close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నిశ్శబ్ద యుద్ధం

- అప్పరాజు నాగజ్యోతి

కొడుక్కి ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌లో మంచి ర్యాంక్‌ వచ్చి సిటీలోని నంబర్‌ వన్‌ కాలేజీలో సీటు వచ్చిన సందర్భంగా- ప్రసాద్‌, రాంమోహన్‌లని ఆఫీసుకి దగ్గరలోనే ఉన్న స్వాగత్‌ రెస్టారెంట్‌కి తీసుకెళ్ళాడు అనంత్‌. వాళ్ళు ముగ్గురూ మంచి స్నేహితులు,
ఒకే కంపెనీలో పదిహేడేళ్లనుండి కలిసి పనిచేస్తున్నారు.
‘‘కంగ్రాట్స్‌ అనంత్‌. ఇక మీవాడి భవిష్యత్తుకి ఢోకా లేదురా! ఆ కాలేజీలో చదివినవాళ్లకి నూరు శాతం క్యాంపస్‌ సెలెక్షన్స్‌ ఉంటాయి’’ స్నేహితుడికి అభినందనలు తెలిపారు మిత్రులిద్దరూ. ‘‘థ్యాంక్స్‌ రా’’ అంటూ అనంత్‌ ఏదో చెబుతుండగానే రెస్టారెంట్‌లో ఓ మూలగా ఉన్న టీవీలో ‘ఫ్లాష్‌ న్యూస్‌’ అంటూ వినిపించింది. దాంతో ముగ్గురి తలలూ టీవీ వైపుకి తిరిగాయి.

