close
బాగా మెల్లగా నడుస్తున్నారా?

డివయసులోకి అడుగుపెట్టే సమయంలో- అంటే, సుమారుగా 45 సంవత్సరాల వయసులో నడిచే వేగాన్ని బట్టి ఆయా వ్యక్తుల మానసిక వయసుని అంచనా వేయొచ్చు అంటున్నారు లండన్‌ కింగ్స్‌ కాలేజ్‌ పరిశోధకులు. ఇందుకోసం వీళ్లు 45 ఏళ్ల వయసులోని వెయ్యిమందిని ఎంపికచేసి వాళ్ల జీవనశైలిని క్షుణ్ణంగా అధ్యయనం చేశారట. అందులో వేగంగా నడిచేవాళ్ల మెదడు చురుకుగా ఉందని గుర్తించారు. చివరగా వాళ్ల ఎమ్మారై స్కాన్‌లను పరిశీలించగా- అందులో నెమ్మదిగా నడిచే వాళ్లలో మెదడు పరిమాణం కూడా తక్కువగా ఉండటంతోబాటు మెదడులోని కార్టెక్స్‌ మందం తక్కువగానూ ఉన్నట్లు గుర్తించారట. రక్తనాళాల్లోనూ తేడా కనిపించిందట. దీన్నిబట్టి వీళ్ల మెదడు కొంత వృద్ధాప్య దశకు చేరుకున్నట్లు భావించారు. అంతేకాదు, నెమ్మదిగా నడిచేవాళ్ల ముఖాన్ని పరిశీలించగా- అందులోనూ, వేగంగా నడిచేవాళ్లకన్నా వృద్ధాప్యఛాయలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీన్నిబట్టి ఆ వయసులో ఎవరైనా బాగా నెమ్మదిగా నడుస్తున్నారంటే కాస్త అనుమానించాల్సిందే అంటున్నారు.


సిగరెట్‌ కన్నా ప్రమాదం!

వాతావరణ కాలుష్యం అనేది ఊపిరితిత్తుల వ్యాధుల్ని ఉధృతం చేస్తుందని వాషింగ్టన్‌, కొలంబియా, బఫెలో విశ్వవిద్యాలయ నిపుణులు సంయుక్తంగా తేల్చి చెబుతున్నారు. ఇది రోజుకి ప్యాకెట్‌ సిగరెట్‌ కాల్చినదానికన్నా ఎక్కువ హాని కలిగిస్తుందట. వాతావరణ కాలుష్యం- అందులోనూ ఓజోన్‌ వాయువు ఆరోగ్యానికి హానికరం అన్నది తెలిసిందే. దీనివల్ల ఊపిరితిత్తులూ, గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని గతంలోనూ అనేక పరిశీలనల్లో స్పష్టమైంది. ఊపిరితిత్తుల్లోని గాలిసంచులు దెబ్బతిని, వాటి గోడలు పలుచనై రంధ్రాలుగా ఏర్పడతాయి. ఫలితంగా దగ్గు, కఫం, ఊపిరి అందకపోవడం వంటి సమస్యలు తలెత్తడమే కాదు, కొన్నిసార్లు ఈ పరిస్థితి మరణానికీ దారితీస్తుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితి ధూమపానం చేసేవాళ్లలో తలెత్తుతుంది. కానీ వరసగా 29 ఏళ్లపాటు రోజుకో ప్యాకెట్‌ సిగరెట్‌ కాల్చేవాళ్లలో కన్నా పదేళ్లపాటు ఓజోన్‌తో నిండిన ప్రాంతంలో నివసించేవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీనికోసం వీళ్లు 18 సంవత్సరాలపాటు ఎంఫెసీమాతో బాధపడుతున్న సీటీస్కాన్‌లను పరిశీలించగా- వాతావరణంలోని ఓజోన్‌ పరిమాణంతోబాటు వాళ్లలో ఆ వ్యాధి తీవ్రత కూడా పెరుగుతూ వచ్చినట్లు గుర్తించారు. కాబట్టి  నివసించే వాతావరణం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మేలు అంటున్నారు సంబంధిత నిపుణులు.


కీళ్లజబ్బుల్నీ తగ్గించొచ్చు!

జీబ్రాఫిష్‌, సాలమాండర్‌ వంటి జీవుల్లో తోక తెగినా కాళ్లూ చేతులూ విరిగినా మళ్లీ వస్తాయి. అదేమాదిరిగా మనుషుల్లోనూ కీళ్లఎముకల్లోని మృదులాస్థి కణజాలం దెబ్బతింటే దాన్ని పునరుద్ధరించే అవకాశం ఉందని డ్యూక్‌ విశ్వవిద్యాలయ నిపుణులు అంటున్నారు. ఇందుకోసం ఇంటర్‌ మాలిక్యులర్‌ క్లాక్స్‌ ఇంటెగ్రల్‌ పద్ధతి ద్వారా మృదులాస్థిలోని ప్రొటీన్లను లెక్కించే విధానాన్ని రూపొందించారు. దీని ఆధారంగా శరీరంలో వివిధ భాగాల్లోని మృదులాస్థిని పరిశీలించినప్పుడు- మడమల దగ్గరున్న ప్రొటీన్ల వయసు చిన్నదిగానూ మోకాళ్ల దగ్గర మధ్యవయసులోనూ తొడల దగ్గర వృద్ధాప్య స్థితిలోనూ ఉన్నట్లు తెలిసింది. అంటే- మోకాళ్లకీ తొడ దగ్గరా దెబ్బ తగిలితే కోలుకునేందుకు ఎక్కువ సమయం పట్టడానికీ మడమల దగ్గర తగిలిన దెబ్బలు త్వరగా తగ్గడానికీ ఇదే కారణం అయి ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేకాదు, ఈ మృదులాస్థి కణజాల పునరుద్ధరణకు కారణమైన మైక్రో ఆర్‌ఎన్‌ఏను మెడిసిన్‌ రూపంలో ఇవ్వడం ద్వారా ఆర్ధ్రయిటిస్‌నీ తగ్గించవచ్చు అంటున్నారు సదరు పరిశోధకులు.


ఇక, ఆందోళన వద్దు!

కొంతమంది ప్రతి చిన్నదానికీ విపరీతంగా ఆందోళన చెందుతారు. మరికొందరు ఏకంగా డిప్రెషన్‌కే గురికావచ్చు. ఈ రకమైన మానసిక సమస్యలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమందిలో కనిపిస్తుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కౌన్సెలింగ్‌తోబాటు మందులు వాడటం ద్వారా వ్యాధి లక్షణాలను మాత్రమే తగ్గించగలం కానీ వ్యాధిని పూర్తిగా తీసేయలేం. పైగా కౌమారదశలో ఈ వ్యాధులకు గురయిన పిల్లలను అవి జీవితాంతం వెంటాడుతుంటాయి. అంతేకాదు, విపరీతమైన ఆందోళనకు గురయ్యే పిల్లలు భవిష్యత్తులో అనేక మానసిక వ్యాధులకీ గురవుతుంటారు. కానీ మొట్టమొదటగా కాలిఫోర్నియా నేషనల్‌ ప్రైమేట్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు చెందిన పరిశోధక బృందం- దీని గురించి రీసస్‌ మకాకె కోతుల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేయగా- మెదడు భాగంలో న్యూరోట్రొఫిన్‌-3 అనే రసాయన శాతం పెరిగినప్పుడు ఆందోళన సమస్యలు తగ్గినట్లు గుర్తించారు. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. దీనిలానే మానసిక సమస్యల్ని తగ్గించే పదార్థాలు మరిన్ని ఉండొచ్చు. కాబట్టి వాటన్నింటినీ గుర్తించగలిగితే మానసికవ్యాధుల్ని పూర్తిగా నివారించడం సులభం కావచ్చు అన్నది ఈ పరిశోధన సారాంశం.

27 అక్టోబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.