close

బాస్‌.. ఇవి మీటింగ్‌ రూల్స్‌..!

కార్పొరేట్‌ ప్రపంచంలో ఉన్నవాళ్లకి మీటింగులు రోజువారీ పనుల్లో భాగం. మరి ప్రపంచ ప్రసిద్ధ కార్పొరేట్‌ ప్రముఖుల్లో కొందరు ఆ సమావేశాలకు ఎలా హాజరవుతారో, మీటింగులకు వారిచ్చే ప్రాధాన్యం ఎలాంటిదో... తెలుసుకోవాలని ఉందా?

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు అమెజాన్‌ వ్యవస్థాపకుడైన జెఫ్‌ బెజోస్‌. ఆ కంపెనీ సీయీవో కూడా అయిన జెఫ్‌...  సమావేశ మందిరంలో ఉన్న వారందరికీ కేవలం రెండు పిజ్జాల్ని స్నాక్స్‌గా తీసుకురమ్మంటారట. దీన్నే ఆ కంపెనీలో ‘టూ పిజ్జా రూల్‌’గా చెబుతారు. అంటే, సాధ్యమైనంత తక్కువ మంది సమావేశానికి హాజరవుతారన్నమాట. అమెజాన్‌ సమావేశాల్లో పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్లు ఉండవు. ఏ సమాచారమైనా కాగితంమీద రాసుకుని వినిపించడమే. అంతేకాదు, సమావేశం ప్రారంభం నుంచీ సభ్యులంతా ఏకాభిప్రాయంతో ఉండటం జెఫ్‌కు నచ్చదు. ఏ అంశంమీదైనా సభ్యుల మధ్య ఆరోగ్యవంతమైన చర్చను ప్రోత్సహిస్తారు.

మూడు నియమాలు
ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందే సీఈఓల్లో ఒకరు మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల. ఈయన తన సమావేశాల నిర్వహణలో మూడు నియమాల్ని అమలుచేస్తారు. అవి... ఎక్కువ వినడం, తక్కువ మాట్లాడటం, సకాలంలో నిర్ణయం తీసుకోవడం. ‘ఏ సమావేశం ఉద్దేశమైనా బృంద సభ్యులతో అభిప్రాయాలనూ, ఆలోచనల్నీ పంచుకోవడమే. సహచరుల మాటల్ని వింటున్నామంటే వాళ్లకీ ఇతర సభ్యుల మీద నమ్మకం ఏర్పడుతుంది, అలాంటి సుహృద్భావ వాతావరణంలో ఎవరైనా తమ ఆలోచనల్ని ధైర్యంగా చెప్పగలరు’ అనేది సత్య ఉద్దేశం. అలాగే, తక్కువ మాట్లాడటం అంటే- ఎక్కువ ప్రశ్నలు అడగటం, మనం చెప్పాల్సింది కచ్చితంగా చెప్పడం, మనకు కేటాయించిన టైమ్‌ని సక్రమంగా సమర్థంగా వినియోగించడం... అందరి అభిప్రాయాలూ విని, చివరకు ఒక నిర్ణయం తీసుకుంటేనే ఆ సమావేశం
సఫలం అయినట్లంటారు సత్య.

కాగితం, పెన్నుతో...
ఈరోజుల్లో పచారీ సామాన్ల జాబితా రుసుకోవడానికీ ఫోన్లో నోట్‌బుక్‌ని వాడుతున్నారు. కానీ ఫేస్‌బుక్‌ సీఓఓ షెరిల్‌ శాండ్‌బెర్గ్‌ మాత్రం స్పైరల్‌ నోట్‌బుక్‌లోనే తన మీటింగ్‌కి సంబంధించిన పాయింట్లని రాసి తెస్తారు. పేజీలు తిప్పుతూ ఒక్కోటీ చదువుతారు. సాంకేతిక పరికరాలు వాడకుండా ఇలా కాగితాలమీద రాసుకుంటే చాలా సహజంగా ఉంటుందనీ, ఆలోచనలూ బాగా వస్తాయనీ చెబుతారామె. తన సహోద్యోగులకు సంబంధించి కెరీర్‌ పరంగా చేసే సూచనల్నీ కాగితంమీద రాసే అందిస్తుంటారట.

