close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెద్దల్లుడు

- డేగల అనితాసూరి

‘‘అవడానికి పెద్దల్లుడేగానీ... ఎలా నడుచుకోవాలో మీ తరవాత వచ్చిన తోడల్లుళ్ళను చూసి నేర్చుకోండి’’ వాషింగ్‌మెషీన్‌లోని బట్టల్ని గట్టిగా విదిల్చి తాడు పైన ఆరవేస్తూ అంది గీర్వాణి.
‘‘ఏమిటోయ్‌, ఆదివారంపూట పొద్దున్నే చక్కగా పెసరట్టు, ఉప్మా పెట్టి మరీ వాయిస్తున్నావ్‌?’’ చూస్తున్న వార్తాపత్రికలో నుంచి సగం తల పైకెత్తి అన్నాడు వేణు.
‘‘మన పెళ్ళిచూపుల్లో మావాళ్ళంతా ‘కుర్రాడు మెతకలా ఉన్నాడు. ఒప్పేసుకోవే’ అంటే, ఏంటో అనుకున్నా. ఇలా అన్నీ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ ఇచ్చి మరీ మీ అమాయకత్వం పోగొట్టాల్సి వస్తుందని తెలియకపోయె’’
బట్టలారవేసే కార్యక్రమం జయప్రదంగా ముగిసిందన్నట్టు బొడ్డున చిక్కిన చీరకుచ్చెళ్ళు తీసి వదిలి, వచ్చి వేణు ముందున్న దివాన్‌ మీద చతికిలబడుతూ అంది.
‘‘ఆ... అనేవాళ్ళు లక్ష అంటారు. మావాళ్ళూ అన్నారు... ‘పిల్ల బొమ్మలా ఉంది. పెద్దపెద్ద కళ్ళున్నా చిన్న లక్కపిడతలాంటి నోరుతో ముచ్చటగా ఉంది.
నీ ముందు నోరెత్తే సాహసం చెయ్యదు ఒప్పేస్కోరా’ అని. తీరా ఇప్పుడేమో నిద్రలో తప్ప నీ నోరు మూతపడేదెప్పుడని?’’ అన్నాడు అంతకన్నా వెటకారంగా వేణు.
‘‘అమ్మో, మీ మెతకదనమంతా ఊళ్ళోవాళ్ళముందే. నన్ను మాత్రం బాగానే సాధిస్తారు’’ ఉక్రోషంగా లేచింది గీర్వాణి వంటింట్లోకి వెళ్ళడానికి.
‘‘అసలిప్పుడింత అర్జంటుగా ఈ శిక్షణా తరగతి నాకోసం ఎందుకు పెట్టాల్సి వచ్చిందో సెలవిచ్చారు కాదు శ్రీమతిగారు’’
అన్నాడు వేణు.
‘‘ఏముంది, సంక్రాంతి వస్తోందిగా’’ అంది చేటలోని ఆకుకూరని వలిచి గిన్నెలో పడేస్తూ.
‘‘అదేంటి, పండుగ దానిదారినది వచ్చిపోతుంది కదా... నా మెతకదనం, గడుసుదనంతో దానికేమిటి సంబంధం?’’ ఆశ్చర్యపోయాడు వేణు.
‘‘చాల్లెండి వేళాకోళం. పండక్కి మా పుట్టింటికెళ్ళొద్దూ.’’
‘‘అయితే?!’’
‘‘అయితే ఏముంది... దద్దోజనం.
ఇంటికి పెద్దల్లుడంటే ఎలా ఉండాలసలు? హుందాగా, దర్పంగా, చూడగానే అత్తమామలు గౌరవించేలా, తోడల్లుళ్ళు భయపడేలా ఉండాలి. కానీ, మన తరవాత రెండేళ్ళకూ నాలుగేళ్ళకూ పెళ్ళయి వచ్చిన నా ఇద్దరు చెల్లెళ్ళ భర్తలకే మీకన్నా ఎక్కువ గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి. అంతా మీ మెతకదనం వల్లే’’ అంది గీర్వాణి.
‘‘అవునా. నేనేదో అందరితో కలివిడిగా ఉండే రకాన్ని. బిగుసుకుపోవటం, మూతి ముడుచుకోవటం నాకు రాదు’’ అన్నాడు వేణు.
‘‘రావాలండీ... రావాలి. లేకుంటే మా పుట్టింటి వాళ్ళముందు చులకనైపోతారు. మా అమ్మ ఆరోగ్యం బాగాలేక ఇంటి పనుల్లో సహాయం కోసం నేను పదో తరగతితో చదువు ఆపేయాల్సి వచ్చింది, మీదేమో గవర్నమెంటు ఆఫీసులో గుమస్తాగిరీ... అందుకే ఈ చులకనంతా. నా త్యాగంవల్లే కదా నా చెల్లెళ్ళు బీటెక్‌లూ ఎంటెక్‌లూ చేయగలిగారు. పెద్ద చదువులు చదివారు కనుక ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను కట్టుకున్నారు. అందుకే, మనల్ని తక్కువ చేసి చూస్తున్నారు వాళ్ళ ముందర. ఈసారి కూడా అలాగే చూస్తే పండగలకు వెళ్ళటం మానేద్దాం. ఎప్పుడో విడిగా మనమే వెళ్ళి అమ్మానాన్నల్ని చూసుకుని వచ్చేస్తే చాలు’’ అంది గీర్వాణి.
‘‘అలా అంటావా, సరే. ఈసారి నువ్వే చూస్తావుగా. నువ్వు సరేనంటే తప్ప, ఏ పనీ చేయను. చూద్దాం ఎన్ని కిలోల గౌరవ మర్యాదలు ఎక్కువొస్తాయో’’ అన్నాడు వేణు.
‘‘ప్రతిసారీ చూస్తున్నాను... వాళ్ళేపనీ చేయకుండా హాయిగా గడిపి వెళ్తుంటారు. మా అమ్మ నాకూ మా నాన్న మీకూ బాగానే పనులు పురమాయిస్తున్నారు. నేనంటే పెద్ద కూతుర్ని కాబట్టి ఏదో సర్దుకుపోయి నా చెల్లెళ్ళకూ తలో పనీ పురమాయించి అయినా చేసుకుపోతుంటా. కానీ, మీకేం పట్టింది... మీరేమన్నా పెద్దల్లుడా లేకుంటే పనివాడా? మీకెలా ఉంటుందో కానీ, నాకు మాత్రం తల కొట్టేసినట్లుంటోంది’’ అంది గీర్వాణి భోజనం వడ్డిస్తూ.
‘‘సరేనోయ్‌, ఈసారి చూసుకో మన డాబూ దర్పమూ ‘తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ త్రీ’లాగా ఎలా ఉండబోతుందో’’ అన్నాడు వేణు భార్య చేతి గుత్తొంకాయ రుచికి మైమరచిపోతూ.

