close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైలు లేటయితే పెనాల్టీ చెల్లిస్తారు

ఆ రైల్లోకి ఎక్కగానే రైలు హోస్టెస్‌(కోచ్‌ క్రూ) స్వాగతం పలుకుతారు. లగేజీ సర్దిపెడతారు. తినడానికి ఏం అడిగినా సీటు దగ్గరికే తెచ్చిస్తారు. బోరు కొడితే మన సీటుముందున్న స్క్రీన్‌లో సినిమాలూ చూసుకోవచ్చు. అవును మరి... ఇది చూడ్డానికే రైలుగానీ విమానంలో ఉండే సకల సౌకర్యాలూ ఇందులో ఉన్నాయి. ఈ మధ్యనే పట్టాలెక్కిన తొలి ప్రైవేట్‌ ట్రెయిన్‌ తేజస్‌ ప్రత్యేకతలు ఒకటా రెండా...

రైళ్లలో కేటరింగ్‌, రిజర్వేషన్‌ బాధ్యతల్ని ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) అనే ప్రయివేటు సంస్థకి అప్పగించిన భారతీయ రైల్వే ఈ మధ్య సొంత రైలును నడుపుకునే అవకాశాన్ని కూడా ఆ సంస్థకి ఇచ్చింది. అలా మనదేశంలో తొలి ప్రైవేటు రైలుగా గుర్తింపు పొందిన తేజస్‌ దిల్లీ- లఖనవూ మార్గంలో పరుగులు తీస్తోంది.

* లఖనవూ నుంచి ఉదయం 6.15 నిమిషాలకు బయల్దేరి దిల్లీ వెళుతుంది. మళ్లీ సాయంత్రం నాలుగుగంటలకు తిరుగు ప్రయాణమవుతుంది. మధ్యలో కాన్పూరు, ఘాజియాబాద్‌ స్టేషన్లలో మాత్రమే తేజస్‌ ఆగుతుంది. 550 కిలోమీటర్ల దూరాన్ని
ఆరుగంటల్లోనే చేరుకుంటుంది ఈ రైలు.
* టికెట్‌ బుక్‌ చేసుకునేటప్పుడు ఇంటి నుంచి లగేజీ తీసుకెళ్లే ఆప్షన్‌ను ఎంచుకుంటే... ప్రయాణ సమయానికి ఐఆర్‌సీటీసీ సిబ్బంది మన ఇంటి వద్దకే వచ్చి తీసుకెళతారు. మళ్లీ మనం వెళ్లే చోటుకు లగేజీ అందజేస్తారు.
* సమయానికి రైలు పట్టాలపైకి రాకున్నా, గమ్యస్థానానికి చేరకపోయినా ఐఆర్‌సీటీసీ డిలే ఛార్జీ అందిస్తుంది. గంట ఆలస్యానికి వంద రూపాయలూ, రెండు గంటలూ, అంతకు మించి అయితే 250 రూపాయలు చెల్లిస్తుంది.
* ప్రయాణికులకు ఉచితంగా పాతికలక్షల ప్రమాద బీమానూ, దొంగతనం జరిగితే లక్షరూపాయలు రికవరీగానూ ఇస్తుంది తేజస్‌.
* ఇది బయట చూడ్డానికి రైలులానే ఉన్నా లోపల మాత్రం ఫ్లైట్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉండటం దీని ప్రత్యేకత.
* ఛైర్‌ కార్‌ టైపు కోచ్‌లు పన్నెండూ, 750 సీట్లూ ఉన్న ఈ రైలు మొత్తానికీ ఏసీ సౌకర్యం ఉంటుంది. అలానే ట్రెయిన్‌ అంతటా ఉచిత వైఫై, భద్రత కోసం సీసీ కెమెరాలూ, జీపీఎస్‌ స్క్రీన్లూ అమర్చి ఉండి తరవాతి స్టేషన్‌ పేరును వాటిలో డిస్‌ప్లే చేస్తారు.
* దీనిలోని ఎగ్జిక్యూటివ్‌ కోచ్‌ మిగతావాటి కంటే కాస్త విలాసవంతంగా ఉంటుంది. సీటుకు ముందు ఫ్లైట్‌లో మాదిరి స్క్రీన్లు ఉంటాయి. అలానే చూపులేని వారికోసం బ్రెయిలీ స్క్రీన్ల ఏర్పాటూ ఉంది ఇందులో.
* సీటుపైన రీడింగ్‌లైటూ, కోచ్‌ క్రూ కాలింగ్‌ బటన్‌ కూడా అమర్చి ఉంటాయి.
* తేజస్‌లోని బయో వ్యాక్యూమ్‌ టాయిలెట్లు అతి తక్కువ నీటిని ఉపయోగించుకోవడంతోపాటు ఎక్కువ శుభ్రంగా ఉంటాయి. సెన్సర్లతో పనిచేసే పంపులూ, హ్యాండ్‌ డ్రయ్యర్లూ, టాయిలెట్‌ ఆక్యుపెన్సీ లైట్ల ఏర్పాటు కూడా ఉంది.
* రైలు ఆగగానే వాటంతట అవే తెరుచుకునే డోర్లు దీని ప్రత్యేకం. బోగీల మధ్య కూడా సెన్సర్లతో వాటంతటవే తెరుచుకునే అద్దాల తలుపులుంటాయి.
* తేజస్‌లోకి ఎక్కాక కోచ్‌ క్రూ స్వాగతం పలికి లగేజీ సర్దిపెడతారు. సీటువద్దకే మంచినీళ్లూ, కాఫీ, టీలూ, భోజనం, స్నాక్స్‌, పేపర్లూ, పత్రికలూ అందిస్తారు.
* అరవై రోజులముందు నుంచీ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, ఆప్‌ల ద్వారా టికెట్‌ బుక్‌చేసుకోవచ్చు. ఇండియన్‌ రైల్వేస్‌ మాదిరి తత్కాల్‌ టికెట్‌, ఇతర రాయితీ సౌకర్యాలేమీ దీనికి లేవు. పట్టాలపై పరుగులు తీసే ఈ ఫ్లైట్‌ను మనమూ ఎక్కేద్దామా ఒకసారి.

27 అక్టోబరు 2019

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు