close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విలువైనది జీవితం

‘ఈ జీవితం దేవుడు మనకిచ్చిన వరం. ఈ జీవితకాలంలో మనం ఏం సాధించామనేది ఆయనకు మనం తిరిగిచ్చే వరం’. ఓ ప్రయాణంలో పరిచయమైన తోటి స్త్రీ చెప్పిన వాక్యాలు ఆమెను ఆలోచింపజేస్తాయి. తన తల్లిదండ్రుల నుంచి భారీగా కట్న కానుకల్ని కోరిన మెట్టినింటి వారిపై ద్వేషాన్ని భర్తపై చూపుతూ టచ్‌ మీ నాట్‌’ అంటూ దూరంగా ఉంచిన ఆమె అతని వ్యక్తిత్వం గురించి తెలిశాక పశ్చాత్తాపం చెందుతుంది. భర్తను చెప్పుచేతల్లో పెట్టుకుని అత్తను వృద్ధాశ్రమం పాలుచేస్తే, ఆమె ిడ్డ మాత్రం నాయనమ్మతో అనుబంధాన్ని పెంచుకుని కుటుంబబాధ్యతను నెరవేరుస్తుంది ‘ఆక్టోపస్‌’ అనే కథలో. ఓ వర్షాకాలం రాత్రి నలుగురు వ్యక్తుల్లో చెలరేగిన అంతరంగ ఘోషే ‘చినుకుల్లో చిరుమంటలు’. కథలన్నిటిలోనూ పాత్రల అంతరంగ చిత్రణకు ప్రాధాన్యం ఇచ్చారు రచయిత. 

- పార్థసారథి

 

చినుకుల్లో చిరుమంటలు (కథలు)
రచన: శ్రీధర
పేజీలు: 200; వెల: రూ.150/-
ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌

స్త్రీపురుష సంబంధాలు

హిందీ సాహితీ రంగాన్ని సుసంపన్నం చేసిన భగవతీ చరణ్‌వర్మ రచన ‘చిత్రలేఖ’. పాపపుణ్యాల చర్చే కథాంశం. చంద్రగుప్త మౌర్యుని రాజ్యంలో ఓ గురువు రత్నాంబరుడు. అతడి శిష్యులు శ్వేతాంకుడు, విశాలదేవ్‌లు. అన్ని విద్యలూ నేర్చి సెలవు తీసుకునే వేళ ‘పాపం అంటే ఏమిటి గురుదేవా?’ అని శ్వేతాంకుడు ప్రశ్నిస్తాడు. సమాధానాన్ని వారు అనుభవంతో గ్రహించాలనుకున్న గురువు ఒకరిని భోగి దగ్గరికీ మరొకరిని యోగి దగ్గరికీ పంపుతాడు. చివరగా శిష్యులిద్దరూ తాము తెలుసుకున్న విషయాన్ని గురువుకు వివరిస్తే ఆయన వారితో విభేదిస్తాడు. ఆయన చెప్పిన సమాధానమేమిటో తెలియాలంటే నవల చదవాలి. స్త్రీ, పురుష సంబంధాలపై చక్కని చర్చ సాగింది. అనువాదం హాయిగా ఉంది.

- పారుపల్లి శ్రీధర్‌

చిత్రలేఖ (నవల);
రచన: భగవతీ చరణ్‌ వర్మ
అనువాదం: లంక నారాయణరావు
పేజీలు: 176; వెల: 150/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

ఆమె కథ

ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన యువతి జీవిత ప్రయాణం ఇది. తాను చూసిన కొందరి జీవితాల ప్రభావంతోనే ఈ నవల రాశాననీ పాత్రలన్నీ సజీవాలేననీ అంటారు రచయిత్రి. తల్లి లేదు, తండ్రి తాగుబోతు. అందుకని పదమూడేళ్ల నళినికి అక్కే పెళ్లి చేసి పంపిస్తుంది. దురదృష్టవశాత్తూ నళినికి దొరికిన భర్త కూడా అలాంటివాడే. రోజూ చావచితగ్గొట్టే ఆ మనిషినుంచి నళిని ఎలా తప్పించుకుందో, పిల్లల్ని ఎలా చదివించి ప్రయోజకుల్ని చేసిందో ఆ ప్రయాణంలో ఆమెకు తోడుగా నిలిచిందెవరో చెబుతుంది కథ. వరసగా జరిగిపోయే సంఘటనలు మన చుట్టుపక్కల చూస్తున్నట్లే ఉంటాయి. ‘కొన్ని గతాలు దాచుకున్న ప్రేమలేఖలైతే, మరికొన్ని వాడేసిన టిష్యూపేపర్‌ లాంటివి...’ లాంటి వాక్యాలు ఆకట్టుకుంటాయి.

- శ్రీ


అనాచ్ఛాదిత కథ (నవల)
రచన: ఝాన్సీ కొప్పిశెట్టి
పేజీలు: 198: వెల: రూ.150/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

ఆకట్టుకునే చరిత్ర రచన!

తెలుగు రాష్ట్రాల చరిత్రపైన- ముఖ్యంగా బౌద్ధమత అవశేషాలపైన- ఏ కాస్త ఆసక్తి ఉన్నవాళ్లనైనా చరిత్ర లోతుల్లోకి లాక్కెళుతుంది ఈ పుస్తకం. పురాతత్వ అవశేషాల విశేషాలూ, కొత్తతరం చరిత్ర పరిశోధనలూ, సామాజిక శాస్త్రాల విశ్లేషణలకి తమవైన స్వానుభవాలని జోడించి ఆసక్తికరంగా మలిచారు రచయితలు. ప్రధానంగా ఉత్తరాంధ్రలోని బౌద్ధ అవశేషాల మీదే దృష్టిపెట్టినా... మొత్తం తెలుగురాష్ట్రాలకి బౌద్ధమతం ఇచ్చిందేమిటీ, ఇక్కడి నుంచి అది తీసుకున్నదేమిటీ... అనే ప్రశ్నలతో లోలోతుల్లోకి వెళ్లి పరిశోధించారు. ఆ పరిశోధనా ఫలాలనే అరటి పండు ఒలిచిపెట్టినంత చక్కగా పాఠకులకి అందించగలిగారు.

- అంకిత

తథాగతుని అడుగుజాడలు
రచన: రాణీశర్మ ఈమని, ఉణుదుర్తి సుధాకర్‌
పేజీలు: 192; వెల: రూ. 180/-
ప్రతులకు: హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు