close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అంతేగా! అంతేగా!

- డి.సూరిబాబు

‘‘నాకొడుకు బంగారం... మీ అందరి కొడుకుల్లా కాదు, వాడు అమ్మకు చెప్పనిదే ఒక్క పనీ చెయ్యలేడు. అమ్మను చూడందే ఒక్క నిమిషమైనా ఉండలేడు’’ కొడుకు మీద కొండంత ప్రేమతో అంది కోటేశ్వరమ్మ.
‘‘ఆ, చూస్తాంగా మేమూ... మీ తల్లీకొడుకుల అనురాగాలు ఎన్నాళ్ళో. ఈ కాలం పెళ్ళాలొచ్చేవరకే  కొడుకులు. ఆ తరవాత కోడలి చేతి కీలుబొమ్మలు’’ అంది పక్కింటి తిరుపతమ్మ.
‘‘నిజమే, బాగా చెప్పావు. నా కొడుకైతే పెళ్ళాం వచ్చేవరకు కూడా కాదు, కాలేజీ రోజుల్నుంచే నా మాటంటే వినడు. నేనేం చెప్పినా పడదు. అప్పుడే మొదలైపోతుంది అమ్మ మాటలు చాదస్తమనే అభిప్రాయం’’ నిట్టూర్చింది పై ఇంటి జానకమ్మ.
‘‘నా కొడుకు మాత్రం చాలా మంచోడూ, అమాయకుడూనూ. పెళ్ళికి ముందు వరకూ నా మాటే వేదమనేవాడు. ఈమధ్య పెళ్ళయి ఆర్నెల్లయ్యిందో లేదో ఆ వగలాడి ఏం మందు పెట్టిందోగానీ నేను ఎడ్డెమంటే తెడ్డెమంటున్నాడు’’ బాధగా అంది  ఎదురింటి అనంతమ్మ.
‘‘మీరెన్నయినా చెప్పండి... నా కొడుకు ఇప్పుడెలా ఉన్నాడో పెళ్ళయ్యాక కూడా అలాగే ఉంటాడు. కావలిస్తే పెళ్ళాన్ని కూడా నా మాట వినేలా చేస్తాడు చూస్తుండండి, నా మాట నిజమని మీరే ప్రత్యక్షంగా చూసి మరీ ఒప్పుకుంటారు’’ పందెం కాస్తున్నట్టే ధీమాగా చెప్పింది కోటేశ్వరమ్మ.
‘‘సర్లే, పదండి... ఇళ్ళకెళ్దాం, కోడళ్ళూ కొడుకులూ మనవలూ వచ్చే సమయం అవుతోంది. మన కొడుకులకు పెళ్ళిళ్ళయి అనుభవిస్తున్నాం కాబట్టి చెప్పాం- తనకూ తెలిసొస్తుందిలే. ఎంత... ఇంకో రెండు నెలల్లో కొడుకు పెళ్ళి నిశ్చయమైంది కదా. ఈ రోజుకి సరిగ్గా ఆర్నెల్లకంతా మనతోనే ఆ సంగతులన్నీ చెప్పుకుని బోరుమనకా పోదు, మనం ఓదార్చకపోము’’ అంటూ పిచ్చాపాటీ ముగించి అందర్నీ ఇళ్ళకు బయలుదేరదీసింది తిరుపతమ్మ.

