close
ఇక్కడ పుస్తకాలు ఉచితం!

వారందరికీ చదువు విలువేమిటో తెలుసు. ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడటానికి చాలా కష్టపడ్డారు. అలాంటి కష్టాల్ని ఇప్పటి విద్యార్థులకు దూరం చేయాలనుకున్నారు. తమ వంతుగా ఎంతో కొంత సాయం చేసి ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. కొందరు పుస్తకాల్ని సేకరించి పేద విద్యార్థులకూ, ప్రభుత్వ పాఠశాలలకూ, గ్రంథాలయాలకూ అందజేస్తుంటే... మరొకరు ఏకంగా గ్రంథాలయాన్నే నిర్మించి పుస్తకాల్ని అందుబాటులో ఉంచుతున్నారు.

పాత పత్రికల్ని విక్రయిస్తూ...

సర్బ్‌జిత్‌ సింగ్‌... ఒకప్పుడు డ్రాపవుట్‌. పంజాబ్‌లోని ముక్త్‌సర్‌ ప్రాంతానికి చెందిన ఈయన కష్టపడి చదివి ఎంఏ, బీఈడీ పూర్తి చేశాడు. చదువు విలువా, పేద విద్యార్థులు పుస్తకాల్ని కొనుగోలు చేయడానికి పడే ఇబ్బందులూ ఈయనకు తెలుసు. దీంతో పేద విద్యార్థుల కోసం తన వంతుగా పుస్తకాల్ని సేకరించి అందించాలని భావించాడు. దీని కోసం ప్రత్యేకంగా ‘రద్దీ టూ ఎడ్యుకేషన్‌’ పేరుతో 2017లో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ తరఫున ప్రజల నుంచి పాత పుస్తకాల్నీ, పత్రికల్నీ సేకరిస్తున్నాడు. వాటిని విక్రయించగా వచ్చిన డబ్బుతో పేద పిల్లలకు అవసరమైన పుస్తకాల్ని కొని ఇస్తున్నాడు. సర్బ్‌జిత్‌ చేస్తున్న ఈ సేవాకార్యక్రమం నచ్చి స్నేహితులూ జత కలిశారు. ముక్త్‌సర్‌లోని బస్టాండ్‌ వద్ద వీరి బుక్‌ బ్యాంక్‌ని ఏర్పాటు చేశాడు. ప్రజల నుంచి పాత పుస్తకాల్నీ, పత్రికల్నీ ఇక్కడ తీసుకుంటారు. ఇందులో ఉన్న పుస్తకాల్ని పేద విద్యార్థులకు అందజేస్తారు. పాత పుస్తకాల్నీ, పత్రికల్నీ తమకు ఇచ్చి పేద విద్యార్థుల చదువుకు అండగా నిలవాలంటూ ముక్త్‌సర్‌ ప్రజలకు ఈ సంస్థ సభ్యులు అవగాహన కల్పిస్తున్నారు.

విద్యార్థులకు ప్రత్యేక గ్రంథాలయం

ప్రకాశం జిల్లా కొరిసెపాడు మండలం రావినూతల గ్రామానికి చెందిన కొడవళ్ల హనుమంతరావుది దిగువ మధ్య తరగతి కుటుంబం. తండ్రి వెంకటేశ్వర్లు కుండలు తయారు చేస్తూ పొలం పనులు చేస్తూ ఆయన్ను చదివించాడు.  ఊళ్లో పాఠశాల లేకపోవడంతో నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి కాలినడకన వెళ్లి చదువుకున్నాడు. అప్పట్లో గ్రంథాలయాలు లేకపోవడంతో ఎక్కువగా దుకాణాలూ, హోటళ్లలోని పుస్తకాల్నీ, పత్రికల్నీ చదివేవాడు. ఎన్నో ఒడుదొడుకుల్ని ఎదుర్కొన్న హనుమంతరావు ప్రస్తుతం అమెరికాలోని మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా కొనసాగుతున్నాడు. చిన్ననాట చదువుకోసం తాను పడ్డ కష్టాల్ని విద్యార్థులు ఎదుర్కోవద్దన్న లక్ష్యంతో రావినూతలలో గౌతమ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీని స్థాపించి 2009లో తండ్రి స్మారకార్థం యాభై లక్షల రూపాయలతో ఓ భవనాన్ని నిర్మించాడు. అందులో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులూ, పెద్దలూ, నిరుద్యోగులకు అవసరమైన పుస్తకాల్ని మూడు వేల దాకా అందుబాటులో ఉంచాడు. గ్రంథాలయ నిర్వహణకు పద్దెనిమిది లక్షల్ని బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయడమే కాకుండా సిబ్బంది జీతభత్యాలకు ఏటా రెండు లక్షల వరకూ చెల్లిస్తున్నాడు. అలాగే కొరిసెపాడు, అద్దంకి, నాగులుప్పలపాడు, ఇంకొల్లు, మద్దిపాడు, జె.పంగలూరు మండలాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఆయనే ప్రత్యేకంగా గ్రంథాలయాల్ని ఏర్పాటు చేశాడు. వీటికి రెండు కోట్ల విలువైన పుస్తకాల్నీ, సామగ్రినీ అందించాడు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాల పేర్లను చెబితే చాలు... మూడు రోజుల్లో హనుమంతరావు గ్రంథాలయానికి చేరవేస్తారు.

సాహిత్య గ్రంథాలు...

విద్యాపరంగా వనపర్తి చాలా అభివృద్ధి చెందింది. అయినా... చాలా మంది పేద పిల్లలు చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికోసం ప్రత్యేకంగా పాత పుస్తకాల్ని సేకరించి ఇవ్వాలని వనపర్తి పట్టణానికి చెందిన కొందరు సాహితీవేత్తలు భావించారు. వీరంతా చదువుకోవడానికి చిన్నప్పుడు ఆర్థికంగా కష్టాలు పడ్డవారే. అప్పటికే ఏర్పాటు చేసిన వనపర్తి సాహితీ కళా వేదిక సంస్థ ద్వారా గత సంవత్సరం ఏప్రిల్‌ 23 (ప్రపంచ పుస్తక దినోత్సవం రోజు)న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన వారి దగ్గరి నుంచి పాత పుస్తకాల్నీ, నోట్‌ పుస్తకాల్నీ సేకరిస్తున్నారు. వీటితోపాటు విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా పాఠశాలలూ, కళాశాలలూ, గ్రంథాలయాలకూ కథలు, విజ్ఞాన, వినోదం, బాలసాహిత్యం, చరిత్ర తదితర అంశాలకి చెందిన పుస్తకాల్నీ పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకూ రూ.10 లక్షలు విలువైన పుస్తకాల్ని సేకరించారు. వాటిని వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పేద పిల్లలూ, పాఠశాలలూ, కళాశాలలూ, గ్రంథాలయాలకూ అందజేశారు. పాత పుస్తకాల్ని పడేయకుండా తమకు అందించి పేద విద్యార్థుల చదువుకు చేయూతనివ్వాలంటూ పుస్తక ప్రచార యాత్ర పేరిట చుట్టుపక్కల జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.