close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వీటి రూటు వేరు గురూ!

ఒకచోటి నుంచి మరోచోటికి ఆహారం సరఫరా చేయడం, ఆన్‌లైన్‌లో బట్టలు విక్రయించడం, హోటల్‌గదులు కేటాయించడం... వీటికి సంబంధించిన ఎన్నో కంపెనీలు మనకున్నాయిప్పుడు! కానీ ఆ రంగాల్లోనూ కొత్తదార్లు పట్టాయి ఈ మూడు సంస్థలు. ఒకటేమో మీ పాత దుస్తుల్నిచ్చి నచ్చినవి తీసుకోమంటుంటే, ఇంకొకటి దేశంలో ఎక్కడున్నా అమ్మచేసిన వంటని అందిస్తామంటోంది. మరొకటి, ఏ బాదరబందీలేని అద్దె ఇంటి సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇస్తోంది.

సమస్యల్లేని అద్దె ఇల్లు...

ప్రస్తుతం ఓ మంచి అద్దె ఇంటిని సాధించడం ఎంత కష్టమో! మనకు ఇల్లు కావాల్సిన ఏరియాలో కాళ్లరిగేలా తిరగాలి, అంత సమయం కేటాయించలేకుంటే దళారుల దగ్గర భారీగా చేతి చమురు వదిలించుకోవాలి, ఇవన్నీ దాటుకుని అద్దె ఇంట్లోకి దిగితే అక్కడ చీటికీమాటికీ ఓనర్‌గారి మొహం చిట్లింపులనీ, ఇష్టారాజ్యంగా పెంచే అద్దెల్నీ భరించాలి! ఈ సమస్యలేవీ లేకుండా సులువుగా అద్దె ఇల్లుని తాము చూపిస్తామంటోంది జిఫీహోమ్స్‌ సంస్థ. దళారుల ప్రమేయం లేకుండా మంచి అద్దె ఇంటిని సాధించడానికి సహకరించడమే కాదు, మీరు ఇంట్లోకి దిగాక అనవసరంగా అద్దెల పెంపులూ, ఇతర ఛార్జీల మోతలూ లేకుండా చూస్తామని హామీ ఇస్తోంది. 
ఈ సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా సులువుగా మీరు కోరుకునే ప్రాంతంలో ఇంటిని ఎంపిక చేసుకోవచ్చు. ‘మనదేశంలో అద్దెకు తీసుకునే, ఇచ్చే వాళ్ల హక్కుల్ని కాపాడే చట్టాలు పకడ్బందీగా అమలైతే ఆ రంగంలో పెట్టుబడులు స్థిరాస్తి రంగాన్ని దాటిపోతాయి’ అంటున్నారు. జిఫీహోమ్స్‌ వ్యవస్థాపకులు సంచల్‌, సౌరభ్‌ రంజన్‌లు. ఆ దిశగా దిల్లీలో తాము వేసిన ఓ చిన్న ముందడుగే ఈ సంస్థ అని చెబుతున్నారు.

పాతవాటిని మార్చుకోవచ్చు!

‘డ్రెస్‌ స్వాపింగ్‌’ మెట్రోనగరాల్లో ఊపందుకుంటున్న ఓ ట్రెండు. మీరు ఇప్పటికే వాడిన, మీ వార్డ్‌రోబ్‌లో అనవసరంగా పడి ఉన్న బట్టల్ని ఇచ్చి... మీకిష్టమైన కొత్తవాటినో, పాతవాటినో తీసుకునే ఏర్పాటు ఇది. ఇందుకోసం నెలకో, రెండు నెలలకో ప్రత్యేకమైన స్వాపింగ్‌ ఎగ్జిబిషన్‌లనీ నిర్వహిస్తున్నారు. దిల్లీకి చెందిన నాన్సీ బసిన్‌, వైభవ్‌ సింగ్‌ స్థాపించిన ‘దిస్‌ ఫర్‌ దట్‌’ సంస్థ కూడా అలా మొదలైందే. కానీ, ఇటీవల తమ సేవల్ని ఆప్‌ ద్వారా దేశం మొత్తానికీ విస్తరించారు. కాకపోతే, ఇది మహిళలకే ప్రత్యేకం. అమ్మాయిలు తామిక వాడింది చాలనుకుంటున్న పాత దుస్తులూ, యాక్సెసరీలూ, ఇతరత్రా వస్తువులన్నింటినీ ఈ ఆప్‌లో అప్‌లోడ్‌ చేయొచ్చు. మీరు అలా నమోదుచేయగానే మీరు పెట్టినవాటి విలువకి సమానమైన దుస్తుల్ని ఇందులో డిస్‌ప్లే చేస్తారు. వాటిలో ఒకటి మీరు ఆర్డర్‌ చేయొచ్చు. 
మీ వస్తువుల్ని ఇంటికే వచ్చి తీసుకెళతారు. మీరు ఎంపిక చేసుకున్నవాటికి మాత్రం రవాణా ఖర్చులు చెల్లించి  తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెలకి ఐదువేలమంది దీన్ని వాడుతున్నారట. 

అమ్మచేతి వంట తెచ్చిస్తారు!

మీ ఇంటి నుంచి వేల మైళ్ల దూరంలో చదువుకుంటూ ఉన్నారనుకుందాం. ఇవాళ మీ బర్త్‌డే. ఈరోజైనా అమ్మ చేతి వంట తినాలని మనసు పీకుతుంటుంది. మీకన్నా అమ్మ మనసు మరింతగా తహతహలాడుతుంటుంది. పాయసమో, పనసపొట్టు కూరో చేసి తినిపించాలని ఉబలాటపడుతుంది. మనం ఎంత ప్రయత్నించినా సరే ఆ కూరల్ని అంతంత దూరం భద్రంగా, వేడి తగ్గకుండా పంపించడం అసాధ్యం! దాన్ని సాధ్యం చేసి చూపుతోంది ‘జస్ట్‌ మై రూట్స్‌’ అనే స్టార్టప్‌. దేశంలో మనం ఏ మూలనున్నా సరే ఇరవై నాలుగ్గంటల్లోపు ఇంటి భోజనాన్ని తీసుకొచ్చి ఇస్తుంది. ఇంటి భోజనమే కాదు... మీ ప్రాంతంలోని మీకు బాగా నచ్చిన రెస్టరెంట్‌ నుంచి కూడా మీకిష్టమైన ఆహారాన్ని తెచ్చిపెడుతుంది. వండినప్పుడున్న అదే వేడీ, రుచీ తగ్గకుండా మీకు ఆహారాన్ని అందజేస్తామంటోందీ సంస్థ. ఇందుకోసం ఇజ్రాయెల్‌ సాంకేతికతని ఉపయోగిస్తోంది. సమీరన్‌ సేన్‌గుప్తా, ప్రమీతా సేన్‌గుప్తా దీని వ్యవస్థాపకులు. ప్రస్తుతం పదహారు నగరాల్లో సేవల్ని అందిస్తున్న ఈ సంస్థ త్వరలోనే ముప్ఫై నగరాలకి సేవల్ని విస్తరిస్తుందట.

10 నవంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.