‘ఊర్వశి సినిమా థియేటర్‌ వద్ద ఈరోజు సాయంత్రం షో ముగిసిన తరువాత రెండు కాలేజీల నుండి వచ్చిన విద్యార్థుల నడుమ చిన్న విషయంపై జరిగిన వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారి కొట్టుకునేదాకా వెళ్ళడమే కాకుండా ఇద్దరు విద్యార్థినులపై మానభంగ ప్రయత్నం కూడా జరిగింది. సమయానికి పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది. ఈ సంఘటనకి కారణమైన నలుగురు వ్యక్తులని పోలీసులు అరెస్ట్‌ చేశారు. త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకున్న అమ్మాయిలు ఇళ్ళకి క్షేమంగా తిరిగి వెళ్ళారు. గాంధీగారు చెప్పినట్లుగా అర్ధరాత్రి కాదు కదా... పట్టపగలు కూడా స్త్రీలు ఒంటరిగానే కాదు, గుంపులుగానూ వీధుల్లో తిరగలేకపోతున్నారు. ఇదీ నేటి మన భారతదేశంలో ఆడవాళ్ళ పరిస్థితి.’
టీవీలో న్యూస్‌రీడర్‌ మాటలు పూర్తవగానే అడ్వర్టయిజ్‌మెంట్‌ మొదలైంది.
‘‘నిజమే కదూ... ఏ నిమిషంలో ఏ పాపిష్టి కళ్ళు పడతాయోనని భయపడుతూ ఆడపిల్లల్ని వేయికళ్ళతో జాగ్రత్తగా కాపాడుకోవలసివస్తోంది’’ అన్నాడు అనంత్‌.
‘‘నిజమేరా, రోజురోజుకీ ఈ దేశంలో ఆడపిల్లలపైన జరుగుతున్న దారుణాలకి అంతులేకుండా పోతోంది’’ బాధగా అన్నాడు రాంమోహన్‌.
కొంతసేపు అదే విషయంపై చర్చించుకున్నాక ముగ్గురూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు.
ఆవేళ ట్రాఫిక్‌ చాలా ఎక్కువగా ఉండటం మూలాన, స్కూటర్‌ని ఎంత వేగంగా నడిపినా ప్రసాద్‌ ఇంటికి చేరేటప్పటికి రాత్రి ఎనిమిది గంటలు దాటింది.
షూస్‌ విప్పాక భార్య ఇచ్చిన మంచినీళ్ళ గ్లాసుని అందుకున్నాడు ప్రసాద్‌.
‘‘రేవతీ, అప్పూ ఏదీ... గదిలో కూర్చుని చదువుకుంటోందా..?’’
ఒక్కగానొక్క కూతురైన అపూర్వ అంటే ప్రసాద్‌కి ప్రాణం. అపూర్వకి తల్లి వద్దకంటే తండ్రితోనే చనువెక్కువ. తండ్రీకూతుళ్ళిద్దరూ ఒక్కటై అప్పుడప్పుడూ రేవతిని సరదాగా ఏడిపిస్తుంటారు కూడా!
‘‘అది ఇంకా ఇంటికి రాలేదండీ. ఇంటర్‌ పరీక్షలు నిన్ననే అయిపోయాయిగా...
వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి ఊర్వశి ధియేటర్లో సినిమాకి వెళ్ళింది.’’
‘ఊర్వశి ధియేటర్‌’ అన్న మాట వినగానే టీవీలో న్యూస్‌రీడర్‌ చదివిన వార్త మనసులో మెదిలి అతని బీపీ అమాంతం పెరిగిపోయింది. కూతురు అదే సినిమా హాల్‌కి వెళ్ళిందని తెలీగానే కంగారుపడ్డాడు.
‘‘బుద్ధుందా నీకు? నాకు చెప్పకుండా ఒంటరిగా దాన్నెందుకు పంపావసలు?’’ అంటూ భార్యపైన ఎగిరాడు.
‘‘బీపీ మాత్ర తెస్తాను, ఒక్క క్షణం ఆగండి’’ అంటున్న రేవతి మాటలు వినిపించుకోకుండా, అప్పుడే విడిచిన షూస్‌ని మళ్ళీ కాళ్ళకి తొడుక్కుని కూతురి కోసం బయలుదేరబోయాడు.
అంతలో కాలింగ్‌ బెల్‌ మోగింది.
తలుపులు తెరవగానే ఎదురుగా నవ్వుతూ నుంచున్న అపూర్వ కనిపించింది.
‘‘హాయ్‌ డాడీ’’ అంటూ తండ్రి మెడలో గారంగా చేతులని వేయబోతున్న కూతుర్ని చూస్తూనే అప్పటిదాకా పడ్డ టెన్షన్‌ వలన వచ్చిన ఆవేశాన్ని అణుచుకోలేకపోయాడు ప్రసాద్‌.
‘‘ఇంత రాత్రిదాకా ఎక్కడెక్కడ తిరిగొస్తున్నావు?’’ కూతురి చెంప చెళ్ళుమనిపించాడు ప్రసాద్‌.
పుట్టి బుద్ధెరిగినప్పటినుంచీ తన ఒంటి మీద దెబ్బ వేయడం కాదు కదా... కనీసం గట్టిగా తనని తిట్టనైనా తిట్టని నాన్న ఒక్కసారిగా అలా కొట్టడంతో బిత్తరపోయింది అపూర్వ.
రెండుక్షణాల తరువాత తేరుకుని చిన్నబోయిన మొహంతో మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తల్లి వచ్చి ఎంత బతిమాలినా గదినుండి బైటకి రాలేదు, భోజనం కూడా చేయలేదు. కూతురు
తినకపోవడంతో ప్రసాద్‌ కూడా కంచం ముందు కూర్చుని ఏదో కెలికాడనిపించాడే తప్ప సరిగా తినలేకపోయాడు.
‘‘ఏమిటో... ఈ తండ్రీకూతుళ్ళు నాకెప్పటికీ అర్థంకారు, ప్చ్‌...’’ నిట్టూరుస్తూ వంటిల్లంతా సర్దుకుని పడగ్గదిలోకి వచ్చేటప్పటికి నిద్రపోకుండా మంచంపైన అస్థిమితంగా కదులుతున్న భర్త కనిపించాడు రేవతికి. జరిగిందానికి మనసులో అతను చాలా బాధపడుతున్నాడని గ్రహించిందామె.
‘‘మీరు ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత మన అప్పూ స్నేహితురాలు కీర్తన ఉందే...
ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాకు ఫోన్‌ చేసి కీర్తననీ వాళ్ళ పక్క ఇంట్లో ఉండే మరో అమ్మాయి పూజనీ తీసుకుని తనూ, పూజా వాళ్ళ అమ్మా సినిమాకి వెళ్తున్నామనీ, అపూర్వ కూడా వచ్చేట్లయితే తనని పికప్‌ చేసుకెళ్తామని చెప్పిందండీ! నాకెలాగూ ఇంట్లో పనితో కుదరట్లేదు, స్నేహితురాళ్ళతో సరదాగా సినిమాకి వెళ్తానని అప్పూ కూడా అడిగేటప్పటికి నేను కాదనలేకపోయాను.
ఆ మాత్రానికే మీరు అంతలా రియాక్ట్‌ అవుతారనుకోలేదు. ఏమైనా ఈమధ్యన మీ ఆరోగ్యం బావుంటున్నట్లు లేదు. రేపొకసారి ఆస్పత్రికి వెళ్లి బీపీ చెకప్‌ చేయించుకోండి’’ తన మాటలకి భర్త నుండి ఏ విధమైన రెస్పాన్స్‌ రాకపోవడంతో మళ్ళీ తనే
‘‘మీరే ఎప్పుడూ నాతో ‘మన అప్పూ అందరు పిల్లల్లాగా కాదు, బాయ్‌ ఫ్రెండ్స్‌ లేరు. ఎంతో బాధ్యతగా తన చదువేదో తనది అన్నట్లుంటుంది’ అంటుంటారుగా! అలాంటిది ఇంత చిన్న విషయానికి దాన్ని కొట్టేటంత కోపమెందుకొచ్చిందండీ మీకు?’’ అంది రేవతి.
భార్య మళ్ళీ మళ్ళీ అడగడంతో ఆవేళ సాయంత్రం టీవీలో తను చూసిన వార్తని పంచుకున్నాడు ప్రసాద్‌. తండ్రిగా అతనుపడ్డ టెన్షన్‌ని అర్థంచేసుకున్న రేవతి... ‘‘పోనీలెండి. చిన్న విషయమేగా! దాని గురించే ఆలోచించి మనసు పాడు చేసుకోకండి’’ అంది.

* * * * *

అయితే రేవతి అనుకున్నట్లుగా అది చిన్న విషయంగా ఉండిపోలేదు. ‘నన్నేమీ అడగకుండానే డాడీ నాపై చేయి చేసుకున్నారు. పైగా ఇంత రాత్రిదాకా ఎక్కడ తిరిగొస్తున్నావు’ అన్నారు! అంటే, నేను
ఏ బాయ్‌ ఫ్రెండుతోనో ఎంజాయ్‌ చేసేందుకు వెళ్లానని ఆయన అనుకున్నట్లేగా! కూతురి మీద ఆమాత్రం నమ్మకం లేదన్నమాట డాడీకి. ఛ, ఛ, నన్ను అనుమానించిన మనిషి నాకసలు తండ్రే కాడు.’
రాత్రంతా అలాంటి ఆలోచనలతోనే గడిపేసిన అపూర్వ మనసులో తండ్రి పట్ల అంతదాకా ఉన్న ప్రేమ స్థానంలో అంతులేని కోపం, ద్వేషం చోటుచేసుకున్నాయి. ఆరోజు నుండి తండ్రితో మాట్లాడటం మానేసింది అపూర్వ. తన తప్పేమీ లేకుండానే తనపై చేయి చేసుకున్న తండ్రిని ఆమె ఎన్నటికీ క్షమించలేకపోయింది. ఆమెని పలకరించేందుకు ప్రసాద్‌ ఎన్నివిధాల ప్రయత్నించినా అపూర్వ మొండిగా ఉండిపోయింది.
కూతురికి నచ్చచెప్పేందుకు రేవతి చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు.
‘‘ఇన్నేళ్ళుగా నన్ను చూస్తున్న డాడీకి నేనెలాంటిదాన్నో తెలీదా మమ్మీ? నా క్యారెక్టర్‌ని అనుమానించిన ఆ మనిషితో నాకు ఇకపై ఏ సంబంధమూలేదు.’’
కూతురు తన గురించి భార్యతో అన్న మాటలని విన్న ప్రసాద్‌ మనసు తీవ్రంగా గాయపడింది.
‘‘చిన్నపిల్ల కదా, మెల్లిగా అదే తెలుసుకుంటుందిలెండి. కాలం అన్ని గాయాలనీ మాన్పుతుంది, అన్నింటినీ నేర్పుతుంది.
కాస్త ఓపిక పట్టండి’’ అంటూ భర్తని ఓదార్చింది రేవతి.

