close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బూట్లు

- చిత్తలూరి సత్యనారాయణ

(‘రామోజీ ఫౌండేషన్‌’ కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి)

‘పింఛను డబ్బులివ్వలేదని కన్నతండ్రిని కొట్టి చంపిన కసాయి కొడుకు’.
‘ఆస్తిని తన పేర రాసివ్వట్లేదని కన్నతల్లిని కొట్టి ఇంట్లోంచి తరిమేసిన తనయుడు.’
... ఇలాంటి వార్తలు చదివినప్పుడల్లా నా మనసెంతో కలవరానికి గురవుతుంది. నోటి దగ్గర పెట్టుకోబోతున్న కాఫీ కప్పును కిందపెట్టి, వెంటనే న్యూస్‌పేపర్‌లోంచి తలెత్తి గోడ మీదకి దృష్టి సారించాను. ముప్ఫై సంవత్సరాలక్రితం జరిగిన సంఘటన కళ్ళముందు మెదిలింది. ఆ తరవాత నేనింకెప్పుడూ మా మామయ్యను బూట్లు కొనివ్వమని మారాం చేయలేదు. వెంటపడి వేధించలేదు. ఒకవేళ ఆయన బూట్లు కొనిచ్చినా అవెప్పుడో కాలగర్భంలో కలిసిపోయేవి కానీ...

* * * * *

అప్పుడు నేను ఆరో తరగతి చదువుతున్నాను. వేసవి సెలవులొచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ దగ్గర కంకిపాడుకు వెళ్ళటం నాకెంతో సరదాగా ఉండేది. ఒకే ఊళ్ళో మా మేనమామా పిన్నీ ఇద్దరూ ఉన్నా నాకు మా పిన్నీవాళ్ళ ఇంట్లో గడపడమే ఇష్టంగా ఉండేది. అలా అని మా అత్త బాగా చూడదని కాదు కానీ, మా అమ్మ తమ్ముడవటం మూలానేమో మా మామయ్య కనబడితే మాత్రం నా ఆనందానికి హద్దులుండేవి కావు. పిన్ని ఆయనకంటే చిన్నది. పనిమీద వెళ్ళేటప్పుడు దారిలో చెల్లెలింటి దగ్గర ఆగి, కాఫీ తాగి కాసేపు కూర్చుని కబుర్లు చెప్పి వెళుతూ ఉండేవాడు మామయ్య. ఆయన ఇంటికి రావటం మా పిన్నికి కూడా చాలా ఆనందంగా ఉండేది. ఇక నేనొచ్చానని తెలిస్తే ఆ దారిలో ఏమీ పనిలేకపోయినా ‘మా అల్లుడు మహేష్‌ వచ్చాడట గదా... ఏడీ ఎక్కడ?’ అంటూ వచ్చేవాడు.
మామయ్యను చూడగానే నేను కూడా గాలిలో తేలిన రంగుల బుడగనయ్యేవాణ్ణి.
ఈసారి వేసవి సెలవుల్లో ‘‘మామయ్య ఎప్పుడొస్తాడు పిన్నీ, ఇంకా రావట్లేదేమిటీ? ఇంతకీ నేనొచ్చానని తెలిసిందంటావా?’’
అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తున్న నన్ను చూసి, ‘‘ఏమిట్రా ఆ తొందర. మా అన్నయ్యకెన్ని పనులు... రావద్దా ఏంటీ... ముందీ వేడివేడి ఉప్మా తిను- మీ మామయ్య వస్తాడుగానీ. అన్నయ్యకు కూడా ఇష్టమని నాలుగు జీడిపప్పులు ఎక్కువే వేశానీసారి ఉప్మాలో’’ అంది.
ఉప్మా తింటూ మామయ్యను అసలు విషయం ఎలా అడగాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. ఇంతలో మామయ్య రానే వచ్చాడు. తెల్లని చొక్కా, తెల్లని గళ్ళ లుంగీలో దబ్బపండు ఛాయలో మా మామయ్య పెద్ద ఆఫీసరులా కనిపించేవాడు. వచ్చీ రావటంతోనే ‘‘చెల్లెమ్మా, ఎక్కడ మా అల్లుడు?’’ అంటూ వసారాలోకి అడుగుపెట్టగానే మా పిన్ని గబగబా నులకమంచం వాల్చి దుప్పటి పరిచింది.
