close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నవ్వండి... మనసారా..!

‘నాన్న కోపంగా ఉన్నారమ్మా, నువ్వే మెల్లగా చెప్పవా మా స్కూల్‌ ఎక్స్‌కర్షన్‌ గురించి...’ తల్లితో కొడుకు రాయబారం. ‘సెలవడగాలి... బాస్‌ మంచి మూడ్‌లో ఉన్నాడంటావా’ సహోద్యోగి ఆరా. ‘కౌంటర్లో ముఖం అలా చిట్లించుకుని కూర్చుంటే కస్టమర్లు వచ్చినట్టే ఇక’ షాపు యజమాని కస్సుబుస్సు. అందరికీ కావాల్సింది ఒకటే... ఎదుటివారి ముఖంలో ఓ చిరునవ్వు! అవటానికి చిన్న నవ్వే కానీ, చాలా పవర్‌ఫుల్‌! పనులన్నీ దాంతోనే ముడిపడివుంటాయి మరి!

పరిచయమున్నవారు పలకరించినప్పుడు...
మనసైనవారిని తలచుకున్నప్పుడు...
ఎవరైనా ప్రశంసించినప్పుడు...
ఏ బాల్యజ్ఞాపకాల్లోనో మనని మనం మరిచిపోయినప్పుడు...
మధురమైన ప్రేమగీతం విన్నప్పుడు...
బోసినోటి పాపాయిని చూసినప్పుడు...
పెరట్లో ముచ్చటగా పెంచుకుంటున్న గులాబీ మొగ్గ వేసినప్పుడు...
మన ప్రమేయం లేకుండానే ముఖాన చిరునవ్వు మెరుస్తుంది!
అది సహజం... అనే అనుకుంటున్నాం ఇన్నాళ్లూ!
కానీ, ఒక్కసారి గుర్తుచేసుకోండి... పొద్దుట్నుంచీ ఎన్నిసార్లు అలా చిరునవ్వు నవ్వారో!
ఒకసారి... నాలుగు సార్లు...పదిసార్లు..?
మీ చుట్టూ చూడండి- ఇల్లు, ఆఫీసు, బస్సు, దుకాణం... ఎంత మంది ముఖాన నవ్వు కన్పిస్తోందీ? చాలా తక్కువ మందికి కదూ!

ఏమైపోయింది చిరునవ్వు..!
టిఫిన్‌ తింటూ పాపాయి ఏ టొమాటో సాస్‌నో పెదాలకు లిప్‌స్టిక్‌లా పూసుకుని ‘అమ్మా చూడు...’ అంటే... ఏం చేస్తారు. ‘భలే ఉన్నావే’ అంటూ నవ్వేసి సెల్‌ఫోన్‌తో ఓ ఫొటో తీసుకుని ఆ తర్వాత శుభ్రంగా నోరు తుడిచి పంపిస్తారా లేక ‘ఆటలు మాని త్వరగా తిని తెమలండి...’ అంటూ ఒక్క అరుపు అరుస్తారా?

బజారుకు వెళ్తే కాలేజీలో చదువుకున్నప్పటి స్నేహితుడు కన్పించాడు. ఏం చేస్తున్నాడో ఎక్కడ ఉంటున్నాడో పిల్లలేం చదువుతున్నారో అడిగి, చిన్ననాటి చిలిపిమాట ఒక్కటైనా గుర్తుచేసుకుని నవ్వుకున్నారా లేక హాయ్‌ చెప్పి ‘ఆఫీసుకు టైమైపోతోంది, మళ్లీ కలుద్దాం...’ అని ఫోన్‌ నంబర్‌ తీసుకుని మీ దారిన మీరు వచ్చేశారా?

మొదటిదే చేస్తున్నారంటే- పర్లేదు, నవ్వుల్ని పంచగల శక్తి మీలో ఇంకా ఉందన్నమాట. కానీ చాలామందిది రెండో రకమేనంటున్నారు సామాజిక పరిశోధకులు.

ఉరుకులు పరుగుల జీవితాల్లోనుంచి చిరునవ్వు అడ్రసు లేకుండా పోతోందనీ వాట్సాప్‌ చాటింగులో, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ లైకుల్లో ఇమోజీలుగా కన్పించినంతగా నిజజీవితాల్లో నవ్వులు కన్పించడం లేదనీ అంటున్నారు వారు. వారలా అనడానికి కారణం లేకపోలేదు.

నవ్వటం నేర్పించారు!
గత ఏడాది రష్యాలో వరల్డ్‌కప్‌ ఫుట్బాల్‌ టోర్నమెంట్‌ జరిగింది. ఆ సందర్భంగా సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించింది ప్రభుత్వం. ఫిఫా నిర్వాహక సిబ్బందితో పాటు రష్యన్‌ రైల్వే, మాస్కో మెట్రో తదితర సంస్థల ఉద్యోగులందరికీ చిరునవ్వుతో అతిథులను పలకరించడంపై ప్రత్యేక తరగతులు నిర్వహించింది. అక్కడ వారు ప్రధానంగా నేర్పించింది నోరారా నవ్వుతూ స్వాగతం చెప్పడం ఎలా అన్నది.

వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కి ఆతిథ్యం వహిస్తోంది జపాన్‌. అక్కడివారికి ఇంగ్లిష్‌ భాషతో సమస్య. ఆతిథ్యం ఇచ్చే సిబ్బందికి ఇంగ్లిష్‌ నేర్పిస్తే చాలు కానీ వాళ్లు దానికన్నా ముఖ్యంగా అందంగా చిరునవ్వు నవ్వడం ఎలా అనే విషయానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అవును మరి, భాషాభేదం లేకుండా ఏ దేశస్థులైనా అర్థం చేసుకునేది హాయిగొలిపే చిరునవ్వే కదా!

అదంతా ఇతర దేశాల్లో సంగతి, మనదేశంలో ఇంకా ఆ పరిస్థితి రాలేదు అనుకునేవారిని ‘అది నిజమైతే నాలాంటి వారి అవసరమేముందీ...’ అని ప్రశ్నిస్తారు లైఫ్‌ కోచ్‌ సలోనీ సింగ్‌. ఆమె గైనకాలజిస్టుగా విదేశాల్లో పనిచేస్తూ స్వదేశం వచ్చినపుడల్లా ఇక్కడి పరిస్థితుల్ని చూసి ఏకంగా తన వృత్తినే మార్చుకున్నారు. వైద్యం చేసేవాళ్లు చాలామంది ఉన్నారు కానీ జీవితాన్ని నిజంగా జీవించడం ఎలాగో చెప్పేవాళ్లు ఎవరూ లేరు, ఇప్పుడు సమాజానికి వారి అవసరమే ఎక్కువగా ఉంది అనుకున్న ఆమె లైఫ్‌ కోచ్‌గా శిక్షణ పొంది మరీ వచ్చారు. చెక్కమొహాలతో బిర్రబిగుసుకుపోకుండా చిరునవ్వుతో సమస్యల్ని ఎదుర్కొనడం ఎలాగో పలువురికి నేర్పిస్తున్నారు. ఆమె ఒక్కతే కాదు, ఆ వృత్తిలో ఇప్పుడు ఎందరో రాణిస్తున్నారంటే మనకీ మనసారా నవ్వడం, ఆనందంగా జీవించడం చేతకావట్లేదనే కదా అర్థం.

ఎన్నిసార్లు నవ్వుతున్నాం...
కళ్లల్లో స్నేహభావమూ ముఖంలో ఆనందమూ కన్పించని చోటికి అక్కడ బంగారపు జల్లు కురిసినా సరే వెళ్లకూడదంటాడు సంత్‌ తులసీదాస్‌. మనుషుల మధ్య అనుబంధానికి సంతోషం ముఖ్యం కానీ సిరిసంపదలు కావని ఆయన ఉద్దేశం. సమాజం ఒకప్పుడు అనుబంధానికి అంత విలువ ఇచ్చేది. మూడు నాలుగు తరాల మనుషులతో గంపెడు మంది పిల్లలతో సరదాలూ సరాగాలతో సాగిన సంసారాలు ఇప్పుడు లేవు. కుటుంబం చిక్కిపోయి ముగ్గురూ నలుగురికి పరిమితమైపోయింది. పిల్లలకు చదువుల పరుగు, పెద్దలకు ఉద్యోగాల పరుగు. సమయంతో పోటీ, పక్కవారితో పోటీ... అందరికీ అడుగడుగునా పోటీనే. ఈ ఒత్తిళ్లలో కూరుకుపోయిన మనిషి సంఘజీవితానికీ దూరమవుతున్నాడు. పెద్దలూ పిల్లలూ అన్న తేడా లేకుండా ఈ సమూహంలో ఒంటరితనం అందరినీ చుట్టుముట్టేసింది. జీవనశైలిలో యంత్రాలు భాగమైపోయినట్లే యాంత్రికత వ్యక్తిత్వంలో భాగమైపోతోంది. రోజులో కనీసం పదిసార్లయినా మనసారా ఫక్కున నవ్వామా... అంటే ఆలోచించాల్సిన విషయమే. 1950లలో రోజుకు సుమారు 18నిమిషాల పాటు నవ్వేవారట. ఇప్పుడది నాలుగైదు నిమిషాలకు పడిపోయింది.

నవ్వు... నేటి అవసరం!
‘చిరునవ్వు చాలా చిన్న పనే అయినా మనం ఇప్పుడు చాలా సందర్భాల్లో దాన్ని మర్చిపోతున్నాం. కొన్నేళ్లక్రితం వరకూ మనం పరిచయస్తుల్ని చిరునవ్వుతో పలకరించేవాళ్లం. మాట్లాడే వీలు లేకపోతే కనీసం చిరునవ్వు అయినా నవ్వి వెళ్లిపోయేవాళ్లం. ఇప్పుడు మనం ఎంత వేగంగా కదులుతున్నామంటే ఎదురుగా తెలిసినవారు ఎవరైనా కనబడినా రకరకాల ఆలోచనల్లో నిమగ్నమైన మన మెదడు వాళ్లు ఫలానా అని గుర్తించి మనకు చెప్పేలోపలే వాళ్లకు కన్పించనంత దూరం వెళ్లిపోతున్నాం. ఒకవేళ వెంటనే గుర్తుపట్టినా ‘హాయ్‌’ అనో ‘బాగున్నారా’ అనో పెదవి చివరనుంచీ ఓ పలకరింపు తప్ప నోరు తెరిచి ఆనందంగా నవ్వే సీను అరుదైపోయింది’ అంటారు సలోనీ. ఒక్కసారి మన దినచర్యనీ దాంతోపాటు రోజులో ఎన్నిసార్లు నవ్వామన్నదీ గుర్తుచేసుకుంటే ఆమె అభిప్రాయం నిజమేననిపిస్తుంది. కుటుంబసభ్యులతో అయినా సహోద్యోగులతో అయినా యథాలాపంగా మాట్లాడటమూ అవసరమైతే తెచ్చిపెట్టుకున్న నవ్వుతో పని కానివ్వడం తప్ప నవ్వుతూ నాలుగు మాటలు మాట్లాడుకోవటమూ జోకులు వేసుకోవటమూ లాంటి సందర్భాలు అరుదైపోతున్నాయి. ఒకప్పుడు నలుగురు స్నేహితులు కలిస్తే కబుర్లు చెప్పుకుని నవ్వీ నవ్వీ దవడలు నొప్పి పుట్టేవి. ఇప్పుడు చిరునవ్వులకే అడ్రసు లేదు ఇక ఇకయికలూ పకపకలూ ఎక్కడ! ఎంత మంది కలిసినా నాలుగు పొడి మాటలు... ఆ తర్వాత ఎవరి ఫోనులో వాళ్లు బిజీ. ఫోను కాకపోతే టీవీ. ఆఖరికి వీధి చివర టీకొట్టు దగ్గర చేరిన కుర్రాళ్లు కూడా క్రికెట్‌ కబుర్లూ సినిమా కబుర్లూ మానేసి సెల్‌ఫోనుకే కళ్లను కట్టేస్తున్నారు. అందుకే, లైఫ్‌కోచ్‌లు వచ్చి నవ్వడం నేర్పించాల్సి వస్తోంది.