* * * * *

‘‘ఏమిటే అమ్మాయ్‌, ప్రతిసారీ రెండ్రోజులు ముందుగా వచ్చేసేవాళ్ళు కదా నువ్వూ అల్లుడూ. ఈసారి సరిగ్గా ముందురోజుకొచ్చారు. నాకూ మీ నాన్నకైతే దిక్కుతోచలేదనుకో’’ అంది గీర్వాణి తల్లి సుభద్ర.
‘అవునవును. అలా ముందుగా వచ్చేయటంవల్లే కదా తరవాత వచ్చే నా చెల్లెళ్ళ లగేజీలు దింపుకోటానికీ, ఎదురెళ్ళి చిన్నల్లుళ్ళని స్వాగతం చెబుతూ తీసుకురావటానికీ మమ్మల్ని పురమాయించేవాళ్ళు’ అనుకుని, ‘‘మీ అల్లుడు గారికి ఊపిరి సలపనంత పని. అసలు లీవు ఇవ్వటం కాదు కదా, పండుగ రోజుల్లో కూడా రావాల్సిందే అన్నారు. కానీ, మీ అందరూ ఎదురుచూస్తుంటారని రాత్రుళ్ళు ఏడెనిమిదింటి వరకు కూడా ఉండి ఎక్‌స్ట్రావర్క్‌ పూర్తిచేయబట్టి రాగలిగాం’’ తన భర్త ఆషామాషీ మనిషేం కాదు, బిజీ మేన్‌ అన్నట్టు చెప్పింది గీర్వాణి.
‘‘అవునా. అయ్యో అల్లుడుగారు అందుకే బాగా చిక్కిపోయినట్టు అనిపిస్తున్నారు’’ అంటూ పెద్ద గ్లాసుడు చిక్కని ఆవుపాలు తెచ్చిచ్చింది సుభద్ర.
అప్పటికే ముందుగా వచ్చేసిన గీర్వాణి పెద్ద చెల్లెలూ ఆమె భర్తా రైతు మార్కెట్‌కి వెళ్ళి రెండు పెద్ద సంచీల నిండుగా కూరగాయలూ పళ్ళూ ఆకుకూరలూ ఆటోలో వేసుకొచ్చి ఇంటిముందు దిగారు.
‘‘ఎప్పుడొచ్చావక్కా? ఏం బావా మా అక్కను ఇంత లేటుగానా మా ఇంటికి తీసుకురావటం?’’ అంటూ వేణుతో అంది పెద్ద మరదలు శ్యామల సంచీలు తల్లి చేతికి అందిస్తూ.
‘‘హలో బ్రదర్‌, హౌ ఆర్యూ? ప్రతిసారీ మీరు ఈ మార్కెట్‌ పని ఎంత చక్కగా చేసుకొచ్చేవాళ్ళో! నాకైతే బేరమాడటం, నాణ్యమైనవి ఎంచుకోవటం భలే కష్టమైందంటే చూడండి’’ అంటూ హాల్లోని సోఫాలో అలసిపోయి కూర్చున్నాడు శ్యామల భర్త అర్జున్‌.
‘‘ఏమైనా, మా బావ వెంట ఇకపైన మీరిద్దరూ కూడా వెళ్ళొస్తుండండి... అప్పుడు అర్థమవుతుంది చక్కగా’’ అలసిపోయి వచ్చి కూర్చున్న చిన్నక్కా బావలకు కాఫీలు తెచ్చి అందించింది మూడవ చెల్లి కావ్య.
‘‘అక్కడికి నీకేదో పనులన్నీ మహాద్భుతంగా చేతనైనట్టు. ఏదో మీ పెద్దక్క ఈసారి లేటుగా దిగబట్టిగానీ, లేకుంటే ఏనాడైనా వంటింట్లో అడుగుపెట్టావా. ఏదో పెద్ద నువ్వే ఎప్పుడూ ఇంటిపనులన్నీ చక్కబెట్టేటట్టు మాట్లాడుతున్నావ్‌. వదినగారూ, ముందు వీళ్ళకు ఇవ్వండి- ఏ పనులు ఎలా చేసుకోవాలో ట్రైనింగు’’ అన్నాడు అర్జున్‌.
