close
ఉద్యోగం కావాలా...శిక్షణ ఇస్తాం రండి!

ఉద్యోగం పొందామా... జీతం వచ్చిందా... కుటుంబంతో ఆనందంగా ఉన్నామా... ఈ రోజుల్లో ఉద్యోగాలు వచ్చిన వారిలో ఎక్కువమంది ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. కానీ, ఆ ఉద్యోగులు దీనికి భిన్నం. కొలువులు సాధించిన తరవాత తాము పడ్డ కష్టాల్ని మరచిపోలేదు. తమలాగే ఇతరులూ ఇబ్బందులు ఎదుర్కోవద్దన్న ఉద్దేశంతో ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం తడికోన గ్రామానికి చెందిన మోకా సత్తిబాబుది పేద కుటుంబం. చదువు వద్దని తండ్రి వారించినా వినకుండా పట్టుదలతో డిగ్రీ పూర్తిచేశాడు. ఎంఏ అనంతరం లెక్చరర్‌గా ఎంపికయ్యాడు. అయినా... సంతృప్తి చెందకుండా కష్టపడి చదివి డీఎస్పీ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం మచిలీపట్నం ఏఎస్పీగా కొనసాగుతున్న సత్తిబాబు... పదో తరగతి నుంచి డీఎస్పీగా ఎంపికయ్యే వరకూ ఆర్థికంగా ఎన్నో ఒడుదొడుకుల్ని ఎదుర్కొన్నాడు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్ని సాధించడానికి తన లాగానే ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని గ్రహించాడతడు. అలాంటి వారికి అండగా నిలుస్తూ ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకుని తన ఆలోచనను మిత్రులతో పంచుకున్నాడు. ఇలా... ఆరేళ్ల కిందట అమలాపురంలో ఓ కోచింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు శిక్షణను ప్రారంభించాడు. తరవాత ఈ శిక్షణను రాజమండ్రి, భీమవరం, ఏలూరు, మచిలీపట్నం ప్రాంతాలకు విస్తరించాడు. ఉద్యోగ ప్రకటనలు విడుదలవగానే పేద నిరుద్యోగుల్ని గుర్తించి శిక్షణ ఇస్తూ వారు జీవితంలో స్థిరపడేలా తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని అంశాల్ని స్వయంగా బోధిస్తుండగా... మరికొన్నింటిని నిపుణులతో బోధించే ఏర్పాట్లు చేస్తున్నాడు. కేంద్రాల నిర్వహణా, పోటీ పరీక్షలకు అవసరమయ్యే మెటీరియల్స్‌కూ సొంత డబ్బును ఖర్చు చేస్తున్నాడు. వీటి కోసం ఇప్పటి వరకూ ఆయన పది లక్షల జీపీఎఫ్‌, రెండు లక్షల వ్యక్తిగత రుణాన్నీ తీసుకున్నాడు. ఈయన ఆధ్వర్యంలో ఆరేళ్ల వ్యవధిలో సుమారు రెండు వేల మంది శిక్షణ తీసుకోగా అందులో నూటయాభై మంది దాకా ఎస్సై, పోలీస్‌ కానిస్టేబుల్‌, టీచర్‌, గ్రామ కార్యదర్శి, బ్యాంకు ఉద్యోగాల్ని సాధించారు.

నాన్న స్ఫూర్తితో...

రీంనగర్‌కు చెందిన మహ్మద్‌ బారి ఏఎస్సై. తన ఇద్దరు కొడుకులకూ దేశరక్షణా, ప్రజల భద్రత విషయాల్నే ఎక్కువగా వివరిస్తూ పోలీసు ఉద్యోగంలో చేరాలని ప్రోత్సహిస్తుండేవాడు. నాన్న కోరిక మేరకు కొడుకులు వసీం అక్రం, ఇమ్రాన్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు సాధించారు. వీరు ఉద్యోగంలో కొనసాగుతున్న సమయంలోనే తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అయినా... నాన్న నూరిపోసిన భావాలు ఆ ఇద్దరు కొడుకుల్లో చైతన్యం రగిలిస్తుండేవి. తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న వారిద్దరూ... పోలీస్‌ శాఖలో ఉద్యోగాలు సాధించేందుకు ఇతరులకూ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తండ్రి మరణానంతరం వచ్చిన డబ్బులోంచి లక్షన్నర వెచ్చించి 2013లో కరీంనగర్‌లో స్టార్‌ ఫౌండేషన్‌ను నెలకొల్పారు. మరికొందరు మిత్రుల సహకారంతో ఈ ఫౌండేషన్‌ ద్వారా నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం పోలీస్‌ కానిస్టేబుల్‌, ఆర్మీ నియామకాల కోసం ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. వీరి శిక్షణలో ఇప్పటి వరకు 9 మంది ఎస్సై, 22 మంది పోలీస్‌ కానిస్టేబుల్‌, 45 మంది ఆర్మీ ఉద్యోగాల్ని సాధించారు. మరికొందరు గ్రామ కార్యదర్శులుగా, ఫారెస్ట్‌ బీట్‌ అధికారులుగా నియమితులయ్యారు. ఇలా... ఓ వైపు ఉద్యోగాలు చేస్తూనే శిక్షణ ఇస్తూ నిరుద్యోగులకు బతుకుదారి చూపుతున్న వీరిని అభినందించాల్సిందే కదూ...!

సెలవుల్లో...

ప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలని విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పుర్రయవలసకు చెందిన కంది హేమంత్‌ కలలుకన్నాడు. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. చివరికి పదిహేడో ప్రయత్నంలో ఎయిర్‌ ఫోర్స్‌లో నాన్‌ టెక్నీషియన్‌గా ఉద్యోగం సాధించాడు. సరైన గైడెన్స్‌ లేకపోవడంతోనే ఉద్యోగాన్ని సాధించడం కష్టంగా మారిందని గుర్తించాడు. మిగిలిన నిరుద్యోగులూ తన లాగే ఇబ్బందులు ఎదుర్కోకుండా వారికి దిక్సూచిలా ఉండాలని 2015లో చీపురుపల్లిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో శిక్షణను ప్రారంభించాడు. అసోంలో ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగిగా కొనసాగుతూనే... ఏడాదికి తనకు లభించే తొంభై రోజుల సెలవుల్ని చీపురుపల్లిలో నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడానికే వినియోగిస్తున్నాడు. శిక్షణకు హాజరయ్యే పేదలకు మిత్రుల సహకారంతో దుస్తులూ, షూస్‌ అందిస్తున్నాడు. అతడి పర్యవేక్షణలో ఎనభై మంది దాకా ఉద్యోగాలు దక్కించుకున్నారు. ఇందులో ఎస్సైలూ, పోలీస్‌ కానిస్టేబుళ్లూ, ఆర్మీ, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో ఉద్యోగాలు సాధించిన వారూ ఉన్నారు.

10 నవంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.