close

వేల ఎకరాలకు నీళ్లిచ్చాడు!

కేజీఎఫ్‌తో జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో యశ్‌. త్వరలో కేజీఎఫ్‌2తో అలరించనున్న ఈ నటుడు సేవా కార్యక్రమాలంటే ముందుంటాడు. అందుకే భార్య రాధికతో కలిసి ‘యశోమార్గ ఫౌండేషన్‌’ ఏర్పాటు చేసి చెరువులకు పూడికలు తీయిస్తున్నాడు. కరవుగ్రామాల్లో దాహం తీరుస్తున్నాడు. ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు చేస్తున్నాడంటే...

శ్‌ది కర్ణాటకలోని భువనహళ్లి అనే గ్రామంలో ఓ రైతు కుటుంబం. పల్లెటూళ్లో పుట్టి పెరగడం... పొలం గట్లపై ఆడుకోవడం వల్ల వ్యవసాయంపైన ఇష్టం కలిగింది యశ్‌కి. అయితే ఆ ప్రాంతంలో సరిగా పంటలు పండక, పెట్టిన పెట్టుబడి తిరిగి రాక యశ్‌ తండ్రి కేఎస్‌ఆర్టీసీలో బస్సు డ్రైవర్‌గా చేరిపోయాడు. అలా రైతుల సమస్యల్ని దగ్గరగా చూడటంతో  వారి ఇబ్బందుల్ని తీర్చాలని చిన్నప్పుడే అనుకున్నాడు. చదువు పూర్తయ్యాక ఆసక్తి కొద్దీ ఈటీవీ కన్నడ సీరియల్‌ ద్వారా చిన్నితెరకు పరిచయమయ్యాడు. తరవాత సినిమాల్లోనూ అవకాశాలు రావడంతో హీరో అయ్యాడు. కొన్నాళ్లకి సహనటి రాధికా పండిట్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆ తరవాత...

చెరువుని బతికించి...
ఉత్తర కర్ణాటకలోని కొప్పల్‌ జిల్లాలో ఉన్న తాళ్లూరులో ఓ చెరువుంది. వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ చెరువు మీదే చుట్టుపక్కల పాతిక గ్రామాల్లోని రైతులు ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. వరి, కంది, మొక్కజొన్న, చెరకు, పత్తి, మిర్చి, జొన్న అక్కడ ప్రధాన పంటలు. అయితే 2012 నుంచి వరసగా నాలుగేళ్లపాటు వర్షాలు సరిగా పడక ఆ చెరువు ఎండిపోయింది. దాన్నెవరూ పట్టించుకోకపోవడంతో  క్రమంగా పూడుకుపోవడం మొదలైంది. అడపాదడపా వర్షం పడినా నీళ్లు లోపలికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఎండిపోయిన ఆ చెరువుపైనే ఆధారపడిన వేల మంది రైతుల జీవితాలు రోడ్డు పాలయ్యాయి. అలానే కొన్ని గ్రామాల్లో తాగునీళ్లు లేక ప్రజలు దాహంతో అల్లాడారు. మేతా, నీళ్లూ లేక కొన్నిచోట్ల పశువులు మృత్యువాత పడ్డాయి. ఆ పరిస్థితుల గురించి తెలుసుకున్న యశ్‌ స్వయంగా అక్కడికెళ్లి చూసొచ్చాడు. ఆ ప్రాంతంలో నీళ్లు లేక వెలవెలబోయిన చెరువుల్ని చూసి బాధపడ్డాడు. వాటిని బాగు చేస్తే పరిస్థితుల్లో దానంతట అదే మార్పు వస్తుందనుకున్నాడు. అందుకోసం 2016లో యశోమార్గ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాడు. మొదట తాళ్లూరులోని పెద్ద చెరువు పూడికతో పనులు మొదలుపెట్టాడు. వందల మంది కూలీల సాయంతో చెరువును బాగు చేయించి... దాని చుట్టుపక్కల వాన నీళ్లు ఇంకిపోవడానికి ఇంకుడు గుంతలు తవ్వించాడు. అందుకోసం దాదాపు నాలుగుకోట్ల రూపాయలు ఖర్చుపెట్టాడు. సరిగ్గా ఏడాదికి -అంటే 2017లో- ఓ మోస్తరు వర్షాలు పడగానే ఆ చెరువులోకి నీళ్లొచ్చాయి. రైతుల అవసరాలు తీర్చాయి. అప్పట్నుంచీ ఆ చెరువు ఎండిపోలేదు.

దాహం తీరుస్తూ...
అలానే కల్బుర్గీ, రాయ్‌చూర్‌, గడగ్‌, బెళగావి, బీదర్‌, యాద్గిరి, బాగల్‌కోట ప్రాంతాల్లోని అరవై గ్రామాల్లో చెరువులకూ పూడికలు తీయించాడు. ఇప్పటికీ మరికొన్ని గ్రామాల్లో చెరువులు బాగు చేస్తున్నాడు. వేసవిలో పశువులకు మేత అందించడంతోపాటు ప్రతిరోజూ ట్యాంకర్లు పంపి ఇంటికో డ్రమ్ము నీళ్లు సరఫరా చేస్తున్నాడు. వర్షాలు పడి బావుల్లోకి నీళ్లు వచ్చాక రెండ్రోజులకోసారి తాగు నీళ్లు అందిస్తున్నాడు. అందుకోసం ఓ పది ట్యాంకర్లు కొనుగోలు చేశాడు. నీటి పొదుపు గురించి అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాడు. నిరుపేద రైతులకు ఉచితంగా విత్తనాలూ ఎరువులూ ఇస్తూ వారిని వ్యవసాయం దిశగా మరింతగా ప్రోత్సహిస్తున్నాడు. ఈ మధ్య కర్ణాటకలోని గడగ్‌ ప్రాంతం భారీ వర్షాలతో వరదల్లో చిక్కుకుపోయింది. అక్కడ వందమంది అంధ విద్యార్థులున్న ఆశ్రమం కూడా నీళ్లలో మునిగిపోయింది. విషయం తెలిసిన యశ్‌ వాళ్లందర్నీ బెంగళూరు తీసుకొచ్చి ఓ షెల్టరు ఏర్పాటు చేసి బాగోగులు చూస్తున్నాడు. కొన్ని అనాథా, వద్ధాశ్రమాలకూ నెలవారీ సరకులు ఇస్తున్నాడు. అలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ నటుడి తండ్రి ఇప్పటికీ బస్సు డ్రైవరుగానే ఉద్యోగం చేస్తూ ఆ జీతాన్ని కూడా ‘యశోమార్గ ఫౌండేషన్‌’కే అందించి కొడుకు సేవాకార్యక్రమాల్లో తన వంతుగా పాలుపంచుకోవడం విశేషం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.