close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దానం చేద్దాం రండి!

నువ్వు తిన్నది నేలపాలు, ఇతరులకు పెట్టింది నీపాలు... అన్నారు పెద్దలు. అందుకే కుడిచేత్తో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకుండా గుప్తదానాలు చేయించేవారు. దానధర్మాలు ఇచ్చిపుచ్చుకోవడం మన సంస్కృతిలోనే అంతర్లీనంగా ఉంది. మారుతున్న సమాజ అవసరాలకు తగినట్లుగా అది మరింతగా పెరుగుతోంది. ఇందుకు సంబంధించి ఈ ఏడాది ఇప్పటికే పలు రికార్డులు నమోదు కాగా రాబోయే దశాబ్దం దాతృత్వానికి స్వర్ణయుగమేనంటున్నారు సామాజికవేత్తలు!

షికాగో ప్రయాణమై వెళ్తున్న వివేకానందుడికి అదే ఓడలో ఓ యువకుడు పరిచయమయ్యాడు. పై చదువులకోసం అమెరికా వెళ్తున్న ఆ యువకుడు తనదో మారుమూల పల్లెటూరనీ తల్లిదండ్రులు నిరుపేదలనీ ఎలాంటి కనీస సౌకర్యాలూ లేని ఆ పల్లెనుంచి పట్టణానికి నడిచి వెళ్లి దాతల సాయంతో కష్టపడి చదువుకున్నాననీ చెప్పాడు.

 

చదువు పూర్తయ్యాక ఏం చేద్దామనుకుంటున్నావని అడిగాడు వివేకానందుడు. పెద్ద ఉద్యోగం చేసి బాగా డబ్బు సంపాదిస్తాననీ, తల్లిదండ్రుల్నీ భార్యాబిడ్డల్నీ సుఖపెడతాననీ చెప్పాడు యువకుడు.

‘ఆ తర్వాత...’ అడిగాడు వివేకానందుడు. ‘పిల్లల్ని బాగా చదివించి అమెరికా పంపిస్తాను.’

‘ఆ తర్వాత...’ ‘రిటైరయ్యి దాచుకున్న డబ్బుతో సుఖంగా విశ్రాంత జీవితం గడుపుతాను.’

‘ఆ తర్వాత...’ ‘ఇంకేముంటుంది... ముసలివాడినై చచ్చిపోతా’నని సమాధానం ఇచ్చాడా యువకుడు. అప్పుడు వివేకానందుడు నవ్వుతూ... ‘ఇతరుల సహాయంతో చదువుకున్నావు, రుణం తీర్చుకోవా? నువ్వూ కొందరిని చదివించు. తరవాత వాళ్ళూ నీ దారిలోనే నడుస్తారు. అప్పుడు నువ్వు చచ్చిపోయినా నీ ఊరివాళ్ళ గుండెల్లో చిరంజీవివే...’ చెప్పాడు వివేకానందుడు. అది వినగానే ఆ యువకుడి మొహం మెరిసింది. ‘మీరెవరో తెలియదు కానీ నా కళ్లు తెరిపించారు. జీవితం ధన్యమయ్యే మార్గం చూపించారు. తప్పకుండా అలాగే చేస్తాను’ వినమ్రంగా చెప్పాడా యువకుడు. కాలం మారింది...

కర్ణుడిలా కవచకుండలాల్నీ శిబి చక్రవర్తిలా ఒంటి మీద మాంసాన్నీ కోసిచ్చేంత కాకపోయినా... సమాజం ఇచ్చే అవకాశాలను ఉపయోగించుకుని ఎదుగుతున్నాం కాబట్టి ఆ సమాజానికి ఎంతోకొంత తిరిగి ఇవ్వడం మన కనీసధర్మం. దాన్ని గుర్తిస్తున్నారు చాలామంది. శక్తిమేరకు దానధర్మాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఎవరికి వారే ఎంతోకొంత ఇస్తూ పోవడం కన్నా ఒక పద్ధతి ప్రకారం కలిసి పనిచేస్తే సమాజం మీద మరింతగా ప్రభావం చూపవచ్చన్న ఆలోచనతో సంఘటితమవుతున్నారు మరికొందరు.