అందరూ ఫలహారాలు ముగించాక శ్యామల అలసిపోయానంటూ బెడ్డెక్కింది. కావ్య భర్త జీవన్‌తో కలిసి పేకాట మొదలెట్టింది. అర్జున్‌ టీవీలో క్రికెట్‌ చూడటంలో లీనమయ్యాడు.
దివాన్‌ మీద నడుం వాల్చాడు వేణు. అప్పటికే సుభద్ర పెద్దకూతురి చేతికి వంటింటి బాధ్యత అప్పగించేసి పూజగది సర్దటంలో మునిగిపోయింది.
‘‘వేణూ, కాస్త బజారుకెళ్ళొద్దాం బయల్దేరు’’ అంటూ వచ్చాడు గీర్వాణి తండ్రి ఆనందరావు. గీర్వాణి వంటగదిలో నుంచి తొంగిచూసి తల అడ్డంగా ఊపింది వెళ్ళొద్దన్నట్టు.
‘‘కాస్త తలనొప్పిగా ఉంది మామయ్యా... మన అర్జున్‌తో వెళ్ళొచ్చేస్తారా?’’
అన్నాడు వేణు.
‘‘అయ్యో... అలాగా. ఆఫీసు పని ఒత్తిడి మరీ ఎక్కువైనట్టుంది. ఉండు మీ అత్తయ్యతో చెప్పి వేడివేడి కాఫీ పెట్టమంటా. అలాగే అమ్మాయితో చెప్పి శొంఠిపట్టు వేయిస్తా. క్షణాల్లో తగ్గిపోతుంది’’ అంటూ వంటగది వైపు వెళ్ళాడు.
అయిదు నిమిషాల్లో చేతిలో పొగలుగక్కే కాఫీ, తలకు శొంఠిపట్టూ, అర్జున్‌ ఇచ్చిన తలనొప్పి మాత్రా, జీవన్‌ నేర్పిన యోగముద్రల ముప్పేటదాడికి ఉత్తిపుణ్యాన బలి కావాల్సొచ్చింది వేణు.
భోజనాలయ్యాక సాయంత్రం ‘‘ఇప్పుడెలా ఉంది వేణూ, తలనొప్పి తగ్గిందా?’’ అడిగాడు ఆనందరావు.
ఈసారి గీర్వాణి గుడ్లురుముతున్నా పట్టించుకోకుండా ‘‘పర్లేదు మామయ్యా, సుమారుగా తగ్గినట్టే ఉంది. రాత్రికి రెస్ట్‌ తీసుకుంటే అదే తగ్గిపోతుంది’’ అని చెప్పాడు.
‘‘తగ్గకుంటే చెప్పండి బావా...
నా స్నేహితురాలు చెప్పిన దనియాల కషాయం పెట్టిస్తా’’ అంది శ్యామల.
‘‘లేదు లేదు... మా అత్తగారు చెప్పారు, శొంఠిపట్టుకు తగ్గకుంటే ఆముదంపట్టు వెయ్యాలని’’ అంది కావ్య.
‘‘ఆగండే... కాస్త విశ్రాంతిగా పడుకోనివ్వండి. అప్పటికీ తగ్గకుంటే డాక్టర్‌ దగ్గరికెళ్తే సరిపోతుంది’’ చెప్పింది సుభద్ర.
‘‘మీరు బజారెళ్ళిరండి మామయ్యా. పండగ రేపే కదా... నాకోసం మీ పనులెందుకు వాయిదా వేయటం’’ అన్నాడు వేణు భార్య వంక ‘ఎలా చెప్పను?’
అన్నట్టు చూస్తూ.

