్తూ పెన్నూ క్యాండిల్‌ హోల్డర్లూ ట్రేలూ పూలబొకేలూ తయారుచేయడం సరికొత్త ట్రెండ్‌గా మారింది. కొంతమంది తమ పేర్లలోని మొదటి అక్షరాన్ని బటన్స్‌తో చేసి ఫ్రేము కట్టించుకుంటే, మరికొందరు అప్పుడే పుట్టిన పిల్లల పాదాలను కాగితం లేదా బట్టమీద పెట్టి కొలత తీసుకుని ఆ మేరా గుండీలను అతికించి, వాళ్ల పుట్టిన తేదీని రాసి అందమైన జ్ఞాపకంగా ఫ్రేములో బంధిస్తున్నారు. కాగితమ్మీద బటన్‌ను అతికిస్తూ బొమ్మలేయడం తేలిక కాబట్టి పిల్లలు సైతం వీటితో రకరకాల కళారూపాలను తయారుచేస్తూ తమలోని సృజనను ప్రదర్శిస్తున్నారు. ఆలోచన అంటూ ఉండాలే గానీ బటన్స్‌తో పజిల్సూ క్యాలెండరూ వంటివి కూడా తయారుచేయవచ్చు. కాబట్టి బొత్తాం చాలా చిన్న వస్తువే కదాని తీసి పారేయకండి... దాంతో ఇంటీరియర్‌ కమ్‌ ఫ్యాషన్‌ సిత్రాలెన్నో సృష్టించేయొచ్చు..!

24 నవంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.