close
బ్రహ్మన్న కొలిచిన...చెన్నకేశవుడు

పౌరుషాల గడ్డగా పేరుగాంచిన పల్నాటి సీమలో కొలువైన స్వామి... చెన్నకేశవుడు. ఈ క్షేత్రంలో స్వామి మహాలక్ష్మీ సమేతుడై యుద్ధవీరుల ఆరాధ్యదేవుడిగా కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని చెన్నకేశవస్వామి ఆలయం పల్నాటి యుద్ధానికి సాక్షీభూతంగా, ఎన్నో ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక గాథలకు వేదికగా నిలుస్తోంది. అంతేకాకుండా దేవుడి ముందు అన్ని వర్గాల వారూ సమానులేనంటూ సమాజంలోని అసమానతల్ని రూపుమాపి ప్రజల్లో సమతాభావాన్ని నింపడానికి ఈ చెన్నకేశవ ఆలయంలోనే పునాదులు పడ్డాయి.

‘మంగళం చెన్నకేశాయ... మంగళం గుణసింధవే... మంగళానాం నివాసాయ... శ్రీమాచర్ల చెన్నకేశాయా మంగళం’ అంటూ భక్తకోటి స్వామివారి అనంత కల్యాణ గుణగణాలను కీర్తిస్తుంది. చెన్నుడు అంటే అందమైనవాడని అర్థం. అందుకే విష్ణుమూర్తి ఇక్కడ చెన్నకేశవస్వామి పేరుతో పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే వీరభద్రస్వామి ఆలయం, ఇష్టకామేశ్వరస్వామి, ఆదిత్యేశ్వరాలయం, భ్రమరాంబ సమేత గిరీశ్వరాలయం, వేంకటేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి. వీరభద్రస్వామి గుడి ప్రాంగణంలో నాలుగడుగుల ఎత్తులో శనీశ్వరుని విగ్రహం ఉంది. భక్తులపై శనీశ్వరుడి చూపు పడకూడదన్న ఉద్దేశంతో ఈ స్వామి కళ్లకు గంతలు కట్టి ఉంచుతారు. ఈ ఆలయంలో పూజలు చేస్తే శని, ఇతర జాతక దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.

స్థల పురాణం...
షడ్చక్రవర్తుల్లో చివరివాడైన కార్తవీర్యార్జునుడు త్రేతాయుగంలో ఇక్కడ స్వామివారికి ఆలయం నిర్మించాడు. శాపం కారణంగా అనారోగ్యానికి గురైన ఆయనకు ఈ క్షేత్రంలోనే శాప విమోచనమైందన్నది ప్రాచుర్యంలో ఉంది. క్రీ.శ 12వ శతాబ్దంలో కార్తవీర్యార్జునుడి సంతతికి చెందిన అనుగురాజు మాచర్లను రాజధానిగా చేసుకొని పల్నాటి సీమను పరిపాలించగా.. బ్రహ్మనాయుడు మహామంత్రిగా వ్యవహరించాడు. ఈ బ్రహ్మనాయుడే శిథిలావస్థకు చేరిన ఆలయ స్థానంలో నూతనాలయాన్ని నిర్మించాడు. మాచర్ల నగరాన్నీ ఈయనే నిర్మించినట్లు పద్మనాయక చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న చంద్రభాగా నది ఆలయానికి మరింత శోభను కలిగిస్తోంది. ఈ స్వామి అనుగ్రహంతోనే శ్రీనాథ కవిసార్వభౌముడు పల్నాటి వీరుల చరిత్రను రచించాడని పూర్వికులు చెబుతారు.

