close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
షెజువాన్‌ మిరియాల్లో ఏముంది?

చైనీస్‌ రెస్టరెంట్లకు వెళ్లినప్పుడు షెజువాన్‌ రైస్‌, నూడుల్స్‌... అన్న మెనూ చూసి ఈ షెజువాన్‌ అనేది ఆ వంటకం పేరు అనుకుంటుంటాం. కానీ షెజువాన్‌ అనేది ఒక రకమైన మసాలాద్రవ్యం. రుచిలో ఘాటులో మిరియాల్ని పోలి ఉండటంతో దీన్ని షెజువాన్‌ పెప్పర్‌ అని పిలుస్తుంటారు. కానీ నిజానికి ఇది సిట్రస్‌ పండ్లను పోలి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లూ ఖనిజాలూ పోషకాలూ వంటివన్నీ ఎక్కువగా ఉండటంతో ఎండిన కాయల తొక్కల్ని పొడి చేసి చైనా, భారత్‌, టిబెట్‌, థాయ్‌ వంటల్లో వాడుతుంటారు. వీటిలో పొటాషియం, విటమిన్‌-ఎ, ఐరన్‌, మాంగనీస్‌, జింక్‌, కాపర్‌, ఫాస్ఫరస్‌, పైటోస్టెరాల్స్‌, టెర్పీన్స్‌, కెరోటిన్స్‌... సమృద్ధిగా ఉండటంతో అనేక వ్యాధులకీ మందులా పనిచేస్తాయి. రక్తహీనత, అలసటతో వాధపడేవాళ్లు ఈ పొడిని టీ రూపంలో తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ పెరిగేలా చేస్తుందట. వీటిల్లో అధికంగా ఉండే జింక్‌ రోగనిరోధకశక్తిని పెంచేందుకు దోహదం చేస్తుంది. జీవక్రియావేగాన్ని పెంచడంతోబాటు ఆకలిని పెంచేందుకూ తోడ్పడుతుంది. ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలకూ బలాన్నిస్తుంది. షెజువాన్‌ పెప్పర్‌లో ఉండే రకరకాల యాంటీఆక్సిడెంట్లు మంటని తగ్గించడం ద్వారా ఆర్థ్రయిటిస్‌ సమస్యల్నీ తగ్గేలా చేస్తాయి. అధిక శాతంలో ఉండే పొటాషియం బీపీని తగ్గించి గుండెజబ్బులూ పక్షవాతం వంటి సమస్యల్ని నిరోధిస్తాయి. ఇందులోని విటమిన్లు కంటి ఆరోగ్యాన్నీ రక్షిస్తాయి.


అమ్మానాన్నలే కారణం..!

పిల్లలు తల్లిదండ్రులు చెప్పేది విని నేర్చుకునే దానికన్నా వాళ్లు చేసేది చూసి నేర్చుకుంటారన్నది అక్షరాలా నిజం అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ బఫెలో విశ్వవిద్యాలయ నిపుణులు. ప్రవర్తనాపరంగా అలవాట్లపరంగా తల్లిదండ్రులు మంచిగా ఉంటే పిల్లలు కూడా అదే పద్ధతిలో పెరుగుతారు. ముఖ్యంగా టీనేజీలో వాళ్లు ఎలాంటి చెడు అలవాట్లకీ లోను కాకుండా ఉండటంతోబాటు ఆ ప్రభావం వాళ్ల తరవాతి జీవితంమీదా ప్రతిఫలిస్తుంది. అలా కాకుండా తండ్రి ఆల్కహాల్‌కు బానిసై తల్లి కూడా పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తుంటే తరవాతి కాలంలో వాళ్లలో ప్రవర్తనా లోపాలు తలెత్తే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. ఈ విషయాన్ని వీళ్లు కొంతమంది పిల్లల్ని క్షుణ్ణంగా పరిశీలించి మరీ చెబుతున్నారు. అంతేకాదు, తల్లిదండ్రులు తరచూ గొడవలు పడుతుండే వాతావరణంలో పెరిగిన పిల్లల్లో హింసాత్మక ప్రవృత్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే పిల్లలతో ప్రేమగా వ్యవహరించే కుటుంబాల్లో పెరిగినవాళ్లలో ఈ సమస్య చాలా తక్కువగా ఉందట. కాబట్టి పిల్లల ప్రవర్తనకు 70 శాతం తల్లిదండ్రులదే బాధ్యత అంటున్నారు.


