close

తెలుగబ్బాయే... తమిళ బిగ్‌బాస్‌!

ముగెన్‌ రావు... ప్రస్తుతం తమిళ యువత నోళ్లలో నానుతున్న పేరు. కమల్‌హాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్‌బాస్‌-3’లో విజేతగా నిలిచిన ఈ కుర్రాడు తెలుగువాడు. పుట్టిపెరిగింది మలేషియాలో. వాళ్లనాన్న ప్రకాశ్‌రావు కృష్ణ అక్కడ గాయకుడూ, నటుడు కూడా. అలా ముగెన్‌ చిన్నప్పటి నుంచే పాటగాడయ్యాడు. టీనేజీలో కాస్త దారి తప్పి మలేషియా మాఫియా ప్రపంచం చుట్టూ తిరిగి ఎన్నో ఎదురు దెబ్బలు తిని బయటపడ్డాడు. అప్పుడే ఆర్థిక పరిస్థితి బాగోలేక నాన్నతోపాటూ తానూ స్టేజీ షోలు ఇవ్వాల్సి వచ్చింది. అదే అతని దశని మార్చింది. మలయ్‌, తమిళం, తెలుగు, మలయాళం పాటలతో అక్కడ బాగా పాపులర్‌ అయిపోయాడు. తన మాతృభాష తెలుగుతోపాటూ తమిళంలోనూ వీడియో పాటలు రాసి డైరెక్ట్‌ చేయడం మొదలుపెట్టాడు. ఆ పాపులారిటీతోనే తమిళ బిగ్‌బాస్‌లోకి వచ్చాడు. అందులో తెలుగుపాటలు పాడి కవ్విస్తూ నవ్విస్తూ అందర్నీ ఆకట్టుకుని విజేతగా నిలిచాడు.

 


కౌగిలించే రోబో!

జినీకాంత్‌ ‘రోబో’ సినిమాలోని చిట్టి మనుషులు చేసే అన్ని పనులూ చేస్తాడు... అప్పుడే పుట్టిన పిల్లల్ని లాలించడం దగ్గర్నుంచీ అమ్మాయిల అరచేతికి అందంగా గోరింటాకు పెట్టడం దాకా! అది సినిమా కాబట్టి కానీ-వాస్తవంలో రోబోలకి ఎదుట ఉన్న మనుషుల్ని సున్నితంగా పట్టుకోవడం ఇటీవలి కాలం వరకూ అసాధ్యంగానే ఉంటూ వచ్చింది. షేక్‌హ్యాండ్‌ ఇచ్చినప్పుడో, కౌగిలించుకున్నప్పుడో అవి మనుషుల ఎముకల్ని నుజ్జు చేసిన సందర్భాలున్నాయి. ఆ సమస్యని ఈమధ్యే అధిగమించారు టెక్నికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మ్యునిచ్‌(టీయూఎం) పరిశోధకులు. ఎదుటివాళ్ల స్పర్శని అర్థం చేసుకుని సందర్భానికి తగ్గట్టు సున్నితంగానూ దృఢంగానూ క్షణంలో వందోవంతు సమయంలో స్పందించగల సెన్సర్లని అతితక్కువ విద్యుత్తుతో పనిచేసేలా రూపొందించారు. వాటినే మరమనుషులకి చర్మంగా వాడారు. ఈ చర్మంతో రోబోలు ఎదుటివాళ్లని సుతిమెత్తగా తాకడం, కౌగిలించుకోవడం సులువవుతుందట.

 

 


ఈ ఫ్లెక్సీ దేశంలోనే ఫస్ట్‌!

మల్‌... మలయాళంలో ప్రసిద్ధ దర్శకుడు. ఆయన తాజా చిత్రం ‘ప్రణయ మీనకులూడే కడల్‌’ ఇటీవలే విడుదలైంది. విశేషమేంటంటే... ఈ సినిమాకి ప్లాస్టిక్‌(పీవీసీ) ఫ్లెక్సీ బోర్డులని కాకుండా బట్టతో చేసిన వాటినే వాడారు. దేశంలో ఇలా పర్యావరణహిత ప్రచారం మొదలుపెట్టిన తొలి సినిమా ఇదే! కేరళ ప్రభుత్వం గత నెల పీవీసీతో చేసే ఫ్లెక్సీ బోర్డులపైన నిషేధం విధించి... వాటికి ప్రత్యామ్నాయంగా భూమిలో సులభంగా కరిగిపోయే బట్టలూ, పాలీఇథనాల్‌ వంటివి వాడాలని సూచించింది. దీనిపైన మలయాళ సినిమా పరిశ్రమవాళ్లు ఎన్నో తర్జనభర్జనలు పడ్డారు. పీవీసీ కాకుండా ఇతరత్రా వాటితో చేసే ఫ్లెక్సీలు అంత ఆకర్షణీయంగా ఉండకపోవడం అటుంచితే, ఖర్చు కూడా ఎక్కువంటూ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. కానీ, అవన్నీ పట్టించుకోకుండా దర్శకుడు కమల్‌, నిర్మాత జాన్‌ ముందడుగేశారు.
మార్కెటింగ్‌ కోసం మామూలు కంటే 50 శాతం ఎక్కువ ఖర్చుచేసి మరీ గుడ్డలతో చేసిన ఫ్లెక్సీలని పెట్టారు. మిగతావారికి మార్గదర్శకులుగా నిలిచారు!

 


జోక్‌ చెబితే చాయ్‌ ఫ్రీ!

చాయ్‌ దుకాణం పేరు సంకీమంకీ కామెడీ టీ స్టాల్‌. పేరు విచిత్రంగా ఉంది కదా... దాని తీరు కూడా అంతే చిత్రంగా ఉంటుంది. అక్కడికొచ్చేవాళ్లందరూ చక్కగా జోకులు చెప్పుకుని నవ్వుకోవాలన్నది దాని యజమాని విజయ్‌సింగ్‌ కోరిక. దుకాణానికి వచ్చే చాయ్‌ప్రియులందరికీ దీన్నే ఓ నిబంధనగా చెబుతాడు. ఓ మంచి జోక్‌ చెబితే సింగిల్‌ టీ ఉచితంగా ఇస్తాడు. సొంతంగా చెప్పాలనేమీ లేదు... సినిమాలో నుంచైనా చెప్పొచ్చుకానీ నలుగుర్నీ నవ్వించాలి అంతే. తమిళనాడు రాష్ట్రం నాగర్‌కోయిల్‌ జిల్లాకేంద్రంలోని దళవాయిపురం అనే ప్రాంతంలో ఉందీ చాయ్‌ దుకాణం. సాధారణంగా తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో చాయ్‌ దుకాణాలు రాజకీయ వివాద కేంద్రాలు. అవి కాస్త ముదిరి... కొట్లాటలకీ దారితీస్తుంటాయి. అందుకే అక్కడి చాయ్‌ దుకాణాల్లో ‘ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దు’ అని బోర్డులూ పెడుతుంటారు. అలాంటివాటి మధ్య ‘జోక్‌ చెబితే చాయ్‌ ఫ్రీ’ అని ఈ టీస్టాల్‌లో బోర్డుపెట్టడమే అందర్నీ ఆశ్చర్యానందాల్లో ముంచెత్తుతోంది!

27 అక్టోబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.