close

సినిమా ఛాన్స్‌ కావాలా..?!

‘నాకుగానీ సినిమాల్లో ఒక్క ఛాన్స్‌ వస్తేనా...!’ - కాలేజీ ఫంక్షన్‌లో మోనోయాక్షన్‌ చేసేవాళ్ళ దగ్గరి నుంచి టిక్‌టాక్‌లో వీడియోలు పెట్టి లైకులు అందుకుంటున్నవాళ్ళదాకా అందరిదీ ఇదే మాట. ఆ ఆశతోనే సినిమా అవకాశాల కోసం కృష్ణానగర్‌ బాట పడుతున్నారు. ఇలాంటివాళ్లు మోసపోకుండా వాళ్లని సరైన దారిలో ‘కాస్టింగ్‌ డైరెక్టర్‌’ వద్దకు చేర్చేందుకు ఇప్పుడు ఆప్‌లూ, వెబ్‌సైట్‌లూ ఎన్నో వస్తున్నాయి. వాటిలో కొన్నింటి పరిచయమిది...

పూరీ జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌: తెలుగు సినిమా రంగానికి ఎంతోమంది కొత్త నటీనటుల్ని పరిచయం చేసిన పూరీ, ప్రతిభావంతులైన యువతీ యువకుల్ని ఆహ్వానిస్తూ ఏర్పాటుచేసిన వెబ్‌సైట్‌ ఇది. సినిమా రంగంపైన ఆసక్తి ఉన్నవాళ్లు ఇందులో తమ ఫొటోలూ వివరాలని నమోదుచేసుకోవచ్చు. ఇదికాకుండా, పూరీ జగన్నాథ్‌ నటి ఛార్మితో కలిసి ‘పూరీ కనెక్ట్‌’ అనే సంస్థనీ స్థాపించారు. సినిమాలూ, యాడ్‌ ఫిల్మ్‌ల నిర్మాణంతోపాటూ యువతీయువకుల ప్రతిభని సినిమా అవసరాలకి తగ్గట్టు సానపట్టే పనిని (టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌) కూడా దీని ద్వారా తలకెత్తుకున్నారు పూరీ. వివరాల కోసం www.purijagannathtouringtakies.comని చూడొచ్చు.

క్లిక్‌ సినీ క్రాఫ్ట్‌: నటుడు జగపతిబాబు సీఎండీగా వ్యవహరిస్తున్న సంస్థ ఇది. నటన, రచన, దర్శకత్వం, సంగీతం... ఇవే కాదు, సినిమాకి సంబంధించిన 24 విభాగాల్లోనూ ప్రతిభావంతుల్ని ప్రోత్సహిస్తోందీ సంస్థ. అమెరికాలోని మిషిగన్‌కి చెందిన ప్రవాస భారతీయులు శ్రీధర్‌ బండారి డైరెక్టర్‌గా, రమేశ్‌ బండారి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ డి.విద్యాసాగర్‌ దీనికి క్రియేటివ్‌ హెడ్‌గా ఉంటున్నారు. నటులు కావాలనుకునేవాళ్లు తమ ఫొటోలనీ, ఔత్సాహిక దర్శకులు తమ లఘుచిత్రాలనీ సంస్థ  ఆప్‌లో నమోదుచేసుకోవచ్చు. వాళ్లలో ది బెస్ట్‌ అనుకున్నవాళ్లని ఎంపిక చేసి హైలైట్‌ చేయడం www.clickcinectaft.com వెబ్‌సైట్‌ ప్రత్యేకత.

సినీ హైర్‌: ఒక్క సినిమా రంగమే కాకుండా షార్ట్‌ఫిల్మ్స్‌, టీవీ సీరియల్స్‌లోనూ ప్రస్తుతం ఎన్నో అవకాశాలున్నాయి. వాటన్నింటికీ సంబంధించి సుమారు వందకు పైచిలుకు విభాగాల్లో పనిచేసేందుకు కావాల్సిన కళాకారుల్ని ఆహ్వానిస్తోందీ ఆప్‌. గత రెండేళ్లలో యాభైకి పైగా లఘుచిత్రాలు తీసి సినిమా ప్రముఖుల ప్రశంసలూ అందుకున్న యువ దర్శకుడు మానస్‌ దండనాయక్‌ దీన్ని ప్రారంభించారు. ఈ యాప్‌లో నమోదు చేసుకున్నవాళ్లకి సినిమా రంగంలోని సీనియర్ల చేత శిక్షణ కూడా ఇప్పిస్తున్నాడు మానస్‌. cinehire ఆప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఉంది.

డేజ్లర్‌: ప్రముఖ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ క్వికర్‌ సినిమా రంగం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆప్‌ ఇది. టాలీవుడ్‌ మాత్రమే కాకుండా బాలీవుడ్‌, కోలీవుడ్‌లలో ఉన్న అవకాశాలని ఇది చూపిస్తుంది. ఆయా సినీ పరిశ్రమలకి సంబంధించిన కాస్టింగ్‌ డైరెక్టర్‌లు ఇప్పటికే ఇందులో తమక్కావాల్సిన కళాకారుల కోసం యాడ్‌లు పెడుతున్నారు. భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందిన యువతీయువకులైనా తమ ప్రతిభా విశేషాలని చెబుతూ ఫొటోలూ, వీడియోలని dazzlr ఆప్‌లో నమోదు
చేసుకోవచ్చు.

ఫస్ట్‌ కట్‌ : నటనా రంగంలోకి వెళ్లాలనుకునే యువతీయువకులు తొలి ఆడిషన్‌ అవకాశం రావడానికే నానా అవస్థలూ పడాల్సి ఉంటుంది. ఆ బాధలేకుండా వాళ్లు నేరుగా తమకు తోచినట్లు వీడియో ఆడిషన్స్‌ తీసి ఆప్‌లో పెట్టే అవకాశాన్ని www.firstcut.co.in కల్పిస్తుంది. నటుల అవసరం ఉన్న నిర్మాణ సంస్థలు వీళ్లని నేరుగా తీసుకునే సౌలభ్యాన్నీ అందిస్తోంది. అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ హంగులతో... ఉన్నత ప్రమాణాలతో అలరారే ఫస్ట్‌ కట్‌ దేశంలోనే నంబర్‌ వన్‌ ఆడిషన్‌ వేదికగా పేరొందింది. లక్షకు పైచిలుకు ఇన్‌స్టాల్స్‌ సాధించుకున్న ఘనత దీనిది.

 

ఇవే కాదు...
ఈ ఐదే కాదు... సినీ రంగంలోకి రావాలనుకునేవాళ్లకి సాయం చేస్తామంటూ వందలాది వెబ్‌సైట్‌లూ, ఆప్‌లూ ఆన్‌లైన్‌లో ఉన్నాయి. వీటిల్లో చాలావరకూ బోగస్‌ చిరునామాలూ మొబైల్‌ నంబర్‌లతో పనిచేస్తున్నాయి. కాబట్టి, ఆప్‌లలో తమ పేర్లూ, వివరాలని నమోదుచేసేటప్పుడు వాటి స్థాపకులూ, వాళ్ల అనుభవం, ఇప్పటిదాకా వాళ్లు సాధించిపెట్టిన అవకాశాలూ వంటివన్నీ దృష్టిలో పెట్టుకునే ముందడుగేయాలి. అప్పుడే- మీదైన కలల ప్రపంచంలోకి ఆనందంగా అడుగుపెట్టగలుగుతారు!

27 అక్టోబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.