close
పంచభూతాత్మకా పాహి... పాహి!

కార్తికమాసమంటే శివయ్యే గుర్తొస్తాడు. పూజలూ మంత్రాలూ తెలియక పోయినా తెల్లవారుజామున నాలుగు చెంబుల చన్నీళ్లు పోసుకుని రెండు చేతులూ జోడించి నమస్కరిస్తే చాలు ఆయన కరుణించేస్తాడంటారు. ఆ నెలలోని సోమవారాలూ, పౌర్ణమీ, ఏకాదశులూ అన్నీ ప్రత్యేకమే. పంచభూతాత్మకుడైన పరమేశ్వరుడు వెలసిన పంచారామాలను ఈ నెలలో దర్శించడం విశేష ఫలాలను అందిస్తుందని భక్తులు నమ్ముతారు.

శివుడు పంచభూతాత్మకుడు. పంచాక్షరీ మంత్ర స్వరూపుడు. అంతేకాదు పంచముఖుడు కూడా అంటాయి పురాణాలు. పృథివి, వాయువు, ఆకాశం, అగ్ని, జలం... ఇలా అన్నీ ఆయనలో లయమై ఉన్నవే.  అలాంటి మహాదేవుడు ఐదు విశిష్టరూపాల్లో కొలువైన క్షేత్రాలు మన తెలుగు నేలమీదే విరాజిల్లుతున్నాయి. పంచారామాలుగా పిలుస్తున్న ఆ క్షేత్రాలకి మూలం ఒకటే అయినా దేనికదే ప్రత్యేకం.పురాణ కథనం ప్రకారం... పూర్వం తారకాసురుడనే రాక్షసుడు  శివుడి గురించి తపస్సు చేసి ప్రాణలింగాన్ని వరంగా పొందాడు.  సాక్షాత్తూ పరమేశ్వరుడే తన దగ్గరున్నాడనే గర్వంతో ఏకంగా దేవలోకంపైనే దండెత్తాడు. ఇంద్రుణ్ని జయించాడు.  దీంతో దేవతలంతా విష్ణువుని శరణువేడారు. శివుడి ప్రాణలింగాన్ని పొందిన తారకాసురుణ్ని తాను సంహరించలేననీ, దీనికి పరిష్కారం శివుణ్నే అడగమనీ చెబుతాడు హరి. అప్పుడు శివుడు ఆ కార్యాన్ని కుమారస్వామికి అప్పగిస్తాడు. తారకాసురుడితో యుద్ధానికి సన్నద్ధమైనా అతన్ని సంహరించలేకపోతాడు స్కందుడు. ప్రాణలింగం రాక్షసుడి గొంతులో ఉందనీ, దాన్ని ఛేదిస్తే వాడు మరణిస్తాడనీ... రహస్యాన్ని చెబుతాడు శంకరుడు. దాంతో శివలింగాన్ని బద్దలు కొడతాడు సుబ్రహ్మణ్యుడు. ఆ ప్రాణలింగం ఐదు ముక్కలవగా, అవన్నీ కృష్ణా, గోదావరీ తీరాల్లో పడ్డాయి. ఒక్కో శకలం పడ్డచోటు ఒక్కో పుణ్యక్షేత్రంగా పరిఢవిల్లింది. ఆ ఐదు క్షేత్రాలే పంచారామాలుగా పిలుస్తున్న ద్రాక్షారామం, క్షీరారామం, అమరారామం, సోమారామం, కుమారారామాలు.

ద్రాక్షారామం

హాశివుడి ప్రాణలింగం ముక్కలుగా పడ్డ ప్రదేశాల్లో తొలిదానిగానే కాక త్రిలింగ క్షేత్రాల్లోనూ విశిష్టమైనదిగా ద్రాక్షారామానికి పేరుంది. సగం తెలుపూ, సగం నలుపూ రంగుల కలయికగా ఉండే ఇక్కడి శివలింగం శివపార్వతుల అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆ మహాశక్తి స్వరూపిణి మాణిక్యాంబ రూపంలో కొలువైన ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లోనూ ఒకటిగా వెలుగొందుతోంది. అంతేకాదు హరిహరుల మధ్య అభేదాన్ని చాటేందుకూ ఈ క్షేత్రం ఓ చక్కటి నిదర్శనం. మహాలక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడికీ, మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామికీ మాఘశుద్ధ ఏకాదశి రోజున ఒకే వేదిక మీద కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇలాంటి వేడుకను ఒక్క ద్రాక్షారామంలోనే చూడగలం. సతీదేవి పుట్టిన స్థలంగా, దక్షప్రజాపతి యజ్ఞం చేసిన ప్రాంతంగా ద్రాక్షారామాన్ని చెబుతారు. దక్షుడి పేరుమీదుగానే ఈ ప్రాంతానికి ద్రాక్షారామం అనే పేరు వచ్చిందని ప్రతీతి. తారకసంహారానంతరం శివలింగభాగం ఈ ప్రాంతంలో పడిందని తెలుసుకున్న సప్తరుషులు భీమేశ్వరుణ్ని అర్చించేందుకు గోదావరీ జలాలతో పాటుగా ప్రయాణమవుతారు. మార్గం మధ్యలో తుల్యుడనే ముని యజ్ఞం చేస్తుంటాడు. ఈ జలాలు యజ్ఞానికి భంగం కలిగిస్తాయన్న ఉద్దేశంతో వారిని నిలువరించే ప్రయత్నం చేస్తాడు తుల్యముని. అప్పుడు వేదవ్యాసుడు కల్పించుకుని, గోదావరి అంతర్వాహినిగా ద్రాక్షారామం చేరుతుందనీ, సప్తగోదావరి పేరుతో పుష్కరిణిగా అవతరిస్తుందనీ చెబుతాడు. రుషులంతా క్షేత్రానికి చేరేలోపు ఉదయం కావడంతో సప్తగోదావరీ జలాలతో సూర్యుడు భీమేశ్వరుణ్ని తొట్టతొలిగా అభిషేకించాడట. పన్నెండు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో, ఎత్తయిన రాజగోపురాలతో అలరారే ఈ ఆలయ వైభవాన్నీ, అక్కడి శిల్పశైలినీ కళ్లారా చూసితీరాల్సిందే! తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి సమీపంలో వెలసిన ఈ ఆలయం, కాకినాడకు 28 కి.మీ. దూరంలో ఉంది.

అమరారామం

దేవతల రాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగం కొలువైన ప్రదేశమే అమరారామం. ఇంద్రుడి రాజధాని నగరం అమరావతి పేరుమీదుగా ఇక్కడి శివయ్యను అమరలింగేశ్వరుడిగా పిలుస్తారు. స్కంద, బ్రహ్మాండ, పద్మ పురాణాల్లో ఈ క్షేత్ర ప్రశస్తి ఉంది. ఇక్కడ ప్రతిష్ఠించిన లింగం ఎత్తు పెరిగిపోతూ ఉండటం గమనించిన ఇంద్రుడు అభిషేకాలూ, బిల్వపత్రార్చానలూ చేశాడట. అయినా ఎత్తు పెరగడం ఆగకపోవడంతో ఒక సీల కొట్టి, కృష్ణాజలాలతో అభిషేకించాడట. పన్నెండు అడుగుల ఎత్తున దర్శనమిచ్చే ఇక్కడి లింగం పంచారామాల్లోకెల్లా ఎత్తైనది. అందుకే ఇక్కడి శివలింగం చుట్టూ రెండు అంతస్తులను నిర్మించారు. రెండో అంతస్తు నుంచి అభిషేకాదులను నిర్వహిస్తారు. ఆలయంలో ప్రణవేశ్వరుడు, కాశీవిశ్వేశ్వరుడు, శ్రీశైల మల్లికార్జునుడు, అగస్త్యేశ్వరుడు, కోసలేశ్వరుడు, వీరభద్రేశ్వరుడు, త్రిపుర సుందరీదేవి కొలువై ఉంటారు. ఇక్కడి అమ్మవారు బాల చాముండేశ్వరి రూపంలో భక్తులను అనుగ్రహిస్తుంది. గుంటూరుకు సుమారు 35.కి.మీ దూరంలో ఉందీ ఆలయం. 