అందులో కూర్చుని ‘‘ఏరా మహేష్‌, ఎప్పుడొచ్చావ్‌? అన్నట్టు... ఈసారి పరీక్షలెట్లా రాశావ్‌? నువ్వు బాగానే రాస్తావ్‌లే, ఎంతయినా నా అల్లుడు చదువులో ఫస్టే’’ అంటూ నా భుజమ్మీద చెయ్యేసి పక్కన చోటిస్తూ మంచంమీద కాస్త పక్కకు జరిగాడు.
చేతిలో మరో ఉప్మా ప్లేటుతో వరండాలోకొచ్చి మామయ్య చేతికందించింది పిన్ని. మామా అల్లుళ్ళు పక్కపక్కనే మంచమ్మీద కూర్చుని అలా ఉప్మా తింటూ ఉంటే ఆమె కళ్ళలో బిడ్డలను చూస్తున్న తల్లి ఆనందం ప్రతిఫలించింది. ఉప్మా తినటం పూర్తయ్యాక లేచి చేయి కడుక్కుని పక్కనే మంచం కోడుకు తగిలించిన తువ్వాలుతో చేతులు తుడుచుకుని ఏమీ మాట్లాడకుండా గదిలోకెళ్ళాను. నేను ముభావంగా ఉన్న సంగతి మామయ్యకు అర్థమైనట్టుంది.
‘‘ఏంటీ, ఈసారి మామా అల్లుళ్ళ మధ్య మాటల్లేవా, మాట్లాడుకోవటం లేదు. ఒరేయ్‌ మహేష్‌, మామయ్య వచ్చిందాకా ఎప్పుడొస్తాడని అడిగీ అడిగీ, వచ్చిందాకా నా ప్రాణాలు తోడేశావ్‌. మరిప్పుడేమయింది- మామయ్యతో మాటా మంతీ లేకుండా గదిలోకి మాయమయ్యావ్‌?’’ అడిగింది పిన్ని.
నా అలకకి కారణం తెలిసిన మామయ్య నవ్వుతూ నావంక గదిలోకి తొంగిచూస్తూ ‘‘నా అల్లుడి అలక ఈరోజు తీరుతుందిలే చెల్లీ’’ అన్నాడో లేదో నేను ఆనందంతో పురివిప్పిన నెమలిలా ఒక్క గంతులో గదినుంచి బయటకొచ్చి మామయ్య పక్కన కూర్చుని ‘‘ఏదీ మామయ్యా, ఇంకోసారను ఆ మాట! నిజమా!?’’ అంటూ సంభ్రమాశ్చర్యాలతో మామయ్య ముఖంలోకి చూశాను.
నా ఉత్సాహం చూసి మామయ్య మరింత సంబరపడ్డాడు. కానీ, అది పూర్తి సంతోషంలా కనిపించలేదు నాకు. ‘‘మీ మామా అల్లుళ్ళ మధ్య ఎప్పుడూ ఉండేదేగా ఈ అలకలాట’’ అంటూ ఖాళీ ప్లేట్లను తీసుకుని పొయ్యి దగ్గర ఉన్న నీటికుండ దగ్గరకు వెళ్ళింది పిన్ని.
ఎప్పటిలాగే తలంటి స్నానంచేసి సిద్ధంగా ఉన్న నేను ప్యాంటూ చొక్కా వేసుకోవటానికి లోనికెళ్ళాను. ఇవాళ ఈ దుస్తులు నా కంటికి మరెంతో అందంగా కనిపిస్తున్నాయి. పోయినేడాది వేసవి సెలవులకొచ్చినప్పుడు మా పిన్ని నాకీ చొక్కా ప్యాంటూ కుట్టించింది. అప్పటినుంచీ ప్రతి పండక్కీ పెట్టెలోంచి తీసి అమ్మ నా చేతికిస్తే ఈ బట్టలు వేసుకుని ఎంతగానో మురిసిపోవటం నాకలవాటు. ఆ రోజుల్లో ఒక మంచి డ్రెస్సేదయినా ఉంటే దాన్నే సంవత్సరాల తరబడి- అంటే, అవి బాగా పొట్టయి, ఇక వేసుకోవటానికి పనికిరావనుకునేదాకా వేసుకునేవాళ్ళం. ఒకే డ్రెస్సుతో సంవత్సరాలు సరిపెట్టుకునే పేదరికమన్నమాట. అందుకే అమ్మ ఎప్పుడైనా మా ఇంట్లోని పెట్టె తెరిచిందంటే ఆ రోజు మా నాన్నకూ నాకూ పండగే ఇక. ఆయనేమో తెల్లని బనీనూ, మరింత తెల్లని అంచు ధోవతిలో మా ఊరి పటేలులా కనిపించేవాడు. నేనేమో ఈ ప్యాంటూ చొక్కాలో నా ఈడు పిల్లలందరిలో హీరోలా పోజు కొట్టేవాణ్ణి. ఎందుకంటే, నా ఈడు పిల్లలంతా పొట్టి నిక్కర్లు వేస్తున్న కాలమది. ప్యాంటు అనేది వారి ఊహల్లో కూడా లేదు. అట్లాంటిది మూరెడు బెల్‌బాటమ్‌ పెట్టించిన ప్యాంటు వేసుకోగలుగుతున్నానంటే నా ఆనందానికి అవధులెక్కడివింకా. అయితే, ఆ డ్రెస్‌ వేసుకున్న ప్రతిసారీ కాళ్ళకు స్లిప్పర్స్‌ వేసుకోవటం నాకు అస్సలు నచ్చేది కాదు. బూట్లు వేసుకుంటే దర్పంగా ఉంటుందనిపించేది.
మా ఊరి సర్పంచు కొడుకు సురేష్‌ ప్యాంటు కింద బూట్లతో కనిపించినప్పుడల్లా నేనెప్పుడలా వేసుకోగలనా అనిపించేది. నేను బాగా చదువుతానని సర్పంచుగారి కొడుక్కి కూడా నాపైన కొంచెం ఇష్టంగానే ఉండేది. ఓసారి దసరా పండక్కి అతనికిలాగే ప్యాంటూ షర్టూ వేసుకుని కాళ్ళకేమో రబ్బరు స్లిప్పర్లతో నిలబడటం నాకెందుకో నామోషీగా అనిపించింది. పైగా వాడు ‘ఒరేయ్‌, ప్యాంటు మీద స్లిప్పర్లేంటిరా, బూట్లేసుకోవాలి. నా బూట్లు చూడు, ఇవి వేసుకుంటే డ్రెస్సుకు ఎంత అందమొచ్చిందో’ అనగానే మా చుట్టూ ఉన్న స్నేహితులంతా ఫక్కున నవ్వారు. అవమానంతోపాటూ రోషం కలగలిసి నాకు బూట్ల పట్ల మరింత కోరిక కలిగింది. వెంటనే మనసులో బలంగా నిర్ణయించుకున్నాను... ఏమైనాసరే, ఈసారి వేసవి సెలవుల్లో మా మామయ్యతో బూట్లు కొనిపించుకోవాలని. అలా వేసవి సెలవులకెళ్ళినప్పుడల్లా మా మామయ్యని బూట్లు కొనిపెట్టమని వెంటపడటం... ఆయన ఏవో సాకులు చెబుతూ ‘నువ్వు ఈసారి క్లాసులో ఫస్టొస్తే కొనిస్తాలేరా’ అని తాత్కాలికంగా తప్పించుకోవటం... నేను ప్రతి ఏటా క్లాసులో ఫస్టు రావటం, మళ్ళీ ఆయన్ని బూట్లు కొనివ్వవేం అని నిలదీయటం, మామయ్య వాయిదా వేస్తూ రావటం జరుగుతూనే ఉంది.