* * * * *

కాలగర్భంలో అయిదేళ్ళు గడిచిపోయినా ఆ తండ్రీకూతుళ్ళ మధ్య కనబడని అడ్డుగోడ మాత్రం అలాగే ఉండిపోయింది. ఇంజినీరింగ్‌ పూర్తవుతూనే అపూర్వకి క్యాంపస్‌ సెలక్షన్స్‌లో విప్రోలో ఉద్యోగం వచ్చింది. రెండు నెలల ట్రైనింగ్‌ పూర్తయ్యాక హైదరాబాద్‌లోనే పోస్టింగు ఇవ్వడం అందరికీ సంతోషాన్ని కలిగించింది. ఆ ఆదివారం తన కొలీగ్‌ అంటూ సృజన్‌ని ఇంటికి తీసుకొచ్చి తల్లికి పరిచయం చేసింది అపూర్వ. ఇంజినీరింగ్‌ కాలేజీలో రెండవ సంవత్సరంలో ఉన్నప్పటినుంచీ తామిద్దరం ప్రేమించుకుంటున్నామనీ, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామనీ చెప్పింది.
‘అప్పుడే సొంత నిర్ణయాల్ని తీసుకునేంత పెద్దదై పోయిందా కూతురు’ అనుకుని ఆశ్చర్యపోయాడు ప్రసాద్‌. సృజన్‌ కుటుంబం గురించి వాకబు చేసి, అబ్బాయి మంచివాడనీ చక్కటి సంప్రదాయ కుటుంబం నుండి వచ్చాడనీ తెలుసుకున్న మీదట కులాలు వేరైనా వాళ్ళ వివాహానికి అభ్యంతరపెట్టలేదు ప్రసాద్‌. నిశ్చితార్థాన్ని ఘనంగా జరిపించి, మరుసటినెల పదోతేదికి పెళ్లి ముహూర్తాన్ని ఖాయం చేసుకున్నారు.

* * * * *

ఆఫీసయ్యాక స్కూటీపైన ఇంటికి బయలుదేరింది అపూర్వ. ట్యాంక్‌బండ్‌ మీదుగా వెళ్తుండగా అక్కడ ఒక బెంచీ మీద కూర్చున్న సృజన్‌ కనిపించాడామెకి.
‘ముఖ్యమైన పనుంది, ఈవేళ త్వరగా వెళ్లాలని చెప్పి ఆఫీసులో హాఫ్‌డే పర్మిషన్‌ తీసుకుని మరీ వెళ్ళిన మనిషి ఇక్కడున్నాడేమిటబ్బా?’ మనసులో ఆశ్చర్యపడుతూనే స్కూటీని పార్క్‌ చేసి వచ్చేటప్పటికి సృజన్‌ వేరే అమ్మాయితో అతి సన్నిహితంగా, దాదాపు కౌగిలించుకుని కనిపించడంతో నిర్ఘాంతపోయింది అపూర్వ. ఆవేశాన్ని ఆపుకోలేక సృజన్‌ చెంపమీద బలంగా కొట్టి అతనేదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా విసురుగా అక్కడనుంచి వెళ్ళిపోయింది.
మనసులో సుళ్ళు తిరుగుతున్న బాధంతా కన్నీరుగా చెంపల మీదుగా జారుతుంటే స్కూటీని పార్క్‌ చేసిన చోటుకి వడివడిగా వెళ్తున్న అపూర్వ వద్దకి వేగంగా వచ్చింది ఒక అమ్మాయి.

‘‘మీరే ఎప్పుడూ నాతో ‘మన అప్పూ అందరు పిల్లల్లాగా కాదు, బాయ్‌ ఫ్రెండ్స్‌ లేరు. ఎంతో బాధ్యతగా తన చదువేదో తనది అన్నట్లుంటుంది’ అని అంటుంటారుగా! అలాంటిది ఇంత చిన్న విషయానికి దాన్ని కొట్టేటంత కోపమెందుకొచ్చిందండీ మీకు?’’ అంది రేవతి.

‘‘హలో, ఒక్క నిముషం’’ అన్న ఆమె మాటలకి ‘ఏమిటీ’ అన్నట్లుగా ఆమెవైపు చూసింది అపూర్వ.
‘‘నా పేరు లావణ్య. దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి. మీరెవరో నాకు తెలీదు. మీరు ఇక్కడికి రాకముందు నుండి నేను ఇక్కడే ఆ పక్క బెంచీపై కూర్చున్నాను. అందుకే ఇక్కడ జరిగిందంతా నా కంటపడింది. మీరు అతన్ని అపార్థం చేసుకున్నారు. ఆ అమ్మాయి ఎక్కడినుండో హఠాత్తుగా గాలిదుమారంలా పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కౌగిలించుకుని అతనికి ఊపిరిసలపనీకుండా చేసింది. అంతే జరిగింది! పాపం, అతనికేమీ తెలీదు’’ లావణ్య మాటలకి ఆలోచనలో పడింది అపూర్వ.
‘ఛ, సృజన్‌ ఎంత బాధపడ్డాడో. నేనలా చేసి ఉండవలసింది కాదు.’ తన అనాలోచిత ప్రవర్తనకి సిగ్గుపడి గబగబా పరిగెత్తినట్లుగా సృజన్‌ వద్దకి వెళ్ళింది. ఆమెని చూస్తూనే బెంచీ మీద కూర్చున్న సృజన్‌ కోపంతో దిగ్గున లేచాడు. వెంటనే అతని రెండుచేతులూ పట్టుకుంది అపూర్వ.
‘‘ఐ యామ్‌ సారీ సృజన్‌’’ అంటుంటే వినిపించుకోకుండా విసురుగా అక్కడనుండి వెళ్ళబోయాడు సృజన్‌.
ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. ‘‘వన్స్‌ అగైన్‌ సారీ సృజన్‌. పొరపాటు పడ్డాను. కావాలంటే నన్ను తిట్టు, ఇంకా నీ కోపం తగ్గకపోతే కొట్టు. అంతేగానీ, ఇలా మాట్లాడకుండా వెళ్లొద్దు, ప్లీజ్‌...’’ అతను అక్కడ నుంచి వెళ్ళకుండా అడ్డుగా నిలబడింది అపూర్వ. రెండుక్షణాల మౌనం తర్వాత నోరు విప్పాడు సృజన్‌.
‘‘నేనెలాంటి వాడినో నీకు తెలీదా అప్పూ? మనకిద్దరికీ నాలుగేళ్ల పరిచయముంది.
ఇంజినీరింగ్‌ కాలేజీలో ఉండగా చెట్టాపట్టాలేసుకుని కలిసి తిరిగాం. అలాంటి నాపైన నమ్మకం లేకుండా నా క్యారెక్టర్‌ని అనుమానించిన నీతో నాకు ఇకపై ఏ సంబంధమూ లేదు. గుడ్‌ బై’’ తను చెప్పవలసింది సూటిగా చెప్పేసి ఆమె ముఖం చూడటం కూడా తనకిష్టంలేదన్నట్టుగా వడివడిగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు సృజన్‌.