ఆనందరావు ‘సరేనా?’ అన్నట్టు సుభద్ర వంక చూడటమూ ఆవిడ వద్దన్నట్టు తల తిప్పటమూ గీర్వాణి కంటపడనే పడింది.
‘‘ఏమీ పర్వాలేదులే అల్లుడూ... మీ తలనొప్పి తగ్గాకే ఇవాళ కాకుంటే రేపెళదాం. రేపు భోగి మంటలేయడమే కదా... సంక్రాంతి ఎల్లుండాయె’’ అంటూ గదిలోకెళ్ళిపోయాడు ఆనందరావు. వెనుకే సుభద్ర కూడా గదిలోకి వెళ్ళింది.
‘‘చూశారా చూశారా, నూరు ఆరైనా మిమ్మల్నే బజారుకి తీసుకెళ్ళి బ్యాగులు మోయించాలనుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ అల్లుళ్ళు మోస్తే అరిగిపోతారని కాబోలు. మా అమ్మ సైగ చేయటం నా కళ్ళారా చూశాను’’ గుసగుసగా భర్త చెవిలో అంది గీర్వాణి.
‘‘నువ్వో అపార్థం మనిషివి. అలా అయితే ఉదయం అర్జున్‌, శారదా కూరగాయలూ పళ్ళూ మోసుకురాలేదా?’’ అన్నాడు వేణు.
‘‘అదీ మనం సమయానికి రాకపోబట్టి తప్పనిసరై పంపారు. కానీ, ఎప్పట్లా రెండు మూడురోజులు ముందొస్తే అదీ మనకే పడేది. ఇప్పుడిక మనల్ని చూశారుగా, వాళ్ళకెందుకు చెప్తారు?’’ అంది గీర్వాణి.
‘‘సర్లే, ఏదో ఒకటి. నేను కాసేపు గదిలో రెస్ట్‌ తీసుకుంటున్నట్టైనా బిల్డప్పివ్వాలి కదా?’’ అంటూ మరో గదివైపు వెళుతుంటే, ‘‘ఆగండి నేను కూడా మీ తలకు జండూబామ్‌ రాస్తున్నట్టు ఈ వంటగది వదిలేసొస్తా.