కుబేరులు చేయి కలిపారు!
గత మూడు, నాలుగు దశాబ్దాల్లో ప్రపంచం చాలా మారింది. ఆర్థిక, సాంకేతిక, వ్యాపార రంగాల్లో చోటుచేసుకున్న మార్పులు ఎందరినో కుబేరుల్ని చేశాయి. దాంతో అవసరానికి మించి వస్తున్న డబ్బుని అర్థవంతంగా ఖర్చుచేయాలని భావించిన సహృదయులు కొందరు ఒక బృందంగా మార్పుకి శ్రీకారం చుట్టారు. బిల్‌గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ లాంటి వాళ్లు ప్రారంభించిన ‘గివింగ్‌ ప్లెడ్జ్‌’ చాలామందిని కదిలించింది. జుకర్‌బెర్గ్‌, అజీమ్‌ ప్రేమ్‌జీ, నందన్‌ నిలేకని లాంటి వాళ్లందరూ తామూ సమాజానికి తిరిగి ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. బిలియన్‌ డాలర్లకు మించి ఆస్తులున్నవాళ్లకే అర్హత ఉన్న ఈ ప్రతిజ్ఞని గత పదేళ్లలో 23 దేశాలనుంచీ మొత్తం 204 మంది చేశారు. 35 లక్షల కోట్ల రూపాయల్ని సమాజానికి ఇచ్చేశారు. వీరి స్ఫూర్తితో ఆ తర్వాత పలు స్వచ్ఛంద సంస్థలు ఏర్పడ్డాయి. ఏటేటా దానధర్మాల జాబితాలు రూపుదిద్దుకుంటున్నాయి. కొత్తవారికి స్ఫూర్తినిస్తున్నాయి. తాజాగా ఫోర్బ్స్‌ విడుదల చేసిన అమెరికాలోని దానశీలుర జాబితాలో గత ఏడాది రికార్డులన్నీ బద్దలయ్యాయి. మొన్నీమధ్యే మన దేశంలోనూ దానశీలుర జాబితా విడుదలైంది. అందులో చోటుచేసుకున్నవారంతా వేలూ లక్షల కోట్ల ఆస్తులున్నవారే. అలాంటి కుబేరులు వంద మంది ఇచ్చిన విరాళం మొత్తం రూ.4,391 కోట్లు. గత ఏడాది కన్నా 90 శాతం ఎక్కువ. అయితే దీనికన్నా ఎనిమిది రెట్లు ఎక్కువ మొత్తం మనదేశంలో ఏటా విరాళాలుగా చేతులు మారుతున్నట్లు ‘సత్వ’ అనే సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. అంటే ఇచ్చే సామర్థ్యం ఉన్నవారూ ఇస్తున్నవారూ సమాజంలో చాలామందే ఉన్నారు, కాకపోతే అది ఒక క్రమపద్ధతిలో సాగడం లేదని భావించిన కొందరు ‘గివింగ్‌ ప్లెడ్జ్‌’ లాంటి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