ఆరుగురు చాలు
టెస్లా వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలన్‌ మస్క్‌ నిర్వహించే సమావేశాల్లో సభ్యులు పరిమితంగా ఉండాలి, ఆ సంఖ్య ఆరుగురికి మించకూడదు. అలాంటప్పుడే సభ్యుల్లోని ప్రతి ఒక్కరికీ విలువైన సమయం ఇచ్చినట్లు అవుతుందనేది మస్క్‌ ఆలోచన. సమావేశంలో ఉన్నవారు ఏ క్షణమైనా తమ అవసరంలేదని భావిస్తే నిరభ్యంతరంగా అక్కణ్నుంచి వెళ్లి తమ పనిచూసుకునే స్వేచ్ఛ ఉంది. ఆ విధంగానైనా సమయాన్ని కంపెనీకి ఉపయోగపడేలా చేయొచ్చు. అత్యవసరమైతే తప్ప సమావేశాల్ని తరచూ నిర్వహించడానికి ఇష్టపడరు మస్క్‌. బదులుగా ఈమెయిల్‌, గ్రూప్‌ చాట్‌ ద్వారా సమాచారాన్ని పంచుకోవచ్చేమో చూడమంటారు.

అడుగులు వేయాల్సిందే...
గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచ్చయ్‌ నిర్వహించే సమావేశాల్లో సభ్యులందరూ మాట్లాడాక చివరగా తాను మాట్లాడతారు. అందరి ఆలోచనల్నీ క్రోడీకరించి ఒక నిర్ణయం తీసుకుంటారు. నాలుగు గోడల మధ్య కూర్చోవడంకంటే నడిస్తేనే తనకు ఆలోచనలు వస్తాయంటారు సుందర్‌. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటపుడు తన ఆఫీసులో నడుస్తూనే మాట్లాడతారట. సమావేశాల మధ్యలో కూడా తన అభిప్రాయాన్ని చెప్పేముందు సీట్లోనుంచి లేచి ఓసారి బయటకు వెళ్లి వస్తారట. అలా వెళ్లి వచ్చి చాలా సమస్యలకు తనదైన పరిష్కారాన్ని చూపుతుంటారు. ‘నేను ఆలోచించాలంటే అడుగులు వేస్తూ ఉండాలి’ అని చెబుతారు సుందర్‌. అందుకేనేమో ఆయన ఆఫీసులో ట్రెడ్‌మిల్‌ డెస్క్‌టాప్‌నీ వినియోగిస్తారు.

వాకింగ్‌లో కలుస్తారు..!
కీలకమైన వ్యక్తులతో సమావేశాన్ని సాధ్యమైనంత వరకూ ఆఫీసు బయట పార్కులూ, ఆఫీసు ప్రాంగణంలోని పచ్చని చెట్ల మధ్య ఏర్పాటుచేస్తుంటారు ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్‌. సంస్థలో కీలక స్థానాల్లో నియామకం చేయాల్సి ఉంటే ఆ అభ్యర్థిని తనతోపాటు వాకింగ్‌కి తీసుకువెళ్తారు. వాకింగ్‌ ముగియగానే అతడి నియామకంపైన ఒక నిర్ణయం తీసుకుంటారు. వాట్సాప్‌ సహ వ్యవస్థాపకుడు జాన్‌ కౌమ్‌తో పలుసార్లు ఇలా వాకింగ్‌ మీటింగ్‌లు జరిగాకే ఆ సంస్థను రూ.లక్ష కోట్లకు కొనుగోలు చేయడానికి జుకర్‌బర్గ్‌ నిర్ణయించుకున్నారట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.