close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కశ్మీరం... కడు రమణీయం! ......

‘కశ్మీర్‌... ఆ పేరు వినగానే పర్యటకుల మదిలో ఓ అందమైన భావన, ఆ వెంటే ఒకలాంటి భయం రెండూ ఏకకాలంలో కలుగుతాయి. అయితే అక్కడి హిమగిరి సొగసులూ పచ్చని పచ్చిక మైదానాలూ దాల్‌ సరస్సు అందాలూ అందులోని పడవ ఇళ్లూ గుర్తురాగానే ఆ భయాందోళనలన్నీ తెల్ల మబ్బుల్లా వీడిపోయి మనసు కశ్మీర్‌ కొండలూ లోయల్లో విహరిస్తుంటుంది’ అంటున్నారు ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించిన హైదరాబాద్‌కు చెందిన గొర్రెపాటి నరసింహప్రసాద్‌.

శ్రీనగర్‌ నుంచి గుల్‌మార్గ్‌ వైపు వెళుతున్న మా కారుని అరగంటలోనే పోలీసులు ఓ చిన్న జంక్షన్‌ దగ్గర ఆపేసి, వెనక్కి వెళ్లిపోమని చెప్పారు. కానీ గుల్‌మార్గ్‌లో మేం  హోటల్‌ బుక్‌చేసుకున్నామని నచ్చజెప్పడంతో వేరే దారి గుండా వెళ్లమన్నారు. అప్పటివరకూ గంటకు 100 కి.మీ. వేగంతో వెళ్లిన మా కారు వేగం 10 కిలోమీటర్లకు తగ్గిపోయింది. రోడ్డంతా గతుకులు... దాంతో నెమ్మదిగా వెళుతోంది. వెనక్కి చూస్తే మరికొన్ని వాహనాలు వస్తూ కనిపించాయి. ఓ గంటలో వెళ్లాల్సిన వాళ్లం ఎప్పటికి వెళతామో చెప్పలేని పరిస్థితి. అయినా భయం అనిపించలేదు. దారికి ఇరువైపులా పచ్చకోక కట్టుకున్నట్లున్న వరిచేలూ ఆ చీరకి అంచులా పసుపూఆకుపచ్చా కలగలిసినట్లున్న ఆవాల తోటలూ ఆ చీరమీద అక్కడక్కడా అందంగా ఎంబ్రాయిడరీ చేసినట్లున్న ఆపిల్‌ తోటలూ పిల్ల కాలువలూ... ఆ దృశ్యం మనోహరంగా అనిపించింది. మెయిన్‌రోడ్డులో వెళితే ఇవన్నీ మిస్సయిపోయేవాళ్లమే కదా అనిపించింది. గంట తరవాత మెయిన్‌రోడ్డుకు చేరుకుని, మరో గంటలో తంగ్‌మార్గ్‌కు చేరుకున్నాం. అక్కడినుంచి గుల్‌మార్గ్‌ వరకూ ఘాట్‌రోడ్డే. పేరుకు తగ్గట్లుగా దారంతా పచ్చిక మైదానాలూ పూలమొక్కలే. ఎదురుగా ఎత్తైన అఫర్వార్త్‌ పర్వతం అందంగా కనిపిస్తోంది. అలా మెల్లగా గుల్‌మార్గ్‌లోని మా హోటల్‌కు చేరుకున్నాం. లవంగం, దాల్చినచెక్క కలిపిన వేడినీటిని వెల్‌కమ్‌ డ్రింకుగా ఇచ్చారు. మా గదిలోనుంచి పచ్చని మైదానాలూ దూరంగా మంచుపర్వతాలూ కనువిందు చేస్తున్నాయి. కొండమీద కనబడుతున్న రాణీ మందిరానికి నడుచుకుంటూ వెళ్లాం. దాని చుట్టూ తిరుగుతుంటే గుల్‌మార్గ్‌ అందంగా కనిపించింది.

మేఘాల్లో ప్రయాణం!
మర్నాడు ఉదయాన్నే బయటకు వెళితే దూరంగా మంచుకొండల మీద ఎండ పడి వెండిలా మెరుస్తోంది. అంతలోనే మేఘాలు కమ్మేస్తున్నాయి. తరవాత గండోలా రైడ్‌ దగ్గరకు బయలుదేరాం. వాహనాలను అనుమతించకపోవడంతో నడుచుకుంటూనే వెళ్లాం. దారివెంట పచ్చని మైదానంలో గులాబీరంగు పూలు చిన్నగా ఆకుల్లో కలిసిపోయి ఉన్నాయి. ఎడమవైపు చిన్న చిన్న కాటేజీలు ఉండగా కుడివైపు చిన్న లోయ ఉంది. కేబుల్‌ కారులో ఫేస్‌-1 వరకూ వెళ్లాం. మే నెల కావడంతో మంచు ఎక్కువగా లేదనీ ఫేస్‌-2కి బయలుదేరాం. 13,780 అడుగుల ఎత్తులో కేబుల్‌ కారులో వెళ్తుంటే మేఘాలలో ప్రయాణిస్తున్నట్లే అనిపించింది. కిందకి చూస్తే కనుచూపుమేరా మంచు...ఉన్నట్టుండి మబ్బులు కమ్మేస్తే ఏమీ కనిపించేది కాదు. మోకాళ్లదాకా బూట్లూ చేతికి గ్లోవ్సూ ఒంటికి లెదర్‌ కోటూ వేసుకున్నా చలికి గజగజలాడాం. ఆ రాత్రికి అక్కడే ఉండి మర్నాడు శ్రీనగర్‌కి బయలుదేరాం.