సగం ఆస్తి రాసిచ్చారు!
గిరీశ్‌ బాత్రా బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త. కొడుకుని చదివించి ప్రయోజకుణ్ని చేశారు. సంపాదనకు ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేకపోవడంతో భార్య తనూతో కలిసి స్వచ్ఛంద కార్యకర్తలుగా సేవలందిస్తుంటారు. అలా తరచుగా బయటకు వెళ్తున్న వీరు - అవసరానికీ... చేస్తున్నదానికీ మధ్య చాలా అంతరం ఉందనీ, ఎంతమంది ఎన్నివిధాలుగా కృషిచేస్తున్నా పేదలకు నిత్యం పోరాటం తప్పటం లేదనీ గుర్తించారు. ఆ నేపథ్యంలో మరికొందరు స్నేహితులతో కలిసి వారు మొదలుపెట్టిందే ‘లివింగ్‌మైప్రామిస్‌’. కోటి రూపాయల పైన ఆస్తి ఉన్నవారెవరైనా తమ ఆస్తిలో సగం సమాజానికి ఇచ్చేస్తామని ప్రతిజ్ఞ చేస్తే ఆ వివరాలను ‘లివింగ్‌మైప్రామిస్‌’ వెబ్‌సైట్‌లో పెడతారు. ఏడాది తిరిగేసరికే ముప్పై మందికి పైగా ఈ ప్రతిజ్ఞ చేయడం విశేషం. ఈ సంఖ్య యాభైకి చేరాక అందరూ ఒకచోట కలుసుకుని భవిష్యత్తులో క్రియాశీలంగా ఏంచేయాలన్నదీ చర్చిస్తాం- అంటున్నారు గిరీశ్‌. ఈరోజుల్లో మధ్య తరగతి అంటేనే కోటి రూపాయల దాకా ఆస్తి ఉంటుంది కాబట్టి అది కనీస స్థాయిగా పెట్టుకున్నామనీ, వందకోట్లు ఉన్నవాళ్లు కోటి రూపాయలు దానం చేయడం కన్నా కోటి ఉన్నవారు అందులో సగం దానం చేయడం చాలా గొప్ప విషయమనీ అందుకే కచ్చితంగా ఇంత అనికాకుండా సగం ఆస్తి అన్న నియమం పెట్టామనీ అంటారు గిరీశ్‌. ఆ ఆస్తితో ఏం చేయాలీ ఎలా చేయాలీ అన్నది ఇచ్చిన వారిష్టమే.

సమాజానికి తిరిగివ్వాలనే...
‘నేను ఐఐటీ, ఐఐఎంలలో చదువుకున్నాను. ప్రభుత్వం బోలెడు సబ్సిడీ భరించి ఈ సంస్థల్లో చదువుకునే అవకాశాన్నిస్తోంది. దాన్ని ఉపయోగించుకున్న నాపై సమాజానికి తిరిగివ్వాల్సిన బాధ్యత ఉంది. మాకు పిల్లలు లేరు. దాంతో మేమిద్దరమూ ఇప్పటివరకూ పేద పిల్లలకు ఫీజులు కడుతూ చదివిస్తున్నాం. చదువు జీవితాలను ఎంతగా మారుస్తుందో ప్రత్యక్షంగా చూశాక ఈ దిశగా పకడ్బందీగా ఏదైనా చేయాలనుకున్నాం. అందుకే ‘లివింగ్‌మైప్రామిస్‌’కి వాగ్దానం చేశాం. విద్యా పరిశోధనారంగంలో ఒక మంచి ప్రాజెక్టుకోసం మా ఆస్తి అంతా ఖర్చుపెడతాం’ అంటారు అపర్ణా శ్రీధర్‌ రాజగోపాలన్‌.

ఉమాకాత్యాయనీ రామనాథన్‌ దంపతులు కూడా మధ్య తరగతి కుటుంబాలనుంచీ వచ్చినవారే. ఇద్దరివీ ఉన్నతోద్యోగాలే కాబట్టి తమ సంపాదన అవసరాలకు మించి ఉందనిపించింది వారికి. దాంతో సమాజం కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకోగానే కాత్యాయని స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పల్లెల్లో పేద పిల్లల చదువుమీద దృష్టిపెట్టింది. అందులో పూర్తిగా నిమగ్నమై సమాజంలోని పరిస్థితుల్ని చూశాక సగం కాదు, మొత్తం ఆస్తి దానికోసమే ఖర్చుపెట్టాలనుకున్నారు ఈ దంపతులు. ఎప్పుడో మనం పోయాక ఆస్తిని సేవాసంస్థలకు ఇచ్చేస్తూ విల్లురాస్తే దాన్ని అమలుచేయడంలో ఎన్నో సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ఇచ్చేదేదైనా మనం ఉన్నప్పుడే ఇచ్చేయాలి. దానివల్ల జరుగుతున్న మేలును ప్రత్యక్షంగా చూస్తే మనకీ తృప్తిగా ఉంటుంది- అంటారు మీనా రఘునాథన్‌ దంపతులు. తమ డబ్బుని ఏ రంగంలో ఖర్చుచేయాలనేదానిపై వీరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

