close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పిల్లల కోసం కుర్చీ బ్యాగు

ఇప్పటికీ మనదేశంలో చాలా ప్రభుత్వ పాఠశాలలు సరైన వసతులకు నోచుకోవట్లేదు. కనీసం పిల్లలకు బల్లలూ ఉండట్లేదు. తరగతి గదిలో అన్ని గంటలు కింద కూర్చుని చదువుకోవడం మామూలు విషయం కాదు. ఉదయ్‌పుర్‌కు చెందిన మనీష్‌నాథ్‌ మాథూర్‌కు అది స్వానుభవం. అందుకే అలాంటి  చిన్నారులు సౌకర్యం  చదువుకోవడానికి సోలార్‌ లైటున్న డెస్క్‌టాప్‌ స్కూలు బ్యాగులు డిజైన్‌ చేసి ఉచితంగా అందిస్తున్నాడు.

మనీష్‌ డిజైన్‌ చేసిన మల్టీపర్పస్‌ డెస్క్‌టాప్‌ బ్యాగుల పేరు ‘ఏ లో’. అంటే హిందీలో ‘ఇది తీసుకో’ అని అర్థం. నాలుగేళ్లలో పదిహేడు రాష్ట్రాల్లో పదివేల మంది చిన్నారులకు ఈ బ్యాగుల్ని ఉచితంగా అందించి చదువుకి దూరమైన ఎందరో పిల్లల్ని బడిబాట పట్టించిన మనీష్‌ది రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో దిగువ మధ్యతరగతి కుటుంబం. తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. పదోతరగతి వరకూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఇంటర్‌, ఆపై చదువులు మెరిట్‌ స్కాలర్షిప్పులతో చదివాడు. 2010లో మానవ వనరుల విభాగంలో మాస్టర్స్‌ పూర్తి చేశాడు. ఓసారి మనీష్‌ చిన్ననాటి స్నేహితులు తమ పాఠశాలలో గెట్‌ టు గెదర్‌ ఏర్పాటు చేసి తననీ రమ్మని పిలిచారు. దాంతో చాలా కాలానికి బడికెళ్లిన మనీష్‌ని అక్కడో విషయం బాధించింది. పదేళ్ల పాటు మనీష్‌ ఆ స్కూల్లో నేలపైనే కూర్చుని చదివాడు. ఆ సమయంలో నడుమునొప్పీ, మెడనొప్పితో ఇబ్బందిపడేవాడు. ఇప్పటికీ ఆ స్కూల్లో పిల్లలు నేలపైనే కూర్చుని చదువుకోవడం అతడిని కలవరపరిచింది. అక్కడ మాత్రమే కాదనీ మనదేశంలో చాలా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు అదే మాదిరి చదువుకుంటున్నారనీ తెలుసుకుని అప్పుడే అలాంటి పిల్లలకోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు.

పేటెంట్‌ పొంది...
ఆలోచించగా ఆలోచించగా మనీష్‌కి ఓ ఐడియా వచ్చింది... పుస్తకాలు మోసుకెళ్లడానికీ, డెస్కుటాపుగా ఉపయోగించుకోవడానికీ, రాత్రిపూట సోలార్‌ లైటుగా వాడుకోవడానికి వీలుగా ఓ బ్యాగు తయారు చేస్తే ఎలా ఉంటుంది అని. అదే విషయాన్ని తను పనిచేస్తున్న యాజమాన్యంతో చెప్పాడు. వాళ్లకీ ఆ ఆలోచన నచ్చడంతో తమ సంస్థలో డిజైనింగ్‌ విభాగాన్ని వాడుకోవడానికి అవకాశమిచ్చారు. స్నేహితులూ, బంధువుల వద్ద లక్షన్నర అప్పు చేసి మరీ ప్రయోగం మొదలుపెట్టాడు మనీష్‌. దాదాపు ఏడాదిపాటు కష్టపడి బ్యాగును విజయవంతంగా తయారు చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి సొంతంగా 2015లో ‘ప్రయాస్‌ ఇన్నోవేషన్స్‌’ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఈ బ్యాగులకి పేటెంట్‌ కూడా పొందాడు. రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌తో వాటర్‌ప్రూఫ్‌గా తయారు చేసిన ఈ బ్యాగుల్లో పదికేజీల బరువును మోయొచ్చు. పుస్తకాలు పెట్టుకుని బడికెళ్లాక బ్యాగును డెస్క్‌టాప్‌లానూ మార్చుకోవచ్చు. అలానే దీనికి సోలార్‌ప్యానెల్‌ ఉన్న ఎల్‌ఈడీ బల్బు ఉంటుంది. దాన్ని బడికి వెళ్లేటప్పుడు ఎండలో పెట్టి వెళితే రాత్రివేళ చదువుకోవడానికే కాదు ఇంటి అవసరాలకూ ఉపయోగపడుతుంది. కుర్చీగానూ మార్చుకొనే సౌకర్యమున్న ఏలో బ్యాగులకు బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహాం బ్రాండ్‌ అంబాసిడర్‌.

కార్పొరేట్‌ సాయంతో...
తయారీ ఖర్చు కాస్త అధికంగానే ఉండే ఆ బ్యాగులను పేద పిల్లలందరికీ ఉచితంగా ఇవ్వడం కష్టమే. అందుకే పలు స్వచ్ఛంద సంస్థలూ, కార్పొరేట్‌ సంస్థల్లోని సీఎస్‌ఆర్‌ విభాగాల్ని సంప్రదించి బ్యాగుల గురించీ, వాటిని పేదలకు ఉచితంగా పంచాలనుకున్న తన ఆలోచననూ చెప్పడం ప్రారంభించాడు.  క్రమంగా ఎన్జీఓలూ, కార్పొరేట్‌ సంస్థలూ స్పందించి వాటిని కొనుగోలు చేయడం మొదలుపెట్టాయి. అలా పేద పిల్లలకు బ్యాగులు ఉచితంగా చేరవేస్తున్న మనీష్‌ వేల మంది చిన్నారులకు చేరువయ్యాడు. డ్రాపవుట్స్‌ మీదా దృష్టి పెట్టి ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చిన్నారుల్ని గుర్తించి ఈ బ్యాగులు అందించడంతోపాటు ఆర్థిక సాయమూ చేస్తున్నాడు. టాటా, మహీంద్రా, రిలయన్స్‌ వంటి కొన్ని కార్పొరేట్‌ దిగ్గజ సంస్థలు ఈ విషయంలో మనీష్‌ని ప్రోత్సహిస్తున్నాయి. గెయిల్‌ ఇండియా వాళ్లు ఆంధప్రదేశ్‌లోని యాభై స్కూళ్లలో ఈ బ్యాగుల్ని అందించారు. ఏలో బ్యాగుల గురించి తెలిసి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ మనీష్‌ని సంప్రదించి రెండు లక్షల బ్యాగులు చేసిమ్మని ఆర్డరిచ్చాయి. ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. మనసుండాలేగానీ మంచి పనులు చేయడానికి ఎన్నో దారులుంటాయని నిరూపించాడు మనీష్‌.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.