close
మా అత్తమ్మ బంగారం

అత్తగారు అనగానే చాలామందికి కోడల్ని తిడుతూ నిష్ఠూరాలాడే సూర్యకాంతం పాత్ర కళ్లముందు కదులుతుంది. అయితే ఇదంతా ఒకప్పటి మాట. మరిప్పుడు అమ్మతో ఉండే సాన్నిహిత్యం, అక్క దగ్గరుండే చనువూ అత్తగారితోనూ ఏర్పడుతున్నాయి. మెట్టినిల్లూ పుట్టినిల్లుగా మారిపోతోంది. ఈరోజు అత్తగార్ల దినోత్సవం సందర్భంగా అమ్మలాంటి అత్తమ్మల గురించి చెబుతున్నారీ కోడళ్లు.


అమ్మలా చూసుకుంటారు...
- నమ్రత

మహేశ్‌తో పెళ్లై పద్నాలుగేళ్లు. అప్పటికి నటిగా ఫామ్‌లోనే ఉన్నా. నటించాలా, ఇంటికే పరిమితం కావాలా అన్నది అత్తారింట్లో అడుగుపెట్టేదాకా నిర్ణయించుకోలేదు. కుటుంబసభ్యులూ బంధువులతో ఎప్పుడూ కళకళలాడే కృష్ణగారింటికి వెళ్లాకే ఇంటిని చక్కబెడుతూ ఇల్లాలిగా ఉండిపోవాలనిపించింది. తెలుగు సరిగా రాక మొదట్లో చాలా ఇబ్బందిపడ్డా. అత్తయ్య ఇందిరా దేవితో సరిగా మాట్లాడలేకపోయేదాన్ని. తనకోసమే చాలా త్వరగా తెలుగు నేర్చేసుకున్నా. ఆ విషయంలో అత్తయ్య కూడా ఎంతో సాయం చేశారు. అలానే మహేశ్‌ని అర్థం చేసుకుని తనని బాగా చూసుకునే అమ్మాయి కోడలిగా రావాలని అత్తయ్య ఎప్పుడూ అనుకునేవారట. మాపెళ్లైన చాలా కొద్దిరోజులకే ‘నేను ఎలాంటి అమ్మాయి కోడలిగా రావాలనుకున్నానో నువ్వు అలానే ఉన్నావు’ అని అత్తయ్య అనడంతో ఎంతో సంతోషమనిపించింది.