‘తల్లిదండ్రులు చదివిస్తే చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నాం. ఇల్లూ కారూ పిల్లల్ని చూసుకునే కేర్‌సెంటరూ... అన్ని సౌకర్యాలూ ఉంటాయి మనకి. కానీ మన ఇళ్లలో పనిచేసేవాళ్లకీ, చిన్నాచితకా పనులు చేసి బతికే కార్మికులూ కూలీల పిల్లలకీ ఇలాంటి సౌకర్యాలేవీ ఉండవు. వాళ్లెలా చదువుకుంటారు... వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనదే. మనం ఒక్కళ్లమే ప్రపంచాన్ని మార్చేయలేకపోవచ్చు. కానీ ఒక్కొక్కరం కొన్ని జీవితాలనైనా ప్రభావితం చేయగలం కదా... చేతనైన రీతిలో ఆ పని చేద్దామని నిర్ణయించుకున్నాక మా పిల్లల్నీ కూర్చోబెట్టి చర్చించాం. వారసత్వంగా తమకు చెందాల్సిన మా ఆస్తుల మీద వారు హక్కు  వదులుకోవటమే కాదు, తమ వంతు సాయమూ చేస్తామని మాటిచ్చారు. అంతకన్నా ఏం కావాలి...’ అంటారు ఫియోనా డియాస్‌, లూయిస్‌ మిరాండా దంపతులు. లివింగ్‌మైప్రామిస్‌కి వాగ్దానం చేసిన వారందరివీ దాదాపు ఇలాంటి అభిప్రాయాలే.

ఇతరుల్నీ ఒప్పిస్తారు!
ఫస్ట్‌ గివర్స్‌ క్లబ్‌ రోజుల్నుంచీ దాతృత్వ కార్యక్రమాల్లో ముందు వరసలో నిలుస్తున్న అమిత్‌ చంద్ర చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. ‘దానం చేయడానికి మా దగ్గర డబ్బుండేది కాదు అందుకని అమ్మ ఇతర రూపాల్లో సాయం చేయమనేది. మేమందరమూ ఇరుగూపొరుగూ వారికి ఏదో ఒకపని చేసిపెడుతూ ఉండేవాళ్లం’ అని చెప్పే అమిత్‌ ఉద్యోగంలో చేరగానే భార్యతో కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు. జీతంలో పదిశాతం దాతృత్వానికి కేటాయించారు. చేసేది పెద్ద ఉద్యోగం కాబట్టి అది పెద్దమొత్తమే అయ్యేది. ఆ కార్యక్రమాల్లో భాగంగా పెద్దపెద్దవాళ్లతో పరిచయాలయ్యేవి. అమిత్‌ సేవాభావాన్ని చూసిన ఒక స్నేహితుడు ‘అట్లాంటిక్‌ ఫిలాంత్రఫీస్‌’ వ్యవస్థాపకుడు చక్‌ ఫీనే జీవితకథని బహుమతిగా ఇచ్చాడు. సొంత ఇల్లు కూడా ఏర్పాటుచేసుకోకుండా అద్దె ఇంట్లో ఉంటూ దాదాపు 70వేల కోట్ల రూపాయల్ని విద్యాసంస్థలకు విరాళంగా ఇచ్చేసిన వ్యక్తి చక్‌. అతడి జీవిత చరిత్ర అమిత్‌ దంపతులను కదిలించింది. ఇద్దరూ కలిసి తమ సమయాన్నీ సంపాదననీ కూడా సమాజంకోసమే వినియోగించడం మొదలెట్టారు. అత్యవసరమైన సేవాకార్యక్రమాల్ని ఎంచుకుని వాటి మీద దృష్టి పెట్టడమే కాక మరికొందరినీ ఒప్పించి, తమతో కలిసి పనిచేసేలా చేయగల సత్తా అమిత్‌ చంద్రది. రాకేశ్‌ ఝన్‌ఝన్‌ వాలా లాంటి హేమాహేమీల్ని సైతం ఒప్పించి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ దంపతులు.