నవ్వులే... నవ్విస్తాయి!
నవ్వేవాళ్లను చూస్తే ఆటోమేటిగ్గా ఎదుటి వ్యక్తి ముఖమూ నవ్వును పులుముకుంటుంది. ఇది ఏదో మాటవరసకి చెబుతున్నది కాదు, పలువురు పరిశోధకులు అధ్యయనం చేసి మరీ నిరూపించిన సత్యం. ముఖ కండరాల కదలికల్ని మన అదుపులో ఉంచుకోవడం ద్వారా భావోద్వేగాల్నీ మార్చుకోవచ్చన్న డార్విన్‌ తదితర శాస్త్రవేత్తల అధ్యయనాన్ని బాగా అర్థం చేసుకున్న డింగ్‌ లీ అనే యువ శాస్త్రవేత్త తనకు పనిలో ఒత్తిడి అన్పించినపుడల్లా గదిలోకి వెళ్లి అద్దం ముందు నిలబడి సీరియస్‌గా ఉన్న ముఖంలోకి బలవంతాన నవ్వుని తెచ్చుకునేది. చిరునవ్వులు చిందిస్తూ రకరకాల కోణాల్లో తన ముఖాన్ని చూసుకుంటూ నవ్వుకునేది. మొదట్లో ఎవరన్నా చూసి వెక్కిరిస్తారేమోనని సంకోచించినా అదొక ఆటలాగా రోజూ చేసేది. కొన్నాళ్లకు తన పనితీరు మెరుగైనట్లు గ్రహించింది లీ. ఒత్తిడి తగ్గి రిలాక్స్‌ అవడానికి ఈ ‘నవ్వులాట’ బాగా పనికొస్తోందని గుర్తించి దాని ఆధారంగా ‘సైన్స్‌ ఆఫ్‌ స్మైలింగ్‌’ పేరుతో ఓ సిద్ధాంతాన్నే రూపొందించింది. ఆ సిద్ధాంతంతో హాంకాంగ్‌కి చెందిన ‘ఫేమ్‌ల్యాబ్‌’ అవార్డునూ గెలుచుకుంది.

స్వీడన్‌కి చెందిన శాస్త్రవేత్తలు మరో ప్రయోగం చేశారు. నవ్వుతూ ఉన్న ఫొటోలు కొన్నీ, ముఖం చిట్లించుకున్న ఫొటోలు కొన్నీ తీసి కొందరు వ్యక్తులకు వాటిని పంచి ఆ ఫొటో చూడగానే వాళ్ల హావభావాలను రికార్డు చేశారు. కొన్ని వేలమందితో చేసిన ఈ ప్రయోగం శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచింది. నవ్వుతున్న ఫొటోల్ని చూసినవాళ్ల ముఖాల మీద నవ్వు పరుచుకోగా ముఖం చిట్లించుకున్న ఫొటోలు చూసినవాళ్లంతా అసంకల్పిత ప్రతీకార చర్యలాగా తమ ముఖాలనూ చిట్లించుకున్నారట. దీన్ని బట్టి నవ్వు అంటువ్యాధిలా వ్యాపిస్తుందనీ నవ్వే మరికొన్ని నవ్వుల్ని పూయించగలదనీ తేల్చారు పరిశోధకులు.

నవ్వండి... నవ్వించండి
తెల్లారి లేస్తే ప్రతి మనిషీ అనుబంధాలతో ఆలోచనలతో ఆరోగ్యంతో పరిస్థితులతో... రకరకాల పోరాటాలు చేస్తుంటాడు. అలా సమస్యలతో సతమతమయ్యేవారి ముఖాల మీద చిరునవ్వు సహజంగా రాదు. అవసరార్థం బలవంతంగా తెచ్చిపెట్టుకున్నా వెంటనే మాయమవుతుంది. అలా కాకుండా సహజంగా వారిని నవ్వించాలంటే ఎదురుగా ఉన్న వారు నవ్వాల్సిందే. అది చూసి వారూ నవ్వుతారు. అలా ఒకరిని చూసి ఒకరు నవ్వుతూ ఉండడం వల్ల వాతావరణం అంతా ఆహ్లాదంగా తయారవుతుంది. నిజానికి చిరునవ్వు ముఖం మీద పరుచుకునేది ఒక్క క్షణమే... కానీ దానికి ఒక జీవితాన్ని మార్చగల శక్తి ఉంది. తీవ్ర నిర్వేదంలో ఉన్న వ్యక్తి కాసేపు నవ్వితే అతడి ఆలోచన మారవచ్చు. తీసుకునే నిర్ణయం మారవచ్చు. అది అతడి జీవితాన్నే మార్చవచ్చు. అందుకే నవ్వండీ... నవ్వించండీ... అంటున్నారు సామాజికవేత్తలు.

నవ్వితే ఏమవుతుంది?
వెనకటికెవరో ఆనందం ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ దేశాలన్నీ తిరిగాడట. చివరికి ఓ బౌద్ధ భిక్షువు కాళ్ల మీద పడి ‘స్వామీ నాకు ఆనందం కావాలి’ అన్నాడట. ‘అది నీ ముక్కు కిందే ఉంది నాయనా, బిగిసిపోయిన ఆ కండరాలను కాస్త వదులుచేయి’ అని నవ్వుతూ చెప్పాడు భిక్షువు. ముక్కు కింద అంటూ ఆయన చెప్పిన తీరు చూసి ఆ వ్యక్తికి నవ్వొచ్చి నవ్వేశాడు. ‘ఆనందాన్ని నీ ముఖంలోనే ఉంచుకుని ఎక్కడెక్కడో వెతికావు కదా...’ అంటూ వెళ్లిపోయాడు ఆ భిక్షువు.