నాకు తెలుగింటి సంప్రదాయాలూ, పండగలూ, పూజల గురించి పెళ్లైన కొత్తలో తెలియదు. మహేశ్‌ కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంప్రదాయాలకు ఎంతో విలువిస్తారు. పండగంటే వారంరోజులపాటు ఇంట్లో సందడి ఉంటుంది. అవన్నీ నాకు కొత్తగా అనిపించేవి. మహేశ్‌ని అడిగి తెలుసుకుందామంటే ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండేవాడు. కుటుంబసభ్యులు కొత్తకావడంతో ఏదైనా అడగడానికి బెరుగ్గా ఉండేదాన్ని. అప్పుడు అత్తయ్యే నన్ను అర్థం చేసుకుని నా భయాలన్నీ దూరం చేశారు. మహేశ్‌కి ఇష్టమైన వంటకాల్ని దగ్గరుండి నేర్పించారు. సంప్రదాయాల్నీ పండగల సమయాల్లో చేసుకునే పులిహోర, పరమాన్నం, పొంగలి తదితర వంటకాల్నీ పరిచయం చేశారు. అందుకే ఇప్పుడు నేను మా పిల్లలకి అవన్నీ నేర్పించగలుగుతున్నా. అలానే నేను అత్తయ్యను చూసి నేర్చుకున్నవీ కొన్ని ఉన్నాయి. ఆమె చాలా సింపుల్‌గా, నిరాడంబరంగా ఉంటారు. ఇంటికి అతిథులొస్తే భోజనం పెట్టకుండా పంపరు. మర్యాదల విషయంలో తన తరవాతే ఎవరైనా అనిపిస్తుంది. ఈ వయసులోనూ చురుగ్గా ఉంటారు. ఇంటి పనులన్నీ దగ్గరుండి చూసుకుంటారు. తక్కువ మాట్లాడే అత్తయ్యది చాలా పాజిటివ్‌ నేచర్‌. ఎవర్నీ నొప్పించరు. ఎలాంటి సమస్య వచ్చినా నిబ్బరంగా ఉంటారు. ఇలా చెప్పుకుంటూపోతే అత్తయ్యని చూసి ఎన్నో నేర్చుకోవాలి. అవన్నీ నేను అలవాటు చేసుకుంటున్నా. చాలా తక్కువ సమయంలోనే మా అమ్మ స్థానాన్ని భర్తీ చేశారామె. మా పెళ్లైన కొన్నాళ్లకి అమ్మానాన్నలు ఓ ప్రమాదంలో చనిపోయారు. ఆ బాధతో డిప్రెషన్‌లోకి వెళితే, అత్తయ్య పక్కనే ఉండి నాక్కావల్సినవన్నీ తనే చూసుకున్నారు. ఆ సమయంలో అన్నం తినిపిస్తుంటే అమ్మే అత్తయ్యలో కనిపించేది. ఒక్కమాటలో చెప్పాలంటే- నన్ను కోడలిగా కాకుండా కూతురిలా చూసుకుంటారు. ఈ విషయంలో ‘నువ్వెంతో లక్కీ...’ అంటుంటారు మా ఆడపడుచులు. ఇక, పాప సితార గురించి చెప్పాలి. అది అచ్చం మా అత్తయ్యలానే ఉంటుంది. ఒక్కోసారి దాని మాటలూ చేతలూ అత్తయ్యలానే అనిపిస్తాయి. 


ది బెస్ట్‌ అత్తయ్య...
- బ్రాహ్మణి

చిన్నప్పుడు అత్తయ్యా వాళ్లింటికి వెళ్లడం... అక్కడే కొన్నిరోజులు ఉండటం అలవాటు. అందుకే పెళ్లయ్యాక నేను వేరే ఇంటికి వెళ్లాననిపించలేదు. ఇది నా మెట్టినిల్లు అనేకంటే ఇంకో పుట్టిల్లు అనే ఫీల్‌ అవుతా. చిన్నప్పుడు నేను భువనేశ్వరి అత్తయ్యకి భయపడేదాన్నట. అప్పుడప్పుడూ ఆ విషయం గుర్తు చేసి నన్ను ఆటపట్టిస్తుంటారు. తనకి ఆడపిల్లలు లేకపోవడంతో నన్నే కూతురు అనుకుంటారు. పెళ్లయ్యాక కూడా చదువుకుంటానంటే అందరికంటే ముందు అత్తయ్యే ప్రోత్సహించారు. ఆమె చాలా తెలివైనవారు. మావయ్య హెరిటేజ్‌ను స్థాపించి చంటిబిడ్డలా అత్తయ్య చేతుల్లో పెడితే దాన్ని రెండువేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. నా దృష్టిలో ఇల్లాలిగా, వ్యాపారవేత్తగా ఆమె ‘ది బెస్ట్‌’. మావయ్యగారు రాజకీయాల్లో బిజీగా ఉన్నా ఇటు ఇంటినీ అటు ఆఫీసునీ చాలా చక్కగా మేనేజ్‌ చేసుకుంటారు. ఆడవాళ్లకు ఆర్థిక స్వేచ్ఛా, స్వాతంత్య్రం అవసరమంటారు. అందుకే హెరిటేజ్‌ ద్వారా మహిళల్ని ప్రోత్సహిస్తున్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా ఆడపిల్లల చదువుకి సాయం అందిస్తున్నారు. బయటే కాదు ఇంట్లో కూడా ఆడపిల్లల్ని ఎంకరేజ్‌ చేస్తారు. అది నా విషయంలోనే రుజువైంది.
నన్ను నమ్మి హెరిటేజ్‌ కీలక బాధ్యతలు నాకు అప్పగించాలన్న నిర్ణయం అత్తయ్యదే. ఎప్పుడూ నన్ను గైడ్‌ చేస్తుంటారు. పెళ్లయ్యాక తననుంచీ నేను చాలా నేర్చుకున్నా. సెలవురోజైనా తెల్లవారుజామున నాలుగ్గంటలకే నిద్రలేస్తారు. వ్యాయామం ఆ తరవాత పూజా చేశాకే దినచర్య ప్రారంభిస్తారు. ఆరోగ్యంపట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఇంట్లోకీ, మావయ్యగారికీ ఏం కావాలో స్వయంగా చూసుకుంటారు. తరచూహెరిటేజ్‌ బ్రాంచిలన్నింటికీ వెళ్లొస్తుంటారు. ఎంత దూరం ప్రయాణం చేసినా అత్తయ్య అస్సలు అలసిపోరు. ఆ విషయంలో నాకు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