 

ఆరేళ్ళక్రితం తండ్రి తన మీద చేయి చేసుకున్నపుడు తాను మనసులో ఏమనుకుందో అచ్చం అవే మాటలు సృజన్‌ నోటి నుంచి రావడంతో దిగ్భ్రాంతురాలైంది అపూర్వ. ఇన్నేళ్ళపాటూ తండ్రిపట్ల తను ప్రవర్తించిన తీరు గుర్తుకొచ్చి ఆమె మనసంతా కలిచివేసినట్లయింది.
పశ్చాత్తాపంతో మనసు ప్రక్షాళనమవుతుంటే ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది అపూర్వ.

* * * * *

ఇంటికి చేరుతూనే ‘డాడీ’ అంటూ తండ్రిని హత్తుకుపోయింది అపూర్వ. ఎన్నో ఏళ్ల తర్వాత కూతురు తనతో మాట్లాడటంతో పులకించిపోయింది ఆ కన్నతండ్రి హృదయం. ‘‘డాడీ, ఇన్నేళ్ళూ మీపట్ల నేనెంతో మూర్ఖంగా ప్రవర్తించాను. పిచ్చి అపోహలతో మిమ్మల్ని దూరంగా ఉంచి మీరు చేసిన తప్పుకి మీకు సరైన శిక్ష వేస్తున్నాననుకుంటూ నన్ను నేనే శిక్షించుకున్నానని ఈవేళే తెలుసుకున్నాను. నన్ను క్షమించండి డాడీ’’
కన్నీళ్ళతో దగ్గరైన కూతురి తలపై ఆప్యాయంగా చేయి వేశాడు ప్రసాద్‌.
‘‘వెరీ గుడ్‌. మొత్తానికి తండ్రీకూతుళ్ళిద్దరూ ఇంతకాలానికి ఒక్కటయ్యారు’’ చప్పట్లు కొడుతూ దగ్గరకి వచ్చిన తల్లితోపాటుగా
సృజన్‌నీ ట్యాంక్‌బండ్‌ వద్ద అతన్ని కౌగిలించుకున్న అమ్మాయినీ ఇంకా లావణ్యనీ తన ఇంట్లో చూసి ఆశ్చర్యపోయింది అపూర్వ.
‘‘అప్పూ, ట్యాంక్‌బండ్‌ వద్ద జరిగినదంతా మర్చిపో. అదంతా ఒక డ్రామా.
ఈ అమ్మాయిలిద్దరూ కూడా లావణ్య, నందిత అని సృజన్‌ కజిన్స్‌. మనిద్దరిని కలపడం కోసమని వాళ్ళ సాయంతో ఈ నాటకం ఆడాడు మన సృజన్‌...’’
తండ్రి మాటలకి అయోమయంగా సృజన్‌ వేపు చూసింది అపూర్వ.
‘‘ఔను అప్పూ, ఆయన  చెబుతున్నది నిజమే. మన నిశ్చితార్థం రోజున మా ఇంటికి వచ్చిన మీ నాన్నగారు నా చేతులు పట్టుకుని నాతో చెప్పిన మాటలు నన్నెంతో కదిలించాయి’’ అంటూ ఆ రోజు జరిగినదంతా చెప్పుకొచ్చాడు సృజన్‌.

* * * * *

‘బాబూ సృజన్‌, నిన్ను అల్లుడిగా కాకుండా నా సొంత కొడుకుగా భావించి చెబుతున్నాను. నా కూతురంటే నాకు పంచప్రాణాలు. దాని కాల్లో ముల్లు గుచ్చుకుంటే నా గుండెల్లో గునపాలు గుచ్చినంత బాధగా ఉంటుందనుకో. నువ్వు కూడా తనని అంతే గాఢంగా ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు ముందుజాగ్రత్త కోసం చెబుతున్నాను. పొరపాటునైనా దాని మనసునెప్పుడూ గాయపరచకు బాబూ.
అలాగ్గానీ చేశావంటే అది జన్మలో నీతో మాట్లాడదు. నేను అనుభవిస్తున్న బాధ భవిష్యత్తులో నీకు కలగకూడదనే ఇదంతా చెబుతున్నాను. నేను చెప్పేదంతా నీ కడుపులోనే పెట్టుకో’ అంటూ ఆరేళ్ళ కిందట జరిగిన సంఘటన, అప్పటినుంచీ కూతురు తనతో మాట్లాడకపోవడం... అంతా పూసగుచ్చినట్లుగా సృజన్‌తో చెప్పాడు ప్రసాద్‌.

* * * * *

‘‘జరిగినదాంట్లో మామయ్యగారు చేసిన పొరపాటుకంటే కూడా నీ మొండితనమూ, అపోహలే ఎక్కువ కారణమని నాకనిపించింది అప్పూ. మానవులు పొరపాట్లు చేస్తే దేవుళ్ళు వాటిని క్షమిస్తారన్న నానుడి వినలేదూ!
పొరపాట్లు జరిగినప్పుడు వాటినుండి పాఠాల్ని నేర్చుకుని ముందుకు సాగిపోవాలే తప్ప వాటినే పట్టుకుని వేలాడుతూ మనసుల్ని అశాంతిపాలు చేసుకోకూడదు, మనల్ని ప్రేమించేవారి జీవితాలని దుర్భరం చేయకూడదు. నీకు ఈ విషయం బోధపడేట్లుగా చేసి, నీ అపోహలని దూరంచేసి నిన్ను మీ డాడీతో కలపాలన్న ఉద్దేశంతోనే ఇలా నా కజిన్స్‌తో కలిసి నాటకమాడాను.
ఈ విషయంలో నీ మనసుని కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించు అప్పూ.’’
‘‘లేదు సృజన్‌. నా తప్పు నేను తెలుసుకునేట్లుగా చేసినందుకుగానూ నీకు నేనెంతో రుణపడిపోయాను. థ్యాంక్యూ సో మచ్‌. లావణ్యా, నందితా మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్‌’’ మనస్ఫూర్తిగా చెప్పింది అపూర్వ.

‘‘మానవులు పొరపాట్లు చేస్తే దేవుళ్ళు వాటిని క్షమిస్తారన్న నానుడి వినలేదూ! పొరపాట్లు జరిగినప్పుడు వాటినుండి పాఠాల్ని నేర్చుకుని ముందుకు సాగిపోవాలే తప్ప వాటినే పట్టుకుని వేలాడుతూ మనసుల్ని అశాంతిపాలు చేసుకోకూడదు, మనల్ని ప్రేమించేవారి జీవితాలని దుర్భరం చేయకూడదు.

‘‘హమ్మయ్య, నీకు కోపం రాలేదు కదా... బతికిపోయాను! మీ డాడీతోమల్లే నాతోనూ నిశ్శబ్దయుద్ధం ప్రకటిస్తావేమోనని హడలిపోయాననుకో’’ సృజన్‌ వేళాకోళానికి చిలిపిగా నవ్వేసిన కూతురిని తృప్తిగా చూసుకున్నారు ప్రసాద్‌, రేవతి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.