close

ఈ పువ్వుకి వెయ్యి రేకులు!

మ్మో అన్ని రేకులున్న పువ్వు ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు కదూ. నిజమే చైనాలో పుట్టి పెరిగే ఈ తామర జాతి పువ్వు అసలు పేరు క్విన్‌బాన్‌లియాన్‌. వెయ్యి రేకులున్న ఈ పువ్వును మన దగ్గర సహస్రదళ పద్మం అని పిలుస్తారు. చైనాలోని బౌద్ధారామాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. బౌద్ధమతంలో సహస్ర చక్రపద్మం ఎంతో ముఖ్యమైంది. ఆ పద్మంలోని చక్రాలన్నింటినీ ఏకాగ్రతతో చూస్తే మెదడు పనితీరు మెరుగవుతుందని నమ్ముతారు. అందుకే వెయ్యి రేకులున్న ఈ పువ్వుని అక్కడ ఎంతో పవిత్రమైనదిగానూ, ప్రత్యేకమైనదిగానూ భావిస్తారు. ముద్ద గులాబీలా ముద్దుగా అదే వర్ణంలో కనిపించే ఈ సహస్రదళ పద్మం ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ షేర్‌ అవుతున్నాయి.


83 ఏళ్ల విద్యార్థి!

దువుకి వయసుతో సంబంధం లేదంటూ ఎనభై మూడేళ్ల వయసులో విద్యార్థిగా మారిపోయాడు సోహన్‌ సింగ్‌ గిల్‌. ఈ మధ్యనే జలంధర్‌ యూనివర్సిటీలో ఎమ్మే(ఇంగ్లిష్‌) పూర్తి చేసి తన చిరకాలవాంఛను నెరవేర్చుకున్నాడు. 1957లో డిగ్రీ పూర్తి చేసిన సోహన్‌సింగ్‌ స్వస్థలం పంజాబ్‌లోని హోసియార్‌పుర్‌. తనకి పీజీ చేయాలని ఉన్నా తల్లిదండ్రులకి చదివించే స్తోమత లేకపోవడంతో డిగ్రీతోనే ఆపేశాడు. ఆ తరవాత టీచర్‌ ట్రైనింగ్‌కోర్సు పూర్తిచేసి టీచర్‌గా స్ధిరపడ్డాడు. మధ్యలో కొంత కాలం కెన్యాలోనూ పనిచేసి వచ్చిన సోహన్‌ సింగ్‌కు రిటైర్‌ అయ్యాక కూడా మనసులో పీజీ చేయాలనే కోరిక ఉండేది. అందుకే పిల్లల పెళ్లిళ్లై బాధ్యతలన్నీ తీరాక రెండేళ్ల క్రితం జలంధర్‌ యూనివర్సిటీలో చేరి తనకెంతో ఇష్టమైన ఇంగ్లిష్‌ని ఎంచుకుని మాస్టర్స్‌లో చేరాడు. ఈమధ్యనే చదువు పూర్తై పట్టా అందుకున్న సోహన్‌ ఈతరం విద్యార్థులకు ఆదర్శమనే చెప్పాలి.


ఆమె ‘ఫైవ్‌స్టార్‌’ డ్రైవర్‌!

ట్రాన్స్‌జెండర్లంటే మనదేశంలో ఇంకా చిన్నచూపే ఉంది. ఇప్పుడిప్పుడే వాళ్లు యాచకవృత్తిని వదులుకుని ఎన్నో సమస్యల్ని అధిగమించి పలు రంగాల్లోకి అడుగుపెడుతున్నారు. కానిస్టేబుల్‌గా, జడ్జిగా, వ్యాఖ్యాతగా కొందరు ఈపాటికే తమ తమ రంగాల్లో రాణిస్తున్నారు. ఒడిశాలోని పూరికి చెందిన రాణి కిన్నార్‌ కూడా వాళ్లని ఆదర్శంగా తీసుకుని డ్రైవింగ్‌ నేర్చుకుని మనదేశంలో తొలి ట్రాన్స్‌జెండర్‌ క్యాబ్‌డ్రైవర్‌గా గుర్తింపు సాధించింది. దాంతోపాటు ఫైవ్‌స్టార్‌ రేటెడ్‌ క్యాబ్‌ డ్రైవర్‌గానూ తనదైన ముద్ర వేసుకుంది రాణి. మొదట్లో ఆమెని కొందరు బలవంతంగా యాచకవృత్తిలోకి దింపినా ఆ పని మానేసి తన కాళ్లమీద తాను నిలబడాలని డ్రైవింగ్‌ నేర్చుకుంది. డ్రైవర్‌గా పనిచేయడానికి ఎవరూ అవకాశమివ్వకపోవడంతో తానే సొంతంగా ఆటో కొనుక్కుని నడిపింది. దానివల్ల పెద్దగా ఆదాయం లేకపోవడంతో కొన్నాళ్లు అంబులెన్సు డ్రైవర్‌గానూ పనిచేసింది. పని పట్ల ఆమెకున్న నిబద్ధతను దగ్గరగా చూసిన మాజీ ఉబర్‌ ఉద్యోగి ఒకరు రాణిని క్యాబ్‌డ్రైవర్‌గా చేయమని సలహా ఇచ్చాడు. దాంతో ఉబర్‌ ఇంటర్వ్యూకి హాజరై విజయవంతంగా దాన్ని పూర్తి చేసి డ్రైవర్‌గా ఎంపికైంది. ఈ మధ్యనే రాణి సొంత కారుకొనుక్కుని స్టీరింగ్‌ పట్టుకుంది. ఆమె ప్రత్యేకంగా ఆడవాళ్లకోసం రాత్రిపూట కూడా క్యాబ్‌ నడుపుతుంటుంది. అందుకే ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ని సొంతం చేసుకుంది. 


పోల్కా డాట్స్‌ జీబ్రాని చూశారా?

జీబ్రా... తెలుపూనలుపూ చారలతో పెయింట్‌ వేసినట్టు ఉంటుంది. దాన్ని చారల గుర్రం అని కూడా పిలుస్తాం. అయితే మీరెప్పుడైనా చారలు కాకుండా తెల్లని పోల్కాడాట్స్‌ ఉన్న జీబ్రాని చూశారా. అదేంటీ జీబ్రాపైన చారలు కదా ఉండాల్సింది డాట్స్‌ ఉండటమేంటీ అనుకుంటున్నారా. కెన్యాలో అత్యధికంగా పర్యటకుల్ని ఆకర్షించే మాసై మారా నేషనల్‌ పార్క్‌కి వెళితే ఈ పోల్కాడాట్స్‌తో ఆకట్టుకుంటున్న జీబ్రా పిల్ల కనిపిస్తుంది. దాని పేరు ఫోయల్‌. మూడు నెలలక్రితం పుట్టిన ఫోయల్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో దాన్ని చూడ్డానికి పర్యటకులు ఆసక్తిచూపుతున్నారట. వెరైటీగా ఉండి అందర్నీ ఆకట్టుకుంటున్న ఫోయల్‌లో మెలనిన్‌ అధికంగా ఉండటం వల్ల తెల్లచారలు పూర్తిగా రాక మచ్చల్లా కనిపిస్తున్నాయనీ, ఈ జన్యు సమస్యని సూడోమెలనిజం అంటారనీ తేల్చారు క్యాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.