*  *  *   *  *

పెళ్ళి వైభవంగా జరిగిపోయింది. పదహార్రోజుల పండుగ, హనీమూన్‌లు కూడా అయిపోయి కోటేశ్వరమ్మ కొడుకు భరణి పెట్టిన సెలవు ముగిసి ఆఫీసుదారి పట్టాడు. పనమ్మాయి ఉదయం అయిదున్నరకే కాలింగ్‌ బెల్‌ కొడితే, ఎలాగూ మెలకువ వచ్చేస్తుంది కాబట్టి కోటేశ్వరమ్మ తలుపు తీస్తుంది. ఇల్లు తుడవటం, దగ్గరుండి గిన్నెలు కడిగించటం, బట్టలు ఆరేయించి అది వెళ్ళేసరికి ఏడు గంటలవుతుంటే, అప్పుడు నిద్రలేచి ముఖం కడిగి బాల్కనీలో పేపర్‌ చూసుకుంటూ కనిపించింది కొత్త కోడలు ఉష.
ఏదో కొత్త కదా అనుకుని మొదటిరోజు ముగ్గురికీ కాఫీ కలిపి కొడుకు చేతికి రెండు కప్పులిచ్చి తానొకటి పుచ్చుకుని హాల్లో టీవీ చూస్తూ తాగాక, తను చూస్తున్న అరగంట ప్రోగ్రామ్‌ ముగిసినా భర్తతో కబుర్లు మాని వంటగది వంకే రాలేదు కోడలు. మొదట్నుంచీ గ్రిప్‌లో పెట్టుకోకుంటే అత్తగారి నెత్తిన కూర్చుని ఆడిస్తుందన్న భయంతో తనూ అలాగే సోఫాని అంటిపెట్టుకుని ఉండిపోయింది. కోడలు కూడా ఉద్యోగినే కదా - ఏం వండి పట్టుకుపోతుందో చూద్దామని. తొమ్మిదింటికి ఇద్దరూ స్నానాలు ముగించి బ్యాగులు వీపుకేసుకుని ‘బై బై’ అంటూ బయటపడ్డారు.
‘వార్నాయనో! చూడబోతే అక్కడ పక్కనవాళ్ళు అన్నట్టే నా ఇంట్లోనూ జరిగేలా ఉందే. దీన్ని మొగ్గలోనే తుంచకపోతే అందరిముందూ చులకనైపోతాను’ అనుకుంది కోటేశ్వరమ్మ.
సాయంత్రం ఆరున్నరా ఏడింటికల్లా ఇంటికొచ్చేసే కొడుకు ఆరోజు రాత్రి తొమ్మిదైనా రాలేదు. కోడలూ అంతే! ఎలాగైనా కోడలితోనే రాత్రి వంట చేయించి తినాలన్న కోరిక ఆదిలోనే హంసపాదై, ఆకలికి తనకైనా కావాలి కదా అనుకుని దోసెలపిండి ఉంటే వేసుకుని తిని పడుకుంది. రాత్రి పదింటికి వచ్చారిద్దరూ. ముభావంగా ఎందుకింత లేటైందనైనా అడక్కుండా తన గదిలోకి వెళ్ళిపోయింది కోటేశ్వరమ్మ. వాళ్ళు కూడా ఆఫీసులయ్యాక అట్నుంచటే సినిమా చూసి వస్తున్నామన్న రీజన్‌ చెప్పాలనుకోనూ లేదు.
మర్నాడు ఉదయం పనిమనిషి ఎంత కాలింగ్‌బెల్‌ కొట్టినా లేవలేదు కోటేశ్వరమ్మ. నిద్రకు డిస్ట్రబ్‌ అయ్యి కొడుకే వెళ్ళి తలుపు తీశాడు. ఆ తరవాత లేచి తనకోసం మాత్రమే కాఫీ కలుపుకుంది. కనీసం కాఫీ అయినా లేకపోయేసరికి అప్పుడు అమ్మ గుర్తొచ్చి ‘‘అమ్మా, కాఫీ’’ అన్నాడు.
‘‘ఇంకా నేనెందుకు కాఫీ ఇస్తాన్రా. నీ కొత్త పెళ్ళాన్నడుగు. అసలు, నాక్కూడా తనే ఇవ్వాల్సింది. ఇంట్లో పెద్దా చిన్నా అన్న మర్యాదా గౌరవమూ ఏమన్నా ఉంటే కదా?’’ అంటూ తాగేసిన గ్లాసు పనమ్మాయి చేతికిచ్చి టీవీ చూస్తూ కూర్చుంది.
తప్పదన్నట్టు భార్యను నిద్రలేపాడు ‘‘ఉషా, త్వరగా కాఫీ కలుపు. నేను స్నానానికెళ్ళాలి’’ అంటూ.
దుప్పటి ముఖమ్మీది నుంచి తీసి సెల్‌ఫోన్‌లో టైమ్‌ చూసి ‘‘ఆరున్నరేగా... అప్పుడేనా? నాకసలే కాఫీ కలపటం సరిగా రాదు. అత్తయ్యను అడగవా ప్లీజ్‌... అలాగే నాక్కూడా’’ అంది.
‘‘అడిగా. కొత్త కోడలొచ్చాక కూడా నేనెందుకు కాఫీ ఇవ్వాలీ, అసలు నాక్కూడా కోడలే కదా ఇవ్వాలీ... అని, అమ్మ కోపంగా ఉంది’’ చెప్పాడు కప్‌బోర్డులోంచి బట్టలు తీసుకుంటూ.
‘‘అదేంటీ, అలా అయితే నువ్వు పెట్టొచ్చుగా. నేనూ నీకన్నా ఎక్కువ శాలరీకి ఉద్యోగం చేస్తున్నా కదా, ఆవిడేం చేస్తుంటారు ఇంట్లో? ఖాళీగా ఉంటే ఏం తోస్తుందట? మా అమ్మ అలాగే అనేది- నేను ఏ పనైనా చెయ్యబోతే. అమ్మకూ అత్తకూ అదే తేడా. అమ్మలేమో ఉద్యోగం చేస్తోంది కదా... అలసిపోతుందని అర్థం చేసుకుంటారు. అత్తలు మాత్రం సంపాదించే కోడలూ కావాలి, ఇంట్లోనూ చాకిరీ చేయాలి అంటారు’’ విసుక్కుంది ఉష.
‘‘అమ్మాయివై ఉండి నీతోనే మీ అమ్మ పని చేయించలేదంటున్నావ్‌ కదా... ఇక అబ్బాయినైన నాతో మా అమ్మెలా పని చేయిస్తుందనుకున్నావ్‌? నీకు కనీసం కాఫీ పెట్టడమైనా వచ్చు. నాకైతే అదీ రాదు. ప్లీజ్‌... ఇక మాటలు కట్టిపెట్టి లేవవా?’’ అన్నాడు భరణి బాత్‌రూమ్‌లోకెళ్ళి తలుపు వేస్తూ.
‘‘అయితే వెళ్ళి క్యాంటీన్‌లోనే తాగండి’’ చెప్పింది మళ్ళీ ముసుగు పెట్టుకుంటూ.
‘‘ఛీ ఛీ... అందుకే నా ఫ్రెండ్స్‌ ముందే అన్నారు... పెళ్ళయ్యాక మొదలవుతుంది అసలు నరకమని. ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది నా బతుకు’’ అని విసుక్కుంటూ తనే వెళ్ళి కాఫీ కలుపుకుని తాగి, ఫ్రెషప్‌ అయి తనపాటికి తను ఆఫీసుకెళ్ళిపోయాడు.
లేటుగా నిద్రలేచిన ఉష అత్తగారిని అసలు పట్టించుకోకుండా తయారై వెళ్ళిపోయింది. సాయంత్రం భరణికంటే తొందరగా ఇంటికొచ్చేసి, హాల్లోనే కూర్చుని ఫోన్‌లో తల్లికి అత్తగారి మీద కంప్లయింట్‌ చేస్తూ మాట్లాడటం మొదలుపెట్టింది. ‘అమ్మా,
నాకిక్కడ ఉండాలనిపించడం లేదు. మనింటికి వచ్చేస్తా. మా అత్తగారు కావాలనే సాధిస్తున్నారు. ఆవిడ మాటలే మా ఆయనకు వేదం. ఆమెకు బుద్ధి చెప్పుకోలేక నామీద చిందులేస్తున్నారు’ అంటూ.
అవతల ఏమి రెస్పాన్స్‌ వచ్చిందోగానీ బ్యాగు పుచ్చుకుని అమ్మగారింటికి ప్రయాణమైపోయింది ఉష. భర్తకు మాత్రం ఫోన్‌ చేసి ‘నేను మా అమ్మా వాళ్ళింటికి వెళ్తున్నాను’ అని చెప్పింది.
కోటేశ్వరమ్మకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంకైనట్టనిపించింది. ఈ కాలం ఆడపిల్లలు మరీ ఇలా ఉన్నారా? మా రోజుల్లో అత్తగారు ఎన్ని ఆరళ్ళు పెట్టినా ఎంత భరించాం. పైగా పుట్టింటివాళ్ళకు బాధలు చెప్పుకున్నా, అత్త చెప్పినట్లు నడుచుకొమ్మనేవాళ్ళు. ఇప్పటి తల్లిదండ్రులు ‘అయితే, వచ్చెయ్‌ అంటున్నారే’ అనుకుంది.

*  *  *   *  * 

భరణి రాత్రి ఎనిమిదింటికి ఇంటికొచ్చాడు. తల్లి భోజనం వడ్డిస్తుంటే ‘‘అమ్మా, నిజంగా నువ్వు చెయ్యలేకపోతే చెప్పు, వంటమ్మాయిని పెట్టుకుందాం. నీకూ శ్రమ తగ్గుతుంది. అంతేకానీ, మీ కాలంలోలాగా కోడలిని
సాధించడం, అలగటం లాంటివి వద్దు.
మాకసలే ఆఫీసు పని ఒత్తిడే ఎక్కువగా ఉంటే, ఈ కోపాలూ సర్దిచెప్పుకోడాలూ సంజాయిషీ ఇచ్చుకోడాలూ... ఇవన్నీ ఎక్కడపడతాం’’ అన్నాడు.
‘‘అదేంట్రా అలా అంటావ్‌... నేనిప్పుడేమన్నానని? ఎంత ఉద్యోగం చేసినా ఆడపిల్ల. పైగా పెళ్ళయి అత్తవారింటికొచ్చిన కొత్త కోడలు కదా. ఏదో కాస్త అత్తగారిని పలకరిస్తూ ఓ అయిదు నిమిషాలు, కాఫీ అయినా కలుపుకుంటే బాగుంటుంది కదా అని చెప్పాను. మధ్యాహ్నం, రాత్రీ నేనేగా వంట చేస్తున్నా. పెళ్ళికి ముందు నువ్వయినా కాస్త డైనింగ్‌ టేబుల్‌ దగ్గర నోరు విప్పి మాట్లాడేవాడివి. ఇప్పుడా రెండు ముక్కలూ నీ భార్య దగ్గర మాట్లాడేసి నన్నో మరయంత్రంలా చూస్తున్నారు. అంతేలేరా, పెళ్ళాం బెల్లమైంది, అమ్మ అల్లమైంది. అందరు కొడుకుల్లాగే నువ్వూనూ. నన్నేదైనా వృద్ధాశ్రమంలో చేర్చెయ్యి’’ అంది ముక్కు చీదుతూ కోటేశ్వరమ్మ.
‘‘అబ్బబ్బా... ఏడుపులు ఆపమ్మా. నాకు భరించే ఓపిక లేదు’’ అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కోటేశ్వరమ్మ బాగా హర్టయింది. మర్నాడు బ్యాగు తీసుకుని ‘‘నేను మామయ్యవాళ్ళ ఊరెళ్తున్నా’’ అనేసి, ఆటోలో బస్‌స్టాండ్‌కి వెళ్ళిపోయింది - దింపడానికి కొడుకు సహాయమైనా ఆశించకనే.

*  *   *  *  *

బెంగళూరులోని అన్నయ్యా వదినల దగ్గరికి చేరేసరికి ఇద్దరూ ఇంట్లో రెండేళ్ళ మనవణ్ణి ఆడించుకుంటూ, ఏడాది మనవరాలిని నిద్రపుచ్చుతూ కనిపించారు.
‘‘అదేమిటి వదినా, ఈ వయసులో మీకీ శ్రమ ఎందుకు, కోడలేమైంది?’’ అంటూ అడిగింది.
‘‘పాపం ఇద్దరూ ఉదయం ఆరింటికొకరూ ఏడింటికొకరు ఉద్యోగాలకెళ్తారు. రావటం ఏ ఏడింటికో, ఎనిమిదింటికో. వాళ్ళూ మనుషులే కదా... వస్తూనే అలసిపోయి స్నానాలు ముగించి, తిని పడుకుంటారు. ఓ అరగంట పిల్లలతో గడుపుతారు. అయినా, ఈ వయసులో మనవలతో ఆడుకోవటమేగా మనకూ కావలసింది’’ అంటూ పిల్ల నిద్రపోయిందని నిర్ధారించుకుని భోజనం వడ్డించింది వదిన.
‘‘అదేమిటి అన్నయ్యా, అంత బిజీగా ఉంటే  ముందుముందు పిల్లల్నీ మిమ్మల్నీ ఏం చూసుకుంటారు?’’ అంది కోటేశ్వరమ్మ కంచంముందు కూర్చుంటూ.
‘‘ఎన్నాళ్ళులే. పిల్లలు కాస్త పెద్దయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. స్కూళ్ళకెళ్తారు.
ఈ వయసులోనే కదా వాళ్ళు సంపాదించుకోగలిగింది. మాకంతగా చేతకాకపోతే మనిషినైనా పెడతారు లేదంటే కోడలో కొడుకో ఉద్యోగం మానేసి చూసుకుంటారు. అయినా, ఈ మాత్రానికి వాళ్ళకు ఇబ్బంది ఎందుకు కలిగించాలి? అదీగాక పొద్దస్తమానం టీవీలకు అంటుకుపోకుండా పిల్లలతో గడిపితే, మాకూ మంచి వ్యాయామం. లేనిపోని మనసు పాడవటాలు లేకుండా హాయిగానే ఉన్నాం’’ అన్నాడు అన్నయ్య కూడా.
ఆ రాత్రి కోటేశ్వరమ్మకు నిద్రపట్టలేదు.
సాయంత్రం కోడలు ఆఫీసు నుంచి వచ్చి ఫ్రెషప్‌ అయి, అత్తగారిచ్చిన కాఫీ తాగుతూ ‘థ్యాంక్స్‌ మమ్మీ’ అంటూ కూతురికంటే ప్రేమగా కావలించుకుంది. అలాగే, తనను పరిచయం చేయగానే ఎంతో ఆప్యాయంగా పలకరించింది. అన్నయ్యతో అయితే మామగారన్న తారతమ్యం లేకుండా ‘‘పప్పా, మీరెళ్ళి త్వరగా పడుకోండి... నేనొచ్చేశాగా, చూసుకుంటా వీళ్ళని’’ అంటూ చేయి పట్టుకుని తన భుజం ఆసరా ఇచ్చి మరీ గదిలోకి తీసుకెళ్ళి వదిలొచ్చింది. కొడుకూ అంతే. మరో అరగంట లేటుగా వచ్చినా ‘‘సారీ మా, ఇవాళ కాస్త లేటైంది’’ అని, అందరితో భోజనం చేస్తున్న పది నిమిషాలైనా ఎంతో ప్రేమగా మాట్లాడి, వాళ్ళమ్మ ‘‘సర్లేరా, ఇక నువ్వెళ్ళి రెస్ట్‌ తీసుకో’’ అన్నాకే గదిలోకెళ్ళాడు.
రాత్రి పిల్లల్ని తమ గదిలోనే పడుకోబెట్టుకుని పెద్దవాళ్ళను హాయిగా నిద్రపోనిచ్చారు. వాళ్ళ మందులు సరిగ్గా తీసుకున్నారో లేదో గుర్తుపెట్టుకుని కనుక్కున్నారు. ఇంటిపనికంతా పనమ్మాయి ఉంది. వంటకూ పెడతామంటే, వదినే వద్దంటున్నట్టు తెలిసింది. మర్నాడు ఉదయం ‘ఇంటికెళ్తా అన్నయ్యా’ అంటూ, మరో రెండు రోజులుండమని వాళ్ళెంతగా బలవంతం చేసినా ఆగకుండా బయల్దేరింది కోటేశ్వరమ్మ.

*  *   *  *  *

ఉష అమ్మ వాళ్ళింటికి వెళ్ళేసరికి, అనుకోకుండా అర్జెంట్‌ పనిపడి వాళ్ళు వేరే ఊరెళ్ళారని పక్కింటివాళ్ళు చెప్పారు. తిరిగి అత్తగారింటికెళ్తే చులకనవుతుందని, ఊళ్ళోనే ఉంటున్న తన పెదనాన్న కూతురు మమత వాళ్ళింటికెళ్ళింది.
మమత చాలా ఆశ్చర్యపోయింది- అనుకోకుండా ఉష వచ్చినందుకు. ‘‘రావే, రా... ఏమిటీ దేవిగారికి మా ఇంటిమీద ఇంత దయ కలిగింది?’’ అంటూ సాదరంగా ఆహ్వానించింది.
‘‘ఎవరు మమతా వచ్చింది?’’ అంటూ వచ్చింది వాళ్ళత్తగారు.
‘‘మా పెద్ద బాబాయ్‌గారి కూతురు ఉష అత్తమ్మా’’ చెప్పింది మమత.
‘‘అవునా... లోనికి తీసుకెళ్ళు. ఎండనపడి వచ్చినట్టుంది. ముఖం కడుక్కోమని, నిమ్మరసం ఇవ్వు’’ అనేసి టీవీ చూడ్డంలో లీనమైంది.
మమత నిమ్మరసం చల్లటి కుండనీళ్ళతో ఇచ్చింది. సాయంత్రం మమత కూతురు ఆరవ తరగతి చదివే నవ్య స్కూలు నుంచి వచ్చింది. తల్లికన్నా ముందుగా ‘హాయ్‌... గ్రానీ!’ అంటూ నానమ్మ దగ్గర స్కూలు కబుర్లన్నీ చెప్పి, అప్పుడు గదిలోకి వెళ్ళి ఫ్రెషప్‌ అయింది.
మమత స్నాక్స్‌, పాలూ ఇచ్చాక ఉషను పలకరించి హోమ్‌వర్క్‌ చేసుకోవటానికి వెళ్ళిపోయింది.
‘‘అదంతేనే. పనులు చేసిపెట్టడానికేమో నేనూ వాళ్ళ డాడీ కావాలిగానీ, గారాలు పోవటానికి మాత్రం గ్రానీనే కావాలి’’ కోపగించుకోకుండా మురిపెంగా చెప్పింది మమత.
ఆఫీసు నుంచి వచ్చిన బావగారు ఉషను ఎంతో ఆత్మీయంగా పలకరించారు. ‘‘మీవారూ, అత్తగారూ కూడా వస్తే బాగుండేది. ఈసారి ముగ్గురూ రండి’’ అన్నాడు.
ఇంట్లో వాళ్ళంతా రాత్రి తొమ్మిదింటికే హాయిగా ఏ కలతా లేకుండా గాఢనిద్రలో ఉంటే, ఉషకు మాత్రం నిద్రపట్టలేదు.
ఇదేంటి... మమతక్క అత్తగారిని చూసుకోడానికి- ఆమెకు ఇంట్లో తోడెవరూ ఉండరని చేస్తున్న ఉద్యోగం మానేసిందా? అలాగని ఆవిడేమీ జబ్బు మనిషో చేతగాని మనిషో కాదు. తన అత్తగారికన్నా ఎంతో ఆరోగ్యంగా చలాకీగా ఉన్నారు. అస్తమానం ఆవిడకెంతో ప్రాధాన్యత ఇస్తూ ‘అత్తయ్య, ఈ వంట చేద్దామా?’, ‘అదైతే నాకు రాదు. మీరు చెప్పండి నేర్చుకుంటా’, ‘ఎక్కువసేపు కూర్చోవద్దూ’, ‘ఈ వంట మీ ఆరోగ్యానికి మంచిదని చేశా’ అంటూ ఉంది.
బావగారు కూడా తల్లి ఏమి చెప్పినా ‘అదేంటో నాకు తెలీదమ్మా. నువ్వూ,
నీ కోడలూ. మీ ఇష్టం’ అనీ, భార్య ఏమి చెప్పినా ‘హోమ్‌ మినిస్టర్‌ గారూ,
ఇంటి విషయాలు నాతో చెప్పొద్దు. మీ ఇష్టం, మీ అత్తగారి ఇష్టం’ అనీ చాలా గడుసుగా మాట్లాడి తన పనిలో తానుంటాడు.
నిజానికి ఎవరూ ఒకరి అదుపాజ్ఞల్లోనూ లేరు. అలాగని విచ్చలవిడి స్వేచ్ఛతో ‘నా ఇష్టం’ అన్న అహంతోనూ లేరు.
ఒకరితో ఒకరు చాలా మంచి అనుబంధంతో హ్యాపీగా ఉన్నారు. ఉదయం నిద్రలేచేసరికి ఏడున్నర అయింది సమయం.
‘‘మంచి నిద్రలో ఉన్నావని లేపలేదే.
ఆఫీసుకేమైనా టైమైపోయిందా?’’ అడిగింది కాఫీ ఇస్తూ మమత.
‘‘అబ్బే, నేనివాళ ఆఫీసుకేం పోవట్లేదక్కా. మా అత్తయ్యా మావారూ ఊరు నుంచి వచ్చేసి ఉంటారు. నేను ఇంటికెళ్తా’’ చెప్పేసి అత్తింటి అడ్రస్‌ చెప్పి ఓలా క్యాబెక్కింది ఉష.

*  *  *  *  *

‘‘ఉషా... ఈ సండే మూవీకెళ్దామోయ్‌’’ అన్నాడు భరణి, పెరుగన్నంలో మామిడిపండు ముక్కలు నంజుకుంటూ.
‘‘ఏమో మరి, అత్తయ్య కూడా వస్తానంటే వెళ్దాం’’ చెప్పింది ఉష మంచినీళ్ళు గ్లాసులో నింపుతూ.
‘‘నేనెందుకురా, పిల్లలు మీరేదో సరదాగా వెళ్తుంటే’’ అంది కోటేశ్వరమ్మ.
‘‘అదేంకాదు కానీ, అప్పుడప్పుడూ థియేటర్‌కెళ్ళి చూస్తే కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది రండత్తయ్యా’’ అంది ఉష.
‘‘అమ్మా, మూడు టిక్కెట్స్‌ ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తున్నా, సరేనా?’’ అడిగాడు భరణి.
‘‘కోడలు చెప్పాక తప్పుతుందా. అంతేగా!’’ అంది కోటేశ్వరమ్మ.
‘‘అలా ఏం కాదు. ఒంటరిగా ఇక్కడైనా మీరూ టీవీ చూస్తుంటారు కదా. అందుకే రమ్మన్నా అత్తయ్యా. మీకు ఇబ్బందైతే చెప్పండి మానేద్దాం’’ అంది ఉష.
‘‘నాకోసం ఎందుకమ్మా, వెళ్దాంలే. కానీ, బయటి చిరుతిళ్ళు తినకూడదు. సరేనా మరి?’’ అంది కోటేశ్వరమ్మ.
‘‘మా ఆరోగ్యం కోసమే కదా మీరు చెప్పేది. అయినా, ఇంటినిండా మీరు చేసిన పాకంపప్పూ అరిసెలూ చెక్కలూ నువ్వుల పట్టీలూ అటుకుల మిక్స్చరూ... ఇన్ని ఉండగా అక్కడి చెత్త ఏం తింటామత్తయ్యా. ఏమండీ అంతేగా?’’ అడిగింది ఉష.
‘‘మీరిద్దరూ ఒక అండర్‌స్టాండింగ్‌ కొచ్చాక నేనేమంటానిక? అంతేగా!’’ నవ్వుతూ అన్నాడు భరణి.
తమ అంచనాలు తారుమారైనందుకు ఇరుగుపొరుగున ఉండే కోటేశ్వరమ్మ స్నేహితురాళ్ళు ఒకరితో ఒకరు ‘ఈ కాలంలో ఇలా ఎలా ఒద్దిగ్గా ఉంటారే? అయినా, ఈ భోగం ఇంకెన్నాళ్ళులే. త్వరలోనే పోట్లాడుకోరూ’ అనుకుని తమ అహాన్ని చల్లబరుచుకున్నారు.
వాళ్ళ పిచ్చిగానీ, ఒకర్నొకరు అంత బాగా అర్థంచేసుకున్న కుటుంబాల్లో పొరపొచ్చాలు ఎందుకొస్తాయంటారు?
‘అంతేగా! అంతేగా!!’

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.