దాల్‌ లేక్‌ దగ్గరకు చేరుకుని, చిన్న పడవలో మేముండాల్సిన హౌస్‌బోట్‌కి చేరుకున్నాం. హాలు, పడకగది, కిచెన్‌ అన్నీ అందులోనే ఉన్నాయి. దానికి అటూ ఇటూ కొన్ని వందల పడవలు ఉన్నాయి. ప్రతి పడవ ఇంటి ముందూ చిన్న చిన్న పడవలు కట్టి ఉన్నాయి. వాటిని నడుపుకుంటూ పిల్లలు స్కూలు నుంచి తిరిగి ఇళ్లకువెళ్తున్నారు. చూస్తుండగానే చీకటి పడింది. సరిగ్గా మాకు ఎదురుగా సరస్సు ఆవల కొండమీద శంకరాచార్యుల వారు స్థాపించిన శంకరాలయం తాలూకు దీపాలు కనిపిస్తున్నాయి. ఆ గుడిని పాండవులు నిర్మించారనీ తరవాత శంకరాచార్యులు పునరుద్ధరించారనీ చెబుతుంటారు.

మర్నాడు వంద కిలోమీటర్ల దూరంలో జమ్మూ హైవేలో ఉన్న పహల్‌గామ్‌ వైపు బయలుదేరాం. ఆపిల్‌ తోటలన్నీ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. రెండేళ్ల కిందట వచ్చినప్పుడు ఆవాల తోటలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అక్కడా ఆపిల్‌ తోటలు వేశారు. పహల్‌గామ్‌ సమీపిస్తుండగానే లిద్దర్‌ నదికి అవతలివైపు ఎత్తైన రోడ్డు కనిపిస్తుంటుంది. అక్కడ కాసేపు ఉండి ప్రకృతిని ఆస్వాదిద్దామని దిగాం. నదిలో నీళ్లను తాకగానే అవి ఐసు కన్నా చల్లగా అనిపించాయి.

బుల్లి స్విట్జర్లాండ్‌!
తరవాత ఇండియన్‌ మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచే బైసరన్‌ వ్యాలీకి బయల్దేరాం. ఆ లోయలోకి గుర్రాలమీదే వెళ్లాలి. ఓ ఐదునిమిషాలు ప్రయాణించాక అడ్డంగా ఫెన్సింగ్‌ కనిపించింది. ఎడమవైపున ఓ కొండ ఉండి, కాలిబాట ఉంది. అటువైపుగా గుర్రాలను మళ్లించారు. అప్పుడు మొదలైంది మా ప్రయాణం. ఏ సినిమాల్లోనూ ఇంతవరకూ చూడనిదీ, అసలెప్పుడూ ఊహల్లోకి రానిదీ అనుభవిస్తేగానీ అక్షరీకరించలేనిదీ... దారంతా గడ్డి పూలమొక్కలు. ఆకుపచ్చరంగు ఇంత అందంగా ఉంటుందా అనిపించేంత పచ్చదనం... పశువులను మేపుతూ స్థానికులు కనిపించారు. వాళ్లు కట్టుకున్న మట్టి ఇళ్లు అక్కడక్కడా ఉన్నాయి. అంతకుముందు రోజు వర్షం పడటంతో నేల బురదగా ఉంది. కాసేపు కొండపైకి నిటారుగా ఎక్కడం... మరికాసేపు అగాథంలాంటి లోయల్లోకి దిగడం... హమ్మయ్య అనుకునేలోపు దారికి అడ్డంగా పడిన ఓ పెద్ద చెట్టు కనిపించేది. ఇప్పుడెలా అనుకునేలోగానే గుర్రాలు వాటిని అవలీలగా దాటిపోయేవి. వాటిని దాటగానే ఎగుడుదిగుడు కొండరాళ్లూ వాటిల్లోంచి పారే పిల్లవాగులూ కనిపించాయి. ఆ దారిలో గుర్రాలమీద నుంచి ఏమాత్రం జారిపడ్డా అంతే సంగతులు... అలా ప్రయాణిస్తూనే బైసరన్‌ వ్యాలీకి చేరుకున్నాం. వావ్‌.. అన్న శబ్దం తప్ప మా నోట మరో మాట రాలేదు... అతిపెద్ద పచ్చిక మైదానం... ఆకాశాన్ని అందుకోవాలనుకుంటోన్న పైన్‌ చెట్లూ వాటికి కంచుకోటలా అంతకన్నా ఎత్తులో ధవళవర్ణంలో శోభిల్లే హిమగిరులూ వాటితో సయ్యాటలాడుతున్నట్లున్న మంచు మబ్బులూ... ఇంత అందమైన దృశ్యానికి పక్కనే నేపథ్యసంగీతంలా రాళ్లను రాసుకుంటూ ప్రవహించే నీటిసవ్వడీ... నిశ్శబ్దంగా చూస్తుండిపోయాం. అక్కడినుంచి కదలాలనిపించలేదుగానీ తప్పదన్నట్లుగా భారంగా వెనక్కి తిరిగాం.

