close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొవ్వొత్తి... కొత్తగా ముస్తాబవుతోంది..!

అమావాస్య చీకట్లను తొలగిస్తూ వెలుగుల్ని పంచే ఆనందాల కేళి... దీపావళి. పండగ వేళ ఇంటిని దీపకాంతులతో మెరిపించేందుకు అందమైన ప్రమిదలతోబాటు డిజైనర్‌ కొవ్వొత్తులూ మార్కెట్లో కొలువుదీరుతున్నాయి.

చీకటి అనే అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానాన్ని కలిగించే వెలుగుకి మారు పేరే దీపం. ఆ దీపం ప్రమిద కావచ్చు, కొవ్వొత్తి కావచ్చు... దాన్ని వెలిగించడంలోని ఉద్దేశం మాత్రం ఒక్కటే. అందుకే ఈతరం సంప్రదాయ దీపాలతోబాటు కొవ్వొత్తుల్నీ వెలిగిస్తూ ఆనందంగా పండగ జరుపుకుంటోంది. దీనికితోడు దీపావళి, కొత్త సంవత్సరం... వేడుక ఏదయినా ఇంటిని రంగుల దీపాలతో శోభాయమానంగా అలంకరించడం... దాన్ని సెల్‌ఫోనుతో క్లిక్‌మనిపించి సోషల్‌ మీడియాల్లో షేర్‌ చేయడం ట్రెండ్‌గా మారింది. అయితే దీపాలను వెలిగించడం కష్టం కాబట్టి కొవ్వొత్తిలోని సౌకర్యం కారణంగా అది ఇంటి అలంకరణలో భాగమైంది. దాంతో ఒకప్పుడు సాదాసీదాగా సన్నగా పొడవుగా ఉండే కొవ్వొత్తి కాస్తా ఇప్పుడు రకరకాల ఆకారాల్నీ రంగుల డిజైన్లనీ సొంతం చేసుకుని చూసేకొద్దీ చూడాలనిపించేలా ముస్తాబవుతోంది. దీపావళి వేళలో అయితే ప్రత్యేకంగా చెప్పేదేముందీ... బొమ్మలూ పువ్వులూ పండ్లూ ఐస్‌క్రీములూ... ఇలా కంటికి కనిపించే అన్ని ఆకారాల్లోకీ మైనం అందంగా ఒదిగిపోతోంది, ఇక, కొవ్వొత్తులమీద కనిపించే డిజైన్లయితే లెక్కలేనన్ని. మైనంలో ఆకర్షణీయమైన రంగుల్ని కలిపి వాటిమీద ప్రకృతి దృశ్యాల్నీ ముద్రించేస్తున్నారు.

‘ఔరా ఇది కొవ్వొత్తేనా’ అనిపించేంత అందంగా వాటికి కుందన్‌లనూ అతికిస్తున్నారు. ఉరుళిలో నీళ్లు పోసి పూలూ ఆకుల మధ్యలో దీపాలు వెలిగించినట్లే, సన్నగా పొడవుగా ఉండే గాజుబీకర్లలో పువ్వులూ ఆకుపచ్చని కొమ్మల్నీ ఉంచిన నీళ్లమీద తేలియాడే కొవ్వొత్తుల వెలుగుల అందాల్ని చూస్తుంటే రెప్ప వాలితే ఒట్టు. చమ్కీలతో అలంకరించిన కొవ్వొత్తులు ఇంటికి సొబగుల్ని అద్దితే, వెలుగులీనుతూ రంగులు మారే గ్లో వ్యాక్స్‌ క్యాండిల్సు వేడుకకే కొత్త అందాన్నిస్తాయి. గాజుగ్లాసుల్లో రంగుల మైనాన్ని అరలు అరలుగా పోసిన హరివిల్లు క్యాండిల్సూ వస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే కళ్లను మురిపించే రంగుల మైనంలో రకరకాల పరిమళ తైలాలను కలిపి తయారుచేసే సెంటెడ్‌ క్యాండిల్స్‌ వెలిగిస్తే అటు దీపకాంతుల శోభతోబాటు ఇటు ఇల్లంతా పరిమళాలూ పరచుకుంటాయి. సో, వాకిట్లో దీపాల వరసలోనో ఇంట్లోని కార్నర్‌ టీపాయ్‌ మీదనో హాల్లో వేసిన రంగవల్లికలోనో మీకు నచ్చిన డిజైనర్‌ కొవ్వొత్తుల్ని అలంకరిస్తే ఇంటికి వచ్చినవాళ్ల చూపు వాటికి అతుక్కుపోతుందనడంలో సందేహమేముందీ..!

వెలుగుల లోకం

ఇంటికి దీపం ఇల్లాలు అవునో కాదోగానీ దీపకాంతుల శోభ ఇంటికి కళ కట్టిస్తుందన్నది మాత్రం నిజం. అందుకే దీపావళి పండగకే కాకుండా మామూలుగానూ హాల్లోనో పడక గదిలోనో చిరువెలుగుల కొవ్వొత్తులు వెలిగించి మురిసిపోతుంటారు చాలామంది. అలాంటివాళ్లకోసమే రకరకాల ఫీచర్లతో వస్తోన్న ఈ హైటెక్‌ కొవ్వొత్తులు...

కొవ్వొత్తిలోనే సాగరగర్భాన్నీ ఆక్వేరియాన్నీ పూదోటల్నీ ఇలా కోరిన అందాల్ని చూడాలనుకునేవాళ్లకోసం రూపొందినవే ఈ జెల్‌ క్యాండిల్స్‌. గాజు కంటెయినర్లలో ఖనిజ నూనెలూ పాలిమర్‌ రెజినూ వేసి చేసిన ఈ రకమైన కొవ్వొత్తులు పారదర్శకంగా ఉంటాయి. వీటి పై భాగంలో అమర్చిన టీ లైట్లనుగానీ లేదా లోపలకంటా అమర్చిన వత్తుల్నిగానీ వెలిగిస్తే ఆ కాంతి జెల్‌లో ప్రతిబింబిస్తూ అందంగా మెరుస్తుంటుంది.

బొమ్మలా కరిగిపోతోంది

కొవ్వొత్తి కరిగిపోవడం తెలిసిందేగానీ అది బొమ్మలా కరిగిపోవడం ఎక్కడైనా చూశారా... స్పిరిట్‌, ఎమోషన్స్‌ రివీల్డ్‌ క్యాండిల్స్‌ను వెలిగిస్తే దాని మైనం నెమ్మదిగా కరుగుతూ అందులోంచి ఐరన్‌తో చేసిన బొమ్మ బయటపడుతుంది. అలాగే గుడ్డులోంచి యూనికార్న్‌, డైనోసార్‌ వంటి జీవులు పుడుతున్నట్లుగా చేసినవే హ్యాచింగ్‌ ఎగ్‌ క్యాండిల్స్‌. వీటిని ఎవరికైనా బహుమతిగా ఇస్తే కొవ్వొత్తి కరిగిపోయినా బొమ్మ గుర్తుండిపోతుంది.

రంగుల వెలుగులు

రంగుల వెలుగుల్ని విరజిమ్మే చిచ్చుబుడ్లను చూస్తే కలిగే ఆనందమే వేరు. అలాగే క్యాండిల్‌ మంట సైతం విభిన్న రంగుల్లో వచ్చేలా పొటాషియం నైట్రేట్‌, క్యుప్రిక్‌ క్లోరైడ్‌, కాపర్‌ సల్ఫేట్‌, కాల్షియం క్లోరైడ్‌ వంటి రసాయనాల్ని మైనంలో కలిపి ఊదా, నీలం,
ఆకుపచ్చ, ఎరుపు... ఇలా రకరకాల రంగుల్లో వెలిగేలా చేస్తున్నారు.

పాలపుంతలా...

పగటివేళలో అచ్చం సాదా లోహంలా కనిపించే ఈ గెలాక్సీ గ్లో విక్‌ గ్లాస్‌ ఎల్‌ఈడీ క్యాండి…ల్‌కి అమర్చిన బటన్‌ నొక్కగానే వెలుగుల పాలపుంతని తలపిస్తుంటుంది. గాజు, ప్లాస్టిక్‌, మైనంతో తయారుచేసిన ఈ క్యాండిల్స్‌ బ్యాటరీతో పనిచేస్తాయి.

రంగు మార్చేయొచ్చు...

వాతావరణాన్నీ మూడ్‌నీ బట్టి కోరిన రంగులో వెలిగే కొవ్వొత్తులే ఈ మల్టీకలర్‌ ఛేంజింగ్‌ ఫ్లేమ్‌లెస్‌ ఎల్‌ఈడీ క్యాండిల్స్‌. ఇవి ఇంట్లో ఉంటే రంగుల దీపాలున్నట్లే. బ్యాటరీతో పనిచేసే ఈ రకం క్యాండిల్స్‌ను రిమోట్‌ సాయంతో పన్నెండు రంగుల్లోకి మార్చుకోవచ్చు. టైమర్‌ను కూడా సెట్‌ చేస్తే నాలుగైదు గంటల తరవాత ఆటోమేటిగ్గా ఆగిపోయే దీన్ని బెడ్‌ల్యాంప్‌గానూ వాడుకోవచ్చు.

కదిలే అందంతో...

వరసగా అమర్చిన దీపాల మధ్యలో ఎల్‌ఈడీ గ్లిట్టర్‌ స్విర్లింగ్‌ వాటర్‌ క్యాండిల్స్‌ను అమరిస్తే చూపులన్నీ వాటికే అతుక్కుపోతాయి. గులాబీ, ఊదా, నీలం, ఎరుపూ... ఇలా భిన్న రంగుల్లోకి వాటంతటవే మారుతూ ఉండటంతోబాటు క్యాండిల్‌ లోపల ఉన్న గ్లిట్టర్స్‌ కదులుతూ వింత అందంతో ఆకట్టుకుంటాయి.

దివ్వీ దివ్వీ...

ఒక్క దీపంతో అనేక దీపాలు వెలిగించిన అనుభూతిని కలిగించేదే ఇన్ఫినిటీ క్యాండిల్‌ మిర్రర్‌ బాక్సు. రెండు అద్దాలను భిన్నకోణాల్లో అమర్చి తయారుచేసిన ఈ దీపం మధ్యలో టీ లైట్‌ క్యాండిల్‌ను పెడితే అందులోని కోణాల కారణంగా ఎన్నో దీపాలు వెలుగుతున్నట్లే ఉంటుంది. ఇందులోనే అద్దాలను బాక్సుల తరహాలో చేసినవీ ఉన్నాయి. బాక్సు సైజుని బట్టి అందులో మూడు, ఐదు, ఆరు, తొమ్మిది దీపాలు పెట్టి ఎన్నో దీపాలున్న భ్రమను కలిగించవచ్చు.

పరిమళం మారుతూ...

ఎయిర్‌ విక్‌ కలర్‌ ఛేంజింగ్‌ క్యాండిల్‌ ఉంటే ఇంట్లో పరిమళాల పూలతోట ఉన్నట్లే. రకరకాల పరిమళాల్ని చొప్పించి చేసిన ఈ మైనపు వత్తిని వెలిగించగానే దానంతటదే రంగులు మారుతూ గ్లాస్‌మీద ఉన్న అందమైన దృశ్యాన్ని ఆవిష్కరించడంతోబాటు అందులోని సెంటు వాసన కూడా మారుతూ మనసుని మరోలోకంలో విహరింపజేస్తుంది.

మ్యాచింగ్‌ కొవ్వొత్తి

సెన్సర్లతో పనిచేసే ఈ డెకార్‌ కలర్‌ మ్యాచింగ్‌ ఫ్లేమ్‌ లెస్‌ ఎల్‌ఈడీ క్యాండిల్‌ను ఆకూ పువ్వూ కప్పూ ఇలా దేని దగ్గరయినా పెట్టి బటన్‌ను నొక్కితే అది ఆ పువ్వు లేదా కప్పు రంగులోకి మారిపోతుందన్నమాట. అప్పుడు దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ అందంగా అలంకరించుకోవచ్చు.

27 అక్టోబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.