close

సత్యాన్ని పలికించే... నాగేశ్వరుడు!

‘వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం... వందే పన్నగ భూషణం మృగధరం వందేపశునాం పతిం’అంటూ భక్తులు ఈశ్వరుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈశ్వరుడిని పూజిస్తే ఆయురారోగ్యాలూ అష్టైశ్వర్యాలూ సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఇదే విశ్వాసంతో భక్తులు కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో కొలువైన నాగేశ్వరుడిని నిష్ఠతో కొలుస్తున్నారు. శివుడు లింగాకృతిలో కాకుండా నాగసర్ప రూపంలో దర్శనమివ్వడం, దుర్గ-పార్వతి లతో కొలువుదీరడం ఇక్కడ ప్రత్యేకత.

స్థల పురాణం ప్రకారం... ప్రస్తుతం పెద్దకళ్లేపల్లి నాగేశ్వరస్వామి క్షేత్రం ఉన్న ప్రాంతంలో పూర్వం పెద్ద పాముల పుట్ట ఉండేది. ఆ ప్రాంతానికి ప్రతిరోజూ మేత కోసం వచ్చే ఓ ఆవు పుట్టకు ఉన్న కలుగులోకి పాలను ధారగా విడుస్తుండేది. దీన్ని గమనించిన కొందరు ఆ పుట్టలో ఏదో మహత్యముందని భావించి తవ్వారు. కొంతసేపటికి సర్ప రూపంలోఉన్న స్వామి పుట్టను చీల్చుకుని ఉద్భవించాడు.  ఇక్కడ స్వామి లింగాకృతిలో కాకుండా నాగసర్ప రూపంలో దర్శనమిస్తుండటంతోనే నాగేశ్వరస్వామి అన్న పేరు వచ్చిందని పూర్వికులు చెబుతారు. దక్షిణదేశ యాత్రకు బయలుదేరిన అగస్త్య మహాముని పెదకళ్లేపల్లి సమీపంలో నాగేశ్వరస్వామి ఉన్నట్లు గుర్తించాడనీ, అక్కడ పార్వతీదేవి విగ్రహాన్ని అగస్త్యుడే ప్రతిష్ఠించాడనీ మరికొందరు చెబుతుంటారు.

ఆలయ చరిత్ర
పెద్దకళ్లేపల్లిలో తొమ్మిది వందల ఏళ్లక్రితమే దుర్గాపార్వతీ సమేత నాగేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. పూర్వికులు చెప్పే వివరాల ప్రకారం... 1762లో చల్లపల్లి రాజా వంశీయులు ఈ ఆలయ నిర్వహణ బాధ్యతల్ని తీసుకున్నారు. చల్లపల్లి రాజా ఓ సారి కోర్టు వివాదంలో చిక్కుకున్నాడు. ఈ వివాదాన్ని పరిష్కరించేలా చూడాలంటూ రాజా వారు తమ ఇలవేల్పు అయిన విద్యాశంకరి అమ్మవారిని కోరాడు. స్పందించకపోవడంతో కలతచెందిన అతడు ఖడ్గంతో శిరచ్ఛేదన చేసుకున్నాడు. అమ్మవారు ఆయనకు పునర్జన్మ ప్రసాదించారు. తరవాత ఆమె సంకేతాల ప్రకారమే న్యాయమూర్తి... రాజా వారు నిర్దోషి అంటూ తీర్పు వెలువరించారని చెబుతుంటారు. అనంతరం అతడు... కృష్ణా నదిలోని వనదుర్గాదేవి విగ్రహాన్ని తీసుకువచ్చి నాగేశ్వరస్వామికి ఎడమ వైపున ప్రతిష్ఠించాడు. ఇలా ఓ వైపు దుర్గ, మరోవైపు పార్వతీదేవితో కొలువై ఉన్న నాగేశ్వరుడు భక్తుల పూజలందుకుంటున్నాడు.

ప్రత్యేకతలు...
ఆలయ ప్రాంగణంలో కాలభైరవుడితోపాటు భద్రకాళీ సమేత వీరభద్రుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయాలు ఉన్నాయి. పంచముఖ గణపతి ఇక్కడ సింహవాహనాధీశుడై దర్శనమిస్తాడు. ఇక్కడే అరవై అడుగుల ఎత్తైన సత్యస్తంభం ఉంది. నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకాలని చెప్పడానికే ఆలయంలో దీన్ని ఏర్పాటు చేశారని పూర్వికులు చెబుతున్నారు. ఈ స్తంభం వెనక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది... గ్రామంలోని ఇద్దరి మధ్య ఆస్తి తగాదా ఏర్పడింది. దాన్ని రాజావారు పరిష్కరిస్తున్న సమయంలో ఓ వ్యక్తి అసత్యం పలికాడు. వెంటనే ఆ స్తంభంలోని మూడో వంతు భాగం అబద్ధమాడిన వ్యక్తిపై పడిందనీ, దీంతో అతడు అక్కడే మృతిచెందాడనీ చెబుతుంటారు. ఆలయ ప్రాంగణంలో ముప్ఫై అడుగుల ఎత్తైన త్రినేత్రుడి విగ్రహం ప్రధానాకర్షణగా నిలుస్తోంది.

ఉత్సవాలూ, విశేష పూజలూ...
కార్తిక మాసంలో ఈ ఆలయంలో నిత్యం భక్తుల సందడి నెలకొంటుంది. ఈ మాసంలో లక్ష బిళ్వార్చన నిర్వహించడంతోపాటు ప్రత్యేక పూజలు చేస్తారు. మహాశివరాత్రి సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలూ, నాగుల చవితి వేడుకలూ, జన్మనక్షత్రం, శాకంబరి ఉత్సవాలూ వైభవంగా కొనసాగుతాయి.

చేరుకోవడం ఇలా...
విజయవాడ నుంచి కరకట్ట రహదారి మీదుగా అవనిగడ్డ వెళ్లే బస్సుల ద్వారా చల్లపల్లిలో దిగాలి. అక్కడి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఈ క్షేత్రానికి ఆటోలూ, ఇతర వాహనాల్లో చేరుకోవచ్చు. మచిలీపట్నం నుంచి వచ్చేవారు అవనిగడ్డ బస్సు ద్వారా చల్లపల్లిలో దిగి పెదకళ్లేపల్లిలోని ఆలయానికి చేరుకోవాలి.

- ముత్తా నారాయణరావు, ఈనాడు, అమరావతి
చిత్రాలు: కేఎన్‌ మూర్తి, మోపిదేవి
 
 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.