ఆస్తే కాదు, అవయవాలూ...
కేరళకు చెందిన కొచౌసెఫ్‌ చిట్టిలప్పిలి విజయవంతమైన వ్యాపారవేత్తగానే కాదు, వితరణలోనూ తనదైన ప్రత్యేకత చూపించారు. ఒక ఫౌండేషన్ని నెలకొల్పి విద్య, వైద్య సౌకర్యాల కల్పనకు తన ఆస్తిలో మూడో వంతు ఖర్చుపెట్టారాయన. గత ఏడాది అరవయ్యో పుట్టినరోజు జరుపుకున్న వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఒక మూత్రపిండాన్ని దానం చేసి సంచలనం సృష్టించారు. దాన్ని వైద్యులు ఓ నిరుపేద రోగికి అమర్చారు. ఆ రోగి భార్య మూత్రపిండం అతనికి పనికిరాలేదు. అందుకని దాన్ని మరొక పేదరోగికి ఇప్పించేలా- అలా ఒకరి నుంచి సాయం పొందినవారు- మరొకరికి సాయం చేసేలా ఒక గొలుసు సంప్రదాయానికి తెరలేపారు కొచౌసెఫ్‌.

ఇచ్చే రోజులివి!
అవసరమూ, చేయాలనిపించే మనసూ... తప్ప దానధర్మాలకు ఒక సమయం సందర్భం అక్కర్లేదు. అయితే సాధారణంగా అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్ని పండగ సీజన్‌ అంటారు. దసరా, దీపావళీ, క్రిస్మస్‌ పండగలు వచ్చే ఈ నెలల్లో షాపింగ్‌ సందడీ పార్టీల హడావుడీ ఉంటుంది. అందరూ ఆనందంగా, వాతావరణం ఆహ్లాదంగా ఉండే ఈ సీజన్‌లోనే దానధర్మాలూ ఎక్కువగా చేస్తారట. అందుకే వాటిని ప్రోత్సహించే కార్యక్రమాలకూ ఈ సీజన్‌నే ఎంచుకున్నారు. అక్టోబరులో గాంధీ జయంతితో మొదలుపెట్టి వారం రోజుల పాటు నిర్వహించే ‘గివింగ్‌ వీక్‌’, ‘దాన్‌ ఉత్సవ్‌’లతో పంచుకునే వేళ మొదలవుతుంది. పలు ప్రభుత్వేతర సేవా సంస్థలూ స్వచ్ఛంద కార్యకర్తల చొరవతో పదేళ్ల క్రితం మొదలైన ‘దాన్‌ ఉత్సవ్‌’ సమాజం మీద మంచి ప్రభావం చూపుతోంది. పాఠశాలలూ కళాశాలలతో మొదలుపెట్టి కార్పొరేట్‌ సంస్థలవరకూ, ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థల నుంచీ ఐదు నక్షత్రాల హోటళ్ల వరకూ రకరకాల సేవాకార్యక్రమాలతో తమ సంపదనీ సమయాన్నీ పంచుకుంటూ ఎందరి కళ్లల్లోనో వెలుగులు పూయిస్తున్నాయి. గివ్‌ ఇండియా, మిలాప్‌, కెట్టో లాంటి వెబ్సైట్లు తెరిస్తే చాలు... విద్య, వైద్యం, వైకల్యం, వృద్ధాప్యం... ఇలా రకరకాల సమస్యలు. కొన్నిటికి సమయం చాలు, చాలా వాటికి డబ్బే కావాలి. సమస్య తీవ్రతనీ, అవసరమైన మొత్తాన్నీ వివరంగా తెలియజేస్తాయి ఈ వెబ్‌సైట్లు. ఏ కారణానికి ఇవ్వాలనుకుంటామో నిర్ణయించుకోవటం మన ఇష్టమే. శక్తిమేరకు ఇవ్వదలచుకున్న డబ్బును ఆన్‌లైన్‌లో చెల్లించేయొచ్చు. మనం ఇచ్చిన డబ్బు నేరుగా అవసరార్థులకే చేరేలా చూస్తాయి ఈ ఆన్‌లైన్‌ వేదికలన్నీ.