అందరి దేవుడు
ఇక్కడి ఆలయం చాళుక్య, కాకతీయ, విజయనగర రాజుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. గర్భాలయంలో చెన్నకేశవ స్వామి విగ్రహం మూడడుగుల ఎత్తులో అందంగా కొలువై ఉంది. అంతరాలయంలో స్వామివారి ఉత్సవమూర్తులతోపాటు రామానుజాచార్యులూ, ఆళ్వారుల పంచలోహ విగ్రహాలు పూజలందుకుంటున్నాయి. ఆలయ రంగమండపంపై కమలం విప్పారినట్లు చిత్రించారు. రామాయణ, మహాభారత, భాగవతాల్లోని ప్రధాన ఘట్టాల్నీ సన్నివేశాల్నీ రంగమండపంలోని నాలుగు స్తంభాలపై సుందరంగా చెక్కారు. వైష్ణవ మతాన్ని
స్వీకరించిన బ్రహ్మనాయుడు దేవుడి దృష్టిలో అందరూ సమానమేనంటూ సామాజిక కట్టుబాట్లను కాదని వెయ్యేళ్ల క్రితమే ఈ ఆలయంలో అన్ని కులాల వారినీ ఒకే వరుసలో కూర్చోబెట్టి సహపంక్తి భోజనాల్ని ఏర్పాటు చేశాడు. ఇదే చాపకూడు సిద్ధాంతంగా చరిత్రలో నిలిచింది. నేటికీ పల్నాటి వీరుల తిరుణాళ్లలో చాపకూడు సిద్ధాంతాన్ని పాటిస్తారు. బ్రహ్మనాయుడే అన్ని వర్గాలవారికీ ఆలయ ప్రవేశం కల్పించి స్వామికి సేవ చేసుకొనే అవకాశమిచ్చాడనీ చెబుతుంటారు. అందుకే ఇక్కడి చెన్నకేశవుడిని సమతాభావం నింపిన దేవుడిగా కొలుస్తుంటారు.

నిత్య కల్యాణం
తిరుమల తరువాత నిత్యకల్యాణం జరిగే కొద్ది ఆలయాల్లో చెన్నకేశవస్వామి గుడి ఒకటి. అన్ని వర్గాల భక్తుల భాగస్వామ్యంతో స్వామికి నిత్యోత్సవాలూ, పక్షోత్సవాలూ, మాసోత్సవాలూ, వార్షికోత్సవాలూ ఘనంగా నిర్వహిస్తారు. ఏటా చైత్ర శుద్ధ త్రయోదశి నుంచి చైత్ర బహుళ త్రయోదశి వరకు పదహారు రోజులు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. వీటినే మాచర్ల తిరుణాళ్లుగా పిలుస్తారు. చివరిరోజు రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో అన్ని కులాల వారికీ భాగస్వామ్యం ఉండటం విశేషం.

ఇలా చేరుకోవాలి...
విజయవాడ, గుంటూరు నుంచి మాచర్లకు బస్సు సౌకర్యం ఉంది. గుంటూరు నుంచి రైలు ద్వారా కూడా చేరుకోవచ్చు. మాచర్ల బస్టాండ్‌, రైల్వే స్టేషన్ల నుంచి ఆటో, ఇతర ప్రైవేట్‌ వాహనాల్లో ఆలయానికి చేరుకోవచ్చు.

- అమ్ముల మోహిత్‌ నాగప్రసాద్‌, ఈజేఎస్‌


గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా!

ల్లు కట్టుకున్నాక బంధువులను పిలిచి గృహప్రవేశం చేసుకుంటాం. ఆ సమయంలో నూతన గృహంలో ముందుగా గోమాతను తీసుకెళ్లి ఇల్లంతా తిప్పిన తరవాతే ఇంటి యజమానీ, కుటుంబ సభ్యులూ లోపలికి వెళ్లడం ఆనవాయితీ. అలా మొదట గోమాతని ఎందుకు తిప్పుతారంటే... ఈ ఆచారం ఇప్పటిది కాదు అనాదిగా వస్తున్నది. ఎందుకంటే గోవు సకల దేవతా స్వరూపం. ఆ మాత వెంటే సమస్త దేవతలూ వెంట ఉంటారని శాస్త్రం చెబుతోంది. అందుకే నూతన గృహాల్లో గోవును తిప్పడం వల్ల ఆ దేవతలు కూడా మనింట్లో నడయాడతారట. అలానే గోవు మూత్రం, పేడలో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం. అందుకే ఇంట్లో గోవును తిప్పినప్పుడు మూత్రం, పేడ వేయడం కూడా శుభసూచకంగా భావిస్తారు. శాస్త్రీయంగా చెప్పాలంటే ఆవు మూత్రం, పేడా రెండూ కొత్తింట్లో క్రిములూ, ఇన్ఫెక్షన్లూ, దోమల్నీ దూరం చేస్తాయి. అలానే పేడా, మూత్రం, నెయ్యీ, పెరుగూ, పాలూ... అన్నింటినీ కలిపి పంచగవ్య అంటారు. వీటిని హోమంలో వేసినప్పుడు వెలువడిన పొగ కూడా క్రిమి కీటకాల్ని బయటకు పంపుతుంది. వాతావరణంలోని విషవ్యర్థాలను పారదోలుతుంది. మరి అప్పుడే కదా మనం ఇంట్లో ఆరోగ్యంగా ఉండేది. అందుకే గృహప్రవేశం సమయంలో ఆవుకు అంత ప్రాధాన్యం.

10 నవంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.