
అన్నం తిందాం...అరిటాకులు వెయ్యండి..!
కార్తికం... ఆధ్యాత్మిక మాసం. చన్నీటిస్నానాలూ ఉపవాసాలూ దీపారాధనలూ దానాలూ వ్రతాలూ... ఇవన్నీ ఒకెత్తయితే, అందరూ కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపే వనభోజనాలు ఒక్కటీ మరొకెత్తు. అందుకే కార్తికం వస్తుందంటే చాలు... పచ్చని అరటితోటలన్నీ విస్తరి వేసి మరీ స్వాగతిస్తాయి.
వనభోజనాల వేళ... ఉసిరి చెట్టు నీడలో చింకి చాపలు పరచుకుని అరిటాకు విస్తరి వేసి పూర్ణం, చక్రపొంగలి, పులిహోర, గోంగూరపచ్చడి, పప్పూదప్పళం, గడ్డపెరుగూ... ఇలా వరసగా అన్నీ వేస్తూ భోజనాన్ని వడ్డిస్తే... అవన్నీ ఒక్కటొక్కటిగా తింటూ ‘అద్భుతః’ అనుకోనివాళ్లు ఉండరు సరికదా, ఆ కమ్మని రుచి వంటకాలదో పచ్చని అరిటాకులదో తేల్చి చెప్పడం కూడా కష్టమే.
అయినా ఒక్క కార్తికం అనేముంది, అరటి ఆకులో భోజనం అనేది ఈతరానికి కొత్తగా ఉండొచ్చేమో కానీ పాతతరానికి మాత్రం అరిటాకు విస్తరి అనగానే ఆపాత జ్ఞాపకాలెన్నో గుర్తుకొస్తాయి. పండగలూ పూజలూ వ్రతాల సమయంలో అరిటాకుల్లోనే శుభప్రదమనీ శుచిగా ఉంటుందనీ భావించి దేవుడికి నైవేద్యం పెట్టడమే కాదు, పెరట్లోని అరటిచెట్టు నుంచి మరో నాలుగాకులు కోసుకొచ్చుకుని ఇంటిల్లిపాదీ పంక్తి భోజనం చేసేవారు. ఇంటికి అతిథులు వచ్చినా పళ్లాల్లో కాకుండా ఆకుల్లోనే భోజనం పెట్టే అలవాటు అప్పట్లో ఉండేది. ఇక, పెళ్లీ పేరంటం అయితే చెప్పనే అక్కర్లేదు. ఎవరో ఒకరి తోటలో నుంచయినా గంపగుత్తగా అరటి ఆకులు తెచ్చి భోజనాలు వడ్డించేవారు.
అరిటాకు విస్తట్లో చారుపోసినా పెరుగు వడ్డించినా దాన్ని అటూఇటూ జారిపోకుండా కలుపుకుని తినడం ఓ సవాల్‌గానే ఉండేది నాటి పిల్లజనాలకి. అయినా ఆకులో తినడం అంటే ఏదో తెలియని ఆనందం... అందుకే భోజనం అనగానే ఆకలి లేకున్నా ముందువరసలో కూర్చునేవారు. అలా తినడంలోని ఆనందమే నచ్చిందో అరటి ఆకుల్లోని రుచినే మెచ్చిందో లేదా అందులోని ఓషధీగుణాలే గుర్తొచ్చాయో తెలీదుగానీ ఆధునిక తరం సైతం అరిటాకు భోజనాల్నే కోరుకుంటోందిప్పుడు. దాంతో కొన్ని హోటళ్లూ రెస్టరెంట్లూ ప్రత్యేకంగా ఆకుల్లోనే వడ్డించడం లేదా ప్లేట్లలో ఆకులేసి వడ్డించడం ద్వారా వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నాయి. పోతే, వేడుకల్లో ఇబ్బందిపడుతూ తినే ఆ బఫే భోజనాలకి స్వస్తి పలుకుతూ టేబుళ్లు వేసి ఆకులేసి భోజనం వడ్డించేందుకే చాలామంది మొగ్గు చూపిస్తున్నారు. దాంతో అరిటాకు మళ్లీ తెరమీదికొచ్చింది. పర్యావరణరీత్యా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలన్నది కూడా అరిటాకు వాడకం పెరగడానికి మరో కారణం.
అసలేముందీ అరిటాకులో..!
అరిటాకుని పవిత్రంగా భావిస్తారు భారతీయులు. దానికి ఎంగిలి ఉండదన్న భావనతోనే ప్రసాదాలను ఆ ఆకులో నివేదిస్తారు. అదెలా ఉన్నా శాస్త్రీయంగా చూస్తే- గ్రీన్ టీలో లభించే ఎపిగాలోకెటెచిన్ గాలేట్(ఇజిసిజి) అనే పాలీఫినాల్ అరటి ఆకుల్లో ఎక్కువ. అందుకే ఆకుల్లో వేడిగా వడ్డించడం వల్ల ఆ వేడికి వాటిల్లోని పాలీఫినాల్స్ ఆహారంలో కలిసి వ్యాధుల్ని నిరోధిస్తాయి. అరిటాకులోని పాలీఫినాల్స్ క్యాన్సర్‌తో పోరాడేందుకూ తోడ్పడతాయని తాజా పరిశోధనలూ చెబుతున్నాయి. ఇజిసిజి అనేది అతినీలలోహిత కిరణాల కారణంగా చర్మం దెబ్బతినకుండా రక్షిస్తుందట. ఆకుల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఆహారంలోని సూక్ష్మజీవుల్నీ నాశనం చేస్తాయి. వేడి పదార్థాలను వడ్డించడం వల్ల ఆకుమీదున్న మైనం కరిగి వాటికి ఒకలాంటి రుచినీ ఇస్తుంది.