ఎన్నో ఇవ్వగలం!
ఇవ్వాలనే ఉంది కానీ ఒకరికి ఇవ్వగల స్థాయి మనకు లేదనుకునేవారూ చాలామందే ఉంటారు. డబ్బు ఇచ్చే స్తోమత లేనివారు సమయాన్నీ, తమ నైపుణ్యాల్నీ సమాజంకోసం వినియోగించవచ్చు. పేద పిల్లలకు చదువు చెప్పడానికీ, వృద్ధులకూ, దివ్యాంగులకూ సేవలు చేయడానికీ స్వచ్ఛంద కార్యకర్తల అవసరం ఎంతో ఉంటుంది. అలాంటి పనులేవైనా చేయొచ్చు. ఇంటి దగ్గరే ఉండి ఆన్‌లైన్లో పాఠాలు చెబుతున్నవారూ ఉన్నారు.

2018 నుంచి 2022 వరకూ మనదేశం రోజూ 70 మంది డాలర్‌ మిలియనీర్స్‌(ఏడు కోట్ల కన్నా ఎక్కువ ఆస్తి కలిగివుండేవారు)ని తయారుచేస్తుందని ఆర్థికవేత్తల అంచనా. యువతరంలో ప్రతి ఐదుగురిలోనూ ఒకరు సమాజానికి తిరిగివ్వడాన్ని తమ జీవితాశయాల్లో ఒకటిగా చెబుతున్నారనీ ఇది మంచి పరిణామమనీ సామాజిక పరిశీలకులు అంటున్నారు. ఈ పరిణామాలన్నీ... వచ్చే దశాబ్దం దాతృత్వానికి స్వర్ణయుగమేనన్న నమ్మకాన్ని పెంచుతున్నాయి.

*

ఒకరోజు కర్ణుడు బంగారుగిన్నెలో సుగంధభరితమైన లేపనమేదో కలిపి ఒంటికి రాసుకుంటుండగా అక్కడికి వచ్చిన కృష్ణుడు ‘గిన్నె చూడముచ్చటగా ఉంది కర్ణా...’ అని మెచ్చుకున్నాడు.

‘తీసుకో కృష్ణా’ అని ఆ గిన్నెను ఇవ్వబోయాడు కర్ణుడు. ‘ఏదైనా ఇచ్చేటప్పుడు కుడిచేత్తో ఇవ్వాలి కదా, మరి నువ్వేంటి ఎడమచేత్తో ఇస్తున్నావు’ అడిగాడు కృష్ణుడు.

‘నువ్వు గిన్నె బాగుందని చెప్పిన సమయానికి అది నా ఎడమచేతిలోనే ఉంది. దాన్ని కుడిచేతిలోకి మార్చుకుని ఇచ్చేలోపు నా మనసు మారిపోవచ్చు. అందుకని...’ చెప్పాడు కర్ణుడు.

అర్థమైంది కదా... దానం చేయాలనిపించాలే కానీ, ఇక రెండో ఆలోచన ఉండకూడదట మరి!

34వేల కోట్లు!