ఏ పనినీ వాయిదా వేయరు. ఏదైనా చేయాలీ అనుకుంటే వందశాతం కష్టపడి చేసి తీరతారు. ఆ పట్టుదల నాకు బాగా నచ్చుతుంది. మా అబ్బాయి  దేవాన్ష్‌ పనులైతే ఎవర్నీ చేయనివ్వరు. తనే వాడిని రెడీ చేసి స్కూలుకు పంపుతారు. నానమ్మగా వాడితో క్వాలిటీ టైం గడపడానికే చూస్తారు. నాకేదన్నా పని ఉంటే వాడికోసం ఆమె ఇంట్లో ఉండిపోయి నన్ను పంపుతారు. అలాంటప్పుడే ఉమ్మడి కుటుంబం విలువ తెలుస్తుంది. నాక్కూడా అదే ఇష్టం. అందుకే పెళ్లైనప్పట్నుంచీ అత్తయ్య వాళ్లతోనే కలిసి ఉంటున్నాం.

నా విజయంలో అత్తయ్యదే కీలక పాత్ర అని గర్వంగా చెప్పుకుంటా. పండగలూ, ఇతర ఫంక్షన్లప్పుడు తను దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుని మీరంతా సమయానికి వస్తే చాలని చెబుతారు. ఎప్పుడూ చురుగ్గా ఉండే అత్తయ్య పనితీరు చూస్తే నాకు ముచ్చటేస్తుంది. తనని దగ్గరగా చూస్తున్న నేను కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా. అత్తయ్యలా వ్యక్తిగతంగానూ వృత్తిగతంగానూ చక్కగా సమన్వయం చేసుకోవడం అలవాటు చేసుకుంటున్నా.


అత్తమ్మ నుంచి అదే నేర్చుకున్నా...
- ఉపాసన

నేను పుట్టి పెరిగింది ఉమ్మడి కుటుంబంలో. మా ఇంట్లో వాళ్లంతా కలిస్తే యాభై మందికిపైనే ఉంటాం. మేమంతా ఎప్పుడూ ఒకే మాటమీద కలిసికట్టుగా ఉంటాం. అందరం కలిస్తే ఇంట్లో పండగలాగే ఉంటుంది.

అందుకే మా అత్తగారిది కూడా ఉమ్మడి కుటుంబం అయితే బాగుంటుంది అనిపించింది. చరణ్‌ నేనూ ప్రేమలో ఉన్నప్పుడు ఒకసారి- మనం పెళ్లయ్యాక ఎక్కడ ఉంటాం అని అడిగా. తను కొన్న స్థలం గురించి చెప్పి అక్కడే ఇల్లు కట్టేస్తా అన్నాడు. అంటే పెళ్లయ్యాక ఇద్దరమే కలిసుండాలని తను అనుకుంటున్నాడేమోనని భయమేసింది. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. కాసేపయ్యాక పెళ్లయిన వెంటనే కుటుంబాన్ని వదిలేసి విడిగా ఎలా ఉండగలుగుతారు అని అడిగేశా. ‘కట్టబోయే ఇల్లు మనం వీకెండ్‌లో ఉండటానికే.

నువ్వేమంటావో చూద్దామని అలా అన్నాను’ అని నవ్వేశాడు. ఆ మాటలకి హమ్మయ్యా అనుకున్నా. అత్తమ్మ సురేఖ అంటే చరణ్‌కి ప్రాణం. ఇంట్లో ఒక్క క్షణం అత్తమ్మ లేకపోయినా విలవిలలాడిపోతాడు. నాకూ ఆమె అంటే చాలా గౌరవం. పెళ్లికి ముందు నుంచే నాకు పెట్స్‌ అంటే ప్రాణం. ఓ పది వరకూ పప్పీలున్నాయి. వాటితో కాసేపు గడపనిదే నాకు రోజు గడవదు. పెళ్లయ్యాక నాతోపాటు వాటిని కూడా తెచ్చుకుంటానని అత్తమ్మని అడగడానికి కాస్త మొహమాట పడ్డా. ఇలాంటి విషయాల్లో చరణ్‌ రికమండేషన్‌ బాగోదు. పెళ్లి ఖాయమయ్యాక ఎలా చెప్పాలా అని సతమతమవుతుంటే ఒకరోజు అత్తమ్మే నా దగ్గరకొచ్చి ‘నీతోపాటు ఎన్ని పెట్స్‌ తెచ్చుకున్నా నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే అది ఇక నుంచీ నీ ఇల్లు కూడా...’ అనడంతో చాలా సంతోషమనిపించింది. మా పెళ్లయ్యాక బయట ఖాళీ స్థలంలో పెట్స్‌ కోసం ప్రత్యేకంగా ఓ ఇంటినే కట్టించారు. అడగకుండానే అందరి మనసులూ అవసరాలూ అర్థం చేసుకునే అత్తమ్మ వాళ్ల అత్తగారినీ ఎంతో బాగా చూసుకుంటారు. ఆమె పనులన్నీ తనే దగ్గరుండి చేస్తారు. అంటే ఇప్పుడు మా ఇంట్లో రెండు తరాల కోడళ్లం ఉన్నామన్నమాట. అప్పుడప్పుడూ చరణ్‌వాళ్ల నానమ్మగారు- సురేఖ అత్తమ్మ పెద్దకోడలిగా ఆ ఇంట్లో ఎలా ఉన్నారో చెబుతుంటారు. అప్పుడూ ఇప్పుడూ కుటుంబానికి పిల్లర్‌గా నిల్చున్న అత్తమ్మ నన్ను కూడా ఎంతో ప్రోత్సహిస్తారు. తన ఇద్దరు కూతుళ్లలానే నన్నూ చూస్తారు. అత్తమ్మది ముక్కుసూటి మనస్తత్వం ఏదైనా మొహం మీదే చెప్పేస్తారు. మావయ్యగారి సినిమాలు బాగుంటే బాగున్నాయనీ లేదంటే లేదనీ సూటిగా చెప్పేస్తారు. నేను కూడా ఆమె నుంచి అదే నేర్చుకున్నా. తను వంట బాగా చేస్తారు. కానీ నేను డైటింగ్‌కోసం వేరే ఫుడ్‌ తీసుకోవడం వల్ల అది మిస్‌ అవుతున్నా. చరణ్‌ కూడా ఎప్పుడూ అదే అంటుంటాడు.

27 అక్టోబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.