మనకి ఏదైనా సంతోషం కలిగినప్పుడు మెదడు ఎండార్ఫిన్లను ఉత్పత్తి చేస్తుంది. ముఖ కండరాల్లోని న్యూరాన్లకు సంకేతాలు ఇస్తుంది. దాంతో అవి రిలాక్స్‌ అయి ముఖాన చిరునవ్వు విరుస్తుంది. ఒకవేళ మనకు నిజంగా నవ్వు రాక బలవంతంగా నవ్వు నటించినా కూడా మెదడు స్పందించి ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. దాంతో సంతోషంగా ఉన్న అనుభూతి కలుగుతుంది. కాబట్టి సంతోషంగా ఉంటేనే నవ్వుతామనుకోకుండా సంతోషంగా ఉండటం కోసం నవ్వుల్ని తెచ్చుకోవాలంటున్నారు పరిశోధకులు.

నవ్వు మన ముఖంలో కన్పించే తొలి భావం. పుడుతూనే నేర్చుకునే సుగుణం. పసిపిల్లలు ప్రతి చిన్నదానికీ కిలకిలా నవ్వుతారు. పిల్లలుగా రోజుకు కొన్ని వందలసార్లు నవ్విన మనం పెద్దయ్యాక పిసినిగొట్టులమయిపోతున్నాం. నవ్వితే మన సొమ్మేదో పోతుందన్నట్లుగా బిగదీసుకుపోతున్నాం. అందుకే చిరునవ్వు పైసా ఖర్చు లేని పెట్టుబడి, దాని వల్ల పొందే లాభం అమూల్యం- అని చెబుతున్నారు నవ్వుల మీద పరిశోధన చేసినవాళ్లు. ఇచ్చేవాళ్లూ తీసుకునేవాళ్లూ... ఇద్దరూ లాభం పొందే ఏకైక లావాదేవీ నవ్వేనట. అందుకే ఇప్పుడు చిరునవ్వుకి చాలా డిమాండ్‌ ఉంది. దాన్ని ముఖం మీదినుంచి చెదరనీయకండి మరి!

* * *

ఓ ప్రవచనకర్త సంతోషంగా ఉండటం గురించి చెబుతున్నాడు. ఆయన ఒక జోక్‌తో తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. జోక్‌ చాలా బాగుందని అక్కడున్నవారంతా పడీపడీ నవ్వారు. ఆయన మళ్లీ అదే జోక్‌ని చెప్పాడు. అందరూ వినలేదని మళ్లీ చెప్పాడనుకుని శ్రోతలు నవ్వారు కానీ మొదటిసారి నవ్వినంత గట్టిగా నవ్వలేదు. ఆయన మూడోసారి మళ్లీ అదే జోక్‌ చెప్పాడు. ఈసారి ఎవరూ నవ్వలేదు. పైగా ఈయనకేమైంది అని ప్రశ్నార్థకంగా చూస్తున్నారు.
‘నేను చెప్పిన జోక్‌ బాగా లేదా...’ ప్రశ్నించాడాయన.

‘బాగుంది కానీ...’

‘మళ్లీ మళ్లీ వింటే నవ్వు రాలేదు. అంతే కదా. మరి ఎప్పుడో జరిగిన సంగతుల్ని తలచుకుని తలచుకుని బాధపడతారెందుకు? ముఖాలు వేలాడేసుకుని తిరుగుతారెందుకు?’

‘.....’

‘చితి ఒక్కసారే మండుతుంది. చింత నిరంతరం మండుతూనే ఉంటుంది. ఆ మంటను చల్లార్చే సాధనం నవ్వు. అందుకే మనసారా నవ్వండి. నలుగురికీ నవ్వుల్ని పంచండి. ఏ చింతలూ మీ దరిచేరవు’ చెప్పాడు ప్రవచనకర్త.


ఒక్క నవ్వే చాలు..!

లాఫింగ్‌ క్లబ్‌ దాకా వెళ్లక్కర లేదు, ముఖం మీద చిన్న చిరునవ్వు కదలాడేలా చూసుకుంటే చాలు ఎన్ని లాభాలో!
* ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉండేవారికి బీపీ పెరగదట. నవ్వు శరీరంలో ఆక్సిజన్‌ శాతాన్ని పెంచుతుంది. గుండెజబ్బుల నివారణకూ అదే దివ్యౌషధం. జ్ఞాపకశక్తినీ పెంచుతుంది.
* చాకొలెట్‌ని మూడ్‌ బూస్టర్‌ అంటాం కానీ దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ప్రభావం చూపేది చిరునవ్వే. అది రెండువేల చాకొలెట్‌ బార్లతో సమానమైన ఉత్సాహాన్ని ఇస్తుందట.
* నవ్వుతూ ఉండేవారిలో కన్పించే ఆత్మవిశ్వాసం వారికి ఉద్యోగాల్లో పదోన్నతులు త్వరగా వచ్చేలా చేస్తుందట.
* నవ్వు ఒత్తిడిని తగ్గించి సంతోషంగా ఉండేలా చేస్తుంది.
* నవ్వు కండరాలను రిలాక్స్‌ చేసి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. నొప్పిని మరిపిస్తుంది. దెబ్బతిన్న కణాలకు మరమ్మతు చేస్తుంది.
* నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారు అసలు వయసు కన్నా తక్కువ కన్పించటమే కాదు, దీర్ఘాయుష్మంతులూ అవుతారట.
* నవ్వు మొహం విజయానికి సంకేతంగా భావిస్తారు. అనుబంధాలన్నిట్లోనూ వారిదే పైచేయి అవుతుంది. అపరిచితులు త్వరగా మాట కలిపేది నవ్వుముఖంతో ఉన్నవారితోనే.
* నవ్వుతూ ఉండే ఉద్యోగుల వల్ల ఉత్పాదకత పెరుగుతుందని రుజువవడంతో పలు సంస్థలు ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఫన్‌ క్లబ్బుల పేరిట రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
* చిరునవ్వు- ఇంట్లో అనుబంధాలను పెంచుతుంది, బయట సంబంధాలను మెరుగుపరుస్తుంది, వ్యాపారంలో మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది... అందుకే నవ్వండి హాయిగా.


చిరునవ్వు... సంగతులు

ఒక్క క్షణం చాలు చిన్న నవ్వు ముఖాన పూయడానికి. కానీ దాని వెనక బోలెడు సంగతులున్నాయి.
* చిరునవ్వుకి 5 నుంచి 53 కండరాలు అవసరమవుతాయట. వాటిల్లో నాలుగైదు కండరాలు రిలాక్స్‌డ్‌గా ఉంటే చాలు ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉండొచ్చు.
* కొంతకాలం క్రితంతో పోలిస్తే నవ్వటం చాలా తగ్గిందన్నది నిజమేనంటున్న పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. అందులో పాల్గొన్న ఉద్యోగుల్లో 30శాతం మాత్రమే తాము రోజుకు ఇరవై సార్లదాకా నవ్వుతున్నామని చెప్పారట. అంతకన్నా ఎక్కువ సార్లు నవ్వామని చెప్పింది 28 శాతమే.
* పసిపిల్లలు చుట్టూ ఉన్నవారిని చూసే భావోద్వేగాల్నీ స్పందనల్నీ నేర్చుకుంటారు కానీ ఒక్క నవ్వు మాత్రం పుట్టుకతోనే వస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు.
* సగటున రోజుకు- పిల్లలు 400 సార్లు నవ్వితే, స్త్రీలు 62 సార్లు, పురుషులు 8సార్లు మాత్రమే నవ్వుతారట. అయితే చిరునవ్వు అవసరమైన విధినిర్వహణలో ఉన్నప్పుడు పురుషులూ స్త్రీలతో సమానంగా నవ్వగలరు.
* ఎంత వేదననైనా కన్పించకుండా దాచుకోవచ్చు కానీ తుళ్లిపడే మనసు బయటకు ప్రకటించే చిరునవ్వుల్ని ఎంత ప్రయత్నించినా దాచలేం. ఫోనులో మాట్లాడేటప్పుడు కూడా మనం నవ్వు ముఖంతో ఉన్నదీ లేనిదీ అవతలి వ్యక్తి గుర్తించవచ్చట.
* అందంగా అలంకరించుకున్నవారికన్నా ఏ అలంకరణా లేకపోయినా చిరునవ్వులు చిందించేవారే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటారని ఓ అధ్యయనంలో పాల్గొన్నవారిలో 69శాతం తేల్చిచెప్పారు.

24 నవంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.