close

వడ్డించేద్దామా... దప్పళం..!

వెజిటబుల్‌ కడి

కావలసినవి
కాలీఫ్లవర్‌ ముక్కలు: కప్పు, వంకాయలు: రెండు, బంగాళాదుంపలు: మూడు, టొమాటోలు: మూడు, బెండకాయలు: 10, బఠాణీ: కప్పు, పచ్చిమిర్చి: ఆరు, దొండకాయలు: రెండు, కరివేపాకు: 5 రెబ్బలు, జీలకర్ర: టీస్పూను, కారం: టేబుల్‌స్పూను, పసుపు: టీస్పూను, సెనగపిండి: అరకప్పు,
నిమ్మకాయలు: రెండు, మెంతులు: టీస్పూను, ఉప్పు: తగినంత, మంచినీళ్లు: 4 కప్పులు,
నూనె: 4 టీస్పూన్లు
తయారుచేసే విధానం
* టొమాటోలూ పచ్చిమిర్చీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.
* కుక్కర్‌లో నూనె వేసి జీలకర్ర, మెంతులు వేసి వేగాక సెనగపిండి కూడా వేసి వేయించాలి. తరవాత టొమాటో-పచ్చిమిర్చి ముద్ద వేసి కాసేపు వేయించాలి. ఇప్పుడు కారం, ఉప్పు వేసి కలిపి కూరగాయల ముక్కలన్నీ వేసి కాసేపు మగ్గనివ్వాలి. తరవాత నీళ్లు పోసి మూడు విజిల్స్‌ రానివ్వాలి. 
చల్లారాక మూత తీసి కరివేపాకు రెబ్బలు వేసి, ఓ నిమిషం మరిగించి దించాలి.

గుమ్మడికాయ దప్పళం

కావలసినవి
గుమ్మడికాయ ముక్కలు: 2 కప్పులు, కందిపప్పు: పావుకప్పు, సాంబారు ఉల్లిపాయలు: పది, ఎండుమిర్చి: రెండు, పసుపు: అరటీస్పూను, కారం: 2 టీస్పూన్లు, మెంతిపొడి: టీస్పూను (వేయించి పొడిచేసినది), కరివేపాకు: 2 రెబ్బలు, ఆవాలు: టీస్పూను,
చింతపండు గుజ్జు: 2 టేబుల్‌స్పూన్లు, బెల్లంతురుము: టేబుల్‌స్పూను, ఇంగువ: చిటికెడు, నూనె: 2 టేబుల్‌స్పూన్లు, దప్పళంపొడి కోసం: సెనగపప్పు: టేబుల్‌స్పూను, మినప్పప్పు: అర టేబుల్‌స్పూను, దనియాలు: టేబుల్‌స్పూను, జీలకర్ర: టేబుల్‌స్పూను, ఎండుమిర్చి: ఒకటి, కొబ్బరి తురుము: 4 టేబుల్‌స్పూన్లు, నూనె: టీస్పూను
తయారుచేసే విధానం
* బాణలిలో నూనె వేసి దప్పళం ముద్ద కోసం తీసుకున్నవన్నీ (కొబ్బరి తప్ప) వేసి వేగాక చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి. తరవాత కొబ్బరితురుము కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి.
* గుమ్మడికాయ ముక్కల్లో కాసిని నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించి ఉంచాలి.
* చిన్న కుక్కర్‌లో పప్పు వేసి, పసుపు వేసి ఉడికించి దించాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, మెంతిపొడి, ఇంగువ వేసి వేయించాలి. తరవాత ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు, కారం వేసి కలపాలి. రుబ్బిన ముద్ద వేసి తగినన్ని నీళ్లు పోసి ముక్కపూర్తిగా మెత్తబడేవరకూ ఉడికించాలి. తరవాత మెత్తగా మెదిపిన పప్పు, చింతపండు పులుసు వేసి మరిగించాలి. ఇప్పుడు బెల్లం, ఉప్పు వేసి కలిపి రెండు నిమిషాలు మరిగించి దించాలి.

దప్పళం

కావలసినవి
చిలగడదుంప: ఒకటి, మునక్కాడ: ఒకటి, టొమాటోలు: రెండు, బెండకాయలు: ఆరు,
వంకాయలు: రెండు, గుమ్మడికాయ ముక్కలు: కప్పు, సొరకాయ ముక్కలు: కప్పు, పచ్చిమిర్చి: ఆరు, సెనగపిండి: 2 టీస్పూన్లు, బెల్లం తురుము: 3 టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర: కట్ట, చింతపండుగుజ్జు: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, పసుపు: టీస్పూను, కారం: 2 టీస్పూన్లు, తాలింపుకోసం: నూనె: 2 టీస్పూన్లు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు: కొద్దికొద్దిగా
తయారుచేసే విధానం
* ఓ గిన్నెలో కూరగాయ ముక్కలూ ఉప్పూ పసుపూ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. అవి బాగా ఉడికిన తరవాత సన్నగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు, బెల్లం తురుము, చింతపండు గుజ్జు, కారం వేసి మరికాసేపు ఉడికించాలి. ముక్కలు పూర్తిగా ఉడికిన తరవాత విడిగా బాణలిలో నూనె వేసి కాగాక తాలింపుదినుసులన్నీ వేసి దప్పళంలో కలపాలి.
*తరవాత సెనగపిండిలో కాసిని నీళ్లు పోసి జారుగా కలిపి ఆ నీటిని దప్పళంలో వేసి ఉండలు కట్టకుండా కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి దించాలి.

మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ స్ట్యూ

కావలసినవి
క్యారెట్లు: రెండు,
బంగాళాదుంపలు: రెండు, మునక్కాడలు: రెండు, బీన్స్‌: నాలుగు, బఠాణీలు:
పావుకప్పు, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు,
అల్లం తురుము: టీస్పూను, వెల్లుల్లి రెబ్బలు: మూడు, దాల్చినచెక్క: అంగుళంముక్క, లవంగాలు: నాలుగు, మిరియాలు: టీస్పూను, యాలకులు: మూడు,
కొబ్బరిపాలు: మూడున్నర కప్పులు,
కరివేపాకు: రెండు రెబ్బలు, ఉప్పు: తగినంత, నూనె: 2 టేబుల్‌స్పూన్లు
తయారుచేసే విధానం
*కూరగాయలన్నీ ముక్కలుగా కోయాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు వేసి వేయించాలి. తరవాత అల్లం తురుము, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తరవాత కూరగాయముక్కలన్నీ వేసి కలిపి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు కొబ్బరి పాలు పోసి ముక్కలు మెత్తగా అయ్యే వరకూ సిమ్‌లో ఉడికించి దించాలి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.