close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
డ్రెస్‌ ఎలా ఉందో ఫోనే చెప్పేస్తుంది..!

మ్మాయిలెవరైనాగానీ కొత్త టాపో డ్రెస్సో వేసుకోగానే పక్కనే ఉన్న అమ్మనో అక్కనో స్నేహితురాలినో బాగుందా అని అడుగుతుంటారు. అందుకే షాపింగ్‌కి వెళ్లేటప్పుడు కూడా ఎవరో ఒకరిని తోడుగా తీసుకెళ్తుంటారు. లేదంటే డ్రెస్‌ వేసుకున్న ఫొటోని వాట్సాప్‌లో పంపించి సలహా అడుగుతుంటారు. ఇక, అలాంటి అవసరం లేకుండా ఆ డ్రెస్‌ బాగుందో లేదో చెప్పడంతోబాటు దానికి చిన్న చిన్న మార్పుల్ని సైతం సూచించే ఎఫ్‌ ప్లస్‌ ప్లస్‌ అనే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను రూపొందించారు ఆస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌కు చెందిన నిపుణులు. అందుకోసం మన ఫొటోని ఫోనులో అప్‌లోడ్‌ చేస్తే డ్రెస్‌ రంగునీ ఆకారాన్నీ బట్ట నాణ్యతనీ సరిచూసి చెప్పడంతోబాటు శరీరాకృతికి తగ్గట్లుగా ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలో వెతికి మరికొన్ని ఫ్యాషనబుల్‌ డ్రెస్సుల్ని కూడా సూచించేలా దీన్ని రూపొందించారు. సో, మున్ముందు ఈ ఆప్‌ను స్మార్ట్‌ఫోనులో లోడ్‌ చేసుకుంటే మన ఫోనే ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేస్తుందన్నమాట.


టీ తాగుతున్నారా?

సలు టీ తాగనివాళ్లతో పోలిస్తే రోజూ టీ తాగేవాళ్లలో మెదడు పనితీరు చక్కగా ఉన్నట్లు నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇందుకోసం వీళ్లు అరవయ్యేళ్లు పైబడిన 36 మందిని ఎంపికచేసి వాళ్ల మెదడుని ఎమ్మారై స్కాన్స్‌ ద్వారా పరిశీలించారట. సాధారణంగా వయసు పెరిగేకొద్దీ మెదడు పనితీరు తగ్గుతుంటుంది. అయితే క్రమం తప్పకుండా టీ తాగేవాళ్లలోని మెదడు కణాలు టీ తాగని వాళ్లతో పోలిస్తే చురుకుగానూ ఓ పద్ధతి ప్రకారం పనిచేస్తున్నట్లు గుర్తించారు. కేంబ్రిడ్జ్‌, ఎసెక్స్‌ విశ్వవిద్యాలయాలతో కలిసి చేసిన ఈ పరిశోధనలో ఆయా వ్యక్తుల జీవనశైలి, ఆరోగ్యం, మానసిక స్థితి అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నారట. ఫలానా టీనే అని కాకుండా గ్రీన్‌, ఊలాంగ్‌, బ్లాక్‌... ఇలా ఏదైనా గానీ పాతికేళ్లపాటు వారానికి కనీసం నాలుగుసార్లు తీసుకునేవాళ్ల మెదడులోని భాగాలు ఒకదాంతో అనుసంధానమై చక్కగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. కాబట్టి టీ తాగడం మానసిక ఆరోగ్యానికీ మంచిదే అన్నమాట.


బ్యాక్టీరియాని చంపే ఫిల్టర్‌

కాలుష్యంలో తిరగడం సంగతి అలా ఉంచితే, రోగం తగ్గించుకోవడానికి వెళ్లే ఆసుపత్రి వాతావరణంలో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌ల కారణంగానూ ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఆసుపత్రి వాతావరణాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచినా రోగులకి కొత్త ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే హ్యూస్టన్‌కు చెందిన రైస్‌ విశ్వవిద్యాలయ నిపుణులు లేజర్‌ ఇండ్యూస్‌డ్‌ గ్రాఫీన్‌(ఎల్‌ఐజి) టెక్నాలజీ సాయంతో ఓ సరికొత్త ఫిల్టర్‌ను రూపొందించారు. దీన్ని ప్లగ్‌లో పెడితే ఇది వాతావరణంలోని బ్యాక్టీరియా, ఫంగైలతోబాటు ఇతరత్రా కలుషిత పదార్థాలను గ్రహించి నాశనం చేస్తుందట. సో, వీటిని వెంటిలేషన్‌ కోసం ఉంచే ఖాళీల్లో పెట్టడం వల్ల వెలుపలి నుంచి లోపలకీ, లోపలి నుంచి బయటికి వెళ్లే గాలిలో ఎలాంటి హానికర పదార్థాలూ, సూక్ష్మజీవులూ లేకుండా నియంత్రించవచ్చని భావిస్తున్నారు.


ఎండ లేకున్నా సౌరవిద్యుత్తు!

సోలార్‌ ప్యానెల్స్‌ విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయాలంటే ఎండ కావాల్సిందే. అయితే ఎండ సరిగ్గా రాని ప్రదేశాల్లో కూడా సౌరశక్తి ద్వారానే విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయగలిగే థెర్మో ఎలక్ట్రిక్‌ జనరేటర్‌ను రూపొందించారు స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నిపుణులు. చిన్న బాక్సు రూపంలో ఉండే దీని నుంచి తయారైన విద్యుచ్ఛక్తి రెండుమూడు బల్బులూ ఫోన్‌ ఛార్జింగ్‌లకు సరిపోతుందని చెబుతున్నారు. బాక్సు పై భాగంలో అల్యూమినియం ప్లేటు పెట్టి దాన్ని పారదర్శక షీటుతో కప్పి, ఆపై మొత్తం పరికరాన్ని ఇన్సులేషన్‌ చేయడంతో ఇది వాతావరణం నుంచి గ్రహించిన పరారుణ కాంతి బయటకు పోకుండా ఉంటుంది. అదేసమయంలో జనరేటర్‌ అడుగుభాగాన్ని అల్యూమినియం ప్లేటుకి అనుసంధానించడంతో అది గ్రహించిన ఉష్ణోగ్రత జనరేటర్‌లో నిక్షిప్తం అవుతుంది. అయితే ఇది చదరపు మీటరుకి సోలార్‌ప్యానెల్‌ తయారుచేసే విద్యుచ్ఛక్తితో పోలిస్తే చాలా తక్కువే. కానీ ఎమర్జెన్సీ సమయాల్లోనూ ఎలాంటి పవర్‌గ్రిడ్‌లు లేని ప్రదేశాల్లోనూ ఇది ఉపయోగపడుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు.

10 నవంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.