close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దివ్యకాంతుల దీపావళి!

చీకటి వెలుగులు మనిషి జీవితంలో సహజం. చీకటిని చీల్చుకుంటూ వెలుతుర్ని వెతుక్కుంటూ సాగడమే మానవ జీవితపు పరమార్థం. అలాంటి విజయపు వెలుగుల్ని ప్రజలందరికీ పంచేదే దీపావళి పండగ. చెడు మీద మంచి గెలుపుకు ప్రతీకగా, అధర్మం పైన ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే సిరికాంతుల పండగ. ఆ పర్వదిన సమయాన ఒక్కనరకాసుర వధే కాదు, యుగయుగాలలో మరెన్నో విశేషాలూ చోటు చేసుకున్నాయని పురాణాలు చెబుతున్నాయి.

శ్రీమహావిష్ణువుకి రాక్షసాంతకుడిగా పేరు. ఏ అవతారమెత్తినా అసుర సంహారమే ఆయన లక్ష్యం. దశావతారాలన్నింటిలోనూ ఆ విషయమే స్పష్టమవుతుంది. ఎన్నో అవతారాల్లో ఎందరో రాక్షసుల్ని సంహరించాడాయన. రావణ కుంభకర్ణుల్నీ, హిరణ్యకశిప హిరణ్యాక్షుల్నీ, కంస శిశుపాలాది అనేక రాక్షసుల్నీ అంతమొందించాడు. ఒకరిని మించి ఒకరు మహాబలవంతులూ, అంతకు మించి క్రూరులూ. కానీ ఒక్క నరకాసురుణ్ని చంపిన రోజే దీపావళి పండగగా చేసుకుంటున్నాం. ద్వాపరయుగం నుంచి ఈనాటి వరకూ ప్రతిఏడూ ఇంటి ముందు దీపాల వరసల్ని పేరుస్తున్నాం. భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాం. సంతోషాన్ని పంచుకుంటున్నాం. అన్ని పండగల్లోకీ ఈ వెలుగుల పండగ ఎందుకంత ప్రత్యేకం అంటే, దాని వెనక అంతే లోతైన అంతరార్థం ఉంది... నరక సంహారం వెనక సమస్త మానవాళీ గుర్తుంచుకోదగ్గ గాథ ఉంది... నేలపై పుట్టిన యావత్‌ జీవరాశికీ వర్తించే విలువైన పాఠం ఉంది...

అది ద్వాపరయుగం. నరకుడనే రాక్షసుడి ఆగడాలు విపరీతమయ్యాయి. ఒక్క భూమినే కాదు పదునాల్గు భువనాలనూ శాసిస్తూ, జనాన్ని హింసిస్తూ జీవించసాగాడు. రాజుల్ని చంపి వారి పిల్లల్ని బంధించేవాడు. అలా పదహారువేల మంది కన్యలను తెచ్చి చెరసాలలో ఉంచాడు. తల్లి చేతిలో తప్ప చావు లేదన్న బ్రహ్మవర గర్వితుడయిన నరకుడు దేవతల జోలికి వెళ్లడమూ మొదలు పెట్టాడు. దేవతల తల్లి అదితి కుండలాలను తస్కరించాడు. సురులు సంచరించే మణిపర్వతాన్ని ఎత్తుకుపోయాడు. చివరికి వరుణుడి ఛత్రాన్నే దొంగిలించాడు.

వాడి ఆగడాలు పెచ్చుమీరుతుండటంతో దేవతలంతా శ్రీ మహావిష్ణు స్వరూపుడయిన కృష్ణపరమాత్మను శరణువేడారు. నీవే దిక్కంటూ మొక్కారు. అసుర సంహారం తప్పక చేస్తానని మాటిచ్చాడు మాయావిలాసుడు. యుద్ధానికి సిద్ధమవ్వమంటూ గరుత్మంతుణ్ని పిలిచాడు. అదే సమయంలో పక్కనున్న ప్రణయ సఖి సత్య నేనూ వస్తానంది. కృష్ణుడు వద్దన్నా వినకుండా బతిమాలడంతో ఆమె మాటను కాదనలేక పోయాడు కృష్ణుడు. వెంట తీసుకెళ్లాడు. ఆయనకు కావలసిందీ అదే మరి!! నరకుడి మీద దండయాత్ర మొదలైంది. అటు సైన్యాన్ని తన అస్త్రాలతో నిలువరిస్తూ యుద్ధం చేస్తున్నాడు నల్లనయ్య. నరకుడి బాణానికి మూర్ఛపోయినట్టు నటించాడు.

నా ప్రాణనాథుడికే హాని తలపెడతావా అంటూ కళ్లెర్రజేసి విల్లెక్కుపెట్టింది సత్యాదేవి. అంతే, నరకుడు నేలకొరిగాడు. నరక అనే పదానికి అర్థం చీకటి, సత్య- అంటే వెలుగు. వెలుగు చేతిలో చీకటి ఓడిపోయింది. దేవతలంతా ‘దీపం కుర్యాత్‌! దీపం కుర్యాత్‌!’ (దీపాలు వెలిగించండి, దీపాలు వెలిగించండి)అంటూ ఆనంద నాదాలు చేశారు. నరకాసుర వధతో అన్ని లోకాలూ ప్రకాశవంతమయ్యాయి. ఆకాశం పూల వాన కురిపించింది. లోకాలన్నింటా విజయ దుందుభులు వినిపించాయి.

తలతెగి నేలను పడగానే నరకుడిలో అప్పటిదాకా ఉన్న అహంకారం ఆవిరయిపోయింది. మనస్సుకు అధిపతి చంద్రుడికి అమావాస్య సమయం కనుక కళ ఉండదు. అంటే, చంద్రుడి కాంతి నారాయణ స్వరూపమైన సూర్యుడిలో ఇమిడిపోయి ఉంది. దాంతో నరకుడి మనస్సూ భగవంతుడిలో చేరింది. ఆక్రమించుకున్న పద్నాలుగు భువనాలూ స్వేచ్ఛను పొందడంతో అతని భవబంధాలన్నీ పటాపంచలయ్యాయి.

జ్ఞానవంతుడైన నరకుడి కుమారుడు భగదత్తుడు పట్టాభిషిక్తుడయ్యాడు, అంటే మంచికి పట్టాభిషేకం జరిగింది. సాక్షాత్తూ మహావిష్ణువు సాన్నిధ్యంలో తల్లి భూమాత స్వరూపమైన సత్యాదేవి చేతిలో మరణించడం వల్ల అతని ఆత్మకు మోక్షం లభించింది. నేల మీద ఉన్న ప్రతి జీవీ చిట్టచివరగా పొందవలసిన స్థితి ఇదే. అప్పుడే ఆ జన్మకు విలువ. ఆ జ్ఞానజ్యోతి జనమందరిలో వెలుగులు నింపాలనే నరకాసుర వధనాడే దీపావళి పండుగను జరుపుకుంటాం. ఆ రోజు ఒక్క భూమి మాత్రమే కాదు పద్నాలుగు భువనాలూ దివ్యకాంతులతో వెలిగిపోతాయి.

లక్ష్మీదేవి పుట్టిందిప్పుడే...
లక్ష్మీదేవి క్షీరాబ్ది తనయ. దేవదానవులంతా అమృతం కోసం పాలసంద్రాన్ని చిలుకుతున్నప్పుడే ఈ సిరుల తల్లి బయటికి వచ్చింది. ఆమె పుట్టిందీ దీపావళి రోజుల్లోనేనట. ధన్‌తేరాస్‌గా పిలిచే ధనత్రయోదశినే మహాలక్ష్మి పుట్టినరోజుగా చెబుతారు. నరకుడు లక్ష్మీదేవిని బంధించి చెరసాలలో పెట్టగా, శ్రీమహా విష్ణువు ఆమెను విడిపించి, సప్తసముద్రాల జలంతోనూ, కామధేనువు క్షీరంతోనూ తన పాంచజన్యం ద్వారా అభిషేకించి ధనలక్ష్మిగా పట్టాభిషిక్తురాలిని చేసింది ధనత్రయోదశినాడేనన్నది మరో కథనం. అందుకే ఆ రోజు కొంచెమైనా బంగారాన్ని కొని, ఇల్లు శుభ్రం చేసి, ముగ్గులు వేసి, దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. దీపావళి సమయంలో అమ్మవారికి సంబంధించిన మరో కథనమూ ప్రచారంలో ఉంది. పూర్వం దూర్వాస మహాముని ఇంద్రుడి ఆతిథ్యానికి మెచ్చి ఒక మహిమాన్వితమైన హారాన్ని ఆయనకు బహూకరించాడట. అయితే ఇంద్రుడు దాని గొప్పతనాన్ని తెలుసుకోకుండా, తన దగ్గరుండే ఐరావతమనే ఏనుగు మెళ్లో దాన్ని వేశాడట. ఆ ఏనుగుకు హారం కొత్తగా అనిపించడంతో నేలపై పడేసి కాళ్లతో మట్టసాగిందట. ఇది చూసిన దూర్వాస ముని ఇంద్రుడిని శపించాడట. దీంతో ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయాడు. పరిహారం కోసం శ్రీమహావిష్ణువును ప్రార్థించాడు.

దీపావళి సమయంలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి దాన్ని మహాలక్ష్మీ రూపంగా అర్చించమన్నాడట శ్రీహరి. అలా చేయడంతో ఇంద్రుడు సిరిసంపదలు తిరిగి పొందాడట. అప్పుడు ఇంద్రుడు ‘అమ్మా... ఇంత మహిమగల నువ్వు ఒక్క విష్ణుమూర్తి దగ్గరే ఉండటం న్యాయమా! జనులందరినీ అనుగ్రహించు తల్లీ’ అని కోరాడట.

అప్పుడామె మునులకు మోక్షలక్ష్మిగా, సంపదలు కోరేవారికి ధనలక్ష్మిగా, సంతానం కావాలనుకునే వారికి సంతానలక్ష్మిగా... ఇలా అనుగ్రహించిందిట. అప్పటి నుంచే అమ్మవారు అష్టలక్ష్మీ రూపాల్లో కొలువయిందట. అష్టలక్ష్మీ రూపాల వెనక ఉన్న కథ ఇది. అందుకే ఆ రోజు దీపాలు పెట్టి అమ్మను పూజించిన వారింట సకల సంపదలూ కొలువవుతాయన్నది పురాణవాక్కు.

ధన్వంతరి జయంతి!
అమృతం కోసం దేవదానవులు పాలకడలిని చిలికే సందర్భంలో విష్ణు స్వరూపుడయిన ధన్వంతరి, చేతిలో అమృత కలశంతో పైకి వచ్చింది కూడా ధనత్రయోదశి నాడేనట. అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించి, అసలు చావే లేకుండా చేసే ఆ కుండను ధరించి ధన్వంతరి వెలుపలికి వచ్చాక రాక్షసులు ఆ భాండాన్ని దొంగతనం చేయడం, తర్వాత జరిగిన మోహినీ కథ వృత్తాంతమంతా మనకు తెలిసిందే. దేవ వైద్యుడిగా ధన్వంతరిని పిలుస్తారు. ఆయుర్వేద విజ్ఞాన దాత అయిన ఈయన జయంతిని ఆయుర్వేద దినోత్సవంగానూ జరుపుకుంటారు. ధన్వంతరి జయంతి రోజు ఆయన్ను పూజిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయన్నది నమ్మిక.

రామయ్య తిరిగొచ్చాడు...
తండ్రి ఆనతిని తలదాల్చిన రామభద్రుడు అడవులకు వెళ్లి, తర్వాత సీతాదేవి కోసం వెతికి, అక్కడే రావణాసుర సంహారం గావించాడు. సీతా లక్ష్మణ హనుమత్‌ సమేతుడై, వానర భల్లూక వీరులతో కలిసి అయోధ్యా పట్టణానికి తిరిగివచ్చాడు.

రఘువంశతిలకుడు జానకీ సమేతుడై పట్టాభిషిక్తుడయ్యాడు. రామపరివారానికి స్వాగత తోరణాలుగా అయోధ్యా వాసులందరూ దీపాలను వెలిగించి ఆనందంగా పండగ జరుపుకున్నారట. రామయ్య తిరిగి అయోధ్య చేరిందీ దీపావళి సమయానే. ఆరోజు ఆయన తన తమ్ముడైన భరతుడిని కలుసుకున్న సందర్భానికి గుర్తుగా ఉత్తరాదిన నరకచతుర్దశి రోజును ‘భరత్‌ మిలాప్‌’గా జరుపుకుంటారు. అంతేకాదు, కౌరవుల చేతిలో మాయాజూదంలో ఓడిపోయి వన, అజ్ఞాత వాసాలను ముగించుకున్న పాండవులు తిరిగి వచ్చిందీ దీపావళి సమయంలోనేనని మహాభారతం పేర్కొంటోంది.

యమధర్మరాజుకు ప్రత్యేకం
దీపావళి సమయంలో వచ్చే ధనత్రయోదశినే యమ త్రయోదశి అని కూడా పిలుస్తారు. ఆయువుకు అధిపతి అయిన ఈయన కోసం దీపావళి సమయంలో యమదీపం పేరిట దీపాన్ని వెలిగిస్తారు. దీని వెనక ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం హిమవంతుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు ఒక కుమారుడు. అయితే, జాతకరీత్యా పెళ్లయిన నాలుగో రోజే పాముకాటుతో మరణిస్తాడని పురోహితులు తేల్చారు. అదంతా పట్టించుకోకుండా ఓ రాకుమారి అతన్ని ప్రేమించి వివాహమాడింది. తన పసుపుకుంకుమల్ని ఎలాగైనా కాపాడుకుంటానని శపథం చేసింది. నాలుగో రోజు గది ముందు ఆభరణాలనూ, బంగారు నాణేలనూ రాశులుగా పోసి చుట్టూ దీపాలు వెలిగించింది. రాత్రంతా రాకుమారుడిని మెలకువతో ఉంచి తన ఇష్టదేవత లక్ష్మీదేవి గురించి శ్రావ్యంగా గానం చేస్తుంది. యమధర్మరాజు సర్పరూపుడై వస్తాడు. ఆ కాంతుల మిరుమిట్లకు చూపు సరిగా ఆనక, గదిముందే తచ్చాడుతూ ఆమెపాడే పాటలను వింటూ ఉంటాడు. ఇంతలోనే తెల్లారిపోయి యమఘడియలు పూర్తవుతాయి. రాకుమారుడు పూర్ణాయుష్కుడవుతాడు. అలా రాకుమారి తన పతి ప్రాణాలను కాపాడుకుంటుంది. అందుకే ఆ రోజు ఆరుబయట అన్నాన్ని రాశిగా పోసి దానిమీద దీపాన్ని వెలిగించే సంప్రదాయం ఉంది. ఇలా చేస్తే అపమృత్యుదోషాలు తొలగిపోతాయని నమ్మకం. దీపావళి తర్వాత వచ్చే విదియనే యమ ద్వితీయ అంటారు. యమధర్మరాజు సోదరి యమున తన అన్నను భోజనానికి ఇంటికి రమ్మని ఎన్నోసార్లు పిలిచిందట. ఓ రోజు చిత్రగుప్తులతో కలిసి మరీ వెళ్లి ఆమె కొసరికొసరి వడ్డించే విందును ఆరగించిన యముడు ఈ రోజు తన సోదరి ఇంట భోజనం చేసిన వారికి నరక బాధలు ఉండవనీ, అపమృత్యు దోషాలు తొలగిపోతాయనీ వరమిచ్చాడు. దీపావళి వేడుకల్లో అయిదవ రోజున ‘భగినీ హస్త భోజనం’గా దీన్ని జరుపుకుంటాం.

బలి చక్రవర్తి కథ
రాక్షసరాజైన బలి చక్రవర్తి అసుర మూకల్ని పోగు చేసి దేవలోకపు అమరావతి మీద యుద్ధానికి సంసిద్ధమవుతాడు. దేవతలను భయభ్రాంతులకు గురిచేస్తాడు. దీంతో మహావిష్ణువు బాల వటువు అవతారం ఎత్తుతాడు. మూడు అడుగుల నేలను దానమివ్వమంటూ బలిచక్రవర్తిని అడుగుతాడు. వచ్చింది ఎవరని ఆలోచించకుండా అతని మాటకు సరేనంటాడు బలిచక్రవర్తి. విష్ణువు త్రివిక్రముడై ఆకాశమెత్తు పెరిగి ఓ పాదంతో నేలనూ మరో పాదంతో ఆకాశాన్నీ ఆక్రమించి మూడో అడుగును బలి తలమీద పెట్టి పాతాళానికి అణచివేసిందీ దీపావళి రోజునే. బలికి పాతాళలోక ఆధిపత్యాన్ని ప్రసాదించి దేవతలను కాపాడాడు శ్రీహరి. దీపావళి మర్నాడు వచ్చే పాడ్యమి నాడు మళ్లీ బలిచక్రవర్తి నేల మీదకు వచ్చి తన ప్రజలు ఎలా ఉన్నారో చూసి వెళతాడనీ, అందరూ సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తాడనీ చెబుతారు. దీపావళి వేడుకల్లో నాలుగో రోజైన ఈ రోజును ‘బలి పాడ్యమి’గా జరుపుకుంటారు. ఇంటి ముందు దీపాలు వెలిగించి బలి చక్రవర్తిని పూజిస్తారు.

లోకాన్ని హింసిస్తున్న హిరణ్యకశిపుణ్ని సంహరించేందుకు స్వామి ఉగ్రనారసింహావతారం ఎత్తిందీ, ఆ రాక్షసుణ్ని తన వజ్రసమాన నఖాలతో చీల్చివేసిందీ ఈ రోజేనట. పరమభక్తుడూ, జ్ఞానీ అయిన ప్రహ్లాదుడికి రక్షణనివ్వడం ద్వారా శ్రీహరి ఎక్కడ వెదకితే అక్కడ ఉంటానని నిరూపించిన శుభదినం ఇది.

అవతారం ఏదైనా రాక్షసుడు ఎవడైనా మొత్తంగా శత్రుసంహారం, ధర్మసంస్థాపనం... ఇదే దీపావళి పండగ ప్రత్యేకం. చీకటిని చిన్నబోయేలా చేస్తూ ఆనాటి రాత్రి వీధి వీధినా, గడపగడపనా వెలిగే దీపాలన్నీ ఇలాంటి ఒక్కో విజయానికీ ప్రతీకలే!


వెలుగు  దీపాలు!

దీపం జ్యోతి పరబ్రహ్మ
దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వమ్‌
దీపలక్ష్మీ నమోస్తుతే
బ్రహ్మ సకల జ్ఞానానికీ అధిపతి. దీపం సాక్షాత్తూ ఆ పరబ్రహ్మ స్వరూపం. అది సకల తమో గుణాలనూ హరించి వేస్తుంది. ఎలాంటి కార్యాన్నైనా సాధించగలిగే శక్తిని ప్రసాదిస్తుంది. అలాంటి దీపలక్ష్మీ నీకు నమస్కారం!!

దీపానికి హైందవ సంప్రదాయంలో విశిష్టస్థానముంది. వారి నిత్యపూజా విధిలో అది ప్రధాన భాగమై విరాజిల్లుతోంది. దీపారాధన చేయనిదే ఎలాంటి శుభకార్యాలూ ప్రారంభించకూడదని శాస్త్రం చెబుతోంది. జ్యోతి సాక్షాత్తూ దేవతా స్వరూపం. దీపంలో కనిపించే ఎరుపు, పసుపు, నీలం... రంగులు త్రిగుణాత్మక రూపాలైన లక్ష్మి, సరస్వతి, దుర్గలకు ప్రతిరూపాలుగా చెబుతారు. అంతేకాదు, దీపపు కుంది కింది భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణువు, ప్రమిదలో శివుడు, వత్తి కాంతిలో సరస్వతి, నిప్పుకణికలో లక్ష్మి స్థిరనివాసం ఉంటారని శాస్త్రవచనం. అందుకే దీపారాధన చేయగానే కుందికి బొట్టు పెట్టి అక్షతలూ, పూలూ వేసి నమస్కరిస్తారు. అయితే ప్రాణులన్నింటి భారాన్నీ మోయగల భూదేవి, దీపం వేడికి మాత్రం తాళలేదట. అందుకే దీపారాధన చేసేప్పుడు ప్రమిదలో ప్రమిద వేయాలి. కుంది అడుగున ఒక పళ్లెమో అదీ లేని పక్షంలో ఆకు అయినా వేసి దీపారాధన చేయాలి. దీపావళి సమయంలో దీపాలు వెలిగించేందుకు నువ్వుల నూనెనూ, లేదా ఆవు నెయ్యినీ వాడటం సర్వశ్రేయోదాయకం.

భోదీపదేవి రూపస్త్యం కర్మసాక్షిహ్యామిఘ్నకృత
యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదోభవ!

దీపం సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపం. అందుకే దీపం కొలువైన ఇంట శ్రీ మహాలక్ష్మి నివసిస్తుంది. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. దరిద్రాన్ని పారదోలుతుంది. ఐశ్వర్యసిద్ధినిస్తుంది. శాంతిని చేకూరుస్తుంది. దీపావళి పండగ సమయంలో తీర్చిదిద్దిన రంగవల్లిక మీద పీఠం వేసి అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు. ముగ్గు లేదా సున్నంతో లక్ష్మి పాదాలు వేసి ఆమెను లోపలికి ఆహ్వానించే ఆచారమూ ఉంది. దీపావళినాటి సాయంత్రాలు పూజగదితో పాటు మరో అయిదు ప్రదేశాల్లోనూ దీపాలు తప్పనిసరిగా వెలిగించాలి. అవి... ఇంటి ప్రధాన ద్వారం, వంటిల్లు, ధాన్యం గది, బావి, రావిచెట్టు. ఇవి వీలుకాని పక్షంలో తులసి చెట్టు దగ్గరా దీపాన్ని వెలిగించవచ్చు. దీపారాధన చేసేప్పుడు కనీసం రెండు వత్తులు ఉండేలా చూసుకోవాలి. ఆ దీపజ్యోతి ఉత్తర దిశగా ఉండేలా పెడితే కార్యాలన్నింటా విజయం లభిస్తుంది. తూర్పుదిశగా పెడితే ఆరోగ్యమూ, మనశ్శాంతీ కలుగుతాయట. రోజూ చేసే దీపారాధన కాకుండా నది దగ్గరా లేదా గుడిలోనో విశేష దీపారాధన చేయాలనుకున్న వాళ్లకి జన్మరాశిని బట్టి ఎన్నెన్ని వత్తులు వెలిగించాలో శాస్త్రంలో స్పష్టంగా ఉంది. దాని ప్రకారం... మేష, కర్కాటక, ధనుస్సు రాశుల వారు 3 వత్తులూ, వృషభ, కన్య, కుంభ రాశుల వారు 4 వత్తులూ, సింహ, వృశ్చిక, మీన రాశుల వారు 5 వత్తులూ, తులారాశి వారు 6 వత్తులూ, మిథున, మకర రాశుల వారు 7 వత్తులూ వెలిగించాలి.

దీపదానానికీ శాస్త్రంలో ఎంతో ప్రత్యేకత ఉంది. దానాల్లో శ్రేష్ఠమైనదిగా దీపదానాన్ని చెబుతారు. చతుర్దశి, అమావాస్య తిథుల్లో ప్రదోష సమయాన దీపదానం చేస్తే యమబాధల నుంచి మనిషికి విముక్తి లభిస్తుందట. గాఢాంధకారాన్ని తొలగించి వెలుగులు నింపే జ్యోతిని వెలిగించినా, దానమిచ్చినా పుణ్యమే. చీకటిలోనూ మనకు కళ్లుంటాయి, కానీ దీపం వెలిగించేదాకా అక్కడ ఉన్నది మనకు కనిపించదు. అలాగే మన మనసులోని తిమిరాన్ని పారద్రోలాలంటే జ్ఞానదీపాన్ని వెలిగించాల్సిందే. అందుకు గుర్తే ఆ కోటి సూర్యప్రకాశుడి ముందు మనం వెలిగించే ఈ దీపాలు.

27 అక్టోబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.