close
ఆ గుడిలో బంగారమే ప్రసాదం

సాధారణంగా గుళ్లలో ప్రసాదంగా ఏమిస్తారు... కొబ్బరిచిప్పలూ, బెల్లం, పులిహోరా, లడ్డూ, కేసరీ, దద్ధ్యోదనం. ఏ ఆలయానికి వెళ్లినా దాదాపు వీటినే భక్తులకు  ప్రసాదంగా అందిస్తారు. కానీ, ఆ గుడిలో ప్రసాదంగా ఏమిస్తారో తెలుసుకుంటే కళ్లు ‘బంగారం’లా వెలిగిపోతాయి. ఎందుకో తెలుసా... ఆ ఆలయంలో బంగారాన్నీ, వెండినే ప్రసాదంగా అందిస్తారు. ఆ ఆలయం ఎక్కడుందీ, ఒక్కసారి వెళ్లొద్దాం అనుకుంటున్నారా... అయితే చదవండి.

దీపావళి వేళ లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలూ సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. అంతా మంచే జరగాలంటూ ఎంతో నిష్ఠతో వ్రతాలు నిర్వహిస్తారు. ఆలయాల్ని దర్శించుకుంటూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. పూజల అనంతరం లడ్డూ, పులిహోరా తదితరాల్ని ప్రసాదంగా అందుకుంటారు. అయితే... మధ్యప్రదేశ్‌లోని ఓ ఆలయాన్ని దర్శించుకుంటే విలువైన ప్రసాదాన్ని పొందొచ్చు. అదే... అక్కడి మాళ్వా ప్రాంతం రాత్లాంలో కొలువైన మహాలక్ష్మి ఆలయం. సంపన్న మందిరంగా పేరుగాంచిన ఈ ఆలయం భక్తుల పాలిట కొంగుబంగారంలా అలరారుతోంది. దీపావళి సందర్భంగా ఈ ఆలయంలోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న వారికి పూజారులు ప్రసాదానికి బదులుగా బంగారం, వెండి ఉంగరాల్నీ, నాణేల్నీ అందజేస్తున్నారు.

మహాలక్ష్మి ఇంట్లో కొలువై ఉంటుందని...
కొన్ని దశాబ్దాల కిందట ప్రారంభమైన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. దీపావళిని పురస్కరించుకొని ఆలయంలో మూడురోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. పండుగకు ముందు రోజు ఆలయంలో దంతేరాస్‌(ధనత్రయోదశి) కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. మహాలక్ష్మిని దర్శించుకుని పూజలు చేసిన భక్తులకు తీర్థప్రసాదాల స్థానంలో బంగారం, వెండి ఉంగరాల్నీ, నాణేల్నీ అందిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రసాదంగా తీసుకున్న వాటిని భక్తులు ఎవరికీ విక్రయించరూ... వాటితో ఇతర ఆభరణాల్నీ తయారు చేయించుకోరూ. తమ ఇంట్లోని పూజగదిలోనో, బ్యాంక్‌ లాకర్లలోనో భద్రపరచుకుంటారు. ఇలా
చేస్తే మహాలక్ష్మి తమ ఇంట్లోనే కొలువై ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు.

ఆలయంలో అలంకరణగా...
దీపావళి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులు బంగారం, వెండీ ఆభరణాల్నీ, వస్తువుల్నీ, డబ్బునూ అమ్మవారికి కానుకలుగా సమర్పిస్తారు. మరికొందరు భక్తులు వీటిని ఆలయంలో మూడు రోజుల పాటు ఉంచి పూజలు చేసి అనంతరం ఇంటికి తీసుకెళ్తారు. తమ పిల్లాపాపల్ని చల్లగా చూడాలనీ, సంపద వృద్ధి చెందే భాగ్యం కల్పించాలనీ మహాలక్ష్మిని వేడుకుంటారు. భక్తులు సమర్పించిన కానుకలతో ఆలయ గర్భగుడినీ, ఆలయం లోపలి భాగాల్నీ అలంకరిస్తారు. ప్రతి సంవత్సరం వంద కోట్లకుపైగా విలువైన కానుకలు వస్తుంటాయి. ఈ సంప్రదాయం ఎప్పుడు, ఎలా ప్రారంభమైందో తెలియదుగానీ... భక్తుల నమ్మకాన్ని కాదనలేక కొన్ని దశాబ్దాలుగా అలాగే కొనసాగిస్తున్నామని ఆలయ పూజారులు చెబుతున్నారు. ఆలయంలోని కానుకల్ని కాపాడటానికి సీసీ కెమెరాల మధ్య భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఉత్సవాల అనంతరం వీటిని ఆలయ కమిటీ సభ్యులు భద్రపరుస్తారు. భక్తులు ఆలయానికి తీసుకొచ్చే ప్రతీ కానుకనూ రిజిస్టర్లలో నమోదు చేస్తుంటారు.

ఇలా చేరుకోవచ్చు...
రాత్లాంలోని మహాలక్ష్మి ఆలయానికి రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో వెళ్లొచ్చు. రోడ్డు మార్గమైతే భోపాల్‌, ఉదయ్‌పూర్‌, బన్స్‌వార, నీమచ్‌, ఇండోర్‌, ఉజ్జయిని తదితర పట్టణాల నుంచి ఆలయానికి చేరుకోవచ్చు. దిల్లీ, ముంబయి, అజ్మీర్‌, ఖాండ్వా తదితర ప్రాంతాల నుంచి రైలు మార్గాల్లో రాత్లాం రైల్వే జంక్షన్‌కి వెళ్లొచ్చు. ఇండోర్‌, ఉదయ్‌పూర్‌ ఎయిర్‌ పోర్ట్‌లకు వెళ్లి అక్కడి నుంచి బస్సులూ, ఇతర వాహనాల్లోనూ ఆలయానికి వెళ్లొచ్చు. ఇండోర్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి నూట నలభై కిలోమీటర్లు, ఉదయ్‌పూర్‌ ఎయిర్‌ పోర్టు నుంచి రెండొందల యాభై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది.

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.