కొండాకోనల్లో... లోయల్లో..!
తరవాత ఏబీసీ వ్యాలీలుగా పిలిచే ఆరూ, బేతాబ్‌, చందన్‌వాడీ లోయలకు బయలుదేరాం. ఆరూ లోయను చూడగానే కౌబాయ్‌ సినిమాలోని సెట్టింగ్‌ గుర్తొచ్చింది. కొండలమధ్యలో పచ్చని మైదానం దాని మధ్యలో ఇళ్లూ చిన్న చిన్న నదులూ ఎంతో
ప్రశాంతంగా ఉంది. తరవాత అక్కడి నుంచి బేతాబ్‌ వ్యాలీకి వెళ్లాం. సన్నీడియోల్‌, అమృతాసింగ్‌ నటించిన బాలీవుడ్‌ సినిమా ‘బేతాబ్‌’ ఇక్కడ తీయగా అది బాగా హిట్టవ్వడంతో ఈ ప్రదేశానికా పేరు స్థిరపడిపోయింది. ఈ లోయగుండా ప్రవహించే లిద్దర్‌ నది అందాల్ని ఎంత చూసినా తనివితీరదు. దీనికి ఏమాత్రం తీసిపోదు చందన్‌వాడీ లోయ... ఇక్కడి నుంచే అమర్‌నాథ్‌ యాత్ర మొదలవుతుంది.

ఈమధ్య వార్తల్లోకి వచ్చిన పుల్వామా దగ్గరలోనే అవంతిపురం అనే గ్రామంలో 9వ శతాబ్దానికి చెందిన విష్ణు ఆలయం ఉందని తెలిసి అక్కడికి వెళ్లాం. భూమికి 20 అడుగుల లోతు నుంచి నిర్మించిన ఈ కట్టడం కోణార్క్‌ మందిరంలా అనిపిస్తుంది. దీన్ని కట్టించిన రాజు అవంతీ వర్మన్‌ ఒడిశాకు చెందినవాడు కావడమే కారణం. 12వ శతాబ్దంలో జరిగిన ప్రకృతి వైపరీత్యంలో ఈ ప్రాంతంతోబాటు గుడి దెబ్బతింది. మందిరంలోని మూలవిరాట్‌ విగ్రహాన్ని బ్రిటిష్‌వారు లండన్‌ మ్యూజియంలో ఉంచారు.

మర్నాడు శ్రీనగర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో సోనామార్గ్‌కు బయలుదేరాం. అక్కడి నుంచి జీరో పాయింట్‌కు వెళ్లాలంటే కార్గిల్‌- లద్ధాఖ్‌ రహదారిలో మరో 20 కిలోమీటర్లు వెళ్లాలి. అంటే- సముద్రమట్టానికి 9,200 అడుగుల ఎత్తులో ప్రయాణించాలి.
ఓ వైపు అగాథాన్ని తలపించే లోయలూ ఆ లోయలకు ఆవలివైపు ఆకాశాన్ని తాకే హిమగిరులూ చూస్తూ బయల్దేరాం. చూస్తుండగానే కొండ చరియలు విరిగి రోడ్డుపై పడుతున్నాయి. దాంతో ట్రాఫిక్‌ జామ్‌ అయి దారి పొడవునా పెద్ద పెద్ద ట్రక్కులు చీమల బారుల్లా నిలబడి ఉన్నాయి. ట్రాఫిక్‌ ఆగిపోతే ఎలా అని భయపడుతుంటే, యాభై మీటర్లకి ఒకరు చొప్పున ఆర్మీ జవాన్లుట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. దారిలో ఓ రెస్టరెంట్‌ దగ్గర ఆగాం. దానికి అవతలివైపు ప్రవహిస్తోన్న సింధునదిలోని రాళ్లు వెన్నెల్లో అందంగా మెరుస్తున్నాయి. కనుచూపుమేరలో ఎక్కడా చిన్న చెత్త కాగితం కనబడలేదు. ప్రకృతిని కంటికి రెప్పలా కాపాడుకుంటోన్న గొప్పతనం కశ్మీరీలదే అనిపించింది. భారతావనిలో ఎన్ని అందమైన ప్రదేశాలు ఉన్నా ప్రకృతి గీసిన అద్భుత చిత్రంలా అనిపించే కశ్మీరానికి సాటి లేదనే చెప్పాలి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.