‘‘చూశారా చూశారా, నూరు ఆరైనా మిమ్మల్నే బజారుకి తీసుకెళ్ళి బ్యాగులు మోయించాలనుకుంటున్నారు. 
సాఫ్ట్‌వేర్‌ అల్లుళ్ళు మోస్తే అరిగిపోతారని కాబోలు.
మా అమ్మ సైగ చేయటం నా కళ్ళారా చూశాను’’ గుసగుసగా భర్త చెవిలో అంది గీర్వాణి.

అప్పుడుగానీ మా అమ్మ శారదకో, కావ్యకో పనులు పురమాయించదు’’ అంటూ వెంట నడిచింది గీర్వాణి.

* * * * *

గదిలోని కిటికీ పక్కనున్న డ్రెస్సింగ్‌ మిర్రర్‌లో చూసుకుంటూ చీర సర్దుకుంటుంటే, కిటికీకి అవతలి గదిలో సుభద్ర, ఆనందరావులు మెల్లగా మాట్లాడుకోవటం వినిపించింది. నెమ్మదిగా కిటికీ రెక్క వెనుక నక్కింది గీర్వాణి - చప్పుడు చేయకుండా చెవులు రిక్కించి వింటూ.
‘‘అదికాదు సుబ్బూ, అల్లుడు తలనొప్పితో పాపం బాగా బాధపడుతున్నాడల్లే ఉంది, అర్జున్‌ని తీసుకెళ్ళి బజారు పని ముగించుకొచ్చేస్తానంటే వద్దంటావెందుకు. రేపు పండగపూట పిల్లలతో గడపకుండా బజార్లవెంట తిరగటం అవసరమా?’’ అన్నాడు ఆనందరావు.
‘‘మీకెన్నిసార్లు చెప్పానండీ- ముఖ్యమైన బజారు పనులకు వేణునే తీసుకెళ్ళాలీ... పండుగ, పబ్బాలప్పుడూ అందరూ వచ్చినప్పుడూ వంటింటి బాధ్యత గీర్వాణిది మాత్రమే అని. ఇవాళ కాకుంటే రేపెళ్ళినా కొంపలేమీ అంటుకోవు. అయినా వంటలు చేస్తూ ఆడవాళ్ళం బిజీగా ఉంటాం కానీ, వేళకు తినటానికొస్తే చాలు కదా మగాళ్ళు. పొద్దుటే ఫలహారం చేసి వెళ్ళొచ్చేయండి’’ అంది సుభద్ర.
అప్పటికే భార్య కిటికీ దగ్గర ఎందుకు నక్కి ఉందా అని అక్కడికొచ్చిన వేణుని చూసి ‘‘విన్నారా?’’ అన్నట్టు ఉడుక్కుంది గీర్వాణి.
‘‘ఎప్పుడో ఒకసారి- కుదరకుంటేనే కదా... అయినా వాళ్ళు మాత్రం ఏమైనా అనుకోరూ, ఎప్పుడూ వేణునే తీసుకెళ్తున్నానని’’
అన్నాడు ఆనందరావు.
‘‘ఏమిటీ అనుకునేది? వాళ్ళకేం తెలుసని... పట్టుబట్టలూ, బంగారం లాంటివి నాణ్యతా గిట్టుబాటూ చూసి మనవాళ్ళకు ఏదవసరమో అలా ఎంపిక చేయటం, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేసినంత సులువు కాదు. వాళ్ళకిప్పటికీ వాళ్ళమ్మా నాన్నలో, మనమో సెలెక్ట్‌ చేసి పెట్టాల్సిందేనాయె. వేణు అయితే వాళ్ళింట్లోనూ పెద్దకొడుకు. కొడుకుల్లేని మన ఇంటికీ అంతే బాధ్యత తెలిసిన పెద్దల్లుడు. అత్తమామల ఆర్థిక పరిస్థితీ, మిగతావాళ్ళ అభిరుచీ తెలిసి అందరూ మెచ్చేలా షాపింగ్‌ చేస్తాడు’’ అంది సుభద్ర.
‘‘పోనీ మిగతా ఇద్దర్నీ వెంటబెట్టుకెళ్తే వాళ్ళకూ అలవాటవుతుందేమో కదా?’’
‘‘వాళ్ళకు ఆన్‌లైన్‌ షాపింగులైతేనే బాగా తెలుస్తుంది. అక్కడికొచ్చి వేణునీ మిమ్మల్నీ తికమక పెట్టేస్తారు.

‘‘అయినా, ‘అన్ని బ్యాగులు మీవల్ల కాదు మామయ్యా’ అంటూ ఒక్కడే పట్టుకొస్తుంటే ఏదోగా ఉంటుంది తెలుసా?’’
‘‘షాపులోనేగా. బయటకు రాగానే ఆటోలో వేసుకొచ్చేస్తారాయె. అతనేమీ మీలా పరాయిగా ఆలోచించలేదు. మామయ్యను కూడా తండ్రిలా భావిస్తుంటే, మీరే అల్లుడిగానే దూరంచేసి చూస్తున్నారు. మన తరవాత కూడా పండగ, పబ్బాలకు కనీసం సంవత్సరానికోసారైనా పుట్టింటి పేరున పిలిచి భోజనం, బట్టలూ పెట్టి పంపేలా, మన స్థానంలో పెద్దమ్మాయీ అల్లుడుగారూ చూసుకునేలా మీ సంపాదనలోని ఆస్తి పంపకాలతో సంబంధం లేకుండా నా వాటాగా మొన్నామధ్య నాకు మా అన్నయ్య పంచిచ్చిన అరెకరం పొలాన్ని రాసిద్దామనుకుంటున్నా. చిన్నవాళ్ళ బుద్ధులెట్లా మారుతాయో చెప్పలేం. కానీ, పెద్దది వట్టి అమాయక పక్షి. చెల్లెళ్ళంటే వల్లమాలిన ప్రేమ. దాని చదువు పాడైనా, చెల్లెళ్ళు బాగా చదువుకోవాలని వాళ్ళకోసం పెందలాడే లేచి బాక్సులు కట్టేది’’ పెద్దకూతురి స్వభావాన్ని గుర్తుచేసుకుంటూ అంది సుభద్ర.
‘‘సరేపోనీ, పెద్దమ్మాయినైనా తీసుకెళ్తా రేపు’’ అన్నాడు ఆనందరావు.
‘‘మీరొకరు. అదొచ్చేస్తే అంతే సంగతి.
మీ చిన్న కూతుళ్ళు వంటింటిని యుద్ధరంగం చేసేస్తారు. అదంటే చిన్నప్పట్నుంచీ ఇంటి పనుల్లో నాకు సాయం చేస్తూ అందరి అభిరుచులూ తెలిసున్న పిల్ల. ఎవరేం తింటారో ఎంత వండాలో కొలిచినట్టు చేస్తుంది. మిగతావాళ్ళు వాళ్ళకేమిష్టమో కూడా తెలియనోళ్ళు. అసలైన పండుగంటే వదినగారూ మీరూ కలిసి వండే పిండివంటలే అత్తయ్యా. మేమిద్దరం అందుకోసమే వస్తామని సిగ్గుపడకుండా ఒప్పుకుంటున్నామని నిన్నేగా చిన్నల్లుళ్ళు ఇద్దరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంది’’ అంటూ హాల్లోకొచ్చిన సుభద్ర వంటగదిలో గీర్వాణి లేకపోవటం గమనించి, ‘శారదా... అక్క- మీ బావగారికి తల పడుతున్నట్టుంది. కాస్త గారెలు బాండీలో వేసి తియ్యి.’ ‘కావ్యా, నువ్వా చింతపండు పులిహోర సంగతి చూడు’’’ అంటూ కేకేసింది.
‘‘ఏమిటలా బెల్లంకొట్టిన రాయిలా దారికడ్డంగా నిలబడ్డారు? పక్కకు జరగండి. అది గారెలేస్తే బజ్జీలవుతాయి. ఇది పులిహోర చేస్తే మన కడుపులు హాహాకారాలు చేస్తాయి. త్వరగా వెళ్ళాలి’’ అంటూ పరుగుతీసింది గీర్వాణి వంటింట్లోకి. ఆ వెనుకే హాల్లోకి నడిచాడు వేణు.
‘‘హమ్మయ్య, అక్క వచ్చేసిందిలెండి...
ఆట ఆపొద్దు’’ అంది కావ్య మళ్ళీ పేక చేతిలోకి తీసుకుంటూ.
‘‘మా అక్క బంగారం. ఒక్క నిమిషం అదటు వెళ్ళగానే కేకలేసి నిద్ర పాడుచేసింది. ఈమె అమ్మ కాదు, అత్తలా తయారైంది. భోజనం తయారయ్యాక లేపవే కావ్యా’’ అంటూ మళ్ళీ మంచమెక్కింది శారద.
‘‘చూశారా అన్నయ్యా, ఇదీ మీ మరదళ్ళ వరస. అత్తగారే నయం గట్టిగా కోప్పడ్తారు. కానీ, వీళ్ళ గారాబం ఎక్కువవటానికి వదినగారే కారణం’’ అభిమానంతో కూడిన కినుకగా అన్నాడు అర్జున్‌.
‘‘చూడండర్రా... గారెల్లో ఉప్పు సరిపోయిందా?’’ మొదటి వాయి ప్లేటులో తెచ్చి తలోటి పంచుతూ అడిగింది గీర్వాణి.
‘‘ఓహ్‌... సూపర్‌గా ఉందొదినా.
పైనంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఇక రుచయితే అదరహో’’ అన్నాడు జీవన్‌.
‘‘నీకిప్పుడు తలనొప్పి ఎలా ఉంది వేణూ. డాక్టర్‌ దగ్గరికి వెళ్ళొద్దామా?’’
అడిగాడు ఆనందరావు.

‘‘మీ సంపాదనలోని ఆస్తి పంపకాలతో సంబంధం లేకుండా నా వాటాగా మొన్నామధ్య నాకు మా అన్నయ్య పంచిచ్చిన అరెకరం పొలాన్ని రాసిద్దామనుకుంటున్నా.
చిన్నవాళ్ళ బుద్ధులెట్లా మారుతాయో చెప్పలేం.’’

‘‘పర్లేదు మామయ్యా, డాక్టర్‌ దగ్గరికేమీ వద్దులెండి’’ అన్నాడు వేణు.
‘‘మరైతే భోజనం చేశాక మీరు నాన్నతో బజారుకెళ్ళొచ్చేయండి’’ అంది గీర్వాణి.
‘‘అమ్మో, బజారెళ్తే మళ్ళీ వస్తుందేమో తలనొప్పి’’ కావాలని కొంటెగా ఎవరూ గమనించకుండా భార్య వంక చూసి కన్నుగీటుతూ అన్నాడు వేణు.
‘‘బయటకెళ్ళి అలా తిరిగొస్తే ‘వీడెవడో మొండిఘటంలా ఉన్నాడు, ఇక మన ఆటలు సాగవు’ అనుకుని అదే జడిసి పారిపోతుందిలెండి’’ అంది గీర్వాణి.
‘వదినగారు భలే చతురోక్తులు విసురుతారే’ అని తోడల్లుళ్ళూ, ‘ఇన్నాళ్ళూ మేము సరదాగా ఒక్క మాటన్నా ఊరుకోని అక్క ఇవాళేంటో తనే మా బావను ఆటపట్టిస్తోందే’ ఆశ్చర్యం నటిస్తూ మరదళ్ళూ గలగలా నవ్వేశారు. వాళ్ళతో గీర్వాణి, వేణులు శృతి కలిపారు.
పండగంటే మనసారా నిండే సంతోషమే. ఇప్పుడు కదా ఇంటికి పండగ కళ వచ్చిందని కూతుళ్ళూ అల్లుళ్ళ ముఖాల్లోని నవ్వులు చూసి మురిసిపోయారు సుభద్ర, ఆనందరావులు.

10 నవంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.