వ్యాయామం ఎప్పుడు చేయాలంటే..!

కొందరు మేం రోజూ గంటకుపైగానే నడుస్తున్నాం. కసరత్తులు చేస్తున్నాం. అయినా బరువు తగ్గడం లేదు అంటూ బాధపడుతుంటారు. అయితే వ్యాయామం చేసే సమయానికీ తినే వేళలకీ కూడా సంబంధం ఉంది అంటున్నారు బర్మింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయ నిపుణులు. ఇందుకోసం వీళ్లు కొందరిని ఎంపికచేసి అల్పాహారం తిన్నాక కొందరితోనూ అల్పాహారం తినకముందు మరికొందరితోనూ ఆరు వారాలపాటు వ్యాయామం చేయించారట. అల్పాహారం తిన్నాక వ్యాయామం చేసేవాళ్లతో పోలిస్తే తినకుండా వ్యాయామం చేసినవాళ్లలో ఇన్సులిన్‌ స్రావం మెరుగ్గా ఉండి రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా శరీరంలో పేరుకున్న కొవ్వు కరగడంలో స్పష్టమైన తేడా కనిపించిందట. దీనిబట్టి నడవడం, కసరత్తు, యోగా... ఇలా ఏదైనాగానీ ఖాళీ కడుపుతో చేయడం వల్లే బరువు వేగంగా తగ్గుతారట.


చలికాలంలో కీళ్లు పట్టేస్తాయా?

వృద్దులూ ఆర్థ్రయిటిస్‌తో బాధపడేవాళ్లూ చలికాలం రాగానే కీళ్లూ కాళ్లూ పట్టేస్తున్నాయి, నడవనివ్వడం లేదు అంటుంటారు. అది నూటికి నూరు శాతం నిజమే అంటున్నారు మాంచెస్టర్‌ విశ్వవిద్యాలయ నిపుణులు. వాతావరణంలో పీడనం తగ్గి తేమగానూ, చల్లగానూ ఉన్నప్పుడు కీళ్లనొప్పులు పెరిగే అవకాశం ఉందట. ఇవే కాదు, ఒళ్లు నొప్పులూ మైగ్రెయిన్‌ వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇందుకోసం వీళ్లు ఆర్థ్రయిటిస్‌తో బాధపడుతోన్న 13 వేలమందిని ఎంపికచేసి స్మార్ట్‌ఫోను ఆప్‌ ద్వారా వాళ్ల ఆరోగ్యాన్ని ప్రతిరోజూ తెలుసుకున్నారట. అందులో వాళ్లు ఉండే ప్రదేశంలోని వాతావరణ మార్పుల్ని పసిగట్టే సెన్సరు కూడా అమర్చడంతో- వాతావరణంలో తేమ శాతం పెరిగినప్పుడు వాళ్లలో నొప్పి శాతం పెరగడంతోబాటు తలనొప్పీ, ఒళ్లునొప్పులూ వంటివి కూడా వచ్చినట్లు గుర్తించారు. వాతావరణంలోని తేమ కారణంగా ఇంట్లోని చెక్కబీరువాలూ తలుపులూ వ్యాకోచించి ఎలా అయితే బిగుసుకుని తీయడానికీ వేయడానికీ మొరాయిస్తాయో అదే మాదిరిగా కండరాలన్నీ బిగుసుకోవడంతో వాటిలో కదలిక తగ్గుతుంది. దాంతో ఆయా నొప్పులు ఎక్కువవుతున్నట్లు గుర్తించారు. కాబట్టి వాతావరణాన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్య కొంత తగ్గే అవకాశం ఉంటుంది అని సూచిస్తున్నారు సదరు పరిశోధకులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.