మనదేశంలో ఏటా 34వేల కోట్ల రూపాయల్ని దానధర్మాలకింద ఇస్తున్నారనీ, అలా ఇచ్చేవారిలో చాలామంది మధ్యతరగతీ ఆ కింది స్థాయివారేననీ అంటోంది ‘సత్వ’ అనే సంస్థ వెలువరించిన అధ్యయనం. 2018 వరల్డ్‌ గివింగ్‌ ఇండెక్స్‌ ప్రకారం ఇచ్చేవారి సంఖ్యలో మనదేశమే మొదటి స్థానంలో ఉంది. అయితే, దాతలను జనాభా నిష్పత్తితో పోల్చినప్పుడు మాత్రం 89వ స్థానంలో ఉంది. ఇక, మన విరాళాల్లో  90 శాతం ధార్మిక సంస్థలకు వెళ్తుండగా 10 శాతం మాత్రమే సామాజిక సేవాసంస్థలకు అందుతున్నాయట. సత్వ వెలువరించిన ‘ఎవిరీడే గివింగ్‌ ఇన్‌ ఇండియా రిపోర్ట్‌ 2019’ ప్రకారం గత పదేళ్లుగా డబ్బు ఇవ్వడమే కాదు, స్వచ్ఛందసేవకులుగానూ పౌరుల పాత్ర చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుతోంది. నానాటికీ పెరుగుతున్న ప్రవాసభారతీయుల సంఖ్యా, దేశంలో ఆర్థిక ప్రమాణాలు పెరుగుతున్న వైనమూ చూస్తుంటే మరో ఐదేళ్లలో భారతీయుల ఇచ్చే సామర్థ్యం నాలుగు రెట్లు పెరిగే అవకాశముందన్నది పరిశీలకుల మాట.

లాభాలెన్నో!

దాతృత్వం- స్వీకరించేవారికి భుక్తినీ ఇచ్చేవారికి ముక్తినీ ప్రసాదిస్తుందని పెద్దలంటారు. ముక్తి సంగతి ఏమో కానీ పంచుకునే స్వభావమున్నవాళ్ల జీవితం ఆనందంగా సాగుతుందనీ, ఆనందం ఆరోగ్యాన్నీ తద్వారా ఆయుష్షునూ పెంచుతుందనీ అధ్యయనాలు తేల్చిచెబుతున్నాయి.
* ఎవరికైనా ఏదైనా సాయం చేయగానే హ్యాపీ హార్మోన్‌గా పేరొందిన డోపమైన్‌ విడుదలై మనసుకెంతో హాయి కలిగిస్తుందని ద యూనివర్శిటీ ఆఫ్‌ ది సౌత్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
* విమెన్స్‌ ఫిలాంత్రఫీ ఇన్‌స్టిట్యూట్‌ వారి నివేదిక ప్రకారం- ఇవ్వడంలోని ఆనందం కాసేపటితో అయిపోదు, జీవితకాలం దాని ప్రభావం ఉంటుంది. ఇచ్చేవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. మొదటిసారి ఇచ్చినప్పుడు పురుషులు ఎక్కువగా సంతోషిస్తే,  ఇచ్చే సామర్థ్యం పెరిగినపుడల్లా స్త్రీలు ఎక్కువ సంతోషిస్తారట.
* సేవా కార్యక్రమాల్లో కార్యకర్తగా పాల్గొనడం వల్ల మానసిక కుంగుబాటు సమస్యను తగ్గించుకోవచ్చని ఆక్స్‌ఫర్డ్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ నివేదిక పేర్కొంది.
* ఏ రూపంలోనైనా ఒకరికి సాయపడే స్వభావం రక్తపోటునీ, మానసిక ఒత్తిడినీ కూడా తగ్గిస్తుందనీ, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుందనీ పలు పరిశోధనలు తేల్చాయి.
* హెల్త్‌ సైకాలజీలో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం సేవాకార్యక్రమాల్లో పాల్గొనడం అలవాటుగా ఉన్నవారు ఆత్మవిశ్వాసంతో జీవిస్తారట, దీర్ఘాయుష్కులవుతారట. వృద్ధాప్యంతో వచ్చే సమస్యల తీవ్రత కూడా చాలా తక్కువగా ఉంటుందట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.