close

ఐఐటీవాళ్ల ఆన్‌లైన్‌ పాఠాలు!

పల్లెటూళ్లలో ఇప్పుడు మొబైళ్లూ, ఇంటర్నెట్‌లకి కొదవలేదు కానీ... అక్కడుండే సర్కారుబళ్లకి టీచర్ల కొరత మాత్రం బాగా ఉంటోంది. దూరమో, ఆర్థికభారమో... కారణమేదైనా ప్రయివేటు స్కూళ్లవైపు వెళ్లలేక ప్రభుత్వ బడుల్లోకి వచ్చే పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. ఆ సమస్యని తీర్చేందుకే హైస్కూలు పిల్లల కోసం తెలుగు సహా తొమ్మిది భాషల్లో పాఠాలని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌  చేస్తున్నారు ఐఐటీ-బాంబే విద్యార్థులు!

జాతీయ సేవా పథకం... ఎన్‌ఎస్‌ఎస్‌... ఈ మధ్య కొన్ని కాలేజీల్లో దీని ఉనికే ఉండటం లేదు. కానీ, ఐఐటీ-బొంబాయిలో ఇప్పటికీ ఇదే అతిపెద్ద విద్యార్థి సంఘం. అందులో సభ్యులుగా ఉంటున్న విద్యార్థులే ఈ ఓపెన్‌ లెర్నింగ్‌ ఇనిషియేటివ్‌(ఓఎల్‌ఐ) అనే యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా ఈ ఆన్‌లైన్‌ పాఠాల్ని చెబుతున్నారు. ఆరు నుంచి పదో తరగతి దాకా ఉన్న చిన్నారుల కోసం గణితం, సైన్స్‌ పాఠాలని రూపొందించి అప్‌లోడ్‌ చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ... ఇలా తొమ్మిది భాషల్లో 350 వీడియోలున్నాయి ఇందులో. ఇవన్నీ కలిసి ఈ మధ్యే లక్షమంది చందాదారుల్ని ఓఎల్‌ఐకి సాధించిపెట్టాయి.

ఇలా ఉంటున్నాయి...
‘అప్పుడప్పుడూ మనమంతా ఓ సరదా లెక్కల ఆట ఆడతాం. మీ మిత్రుడు మిమ్మల్ని మనసులో ఓ అంకెని అనుకోమంటాడు. దానికి ఐదు కలపమని చెబుతాడు. తర్వాత రెండుతో భాగించమనో హెచ్చించమనో అంటాడు. మీరు దాని ఫలితం చెప్పాక... మనసులో మీరనుకున్న అంకె ఏమిటో చెప్పి ఆశ్చర్యపరుస్తాడు. దాని వెనకున్న కిటుకు తెలుసుకోవాలంటే... మీరు బీజీయ సమాసాల పాఠం నేర్చుకోవాలి!’ - అతిక్లిష్టమైన అల్జీబ్రా పాఠాలని కూడా ఇంత సులభంగానే మొదలుపెడుతున్నారు ఓఎల్‌ఐ తెలుగు వీడియోల్లో! వీటికి చక్కటి గ్రాఫిక్స్‌  జతచేస్తున్నారు. సైన్స్‌ పాఠాలు కూడా అంతే... చుట్టూ ఉన్న వస్తువుల ఉదాహరణలతో ముందు ఆయా సబ్జెక్టులపైనున్న భయాన్ని పోగొడుతున్నారు. ఆ తర్వాత ప్రాథమిక సూత్రాలతో అరటి పండు వలిచి పెట్టినంత సులభంగా బోధిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఇలా బడి విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకుని పాఠాలు చెప్పే ఎన్నో వెబ్‌సైట్‌లున్నా అవన్నీ ఎక్కువగా ఇంగ్లిషు, హిందీ భాషలకే పరిమితమవుతున్నాయి. ఎంతోకొంత ఏదో రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి. కానీ డబ్బు ఊసేలేకుండా... ఐఐటీ స్థాయి సాంకేతిక నైపుణ్యంతో పాఠాలని రూపొందించడమే ఓఎల్‌ఐని మిగతావాటికంటే భిన్నంగా నిలుపుతోంది.

ఐఐటీ-బాంబేకి చెందిన ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు 2015లో ‘విద్య’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేశారు. పేద విద్యార్థులకి ఉచితంగా పాఠాలు చెప్పే ఎన్జీఓ అది. ఆ సంస్థ ఈ విద్యార్థుల్ని ప్రాంతీయ భాషల్లో ఉన్న ఆన్‌లైన్‌ పాఠాలని సేకరించి ఇవ్వమని కోరిందట. అందుకోసమని వెతికితే... ఒక్క ఇంగ్లిషులో తప్ప మరే భాషలోనూ పాఠాలు కనిపించలేదు. దాంతో విద్య సంస్థ కోసం ఐఐటీ విద్యార్థులే పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. వాటిని చదివిన చిన్నారులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే నాటి ఐఐటీ-బాంబే ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థి యశ్‌ సంఘ్వీ ఓఎల్‌ఐని ప్రారంభించాడు. అతను ఐఐటీలో చదువు ముగించి వెళ్లాక... మిగతా విద్యార్థులు ఆ పనిని అందిపుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లోని హైస్కూల్‌ సిలబస్‌లని బట్టి ఐఐటీలోని చివరి ఏడాది విద్యార్థులు పాఠాలకి సంబంధించిన కాన్సెప్ట్స్‌ని తయారుచేస్తున్నారు. మొదటి ఏడాది విద్యార్థులు ఈ వీడియో పాఠాలు చెబుతుంటే, రెండూ మూడో ఏడాదివాళ్లు ఎడిట్‌ చేస్తున్నారు. చివరిగా ఆయా విభాగాలకి చెందిన ప్రొఫెసర్‌లు వాటిని చూసి ఆమోద ముద్ర వేశాక వీటిని అప్‌లోడ్‌ చేస్తున్నారు.

నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతంలో...
గిర్ది... జార్ఖండ్‌ రాష్ట్రంలో నక్సల్స్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతం. అక్కడ ఎయిడెడ్‌ బడులున్నా ఉపాధ్యాయుల హాజరీ చాలా తక్కువ. అందుకు తగ్గట్టే పిల్లల అటెండెన్స్‌ కూడా అంతంతమాత్రంగా ఉండేది. అలాంటి చోట, కేవలం ఐఐటీ బాంబే వీడియో పాఠాలని వాడి పిల్లల హాజరీని గణనీయంగా పెంచుకుంది ఓ స్కూలు! ఓఎల్‌ఐ ఛానెల్‌ కామెంట్స్‌ బాక్స్‌లో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో కనిపిస్తుంటాయి. ఈ స్ఫూర్తితోనే ప్రస్తుతం ఆరు నుంచి పదో తరగతి వరకే పాఠాలు చెబుతున్న ఈ ఛానెల్‌ త్వరలో ఒకటి నుంచి ఐదు తరగతులతోపాటూ ఇంటర్‌ పాఠాలనూ బోధించేందుకు సిద్ధమవుతోంది!

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.