అరిటాకులోని క్లోరోఫిల్ పేగు అల్సర్లనీ చర్మవ్యాధుల్నీ నిరోధించడంతోబాటు రక్తశుద్ధికి తోడ్పడుతుంది. ఆకలిని పెంచి, త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మూత్రాశయంలో, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండానూ చూస్తుంది. ఇంకా ఇందులోని విటమిన్-ఎ, కాల్షియం, కెరోటిన్, సిట్రిక్ ఆమ్లం... వంటివన్నీ కలిసి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అందుకే పూర్వికులు ఇంట్లో ఖరీదైన కంచాలు ఉన్నా నేరుగా ఆకుల్లోనో లేదా ఆ పళ్లాల్లో ఆకువేసుకునో తినేవారు. పైగా ఆకు పెద్దగా ఉండటంవల్ల వంటకాలన్నీ ఒకేసారి వడ్డించొచ్చు. నిజానికి ఆకుల్లో తినడం అనేది కేరళలో మొదలైందట. అందుకు ఇంటిచుట్టూ అరటి చెట్లు ఉండటం ఓ కారణమైతే, ఆయుర్వేద శాస్త్రరీత్యా కూడా ఆకులో తినడం ఆరోగ్యానికి మంచిదన్నది మరో కారణం. తమిళనాడులోని తిరునెల్వేలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ అచ్చంగా అరిటాకుల్లో మాత్రమే తింటారు. దానివల్లే వాళ్లకి బట్టతల రాదని విశ్వసిస్తుంటారు. కొన్నిప్రాంతాల్లో ఆయుర్వేద మందుల్ని అరిటాకుల్లోనే ప్యాక్ చేసి ఇస్తుంటారు. అంతేకాదు, గాయాలకూ కొన్ని చర్మవ్యాధులకీ అరిటాకు నూరి తీసిన రసాన్ని పూస్తే త్వరగా తగ్గుతాయి.
భోజనానికి ప్లేట్లులాంటివి వాడి, వాటిని సబ్బులతో కడగడం వల్ల ఆయా రసాయనాలు అంతో ఇంతో ఆ ప్లేట్లకి పడతాయి. అదే అరిటాకులపై ఉండే మైనం వల్ల వాటికి దుమ్మూధూళీ అతుక్కోదు సరికదా, నీళ్లు చిలకరిస్తే చాలు, శుభ్రమైపోతాయి. అదీగాక వేడుకల్లో వాడుతోన్న ప్లాస్టిక్, స్టైరోఫోమ్లతో తయారయ్యే డిస్పోజబుల్ ప్లేట్ల వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుంది. అదే అరిటాకులయితే నేలలో కలిసిపోతాయి.
వంటల్లోనూ..!
ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-ఎ, సిట్రిక్ ఆమ్లం, కాల్షియం, కెరోటిన్... వంటివన్నీ ఆహారంలో కలిసి వంటకానికో ప్రత్యేక రుచిని తెస్తాయి. ఆ కారణంతోనే అనేక ప్రాంతాల్లో ఆకుల్ని వంటల తయారీకీ వాడుతుంటారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో చేప, పుట్టు, ఇడ్లీ, డోక్లా... వంటి కొన్ని ప్రత్యేకమైన వంటకాలను ఆకుల్లో పెట్టి వండుతారు. మలబారు తీరంలో అరిటాకులో వండే కిజి బిర్యానీ రుచి ఈమధ్య దేశవిదేశీయులెందరినో అలరిస్తోంది. జపాన్, మెక్సికో, హవాయ్ల్లో కూడా వంటలకి అరటి ఆకుల్ని వాడుతుంటారు. కొన్ని రెస్టరెంట్లలో ఇడ్లీ, దోసె, వడ, ఊతప్పం... వంటి టిఫిన్లనీ అరిటాకుల్లోనే వడ్డిస్తున్నారు. కూరల్నీ అరిటాకుల గిన్నెల్లోనే వడ్డించడం విశేషం. ఫుడ్ పార్సిల్స్కోసం కాగితం, ప్లాస్టిక్, అల్యూమినియం ఫాయిల్... ఇలా వేటిని వాడినా అందులోని ఇంకూ ఇతరత్రా రసాయనాలన్నీ ఆహారంలో అంతోఇంతో కలుస్తాయి. అందుకే వాటి వాడకాన్ని తగ్గించడానికి ఆకుల వాడకం పెరుగుతోంది. ప్లాస్టిక్కుకి ప్రత్యామ్నాయంగా కూరగాయలూ ఆకుకూరల ప్యాకింగులకోసం అరటి ఆకుల్నే వాడుతున్నారు.
ఏటా సుమారు 11 కోట్ల టన్నుల అరటి ఆకుల్ని వృథాగా పారేస్తున్నాం. అందుకే బనానా లీఫ్ టెక్నాలజీ... వంటి సంస్థలు ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్కుకు బదులుగా ఏడాదిపాటు నిల్వ ఉండే అరిటాకుల కప్పులూ ప్లేట్లూ కవర్లూ తయారుచేస్తున్నాయి. వీటిల్లో ప్యాక్ చేయడం వల్ల వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి వాటినీ నిరోధిస్తాయట. మొత్తమ్మీద ఆహారానికీ ఆకుకీ విడదీయరాని అనుబంధం ఉంది. తామర, బాదం, విస్తరాకు, పనస... ఇలా ఆకులేవైనా వాటిల్లోని ఆస్ట్రింజెంట్ గుణాలు పదార్థాలకి ఒకలాంటి రుచితో బాటు చర్మానికీ మేలు చేస్తాయి. అందుకే మరి... ఇక ఆకుల్లోనే వడ్డిద్దాం... భుజిద్దాం..!