బూట్లు కొనిపెట్టేంత స్తోమత మా అమ్మానాన్నలకు ఎలాగూ లేదని తెలుసు కాబట్టి అడిగినా ప్రయోజనం లేదని ఊరకుండిపోయాను. కానీ, మా మామయ్య చిన్నపాటిదైన టౌన్లోనే ఉంటున్నాడు కదా! అంతేకాకుండా, మా పిన్ని వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి కొనిపెట్టి నాపట్ల ఆమె ప్రేమను వ్యక్తపరిచేది. మా మామయ్య కనీసం బూట్లయినా కొనివ్వడా? - అనే లాజికొకటి నా కోరికను మరింత బలపరిచింది. మా పిన్నినడిగినా బూట్లు కొనిచ్చేదేగానీ అసలే ఆ రోజుల్లో ఒక వ్యక్తికి- పిల్లలకైనా పెద్దలకైనా బట్టలు పెట్టటమంటే కుటుంబాల్లో ఆర్థికభారంగానే ఉండేది. పైగా మా నాన్న ఒకసారి అన్నాడు- ‘ఒరేయ్‌, మీ పిన్ని ముందే నీకు అంత ఖరీదైన డ్రెస్సు కొనిచ్చింది. ఇంకా బూట్లు కొనమని అడిగి ఇబ్బంది పెట్టొద్దు. నా బామ్మర్ది - అదే - మీ మేనమామ కొనిస్తే కొనిపించుకో’ అన్నాడు. మామయ్యతోనే బూట్లు కొనిపించుకోవాలనే
నా నిర్ణయానికి నాన్న మాట మరింత బలం చేకూర్చింది. అందుకే పిన్ని వాళ్ళింటికి వచ్చినప్పుడల్లా, మామయ్యను కలుసుకున్నప్పుడల్లా బూట్లు కొనివ్వమని అడగటం... ఆయన వాయిదాలేస్తూ పోవటం ఒక ఆనవాయితీగా మారిపోయింది. అలాంటిది ఇవాళ బజారుకెళదామని చెప్పేసరికి నాకెంతో హుషారొచ్చింది.
ఎందుకో ఇంతటి ఆనందంలోనూ ఎక్కడో ఓ మూల లోపల మామయ్య మీద మళ్ళీ అపనమ్మకంగానే ఉంది. అందునా అన్నీ తెలిసిన పిన్ని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆమె పనిలో ఆమె నిమగ్నమైపోవటం- నా అపనమ్మకానికి ఆజ్యం పోసింది. అద్దంలో ఒకటికి రెండుసార్లు నా ఆఫ్‌ చేతుల చుక్కల చొక్కానీ చింతపండు రంగులోని ప్యాంటునీ చూసుకుంటుంటే నాకే ఎంతో చూడముచ్చటగా అనిపించింది. బెల్‌బాటమ్‌ వంక కించిత్తు గర్వంగా చూసుకుంటూ ఇంకాస్త కిందకు చూపుపడగానే మనసు చివుక్కుమంది. కాళ్ళవైపు చూసుకోగానే, అప్పటిదాకా జ్వాలలా మండిన గర్వం కాస్తా నీళ్ళు చిలకరించినట్లు చప్పున చల్లారింది. దిగులు ముఖంతో వచ్చి మామయ్య ఎదురుగా కూర్చున్నాను.

నేను గదిలో ఉన్నప్పుడు చెల్లెలూ అన్నయ్యా ఏం మాట్లాడుకున్నారో ఏమో పిన్ని మెల్లగా గొంతు విప్పి ‘‘ఇంకా ఎందుకురా ఆ దిగులు ముఖం, మీ మామయ్య నిన్ను బజారుకు తీసుకెళతానంటున్నాడుగా... నీక్కావలసింది కొనిపెడతాడులే ఈసారి’’ అంటూ మామయ్యకేసి చూసి నవ్వింది. పక్కనే ఉన్న పారగాన్‌ రబ్బరు చెప్పులు అయిష్టంగా కాళ్ళకు తగిలించుకుని మామయ్య వెనకాల మెల్లగా అడుగులు వేశాను.
సైకిల్‌స్టాండు తీసి తలతిప్పి వెనక్కి తిరిగి వెనక క్యారేజీ మీద కూర్చోమని సైగ చేశాడు మామయ్య.
దారిలో ఎదురుపడ్డవారికల్లా... ‘‘ఇదిగో మా అల్లుడయ్యా, నైజాం నుంచి వచ్చాడు. ఆరో తరగతిలో మా అల్లుడే ఫస్టు తెలుసా?’’ అంటూ నా గురించి ఎంతో గర్వంగా గొప్పలు చెబుతున్నాడు.
నాకెందుకో ఒకపక్క ఆనందంగా తోచినా వెంటనే మరోపక్క కోపం తన్నుకొస్తోంది. ‘ఇంతకీ మామయ్య నన్నెక్కడికి తీసుకెళుతున్నాడు- నేనూహించిన చోటుకేనా? ఈ రోజైనా నేననుకున్నది నాకు సమకూరుతుందా? మా ఊరికి తిరిగివెళ్ళాక మా స్నేహితులందరి ముందూ- ముఖ్యంగా- సురేష్‌గాడి ముందు నేను బడాయిపోయే అవకాశం చిక్కుతుందా?’
ఆలోచనల్లో పడిపోయి దారిలో ఆయన పలకరింపుల మధ్య తడిసిపోతున్న వాళ్ళను నేను పెద్దగా పట్టించుకోలేదు. మామయ్య వెనక్కి తిరిగినప్పుడల్లా నేనూ మెల్లగా ఓ చిరునవ్వు వాళ్ళమీదకు విసిరేస్తూ ఉన్నాను. నా కళ్ళు మాత్రం రోడ్డుకిరువైపులా ఉన్న షాపుల్ని జాగ్రత్తగా వెతుకుతున్నాయి. సైకిల్‌ ముందుకు కదులుతూనే ఉంది... నాక్కావలసిన షాపు కనబడగానే నా కళ్ళు పెద్దవవటం, అంతలోనే చిన్నబుచ్చుకుని రెప్పలు మూసుకుపోయి తల కిందికి వాలిపోవటం నాకు స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. మామయ్య మాత్రం సైకిల్‌ బెల్లును మోగిస్తూ ఎప్పటిలాగే పలకరింపుల చినుకులలో ఎరిగినవాళ్ళను తడిపేస్తూ, సైకిల్‌ తొక్కుకుంటూ ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఇంతలో సన్నగా చినుకులు మొదలయ్యాయి. నాక్కావలసిన షాపులన్నీ దాటి సైకిల్‌ ముందుకు దూసుకుపోవటం, మామయ్య ఏమీ మాట్లాడకుండా సైకిల్‌ తొక్కే పనిలో లీనమైపోవటంతో నా మనసంతా దిగులు మేఘం కమ్మినట్లయింది.
తన జేబులో ఉన్న జేబు రుమాలు తీసి నా తలమీద కప్పుతూ, ‘‘త్వరగా లోపలికి పద అల్లుడూ, వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది’’ అంటూ పక్కనే చెట్టువారగా సైకిల్‌స్టాండు వేసి వేగంగా లోపలికి అడుగులు వేశాడు. నాకంతా అయోమయంగా ఉంది. కాసేపయ్యాక మామయ్య ఇచ్చిన రుమాలుతోనే తల తుడుచుకుని గది లోపలి దృశ్యాలను చూసిన నాకు అది ఫొటో స్టూడియో అని అర్థమై ఉలిక్కిపడ్డాను. ఇక్కడ బూట్లెలా దొరుకుతాయో నాకర్థం కాలేదు. దిక్కుతోచనివాడిలా దిక్కులు చూస్తూ ఉండిపోయాను.
ఫొటో స్టూడియో అతనితో ఏదో మాట్లాడి నా దగ్గరకొచ్చాడు మామయ్య.
‘‘అల్లుడూ, ఈ డ్రెస్సు మీద ఫొటో దిగితే చాలా బాగుంటుంది’’ అన్నాడు నవ్వుతూ.
ఫొటో అనగానే చాలా సరదాగా ఎంతో ఉత్సాహంగా అనిపించిందో క్షణకాలం.
నా చిన్నప్పటి కాలంలో ఫొటోలు దిగి మమ్మల్ని మేము చూసుకుని మురిసిపోయే అవకాశం కూడా లేదు. చిన్న పాస్‌పోర్టు సైజు ఫొటో దిగాలన్నా మా ఊరునుంచి ఓ పదిహేను కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వెళితేగానీ ఫొటో స్టూడియో కనిపించేది కాదు. తీరా డబ్బులుపెట్టి ఫొటో దిగాక మా ముఖం చూసుకోవాలన్న ఉత్సాహం అంతా నీరుగారిపోయాక ఏ నెలరోజులకో ఫొటో మా చేతికందేది. వెనకటికోసారి మా పెద్దక్కకు ఫొటో తీయించాలనుకుని కూడా డబ్బుల్లేక, అంత దూరం పోలేక, ఫొటో దిగటం ఓ ఖరీదైన వ్యవహారంలా భావించి మా తల్లిదండ్రులు మిన్నకుండిపోయారు. అందుకే, నా పసితనం లోనే దూరమైన మా అక్క ఎలా ఉంటుందో కూడా నాకు తెలియకుండా పోయింది. మా అమ్మానాన్నలూ పిన్నీబాబాయిలూ మామయ్యా చెబితే పోలికల్ని ఊహించుకుని తలుచుకుంటూ బాధపడటం నా కలవాటైంది.
ఫొటో విషయంలో నాకున్న అనుభవం నన్ను ఫొటో దిగటానికి పురికొల్పినా, మామయ్య ఫొటో పేరుతో నా బూట్లకు ఎసరు పెడతాడేమోనని లోపల్లోపల అనుమానం కలుగుతూనే ఉంది. అందుకే నాకు నవ్వు రాలేదు సరికదా... కోపం ముఖంనిండా ఆవరించి కందగడ్డలా మారింది.
‘‘ఏమయ్యా నాగేశ్వర్రావ్‌, మా అల్లుణ్ణి చాలా అందంగా ఫొటో తీయాలి. లేకపోతే నీకు డబ్బులియ్యను... అర్థమైందా?’’ అన్నాడు మామయ్య.
‘‘అట్లాగే గురువుగారూ. అయినా, ఇందులో నేను తియ్యటానికేముంది, మీ అల్లుడెట్లాగూ అందగాడే! ఆ అందమే ఫొటోలో వస్తది. అయినా కాస్త నవ్వమని చెప్పండి మీ అల్లుణ్ణి’’ అంటూ నావైపు చూసి నవ్వాడు స్టూడియో అతను.
మామయ్య చేయి చాచి లైటింగు ఎదురుగా నిల్చోమన్నట్లు సైగ చేశాడు. లోపల ఎంత మండిపోతున్నా మామయ్య మీదున్న గౌరవం, ప్రేమా, ఫొటోపట్ల ఎక్కడో ఉన్న మోజూ నన్ను అక్కడ నిలబడేలా చేశాయి.
స్టూడియో అతను నా పక్కగా ఒక చెక్క స్టూలు వేశాడు. మామయ్య దానిమీద స్టూడియోలో ఉన్న ఒక అందమైన ప్లాస్టిక్‌ ఫ్లవర్‌వేజ్‌ను అమరుస్తున్నాడు. ఎన్నిసార్లు పెట్టినా ఆ ఫ్లవర్‌వేజు స్టూలు మీద నిలవటం లేదు. అదే స్టూలు మీద ఒక రేడియోను కూడా పెట్టడం వల్ల ఈ ఫ్లవర్‌వేజుకి చోటు కుదరక పడిపోతోందనిపించింది నాకు. కానీ, మామయ్య పట్టువదలని విక్రమార్కుడిలా దాన్ని మళ్ళీ మళ్ళీ అమర్చటం, అది పడిపోవటం చూస్తే నాకే విసుగొస్తోంది కానీ, మామయ్య మాత్రం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ‘రకరకాల పూలతో ఆ ఫ్లవర్‌వేజ్‌ చాలా బాగుంది. అది ఫొటోలో పడితే ఇంకా బాగుంటుంది. మా అల్లుడి ఫొటోకి చెప్పలేనంత అందమొస్తుంది’ అనుకుంటున్నట్టుగా మామయ్య ప్రయత్నాలు చూస్తే అర్థమైంది. పాపం మామయ్య, నా ఫొటో అందంగా రావాలని ఎంత ఉబలాటపడుతున్నాడో అనిపించి జాలేసింది. కానీ, నా మనసేమో బూట్లమీద తచ్చాడుతూ ఉందాయే! ఇంతలో మామయ్య నా స్లిప్పర్లను విడవమని సైగ చేసి, నేను తాత్సారం చేస్తుంటే తనే స్వయంగా వాటిని తీసివేయడానికి నా కాళ్ళ దగ్గర వంగబోయాడు. వెంటనే అపరాధభావంతో పక్కకు జరిగిన నేను ‘‘వద్దు మామయ్యా, నేనే విప్పుతానులే’’ అని చెప్పి స్టూడియో బయట విప్పేసి, మళ్ళీ లోనికెళ్ళి యథాస్థానంలో నిలబడ్డాను. ఆశ్చర్యం...
తన కాళ్ళకున్న చెప్పులను తీసుకొచ్చి, నా కాళ్ళముందు పెట్టి వేసుకోమన్నట్టుగా ముందుకు జరుపుతూ నా పాదాలు పట్టుకుని తనే తొడగబోయాడు. ‘మామయ్యా’ అంటూ వెనక్కి జరగబోయాను. ‘‘వేసుకోరా మహేష్‌, కొత్త చెప్పులే... రెండుసార్లో ఏమో వేశాను. నీ కాళ్ళకు ఆ స్లిప్పర్లు ఈ ఫొటోలో బాగుండవేమోననిపించింది. ఈ చెప్పులైతే బాగా కనిపిస్తాయనంతే’’ అంటూనే నా కాళ్ళకు తన చెప్పులు తొడిగి మురిపెంగా చూశాడు మామయ్య. ఎప్పుడూ స్లిప్పర్లు తప్ప, మరో చెప్పుల జత ఎరుగని నాకు ఆ చెప్పుల్లో కాళ్ళు పెట్టగానే... ఏదో కొత్త అనుభవంలా అనిపించింది. అయినా బూట్లు కొనివ్వమని అడిగితే, తన చెప్పులు తీసి నాకు తొడగటమేంటీ అని చిరాకు కలిగింది కూడా. కానీ ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడిపోయాను.

ఫొటోగ్రాఫర్‌ కెమెరాలోంచి నా స్టిల్‌ను గమనిస్తూ ‘స్మైల్‌ ప్లీజ్‌, కొద్దిగా నవ్వు తమ్ముడూ’ అనేంతలో... ‘‘ఒక్క నిమిషం నాగేశ్వర్‌రావ్‌’’ అంటూ మామయ్య నా దగ్గరగా వచ్చి, ‘‘మా అల్లుడి చేయి బోసిగా ఉందయ్యా’’
అని చెప్పి, తన చేతికి ఉన్న స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ హెచ్‌ఎంటీ వాచీని తీసి నా చేతికి తగిలించాడు. కానీ, అది నా చేతిమీద నిలవనంటూ జారిపోతోంది. మామయ్య ఎన్నిసార్లు పెట్టి చెయిన్‌ నొక్కినా ససేమిరా ఉండనంటూ జారుతోంది. పాపం ఆయన ఉబలాటాన్ని చూస్తే మళ్ళీ జాలనిపించింది. అటూ ఇటూ చూసి ఏం చేయాలో పాలుపోనివాడిలా ‘‘చిన్న దారముంటే ఇస్తావయ్యా నాగేశ్వర్రావ్‌’’ అనడిగి స్టూడియో అతను చేతికందించగానే గబగబా వదులుగా ఉన్న వాచీ చెయిను రెండు చివరల మడతలో గట్టిగా ఆ దారాన్ని చుట్టి మిగిలిన దారం చివరలను నోటితో కొరికాడు. మామయ్య ప్రేమతో పురిపెట్టి ముడి వేశాడేమోనన్నట్లు ఈసారి జారకుండా నా చేతి మణికట్టు మీద ఠీవిగా నిలిచింది వాచీ. అప్పుడు మామయ్య కళ్ళలోని మెరుపు నా చేతికి పెట్టిన వాచీ పైన తళుక్కున మెరిసినట్లయింది. ఈ తతంగమంతా ముగ్ధుడై చూస్తున్న నాగేశ్వర్రావు అంకుల్‌... ‘‘ఓకే, స్టడీయా... స్మైల్‌ ప్లీజ్‌’’ అని క్లిక్‌ మనిపించే లోపలే ‘‘ఒక్క నిమిషం నాగేశ్వర్రావ్‌...’’ అంటూ మళ్ళీ మామయ్య నా దగ్గరగా రెండడుగులు వేసి నా మొహంలో మొహం పెట్టి తదేకంగా చూస్తూ నిలుచున్నాడు. అదెలా ఉందంటే కెమెరాలోకి ఫొటోగ్రాఫర్‌ మంచి స్టిల్‌ కోసం చూస్తున్న చూపులా ఉంది. ఇంకాస్త ముందుకు జరిగి తన కుడిచేతి చూపుడువేలూ మధ్యవేలిని కలిపి నా మాడు మీద నుంచి జుట్టును కాస్త నుదుటి మీదకు జరిపాడు. ‘‘ఇప్పుడు చూడు... ఫంకెలా అదిరిందో! అసలే నిన్ననే కటింగ్‌ చేయించుకున్నాడు మా అల్లుడు. కాస్త బోడిగా అనిపించి ఫంకు లాగాను. ఇప్పుడు బాగుంది కదా నాగేశ్వర్రావ్‌’’ గర్వంగా చూస్తూ అన్నాడు మామయ్య. ఈసారెందుకో బూట్ల సంగతి మరిచిపోయి నా ఫొటో అందంగా తీయించడానికి మా మామయ్య పడుతున్న తాపత్రయం నన్నొక క్షణం ఆలోచనలో పడేసింది. సుడులు తిరగబోతున్న కన్నీళ్ళను బలవంతంగా అదుపులో పెట్టాను. ఫొటోలో కన్నీళ్ళు పడతాయనే కాదు, కన్నీటితో నిండిన నా కళ్ళు మా మామయ్య కళ్ళల్లో పడతాయేమోనని కలవరపడ్డాను. మొత్తానికి కెమెరా క్లిక్‌ మంది. ఇద్దరం సైకిల్‌ మీద ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాం.

* * * * *

ఆ తరవాత నేనింకెప్పుడూ మా మామయ్యను బూట్లు కొనివ్వమని మారాం చేయలేదు. వెంటబడి వేధించలేదు. ఒకవేళ ఆయన బూట్లు కొనిచ్చినా అవెప్పుడో కాలగర్భంలో కలిసిపోయేవి కానీ... బూట్లు కొనలేని పేదరికంలోంచి వచ్చిన తన నిస్సహాయతకు సిగ్గుపడి దాన్ని దాచిపెట్టుకునే క్రమంలో మా మామయ్య నాపట్ల చూపించిన అపారమైన ప్రేమ ఇన్నేళ్ళయినా ఇప్పటికీ మా ఇంటిగోడ మీద ఫ్రేమ్‌ కట్టిన ఫొటో అయి వేలాడుతూ నిత్యం నన్నిలా పలకరిస్తూ ఉండేది కాదు. మామయ్య పరిస్థితిని అంచనా వేయకుండా బూట్ల కోసం ఆయనపైన
అకారణ కోపం పెంచుకుని ఆయన నిజమైన ప్రేమను గ్రహించలేకపోయిన నా ప్రవర్తనకు నేనే సిగ్గుపడేలా గుర్తుచేసేదీ కాదు.
‘పింఛను డబ్బులు ఇవ్వలేదని కన్నతండ్రిని కొట్టి చంపిన కసాయి కొడుకు.’
‘ఆస్తిని తన పేర రాయట్లేదని కన్నతల్లిని కొట్టి ఇంట్లోంచి తరిమేసిన తనయుడు’... లాంటి వార్తలు చూసినప్పుడల్లా ఈ సమాజం పట్ల నాలో చెలరేగే కలవరాన్ని తుడిచిపెట్టేదీ కాదు.

27 అక్టోబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.