సోమారామం

పంచారామ లింగాల్లో చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం సోమారామంలో ఉంది. సోముడి పేరుమీదుగానే ఇక్కడి శివుడిని సోమేశ్వర జనార్దనుడని పిలుస్తారు. తెల్లగా ఉండే ఈ శివలింగం రంగు చంద్రుడి కళలను బట్టి మారుతూ ఉంటుంది. పౌర్ణమినాడు ధవళ వర్ణంలో మెరిసిపోయే ఈ శివలింగం, అమావాస్య నాటికి గోధుమ వర్ణాన్ని సంతరించుకుంటుందట. అన్నపూర్ణాదేవిగా అర్చనలు అందుకుంటున్న పార్వతీదేవి స్వామి వెలసిన అంతస్తుకు పై అంతస్తులో దర్శనమిస్తుంది. ఇలా స్వామికన్నా పైభాగంలో అమ్మవారు ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ క్షేత్రంలోని చంద్రపుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పటాపంచలవుతాయని నమ్మిక. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరంలోని గునుగుపూడి గ్రామంలో వెలసిందీ ఆలయం.

క్షీరారామం

రమ పవిత్ర పంచారామ క్షేత్రాల్లో సాక్షాత్తూ శ్రీమహావిష్ణు స్వరూపుడైన రామభద్రుడు ప్రతిష్ఠించిన మూర్తిగా క్షీరారామలింగేశ్వరుడిని చెబుతారు. రాముడి పేరు మీదుగానే ఆయనకు ఆ పేరు వచ్చింది. తారకాసుర సంహార సమయంలో ముక్కలయిన శివుడి ప్రాణలింగంలోని పైభాగం క్షీరారామంలోనే పడిందంటారు. ఇక్కడి శివలింగానికి పైభాగంలో జటాజూటంలాంటిది కనిపిస్తుంది. అందుకే ఈయన్ను కొప్పురామలింగేశ్వరుడిగానూ పిలుస్తారు. ఈ క్షేత్రానికి సంబంధించి ఓ పురాణగాథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కౌశికముని కుమారుడు ఉపమన్యుడు అభిషేకం కోసం శివుడిని క్షీరాన్ని అడిగాడట. అప్పుడు శివుడు ఒక క్షీర పుష్కరిణిని సృష్టించి ఇచ్చాడట. అలా ఇక్కడ పాలకొలను ఏర్పడటం వల్ల ఈ ఊరి పేరు కాలక్రమంలో పాలకొల్లుగా పరిణామం చెందిందంటారు. ఇక్కడ అమ్మవారు పార్వతీదేవిగా కొలుయింది. 125 అడుగుల ఎత్తులో తొమ్మిది అంతస్తుల్లో కనిపించే రాజగోపురం క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణ. పైదాకా వెళ్లేందుకు మెట్లూ ఉంటాయి. ఉత్తరాయణ, దక్షిణాయన ప్రారంభ సమయాల్లో ఉషోదయ వేళ భానుడి కిరణాలు గోపురం రెండో అంతస్తు నుంచి శివలింగం మీద పడతాయి. పశ్చిమగోదారి జిల్లా పాలకొల్లులో ఉన్న ఈ క్షేత్రం ఏలూరుకు సుమారు 110 కి.మీ. దూరంలో ఉంది.

కుమారారామం

తారకాసుర సంహారకుడూ, శివుడి కుమారుడూ అయిన కుమారస్వామి ప్రతిష్ఠించిన లింగం కుమారారామంలో పూజలందుకుంటోంది. ఆయన పేరు మీదుగానే ఇక్కడి శివుడిని కుమార భీమేశ్వరుడిగా పిలుస్తారు. క్షేత్రంలో పార్వతీదేవి బాలాత్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తుంది. ఆలయంలో కాలభైరవుడు, చంద్రమౌళీశ్వరుడు, ఉమాసమేత మృత్యుంజయుడు... తదితర దేవతామూర్తులు కొలువయ్యారు. కాకతీయులు, చాళుక్య రాజుల నిర్మాణ శైలి ఈ ఆలయంలో ప్రస్ఫుటమవుతుంది. చైత్ర, వైశాఖ మాసాల్లో సూర్యోదయ వేళ భీమేశ్వరుడి పాదపీఠాన్నీ, సాయం సమయాన అమ్మవారి పాదాలనూ సూర్యుడి కిరణాలు స్పృశించేలా ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఉన్న ఈ క్షేత్రం, రాజమండ్రికి సుమారు 60 కి.మీ. దూరంలో ఉంది. 

10 నవంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.